top of page

నేటి తరం అమ్మాయి పార్ట్ 1


'Netitharam Ammayi Part 1/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'నేటి తరం అమ్మాయి పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఏమండీ! మన అమ్మాయికి మంచి పెళ్ళి సంబంధం వెతకండి, ఈడొచ్చిన పిల్లను అలా గాలికొదిలేసినట్టు ఊరుకుంటే ఎలాగా? అదేమో ఉద్యోగమంటూ పట్నంలోనే ఉంటుంది. పెళ్ళి అంటేనే అంతెత్తు ఎగిరిపడుతుంది. అది తానా మీరు తందానా అంటారే తప్ప దాన్ని ఒప్పించే ప్రయత్నం చెయ్యరు. నేనుంటేనేమో నన్ను గంజిలో ఈగను తీసిపడేసినట్టు చూస్తుంది. దానితోటి వాళ్ళందరు పెళ్ళిళ్ళు చేసుకుని చక్కగా కాపురాలు చేస్తూ పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. ఇదేమో మన మాట వినడంలేదాయే.. దేవుడా! నువ్వన్నా దాని మనసు మార్చు తండ్రి, " అంటూ భర్తతో చెప్పిందే చెప్పి దేవుడితో మొరపెట్టుకుంది సుభద్ర.


“అబ్బా.. ఏమిటే నీగోల! ఉదయం లేచినప్పటి నుండి ఇదే నసనా, ఇంకేవిషయాలు తోచవా మాట్లాడడానికి? అదేమో నేను నాకు నచ్చిన అబ్బాయి వచ్చేంతవరకు పెళ్ళిమాట

ఎత్తకండి అంటుంది, నువ్వేమో పెళ్ళో పెళ్లో అంటూ నా ప్రాణం తింటున్నావు. నేనెవరి మాట వినాలో నాకు తెలియడం లేదు సుభద్రా, " అన్నాడు కృష్ణమూర్తి.


“బాగుంది మీ వరస.. కన్న కూతురిని చూసి భయపడేవాణ్ణి మిమ్మల్నే చూస్తున్నా, అదన్నదని చెప్పి మన ప్రయత్నం మనం చెయ్యకుండా ఉంటామా? అయినా ఏ ఆడపిల్లైనా నాన్న.. నాకు పెళ్ళిచెయ్యండి అని అడుగుతుందా? దానికి నచ్చిన అబ్బాయి దొరకాలన్నా ప్రయత్నం చెయ్యాలి కదా! ఊరకే వచ్చి ఎదురుగా నిలబడడు కదా! అది చెప్పడమూ మీరు గంగిరెద్దులా తలూపడం సరిపోయింది, " వ్యంగ్యంగా అంది సుభద్ర.


"అమ్మా మహాతల్లి.. నీతో మాట్లాడలేను గానీ నువ్వు, నీ కూతురు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొండి, " చిర్రుబుర్రులాడుతూ చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు.


“అంతేలెండి! మీరు, మీ కూతురు ఒకటే! మీరన్నది కాకపోతే అక్కడనుండి తప్పించుకుని వెళ్ళిపోతారు. కన్నతల్లిని నేనెంత ఆవేదన పడుతున్నానో మీకు తెలియదు. అమ్మలక్కలందరు మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యవా? పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? మీ అమ్మాయికి దేవలోకంనుండి రాజకుమారుడు దిగి వస్తాడేమో. మాములు వాళ్ళ మీ అమ్మాయికి కంటికి కనిపిస్తారా.. ” అంటూ సూటిపోటిలంటుంటే నేనెంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదు. అంతేనా.. అక్కడితో ఆగిపోతే బాగుండేది. మీ అమ్మాయి కులం తక్కువ వాడిని ఎవరినైనా పెళ్ళి చేసుకుందా? లేకపోతే ఎవరినైనా ప్రేమిస్తుందేమో.. అని వాళ్ళు గుండెలమీద గునపాల్లాంటి మాటలంటుంటే నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. అందుకే వాళ్ళ నోర్లు మూయించాలంటే సౌజన్య మెడలో మూడు ముళ్ళు వేయించడమొక్కటే సరి అయిన దారి” మనసు ఆవేదనతో రగిలిపోతుంది సుభద్రకు.


