top of page

నిజం నిప్పులాంటిది

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #NijamNippulantidi , #నిజంనిప్పులాంటిది, #TeluguHeartTouchingStories

ree

Nijam Nippulantidi - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 28/07/2025

నిజం నిప్పులాంటిది - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


"అమ్మగారు! వంట అయిపోయింది భోజనం పెట్టనా?" అడిగింది మంగమ్మ.


"ఆ పెట్టేసేయ్ ఇంకొక పది నిమిషాల్లో వచ్చేస్తున్నాను, " అంది వసుంధర టీవీ సీరియల్ చూస్తూ.


మంగమ్మ డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దింది.


వసుంధర వచ్చి కూర్చుంది. 


 టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూర అన్నము పెట్టింది మంగమ్మ.


"చాలా బావుంది వంకాయ కారం పెట్టిన కూర" వసుంధర మెచ్చుకుంది


"ఇంకొంచెం వేసుకోండి అమ్మగారు! చక్కగా తినండి, మళ్లీ బలం ఉండదు, ఇదిగో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను" అంటూ రెండు చెంచాల నెయ్యి వేసింది.


"అయ్యో అలా వేయకు మంగా! అసలే ఇప్పటికే నడవలేక కాళ్ళు నొప్పులు..” 


"లేదమ్మా గారు! నెయ్యి వేసుకుంటే బలము. నెయ్యి,  పెరుగు ఇవన్నీ తింటుండాలి. మీ అమ్మాయి గారు వచ్చినప్పుడు, మీకు సరిగా తిండి పెట్టలేదని నన్ను కేకలేస్తుంది.


మీకు ఫోన్ చేసినప్పుడల్లా నాతో మాట్లాడుతారు, ‘అమ్మగారు సరిగ్గా భోంచేస్తున్నారా లేదా చూసుకోవే మంగీ’ అని నన్ను హెచ్చరించారు"


"సరేలే మా పిల్లకి తోడు, నువ్వు బాగానే దొరికావు, " అంటూ చిరు కోపంతో నవ్వుతూ అంది వసుంధర.


"అయినా ఎంత కంట్రోల్ చేసినా నీ వంట టేస్టీగా ఉంటుంది. తినకుండా ఉండలేము మంగా"


"అమ్మగారు.. ఈ సాంబార్ ఏసుకోండి. ఈవేళ ములక్కాడ సాంబారు" అంటూ సాంబారు వడ్డించింది.

“పెరుగు వేసుకుని బాగా తినాలి” అంటుంది.


వసుంధర కడుపునిండా భోంచేసి 


"నువ్వు కూడా తినేసి వెళ్ళు" అంటూ మళ్ళీ టీవీ ఆన్ చేసి కూర్చుంది.


వంట గిన్నె లన్నీ వంటిట్లోకి పట్టుకుపోయి వంటింట్లో కింద కూర్చుని కడుపునిండా అన్నం తింది మంగమ్మ.


వంటిల్లు అంతా నీటుగా సర్దేసింది. సామానంతా తోమేసుకుంది. వెనక తలుపులన్నీ వేసుకుని 

“అమ్మగారు, ఇంక వెళ్లి వస్తాను” అంటూ వసుంధరకి చెప్పింది.


"వెళ్లిరా! కాస్త తొందరగా వచ్చేయ్. ఒంటరిగా కూర్చోలేక పోతున్నాను. నువ్వు వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు చెప్తే నాకు కాలక్షేపమవుతుంది" అంది వసుంధర.


"తప్పకుండా అమ్మగారు. తొందరగా వచ్చేస్తాను ఐదింటికి" అంటూ మంగమ్మ వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ గేటు దగ్గర ఉన్న తోటమాలితో “వెళ్ళొస్తాను. అమ్మగారిని చూసుకుంటూ ఉండు” అంటూ వెళ్లిపోయింది.


వసుంధర ఆ కాలనీలో చక్కగ చిన్న ఇల్లు కట్టుకొని, భర్త రామారావుతో ఉండేది.


