నేనూ నీలాంటి వాడినే
- Srinivasarao Jeedigunta
- Jul 27
- 5 min read
#JeediguntaSrinivasaRao, #నేనూనీలాంటివాడినే, #NenuNeelantiVadine, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguHeartTouchingStories

Nenu Neelanti Vadine - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 27/07/2025
నేనూ నీలాంటి వాడినే - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కుండపోతగా వర్షం కురుస్తోంది. రోడ్లు నీళ్లతో ఎక్కడకక్కడ నిండిపోవడంతో వెహికల్స్ మెల్లగా కదులుతున్నాయి. ఆదివారం బేరం బాగా ఉంటుంది అని అన్నీ రకాల కూరగాయలు బండిమీద నింపుకుని ఉదయం కాలనీ చొరస్తా దగ్గర పెట్టుకుని నుంచున్నాడు రాములు.
చాలిచాలని సంపాదన గంపెడు సంసారం, యింతకంటే పెద్ద వ్యాపారం చెయ్యడానికి చేతిలో సరిపడ సొమ్ములేక పోవడం, ఈ బ్రతుకు ఇంతే అనుకుంటూ బేరం కోసం ఎదురు చూస్తున్నాడు.
“పాలకూర ఎన్ని కట్టలు యిస్తున్నావు?” అంటూ స్కూటర్ మీద వచ్చిన అమ్మాయి అడిగింది.
“ఇరవై రూపాయలకి మూడు కట్టలు మేడం” అన్నాడు.
“అయిదు యిస్తావా” అని అడిగింది.
“అమ్మా, వానకాలం ఆకు కూరలు రావడం లేదమ్మా. నాలుగు తీసుకోండి” అన్నాడు రాములు.
“ఎండాకాలం ఎండలు అని, వానకాలం వానలు అని ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి దోచుకోవడమే తప్పా ఎప్పుడైనా నిజాయతీగా యిచ్చారా?” అంది.
“అమ్మా! ఒక కట్ట తేడాలో మిమ్మల్ని దోచి మేము బాగుపడేది ఏముంది, నాలుగు కంటే ఇవ్వలేను” అన్నాడు.
స్కూటర్ స్టార్ట్ చేసి, ‘అక్కరలేదులే’ అంటూ ఉండగా, ‘అమ్మా ఆకలిగా వుంది ధర్మం చెయ్యి తల్లీ’ అంటూ బిక్షగాడు చెయ్యి చాచాడు.
పర్సు లో నుంచి పదిరూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.
“ఛీ, చివరికి మా బ్రతుకు బిక్షగాడి కంటే హీనం అయిపొయింది, నా దగ్గర బేరం ఆడింది. అక్కడ పదిరూపాయలు దానం చేసింది. ఏమనుకోవాలి” అనుకున్నాడు.
“అన్నా టీ కావాలా” అంటూ టీ అమ్మే కుర్రాడు ప్లాస్క్ బండి మీద పెట్టాడు.
“వద్దులే, బోణి కాలేదు, చేతిలో పైసా లేదు” అన్నాడు రాములు.
పదేళ్ల ఆ కుర్రాడు ఒక్కసారి అతని వంక చూసి గ్లాస్ లో టీ పోసి, “తాగు అన్నా, నేను నీలాంటి వాడినే, డబ్బులు రేపు యిద్దువు” అన్నాడు.
“వద్దురా, అన్నీ టీలు అమ్మితే నీకు పదిరూపాయలు మిగలవు, మీ యింట్లో ఏం చెప్తావు” అన్నాడు రాములు.
“అయితే ఆ పది రూపాయలకి పాలకూర యివ్వు అన్నా, నీకు నేను టీ వూరికే యిచ్చినట్టు కాదు, నువ్వు నాకు పాలకూర ఊరికే యిచ్చినట్టు కాదు” అన్నాడు నవ్వుతూ.
“సరే, చదువుకోక ఈ టీ అమ్ముకోవడం ఎందుకురా”, అన్నాడు టీ గ్లాస్ చేతిలోకి తీసుకుంటో.
“మా నాన్న మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు. దిక్కులేక మా అమ్మ క్రాస్ రోడ్డు దగ్గర ముష్టి అడిగి తింటానికి డబ్బులు తెస్తుంది. నేను ముష్టి ఎత్తలేక హోటల్ సార్ దగ్గర మాట్లాడుకుని టీ అమ్ముతున్నాను. ఈ రోజు అమ్మతో చెప్పి ఆకు కూర వండించుకుంటా” అన్నాడు.
టీ గ్లాస్ కుర్రాడికి యిచ్చి, ఒక పది కట్టలు తీసి కవర్లో పెట్టి “తీసుకుని వెళ్లి అమ్మకి యివ్వు” అన్నాడు.
ఎప్పుడైనా కూరలు కొంటే కదా ఆపిల్లాడికి తెలిసేది తను యిచ్చిన టీ కి అన్ని పాలకూర కట్టలు రావు అని.