"హలో సౌజన్య .. ఏమిట్రా ఎన్నిసార్లు ఫోన్ ఎత్తడంలేదు, ఏమైందోనని హడలి చస్తున్నా. రెండురోజులుగా నీ ఫోన్లేదు, పోని నేను చేస్తే రింగవుతుంది.. నువ్వు తీయడంలేదు.

ఒంట్లో బాగానే ఉంది కదా, " ఆత్రుతగా అడిగింది కూతురు సౌజన్యను.


"అనుకున్నా.. నేను ఫోన్ తీయకపోతే నువ్వు గాబరా పడిపోయి ఇంట్లో విప్లవం సృష్టిస్తావని తెలుసు. ఎందుకింత చాదస్తంగా తయారయ్యావు అమ్మా.. ఏదో పనిలో బిజీగా ఉందేమో.. అందుకే ఫోన్ తీయడంలేదేమో.. అనుకోవచ్చు కదా! నేనేం చిన్నపిల్లననుకున్నావా.. ప్రతిచిన్న విషయానికి నువ్వు భయపడిపోయి నాన్నను, నన్ను కంగారు పెడతావు, " తల్లిమీదకు గట్టిగా చీవాట్లు వేసింది సౌజన్య.


సుభద్రకు మనసు చివుక్కుమన్నది కూతురి మాటలకు. "అదికాదురా తల్లి.. నువ్వొక్కదానివి అక్కడున్నావు.. నీకేమైందోనని భయంవేసింది. నా ఆవేదనను అర్ధం చేసుకోనే చేసుకోరు మీ తండ్రికూతుళ్ళు. పోనిలే.. నువ్వు బాగుంటే నాకదేచాలు, ”


"ఇంతకు అంతకొంపలంటుకు పోయే విషయం ఏముందని అన్నిసార్లు ఫోన్ చేసావు? పెళ్ళి విషయమైతే ఫోన్ పెట్టేస్తాను. వేరే మాట్లాడేది ఉంటే చెప్పమ్మా, " అంది కంఠంలో వ్యంగ్యం ధ్వనించగా.


"అదికాదు సౌజన్య .. నేను చెప్పేది రెండు నిముషాలు విను ఆ తరువాత నీ ఇష్టం. నువ్వేం చిన్న పిల్లవుకాదు పదే పదే చెప్పడానికి.. నీతోటి వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయి పిల్లలను కూడా కన్నారు. నువ్వేమో పెళ్ళి లేకుండా బండచాకిరి చేసుకుంటూ ఒంటరి జీవితం గడుపుతున్నావు. నీకప్పుడే ఇరవైఎనిమిది నిండి ఇరవైతోమ్మిది వచ్చాయి. లేటు వయసులో పిల్లలను కంటే ఏమౌతుందో చదువుకున్నదానివి నాకంటే నీకే బాగా తెలుస్తుంది.


వయసు వచ్చే కొద్ది ముఖం ముదురుతుంది. పెళ్ళి చేసుకునేవాళ్ళకు మనం నచ్చొద్దూ.. అందుకే నా మాటవిని ఆ విజయవాడ సంబంధం ఒప్పుకో. వాళ్ళది చాలా సాంప్రదాయ కుటుంబం. మన గురించి తెలిసి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చారు. నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు ఊ అంటే వాళ్ళకు చెబుతారు మీ నాన్న. ఏమంటావు, ” అడిగింది సుభద్ర.


"నేను చెప్పానా .. నువ్వు పెళ్ళి విషయం తప్ప ఇంకేం మాట్లాడవని తెలిసే రెండురోజులుగా నీ ఫోన్ తీయడం లేదు. ఓ.. కొంపలంటుకుపోతున్నట్టు ఫోన్ చేస్తునే ఉన్నావు. చూడమ్మా!! కాలం మారింది. మాకు నచ్చినప్పుడు మాకు నచ్చిన వ్యక్తిని మేము పెళ్ళి చేసుకునే అధికారం మాకుంది. ఎందుకంటే మాకు మైనారిటీ తీరింది కాబట్టి మమ్మల్నెవరు శాసించే పనిలేదు. మీ కాలంలో అంటే ముక్కుపచ్చలారని పసివాళ్లకు పెళ్ళిళ్ళు చేసి గంపెడంతమందిని పిల్లలను కనడమే పని. మేమలాకాదు. పెద్ద చదువులు చదువుకుని మంచి. ఉద్యోగం సంపాదించుకుని మా కాళ్ళమీద మేము నిలబడగలగాలి. అప్పుడు.. అప్పుడు చేసుకుంటాను పెళ్ళి. సరేనా, "అంది.

