top of page
Original.png

నెలగ మూట శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #NelagaMutaSathakamu, #నెలగమూటశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Nelaga Muta Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 18/10/2025

నెలగ మూట శతకము - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

 

(1)శ్రీపతిని వేడుకొనుచు సంపతిని ప్రోగు జేసి

నిర్ధనునికి నీడ నీక నిర్దయతొ నుండువాని 

ఆపదలొ నున్ననాడా దేవుడు కానగలడ

నేను  జెప్పు మాట నెలగ మూట.


(2)కడుపు నిండుగ దిన్న కాదు హాని

 కడుపు నిండిన దిన్న కలుగు నజీర్తి

అదుపు దప్పిన నేదైన చెడుపు జేయు

నేను జెప్పు మాట నెలగ మూట.


(3) ఆవు పాలు పితుక లేగ నొదిలి

త్యాగ మించుకలేగ తానె బితుక

క్రేపు చచ్చు చూడు రేపొ మాపొ

నేను జెప్పు మాట నెలగ మూట.


(4) మాత్రుమూర్తి మాత్రు భూమి

మాత్రు భాషను మరచినోడు

యాత్ర జేసినౌనె సుకృతుండు

నే ను జెప్పు మాట నెలగ మూట.


(5) త్యాగమునకు పరిత్యాగమునకు

తారతమ్యమేరాళ మైనను తర్కమందున

త్యాగ భావమె తలువ దగును 

నేను జెప్పు మాట నెలగ మూట.


(6) నిప్పు చూడక కాలునంటిన నది

కాలకుండ నుండదటులె కనక చేసిన                                                                                          తప్పు గూడ మదిని గాల్చు నిప్పువోలె

నేను జెప్పు మాట నెలగ మూట. 


(7) అప్పు జేయుచుండుటది తప్పు గాదు

అప్పు దీర్చకున్న యౌనుగొప్ప తప్పు యది

చెప్పులోని రాయియై చొరబుచ్చుచుండు

నేను జెప్పు మాట నెలగ మూట.


(8) ఆలు బిడ్డల నగచాట్ల పాల్జేసి

తాగుబోతుగ మారి తనువు జెడగ

ఏరు దరికి రానీరు యేడ్చినంగాని

నేను జెప్పు మాట నెలగ మూట.


(9) పేరు ప్రఖ్యాతులు పేర్కొన గడించి

పేరోలగమున సుద్దులు చెప్పి చెప్పి యిక

ఇంట మర్యాద గోల్పోవ నేమి ఫలము

నేను జెప్పు మాట నెలగ మూట.


(10) పెంట మీద తులసి పెరిగిన దెచ్చి

ఇంట కోట గట్టి పూజింతురింటిల్లిపాది

ఇంట చెదలు బుట్ట పెంటమీదేయరా

నెను జెప్పు మాట నెలగ మూట.


(11) పైస క్రింద పడిన పలుమార్లు వెదకు

దస్త్రమెదుక మన్న దబాయించి జూచు

మన్ననెరుగని వాడు చేటగు యెన్నడైన 

నేను జెప్పు మాట నెలగ మాట.


(12) వనము నుండి జనములో కొచ్చిన 

వనచరముల జూసదురుకొనగ జనులు

సన్మార్గి జేరి దుష్టుడటులె కష్టబెట్టు 

నను జెప్పు మాట నిలగ మూట.


(13) పాలు పెరుగు నెయ్యి కలుషితము జేసి

తాను బొందెడు పప్పులుప్పులు నూనెల

తప్పు బట్టువాడు మెప్పు బొంద లేడు

నేను జెప్పు మాట నెలగ మాట.


(14) తెర వెనుక వేష ధారణ సరికద నిక

తెర తీయగ పాత్రపోషణ సాగన్ దగు

మర్మమెరిగితేనె మంచి లాస్యము జూడన్.

నేను జెప్పు మాట నెలగ మూట.


(15) రోజు ఒకటె కూరైన మోజు తగ్గు

రోజొకటె వస్త్రమైన రోత బుట్టు

రోజదే చుట్టమైన చులకనగును

నేను జెప్పు మాట నెలగ మాట.


(16) పతిని గోల్పోయి విలపించు సతిని జేరి

బొట్టు గాజులు  మట్టెలు పుస్తెలు పూవులు

దాల్చ పాడిగాదనుట నతి దారూంబగున్

నేను జెప్పు మాట నెలగ మూట


(17) జాతి సొత్తాహారమని జగము దెలియ

నీతి నియమాలు పాటించి ప్రీతి జెంది 

తిన్న మిగులు పారవేయుట పాటిగాదు

నేను జెప్పు మాట నెలగ మూట.


