నవ్వులరేడు
- Neeraja Prabhala
- Aug 4
- 4 min read
#NeerajaHariPrabhala, #NavvulaRedu, #నవ్వులరేడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Navvula Redu - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 04/08/2025
నవ్వులరేడు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
చిన్నప్పటి నుంచి విజ్ఞాన పుస్తకాలతో కాక జోక్స్ పుస్తకాలు చదివి పెరిగాడు పవన్. ఉద్యోగం చేయాలని తండ్రి ఒత్తిడి చేయడంతో అతను ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఒక ఆఫీసు లో ఇంటర్వ్యూ కోసం హడావిడి పడసాగాడు. ఆ హడావిడిలో అతను తన రెజ్యూమ్ ను పూర్తిగా గూగుల్ నుంచి కాపీ చేసి తీసికెళ్ళాడు.
ఉదయాన్నే హడావిడిగా తయారయి సిటీ బస్సునందుకుని ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు.
వదులైన సఫారి బట్టలు ధరించి మెడలో ఖద్దరు ఉత్తరీయం వేసుకొని సాదాసీదాగా బాటా చెప్పులు వేసుకున్న అతన్ని చూసి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డు షాక్ అయాడు.
“ఏయ్! ఎవరు నీవు? ఎందుకొచ్చావ్? చూస్తుంటే ఈ ఆఫీసుకి క్రొత్తవాడిలా ఉన్నావే. సరాసరి ఆఫీసులోకి వెళుతున్నావు. ” అన్నాడు సెక్యూరిటి.
పవన్ తన పేరు చెప్పి ఈరోజు తనకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉందని, టైమ్ గడిచిపోతోంది, లోపలికి పంపమని సెక్యూరిటితో చెప్పాడు.
“బఫూన్ లాంటి ఈ వేషధారణతో ఇంటర్వ్యూకి వచ్చావా? ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ కన్నా వెళ్లావా? అద్దంలో నీ మొహం చూసుకున్నావా? ” అన్నాడు సెక్యూరిటీగార్డు.
“నేను చాలా బావున్నా! సమయానికి ముందుగానే వచ్చాను. మీ గడియారం ‘రోళెక్స్’ అయి ఉంటేనే తప్పు ఉండొచ్చు!” అన్న పవన్ మాటలకి గార్డుకి కోపం వచ్చి అతన్ని అడ్డగించాడు.
“సరదాగా అన్నాలేవోయ్! ముందు లోపలికి పోనీయ్!” అని నవ్వుతూ గార్డు భుజాన్ని తట్టిన పవన్ ని అతను లోపలికి అనుమతించాడు.
లోపలికి వెళ్లిన పవన్ అక్కడ ప్యూన్ చూపించిన హాలులో కూర్చొని పరిసరాలని గమనించాడు. ఇంటర్వ్యూ కోసం చాలా మంది కూర్చున్నారు. ప్యూను పిలవగానే ఒక్కొక్కళ్లుగా లోపలికి వెళ్లి వస్తున్నారు. కాసేపటికి తన వంతురాగా లోపలికి వెళ్లిన పవన్ అక్కడి మేనేజర్ కి నమస్కరించి తన రెజ్యూమ్ ని ఆయన చేతికిచ్చి ఆయన చూపించిన సీటులో కూర్చున్నాడు.
“చూడు మిస్టర్ పవన్. మీరు మీ రెజ్యూమ్ లో చూపినట్లు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (AI) మీద మీకు 3 ఏళ్ల అనుభవం ఉందన్నారు. ‘AI’ అంటే ఏంటి? చెప్పండి?” అడిగాడు మేనేజర్.
“AI అంటే అత్తగారు ఇంట్లో ఉన్నప్పటికీ నోరు మూసుకొని ఉండటం!” అన్నాడు ఠక్కున పవన్.
“మీరు చెప్పింది అర్థం కాలేదు. అసలు మిమ్మల్ని ఏ స్కిల్ మీద తీసుకోవాలి?” అడిగాడు మేనేజర్.
“సార్, ! నన్ను చూసి చాలా మంది అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇది కూడా ఓ లీడర్షిప్ క్వాలిటీ కదా!” అన్నాడు పవన్.
అతను చెప్పిన జవాబుకి మేనేజర్ ఖంగుమని “ఒక్క ప్రశ్న. మీరు మా కంపెనీలో ఏం చేస్తారు?” సీరియస్ గా అడిగాడు.
“సార్! మీ కంపెనీలో నేను చేరగానే స్టాఫ్ మొత్తం వర్క్ మానేసి నన్ను చూసి నవ్వుతూ సరదాగా ఉంటారు. అదికూడా ఒక పనేగా!” అన్నాడు పవన్.
మేనేజర్ తనకు వస్తున్న నవ్వుని బలవంతాన ఆపుకుంటూ
“చూడు మిస్టర్. మీకు ఇక్కడ ఉద్యోగం లేదు కానీ మేము మిమ్మల్ని ‘స్టాండ్ అప్ కామెడీ షోకి’ రికమెండ్ చేస్తాం!” అన్నాడు ఆయన.
