top of page

నిర్ణయం

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Nirnayam, #నిర్ణయం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Nirnayam - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 12/06/2025

నిర్ణయం - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


కాలింగ్ బెల్ మోగగానే  'ఎవరు వచ్చి ఉంటారు?' అనుకుని శారద తలుపు తీసింది. 

ఎదురుగా కూతురు తుషార!


'లోపలికి రావచ్చా?' అడిగింది తుషార. 


'అదేమిటే పరాయి వాళ్ళ ల్లా అలా అడుగుతున్నావు? 

రా' అని పిలిచి కూతుర్ని కౌగలించుకుంది. 

'ఇలా చిక్కి పోయావేమిటి? నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ ఇస్తా' అని వంటింట్లోకి వెళ్లింది శారద. 


'నాన్న గారు లేరా?' 


'ఆయన ఫ్రెండ్ కి యాక్సిడెంటయ్యిందని హాస్పిటల్ కి వెళ్ళారు. ఒ అర గంట లో వస్తారు'


తల్లి, కూతురు ఇద్దరూ సోఫా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 


'మా అల్లుడు ఏలా ఉన్నారు? ఇద్దరూ వస్తే బాగుండేది' 


' ఆయన బిజీ! ఈ సారి వస్తారు లే. నాన్న అనుమతి ఇస్తే '

అనుమతి అన్నప్పుడు తుషార గొంతు ఒణకడం శారద గమనించింది. 


 ********

'నీకు తెలిసిన అమ్మాయి ఎవరో వచ్చినట్టున్నారు?' అడిగాడు శారద భర్త ఫణి ప్రసాద్. 


'అదేమిటండీ అలా అంటారు. మన అమ్మాయి తుషారని 

పట్టుకుని'


'ఆగస్టు 12 నుండి ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు'


శారద కి ఆ రోజు గుర్తు కు వచ్చింది. తండ్రి తెచ్చిన సంబంధం కాదని తుషార పీటర్ ని పెళ్ళి చేసుకున్న రోజు! 

'నన్ను క్షమించండి నాన్న' అంది తుషార తండ్రి కాళ్ళ మీద పడి. 


'జరగాల్సినది జరిగింది. నువ్వు నీ భర్త తో సుఖం గా ఉన్నావు కదా '


'సుఖం కల గానే మిగిలింది ' అని మనస్సు లో బాధ గా 

అనుకుంది తుషార.

 *********

చాలా రోజుల తర్వాత తల్లి తండ్రుల తో భోజనం చేసింది

తుషార. 


'నీకిష్టమైన పాలక్ పప్పు చేసాను. కొంచెం వేసుకో'


' చాలమ్మా' అంది తుషార ఉక్కిరిబిక్కిరి అవుతూ. 



 కూతుర్ని చూసి ఫణి కి కోపం, ప్రేమ ఒకే సారీ 

కలిగాయి. 

 ******

'తుషార వెడతానంటోంది' అంది శారద. 


'వెళ్ళమను క్యాబ్ బుక్ చెయ్యనా?'


'అది కాదు! పీటర్ కీ ప్రస్తుతం ఉద్యోగం లేదు. ఫ్రెండ్స్ తో

 కలిసి స్టార్టప్ పెడతాడట. మీరు ఆర్ధిక సహాయం చేస్తే.. ' 

 నసిగింది శారద. 


'పిల్ల కి తల్లి రికమండేషన్. ఇక్కడ డబ్బులు రాసులు పోసుకుని కూర్చోలేదు. ఏదో మధ్య తరగతి మనిషిని'


'మనం కట్నం గా కూడా ఏమి ఇవ్వలేదు. కట్నం అనుకుని

 మీరు పది లక్షలు సాయం చేస్తే ' శారద నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. 


'కట్నాలు కానుకలు అవీ తల్లి తండ్రులు చూసిన సంబంధం పెళ్ళి చేసుకున్న వారికి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వాళ్ళ కి కాదు. నా దగ్గర ఉన్న డబ్బు నా ఫ్రెండ్ కి ఇచ్చాను. కావాలంటే ఓ యాభై వేలున్నాయి పట్టుకు వెళ్ళమను’

 

'అవసరం లేదు' విసురుగా వెళ్లి పోయింది తుషార. 