(18) సవిత్రి సవితృడు స్థావిరమున నుండ

పవిత్ర భావము తోడ పరిచర్యలు సేయ నా

పితృ మాతృల ప్రేమయే నీకు పెన్నిధగున్ 

నేను జెప్పు మాట నెలగ మూట.


(19) అక్కరకు రానిదేది నిక్కము నీ జగతి లేదు

అక్కరకు రానిదొక్కటె కనగ తిక్క మనిషియన

దక్కదు కీర్తి యెన్నడు తా దారికొచ్చువరకు

నేను జెప్పు మాట నెలగ మూట.


(20) హుండుడి నందురు హరి ప్రియుడని ఆ 

మొండికి జగమున యండ లేకున్నను నాతడు

తిండికి బండి గట్టు సిగ్గిడి తిట్టినన్ కొట్టినన్ 

నేను జెప్పు మాట నెలగ మూట.



(21)పంచ భాషలే పసిద్ధి గాంచె ప్రపంచమందున 

ఆంగ్ల హిందీ అరబిక్ స్పానిష్ చైనీస్ యనన్ మరి

ఏడు వేల భాషలందు తెలుగేల వెలుగదాయె

నేను జెప్పు మాట నెలగ మూట.


(22) దేశ భాషలందు దెలుగు లెస్స నాడన

నేడుమాతృ భాష మీద మమకార  మొదుల 

ఆంగ్ల భాషా యోషాకర్షణదియె   కాబోలనన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(23) అధమాంగమున హత్తమందున శిరోధరమందున 

కేశవీధిన్ కౌనున పైంజుషములందున సంఘాటికన దాల్చు

తొయ్యలి  తొడవుల్ గన దస్యుడు దోచన్ జూచున్.

నేను జెప్పు మాట నెలగ మూట.


(24) రూపాయి యాదాస్తుకు చిల్లర రూపములు నూరైన

అధిక రూపములని అందులో సగము గైకొందురా

అధికస్య అధికం ఫల మనుట అక్కరకు వచ్చునా

నేను జెప్పు మాట నెలగ మూట.


(25) మోఘమొందిన వస్తు వితరణము  సేయ

త్యాగ మంపించదది తత్పరులకును నది

భుక్తోజ్ఘితము భుభుక్షువుకు పెట్టినట్లుండు

నేను జెప్పు మాట నెలగ మూట.


(26) మొండి వాడెపుడైన మొరటు మాని

దండిగా నెడయాడు దారి గనగ          

ముసలం కిసలాయతే యనరె వాని 

నేను జెప్పు మాట నెలగ మూట.


(27) అగ్ని సాక్షిగ పెళ్ళాడిన యాలి యుండనా

జాయ నొదిలి జారిణి జాడ లెతుక చక్కని

రుక్మమొదలి రూక్షము పొందునట్లగున్ 

నేను జెప్పు మాట నెలగ మూట.


(28) చక్కెర బొమ్మకు నందము చిక్కని కురులున్ 

చక్కని చెట్టుకు నందము పెక్కుగ విరులనన్

చుక్కల ముగ్గులు వాకిట చూడగనందం

నేను జెప్పు మాట నెలగ మూట.


(29)తలక్రిందుల తపసు జేసినట్లుండు తైలపాయిక

తెకతేర యిండ్లందె తైతక్కలాడు తిమిరమందు

తిరుగు బోతటులె చరించు చర్మచటకము వోలెన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(30)కులముల పేర్లు బెట్టి బిలుచుట తగదని

కలముల వ్రాతలొచ్చె కాలపు మహిమన్

ప్రభుత యాజ్ఞ పాటించ పాడి గాదె నేడు

నేను జెప్పు మాట నెలగ మూట.


(31) గాదె నిండుగ ధాన్యము గాలికొదిలి

పేద బీదలకు పెట్టక పిసినిగొట్టైన తుదకు

కొక్కు దిని పోవ నీకిక దక్కునపకీర్తి

నేను జెప్పు మాట నెలగ మూట.


(32) చెట్టు  బెంచుటకు పట్టును కాలాలు పది యన

చెట్టు నరుకుటకు బట్టును క్షణములు గొన్నియె

చెట్టు జేసేడి మేలెంచి ముట్టకుండుట  మేలు

నేను జెప్పు మాట నెలగ మూట.


(33) దుంధుమారము జంపి తీసిన దారమే

కౌశేయాంబరమై కాంతిల్లుచుండు నట్టి

కోకలు గట్ట నతివలకు హితమేల నేల

నేను జెప్పు మాట నెలగ మూట.


(34) పట్టు పగడము ముత్యము పుట్టును

సత్యము యవి పులకము నుండియె నట్టి 

తొడుగులు ధరించ నరులకు న్యాయంబ

నేను జెప్పు మాట నెలగ మూట.


(35) పుస్తకమును మనసిడి జదివిన యది

మస్తకమునకెక్కు దాని మర్మంబేదో కుదురుగ

కూర్చొని దిన్న కూడొంట బట్టినట్లు

నేను జెప్పు మాట నెలగ మూట.


(36) ముసలి వారిని జూచి ముసిముసి నవ్వ

ముదము గాదది యగును మూర్ఖ లక్షణంబు

ముయ్యీడుకున్ దప్పునె ముందు దశలు

నేను జెప్పు మాట నెలగ మూట.


(37) సైనికుడు దేశానికి సంజీవి యని యెంచ

సమాజ సంరక్షణకు బూనిన సాహసుండతడు 

సవినయ సామీచియె శత కోటి శ్లాఘనంబు

నేను జెప్పు మాట నెలగ మూట.


(38) పక్షి కైనను పశువుకైన బుభుక్షుకైన

రక్షణొక్కటె లక్ష్యంబు దమ కుక్షి ఫలము

కౌశిక ఫలమెంతో మునుజూపు కానినట్లు

నేను జెప్పు మాట నెలగ మూట.


(39) సంతొకటి చాలంటు సంతృప్తి నొందిన

వరుస వావిలు కరువయ్యి వగపు గల్గు

చేయొక్కటైన జేయునా బనులన్ని చేవ గల్గి

నేను జెప్పు మాట నెలగ మూట.


(40) కులమన్నది వృత్తి మతమన్నదుద్దేశము

కుల మతములు రెండు కూడి యున్న

కలుగదా మనుగడ కాంచన మయమయ్యి

నేను జెప్పు మాట నెలగ మూట.


(41) సన్యాసి యైన సంసారియైన సద్భక్తుడైన న్

సాగిలపడేది  సనాతను సౌజన్యమొందనే

సంకల్పమే లేని సమారంభము సాధ్యమగునే

నేను జెప్పు మాట నెలగ మూట.


(42) సారమేయము గంకు సారహీనమైననెమ్ము

సామి చెంతనున్నను సుంత శాలీనత లేక

స్వల్ప మందాక్షమెరుగనల్పుని బూతి రీతి

నను జెప్పు మాట నెలగ మూట-


(43) ధనలక్ష్మి సఖియై ధనపతి సఖుడై యుండియు

ధన హీనుడయ్యి ధీవుడు రుణగ్రస్తుడాయె నిక

జనమే తీర్చంగవలయు నా జేజే యప్పుల్నప్పుల్

నేను జెప్పు మాట నెలగ మూట.


(44) విద్యుఛ్శక్తిని గనుగొనిన విద్వన్మణిని(బెంజమిన్ ఫ్రాంక్లిన్)

వినయంబున దలచుట వివేకము గాని

వీధి వీధి నాయకుల విగ్రహములేలా

నేను జెప్పు మాట నెలగ మూట.


(45) మహిలోన మహిళలు మహనీయురాండ్రు

మహిళలె మాతృమూర్తులు జగతిన జేజె లనగ 

మహిళ లేకున్న మహిలోన మనుగడేది

నేను జెప్పు మాట నెలగ మూట.


(46) కరుణకు నారీలోకము కర్వరి వంటిదన

కరుణ యె యువిద యుల్లము గ్రిక్కొను

కరుణకభిదాంతరము కన్న తల్లియె గాదె

నేను జెప్పు మాట నెలగ మూట.


(47) పుడమిన పురుషుడు పూషుణి కిణము

పడతుల పాలిట పరమ ప్రదీపమననిక

కాంతకు కాంతినిచ్చు విక్రాంతుడిలన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(48) ఉదరమందున నిత్య ముదరంబు జేసినను                                                                         పట్టికిని నెట్టి హాని తలబెట్ట బోదు తల్లి  మల                                                                                 మూత్రములనైన సహించు మహిమాత్మురాలు                                                                            నేను జెప్పు మాట నెలగ మూట.


(49) ఇంట వాడనె గాక వీధి వీధిన విభుడుండ

తిరుపతి శ్రీరంగము యాత్రలనుచు తిరుగుటేల

అణువణువున యా దేవుడె యావరించె గాదె 

నేను జెప్పు మాట నెలగ మూట.


