నిత్య ప్రళయ నిశ్శబ్దం
- Yasoda Gottiparthi

- 59 minutes ago
- 5 min read

Nithya Pralaya Nissabdam - Telugu Emotional Story | Yasoda Gottiparthi
నిత్య ప్రళయ నిశ్శబ్దం - తెలుగు భావోద్వేగ కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 09/05/2026
కొన్ని నిశ్శబ్దాలు… వినిపించకపోయినా అరుస్తుంటాయి. కొన్ని బాధలు… కనిపించకపోయినా కాలుస్తుంటాయి. ఒక హాస్టల్ విద్యార్థుల చేతికి చిక్కిన డైరీ… అమాయక బాలికల జీవితాల వెనుక దాగిన భయంకర ప్రపంచాన్ని బయటపెట్టింది. “నిత్య ప్రళయ నిశ్శబ్దం” కేవలం కథ కాదు… సమాజం మేల్కొనాల్సిన హెచ్చరిక.
"ఓ వెంకవ్వ! విసనకర్ర కనబడుత లేదు, వెతుకులాడి యాష్టకొస్తుంది. ఎండాకాలంలో గాలి కోసం విసురుకునేది, ఇప్పుడు పొయ్యి మంట కోసం తెచ్చిచ్చి పోవే!"
"లేదానయ్యా? నీ విసురుడు చప్పుడు విని చుట్టుపక్కల వాళ్ళొస్తరు... చాయ పోస్తావని. రాలేదా? విచిత్రమే!" అంటూ ముక్కు మీద వేలేసుకుని,
"వచ్చినరే ధర్మన్నా! నీ చాయ పొంగు వాసన ముక్కులకు తాకుతు లేదు," అని మురుక చూసుకుంటూ... "ఇయ్యాల నీవల్ల అయిత లేనట్టుంది," అని కిసుక్కున నవ్వి, "సరే, తీయి. బయట తాగుతం. పొద్దు పోయింది," అని "మల్ల వస్తాం," అని చెప్పి పోయిండ్రు.
"మరింకేంది? వాళ్లెల్లి పోయినంకా పొద్దు పొద్దుగాల నీ పిలుపులు ఎందుకు? కొద్దిగా ఓపిక పట్టలేవా? పెద్దమనిషి..."
"నీ తోటే పని పడింది... అయ్యో! వయ్యారాలు పోకే, అందం కరిగిపోతది. ఇట్లా రావే, కూకో..."
"చాల్లేవయ్యా! వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి. పొద్దెక్కుతుంది."
"నువ్వే కదయ్యా! గ్యాస్ బండ లేక పది రోజుల నుండి బొగ్గులకుంపటి అంటుకునే వరకు విసనకర్ర తోటి కొట్టి మంట కోసం విసిరి మూడు ముక్కలు చేసినవూ, తెలియదా?"
"ఆకాశంలో యుద్ధం వచ్చి మన పేదల భూమి మీద అన్నీ కరువాయే. తీసుకురావే వెంకవ్వ అంటే మాటల యుద్ధం చేస్తున్నవు."
"కొత్తది అటక మీద పెట్టినది దొరకబట్టుకో. కిరసనాయిలు తెచ్చినప్పుడే రెండు విసనకర్రలు తెచ్చి పెట్టిన. విసనకర్రలు వెనకటి తీరుగ లేవు, అవి కూడా కల్తీ అయినాయేంది? పుటుక్కున విరుగుతున్నయి. పదిలంగ విసరవయ్యా."
"మంట అంటుకుని చాయ మరుగుతున్నది. ఈడనే ఉండి తాగి పోవే! గ్యాస్ లేకపోతే మాయే. కుంపటి మీది చాయ ఎంత రుచిగా ఉన్నదో,"
"పెళ్లి కాగానే చాటుగా నువ్విచ్చిన ముద్దంత తియ్యగా..."
"ఏమయ్యో! 'ముసలితనాన కుసుమ గుడాలు' ఎప్పటివో మధ్యలో తీసుకొస్తావు."
"నీకేం తెలుసే? పాతవైనా ఎప్పుడూ కొత్తవే!" అని ముందుకు జరిగి బుగ్గలు తడమబోతుంటే, "నీ సంబడం చాలుగాని, మన పెద్దవాడికి పట్నంలో ఉద్యోగం వచ్చింది, మీరిద్దరూ రండి," అంటూ నాలుగో తరగతిల పాఠం చెప్పిన సార్‌కు ఉత్తరం రాసిండట. "పోదాం అయ్యా!"
"వ్యవసాయం పనులు కదలకుండా ఉన్నయి. నోటి ముందట ముద్ద వదులుకొని అక్కడికి పోయి ఏం చేస్తాం? వాడు ఎన్ని తిప్పలు పడుతున్నడో..."