సాయంత్రం నాలుగు అయ్యే సరికి రెండు వందలు వచ్చింది. దానిలో బండి రోడ్డు పక్కన పెట్టినందుకు ఇరవై రూపాయలు యిచ్చుకోవలిసి వచ్చింది. ఉదయమే బయలుదేరటంతో టిఫిన్ కి నలభై రూపాయలు. ఇహ మిగిలింది నష్టం.
వాన కొద్దిగా ఆగటం తో ఇంటికి చేరడం మంచిది అనుకుని బండి తోసుకుంటో బయలుదేరాడు. యింట్లో ఇల్లాలు ఏమైనా కూడు వండితే నాలుగు మెతుకులు తిని పడుకోవాలి, వానకి తడవడం వల్ల వొళ్ళు నొప్పిగా వుంది అనుకున్నాడు. ఎదురుగా వస్తున్న ఆవుని చూసి మిగిలిన ఆకు కూరలు దాని నోటికి అందించి దణ్ణం పెట్టుకుని బండిని భారంగా తోస్తున్నాడు.
“ఏయ్ బుద్ది వుందా లేదా, అసలే ట్రాఫిక్ జాం తో చస్తోవుంటే నీ బండి వేసుకుని రోడ్డు మధ్యలోకి ఎందుకు వచ్చావు, బండిని సైడ్ కి లాగు” అంటూ కర్రతో బండి మీద కొట్టాడు ట్రాఫిక్ పోలీస్.
మొహం మీద టొమోటో రసం పడింది రాములుకి, “అయ్యా, రోడ్డు దాటి అటువైపు వెళ్ళాలి, కొద్దిగా ఓపికపట్టండి” అంటూ తోపుడు బండిని బలంగా తోస్తున్నాడు.
నడిచి వెళ్లే వాళ్ళలో ఒక్కడికి కూడా సహాయం చేద్దాం అనిపించకపోవడం విచిత్రం అనిపించలేదు, కాలం అంతే.
అంతలో అప్పటివరకు బరువుగా వున్న బండి తేలికగా ముందుకు కదలడంతో పక్కకి చూసాడు. ఉదయం టీ అమ్మిన అబ్బాయి, యింకో స్త్రీ బండిని తోస్తూ రోడ్డు దాటించారు.
“టీ అమ్మేసి నా కోసమే వచ్చినట్టు వచ్చావు రా కొడుకా” అన్నాడు రాములు.
“మనం మనం ఒక్కటేగా అన్నా, మా అమ్మ ఈ చౌరస్తా లోనే..” అని ఆగిపోయాడు.
బండిని ఒక చెట్టు దగ్గర ఆపి “నువ్వే నయ్యం తల్లి, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్లకు విలువే లేదు, చూసావుగా ఆ ట్రాఫిక్ పోలీస్ ఎలా పిలిచాడో నన్ను, అంటే మనకి గౌరవం అక్కర్లేదు అని, ఎలా పిలిచినా తలవొంచుకుని పోతాము కదా” అన్నాడు.
“తప్పదు అన్నా. మనం యిలాగే బతకాలి అని దేముడు మన నుదుటిన రాసాడు” అంది.
“అవును అక్కా నువ్వు యిలా అందరిని డబ్బులు అడిగేదానికంటే నాలుగు ఇళ్లలో పనిచేయడం మంచిది కదా” అన్నాడు రాములు.
నా వయసు ఒక విధంగా నాకు నష్టం ఒక విధంగా లాభం. ఇళ్లలో పనికి నా వయసు అడ్డంకి. అడుక్కుంటున్నప్పుడు నా వయసుని చూసి చోంగకార్చుకుంటో డబ్బులు వేస్తున్నారు” అంది. “అయినా నేను స్వచ్ఛంగా బతుకుతున్నాను, నమ్ము అన్నా” అంది.
“సరే నీ పేరు ఏమిటి రా అబ్బాయి” అని ఆడిగాడు.
“నా పేరు నేనే మర్చిపోయాను, అందరూ ఏ చాయ్ యిటు రా అని పిలవడమే” అన్నాడు.
“ఆడిపేరు రాజు. కాని యిలా బతుకుతున్నాడు” అంది.
“సరే అక్కా. మన బాధలు తీరేవి కావు, యిదిగో ఈ టొమోటోలు ఉంచుకో” అని కొన్ని టొమోటోలు యిచ్చి బండి తోసుకుంటూ ముందుకి నడిచాడు.
యధాప్రకారం మర్నాడు బండి తీసుకుని వెళ్ళి తన స్థానం లో బండి పెట్టుకుని ఎదురుగా యింకో కూరగాయల బండి ఉండటం తో అతని దగ్గరికి వెళ్ళి, “చూడు.. నాకే బేరాలు లేక యిబ్బంది పడుతున్నాను, నువ్వు నా బండికి ఎదురుగా నీ బండి పెడితే ఎలా” అన్నాడు.
