'Netitharam Ammayi Part 2/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla
'నేటి తరం అమ్మాయి పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం
రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
కూతురు సౌజన్య పెళ్లికోసం తొందర పడుతుంది సుభద్ర.
తాను ఒక అబ్బాయితో కలిసి ఉంటున్నట్లు చెబుతుంది సౌజన్య. తనను పెళ్లి విషయంగా తొందర పెట్టొద్దని చెబుతుంది. రఘు కోరినట్లు ఆస్తిని తనపేరు మీద రాయించుకుంటుంది.
ఇక నేటి తరం అమ్మాయి పెద్దకథ చివరి భాగం చదవండి.
"ఏమండి ఏం చెప్పారు మీ అమ్మాయికి, నన్నేమో నోరెత్తెద్దు అని నా నోరు మూయించారు. పోనీ.. మీరన్న దాని మనసు మార్చి పెళ్లికి ఒప్పించారా? ఏమన్నదేంటి మీ కూతురు, " అడిగింది భర్త దగ్గర కూర్చుంటూ.
"నీ ఆత్రం చూస్తుంటే నీ కూతురు ఒప్పుకుంటే రేపే పెళ్ళి చేసేలా ఉన్నావు.. అంత తొందర పనికిరాదు సుభద్ర.. కాస్త నిదానంగా ఉండు. తొందరలోనే నీ కూతురు నువ్వు చెప్పినట్టు వినే రోజు వస్తుంది, " ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు.
"ఊ ఊ .. మీకంతా వేళాకోళంగానే ఉంటుంది, పెళ్ళీడు దాటిపోయి ముదురు తయారవుతుంది మీ కూతురు. ఇంకా పసిపాపేం కాదు తనకు నచ్చచెప్పడానికి. నలుగురిలో తలెత్తుకోలేకుండా ఉన్నాము ఇప్పటికే. ఏం చేస్తారో ఏంటో? నాకు దాని పెళ్ళి చక్కగా చేసి అత్తవారింటికి పంపించేదాక నా మనసు నిలకడగా ఉండదు, " అంది గొంతులో బాధను బయటకు రానివ్వకుండా.
***
"హాయ్ రఘు.. ఎక్కడున్నావు ? నేను వచ్చేవరకు గదిలో ఉంటావనుకున్నాను, ఫోన్ చేసాను ఫోన్ ఎత్తలేదు. నువ్వు త్వరగా మన రూం దగ్గరకు వచ్చేయ్యి. నీకో గుడ్
న్యూస్ చెప్పాలి, " అంటూ ఫోన్ కట్ చేసింది. రఘు ఎప్పుడెప్పుడు వస్తాడా ఆస్తి విషయం చెపితే రఘు ఎంత సంతోషపడిపోతాడోనని ఆత్రంగా చూడసాగింది.
"హలో సౌజన్యా.. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? మీ అమ్మానాన్నలను మన పెళ్లికి ఒప్పించావా ఏంటి, చెప్పు చెప్పు నాకు వినాలని ఆరాటంగా ఉంది, "అన్నాడు.
"రఘు నీకు తెలుసా.. మా నాన్న నేనడగకుండానే ఆస్తి మొత్తం నాపేరు మీద రాసేసారు. అదేదో సామెత చెప్పినట్టు ‘వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు’ ఎప్పటికైనా
నీకు చెందాల్సిందేనని చెప్పారు. నేను ముందే చెప్పానని మా అమ్మతో నా పెళ్ళి విషయం ఎత్తొద్దని. అందుకు వాళ్ళ ఒక్కసారి కూడా పెళ్ళి గురించి మాట్లడలేదు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో, " అంటూ రఘును గట్టిగా వాటేసుకుంది సౌజన్య.
"అయితే ఇంకేం ఈ వారంలో మనం రిజిస్టర్ మ్యారేజి చేసుకుందాము, మా స్నేహితులందరు మన పెళ్ళి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు, " సౌజన్యను గట్టిగా గుండెలకదుముకుంటూ చెప్పాడు.
"అబ్బో పెళ్ళి కొడుకు ఆగేట్టు లేడు కదా! రఘు.. నీ సంతోషమే నా సంతోషం. ఇదిగో రఘు.. నా ఆస్తి తాలుకు కాగితాలు. ఇక నుండి నాతోపాటుగా వీటిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే రఘు, "అంది పేపర్లు రఘు కందిస్తూ.
రఘుకు పట్టరానంత ఆనందంగా ఉంది. ఇప్పుడు తను కోట్లకు వారసుడు కాబోతున్నాడు. ఎలాగైనా సౌజన్యను నమ్మించి పెళ్ళికి ముందే ఈ పేపర్ల మీద సంతకం చేయించుకోవాలి. తనకు ఎక్కడ అనుమానం రాకుండా చూసుకోవాలి..