 ఇద్దరూ బ్యాంకులో పని చేసేవారు. రిటైర్ అయ్యి పది సంవత్సరాలు అయింది.


ఈమధ్య భర్త రామారావు ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యంతో కన్నుమూశాడు.


ఆ ఇంట్లో వసుంధర ఒకతే ఉంటుంది.


 కూతురు సునీత అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె, భర్త ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉంటారు.


అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులతో గడిపి వెళుతూ ఉంటారు.


సునీత, తల్లి వసుంధరని అమెరికాలోనే ఉండమంటుంది. కానీ ఆమెకి తోచక “అక్కడ ఎవరూ బంధుజనులు స్నేహితులు ఉండరే. ఉండలేను. ఓపిక ఉన్నంతకాలం ఇండియాలో ఉండనీ" అంటూ వచ్చేస్తుంది.


క్రిందటి సంవత్సరం భర్త పోయిన తర్వాత నాలుగు నెలలు అమెరికాలో ఉండింది. మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసింది.

ఇరుగు పొరుగు స్నేహంగా ఉంటారు. పిలిస్తే పలుకుతారు, సహాయం చేస్తారు.


వసుంధర కి ఓపిక లేక మంగమ్మ ని వంట మనిషిగా పెట్టుకుంది. రెండు పూటలా వచ్చి కావలసిన వన్ని వండి వెళ్ళిపోతూ ఉంటుంది.


అదిగాక వసుంధరని తల్లిలా చూసుకుంటుంది.

సాధారణంగా పుస్తకాలు చదువుకుంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది.


మంగమ్మ వెళ్ళిన తరువాత వసుంధర టీవీలో న్యూస్ చూస్తోంది సీరియస్ గా.


 ఇంతలో బయట పని చేసుకుంటున్న తోటమాలి రామయ్య వచ్చాడు.


"అమ్మగారు!" అంటూ నసుకుతున్నాడు.


" ఏమిటి చెప్పు?" అంది వసుంధర.

 

"మరీ, ఏం లేదండి అమ్మగారు" అన్నాడు.


"చెప్పరా పర్వాలేదు భయం లేదు"


"ఏం లేదండి. మన వంట అమ్మగారు, మంగమ్మ గారు ఈ మధ్య ప్రతిరోజు కొంగులో ఏదో ప్యాకెట్టు పట్టుకు పోతున్నారమ్మ"


"ఏమిటది మరి చూసావా"


"లేదండి అది కొంగులో మూట కట్టుకొని పట్టుకు పోతుం టాది"


"సరేలే నేను చూస్తాను, నువ్వు వెళ్ళు” అంది వసుంధర.


ఇంక అక్కడ నుంచి ఆమెకు అనుమానం పట్టుకుంది. 

ఈ వంటలక్క ఇంట్లో నుంచి ఏమి పట్టుకుపోతోంది రోజు.. సామాను పట్టుకు పోతుందా? వంట సామాను పట్టుకు పోతుందేమో? అని డౌట్ వచ్చింది. 


'మంచిమనిషే. అలా చేయదు కదా.. ఏమైనా కావలిస్తే అడుగుతుంది. అయినా భార్యాభర్త ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఖర్చు ఏమీ ఉండదు. మొగుడికి కాస్త పెన్షన్ వస్తుంది.

ఈమె రెండు ఇళ్లల్లో పని చేసుకుంటుంది. ఇంకా చేసుకొని డబ్బు గడించొచ్చు. తానే చెప్తుంది నాకు అంత అవసరం లేదమ్మా అని.


ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ దొంగతనం అనేది చేయలేదు. చిన్న వస్తువు కూడా పోలేదు.


ఇంటి తాళాలు ఇచ్చి కూడా తాను అమెరికా వెళ్లి వస్తుంది.

మంచిమనిషి అయినా గమనించాలి కదా’ మనసు పరిపరి విధాల పోయింది వసుంధరకు.

 

మర్నాటి నుంచి ఆమె వెళుతుండగా గమనిస్తోంది.నాలుగైదు రోజులు అయ్యేసరికి ఆమె గుణం బయటపడింది. నిజమే తోటమాలి చెప్పినట్లు కొంగులో ఏదో మూట కట్టుకొని వెళ్తోంది.


