పాపే నా ప్రాణం
- Karanam Lakshmi Sailaja
- Jun 10
- 8 min read
#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #PapeNaPranam, #పాపేనాప్రాణం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Pape Na Pranam - New Telugu Story Written By K. Lakshmi Sailaja
Published In manatelugukathalu.com On 10/06/2025
పాపే నా ప్రాణం - తెలుగు కథ
రచన: కే. లక్ష్మీ శైలజ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి యుండునూ.. ఆ పురిటి కందు మనసులో దైవముండునూ..”
***
పక్షుల కిలకిలా రావాల్లాగా చిన్నపిల్లల కిలకిలా నవ్వులు గాల్లో తేలివచ్చి అందరి మనసులకు ఆహ్లాదాన్నిస్తున్నాయి.
కిటికీలో నుంచి బాలసదనం గ్రౌండ్ లో ఆడుకుంటున్న ఆ పిల్లల ఆటలు చూస్తూ “అమ్మా, చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో కదా!” అంది శ్రీరాగ.
“అవును. మొదట పాల బుగ్గలు, పెద్దపెద్ద కళ్ళతో బోసినవ్వులు నవ్వూతూ ఉంటారు. తరువాత అమాయకంగా మనలను చూస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ముచ్చటగా ఉంటారు” అంది వాళ్ళమ్మ శ్రీకళ.
“మరి, అలాంటి చిన్న పిల్లలను ఎందుకమ్మా తల్లితండ్రులు ఇలా వదిలేశారు?” అంది ఆవేదనగా శ్రీరాగ.
“రాగా.. అది వారి పరిస్థితుల ప్రభావం వల్ల అయివుంటుంది. అంతే కానీ వాళ్ళకు పిల్లలంటే ఇష్టం లేక అయివుండదులే” అంది శ్రీకళ.
రాగ ‘ఊ.. ఊ.. ’ అని తల ఆడిస్తూ ఇంకేమీ మాట్లాడకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలు దేరింది. ‘సాయంత్రం వంటల ఏర్పాటు చూడాలి’ అనుకుంటూ.
ప్రభుత్వం వారి అనాధ బాలల సదనంలో శ్రీరాగ సూపరింటెండెంట్ గా పనిచేస్తోంది. అక్కడ పదవతరగతి వరకూ చదువుకునే పిల్లలున్నారు. ప్రభుత్వం వారే వారి భోజనము, వసతి ఖర్చంతా భరించి చదివిస్తారు. శ్రీరాగ రోజూ ఉదయం ప్రార్ధన నుంచీ వారితో కలిసి మెలిసి తిరుగుతూ ఆనందంగా ఉంటుంది. రాత్రి కూడా బాలసదనంలోనే పదహైదు రోజులు తను, పదహైదు రోజులు మాట్రిన్ పడుకుంటారు.
పక్కనే ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో రాగ ఉంటుంది. ఆ రోజు ఉదయం శ్రీరాగను చూడటానికి ఊరినుండి వాళ్ళమ్మ శ్రీకళ వచ్చినందున మధ్యాహ్నం భోజనానికి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కు వచ్చిందామె. రేపు అమ్మ వూరికి వెళ్తుందని మధ్యాహ్నం అమ్మ దగ్గరకు వచ్చింది.
ఆ రోజు పిల్లలందరూ చదువుకొని అన్నం తిని పడుకున్న తరువాత సదనమంతా పర్యవేక్షించి వచ్చింది. సదనం చుట్టూ కాంపౌండ్ వాల్ మూడడుగులేవుంది. ఈ మధ్యే ఆగోడ ఎత్తు పెంచడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎస్టిమేషన్ వేయించారు. ‘అరవై మంది ఆడపిల్లలు. ఎవరికీ ఏమీ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి’ అనుకుంటూ బాలసదనంకు సంబంధించిన రిజిస్టర్స్ కొన్ని వ్రాసుకుంటూ ఉండిపోయింది రాగ.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయాను తీసుకొని ఆటోలో అక్కడికి వెళ్ళింది రాగ.