మనసులో అనుకుంటూ. " సౌజన్య.. అబ్బా ఎంత బరువు నా మీద పెడుతున్నావు? మన పెళ్ళయ్యాక మనతోపాటుగా ఈ ఆస్తిని కూడా మీ నాన్ననే చూసుకోమనడం మంచిదేమో, ఎంతైనా అనుభవం ఉన్నవాళ్ళు. మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు, " ఆప్యాయతను రంగరించి సౌజన్య మనసు దోచుకున్నాడు.
"రఘు .. నిజంగా నువ్వెంత మంచివాడివో, మా అమ్మా నాన్నలు నిన్ను చూస్తే ఎంత పొంగిపోతారో కదా, "అంది ఆర్ద్రత నిండిన కళ్ళతో.
అనుకున్న రోజు రానే వచ్చింది. పెళ్ళి కూతురు ముస్తాబులో దేవ కన్యలా మెరిసిపోతుంది సౌజన్య. స్నేహితులంతా వచ్చారు ఎవరికి తోచిన పని వాళ్ళు చేసారు. సరిగ్గా సమయం చూసుకుని రిజస్టర్ ఆఫీసులో దండలు మార్చుకుని సంతకాలు పెట్టడానికి తయారవుతున్నారు.
"ఆగండి, " అన్న పిలుపు వినిపించి చటుక్కున అటు వైపు తిరిగారందరు. ఇద్దరాడవాళ్ళను చూడగానే రఘు ముఖం పాలిపోయింది.
"ఏయ్ సరితా.. నువ్వేంటే ఇలా వచ్చావు? సరే రా. సమయానికి నువ్వు వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. నా తరపున నా స్నేహితురాలివి నువ్వు వచ్చావు సాక్షి సంతకం పెట్టడానికి, " అంది సౌజన్య.
"సౌజన్య .. నేను నీ కోసం రాలేదు, నీకు పెళ్ళి ముందు గుర్తుకు రాలేదు గాని నాకై నేను వస్తే గుర్తుకు వచ్చానా? నేను ఊరికే రాలేదు సౌజన్య.. ఇదిగో మా అక్క జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నాడే నీ ప్రాణ సఖుడు, అతని బండారం బయటపెట్టడానికి వచ్చాను. అయినా నువ్వేంటే.. గొప్ప తెలివికలదానివనుకుంటే ఈ మోసగాడి వలలో పడిపోయావు" వేలెత్తి రఘువైపు చూపిస్తూ కోపంగా అంది సరిత.
"ఏమిటి సరితా.. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, రఘు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నన్ను అపురూపంగా కంటికి రెప్పలా కాపాడుకునే మంచి మనసున్న మనిషి" అంది.
"చాల్చాల్లేవమ్మా నీ శ్రీరంగనీతులు.. నీకు ఏం తెలుసని మా ఆయన గురించి మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళను మాటలతో బురిడి కొట్టించి ఆయనకు కావలసిన సరదా తీర్చుకుంటాడు. ఎన్నోసార్లు చూసాను నేను బ్రతిమాలాను. అయిన వినలేదు. ఇప్పుడేమో ఏకంగా నిన్ను పెళ్ళి చేసుకుని నాకు సవతిని చేద్దామని చూస్తున్నాడు. పదేళ్ళ కాపురంలో అర్ధం చేసుకోలేని నాకంటే నీకే బాగా అర్ధమైయ్యా డనుకుంటున్నావా?
పిచ్చిదానా! నా మొగుడు మేకవన్నె పులి తెలుసా? జూదం పిచ్చిన్నవాడు. అమ్మాయిల పిచ్చి బ్రహ్మాండంగా ఉన్నవాడు. ఇప్పటికి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో నాకు తెలుసు.. ఈ మహానుభావుడు అందగాడని నేను తెలుసుకోలేక మోసపోయాను, దాని వలన పుట్టింటి ఆదరణకు నోచుకోలేని నిర్భాగ్యురాలను. అలాగని అత్తింటి గడపలోకి రానివ్వరు. అనాథల బ్రతకలేక ఈయన చేసే దరిద్రం పనులు చూస్తూ ఊరుకున్నాను,
మా చెల్లి సరిత స్నేహితురాలవని మంచి భవిష్యత్ ఉన్నదానివని, నిన్ను కాపాడుకునే బాధ్యత దాని మీద పెట్టాడు మీ నాన్న. చదువుకున్న మూర్ఖురాలవని తెలిసి నిన్ను కాపాడటానికి వచ్చాను" చెప్పింది భర్త వైపు అసహ్యంగా చూస్తూ.