సౌజన్య..


“ఇప్పుడేం తక్కువయిందే నీకు, మీ నాన్న సంపాదించిన ఆస్తి పట్టేంత ఉంది. మాకున్నది నువ్వొక్కదానివే. పైగా నువ్వు ఉద్యోగం చెయ్యబట్టి అయిదేళ్ళకు పైనే అయింది. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నావు. ఇంకెందుకే ఆలస్యం.. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుని పది కాలాలపాటు పిల్లలతో హాయిగా గడపక ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, " బాధపడుతూ అడిగింది.


"అమ్మా! నన్ను విసిగించకు అని చెప్పాను కదా! నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాను. నాకు నచ్చిన అబ్బాయితో కలిసే ఉంటున్నాను. మా మనసులు, మా పద్ధతులు, అభిప్రాయాలు కలిసాయంటే అప్పుడే పెళ్ళి చేసుకుంటాము. ఇంకెప్పుడు నా పెళ్ళి విషయం మాట్లాడకు, " అంటూ ఠక్కున ఫోన్ పెట్టేసింది సౌజన్య.


“అయ్యో రామ! ఇదేమిటి.. ఇది ఇలా మాట్లాడుతుంది. ఆడమగ ఒకే గదిలో కలిసుంటే ఏదైనా పొరబాటు జరిగితే రేపు జీవితం ఏమైపోతుందో ఏమో, కంగారుపడుతూ మళ్ళి ఫోన్ చేసింది కూతురికి. ఏ ధ్యాసలో ఉందోగాని వెంటనే ఫోన్ ఎత్తింది సౌజన్య.


"హలో సౌజన్య.. ఇందాక నువ్వన్న మాటకు నాకు పిచ్చెత్తి పోతుందే, నువ్వు ఆ అబ్బాయి ఒకే గదిలో ఉంటున్నారా? ఇదెక్కడి చోద్యమే, మన వంశప్రతిష్టలు మంటగలిసి పోతాయే తల్లి, మీ నాన్నకు తెలిస్తే గుండె ఆగిపోతుంది. మా తల్లివి కదా! నువ్వు చక్కగా ఇంటికిరావే, నీకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తాము, " అంటూ బోరుమని ఏడవసాగింది సుభద్ర.


"అమ్మా .. ఆపుతావా లేదా నీ గోల.. ఏమైందని ఇప్పుడు అంత శోకాలుపెట్టి ఏడుస్తున్నావు? ఏంటి మీ వంశప్రతిష్టల కోసం పంచెకట్టు పిలకవేసుకున్న వాణ్ణి చూసి పెళ్ళి చేసుకోవాలా? నీకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళే కదా! నేను నాన్నతో మాట్లాడుకుంటాను గానీ నువ్వు ఫోన్ పెట్టేయ్యి. మళ్ళి నాకు ఫోన్ చెయ్యకు, " అంటూ తల్లిని చెడామడా దులిపేసింది.


ఆరోజంతా సుభద్ర అన్యమనస్కంగానే ఉంది. భర్త పలకరించినా అంటిముట్టనట్టుగానే తన పని తాను చేసుకోసాగింది. కృష్ణమూర్తి, భార్య ఎందుకలా ఉందోనని గ్రహించలేదు.


సుభద్రకు తన కూతురు భవిష్యత్తు ఏమైపోతుందోనని భయం పట్టుకుంది. ఉన్న ఒక్క కూతురికి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే అదేమో పక్కదారులు పడుతుంది. తండ్రి, కూతురు ఇద్దరు ఒకటే.. మంచేదో చెడేదో గ్రహించే స్థితిలోలేరు. ఎటుపోయి ఏమౌతుందోనని భయంతో మనసంతా ఆందోళనగా ఉంది. కదిలిస్తే గంగాప్రవాహం పొంగిపోయేలా ఉంది సుభద్ర మానసిక స్థితి.


