top of page

నేరస్థుడి మనసు మార్చిన యోగా

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #నేరస్థుడిమనసుమార్చినయోగా, #NerasthudiManasuMarchinaYoga, #TeluguHeartTouchingStories

Nerasthudi Manasu Marchina Yoga - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 08/06/2025

నేరస్థుడి మనసు మార్చిన యోగా - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం — ప్రకృతి అందాలతో నిండిన, కానీ శబ్దాలు మాత్రం ఎక్కువగా తుపాకులదే. అదే గ్రామానికి అటుగా ఒక టెర్రరిస్టు గ్రూప్ తమ శిబిరం వేసుకుంది. ఆ గ్రూప్‌లో అత్యంత కఠినంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వ్యక్తి రహీమ్. 


చిన్ననాటి నుండి హింసే జీవితంగా అతనికి నేర్పారు. తండ్రి మరణం, కుటుంబం విపత్తులు — వీటన్నింటికీ కారణం ప్రపంచమే అనుకుని, దానికి తుపాకీతో సమాధానం అనుకునే వాడు. కానీ అతడి జీవితాన్ని మార్చినది ఒక చిన్న సంఘటన. 


ఒకసారి అతడు తీవ్ర గాయాలతో పడి ఉండగా, జాతీయ సైన్యం పట్టుకుని తక్షణమే అతనిని స్థానిక వైద్యశాలలో చికిత్సకు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్న సమయంలో టీవీ లో మన ప్రధానమంత్రి యోగా గురించి చెపుతున్న సందేశం చూసి దాన్ని ఆసాంతం విని అక్కడి వైద్యులను దానిగురించి వివరణ అడిగాడు. వాళ్ళు చెప్పినది అర్ధమై అతని మనసులో నెమ్మదిగా పరివర్తన కలుగసాగింది. కొన్ని రోజుల తర్వాత అతను కోలుకున్నాక న్యాయస్ధానంలో వాదనల అనంతరం శిక్ష అనుభవించాడు. 


ఆ తర్వాత అతను విడుదలై ఒక ప్రకృతి ఆశ్రమంలో చేరాడు. అక్కడి యోగా కేంద్రం, ధ్యానం.. ఇవన్నీ అతడికి కొత్త. మొదట చాలా అవమానంగా అనిపించింది. కానీ శరీర నొప్పులు తగ్గేందుకు ప్రాణాయామం చేయమన్న యోగాచార్యుల మాట వినాల్సి వచ్చింది. 


ఆ నిశ్శబ్దంలో, ఆ లోతైన శ్వాసలో ఏదో విడిగా అనిపించింది. రోజూ యోగా చేస్తున్న కొద్దీ, ఆయన మనసు నెమ్మదించింది. “హింసలో శాంతి ఉండదని” అన్న మాటలు మొదట నవ్వు పుట్టించాయి, కానీ అర్థం అవుతుండగా కన్నీళ్లు తెచ్చాయి. 


అతడికి తన గతం గుర్తొచ్చింది — చిన్ననాటి నవ్వులు, తల్లి చేతి వంటలు, స్నేహితుల ఆటలు. తుపాకీకి బదులు కలం పట్టిన జీవితం ఎలా ఉండేదో ఊహించాడు. 

ఆశ్రమం నుండి కోలుకొని బయటికి వచ్చిన రహీమ్ మళ్లీ తుపాకీ పట్టలేదు. ఆయన ఇప్పుడు యోగా ఉపాధ్యాయుడు. హింస బాటలో ఉన్న యువకుల్ని మారుస్తూ, "మన మార్పే ప్రపంచ మార్పు" అనే సందేశాన్ని అందరికీ తెలియచేస్తున్నాడు. 


ఇలా కొన్ని నెలలు గడిచాక చూస్తుండగానే ఒక రోజు అంటే జూన్ 21వ తేదీ యోగా రోజు వచ్చింది. అదే సమయంలో ఒక నెల రోజుల ముందుగా భారత ప్రభుత్వం తరపున ప్రధాని జాతికి సందేశం ఇస్తూ ప్రపంచ శాంతి కోసం, తమ తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ విధిగా నిత్యం యోగా సాధన చేయాలని, ఇలా చేస్తే ఈ యాంత్రిక వత్తిడి యుగంలో అందరూ తమ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చక్కటి ప్రశాంత జీవనం గడపవచ్చని, ఇందుకు ఈ నెలరోజులు వివిధ ప్రదేశాలలో యోగా సాధన చేసి ప్రదర్శన లివ్వాలని, అలా ఎక్కడ, ఎవరు బాగా చేస్తే ఆ స్కూలు, ఆ సంస్థలకు మంచి ప్రతిభాపురస్కారాలు ఉంటాయని సందేశమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 


ఇది రహీమ్ పనిచేసే స్కూలుకు కూడా వచ్చింది. రహీమ్ తమ ప్రధానోపాధ్యాయుని అనుమతి తీసుకుని తమ స్కూలు పిల్లలకు యోగా లో ఇంకా బాగా తర్ఫీదు నిస్తూ వాళ్లని ఉత్తేజితుల్ని చేశాడు. 


ఆరోజు జూన్ 21వతేది. యోగా దినోత్సవం. ప్రధానమంత్రి పిలుపు మేరకు జిల్లాస్థాయి యోగా పోటీలు జరిగాయి. రహీమ్ శిక్షణలో ఉత్తేజితులైన ఆ స్కూల్ విద్యార్థులు జిల్లా స్ధాయి పోటీలలో పాల్గొని విజేతలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర స్ధాయి పోటీలలో కూడా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను చూపి విజేతలై అందరి మన్ననలను పొందారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి చేతులమీదుగా “యోగార్జున్” అవార్డు, సన్మానం పొందారు. 


రహీమ్ గత చరిత్రని, యోగా ద్వారా అతను మంచి మనిషిగా మారి తన సత్ప్రవర్తన తో యోగా మాస్టర్ గా ఉంటూ తమ స్కూలు విద్యార్థులను యోగా లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న వైనం తెలుసుకున్న ప్రధానమంత్రి గారు రహీమ్ ని ఘనంగా సన్మనించారు. రహీమ్ ఆనందానికి అవధులు లేవు. 


తమ స్కూలుకు, తమ ఊరికి వన్నె తెచ్చిన రహీమ్ ని, తమ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, పురప్రముఖులు వేనోళ్ల కొనియాడారు. 


యోగా మనిషి మనసుని మాత్రమే కాదు. అతని దైనందిన జీవితవిధానాన్ని, తద్వారా కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని, తద్వారా దేశాన్ని మంచిమార్గంలో మారుస్తుంది. భావిభారత పౌరులని తీర్చిదిద్దుతుంది. 


1. హింస ఎవ్వరినీ శాశ్వతంగా సంతోషంగా చేయదు. 


2. మనస్సు మార్పుకు ధ్యానం, యోగా శక్తివంతమైన మార్గాలు. 


3. ప్రేమ, క్షమ, శాంతి — ఇవే నిజమైన విజయ పధం. ఈ మూడు సూత్రాలను విద్యార్థులందరికీ బోధిస్తూ రహీమ్ ఆదర్శ జీవితం గడుపుతున్నాడు. 


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


YouTube Playlist Link









Comments


bottom of page