“చాలా ధన్యవాదాలు సర్!” అని బయటికి వచ్చాడు పవన్.
ఇంటర్వ్యూ లో పవన్ ఫెయిల్ అయినా, మేనేజర్ అతని కామెడీకి ఫిదా అయి తమ యూట్యూబ్ షోకి అవకాశం ఇచ్చాడు.
కొన్నాళ్లు అక్కడ పనిచేసిన పవన్ మేనరిజమ్ కి, బద్దకానికి వాళ్లకి విసుగొచ్చి అతన్ని ఉద్యొగంలోంచి తీశేశారు.
మరలా ఉద్యోగవేటలో తిరుగుతూ ఇంకో ఆఫీసులో ఇంటర్వ్యూకి మరలా అలాంటి విచిత్ర వేషధారణతో వెళ్లిన పవన్ ని సెక్యూరిటి అడ్డగించాడు.
"సార్! మీరు ఇంటర్వ్యూ కి అయితే ఇలానా వచ్చేది? ఇది ‘ఫాషన్ పెరెడ్’ కాదు కదా?" అన్నాడు సెక్యూరిటి.
"ఇది కొత్త స్టైల్. LinkedIn లో చూశాను. ‘వెళ్తున్న దారి నీవే ట్రెండ్ అయ్యేలా ఉండాలి' అని!" అన్నాడు పవన్.
“సరే! కానివ్వు” అని పవన్ ని లోపలికి అనుమతించాడు సెక్యూరిటి.
అలా లోపలికి వెళ్లి HR మేనేజర్ ముందు కూర్చున్నాడు పవన్.
"చూడండి మిస్టర్! మీ రెజ్యూమేలో ‘Machine learning experience’ అని ఉంది. Past project అంటే ఏంటి?" అడిగాడు మేనేజర్.
“ఓ! అదా సార్! మా అమ్మగారికి నేను ఓ అలారం పెట్టా. అది వింటే ఒక్కసారిగా లేచి నన్ను తిడతారు. So, Machine learning కాదు. Mother learning!" అండి.
మేనేజర్ అతని వైపు తేరిపార చూసినవ్వుతూ "మీకు Serious attitude లేదు ?" అన్నాడు.
"సార్! Serious ఐతే ఈ జనాలందరూ స్ట్రెస్ తో బి. పి. లు పెరిగి already hospitals లో ఉంటున్నారు. నేనెప్పుడైనా అక్కడికి వెళ్లి వాళ్లని నవ్విస్తే అంతే! బెడ్స్ ఖాళీ అవుతాయి. " అన్నాడు పవన్.
మేనేజర్ అతని హాస్యచతురతకి ఫిదా అయి అతనికి ఉద్యోగం ఇచ్చాడు.
పవన్ అక్కడి ఆఫీసులో చేరిన కొద్ది రోజుల కే అందరితో కలివిడిగా ఉంటూ స్నేహం పెంచుకున్నాడు.
క్రమేణా ఒక్కొక్కరితో చాట్ చేయడం మొదలుపెట్టాడు. రిసెప్షనిస్టు అమ్మాయికి"మత్తెక్కించే మీ నవ్వు చూస్తే నాకు ఉద్యోగం లేకపోయినా, జీవితంలో హాయిగా బ్రతకచ్చు అని అర్థం అయ్యింది!" అని ఛాట్ చేశాడు పవన్.
ఆమె దాన్ని మేనేజర్ కి చూపించగానే ఆయన పవన్ ని పిలిచి చివాట్లు వేసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా అతని ధోరణిలో మార్పు రాకపోయాక అతన్ని ఉద్యోగంలోంచి తీశేశాడు మేనేజర్. పవన్ మరలా ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు.
ఒకరోజున ఒక ఇంటర్వ్యూ కి వెళ్లి ఫెయిల్ అయి ఇంటికి వచ్చి నిరాశగా కూర్చున్న పవన్ ని స్నేహితుడు రవి సముదాయించి అతనికి ధైర్యం చెప్పి
“ఒరేయ్! నీవు ఉద్యోగం చేద్దామనుకోవద్దు. నీ కామెడీతో మనం షార్ట్ వీడియోలు చేద్దాం. ఇది చేసి మనం పబ్లిక్ కి నవ్వులు పంచగలుగుతాం! ఆదాయం కూడా వస్తుంది. " అన్నాడు.
దానికి పవన్ వెంటనే అంగీకరించాడు.
ఆ మరుసటి రోజున కావల్సినవన్నీ సిధ్ధం చేసుకుని ప్రోగ్రాం మొదలు పెట్టారు. పవన్ కష్టపడి మొదటి వీడియో తయారు చేశాడు.
“ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు ఏమీ తినకుండా అటెండ్ అయితే ఏం జరుగుతుందో చూడు!” అనే టైటిల్ తో తొలి వీడియో చేశాడు పవన్. ఆ వీడియోలో పవన్ తన ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలోనే టేబుల్ మీద బిర్యానీ తింటూ HRతో మాట్లాడుతున్నట్టు నటన చేశాడు.
"ఇది ఏం మానర్స్?" అన్నాడు HR. కోపంగా. "మా నాన్న చెప్పారు సార్! ఖాళీ కడుపుతో ఎవరినీ ఎదుర్కోవద్దు అని. తండ్రి మాట వినాలి కదా సార్. నేను ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాను. తండ్రి మాట వింటే తప్పా సార్?" అన్నాడు పవన్.
“షటప్. యూ కంట్రీబ్రూట్. గెటౌట్. ” అన్నాడు HR. కోపంగా.
“ఓకే. సర్. If you don't mind. ఒక చిన్న సలహా. మీరు బి. పి మాత్రలు వేసుకోవడం మర్చిపోయారనుకుంటున్నా. వెంటనే వేసుకోండి సర్. ” అని బయటికి వెళ్లాడు పవన్.
ఆ వీడియో జనాల్లోకి వైరల్ అయ్యింది. లక్షలాది వ్యూస్, కామెంట్లూ వచ్చాయి.
అందరూ తలో విధంగా సానుకూలంగా కామెంట్స్ పెడుతూ అతన్ని అభినందించారు. అందులో “ఇంటర్వ్యూ కి బదులుగా జనాల్లో చప్పట్లు కొట్టించుకున్నావ్!” అనే ఒక కామెంట్ పవన్ మనసుకి బాగా నచ్చింది.
మరి కొద్ది రోజులలోనే పవన్ YouTube చానెల్ ‘హాస్యపవన్’ అనే పేరుతో వచ్చేసింది. అందులో ఎప్పుడూ వివిధరకాల హాస్యంతో కూడా కూడిన వీడియోలను చేస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తూ వారి మనసులలో సుస్ధిర స్ధానం సంపాదించుకుంటూ చాలా బిజీ అయాడు పవన్. తన స్నేహితుడు రవకి కొంత డబ్బిచ్చి అతడికి వేరే ఉపాధి కల్పించాడు. ఇప్పుడు తన స్వంత ఛానెల్, వీడియోలతో చాలా ధనవంతుడైనాడు.
పబ్లిక్ లో అనేక సన్మానాలను పొందుతూ “నవ్వులరేడు” అనే బిరుదుని పొందాడు పవన్.
లోగడ పలు ఇంటర్వ్యూలకి ఫెయిల్ అయిన పవన్ ఇప్పుడు ఫ్లైట్ లలో బిజినెస్ క్లాస్‌లో టూర్ చేస్తున్నాడు. అతన్ని పలుదేశాలు TEDx టాక్‌లకి పిలుస్తున్నారు.
ఒకసారి చిన్న స్కూల్లో ‘Motivational talk’ ఇచ్చాడు పవన్. "పిల్లలూ! మీరు చదవాలని లేకపోతే ఎంత చదివినా మీ బుర్ర కెక్కదు. దాన్నే పట్టుకుని కూర్చొని ప్రయోజనం లేదు. దేనిమీదైనా శ్రధ్ధ, పట్టుదల ముఖ్యం. మీకే రంగంలో ఇష్టమో ఆ దిశగా అడుగులు వేసి కష్టపడితే మీరు వృధ్ధిలోకి వస్తారు. కానీ మీరు ఎప్పుడూ నవ్వుతూ, మనసారా అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తే.. ప్రపంచమే మీ క్లాస్‌రూమ్ అవుతుంది!" అన్నాడు పవన్.
అంతే! అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ క్లాస్ రూమ్ లో గలగల సందడి మొదలై పిల్లలు పగలబడి నవ్వారు. టీచర్లు హర్షధ్వానాలు చేశారు.
మొత్తానికి పవన్ కి జాబ్ లేదు కానీ జనాల్లో మంచి పేరు సంపాదించాడు.
పలు ఇంటర్వ్యూలకి వెళ్ళిన పవన్ అనేక చోట్ల ఉద్యోగాలను కోల్పోయినా నిరాశ పడక తన హాస్యంతో ప్రపంచాన్ని గెలిచాడు.
పవన్ philosophy ఒక్కటే –“హాస్యం ఉంది అంటే జీవితం ఉంది” అని.
“నవ్వడం ఒక భోగం.
నవ్వించడం ఒక యోగం.
నవ్వలేక పోవడం ఒక రోగం.“
ఇది అక్షర సత్యం.
ఎప్పుడూ మనసారా నవ్వుతూ ఉంటే ఏ రోగాలు మన దరి చేరవు. మనోల్లాసాన్ని మించినదేదీ లేదు. అందరూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. సంతోషం సగం బలం.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link
Comments