“ఈ రోజుల పాప ఈ రోజు ఉదయం ఐదు గంటలకు జే. సి. గారి బంగళా ముందు దొరికింది. మీరొచ్చి పాపను తీసుకెళ్ళి రక్షణ కల్పించండి” అని సూపరింటెండెంట్ గారు చెప్పారు.
పాపను చూస్తే చిన్న పాప. “ముందు పాప ఆరోగ్యం ఎలావుందో డాక్టర్ గారితో టెస్ట్ చేయిస్తాము సర్” అంది శ్రీరాగ.
“ఉదయం హాస్పిటల్ కు పంపారు. వారిచ్చిన మందులు వాడుతూ మీరు పాపను జాగ్రత్తగా చూడండి“ అన్నారాయన.
“అలాగే సర్” అన్నాడు రాగ.
పాపను చూసి శ్రీరాగ ‘ అయ్యో ‘ అనుకుంది. డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి, ఆయా సహాయంతో నాలుగు జతల బట్టలు, పాలపొడి పాకెట్ కూడా తెప్పించుకొని బాల సదనానికి తీసుకొని వెళ్ళింది.
“నువ్వు జాలి పడేకొద్దీ నీకే ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి” అంది కొంచెం బాధగా శ్రీకళ.
“అవునమ్మా. ఈ పాపను రెండు రోజుల్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ లో శిశు విహార్ కు తీసుకొని వెళ్తారు. అంతవరకూ జాగ్రత్తగా చూడాలి” అంది పాపను జోకొడ్తూ.
“అయినా జాయింట్ కలెక్టర్ గారి బంగళా ముందు ఒదిలారంటే పాపను ప్రభుత్వం వారు జాగ్రత్తగా చూస్తారనే విషయం తెలిసిన వాళ్ళయి వుండాలి” అంది ఆలోచనగా శ్రీకళ.
“అవునమ్మా. అక్కడ ఆఫీస్ లో కూడా అందరూ అదే అనుకుంటూ ఉన్నారు” అని శ్రీరాగ కూడా ఆలోచనలో పడింది.
***
ధన ధన మని శబ్దం చేస్తూ వెళ్తోంది మద్రాస్ కు వెళ్ళే రైలు. రైల్లో కిటికీ పక్కనే కూర్చున్న కల్యాణి తను అనుకున్న స్టేషన్ లో ట్రెయిన్ ఆగడం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి. తన కలల రూపాన్ని ఇంకొద్దిసేపట్లో తిరిగి చేరుకోబోతున్నందుకు ఆమె ఉద్వేగంగా వుంది.
***
ఉదయం 10 గంటలు దాటింది. మెల్లగా బాలసదనం వెనుక వైపు కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి జారాడతను. కిచెన్ పక్కనుంచి నడిచి, డైనింగ్ రూము దాటాడు. వంట వాళ్ళిద్దరూ బిజీగా వున్నారు. కిటికీ పక్కనుంచి హాల్ లోకి చూశాడు. ఉయ్యాలలో పాప నిద్రపోతోంది. మిగతా పిల్లలు స్కూల్ కు వెళ్ళినందున ఎవరూ లేరక్కడ. ఆయా అటు వైపు చెట్లకు నీళ్ళు పోస్తోంది. శ్రీ రాగ వాళ్ళమ్మ వూరు వెళ్తున్నందున బాలసదనం వాకిట్లో ఆటో ఎక్కిస్తూ మాట్లాడుతోంది.
అతను ఆటో వెళ్ళే వరకూ ఆగాడు. ఆ తరువాత శ్రీ రాగ హాస్టల్ లో తన రూంకు వెళ్ళింది, వాళ్ళమ్మను పంపిన తరువాత తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి. అప్పుడు చిన్నగా పాపను రెండు చేతుల్లోకి తీసుకున్నాడతను. వేడినీళ్ళతో స్నానం తోనూ, డాక్టర్ గారిచ్చిన డ్రాప్స్ వల్లనూ పాప గాఢ నిద్రలో ఉంది. అతను మెయిన్ గేట్ ను నెమ్మదిగా తీశాడు. పాపను తీసుకొని గేట్ దాటాడు. గేట్ తీసిన శబ్దానికి ఆయా “ఎవరూ” అంటూ చేతిలో ఉన్న నీళ్ళ పైప్ ను చెట్ల మొదట్లో వదిలి గేట్ వైపుకు వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ ఎదురుగా వున్న చిన్న సందులోనికి వెళ్ళిపోయాడు. అతను ఎవరైందీ ఆమె కనుక్కోలేక పోతోంది. అందరినీ పిలిచి గట్టిగా అరుస్తోంది.