అంటే, దొంగతనంగా సామాను పట్టుక పోతోందన్నమాట. వసుంధరకు మనసులో ఎంతో బాధేసుకుంది. 'తాను ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ కావాల్సినవన్నీ ఇస్తుంటే ఆమె ఈ దొంగతనం చేయడం కర్మమేమిటి, ఎవర్ని నమ్మరాదు ' అంటూ బాధపడింది.


ఇలాంటి వాళ్ళని ఇంక పెట్టుకోకూడదు అని మనసులో నిర్ణయించుకుంది.


మర్నాడు మంగమ్మ వంట చేసి వెళ్లిపోతోంది "అమ్మగారు వెళ్ళొస్తానని" చెప్పింది.

 

"ఆగక్కడ!" అని అరిచింది ఒక్కసారి వసుంధర.


"ఏమిటి కొంగులో తీసుకెళ్తున్నావ్?"


వెంటనే మంగమ్మ భయపడిపోయింది. 


"చూపించు!” అంది వసుంధర.


కొంగులో ప్లాస్టిక్ కవర్లలో కొంచెం అన్నము, కూర, సాంబారు కట్టేసి ఉన్నాయి.


"ఇదిగో మంగమ్మ! ఇలా దొంగతనాలు నాకు ఇష్టం ఉండవు. రేపటి నుంచి మా ఇంటికి పనిలోకి రాకు. ఇదిగో నీ డబ్బు” అంటూ ఆమెకు నెలకి ఇచ్చే 5, 000 రూపాయలు ఇచ్చేసింది.


 "అది కాదమ్మగారు. అసలు సంగతి..” అంటూ ఏదో చెప్పబోయింది


" నువ్వు నాకేమీ చెప్పకు వెళ్ళిపో" అంటూ కోపంగా అరిచేసి తలుపు వేసేసింది.


మంగమ్మ చేసేదేమీ లేక వెళ్లిపోయింది.


వసుంధర పక్క వీధిలో తన చెల్లెలు ఇంటిలోనున్న వంట మనిషిని పిలిచి వంట చేయించుకోవడం మొదలుపెట్టింది.


ఈమె పేరు రంగమ్మ.

మంగమ్మ లాగే చక్కగా రుచికరమైన పదార్థాలు చేస్తుంది.

ఒక వారం రోజులు తర్వాత రంగమ్మ, 

వంట చేసి వెళ్ళిపోతూ, "అమ్మగారు ఓ విషయం అడగనా?” అని అంది


"ఏమిటి అడుగు అంది" వసుంధర. 


"ఏం లేదమ్మా గారు. మీరు గంగమ్మ ని ఎందుకు తీసేసారు?"

అని అడిగింది.


"అది దొంగతనం చేస్తుంది. అందుకే తీసేసాను"


"మీరు చూశారా అమ్మగారు?" అని అడిగింది రంగమ్మ.


 "అవును నేను చూశాను! నా కళ్ళతో నేను చూశాను!" అంది వసుంధర.


"కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు అమ్మగారు! కళ్ళు కూడా అబద్ధాలు చెబుతాయి.కొన్నిసార్లు, నిప్పులాంటి నిజాలు కొన్ని ఉంటాయి"


"కళ్ళతో చూసింది అబద్ధం ఎలా అవుతుంది?"


"అమ్మగారు, ఓ విషయం చెప్పమన్నారా? మంగమ్మ చాలా మంచి ఆవిడ, మీరు ఆమెని పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మంగమ్మ నాతో అన్ని విషయాలు చెప్పింది.

ఆమె నేను ఒక దగ్గరే ఉంటాము. ఆమె మీ ఇంట్లో దొంగతనం చేయలేదు.