"సౌజన్య.. ఏంటి మీ అమ్మతో ఏదో గొడవపడుతున్నావు ? ఏమంటుంది మీ అమ్మ, ” సౌజన్యను అడిగాడు సౌజన్యతో కలిసి ఉంటున్న రఘు.


"ఆ.. ఏముంది మాములే కదా! వంశం, పరువు అంటూ వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలని ఆవిడ పట్టుదల. నాకేమో నా మనసుకు నచ్చిన వ్యక్తి నన్నర్ధం చేసుకుని నన్ను నన్నుగా ప్రేమించాలని కోరుకుంటాను. వాళ్ళు చూసే సంబంధాలు, మడి ఆచారాలకు కట్టుబడి ఉండడం నావల్లకాదు రఘు. పైగా ఇంటిల్లిపాది కలిసి ఉండి అందరికి సేవలు చేసుకుంటు ఉంటే వాళ్ళకు పరువు మర్యాదలు కాపాడినట్టు. ఇంత చదువు చదువుకుని లక్షల్లో సంపాదించే నాకు, ఒకరికి సేవలు చేసే కర్మ నాకేంటి రఘు, " అంది.


" నువ్వన్నది నిజమే కావచ్చు సౌజన్య.. కాకపోతే పెద్దవాళ్లు.. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి కదా! నువ్వు కొంచెం ఆలోచించాల్సి ఉండేదేమో, " అన్నాడు రఘు.


"రఘు .. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వర్ధం చేసుకున్నది ఇంతేనా? నా భావాలు నీ భావాలు ఒకటేననుకున్నాను, మనిద్దరి ఆలోచనలు మనం మన భవిష్యత్తు గురించి కంటున్న కలలు మరిచిపోయావా, " కోపంతో అడిగింది.


"అబ్బా సౌజన్యా.. ఈ కోపంతోటే అందరిని దూరం చేసుకుంటున్నావు, నువ్వు మీ వాళ్ళతో మంచిగా ఉంటేనే కదా కోట్ల అస్థి నీకు దక్కేది, కొంచెం ఓపికతో వాళ్ళను మంచి చేసుకున్నాక మనం పెళ్ళిచేసుకుందాము. నేను దేశం విడిచి పారిపోను కదా! నేను చెబుతూనే ఉన్నాను, మీ అమ్మానాన్నలను మంచి మాటలతో మార్చుకుని వాళ్ళచేతుల మీదుగానే పెళ్ళి చేసుకుందాము అని. అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటే.. వాళ్ళచేత మాయమాటలు చెప్పి తెల్లకాగీతాలమీద సంతకాలు పెట్టిందాము. అప్పుడు వాళ్ళను మనమే బెదిరించేద్దాం. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు చెప్పు, " సౌజన్యను దగ్గరకు తీసుకుని అనునయిస్తూ చెప్పాడు రఘు.


అతన్ని గట్టిగా హత్తుకుంటూ "చూసావా రఘు .. ఇలాంటి మాటలతో నన్ను సేదదీరుస్తావు కనుకనే నువ్వంటే చాలా ఇష్టం, మా అమ్మా నాన్నలకు అర్ధంకాదు నీ గురించి. ఎంతసేపు వాళ్ళు చెప్పినట్టే వినాలని చూస్తారు, రఘు .. నువ్వన్నట్టుగా వాళ్ళు మనమాటవినే రకం కాదుగానీ, ఏవో తంటాలుపడి వాళ్ళతో ఆస్తి కాగితాలమీద సంతకం పెట్టే ఉపాయం చూస్తాను. ఇక అప్పుడు వాళ్ళు ఒప్పుకోక పోయినా పరవాలేదు, మనం కోటీశ్వరులం అయిపోతాం, " అంది ఊహాలోకం తెలిపోతూ.


‘అవును. నువ్వు మీ నాన్నతో పేపర్ల మీద సంతకం పెట్టించగానే, ఆస్తి మొత్తం నీ చేతులతో నాపేరు రాయించుకోని నీకు ఉద్వాసన చెప్పాలన్నదే నా ఆలోచన. ఎంత తొందరగా అవుతుందా అని ఎదురు చూస్తున్నాను సౌజన్య.. ’ మనసులో అనుకున్నాడు రఘు.


ఉన్నట్టుండి ఊడిపడిన కూతురిని చూసి ఆశ్చర్యపోయారు కృష్ణమూర్తి సుభద్రలు.