“అయ్యో. పాపను ఎవరో ఎత్తుకొని పోతున్నారు. రండి. రక్షించండి” అని ఆయా గట్టిగా అరుస్తోంది. ఎవరు తీసుకెళ్తున్నదీ ఆమెకు అర్థం కాలేదు. ఆ సందులో నుంచి రైల్వే స్టేషన్ కు అడ్డదారి ఉంది. ఐదు నిముషాల్లో అతను స్టేషన్ కు వెళ్ళగలడు.
***
కల్యాణి ఫోన్ రింగ్ అయ్యింది.
“అమ్మా, ఒక్కరే వెళ్తున్నారు. ఏమీ ఇబ్బంది లేదు కదా?” ఆదుర్దాగా అడిగింది కస్తూరి.
“లేదు కస్తూరీ. నాకేమీ ఇబ్బంది లేదు. ట్రైన్ నెల్లూరు దాటింది. ఇంక కొద్దిసేపేలే” అది కల్యాణి ధైర్యంగా.
“సరేనమ్మా. మీరందరూ క్షేమంగా కలుసుకున్న తరువాత నాకు ఫోన్ చెయ్యండమ్మా. ఇక్కడ మీరు ఒక్కరే ఒంగోలు లో ఉన్న మీ చెల్లి దగ్గరికి వెళ్తున్నారని మీ అత్త ఇంటి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒంగోలుకు వెళ్ళకుండా కందుకూరు లో దిగి, మళ్ళీ వెనక్కి వెళ్ళే మద్రాస్ ట్రెయిన్ ఎక్కారని వాళ్ళు ఊహించలేదు.
మీరు చెప్పినట్లు మొన్న పాపను తీసుకెళ్ళి నెల్లూరు లో జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా దగ్గర వదిలాము. నిన్న ఉదయం పేపర్లో పాప జాగ్రత్తగా బాలసదనం లో ఉన్నట్లు చదివాము. మీరు జాగ్రత్తమ్మా” అంది కస్తూరి.
“అవును. అవును. నెల్లూరు స్టేషన్ వస్తోంది. నేను మళ్ళీ చేస్తాను” అంటూ గబ గబా ఫోన్ పెట్టేసి మొహానికి చేతిని అడ్డం పెట్టుకొని కిటికీలో కనపడకుండా వెనక్కు కూర్చుంది కల్యాణి.
***
ఆయా అరుపులకు పక్కనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉండే వంట చేసే వాళ్ళిద్దరూ, బాల సదనం లో వంట చేసే వాళ్ళూ బయటకు వచ్చారు. చూట్టూ ఎవరింట్లో కూడా మగ వాళ్ళు లేరు. అందరూ బయటకు వెళ్ళారు. ఉన్నది ఆడవాళ్ళే. ఈ లోపు రాగ కూడా వచ్చింది. ఆమెతో పాటు ఆయా, ఇంకా వంటచేసే ఆడవాళ్ళు కూడా ఆ సందులో కొంత దూరం అతని కోసం పరుగెత్తారు. కానీ అతను కనపడలేదు.
వాళ్ళు వెనక్కు వచ్చి రోడ్ లో వచ్చిన ఒక ఆటో అతన్ని, కరెంట్ రీడింగ్ చూడటానికి వచ్చినతన్ని, వాన్ లో గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడానికి వచ్చినతన్ని, గులాబీ పూలు సైకిల్ లో తెచ్చి అమ్ముతున్నతన్ని అందరినీ బ్రతిమిలాడి విషయం గబ గాబా చెప్పి పాపను తీసుకెళ్ళినతన్ని పట్టుకోమన్నారు. వెంటనే అందరూ ఆ సందులో పరుగెత్తారు.