"మన మీద ప్రాణం గుంజుతున్నదేమో 'రాండమ్మా' అంటుండు."
"మనకోసం అద్దె ఇల్లు కూడా చూసిండట."
"మనకేడ తీరుతది? ఎట్లనో సెలవు చూసుకొని మనకోసం కొన్ని దినాలు రమ్మందాము. ఇక్కడ మనం అందరం కలిసి బాగోగులు చూసుకోవచ్చు."
"పంతులు కాడికి పోయి చెప్పి వస్తా," అంటూ పంచ సవరించుకుని, భుజం మీద కండువ వేసుకుని, "ఆ తలపాగ ఇయ్యి, పంతులును కలిసి చెప్పి వస్తా," అని గుమ్మం బయటకు వెళ్తుండగానే కారు ఆగిన శబ్దం విని ఆగిండు ధర్మయ్య.
సూటు బూటులోంచి ఎదురుగా ఇద్దరు ఆఫీసర్లు నిలబడగానే, కాళ్లలో వణుకు పుట్టి, "ఏంది సార్లూ, పొద్దు పొద్దుగాల వచ్చినారు. మా వల్ల ఏదైనా తప్పిదం జరిగిందా? మా కాడికి వచ్చినరంటేనే భయం అయితాంది," అని చేతులు జోడిస్తుంటే,
"అదేం లేదు. నువ్వేం చేస్తావని.. భయపడకు... ఊర్లో ఇల్లు లేని వాళ్లకు డబుల్ బెడ్ రూంలు శాంక్షన్ అయినయి. అందులో నీ పేరు ఉన్నది."
"ఆ సర్పంచ్ సారు ఏడాది కింద ఒకసారి అన్నడు. యాది మరచిన. చాలా సంతోషం సార్! నాకు భార్య, ఇద్దరు కొడుకులు, అమ్మ. పెద్దకొడుకు పట్నంలో చదువుకుంటున్నడు, ఉద్యోగం వచ్చింది అన్నడు. నేను, నా భార్య వెదురు బుట్టలు అల్లుతూ పూట గడుపుతామయ్యా," అని దీనంగా చెప్పగానే, "కావలసిన వివరాలు పూర్తయినాయి. ఇంటి పత్రాలు పిలిచినప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోయి తీసుకోవాలి," అని చెప్పి వెళ్లడంతో, సంతోషంతో సొంత ఇంటి కలలు తీరాయి. "పాయసం చేయవే, పండుగ చేసుకుందాం."
****
అమ్మ, అయ్యతో సహా ఇంటికి దూరమై, బాల్యం అంటే భయరహిత వాతావరణంలో పెరగకుండా, కోరికలను కొండెక్కించి, కష్టపడి, ఇష్టపడి పడిన పాట్లెన్నో... ఆంక్షలు పెట్టడం తప్ప తమ అవసరాలు గమనించకుండా...
"ఈరోజు అన్నం తినబుద్ధి కావట్లేదు సార్!" అంటున్నా,
"ఆకలితో ఉన్న వాళ్ళెందరో తిండి లేక అలమటిస్తున్నారురా! మీకేమో తిన్నదరగక తినబుద్ధి కావడం లేదు అంటున్నారు. ఒక రోజు మాడితేనే అన్నము విలువ తెలుస్తుందిరా!" అనే తిట్లు తిని పడుకుంటే,
ఇంట్లో అమ్మ అయితే "జ్వరం వచ్చిందా నాయనా!" అని "నీకు ఇష్టమైతేనే తిను రా!" అని ఓదార్చి నిద్రపుచ్చేది.
అప్పుడు తన ప్రేమలో అంతవరకే ఆనందాన్ని పొందేవాడినేమో? ఆ ప్రేమతోనే నేను విశ్వమంతా గెలిచినట్టు నన్ను నేను తెలుసుకునే ఆధారంగా చదువును చెప్పించి ప్రయోజకుడిని చేశారు. తను ఇప్పటివరకు హాస్టల్లో పదిమందిలో కష్టాన్ని కూడా సుఖమనీ అనుభవిస్తూ కళ్లలో నీళ్లు కుక్కుకుంటూ అంటున్న "సత్యం"తో, "ఎందుకు అంత బాధపడతావు? తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి కదా ఇక్కడ ఇష్టంగా ఉంటున్నాము." పిర్ర మీద దెబ్బతో "సార్! సార్!" అన్నాడు గోవిందు.
"మీ బాత్రూంలు అట్లా ఏడ్చినాయి. ఫినాయిలు పోసి కడగండిరా! అవి శుభ్రం చేయకపోతే అక్కడే ఉండాలి. లోపల పడేసి తాళం పెడతా!" అని వార్నింగ్ ఇచ్చిన వార్డెన్ రాక్షసుడిలా తోచాడు.
