top of page

నిజమైన దెయ్యాలు



'Nijamaina Dayyalu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 27/04/2024

'నిజమైన దెయ్యాలు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రామయ్య స్మశానంలో కాటికాపరి. అక్కడే ఒక పాక వేసుకుని ఒక్కడే ఉంటున్నాడు. ఒకప్పుడు బాగా బతికినా.. ఇప్పుడు ఇక్కడ ఇలా బతికేస్తున్నాడు. భార్య చనిపోయిన తరువాత.. ఇక్కడికి వచ్చి ఇలా కాటికాపరిగా ఉంటున్నాడు రామయ్య. 


'ఇంత పొద్దుపోయాక ఎవరబ్బా.. ? పాపం ఎవరో పెద్దాయన కాలం చేసినట్టున్నాడు.. ' అని మనసులో అనుకున్నాడు రామయ్య.


వాళ్ళు దగ్గరగా వస్తున్న కొద్దీ.. వారి మాటలు స్పష్టంగా వినిపించసాగాయి. ఒక పెద్దాయన్ని మోసుకుని మంది వస్తున్నారు. పక్కనే ఒక అబ్బాయి, అమ్మాయి గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. దగ్గరగా వచ్చిన తర్వాత, వాళ్ళు దేనికోసమో గొడవ పడుతున్నట్లుగా తోచింది రామయ్యకు. 


"నువ్వు ఆస్తి కోసమే, ఇక్కడ దాక వచ్చేసావు.. ఆడవారు స్మశానానికి రాకూడదని నీకు తెలియదా.. ?" అని వినిపించింది అబ్బాయి గొంతు.

 

"నువ్వు మాత్రం, నాన్న బతికున్నప్పుడు ఎప్పుడు రమ్మన్నా రాలేదు.. ఇప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ రాలేదూ మరి.. " అని అమ్మాయి గొంతు. 

"నువ్వు మాత్రం వీలున్నప్పుడల్లా పుట్టింటికి వచ్చేసి.. నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి, ఇల్లు రాయించుకోలేదా.. ?"


"నువ్వు చెయ్యలేని సేవ నేను చేసాను.. అందుకే నాన్న నాకు ఇల్లు రాసారేమో.. " అంది అమ్మాయి.

 

"ఇల్లు తో ఆగు ఇంక.. మిగతా ఆస్థి మీద నీకు హక్కులేదు. కొడుకుగా అన్నీ నాకే వస్తాయి. మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదా.. ఇంకా కక్కుర్తి ఎందుకే.. ?"


"ఏదిఏమైనా.. ఆస్తి వదులుకోను.. నా వాటా నేను తీసుకునే తీరుతాను.. " అంది అమ్మాయి. 


ఆ గొడవను బట్టి.. ఆ ఇద్దరూ ఆ పెద్దాయన కొడుకు, కూతురని అర్ధమైంది రామయ్యకు. 'పోయిన తర్వాత కుడా సుఖంలేదు ఆ పెద్దాయనకు. ఏం చేస్తాం.. కలికాలం.. ' అని అనుకున్నాడు రామయ్య. 


"బాగా పొద్దు పోయింది.. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి.. " అన్నాడు రామయ్య.. 


రామయ్య మాటలకు మర్యాద ఇచ్చి.. కార్యక్రమం కానిచ్చి.. అంతా అక్కడ నుండి వెళ్ళిపోయారు.. 


ఆ రోజు రాత్రి.. 


"ఓ పెద్దాయనా.. ! ఏమిటి ఆలోచిస్తున్నావు.. ?" అని స్మశానంలోంచి ఒక గొంతు వినిపించింది.

 

"ఏం చెయ్యమంటావు.. ? ఇంతకీ నువ్వు ఎవరు.. ?"


"నీకన్నా ముందు నుంచి ఇక్కడే ఉంటున్నాను.. "

 అని బయటకు వచ్చింది ఓ ఆకారం.

 

"అంటే, నువ్వూ నాలాగే చనిపోయావా.. ?"


"ఎందుకంత సందేహం.. అవును.. ఇప్పుడు ఇలా దెయ్యం అయి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు కుడా నాలాగే దెయ్యం.. తెలుసా.. ? ఇప్పుడు కుడా ఇంకా ఎందుకంత ఆలోచన. చనిపోయిన తర్వాత, మనకి ఈ లోకంతో సంబంధం ఉండదు.. మన లోకం వేరు పెద్దాయన.. "


"నీకేం తెలుసు నా బాధ.. " అన్నాడు పెద్దాయన.


"చెబితేనే తెలుస్తుంది కదా.. !.. చెప్పరాదు మరి.. "


నా కొడుకు చాలా మంచివాడు. తల్లి లేని వాడికి, అన్నీ నేనే అయి బాగా చదివించాను. ఒక పెద్ద కంపెనీ లో, నాకున్న పెద్ద పరిచయాల ద్వారా వాడికి ఉద్యోగం కుడా వేయించాను. ఉద్యోగం చేసుకుంటూ.. హ్యాపీగా ఉన్నాడు. నన్ను బాగా చూసుకునేవాడు. నేను నా ఉద్యోగం మొదలు పెట్టిననాటినుంచి పొదుపు చెయ్యడం బాగా అలవాటు. సంపాదించిన దానిలో చాలా వరకూ పొదుపు చేసేవాడిని. అలాగ ఒక స్థలం కొని, ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కుడా కట్టాను. నేను చేసిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ నాకు బాగా ఆస్థిని తెచ్చి పెట్టాయి. మరిన్ని ఆస్తులు కొన్నాను. ఉద్యోగం చేస్తున్న మా అబ్బాయిని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. 


