నేర్చుకో బాలా!
- T. V. L. Gayathri

- 12 minutes ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నేర్చుకోబాలా!, #బంగారుబాల్యము

గాయత్రి గారి కవితలు పార్ట్ 46
Nerchuko Bala - Gayathri Gari Kavithalu Part 46 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 18/11/2025
నేర్చుకో బాలా! - గాయత్రి గారి కవితలు పార్ట్ 46 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
నేర్చుకో బాలా!
(బాల పంచపది)
***********************
పట్టుదలను వీడక పయనించు
గట్టిసంకల్పము తోడచరించు
నీరసము నీకు తగదంచు
ధైర్యముతో నడుగు వేయుచు
పదపదవోయి! ముందుకే బాలా!
భరతదేశ పౌరుడవు కాద!
చరిత విన్నచో నీకు ధైర్యమే రాద!
సురలు పొగిడిన సీమలో బాధ
పడకుండ వేగమే సాగిపోరాద!
పదపదవోయి! ముందుకే బాలా!
చదువు సంధ్యలు నేర్చుకో బాలా!
చతికిల పడుట నీకు మేలా!
ఉప్పెన వలె నురుకుట చాలా
ఒప్పిదము కదా నీకెప్డు బాలా!
పదపదవోయి! ముందుకే బాలా!
చురుకుతనము చూపించవయ్యా!
వెరపుతో నడుగులు వేయకయ్యా!
నిరతము విశ్వాసం వీడకయ్యా!
చరితను తిరగ వ్రాయవయ్యా!
పదపదవోయి! ముందుకే బాలా!
కుంటిసాకులు కొన్ని చూపకోయి!
చంటి పిల్లాడివై బ్రతుకకోయి!
గెలుపు లక్ష్యముగా పోరాడవోయి!
వెల్గు రవ్వగ నీవు నిల్చిపోవోయి!
పదపదవోయి! ముందుకే బాలా!//
************************************

బంగారు బాల్యము
(బాల పంచపది)
************************************
బరువు బాధ్యతల్లేనట్టి బాల్యము
పిల్లలకు దైవమిచ్చెడి వరము
ఎంతమందికి దొరుకునా భాగ్యము?
ఆలోచించగా కలుగు విచారము
శోధించవలె తగిన పరిష్కారము.
కూలీనాలీతో గడుపు జీవనము
నెట్టుచుండగా నంతులేని భారము
పిల్లలకు కరువైనదా బాల్యము
తల్చుకొన్నచో క్రుంగు నా మానసము
తొలగించవలె బాధలని ఆలోచిద్దాము.
సమసమాజము కొఱకు నిత్యము
ప్రజలు కలిసి పాటుపడటము
పేదరికంబును నిర్మూలించటము
పెద్దమనసుతో జేయగా సాయము
సొంతమౌ కదా బంగారు బాల్యము.
చక్కని చదువును చెప్పించటము
పౌష్టికాహార మీయగా తక్షణము
బలముతో బుద్ధిలోన చైతన్యము
వెల్లివిరియ భద్రమౌ జీవనము
వర్థిల్లును సౌఖ్యముగ భావితరము.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments