తప్పు చేశాను
- A . Annapurna

- 22 hours ago
- 3 min read
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #తప్పుచేశాను, #ThappuChesanu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Thappu Chesanu - New Telugu Story Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 21/12/2025
తప్పు చేశాను - తెలుగు కథ
రచన: ఏ. అన్నపూర్ణ
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి
''అబ్బా! ఎన్నేళ్లకు వచ్చావురా శ్రీకాంత్, ఇప్పుడు ఇండియా మీద ప్రేమ కలిగిందా?” అన్నారు శ్రీకాంత్ ఫ్రెండ్స్.
''ఇరవై ఏళ్లపాటు ఊపిరి సలపకుండా వర్క్ చేస్తే, ఇప్పటికి స్థిరపడ్డాను. మా పెరెంట్స్‌ని రెండేళ్లకు ఒకసారి అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. అందుకే రాలేకపోయాను''. అన్నాడు శ్రీకాంత్.
''పేస్ టైమ్లో పలకరించుకున్నా లైవ్ గా చూడటం వేరు. వెరీ హాపీ టూ మీట్ యు. ''అన్నారు అందరు.
తాజ్మహల్ హోటల్లో లంచ్ చేసి ఎవరికీ వారు బై చెప్పి వెళ్ళిపోయాక, కార్ తీసుకుని బయలుదేరుతుంటే,
అప్పుడే వచ్చిన కార్ నుంచి దిగింది మాధురి.
ఎదురుగా బయలుదేరుతున్న శ్రీకాంత్ను గుర్తుపట్టి, '' హలొ శ్రీకాంత్, నువ్వేనా?” అంటూ దగ్గరగా వచ్చింది.
''హలొ.. మీరు?” అంటూ కారుదిగాడు. కానీ ఆమెను గుర్తు పట్టలేదు.
''నేను నీకు ఇంజనీరింగ్లో క్లాస్ మేట్ మధుని. ''
''ఓహ్ మధూ, చాలా మారిపోయావు. అస్సలు గుర్తుపట్టలేదు. ఎలావున్నావ్? ఇక్కడే హైదరాబాదులోనే వుంటున్నావా?''
''అవును ఇరవై అయిదేళ్ళ క్రితానికి ఇప్పటికి మార్పు రాకుండా ఎలావుంటాను. కానీ నిన్ను చూస్తే అసూయగా వుంది. అచ్చం అలాగే యంగ్ గా, హ్యాండ్ సంగా వున్నావ్..” అంటూ ఏమాత్రం అరమరికలు లేకుండా గాఢంగా అతడిని హగ్ చేసుకుంది.
శ్రీకాంత్ ఆమె చొరవకు కాస్తంత కంగారుపడినా, ఆమెకు లేని భయం నాకెందుకు అని గట్టిగా దగ్గరకు హత్తుకున్నాడు.
''నాకు కంపెనీ ఇద్దుగాని రా..” అంది మాధురి.
''లేదు. నాకు వేరే అప్పోయింట్మెంట్ వుంది. సారీ మధు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. మళ్లీ కలుద్దాం'' అంటూ ఆమె నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
అలా కలిసిన వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్షిప్ను కొనసాగించారు.
మాధురి భర్త రవిది ఎక్కువగా టూర్లు వెళ్లే జాబ్. ఇద్దరుపిల్లలు, చదువులకు వెళ్లిపోయారు. వుద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కానీ టైంపాస్ కోసం ఫ్రెండ్స్ తో సైట్ సీఇంగ్కి వెళ్లడం, పార్టీలు చేసుకోడం, మూవీస్ చూడటం తో గడిపేస్తుంది.
ఇప్పుడు చిన్నప్పటి స్నేహితుడు కనిపించేసరికి కొత్త ఉత్సాహం వచ్చింది మాధురికి.
హోటల్ ఖాళీ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది.
దానికితోడు శ్రీకాంత్ వర్క్ చేసే కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేయడం, శ్రీకాంత్ని మేనేజర్గా ప్రమోట్ చేయడం వలన ఆరునెలలు ఇండియా-ఆరునెలలు అమెరికా వెళ్లి వస్తున్నాడు.
మాధురి ఎంతగా పట్టుబట్టిన ఆమె ఇంట్లో ఉండటానికి ఇష్టపడలేదు.
''నాకు కంపెనీ ఫ్లాట్ ఇచ్చింది. ''అన్నాడు.
''ఒకరోజు మా ఇంటికి రావాలి తప్పదు..” అంటే సరే అన్నాడు.
ఈ సారి ట్రిప్ కి శ్రీకాంత్ వైఫ్ కూడా వచ్చింది. ఫ్రెండ్ కూతురి పెళ్లి అని.
''నేను ఈసారి కలవడం కుదరదు. ''అని మాధురికి మెస్సేజ్ పెట్టేడు.
అతనికి మాధురి ప్రవర్తన అతిగా అనిపించింది.
పెళ్ళికి ముందు స్నేహం వేరు, పెళ్లి అయ్యాక పిల్లలు, భాగస్వామి పట్ల బాధ్యతగా ఉండాలి. ఆకర్షణ అనేది క్షణికం. దూరంగా వున్నప్పుడు మోహం కలుగుతుంది. దగ్గిరయ్యాక విసుగు కలుగుతుంది.
చదువుకునే రోజుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొన్ని కారణాలవలన చేసుకోలేదు. విడిగా ఎవరి జీవితాలు వాళ్ళవి బాగానే వున్నాయి.
చాలా కాలానికి కలిసాం కదా అని సరదాగా గడిపాము. అంతటితో సరి.
ఇంకా దూరం పోదల్చుకోలేదు. కానీ మాధురి పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఎలా బుద్ధిచెప్పాలి? అనుకున్నాడు.
భార్య దివ్య పెళ్ళికి వెళ్ళినపుడు, ''మనం మొదటిసారి కలిసిన తాజ్ హోటల్కిరా అక్కడ కలుసుకుందాం!” అని, పిలిచాడు.
అతను చెప్పిన టైమ్‌కు మాధురి సంతోషంగా వెళ్ళింది.
కానీ శ్రీకాంత్ కోసం ఎంతగా ఎదురు చూసినా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
'ఛీ.. ఏమిటింతగా మోసంచేశాడు.’ అవమానంతో రగిలిపొయిన్ది.
కానీ అతడి మీద వున్న వ్యామోహం వలన ఇంకా కాసేపు ఎదురుచూద్దాం అనుకుంది.
మసకగా వెలుగుతున్న లైట్ల నీడలో ఒక అబ్బాయి అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న దుస్తులతో తాగిన మైకంలో తూలుతూ ఒకరినొకరు పట్టుకుని లోపలికి వచ్చారు.
వాళ్ళు మూలగా ఉన్న టేబుల్ దగ్గిర మితిమీరి ప్రవర్తిస్తూ చుట్టూ జనం ఉన్నారనే స్పృహ లేకుండా ఉండటం చూసిన మాధురికి, ఆ అమ్మాయి తన కూతురు రేణు ఏమో అనిపించి, వాళ్లకు దగ్గిరగా వెళ్ళింది.
అంతలో హోటల్ మేనేజర్ వచ్చి వాళ్ళను బయటకు వెళ్లిపొమ్మని చెప్పేడు.
ఆ యువకుడు తిరగబడి 'వెళ్లి పొమ్మని చెప్పడానికి నువ్వెవరు?’ అంటూ మానేజర్ని కొట్టాడు.
పెద్ద గొడవ అయిపోవడంతో, కూతురును బలవంతాన ఇంటికి తీసుకుని వెళ్ళింది మాధురి.
''హాస్టల్లో వున్నదానివి బయట ఈ తిరుగుళ్ళు ఏమిటి నీకు బుద్ధి ఉందా ? కాలేజీకి వెళ్ళడంలేదా..” అంటూ చీవాట్లు పెట్టింది.
''ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాను. నువ్వెందుకువచ్చావ్ ?” అంది కూతురు.
ఆ తర్వాత ఒళ్లు తెలియని మైకంలో నిద్రపోయింది.