"ఏంటి నాన్నా అలా చూస్తున్నారు ? చెప్పా పెట్టకుండా వచ్చిందేంటాని అనుకుంటున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మనసంతా బెంగగా ఉంది. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీరేమో ఇంటికి వస్తే పెళ్ళి గోల మొదలెడతారు. నాకేమో ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. అమ్మా! ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, " అంటూ గట్టిగా తల్లిని వాటేసుకుంది సౌజన్య.


"నా తల్లే.. ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చామా తల్లి. నిన్ను చూడాలని మనసెంత ఆరాటపడుతుందో నీకు తెలియదు. నువ్వు రావొద్దన్నావని బాధను గుండెలోనే దాచుకుని

అలమటిస్తున్నాము. నేను కనీసం బయటకు చెప్పుకుని బాధపడుతున్నాను కానీ మీ నాన్న ఉన్నారు చూసావా.. ఆయనకు నువ్వంటే ఎంత ప్రాణమో.. బాధనంతా మనసులో దాచుకుని ఎలా కృశించారో చూడు, " అంది భర్తవైపు ఆప్యాయంగా చూస్తూ.


"సారీ నాన్న.. మిమ్మల్ని బాధపెట్టాను. ఇంకెప్పుడు మిమ్మల్ని చూడకుండా బాధపెట్టను, " తండ్రి నుదుటిమీద ముద్దుపెట్టుకుంటూ అంది. ఇన్నాళ్ళకు తమ కూతురు తమను అర్ధం చేసుకున్నందుకు సంతోషంతో పొంగిపోయారు. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి సౌజన్య వచ్చి. ఇక రేపోమాపో వెళ్ళి పోవాలి తను. ఎలాగైనా ఈ రోజు నాన్న చేత ఆస్తి కాగితాలమీద సంతకం పెట్టించుకోవాలి. ఎలాగా.. అన్న ఆలోచనతో ఉండగానే, కృష్ణమూర్తి పిలిచాడు కూతురిని.


"ఏంటి నాన్న పిలిచారు, " వినయాన్ని ప్రదర్శిస్తూ అడిగింది.


"ఇలా కూర్చోరా.. సౌజన్య నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలిరా, " చెప్పడం ఆపి సౌజన్య వైపు చూసాడు.


ఇదేంటి కొంపతీసి మళ్ళీ పెళ్ళి గురించి మాట్లాడడు కదా! కలవరపడుతూనే

"చెప్పండి నాన్న, " అడిగింది.


" తల్లీ.. మాకా వయసైపోయింది. నిన్ను చూస్తే ఇంకా పెళ్ళి కాకుండా ఉండిపోయావు. నీకు పెళ్ళి చేస్తే నీ బాధ్యతతో పాటుగా ఈ ఆస్తినంతటిని వచ్చే నీ భర్తకు అప్పచెప్పాలని ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాను. నువ్వేమో పెళ్ళి మాట తీస్తేనే అంతెత్తున ఎగిరిపడుతున్నావు. అలా అని నువ్వేం లోకంపోకడ తెలియని చిన్న పిల్లవు కాదు. పెద్ద కంపినీలో ఉద్యోగం చేస్తున్నావు. నీకు మంచి చెడు అన్నీ తెలుసనుకుంటున్నాను.


నీచేతికి ఇంత ఆస్తి వచ్చాక నీ చుట్టు ‘బెల్లం చుట్టు ఈగలు ముసిరినట్టు’ ఎంతమంది తిరుగుతారో నిన్ను ఏం చేస్తారోనని ఇన్నాళ్ళు భయడిపోయాను’ మాఆరోగ్యాలు చూస్తే అంతంత మాత్రంగా ఉన్నాయి. అందుకే ఎప్పటికైనా ఈ ఆస్తి నీకు చెందవలసినదే కదా! నీ బాగోగులు నువ్వు చూసుకుంటున్నావు, ఇక నుండి నీ ఆస్తిని కూడా నువ్వే చూసుకో తల్లి, " అంటూ తను తెల్లకాగితాల మీద సంతకం పెడుతూ, సౌజన్యతో పేపర్లమీద సంతకాలు పెట్టించి కూతురి చేతిలో పెట్టి నిట్టూర్చాడు బాధ్యత అయిపోయింది అన్నట్టుగా.


