పుస్తకాల హితవు
- Gadwala Somanna
- Sep 20
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PusthakalaHithavu, #పుస్తకాలహితవు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 121
Pusthakala Hithavu - Somanna Gari Kavithalu Part 121 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 20/09/2025
పుస్తకాల హితవు - సోమన్న గారి కవితలు పార్ట్ 121 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
పుస్తకాల హితవు
----------------------------
మరువకు చేసిన సాయము
తప్పకు నీతి,న్యాయము
అవరోధాలు వచ్చినా
వదలకు యధార్ధ మార్గము
దుర్మార్గులతో పొత్తు
చేయును బ్రతుకులను చిత్తు
ఖచ్చితంగా తెచ్చును
జీవితాన పెను విపత్తు
వశమైతే బద్ధకము
అభివృద్ధికి ఆటంకము
చురుకుదనం బహుమానము
కల్గియుంటే ఉత్తమము
హృదయాల్లో ఉల్లాసము
నింపుతుంది ఉత్తేజము
ముఖంలో మందహాసము
అత్యంత మనోహరము

వ్యర్థం! వ్యర్థం! వ్యర్థం!
---------------------------------------
కడలిలో కురిసిన వర్షము
కానలో పూసిన పుష్పము
వ్యర్థం! వ్యర్థం! వ్యర్థం!
భూమిలో దాచిన పైకము
గమ్యమే తెలియని పయనము
సంతృప్తి లేని జీవితము
వ్యర్థం! వ్యర్థం! వ్యర్థం!
చిన్నారులు లేని సదనము
అనురాగం చిందని హృదయము
మనుషులే ఉండని భవనము
వ్యర్థం! వ్యర్థం! వ్యర్థం!
సర్దుబాటు లేని కాపురము
అక్కరకే రాని చుట్టము
న్యాయమే చేయని చట్టము
వ్యర్థం! వ్యర్థం! వ్యర్థం!
అనర్హులకు చేసిన సాయము

వ్యర్థం కానేరదు
--------------------------------------
చేసినట్టి కష్టము
పదిమందికి సాయము
వ్యర్థం కానేరదు
శ్రేష్టమైన త్యాగము
కన్నవారి సేవలు
స్వచ్ఛమైన ప్రేమలు
వ్యర్థం కానేరవు
ప్రేమలొలుకు పలుకులు
మంచివారి స్నేహము
జీవితాన భాగ్యము
వ్యర్థం కానేరదు
మదిలో మంచితనము
ఆర్జించిన జ్ఞానము
ప్రతిరోజూ ధ్యానము
వ్యర్థం కానేరదు
సాధించిన విజయము

అక్షర సత్యాలు-ఆణిముత్యాలు
-----------------------------------------
ధనమెంతో ఉండినా
పేరెంతో పొందినా
లేకుంటే సుగుణాలు
నిరర్ధకమే బ్రతుకులు
అహంకారం హెచ్చినా
వినయం కోల్పోయినా
ఎన్ని ఉన్న వ్యర్థమే!
అక్షరాల సత్యమే!
ఛిద్రమైతే బంధాలు
కూలితే కాపురాలు
కట్టుకొనుట దుర్లభము
ముక్కలైతే హృదయాలు
పుస్తకాలు చదివితే
మస్తకాలు వెలుగుతాయి
అజ్ఞానం తొలగితే
జీవితాలు ఎదుగుతాయి

అమ్మ ప్రేమప్రబోధం
---------------------------------
వయసులోన పెద్దలకు
నడవలేని వృద్ధులకు
సేవ కాస్త చేయాలి
పుణ్యం కట్టుకోవాలి
అమ్మలాంటి మహిళలను
నాన్నలాంటి గురువులను
తప్పక గౌరవించాలి
సంస్కారం చాటాలి
సరిహద్దు సైనికులను
మహిలో మహనీయులను
స్ఫూర్తిగా తీసుకోవాలి
స్వాతంత్ర్య సమర యోధులను
కన్న తల్లిదండ్రులను
అక్కచెల్లమ్మలను
ఇలను అన్నదమ్ములను
ఘన ప్రేమతో చూడాలి
బంధాలు కాపాడాలి
సమైక్యతను తెలపాలి
వసుదైక కుటుంబమై
ఆదర్శం చూపాలి
-గద్వాల సోమన్న
Comments