(50) లేని వానికి దానము లేశమైనను మేలు

ఉన్న వానికె నుపకారము సేయ నది

వారాశిలో వర్షము కురిసినట్టగున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(51) అతి తిండి యతి నిద్రతి వాగుడు

అతివల ముందున్ మతి లేని మాటలు

అవివేకుల లక్షణంబు దక్షుని మదికిన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(52) సకల వ్యాధులకు ఘనౌషధంబు ఘృతకుమారి యన

నదియె కలబంద యదియె గృహకన్య యదియె కన్య

గుజ్జు మాధవి తొ కలిపి సేవించ మంచి గుణమునిచ్చు

నేను జెప్పు మాట నెలగ మూట.


(53) ప్రజ్ఞ గలవారి పనులె ప్రణుతి కెక్క

విజ్ఞతెరిగిన జదువులె విఖ్యాతి జెందు

ప్రజ్ఞువు గాకున్న బ్రయాస ప్రోచికోలగును

నేను జెప్పు మాట నెలగ మూట.


(54) పాథోజము పూరించుచు ప్రతీహారమందు నిల్చి

పారిరక్షకుడు బిక్షమెత్తు పగటి పూటలయందున్

దాసరి యాకలి గొన్నప్పుడె దిరుగు దిరిపమెత్త

నేను జెప్పు మాట నెలగ మూట.


(55) బధిర మూగలకైన భాషుండు నొకటి 

సయిగల తోడ నేదైన సందుకొన నుండ 

మెదడు కెక్కదే భాషైన మూర్ఖునకును 

నేను జెప్పు మాటనెలగ మూట.


(56) ప్రకృతిలొ యందమున పురుషులదె పై చేయి

పొలతుల యందమంత పోలికలతోనుండ

రవి కైరవుల మాదిరి రాణించుచుందురు

నేను జెప్పు మాట నెలగ మూట


(57) ఎదిగిన బిడ్డని యెవరో వెధవకు గట్టబెట్టక

చదివించి సామర్థ్యము బెంచి నిక సందేహించక

చదివిన సమర్థున కప్పజెప్పిన సవ్యంగుండున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(58) నేల నీరు  నింగి నిప్పు నభోజాతంబులను

పంచ భూతములు ప్రాణులకు పట్టునుండుటకున్

బరమాత్మయే నని ప్రాణి యెంచ పరమంబిలన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(59) హరిప్రియ యందు బుట్టిన నరునకు

పరి పరి విధముల హక్కులు నిక్కము 

పిత పితామహుల యాస్తిపాస్తుల తోడుతన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(60) టెక్కెము ఎగరేసి టెంకణము జేసి

మక్కువ గొల్పెడి మాటలాడి నోటి

బుక్కను దోచు టక్కరి నాయకుండు

నేను జెప్పు మాట నెలగ మూట.


(61) మూడు పూటల కూడు దినుచు

ముప్పొద్దు నిదిరించు వానితో నిక

కీడె గాక మినుకంత మేలుయగునె

నేను జెప్పు మాట నెలగ మూట


(62) మంచిని మంచి యన్న మారు పలుకకుండు

వంచకుడిని వంచకుండన్న కంచుగంటౌను

నిండు కుండ తొణుకకుండుండు నటులన్

నేను జెప్పు మాట నెలగ మూట


(63) అమ్మ చేతి వంటకంబెంచనదమృతంబు

ఆరున్నొక రుచి యన నదే కమ్మదనము

అమ్మ బెట్టు రుచికి మిన్న లేదవని యందు

నేను జెప్పు మాట నెలగ మూట


(64) తానలిగిన సతి దానలిగి బండుకొను గాని

తాపత్రయ జెనదించుక పతి యాకలి బాపన్

తల్లిదానలిగినన్ తపనబడు తనయులంగద దీర్చన్

నేను జెప్పు మాట నెలగ మూట.  


(65) వల్లభుడు జచ్చిన మగువను విధవ యనగ

వల్లభను గోల్పోగ మగవాన్ని విధురుడంద్రు

ఎవ్వరున్ లేని వానిని యేకాకి యంద్రు

నేను జెప్పు మాట నెలగ మూట.


(66)మన హితము జన హితము మ్రానుల హితమున్

మనమున దాల్చిన మానవతా మూర్తి యనంబడన్

హితమెవ్వరిది గోరకున్న స్వార్థ సహితుండనరె

నేను జెప్పు మాట నెలగ మూట.


(67) విత్తవంతునకేల యీవి విశాలపుటిల్లు నదె

పేద వానికి పెంకుటిల్లిచ్చిన పెన్నిధిగ భావించు

తిండిబోతు కన్న తిరిపరికన్నమమృతంబగున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(68) గాయత్రి మంత్ర సృష్టికర్త గాధిపుత్రుడన

బాదరాయణుడు విభజించె వేదములనానాడు

కలియుగమున జూడ కల్మషకారులు పెక్కండ్రు

నేను జెప్పు మాట నెలగ మూట.