తను కూడా పరుగెడుతూ రాగ పోలీస్ కు ఫోన్ చేస్తోంది.
ఆడవాళ్ళు వెనుకబడిపోయారు. మగవాళ్ళు కొంచెం స్పీడ్ గానే పరుగెత్తారు. అతను సందులోకి తిరగగానే పాపను తీసుకొని పరుగెత్తాడు. సందు ఆగిపోయి రైల్వే ట్రాక్ కనపడ్తూనే ట్రాక్ పక్కగా ఉన్న రోడ్ మీద పరుగెడుతూ వెనక్కు చూశాడు. ఎవరూ వెనుక రావడం లేదు. అయినా స్పీడ్ గానే పరుగెత్తాడు. దూరంగా ‘వేదాయ పాలెం’ రైల్వే స్టేషన్ కనిపిస్తోంది. ఇంకొక రెండు నిముషాలకు వెనకాల రైలు కూత వినిపించింది. ‘అమ్మయ్య. తను స్టేషన్
చేరుకోగలడు’ అనుకున్నాడు.
***
కల్యాణి వాష్ బేసిన్ దగ్గర నిలబడి కస్తూరికి ఫోన్ చేసింది. చిన్నగా మాట్లాడుతూ “ కస్తూరీ. ట్రెయిన్ నెల్లూరు దాటింది. నువ్వు సహాయం చెయ్యబట్టే ఇదంతా జరిగింది. మగ పిల్లవాడు పుట్టలేదని పాపను మందుపెట్టి చంపేద్దామనుకుంది మా అత్త. కొడుకైనా కూతురైనా నాపిల్లలే కదా! అమ్మాయిని నేను చక్కగా పెంచుకొని వాళ్ళకు చూపిస్తాను. నాలుగు రోజుల క్రితం వాళ్ళ మాటలు నేను విన్నాను కాబట్టి నాపాపను నేను కాపాడుకుంటూ వున్నాను. రెండు నెలల క్రితం నా భర్త బోర్డర్ లో ఎదురుకాల్పుల్లో చనిపోబట్టి మా అత్త, మా మరిది ఇలా వాళ్ళిష్టం వచ్చినట్లు చేస్తున్నారు. నేనొక్కదాన్నే కాబట్టి ఏమైనా చేయ్యవచ్చనుకున్నారు. నాకు డెలివరీ తరువాత ఉద్యోగం వస్తుందని కూడా అసూయగా ఉన్నారు.
నీకు, మీ ఆయనకు కూడా నేనెంతో రుణపడి వుంటాను. పాపను తీసుకొని వెళ్ళి నెల్లూరు లో వదిలి మీరు నాకు చాలా సహాయం చేశారు. నా భర్త మీ పెళ్ళికి సహాయం చేసిన దానికి రుణం తీర్చుకుంటున్నారు. కానీ నీ భర్తకేమీ ఆపద కలుగకుండా చూసుకోండి. పాపను ఆసుపత్రి లోనే ఎవరో ఎత్తుకుపోయారని మా అత్తా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అదిగో స్టేషన్ వస్తోంది. పాపను నేను తీసుకున్న తరువాత ఫోన్ చేస్తాను. ఉంటాను” అంది కల్యాణి. “అలాగేనమ్మా” అని ఫోన్ పెట్టేసింది కస్తూరి.
***
ఇంతలో తన వెనుక దూరంగా మనుషులు రావడం కనిపించిందతనికి. ఆ వ్యక్తి రోడ్ మీద పరుగెడుతున్నాడు. అతని చేతిలో చిన్న పాప ఉంది. అతని వెనుక నలుగురు మనుషులు అతన్ని వెంట తరుముతున్నారు. రైలు వెళ్ళి స్టేషన్ లో ఆగుతోంది నెమ్మదిగా. అతను ఇంకా త్వరగా పరుగెడుతున్నాడు.