 

ఈమధ్య ఆ వీధి చివర ఒక ముసలి దంపతులు, కళ్ళు కనిపించవు పాపం వారికి. ఆ చెట్టు కింద తలదాచు కుంటున్నారు, మంగమ్మ జాలిపడి తాను మీ ఇంటిలో తినక, 

అన్నము పప్పు కూరలు అన్నీ తీసుకువెళ్లి ఆ ముసలి దంపతులకు రోజు ఇస్తోంది. ఆనాథలపై జాలిపడి కరుణతో వారి కడుపు నింపుతోంది. మీకు చెబితే మీరు వద్దంటారని ఆమె భయపడింది. వాళ్లకి ఎవరు దిక్కులేదు. మంగమ్మ ఆ అనాధలకు కడుపునిండా తిండి పెడుతోంది. నాతో చెప్పింది.


‘నేను ఇంటికి పోయి తింటానే. అమ్మగారు పెట్టే ముద్ద వాళ్ళకి పెడుతున్నాను, కాస్త పుణ్యం కదా! అటువంటి వారిని ఆదుకోవడము’ అని ఎంతో జాలిగా చెప్పింది.


ఇదీ అసలు విషయం అమ్మగారు!


మీరు ఆమె దొంగతనం చేస్తుందని, నేను చూశాను.. అంటూ చెప్పి ఆమెను పనిలోంచి తీసేసారు. ఈ విషయాలన్నీ చెప్పి మంగమ్మ నాతో ఎంతో బాధపడింది.

'ఇన్నాళ్ళ నుంచి విశ్వాసముగా చేస్తే నామీద అమ్మగారికి నమ్మకము కలగలేదే రంగమ్మా!’ అంటూ బాధపడింది.

 

అమ్మగారు! కళ్ళు చూసేవన్ని నిజాలు కావు. ఒక్కొక్కసారి కళ్ళు కూడా అబద్ధం చెప్తాయి”


 అంతా విన్న వసుంధరకు మనసు ఎంతో బాధనిపించింది.


"అదా సంగతి! అయ్యో నాకు చెప్పనే లేదే! ఈ విషయాలన్నీ"


"లేదమ్మా గారు, మీకు చెబుదామని ప్రయత్నస్తే మీరు కోపంలో ఉండి ఏమీ వినిపించుకోలేదు. ఆమె చాలా మంచి మనిషి, విశ్వాసపాత్రురాలు. దొంగతనము చేయవలసిన అవసరం కూడా ఆమెకు లేదు. 


వాళ్ళ ఆయనకి దొరికే పెన్షన్ డబ్బులతో వాళ్ళిద్దరి పొట్ట గడుస్తుంది, కానీ ఆమెకు ఏదో పని చేయడం అలవాటు కాబట్టి ఈ వంట పనులు చేయడం అలవాటు కాబట్టి రెండు మూడు ఇళ్లల్లో వంట చేసుకుని వెళుతుంది నాలుగు డబ్బులు వస్తాయని "


"పోనీలే ఇప్పటికైనా నువ్వు నా కళ్ళు తెరిపించావు నిజం చెప్పి. చాలా పొరపాటయింది, రేపటి నుంచి ఆమెను పనిలోకి రమ్మని చెప్పు"

"అలాగే అమ్మగారు! చాలా సంతోషము. రేపటి నుంచి మంగమ్మ ని మీ దగ్గరికి పంపిస్తాను" అంటూ ఆనందంగా వెళ్ళిపోయింది రంగమ్మ.


మంగమ్మ మీద ఉండే మనసులోని అనుమానపు పొరలు విడిపోయి, మనసంతా సంతోషంగా అయింది వసుంధరకి.


'వచ్చే నెల నుంచి ఆమెకు జీతం కూడా పెంచాలి. ఇంత మానవత్వం ఉన్న మనుషులు సమాజంలో అరుదుగా కనిపిస్తారు'


ఇప్పుడు మంగమ్మ అంటే వసుంధరకి ఎనలేని గౌరవం కలిగింది. 


'నిజం నిప్పులాంటిది, కళ్ళు కూడా గ్రహించలేవు, అయినా ఎప్పటికైనా బయట పడుతుంది. పోనీలే, అంతా మన మంచికే' అనుకుంది మనసులో వసుంధర.

***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page