పనివాళ్ళకు జీతాలు ఇచ్చి, పసివాళ్ళని పనిచేయమని అనడం ఏమన్నా న్యాయంగా ఉందా? "బట్టలు, పుస్తకాలు ఇస్తున్నామంటూ" లెక్కలు రాసి గవర్నమెంట్‌కు పంపుతారట. ఏడాదికి ఒక్క జత బట్టలు, సిలబస్ అంతా అయిపోయినంక పుస్తకాలు ఇచ్చినారు కదరా! పైకి అనుకున్నా పేగులు లెక్కబెడతారు పంతుళ్లు.
రమేష్ సార్ పిలిచినట్టే వచ్చి చక్కగా చదువు చెప్తుంటే వంకర బుద్ధి పోతలేదురా మీకు...
కుర్చీలో కూర్చుని, "రారా సత్యం!"
"నా కాళ్లు పట్టు, బాగా గుంజుతున్నాయిరా!"
"నువ్వుండూ సత్యం, నేను పోతా," అంటూ గోవిందు "కాళ్లు బాగా గుంజుతున్నాయా సార్!"
"అయితే నా ఒక్కడి వల్ల కాదు. రంగా, సాంబన్నా! అందరూ రండిరా! రవి సార్ గారికి కాళ్లు గుంజాలట,"
లోలోపల నవ్వుతుంటే, బాధపడుతున్న సత్యం వీళ్ళ మాటలు విని దగ్గరకు వచ్చి, "మనమే కోరుకున్న జీవితానికి రెండు బాటల్లో నడవాలి: ముళ్ళ బాట, పూల బాట. ముందుగా,
ముళ్ళు జరుపుకుంటూ గుచ్చుకోకుండా, ప్రకృతి ఇచ్చిన వరంగా తీసుకొని, రెండు వైపులా పరికించి చూస్తూ, రెండింటి మధ్య వర్షాలకు కొట్టుకొని పోయే ఎగుడు దిగుడు రోడ్డు కూడా వస్తుంది. లక్ష్యం ముందుగా నిన్ను సిమెంట్ రోడ్డు వైపున నడిపించే ఎన్నో ఆశలకు కల్పించే పూల బాట మాత్రమే కనిపిస్తుంది.
"ఒరేయ్ సత్యం! నీ వేదాంతం, పూల బాట అంటూ ఇవన్నీ మాటలు వినడానికి బాగుంటాయి. ముక్కు పచ్చలారని పిల్లలకు చెప్పు, అంతేగాని పరుగుల గుర్రానికి చెప్పకు. మధ్యంతరంగా చదువులు మానితే మనకే నష్టం. మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే కోల్పోయేది మనమే..." అని, "అలా బయటకు తిరిగి వద్దాం పదరా," అని "రాత్రి పది అవుతుంది, మనల్ని తిరగనియ్యరు," అని "పర్లేదు, నిశ్శబ్దంగా చీకటి నీడలో నడుద్దాం," అంటూ తిరగడం మొదలుపెట్టారు.
"ఊరికి చాలా దూరంగా ఉంది కదరా, నిర్మానుష్యంగా... ఏం జరిగినా ఎవరికీ తెలియదు. అందుకే ఇక్కడ ఎవరూ జాయిన్ కాలేదు."
"ఒరేయ్ సత్యం! నువ్వు ఊహించుకోకు. వస్తూనే ఉంటారు. మనం వచ్చాముగా, చేరాముగా? మరి తెలివితేటలు తగ్గట్టుగా మనల్ని మనమే బాగు చేసుకుంటున్నాముగా? వీడు చెప్పేదానికి, ఇప్పుడు చేసేదానికి ఏమన్నా అతికినట్లు ఉన్నాయా రా? పరీక్షలు దగ్గర పడుతున్నాయి, కూర్చొని చదువుకోవాలి... కానీ కాలక్షేపం చేస్తూ తిరుగుతున్నాం."
"చూడరా! దూరంగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఎవరో పెడుతున్నట్లా? లేక ఏమైనా అంటుకుని తగలబడుతున్నాయా?" దూరం నుండి పొగ దట్టంగా వ్యాపిస్తుంది. చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. "మన ముగ్గురం ఈ మంటల్లో చిక్కుకుపోతామో ఏమో? పదండిరా, హాస్టల్లోకి వెళ్లి మంటలు అని చెబుదాము," అని వెనక్కి బయలుదేరారు.
"ఇరవై నిమిషాలు నడిస్తే గాని మనం హాస్టల్ గదిల్లోకి వెళ్లలేము. ఈ లోపల ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్ళను అంటుకుంటాయి. మనం మేలు చేద్దామని వస్తే ఆ మంటలు మనల్ని దహించేట్లున్నాయి." లోపలికి నడుస్తూ ప్రారంభించి నాలుగు అడుగులు వేశారో లేదో... రంగడు వస్తూ, "సాంబా, సత్యం, గోవిందు! మీరందరూ ఇక్కడే ఏం చేస్తున్నారురా?"