కల్యాణి ఐదు నిముషాల నుండీ పెట్టె ద్వారం దగ్గర నిలబడి రెండు కమ్మీలూ పట్టుకొని చూస్తోంది. చివరగా ఉన్న జనరల్ పెట్టెలో ఉందామె. పాపతో అతను కనపడగానే ఆమె ఆదుర్దాగా తల వంచి చూస్తుండగా ట్రెయిన్ ఆగింది. అతను పరిగెడుతూనే ఉన్నాడు. వెనుకాల వచ్చే మనుషులు అతనితో పరుగెట్టలేక ఆయాసం తో ఎప్పుడో ఆగిపోయారు. ఇతను పాతిక సంవత్సరాల వాడు. వాళ్ళు నలభై సంవత్సరాల వాళ్ళు. ఇంకా ఇరవై అడుగుల దూరం లో అతను ఉండగా ట్రెయిన్ కూత పెట్టింది. కల్యాణి పెట్టె దిగింది.
అతను “వద్దమ్మా. ఎక్కెయ్యండీ” అంటున్నాడు. ట్రెయిన్ శబ్దానికి పాప లేచి ఏడుస్తోంది.
అతను చెయ్యి వూపడం ఆమెకు అర్థమవుతున్నా, ఆమె కంగారుతో ఉంది. ఎక్కకుండా పాపను అందుకోవడానికి చూస్తోంది. అతను ఐదడుగుల దూరానికి వస్తుండగా ఆమె ట్రెయిన్ ఎక్కింది. ట్రెయిన్ కదులుతోంది. అతను పాపను ఆమెకు అందిస్తూ ట్రెయిన్ తో పాటు నడిచాడు. ఆమె పాపను అందుకుంది. అతను నమస్కారం చేశాడు. ఆమె కన్నీళ్ళతో వెనక్కు నడిచి పెట్టెను ఆనుకొని పాపతో సహా అతనికి నమస్కరించింది. ట్రెయిన్ స్పీడ్ అందుకుంది. పెట్టె నిండుగా ఉన్న జనం ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఒక రెండు నిముషాల తరువాత తన పక్కన కూర్చున్న అమ్మాయి సహాయంతో తన సీట్ లో కూర్చొని పాపను సముదాయించింది.
***
కళ్యాణికి రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
కల్యాణి డెలివరీ అయిన రెండో రోజు రాత్రి ఆసుపత్రి వరండాలో ఆమె అత్తగారు ఫోన్ లో మాట్లాడిన విషయాలు పాప పక్క సర్దడానికి లేచినప్పుడు కల్యాణికి వినపడ్డాయి.
“ఒరేయ్ గోపాలం, ఆ చంటి బిడ్డను ఆసుపత్రి నుంచే ఎత్తుకొని పొయ్యి ఎక్కడో ఒక చోట మందు పెట్టీ పాతిపెట్టేసేయ్యి. పీడా వదులుతుంది. లేకుంటే మీ బిడ్డే కదా ఆ బిడ్డను పెంచడానికి ఇల్లో, వాకిలో రాసియ్యమంటే మనమెక్కడ చూస్తాం? కళ్యాణికి ఉద్యోగమెలాగూ ఇస్తారు. వీలైతే నువ్వు. మారు మనువు కూడా చేసుకోవచ్చు” అని చిన్న కొడుక్కు ఆశపెడ్తూ చెప్తోంది.
‘అంటే నా బిడ్డను తీసుకెళ్తారా?’.. ‘అమ్మో’ అనుకుంటూ కల్యాణి వణికి పోయింది. ఈ పరిస్థితులలో ఏం చెయ్యాలో తోచడం లేదు.
అత్తగారు లోపలికి వచ్చి నిద్రపోయిన తరువాత లేచి కస్తూరికి మెసేజ్ చేసింది. వెంటనే కస్తూరి నుంచి రిప్లై వచ్చింది. వెంటనే తానేమి అనుకున్నదీ వ్రాసింది.