(69) ఆయుధమాత్మ రక్షణకె గాని హత్యకు కాదు

ప్రభువులు పాలనెకె గాని ప్రయోషించ గాదు

ధనము దాన ధర్మములకె గాని దాచ గాదు

నేను జెప్పు మాట నెలగ మూట.


(70) బట్టల కొట్టు నందు బంగారు కొట్టునందును

బేరాలు సేయక బీదసాదలమ్మేటి సరుకులు కూరలు

భారమనుచు కొసరి బేరాలు జేయుట భావ్యమౌనె

నేను జెప్పు మాట నెలగ మూట.


(71) న్యాయమునకు బలమెక్కువ నదియె న

న్యాయమునకు బెదురెక్కువ నందరిలోనన్ 

ధనికునకున్న దిగులు దీనుడెరుంగనట్లు

నేను జెప్పు మాట నెలగ మూట.


(72) ప్రాడ్వివాకుడును పరార్థ వాదియు ధర్మాసనమున 

ధర్మము సేయనుండ వ్యాజ్యము గెలుచుటకున్

బరార్థవాది చట్టముకై ప్రాడ్వివాకుడు పట్టుబట్టు

నేను జెప్పు మాట నెలగ మూట.   


(73) ఎన్ని చెట్లున్ననే మెంత నేలున్ననేమి

చలికొణికిపోవు సమస్య యేగానమెరికా కెనడాలలో

భరత మాతయె మనల భద్రంగ జూసుకొను

నేను జెప్పు మాట నెలగ మూట. 


(74) దేహములు రెండైన నొక్క దేహముగ యుండి

జాయా పతులు జగడాలెరుగకుండ కల్ల పోట్లాట                                                                         లొచ్చిన పాదరసమోలె కలసిండ పాటియగును

నేను జెప్పు మాట నెలగ మూట.


(75) దేవుడెక్కడని మనమున దేవురించుట యేల

తల్లి దండ్రులె దేవుండ్లరయ తనయులకును

జన్మనిచ్చిన వారినాదరించ జయము గలుగు

నేను జెప్పు మాట నెలగ మూట.


(76) అరయన్ బోతన తిక్కనాది గవులీ యుర్విన్

జనియించి నిల్చిరి చిరంజీవులుగ వారొనరించిన

ధర్మమన భాగవత భారతాది కావ్య నిర్మాణంబుల్

నేను జెప్పు మాట నెలగ మూట.


(77) స్నేహమున నుండు సంఘీ భావము

కామమున నుండు కలయిక భావము

భావములు రెండాత్మ భద్రత కొరకే

నేను జెప్పు మాట నెలగ మూట.


(78) హరి యైనన్ కరి యైనన్ యడవి జంతువేదైన

దరి దాపులకు రావవి దేహవంతుల కడకున్ క్రూర                                                                      మృగమైనను మర్యాద పాటించు మనుజునకన్నన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(79) భాషలు ప్రభవించు ప్రాంతాల పారగతులందు

యా మను జన్మ యెప్పుడో భాషపుడె గాని

ప్రాచీన భాష పుట్టుకకు మూలము పసిగట్టగలమె

నేను జెప్పు మాట నెలగ మూట.


(80) పుడమిన పురవాసి ప్రావీణ్యుడుగాకున్న

ప్రభవించునా ప్రగమము బ్రజలయందు

అగ్ని కణము లేకున్న దీపమావిష్కరణేల 

నేను జెప్పు మాట నెలగ మూట


(81) ఎద్దుకు ముకుతా డేనుగుకంకుశము

గుర్రము పరుగిడ కరమున కళ్ళెము

మొద్దుకు బుద్ధికి వీపు దెబ్బలె సుమ్మీ

నేను జెప్పు మాట నెలగ మూట


(82) మాతాపితరుల మంచి పెంపకమున్నను

బిడ్డ పాపలకు బుట్టదు దొడ్డ ద్రోహపు చింతన

మొక్కపుడె వంచ  మ్రాను చక్కగ బెరుగున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(83) తిన యావ గలిగిన వాడు తరావి జేసి తినగ

తినుట మానైన పొదుపరి పొనుబాటు సేయు

ధనవంతుల రుణగ్రస్తుల దారులు వేరుండు

నేను జెప్పు మాట నెలగ మూట.


