top of page

నీది నాది మనది


'Needi Nadi Manadi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'నీది నాది మనది' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


ఈ విశాల మైన ప్రపంచములో మనిషి పంచ భూతాలను పంచుకొని బ్రతకడము సహజము. ఐతె అందులో నీదీ నాదీ అనుటకు ఆకాశము, గాలి, వెలుతురు ఈ మూడు ఎవరి సొత్తూ కాదు- ఇకపోతె భూమి నీళ్ళే పంచుకునే అవకాశము ఉన్నది.


కాక పోతే దేశాలకు భూభాగము అనుసరించి ఆకాశము మార్గము- సముద్రాలలో హద్దు ఉండడము సహజము కాని వ్యక్తులకా అవకాశము లేదు- ఇక సూర్య భగవానుడిచ్చె వెలుతురుకు మాత్రము ఎవరి ప్రమేయము అవసరము లేదు.


ఇక కథలోనికి వస్తె ఆ ఊరిలో కంబమయ్య- కామారి ఇద్దరే పెద్దరికము కలిగిన రైతులు-


ఊళ్ళో అందరికంటె అధిక భూములు, పెద్ద బంగళాలు ఉన్నది వీరిద్దరికే.


ఊళ్ళో ఎవరికి ఏది అవసరము వచ్చిన ఇద్దట్లో ఎవరో ఒకరు తీర్చ వలసిందే. అది అరువు గావచ్చు- ఉదారము కావచ్చు ఆయా వ్యక్తుల ప్రవర్తనను బట్టి మాత్రమే.


అయినా పేదలకు అన్యాయము చేయగూడదను ప్రవర్తన వలన ఈ ఇద్దరి మీద గ్రామములో ఎవరికి ఈర్ష గాని ద్వేషము గాని కనబడదు.


ఊరిలో ఏ కార్యక్రమము జరిగినా వ్యయము కంబమయ్య కామారి మాత్రమే చేస్తారు. నీది, నాది అనకుండ మనము అనే భావముతో అందరు కలిసి మెలసి చేస్తారు.


ఊరి వాళ్ళకు కంబమయ్య కామారే పంచభూతాలు- ఊరి జనానికి ఏలోటు జరిగినా ఆదుకునే మనస్తత్వము వారిది..


వీరిద్దరిని ఊరివారందరు పంచ భూతాలు అని పిలుచుకుంటారు. ఎందుకంటె సర్వకాల సర్వావస్థలందు గ్రామ జనాన్ని ప్రతిఫలము ఆశించక ఆదుకునే వారు వీరేకనుక.

ఇద్దరికీ చెరువు కింద కొంత పొలము ఉంటది.


ఒకనాడు అధిక వర్షము కురియడము చే కంబమయ్య పొలము మొత్తము కొట్టుక పోతుంది. అందువల్ల అతనికి బాగా నష్టము జరుగుతుంది. ఒక పంటనే కాక పొలమంతా మట్టితో సహా కొట్టుక పోయి సారహీన మౌతుంది. కామారికి మాత్రము కొద్ది నష్టముతో బయట పడుతాడు.

కామారి ఎక్కువ నష్టము పొందక పోవడము చే ఊరి వారికి యథావిధిగా సహకారము అందిస్తుంటాడు.


కంబమయ్య మాత్రము తనకు జరిగిన నష్టానికి చింతిస్తూ ఎవరికి ఏమి సహాయము చేయ లేక పోతాడు.


తదుపరి సంవత్సరము కూడా అనావృష్టితో కంబమయ్య కు మరింత నష్టము జరుగుతుంది. ఇక చేసేది లేక అవసరానికి కామారిని ఆశ్రయించవలసి వస్తది.


సహాయానికి కంబమయ్య రావడముతొ చలించి పోతాడు కామారి- వచ్చిన కరవు కాలములో "నీది, నాది ఏమిటి కంబమయ్య? ఇప్పుడు అంతా మనదే- రేపు నాకూ ఇలాంటి పరిస్థితి రాదని పూచీ ఏమున్నది- నీకు అవసరమున్నంత సొత్తు ఇవ్వడానికి నేనేమి వెనుకంజ వేయలేను" అని కంబమయ్య అడిగినంత సొమ్ము ఇస్తాడు కామారి. దానికి ఎంతో సంతోషము చెందుతాడు కంబమయ్య.


తెగిపోయిన చెరువును పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి విన్నవించిన తొందరలో కాదని తలంచి ఊరివారందరు చందా లేసుకొని పునరుద్ధరణకు పూనుకుంటారు. ఇదివరకే నష్ట పోయిన కంబమయ్య చందా కామారి ఇచ్చినంత ఈయలేక ఉదార స్వభావము ఒదుల లేక తనకున్న పొలములో ఎకరము అమ్మి చందాలో తనవంతు డబ్బు చెల్లిస్తాడు.


'కామారి సహాయము పొందేకన్న ఇదే పనిని కంబమయ్య చేయవచ్చుగదా' అనుకుంటారు ఊరిలో కొందరు. ఇంకొంతమంది 'అది కాదు, కంబమయ్య ఆత్మాభిమానమున్న మాట నిజమే కాని తన వ్యక్తిగత అవసరాలు అందరిలా ఉన్నవారి దగ్గర తీసుకుని తీర్చుకుంటాడు. కాని చందా విషయానికొస్తే మళ్ళీ కామారిని అడుగలేడు కదా.. ఇదీ విషయము' అంటారు.


