top of page

ఓ కథ...... ఆమె వ్యథ


'O Katha Ame Vyatha' written by Anika Tejaswini

రచన : అనిక తేజస్విని

"అమ్మా...నాకు నిద్ర పట్టడం లేదు. ఒక కథ చెప్పవా. చాలా భయంకరంగా ఉండాలి".

"సరే నాన్నా చెప్తాను. నిజంగా జరిగిన కథే చెప్తాను. నాకు భయం ఇంకా బాధ అంటే ఏంటో పరిచయం చేసిన కథను ఇప్పుడు నీకు చెప్తాను.


అప్పుడు నీకు సరిగ్గా రెండేళ్ళు ఉంటాయి. అప్పటి వరకు నవ్వుతూ ఆడుకున్న నువ్వు హఠాత్తుగా ఏ ఉలుకూ పలుకూ లేకుండా, నోట మాట రాకుండా అలా మంచం మీద వాలిపోయావు. నువ్వు పడుకున్నావేమో అని ఈ పిచ్చి అమ్మ అనుకుంది. ఇక నువ్వు తినే సమయం కూడా అవ్వటంతో నిన్ను లేపడానికి నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకునేసరికి నువ్వు చలనం లేకుండా ఉన్నావు. నిన్ను అలా చూసేసరికి నేను భయంతో గట్టిగా అరిచాను. నా అరుపులు విని మీ అమ్మమ్మ తాతయ్య కంగారుగా ఏమయింది అంటూ వచ్చారు. చలనం

లేని నిన్ను చూసి మీ అమ్మమ్మ ఏడవటం మొదలు పెట్టింది. నాకు అమ్మమ్మకి ధైర్యం చెప్పి

మీ తాతయ్య హుటాహుటిన కారు తీసారు. నేను అమ్మమ్మ కంగారుగా కారు ఎక్కాము. ఇక జరిగిన విషయం మీ నాన్నతో చెబుదామని ఫోన్ చేశాను. మీ నాన్న ఫోన్ ఎత్తలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా మీ నాన్న ఫోన్ ఎత్తలేదు. ఇంతలో ఆసుపత్రి దగ్గరకు వచ్చాము. తొందరగా కారు దిగి నిన్ను డాక్టర్ దెగ్గరికి తీసుకెళ్ళాం. నిన్ను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. మేమంతా బయట ఉన్నాం. అప్పుడే నా ముందు నుంచీ ఒక డెడ్ బాడీని తీసుకెళ్లారు. గాలికి డెడ్ బాడీ మీద ఉన్న దుప్పటి కింద పడింది. అది చూసిన నాకు నోటి వెంట మాట రాలేదు. గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆసుపత్రి లో అంతా నన్నే చూస్తున్నారు. చనిపోయింది ఎవరో కాదు మీ నాన్న. అప్పుడే లోపలినుండి వచ్చిన డాక్టర్ గారూ 'మీరు కంగారు పడకండి మీ బాబు ఇప్పుడు బానే ఉన్నాడు' అని చెప్పారు. అది విన్న నేను మీ నాన్న ఇక లేడు అని బాధపడాలో లేక నువ్వు బతికావని సంబరపడాలో అర్థం కాక విలవిలలాడాను !

ఎవరినో కాపాడడం కోసం మీ నాన్న తన ప్రాణాలను పణంగా పెట్టారు. మీ నాన్నకి కొంచెం తొందర ఎక్కువ కదరా (ఏడుస్తూ) అందుకే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే ఆయన తన ప్రాణాలను వదిలేసారు".

"నాన్న ఎంతో గొప్పవాడు కదమ్మా. వేరేవాళ్ళని కాపాడడం కోసం తన ప్రాణాలను వదిలేసారు. నేను కూడా పెద్దయ్యాక నాన్న లాగా సూపర్ హీరోని అవుతాను".

"నా తండ్రే... అచ్చం నాన్న పోలికలు . అలాగే అవుదూలే కానీ ఇక పడుకో బంగారం లేట్ అయ్యింది ఇప్పటికే'.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

42 views0 comments
bottom of page