సౌజన్య ఆనందం పట్టలేకపోతుంది. నేను కోరుకున్నది కష్టపడకుండానే నా చేతికి వచ్చింది. అబ్బా ఈ సమయంలో రఘు నా దగ్గరుంటే ఎంత బాగుండేదో అనుకుంది.


" నాన్న.. ఇదేంటి ఇదంతా నాకెందుకు అప్పచెప్పుతున్నారు.. మీకంటూ ఏమి మిగుల్చుకోరా? మీ భవిష్యత్తు ఎలా జరగాలనుకున్నారు," అడిగింది.


"చూడమ్మా.. నువ్వు కోరుకున్నది ఇదేకదా! అదేనమ్మా పెళ్ళిచేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోదాం అనుకున్నావు, అలాంటప్పుడు నీ దగ్గరుంటేనేమి మా దగ్గరుంటేనేమి చెప్పు? రేపు మమ్మల్ని చూడవలసిన బాధ్యత నీదే. అవును కదా!, " అడిగాడు కూతురు ముఖంలోకి గమనిస్తూ.


"అలా అంటారేంటి నాన్న.. మీరు ఆస్తి నాకివ్వకున్నా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాదే, మీకేలోటు రాకుండా నేను చూసుకుంటాను నాన్న, " తండ్రి

చేతులుపట్టుకుని కళ్ళకద్దుకుంటూ పేపర్లు తీసుకుని బ్యాగులో పెట్టేసుకుంది. ఆ రాత్రంతా

స్వర్గంలో విహరించింది సౌజన్య.


"అమ్మా వెళ్ళొస్తానే.. నాన్న మీరెప్పుడు రమ్మంటే అప్పుడే రెక్కలు కట్టుకుని వాలిపోతాను సరేనా, " అంది వెళ్లడానికి బయలుదేరుతూ.


"అలాగే తల్లి .. నువ్వనుకున్నది సాధించావు కదా! నీకు సంతోషంగా ఉందనుకుంటా,” అడిగాడు కూతురి తల నిమురుతూ.


చివాలున కళ్ళెత్తి తండ్రివైపు చూసింది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు నాన్న.. కొంపతీసి నేను ఆస్తి కోసమే వచ్చానని తెలుసుకున్నాడా ఏంటి కంగారుపడుతూ..


"అదేంటి నాన్న అలా అంటున్నారు? నేనేం సాధించుకున్నానని సంతోషంగా ఉండమన్నారు, " అడిగింది తడబడుతూ.


"అబ్బే అదేం లేదురా.. నువ్వు వచ్చినప్పటినుండి మీ అమ్మ నేను నీ పెళ్ళి విషయం ఎత్తకుండా ఉన్నాం కదా! అదే అంటున్నా, మమ్మల్ని నోరెత్తకుండా చేసావు మళ్ళీ నువ్వు ఇంటివైపు రాకుండా ఉంటావేమోనని మాట్లాడలేదు అంతే కదూ సుభద్రా, "అడిగాడు భార్యవైపు చూస్తూ.


ఈగోలేంటో తెలియని సుభద్ర ఆటు ఇటుగా తల ఊపింది.


"అమ్మయ్యా.. ఇంకోమో అనుకున్నాను నాన్న, " అంటూ చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది.


కూతురు వెళ్ళినవైపే చూస్తూ ‘పిచ్చితల్లి.. నువ్వు ఇంగ్లీషు చదువు చదువుకుని గొప్ప తెలివితేటలు ఉన్నాయనుకున్నావు. కానీ మాకు అక్షరం ముక్క రాకున్నా మట్టిని నమ్ముకున్న వాళ్ళం. ఎవరి మనసు ఏంటో కనిపెట్టలేని వెర్రివాళ్ళం కాదు. నువ్వెక్కడున్నా నీ వెనుక నేనుంటానని నువ్వు తెలుసుకోలేకపోయావు. డబ్బు సంపాదన మొదలు పెట్టగానే వెర్రి ఆలోచనలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నీలాంటి వాళ్ళేనమ్మా’ అనుకున్నాడు కృష్ణమూర్తి.

========================================================================

ఇంకా వుంది...

========================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.50 views1 comment
bottom of page