"ఏయ్ .. అసలు నువ్వేందుకొచ్చావు ఇక్కడకు, నీకు పిల్లలమీద ప్రేమ లేదా? వాళ్ళ జీవితాలను నాశనం చేద్దామనుకున్నావా? సౌజన్య .. ఈమెవరో నాకు తెలియదు
మన పెళ్ళి చెడగొట్టడానికి వచ్చారు. ఈ మద్య ఇలాంటి వాళ్ళు డబ్బులకోసం నాటకాలాడుతున్నారు ఆగు వీళ్ళను పోలీసులకు అప్పచెప్పుదాము, " అంటూ సౌజన్య
వైపు వెళ్ళాడు.
"ఆ ఆ.. అవును బాబు .. నీకా శ్రమ అక్కరలేకుండానే నేనే పోలీసులను తీసుకవచ్చాను. వీళ్ళ మోసాలు తట్టుకోలేకపోతున్నారని నీలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని తెలిసి నా జాగ్రత్తలో నేను వచ్చాను. కానిస్టేబుల్ ఈ నయవంచకుడిని అరెస్ట్ చెయ్యండి, ”
ఆవేశంతో చెప్పాడు సౌజన్య తండ్రి కృష్ణమూర్తి.
నోటమాటరానిదానిలా కళ్లప్పగించి చోద్యం చూస్తున్నట్టుగా నిలబడింది. అంతా అయోమయంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిది నిజమనుకోవాలో తెలియని సందిగ్ధం
ఉండిపోయింది.
"ఏ ఏం.. మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరు? నామీద లేనిపోని నిందలు వేస్తున్నారు.. సౌజన్య వీళ్ళెవరో మన పెళ్ళి ఆపడానికి వచ్చారు. వీళ్ళ మాటలు నమ్మకు, సర్ .. మీరు త్వరగా మా పెళ్ళి కానివ్వండి. సంతకాలు ఎక్కడ పెట్టాలో
చెప్పండి. సర్.. సౌజన్య నేను మనస్పూర్తిగా ప్రేమించుకున్నాము. వీళ్ళ వాళ్ళు మా పెళ్లికి అడ్డు పడుతున్నారని మేమే రిజిష్టరు పెళ్ళి చేసుకుందా మనుకున్నాము, ఇక్కడికి కూడా వచ్చి మమ్మల్ని పెళ్ళి చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. తొందరగా కానివ్వండి సర్.. సాక్షి సంతకాలు మా స్నేహితులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, " ఆయాసంతో రొప్పుతూ గబగబా చెప్పాడు రఘు.
"చూడు బాబు .. ఆ అమ్మాయికి నీకు ఇష్టమున్నంత మాత్రమున సరిపోదు కదా! వాళ్ళ అమ్మానాన్నలతో ఇబ్బందిగా ఉందని ముందస్తుగా పోలీసు కంప్లయింటు తెచ్చుకోవలసింది. తగుదునమ్మా అంటూ వాళ్ళు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. ఇప్పుడు మేమేం చెయ్యలేము. మీరు మీరు చూసుకోండి, " అంటూ చేతులెత్తేసాడు రిజిష్టరు ఆఫీసరు.
సింహం నోటిలో చిక్కిన లేడిపిల్లలా అల్లాడిపోయాడు రఘు. చేసిన పాపం ఊరికే పోదన్నట్టు చేతులకు బేడీలు తగిలించారు ఫోలీసులు.
"నాన్న .. రఘు.. రఘు చాలా మంచివాడు ఇదంతా.." సౌజన్య మాటలకు అడ్డు వస్తూ.
"చత్.. నీకింకా అర్ధం కాలేదా ఆ మోసగాడి గురించి.. కట్టుకున్న భార్యను నేనే చెబుతున్నాను కదా! అయినా నీకిదేం బుద్ది చక్కగా తల్లి తండ్రులు చూసిన సంబంధం చేసుకోక, ఇలాంటి మాయగాళ్ళ మాటలు నమ్మి నూరేళ్ళ జీవితం నాశనం చేసుకుంటావా..
మీ నాన్న తెలివి మంతుడు గనుక నీ వెనక ఉండి నిన్ను కాపాడుకున్నాడు. లేకపొయ్యుంటేనా ఈపాటికి నా బ్రతుకులాగా నడి వీధిన పడేదానివి. వెళ్ళు వెళ్ళు చక్కగా
పెద్దవాళ్లు కుదిర్చిన పెళ్ళి చేసుకుని పిల్లపాపలతో హాయిగా ఉండు, " అంటూ రెండుచేతులలో ముఖం దాచుకుని చిన్న పిల్లలా రోదిస్తూ బయటకు వెళ్ళిపోయింది.