(84) మధు మక్షికము లెంతొ కష్టముతొ సమ కూర్చి

మనకందించిన  యుచ్చిష్టమిష్టమది శ్రేష్టమనగ

మధుమక్షికా పాలన సేయన్ వాటి సంరక్షణగున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(85)దారినబోవు దానయ్యతో నాకేపని యన యా

దారిన నీవు బోదు వవసర వేళన్ గాదా మరి

దారి నడుచువాని దిష్టమెరుగ నది కష్టంబగునే

నేను జెప్పు మాట నెలగ మూట.


(86) సవిత్రి సవిత్రుడు మిత్రుడు గురుడున్         

బవిత్ర హృదయులు వారిన్ బూజించి         

సేవించి యాదరించ నది వేదోక్తమగున్

నేను జెప్పు మాట నెలగ మూట. 


(87) వేసవిన ద్రోవరికి వేసరమనక జలివేంద్రమున్

పిచ్చుకలకు ద్రాగుటకున్ బానీయ మందించ నది

ధర్మ కార్యంబనబడు నీ ధారుణి యందున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(88) ప్రియ వచనముల ముసుగునందున

నయవంచకులు నేటి నాయకులు

జలరంజము మాదిరి జనులను దోచన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(89) శోభనకుప శోభయె శోభ నీయ నిక

శోభితములె బ్రియ వచనములనన్ యే                                                                                       శోభ లేదేని వారిని యెబ్రాసి యనరె  

నేను జెప్పు మాట నెలగ మూట.


(90) హరిచందన వందనాంగనలు దరిజేరగ

పరికించ వేల్పు పట్టుగొమ్మలు వారున్

వరియించి వధువులైన వరులకు వరమే

నేను జెప్పు మాట నెలగ మూట.


(91) కంటక మయమైనను కంటికింపగుచు

సౌమ్యగంధములీను సుగంధంబులరయ

మదిని పురిగొల్పు ద్రెంచ మణీచకంబదియె

నేను జెప్పు మాట నెలగమూట.


(92) ఆకొన్న కూడె యమృతంబగు గాని

బాహ్య తిండేదియు భద్రంబు గాదు

యింటి తిండియె యొప్పు యిగురమనగ

నేను జెప్పు మాట నెలగ మూట.


(93) తరతరముల నుండి తగవులుండుట

ప్రకృతి వికృతుల పరమార్థ మనబడు

భరత చరితంత కలహమేకాననగును

నేను జెప్పు మాట నెలగ మూట


(94) ద్వాపర యందు గృష్ణుడు దారుగ బుట్టి

ద్వారక గట్టించె దారాదము నందు పెక్కు

ద్వారము లుండు నట్లు దా ధీవుడననుచున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(95) భావము గనలేము బాధయున్ గనలేము

నింగి చూలి గనలేము నేమమున్ గనలేము 

అంతరంగ మొకటె యనుభూతి బొందున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(96)దేవుడందరి వాడింక సందేహ మేల

అగ్రగణ్యులమంటు యధికారము జూప

విగ్రహము నున్న దేవుడే నిగ్రహము గోల్పోవు

నేను జెప్పు మాట నెలగ మూట.


(97) విద్య యనునదొక వహ్నికణము యది

వాచించ స్వర్వ వ్యాప్తమై గొనసాగుచుండు

సూక్ష్మ వట బీజము మొలకెత్తి మట్టాడినట్టు

నేను జెప్పు మాట నెలగ మూట


(98) అను క్షణము చాయ కాఫీలంటాస్వాదించ

జఠరమందుదరవ్యాధి జనించి కుదరకుండు

పరిమిత మేదైన నిక బ్రాప్తించు సుఖము

నేను జెప్పు మాట నెలగ మూట..


(99) పండుగ నాడు పరమాన్నము పులిహోర

శ్రాద్ధము నాడు శ్రద్దతో గారెలు బూరెలు

నిత్యము దిన సత్యము పప్పు తొక్కు చారె.

నేను జెప్పు మాట నెలగ మూట.


(100) పెను మబ్బులు గప్పిన పెనుగొను చీకటి నిక

పెళ పెళ ధ్వనులతో యురుములు మెరుపులు

పొరపొచ్చాలొచ్చిన భార్యా భర్తల బాగోతంబట్లే

నేను జెప్పు మాట నెలగ మూట.


(101) మబ్బు పూవులవెల్లి మహిలోన ముప్పావు

ఉప్పు నీరే కాని పానమునకు బనికిరాదాయె

గొప్ప కోవిదుడు మహా కోపిష్టియైనట్టులన్

నేను జెప్పు మాట నెలగ మూట


(102) కోసిన రక్తమొచ్చు కొట్టిన నొప్పి దెలుసు

కోపమునన్ దిట్ట కుతిల గల్గే కుండీరులందు

కులమతముల బోరింక గుచ్చితము గాదె

నేను జెప్పు మాట నెలగ మూట.