“కస్తూరీ, మా ఆయన, మీ ఆయన స్నేహితులు కాబట్టి ఈ సహాయం చేసి స్నేహితుని కూతురిని కాపాడమని మీ ఆయనను కోరుతున్నాను. సెలవు మీద వచ్చిన మీ ఆయనను ఈ పని చేసి నా పాపను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ”
“ఇది మారు మూల చిన్న ఆసుపత్రి కనుక సి. సి. కెమెరాలు లేవు. జాగ్రత్తగా ఎవరికీ చిక్కకుండా చేయవలసినదిగా కళ్ళ నీళ్ళతో అభ్యర్ధిస్తున్నాను” అని కూడా వ్రాసింది.
ఆ తరువాత గంటకు కస్తూరి భర్త రావడం, పాపను తీసుకెళ్ళి కస్తూరికివ్వడం జరిగిపోయింది. ఇద్దరూ నెల్లూరు వెళ్ళి పాపను జే. సి. గారి బంగళా ముందు ఉదయం 4. 30 కు ఉంచారు. వాచ్ మాన్ వచ్చి పాపను చూసి లోపలికి తీసుకొని వెళ్ళడంతో ‘అమ్మయ్య’ అని గాలి పీల్చుకున్నారు.
తరువాత విషయాలు ఒక్కొక్కటీ గమనిస్తూ బాల సదనం దగ్గర పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు.
కల్యాణి వాళ్ళకు వివరంగా చెప్పింది.
“నేను అదే బాలసదనం లో పదవతరగతి వరకూ చదివాను. ఇలా ఎవరైనా పిల్లలు దొరికితే ముందు ఆసుపత్రిలో ఉంచి తరువాత మా బాలసదనం కు అప్పగిస్తారు. కాబట్టి పాప ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. అక్కడి నుండి తీసుకొని నాకు ట్రెయిన్ లో అందించగలిగితే వెంటనే నేను మద్రాస్ చేరిపోతాను. ”
***
ఆ తరువాత పాపను నిద్రపుచ్చి కల్యాణి కస్తూరికి మెసేజ్ చేసింది. “అంతా క్షేమం. థాంక్యూ కస్తూరీ” అని.
కల్యాణి ధైర్యం చెప్పి నందువల్ల బాలసదనం దగ్గరే కస్తూరి కూడా ఉండి, భర్తను వెనుక నుంచి లోపలికి వెళ్ళి పాపను తీసుకొని వెళ్ళమంది. ‘దొంగతనం తప్పే. కానీ దేశం కోసం వీరమరణం పొందిన ఒక వీరసైనికుని కూతురు అన్యాయంగా హతమైపోవడం న్యాయం కాదు కాబట్టి స్నేహితుని ఆత్మ శాంతించడం కోసం నా సైనికశక్తిని ఉపయోగిస్తాన’ ని అతను భావించి పాపను తీసుకెళ్ళి ట్రైన్లో కళ్యాణికి అప్పగించాడు. అందువల్లనే సామాన్య జనం.. ఆ జవాను పరుగును అందుకోలేక పొయ్యారు.
‘వాళ్ళ పాపను వాళ్ళకే చేర్చడం కాబట్టి, ఇది దొంగతనం అవదు’ అని అనుకొని దేశానికి సేవ చేసినట్టు గానే చనిపోయిన తన స్నేహితుని కూతురిని కాపాడాడు ఆ సైనికుడు.
పాప బ్రతికున్నట్లుగా అత్తగారికి తెలియకూడదనే ఇలా ఆలోచించింది కల్యాణి. లేకుంటే పోలీస్ లేదా కలెక్టర్ గారి సహాయం తీసుకుంటే ఇలా పాపను ఎత్తుకొచ్చే పని కూడా వుండదు.
ఈ కష్టమేమీ తెలియని ఆ పసిహృదయం అమ్మ వొళ్ళో చేరి హాయిగా నిద్ర పోతోంది. “పాపే నా ప్రాణం” అంటూ కల్యాణి పాప తల నిమురుతోంది ఆప్యాయంగా.
సమాప్తం
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
సమాప్తం

రచయిత్రి పరిచయం: నా పేరు కె.లక్ష్మీ శైలజ
నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.
మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.
ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మనతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి
నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు
సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.
రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.
జిమ్మీ నా ప్రాణం కథ.
వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.
ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.
Comments