"అమ్మా సరితా.. నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను, సమయానికి మీ బావ విషయం చెప్పి మా సౌజన్య జీవితం కాపాడావు, మా వల్ల మీ అక్క ఒంటరిదయిపోయిందని బాధపడకు. నాకున్నది ఒక్కతే కూతురు. ఇక నుండి మీ అక్కను కూడా నా రెండో కూతురులాగా చూసుకుంటాను, " అన్నాడు సరిత రెండు చేతులుపట్టుకుని.
"బాబాయి .. మీ పెద్ద మనసుకు నేనే చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా అక్క జీవితం పాడైపోయిందన్న బాధలేదు నాకు. ఎందుకంటే ఆ పరమ నీచుడు పెట్టే బాధలన్ని తీరిపోయాయి. అంతేకాదు. నా ప్రాణ స్నేహితురాలి జీవితం బలికానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, " సౌజన్యను దగ్గరగా తీసుకుంటూ చెప్పింది సరిత.
"నాన్నా.. సరితా .. మీరు మీరు నా కోసం ఇంత కష్టపడ్డారా? ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను.. సమయానికి మీరు రాకపొయింటే గనుక నా పరిస్థితి ఏమయ్యేది..
నాన్న నన్ను క్షమించండి.. రఘు మాటలకు లోబడి మిమ్మల్ని అమ్మను చాలా బాధపెట్టాను. మీ మాటకు విలువివ్వకుండా ఆస్తికోసం నన్ను ఇంతగా మాయమాటలతో నన్ను మోసం చేస్తున్నాడని అనుకోలేకపోయాను, అమ్మా .. నన్ను క్షమించమ్మా! నాన్న .. నన్ను క్షమించవూ”, అంటూ కన్నీటితో తల్లి తండ్రుల కాళ్ళు పట్టుకుంది.
"ఛ ఛ ఇదేంటమ్మా.. నువ్వు పెళ్ళి వద్దంటున్నావంటేనే నాకనుమానం వచ్చింది, ఇదిగో నీ ప్రాణ స్నేహితురాలిని నిన్నో కంటకనిపెట్టమని చెప్పాను. కోట్లకు వారసురాలివి
నువ్వెందుకు పెళ్లికి వద్దంటున్నావో నాకర్ధం కాలేదు. నువ్వొక అబ్బాయితో తిరుగుతున్నావని అతనొక మేకవన్నె పులి అని సరిత చెప్పింది. అదిగో అప్పటి నుండి సమయం కోసం నేను సరిత వేచి చూస్తున్నాము.
మీ ప్రతి కదలిక సరిత గమనిస్తూ నాకు ఎప్పటికప్పుడు విషయం చేరవేసేది. అందుకే నిన్ను కాపాడుకోగలిగాను. అంతేకాదు, ఆ రఘు స్వయానా తన అక్కను మోసం చేసి పెళ్ళి చేసుకున్న సరిత బావ, " చెప్పాడు సరిత తలమీద చెయ్యవేసి.
“సరితా.. నువ్వే గనుక లేకపోతే ఈ రోజు నీ సౌజన్య ఏమయిపోయేదే, " అంది సరితను గట్టిగా కౌగిలించుకుంటూ.
"సరేసరే.. ఈ ముచ్చట్లతోనేనా పప్పన్నం పెడతావా లేదా ఇప్పటికైనా? ఆకాశమంత పందిరివేసి భూదేవంత అరుగువేసి అంగరంగ వైభవంగా నీ పెళ్ళి చెయ్యాలనే మీ అమ్మానాన్నల ఆశను తీర్చుకోవే, పద పద నిన్ను పెళ్ళి కూతురిలా అలంకరించే బాధ్యత నామీదే పెట్టారు, " నవ్వుతూ అందరిని తొందరచేసింది సరిత. ఆశ్చర్యంతో తల్లితండ్రి వైపు చూసింది సౌజన్య.
"అవునమ్మా సరిత చెప్పింది నిజం. నిన్ను నీ భావాలను ఇష్టపడిన మీ బావ మోహన్ తో నీ పెళ్ళి నిశ్చయం చేసాము. నీ మనసులో ఏం కోరుకునే దానివో అలాంటి వ్యక్తిత్వం కల మనిషితో నీ పెళ్ళి జరుగుతుంది. మా పద్దతి ప్రకారం పెళ్ళి చేసే మీ అమ్మ కోరిక నెరవేరుతుంది. పద తల్లి, " అంటూ సౌజన్య ను దగ్గరకు తీసుకుంటూ సుభద్ర చేతిలో
సౌజన్య చేతిని పెట్టాడు. ఆప్యాయతతో కూతురి తల నిమిరింది సుభద్ర. గువ్వ పిట్టలా తల్లి గుండెలో తల దాచుకుంది సౌజన్య.
========================================================================
సమాప్తం
========================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
댓글