ఆ బండి అతను “ఎవ్వరి బేరం వాళ్ళది, ఈ రోడ్డు మీ తాత వేయించింది కాదుగా” అన్నాడు పొగరుగా.
అతనితో మాట్లాడలేక తన బండి దగ్గర నుంచుని కూరగాయలు చక్కగా సర్ధటం మొదలు పెట్టాడు. ఈ రోజు బేరం బాగానే వుంది అనుకుంటూ వుండగా, ట్రాఫిక్ అతను వచ్చి “కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు యివ్వు, వాడెవ్వడు నీకు పోటీగా బండి పెట్టాడు” అన్నాడు. “సరేలే, సాయంత్రం లోపు వాడి బండిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా” అంటూ వెళ్ళిపోయాడు.
అన్నట్టుగానే సాయంత్రం పోలీస్ వ్యాన్ వచ్చి “రోడ్డుకి రెండు సైడులు మీ బళ్ళేమిటి?” అంటూ కొత్తగా పెట్టిన బండిని ట్రక్ లో ఎక్కించబోయాడు.
జాలివేసి “అన్నా పోనిలే అన్నా. వాడూ బ్రతకాలి కదా, వదిలేయ్, నేనే నా బండిని పక్క వీధిలో పెట్టుకుంటా” అన్నాడు పోలీసు తో.
“రాములు.. మరీ యింత మంచితనం అయితే ఎలా, సరేలే. ఇద్దరు కొట్టాడుకోకుండా వ్యాపారం చేసుకోండి” అని వెళ్ళిపోయాడు.
యిహ ఈ రోజుకి అమ్మింది చాలు అనుకుంటూ బండిని ఇంటివైపు కి తిప్పాడు. ఇంతలో చాయ్ కుర్రాడు ఫ్లాస్క్ తో ఎదురయ్యి “అన్నా. ఒకసారి నువ్వు మా హోటల్ యజమాని ని కలవాలి” అన్నాడు.
“ఎందుకురా.. ఏమైనా తప్పుజరిగిందా” అన్నాడు రాములు.
“లేదు అన్నా. మా హోటల్ కి ఎంత లేదన్నా వెయ్యి రూపాయల కూరగాయలు అవసరం పడతాయి. నేను మా యజమాని కి నీ విషయం చెప్పి ఒప్పించాను. నువ్వు రోజూ మా హోటల్ కి కావలిసిన కూరగాయలు సప్లై చెయ్యాలి, ఆతరువాత నీ బండి నీ యిష్టం” అన్నాడు.
“ఎందుకురా నీకు నామీద యింత అభిమానం, అయినా అంత పెట్టుబడి ఎక్కడనుంచి పెట్టాలి రా” అన్నాడు రాముడు.
“అదికూడా మా యజమానిని అడుగుదాం ముందు నువ్వు వచ్చి మాట్లాడు” అని హోటల్ యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు.
హోటల్ యజమాని కుమార్ రాములుకి చెప్పాడు “రోజూ ఉదయం 6 గంటలకల్లా వంట మాస్టర్ యిచ్చిన లిస్ట్ ప్రకారం తాజా కూరగాయలు సప్లై చెయ్యాలి, పేమెంట్ సాయంత్రం 6 గంటలకు యిచ్చేస్తాము. వారం రోజులు సప్లై చెయ్యాలి” అన్నాడు.
“రోజూ సాయంత్రం భోజనం ఫ్రీగా చెయ్యవచ్చు, ఉదయం టిఫిన్ ఫ్రీగా తినవచ్చు” అన్నాడు. “రేపటి నుంచి సప్లై మొదలుపెట్ట”మన్నాడు, నిజాయితీ ముఖ్యం అని మరీ మరి చెప్పాడు.
సాయంత్రం యిచ్చిన కూరగాయల జాబితా చూసి మహా సంతోష పడ్డాడు రాములు. యిహ నుంచి రెండు బళ్ళ సరుకులు తేవాలిసిందే అనుకున్నాడు.
అప్పుడే ప్లాస్క్ తో వచ్చిన టీ కుర్రాడిని కౌగిలించుకుని “నీ సహాయం మర్చిపోలేను రా” అన్నాడు.
“దానిదే ముంది అన్నా. మనకి డబ్బున్న వాళ్ళు సహాయం చెయ్యరు. మనకష్టం మీద పైకి రావాలి, మనం మనం ఒక్కటే అన్నా. అది మర్చిపోకుండా మనం ఎదిగినా మన వాళ్ళకి సహాయం చేస్తే చాలు” అన్నాడు.
త్వరలోనే రాములు కూరగాయల షాప్ పెట్టాడు, టీ కుర్రాడు సర్వర్ అయ్యాడు, వాళ్ళ అమ్మ అడుక్కోవడం మానేసి హోటల్ లో పనికి కుదిరింది.
కష్టం తరువాత సుఖం ఉంటుంది.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comentarios