 *********

సమయం రాత్రి పది గంటలు. 


'తుషార చెప్పడం లేదు కాని డబ్బు ఇబ్బందుల్లో ఉందనిపిస్తోంది' అంది శారద మోబైల్ లో అలారం 

సెట్ చేస్తూ. 


ఫణి కిటికి లో నుంచి చంద్రుణ్ణీ చూస్తున్నాడు. కొబ్బరి చెట్టు మీద నుండి వచ్చే గాలి ఆహ్లాదకరం గా ఉంది. 


ఫణి కీ తుషార చిన్నతనం గుర్తుకు వచ్చింది. చిట్టి చిట్టి కాళ్ళ తో తన గుండెల మీద తన్నడం గుర్తుకు వచ్చింది. 

ఇప్పుడు గుండెల మీద తన్ని పీటర్ తో వెళ్ళి పోయింది. 

ఆ బాధ అలాగే సన్నగా ప్రతీ రాత్రి విషాద తంత్రిని వినిపిస్తోంది. 


'నే చెప్పింది విన్నారా? తుషార ఇబ్బందుల్లో ఉంది. దాని

 కళ్ళే చెప్తున్నాయి. ' 


'నా ప్రాధాన్యత లు నాకున్నాయి'. 


'ఏమిటండీ' 


'ఇంటి పెద్దగా నేను చెయ్యాల్సిన పనులున్నాయి. మన అబ్బాయి శశాంక్ కి ఇంటర్మీడియట్ పూర్తయింది. వాడిని మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాలి. దానికి పది లక్షలు దాకా ఖర్చవుతుంది. 

తరువాత నీ కిడ్నీ ఆపరేషన్ కి 5 లక్షలు దాకా అవసరం

పడుతుంది. 

ఇన్సూరెన్స్ కవరేజ్ లక్ష వరకే ఉంది. 

ఇప్పుడు చెప్పు ఇవన్నీ మానేసి తుషార కి పది లక్షలు ఇవ్వడం సబుబా? '


శారద ఫణిని అపార్ధం చేసుకున్నందుకు బాధ పడింది. 

'పోని నా నెక్లెస్ అమ్మి ఇవ్వనా?'


'ఆ మాట అనకు శారదా! అందులో మొత్తం బంగారం కాదు. నా ప్రేమ ఉంది. నీ కోసం ఓవర్ టైమ్ చేసి నెక్లెస్ చేయించాను. అది నా ప్రేమ చిహ్నం. 


పిల్లలు ఇబ్బందులు పడతారని ఎన్ని త్యాగాలు చేస్తాం? 

ఇంత చేసినా చివరి రోజుల్లో చూస్తారని భరోసా లేదు.

కొంచెం ఇప్పుడు ఇబ్బంది పడినా భవిష్యత్ లో తుషార 

సుఖపడుతుంది. మరీ ఇబ్బందయితే అప్పుడు చూస్తానులే. ఇక్కడ జీవితం లో ఇన్ స్టెంట్ సోల్యుషన్ ఉండదు. ' 


భర్త మాటలకి తృప్తి చెందిన శారద ఫణి ఎద మీద వాలింది. 

 ********

రెండు నెలల తర్వాత తుషార కి ఐదు లక్షల డబ్బు అందింది. ఆ డబ్బు ఫణి అమలాపురం సమీపం లో 

ఉన్న రెండు సెంట్ల స్థలం అమ్మితే వచ్చిందని తుషార 

కి తెలియదు. అమ్మ బంగారం అమ్మి ఇచ్చిందని భావిస్తోంది. 


నాన్న గొడుగు లాంటి వాడు. అవసరమయినపుడే విచ్చుకుంటుంది. 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






1 comentario


మనసు గతి ఇంతే! నాన్న గురించి వ్రాసిన ఆఖరి వాక్యం మణిపూస.. రచయిత కి అభినందనలు

Me gusta
bottom of page