ఈ మాటలు కంబమయ్య కామారి చెవిలో పడుతాయి-


కామారి అడుగుతాడు "నిజమేకద కంబమయ్యా! తొలుతనే నీవు భూమి అమ్మవలసి ఉండెడిది కదా" అని-


దానికి కంబమయ్య "నీవు కొందరి మాటే విన్నావు కామారి, వేరేవాండ్ల మాటలు వినలేదా?" అంటడు కంబమయ్య.


"అంతా విన్నాను- ఇక ఆ మాటలెందుకు.. కాలాలు అనుకూలించిననాడు నీదీ నాది- కరవు కాలములో "నీదీ, నాదీ, మనదీ" అందాము అంటాడు కామారి.


కామారికి ఇద్దరు కూతుర్లు ప్రశాంతి- నవజ్యోతి. కంబమయ్యకు ఒక కొడుకు సామీరి,ఒక కూతురు పావకి. ఊరి పద్ధతి ప్రకారము కంబమయ్యది- కామారిది వేరు వేరు కులాలు- ఐనా ఇరువురి బలమైన స్నేహము వారి కులాలను మరిపించింది.


కామారి అడుగుతాడు కంబమయ్యను తన కూతురు ప్రశాంతిని సామీరికి చేసుకొమ్మని.

దానికి కంబమయ్య ఒప్పుకుంటాడు- ఎందుకంటె తన కొడుకు బుద్ధిమంతుడని తన మాటా కాదనడని నమ్మకముతో. అదేమాట కంబమయ్య తన భార్య జయంతి, కొడుకు సామీరిని పిలిచి వివరిస్తాడు.


జయంతి భర్త మాట కాదనకున్నా సామీరి మాత్రము "ఆ ప్రశాంతి నైతె నాకు ఇష్టము లేదు నాన్నా! మీరు అంతగా బలవంతము చేస్తె ఆమె చెల్లెలు నవజ్యోతి నైతె పరువా లేదు" అంటాడు-

ఎన్నడూ ఏ పొరపొచ్చాలు లేక ఒక్క ఇంటివారిగా వ్యవహరిస్తున్న కంబమయ్యకు గొంతులో వెలగ కాయ పడినట్లైతది. కామారికి ఏమి సమాధానము చెప్పాలో పాలుపోవడము లేదు.

ఇది గ్రహించిన జయంతి కామారి ఇంటికి పోతుంది- చెప్పలేక చెప్పలేక "మీ నవజ్యోతి నైతె ఒప్పుకుంటానంటున్నడు మా సామీరి" అంటుంది-


కామారి భార్య యమున "ముందటి నుంచి అనుకున్నది కాదుకద.. రేపు సంసారము చేసేది వాళ్ళు-- వాళ్ళ ఇష్టాయిస్టాల ప్రకారము మనము నడుచుకోవాలె" అంటుంటె

జయంతి అంటుంది "మా ఆయన మాత్రము నిప్పుకు చెదలు పట్టబట్టె" అనుకుంటున్నాడు అనగానే "నిప్పుకూ పట్టదు నీళ్ళకూ పట్టదమ్మా" అంటాడు కామారి- అనుకుంటే "నవజ్యోతీ నీ సంగతి చెప్పమ్మా" అంటడు కామారి.


"మీ ఇష్టమే నా యిష్టము కాని ముందు అక్కకు కానీయండి" అంటుంది నవజ్యోతి.--


"సరెనమ్మా, మీ ఆయనను దిగులుపడవద్దని చెప్పమ్మా" అంటడు కామారి.


"సరే నేను పోయివస్త" అని చెబుతూ వ్యవహారము అంత తీవ్రముగా లేదని గ్రహించి ఇంటిదారి పడుతుంది జయంతి.


జయంతి ఇంటికి రాగానే అడుగుతాడు కంబమయ్య ఏమన్నరు అని-


జరిగిన సంగతంతా చెబుతుంది జయంతి భర్తతో. అమ్మ బరువు దిగింది అని నిట్టూరుస్తాడు కంబమయ్య.


ఈ మాటలు విన్న సామీరి సార్థక నామదేయుడిలా గంతులు వేస్తాడు.


సామీరి చెల్లెలు పావకి "అన్నయ్యా! రేపు ఈ గంతులు వేస్తున్నది చూస్తె ఆ నవజ్యో తి సువర్చల మాదిరి వెడలి పోగలదు" అని వ్యంగ్యంగా అంటుంది.


"నన్నంటున్నవు కాని రేపా పరబ్రహ్మ దొరికితే కదులకుండ కూర్చుంటాడు. అప్పుడు తెలుస్తది అమ్మగారి దుడుకుతనము" అంటాడు సామీరి.


కొంత కాలానికి కామారి పెద్దకూతురు పెళ్ళి జరిగి పోతది. తరువాత నెల రోజులకే సామీరికి నవ జ్యోతికి వివాహం జరిపిస్తారు-


అప్పుడు అంటడు కామారి 'ఇన్ని రోజులు నాదీ నీదీ అన్న నోటనే మనది అనవలసి వచ్చింది, సంతోషం' అని కంబమయ్యను కౌగలించుకుంటాడు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



32 views0 comments
bottom of page