ఇలా ఉంటుండగా, వాడికి అమెరికా లో జాబ్ ఆఫర్ వచ్చింది. ఇక్కడ ఉద్యోగం మానేసి, అక్కడకి వెళ్ళిపోతానని నాతో అన్నాడు. మొదట కొడుకుని అంత దూరం పంపించడం ఇష్టం లేకపోయినా.. వాడి భవిష్యత్తు బాగుంటుందని.. సరే అన్నాను. పెళ్ళి చేసి పంపిస్తే, అక్కడ వాడికి ఒక తోడుంటుందని, వాడు ఇష్టపడిన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి కుడా చేసాను. 


పెళ్లి అయి, అమెరికా వెళ్ళిన అబ్బాయికి, పెళ్ళాం బెల్లం అయ్యింది. కోడలికి దుబార ఖర్చు చాలా ఎక్కువని నేను ముందే గ్రహించాను. తాను ఎంత సంపాదించినా, పెళ్ళాం చాలదని అనేదని.. మా అబ్బాయి చేప్పేవాడు. అప్పుడప్పుడు నాకున్న అవకాశం మేర వాడికి డబ్బు సాయం చేసేవాడిని. వాడు చేస్తున్న ఉద్యోగానికీ, వాళ్ళు పెట్టే ఖర్చులకే పొంతన లేకుండా పోయింది.. ఏం చేస్తాం.. ? అప్పుడే కోడలికి మా ఆస్థి పైన కన్ను పడింది. మా అబ్బాయి మనసు పాడుచేసి, మెల్లగా నాతో ఆస్థి కోసం గొడవ పడేటట్టు చేసింది. ఇదంతా నాకసలు నచ్చేదికాదు. మౌనం వహించాను. 


ఇక, నా కూతురు గురించి.. ఉన్నంతలో బాగానే చదివించాను. మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేసాను. అల్లుడు చాలా మంచివాడు. అమ్మాయిని బాగా చూసుకునేవాడు. కానీ, నా కూతురికి నాతో ఆస్తుల కోసం చేస్తున్న మా అబ్బాయి ప్రయత్నాలు తెలిసి.. అమ్మాయి కుడా ఆస్తి కోసం పేచీ మొదలుపెట్టింది. 


"మాదేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలా.. ? మామూలు బ్యాంకు ఎంప్లాయ్ కి ఇచ్చి నా గొంతు కోసారు. అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు.. నాకూ ఆస్థి లో వాటా కావాలి" అని అడగడం మొదలుపెట్టింది. చిన్నపిల్ల అని వూరుకున్నాను. 


నేను చేసిన తప్పేమిటంటే, వీలునామా రాయకపోవడమే. నా ఆఖరి రోజుల్లో నా కొడుకు దగ్గర లేడు. నాకు తోడుగా, కూతురే దగ్గరుండి నా బాగోగులు చూసింది. ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం.. ? కొడుకు దగ్గర లేడు. ఆఖరి రోజుల్లో మా అమ్మాయి చూపిన ప్రేమకు, చేసిన సేవకు మెచ్చి, ఉంటున్న ఇల్లు దాని పేరు మీద రాసేసాను. అమ్మాయి కొంత సంతోషించింది. ఇది జరిగిన కొన్ని రోజులకి, నేను కన్ను మూసాను. ఆ తర్వాత జరిగినదంతా అందరికీ తెలుసు. 


"ఒక మాట చెప్పనా పెద్దాయనా.. ! చనిపోయిన తరువాత మన లోకం వేరు. మనం ఇంకా ఇక్కడ ఉన్న బంధాల గురించి ఆలోచించకూడదు. పోనీ, ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వాళ్ళు పరాయి వారు కాదు.. నీ సొంత బిడ్డలే.. ! వారి గోల ఏదో వారు పడతారు. మనం ప్రాణం లేని దెయ్యాలమైతే.. ఆస్తి కోసం పీక్కుతినే అలాంటివారు ప్రాణం ఉన్న నిజమైన దెయ్యాలు అంతే.. ! ఆ కాటికాపరి కథా అంతే.. పెళ్ళాం చనిపోయిన తరువాత, ఆస్థి మొత్తం కొడుకులు లాగేసుకుని.. ఇంటినుండి తరిమేసారు. అందరి కథ ఇంతే.. !"


"నిజమే.. " అన్నాడు పెద్దాయన. 


"నీకు తెలియని ఒక విషయం చెప్పనా.. ! నీ మరణం ఆయుష్షు తీరి రాలేదు.. నీ శరీరంలోకి విషం ఎక్కించడం చేత వచ్చింది. ఇకనైనా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు పెద్దాయనా.. !"


"నాకు ప్రశాంతత ఎప్పుడో పోయింది.. ఎవరిచ్చారు విషం.. ?" 


"విషయం చెప్పకపోతే, నువ్వు అదే ఆలోచిస్తూ ఉంటావేమో.. నీకు విషమిచ్చింది నీ సొంత కూతురే.. తెలుసా.. ?" 


"నా కూతురు అలా ఎందుకు చేస్తుంది.. నేనంటే దానికి చాలా ప్రేమ.. "


"కొడుకు గురించి నీ కలవరింతలు చూసి, ఆస్థిని ఎక్కడ నీ కొడుక్కి రాసేస్తావోనని అనుమానించి ఇదంతా చేసింది.. " అని ఉన్న విషయం చెప్పింది ఆ దెయ్యం 


*************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


65 views0 comments
bottom of page