"చూస్తే పక్కనే లేరు. దారి మధ్యలో ఈ డైరీ దొరికింది. ఈ మంటలేందిరా?" అనగానే "ఇప్పుడే వచ్చాయి, చెబుదామని బయలుదేరాము."
"ఆ డైరీ ఇవ్వు," అని స్ట్రీట్ లైట్ వెలుగులో నిలబడి చదవడం మొదలుపెట్టారు. "మీరు ఈ డైరీ చదివే ముందు ఒకసారి నాలుగు వైపులా చూడండి. దక్షిణం వైపున ముళ్ళకంప చెట్లు చుట్టూ దట్టంగా ఉంటాయి."
"చదివే టైం లేదు. వెళ్లి వార్డెన్‌ను తీసుకురావాలి, పదండి," అని మళ్లీ రెండు అడుగులు వేశారో లేదో పెద్ద శబ్దం వినవచ్చి, వెనక్కి తిరిగి చూశారు.
తెల్లటి బట్టలతో, జుట్టు విరబోసుకుని, నల్లటి ముఖంతో, తెల్లటి కళ్ళు, కోరల పళ్ళు భయంకరంగా కనిపించేసరికి కళ్ళు మూతలు పడ్డాయి. చల్ల చమటలతో ఒళ్లంతా తడిచి పరుగులు తీస్తుంటే, "ముందు చదవండిరా! చూస్తే దయ్యం లేదు. చుట్టూ చూస్తే మంటలు లేవు. ఎవరో చల్లార్చినట్లున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్పినా నమ్మరు. హాస్టల్ వార్డెన్ మనల్ని నాలుగు వాయిస్తాడు. బుద్ధిగా చదువుకోండిరా అంటే 'బేతాళ కథలు చెప్తున్నారా?' అంటాడు”.
మెల్లగా రూమ్‌లోకి చేరి డైరీలో చదువుతూ, "పెద్ద వెదురు బుట్టలు ఒకదాంట్లో ఒకటి వేసి చక్కగా పెద్ద పెద్ద లారీల్లోకి తీసుకువెళుతుంటారు. వాటిల్లో చిన్న పిల్లలను పెట్టి రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అధిక జనాభా భారతదేశం, అమాయక ఆడపిల్లలు. దొరికిన వారిని దొరికినట్టు మమ్మల్ని పాడుబడ్డ ఇంట్లో బంధించి, భయపెట్టించి, బుట్టలు, తట్టలు ఎగుమతి చేస్తున్నామంటూ భ్రమ కల్పిస్తున్నారురా!
ఇన్నాళ్లు ఈ డైరీ ఎవరూ చదవలేదా? అనుకుంటున్నారు కదా! ఇప్పుడు మీ వెనుకనే నడిచిన నేను దయ్యాన్ని కాను. ఆ ఆకారంలో ఉన్న అమాయక అమ్మాయిని... పట్టించుకునే వారు లేరని, 'ఇక్కడ దారిన పోయే కంపలు తగిలించుకోబడును' బోర్డు పెట్టారు దుర్మార్గం వెధవలు. ఇన్నాళ్లకు మీరు దొరికారు. ఇది చదవగానే వెంటనే మీరేదో హీరోలా మమ్మల్ని రక్షించడానికి రాకండి, బలైపోతారు.
పోలీస్ కంప్లైంట్‌తో, బందోబస్తుగా వచ్చి దుండగులను పట్టించాలిరా. ప్రయత్నాలు చేయండి. మిమ్మల్ని నమ్ముతున్నాను. వారం రోజుల్లో నన్ను అమ్మేస్తారు. ఇప్పుడే వెళ్లి ఆ పని చూడండి."
భయం, బాధ్యతల మధ్య ఉక్కిరిబిక్కిరై "పదండిరా," అంటూ సత్యం పక్కన పడుకున్న వాళ్ళందరినీ తట్టి లేపుతున్నాడు.
"ఏమైందిరా? ఇప్పటివరకు చదువుకుని పడుకున్నాము. మంచి నిద్ర పాడు చేశావు."
"ఇదంతా కలనా? నిజమేనేమో పదరా! నీ ఎంకమ్మ పెద్ద సంఘ సంస్కర్త, బయలుదేరు."
ప్రభుత్వము ఇచ్చిన ఇళ్ల గృహప్రవేశము అని తండ్రి పిలుపుతో వెళ్లి అక్కడ అందరికీ చెప్పాడు. "ఈ ఇళ్లలోనే ఉండాలి," అని చెపుతుంటే అట్లనే అని సంతోషించారు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం







Comments