(103) మూడు రెక్కలతోడ ముచ్చటగ నడిచేటి

దేశ పాలనలోన దోచుకొను వారధికంబు

మూడు రెక్కలన్ గన ముడుపుల లెక్కలే

నేను జెప్పు మాట నెలగ మూట.


(104) నోములు వ్రతాలు పూజలు సేయ

నార బట్టలు గట్టి నామములు బెట్టినా

చిత్త శుద్ధి లేనిది శ్రీపతనుగ్రహించునా

నేను జెప్పు మాట నెలగ మూట


(105) రుచి గని శబరి రామునకు ఫలమిచ్చి నటులె

తెరయీగ రుచిగనియె తీయని తేనె మనకిచ్చు 

ఉఛ్చిష్టమది యనక  యుత్కృష్ట మెంచమేలు

నేను జెప్పు మాట నెలగ మూట.


(106) గ్రంథ మొకటి గలిగి యున్నను మేలు బఠించకున్న

గ్రంథ పఠనము జేసి జ్ఞాన మార్జించనధిక  మేలు

గ్రహించిన జ్ఞానమాచరణే యత్యంత ఘనత నొందిలన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(107) పంచ వర్షముల వరకు బుత్రుని ప్రభువుగానెంచి

దశ వర్షములకు దండించి జదువులు నేర్పదగును

షోడశ వర్షములు నిండ నికాతడగును సహభావి

నేను జెప్పు మాట నెలగ మూట.


(108) నవ్వు యనునది మనుజులకు దివ్యౌషధంబు

నవ్వ గలిగిన నదియొక యోగ మందు రెవ్వరైన

నవ్వ లేకున్నను నందురది యొక రోగమనుచు

నేను జెప్పు మాట నెలగ మూట.


(109) అప్పు జేయుచను నిత్యము పప్పు కూడు దిన

అప్పిచ్చు వాడు సదా దెప్పుటకు కారణంబగున్

అప్పు సేయకున్ననె నరుడు బ్రతుకు నిప్పువోలె

నేను జెప్పు మాట నెలగ మూట


(110) వీరుడొక్కడె గాదీ మన స్వతంత్ర దేశమందు 

శూరులెందరొ పోరాడి శుభము జేకూర్చిరనన్ 

భారత జనమంత వీరులే స్వదేశ భావనందు

నేను జెప్పు మాట నెలగ మూట.


(111) కొట్టు బెట్టిన వణిజుడు బెట్టును పెట్టుబడి

గిట్టుబాటు  రాబట్ట గోర కట్టడిగాకున్నను

బెట్టు నెంచక నధికంబు రాబట్ట నెబ్బెట్టగున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(112) భారతీయ గణిత పండితుడు బ్రహ్మ గుప్త

ప్రప్రథమున సున్న గనుగొని  మన్నన బొందెనతడు

భారతీయ భగము జగము నిండునటులన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(113) అధిక నాయకులు సతత మధికార పీఠానికై బోర

అహర్నిశలు బోరాడెదరన్నదమూలాస్తి కొరకు

పుడమిన పంతము లేనిదనగ శ్మశానమొకటె

నేను జెప్పు మాట నెలగ మూట.


(114) పండితులు వ్రాసిన పద్యమొకటి జక్కగ

బల్కగ భీతిన్  జెందువాడు తానున్ నొక

పండితుడ నంటు నిక  ప్రగల్భములేలా

నేను జెప్పు మాట నెలగ మూట


(115) సున్ననకును  విలువ గనుగొని జన మన్నన బొందన్

బ్రహ్మగుప్త పంచ భూతములకు తోడారవ భూతమన

విద్యుత్తును గనుగొనియె బెంజమిన్ ఫ్రాక్లిన్ మహాశయుండు

నేను జెప్పు మాట నెలగ మూట


(116) త్రాగిన మైకమొచ్చు మేను త్రాణమున్ కరువగు

త్రాగిన మనుజుని ప్రాణ హానియు గలుగున్

త్రాగ కున్నచొ సుఖ త్రయములు ద్రాగ వచ్చున్

నేను జెప్పు మాట నెలగ మూట


(117) రుచి లేని తిండి  రుచించదు రసనకు

రుచి గలిగిన శుచి లేకున్నన్ రుచించదు మదికిన్

రుచి శుచి రెండు గల్గిన నదియె రుచిరంబగున్ 

నేను జెప్పు మాట నెలగ మూట.


(118) చదివిన జాతుర్యము బొందవచ్చు నింక

చదివిన జీవనోపాయ జాడ లెరుగవచ్చు      

జదివిన జీవనము జేగీయమానమగున్

నేను జెప్పిన మాట నెలగ మూట.


(119) మన యూరనె మనము గొప్పని దలచిన

పర యూరిన బరువు బ్రాప్తించ బోదు

అధిపతికైనను పరపతి దన పాళెము దాకే

నేను జెప్పు మాట నెలగ మూట.


(120) రసజ్ఞత లేని జదువుల్ వ్యర్థంబగు

ప్రతిజ్ఞ జేయని బనులున్ బాటిల్లబోవు

సంజ్ఞానము తోడనె బనుల్ సంప్రాప్తించున్

నేను జెప్పు మాట నెలగ మూట.


(121) నిర్గ్రంథుడు నవ రత్నముల్ ధరించనేమ                                                                          బహుళ శాస్త్ర విజ్ఞాన బుధునికన్న భాతియౌనె

మెల్లెకంటి షోకులాడి కన్న జీర్ణవస్త్ర జోటినయము

నేను జెప్పు మాట నెలగ మూట


(122) తలిదండ్రుల లక్ష్యమొకటె దమ తనయుల 

తగురీతి జదివించి దగిన యోగ్యుల జేయన్ నిక

సవిత్రి సవిత్రుడి సంరక్షణే సంతతిలక్ష్యంబగున్

నేను జెప్పు మాట నెలగ మూట. 


(123) సంగీత సాహిత్యముల్ రెండున్ సంప్రాప్తించె

జానపదుల నుండన జగమెరిగిన సత్యంబు

జానపదులె లేకున్న జగమెంత శూన్యమో

నేను జెప్పు మాట నెలగ మూట. 


(124) నవ మాసాలు మోసి నానా యాతన జెంది

ప్రసవ వేదన భరించి పసికూనకు జన్మనిచ్చినట్టి

పవిత్ర సవిత్రికిన్ సాగిలపడ బ్రతుకు సార్థకంబు

నేను జెప్పు మాట నెలగ మూట.


(125) కడుపున బుట్టిన కొడుకునకు యాపద వచ్చిన

ముడుపులు గట్టి మ్రొక్కు తల్లి ముప్పోకలాడికి యట్టి

మమత గల మాతకు శత వందనాలు శ్రేయంబగున్

నేను జెప్పు మాట నెలగ మూట


(126) ఆత్మ బంధువులతొ గూ డుండి యావెనుక మరణ

మాసన్న మైన వేళ మథనపడుటేల పులుగులన్ని మాపొక

 మ్రాను పై జేరి మరలిపోవె మేతకై యుదయంబు 

నేను జెప్పు మాట నెలగ మూట


(127) మాననీయుడైన యాచకుని మనోరథము దీర్చి

మానవత చాట మహనీయుడంటు మన్నన బొంద                                                                    దారు ధరాధరములె మేలంద్రు                                                                                                      నేను జెప్పు మాట నెలగ మూట.

 

(128) తనవాడు గాకున్న నాత్మీయుడంటు ధనికుని

ఆదరించెదరు జనులు యదియె పేదవాని గని

దుర్జనుని గనినట్లు దూరముంచెదరు జూడ

నేను జెప్పు మాట నెలగ మూట.


(129) చూడన్ సుందరము మాటయున్ మథురము

చేతమునన్ చురకత్తులు నొగదల నతి వినయంబన

మూర్ఖ ధూర్త లక్షణంబు మానవాళియు నెరుగన్

నేను జెప్పుమాట నెలగ మూట


(130) నిత్యము సత్యము బలుకుటయున్

నిర్విరామ విద్యా కృషి యున్ సలుపుట

మిన్నతి పొందు మార్గమదె మానిసికిన్

నేను జెప్పు మాట నెలగ మూట.


(131) పరివేదనేల మనుజునకు న్ నింక పరితాపమేల

ప్రపంచ ప్రవాహమున న్ సంయోగ వియోగములుండు

కట్టెలు రెండు నదిలోన కలసి విడి పోయినట్టులన్

నేను జప్పు మాట నెలగ మూట


(132) దారుణమీ దరిద్రము దావానలముకన్నన్

దార సుతుల బోషించు దారియున్ గరువగు

కాయకష్ట మొక్కటే ఖుల్లము కుండీరునకున్

నేను జప్పు మాట నెలగ మూట

 

(133)ధనముండియు దానమీక భావ ముండియున్

భాషితము సేయ లేక సంగీత సామర్థ్యమున్నన్

స్వరమనుకూలించని దీరులున్ గొరమాలగున్

నేను జెప్పు మాట నెలగ మూట.     

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page