'అవును, నా కూతురు బాయ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది. నేను ఎందుకు వెళ్ళేను? అది తప్పుచేసింది నా దృష్టిలో. నేను నా బాయ్ ఫ్రెండ్ ని కలుసుకోడానికేగా వెళ్ళింది.
మరి నేను వెళ్లడం కూడా తప్పేగా!
దాన్ని మందలించడానికి నేను తల్లిని వున్నాను. నేను చేసినదానికి శ్రీకాంత్ మందలించాడా! నాకు బుద్ధి చెప్పాలని కావాలనే శ్రీకాంత్ రాలేదు. నేనే విచక్షణ కోల్పోయి సిగ్గువదిలి శ్రీకాంత్ మోహంలో పడిపోయాను. నన్ను ప్రేమించే భర్త, ఎదిగిన పిల్లలు ఉండగా కూడా తప్పు చేసాను. ' అనుకుంది మాధురి.
తర్వాత రేణును అడిగింది.
''డాడీ వూళ్ళో లేరు. నువ్వు వీకెండ్ లో ఇంటికి రావడం మానేశావ్. శ్రద్గా చదువుకుంటున్నావ్ అనుకున్న.
నువ్వు వేసుకున్న డ్రెస్ ఏమిటి? పీలికలు. పైగా డ్రింక్ చేసావ్. చదివేది ఇంటర్. ఇప్పుడే ఇవన్నీ నేర్చుకున్నావు అంటే తర్వాత ఇంకెంత బ్రష్టు అవుతావో. ఇక హాస్టల్కి పంపను. డాడీకి తెలిస్తే చంపేస్తారు. ''
''నేను హాస్టల్కి వెళ్ళను అని చెప్పినా బలవంతాన చేర్పించావు. ఇంటి దగ్గిర ఉండి చదువుకుంటా. మా క్లాసులో చాలామంది ఇలాగే బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఇంటినుంచి వెళ్లేవారు బాగానే వున్నారు. నేను రానప్పుడు నువ్వు వచ్చి చూడచ్చుగా! నువ్వురావు. డాడీ ఎప్పుడూ టూర్లో వుంటారు.
“నాకు ఫ్రెండ్ తప్ప ఎవరూలేరు. అన్నను ఎక్కడో మెడికల్ కాలేజీలో చేర్పించావు. వాణ్ని చూసి రెండేళ్లు అయింది. నువ్వు అసలు తల్లివేనా? వూళ్ళో కాలేజీలు ఉండగా డొనేషన్ కట్టి మమ్మల్ని దూరం పంపించావు. ఒక్కదానివి ఉండటం నీకు బాగుందా? అంతేకాదు.. నీ ఫోనులో ఫోటోలు చూసాను. నీకు శ్రీకాంత్ అని బాయ్ ఫ్రెండ్ వున్నాడు. మరి డాడీకి నేను చెబితే? పూర్ డాడీ. ''
రేణు చెప్పే ఒక్కొక్క మాట గుండెలో బాణాల్లా తగులుతుంటే మాధురి నివ్వెరపోయింది.
సిగ్గుతో కుమిలిపోయింది. చేసిన తప్పుకి బాధపడింది. రేణుని దగ్గిరకు తీసుకుని, ''అవును నాతప్పు ఏమిటో తెలిసింది. ఇకనుంచి నువ్వు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లు. అన్నను సెలవులకి వెళ్లి చూసొద్దాం.
డాడీని కూడా తక్కువ జీతం ఐనా సరే హైదరాబాద్ లోనే జాబ్ చూసుకోమని చెబుదాం. నా కళ్ళు తెరిపించావు. '' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
''సారీ మమ్మీ, పార్టీకి వెడితే నీ పర్మిషన్ తీసుకుని వెళ్తాను. ఇక నువ్వు చెప్పినట్టు వుంటాను. '' అంది రేణు సంతోషంగా. ‘’
వెంటనే ఫోనులో ఉన్న శ్రీకాంత్ నెంబర్, ఫోటోలు, చాట్లు, అన్ని డిలీట్ చేసింది మాధురి.
*******************

-ఏ. అన్నపూర్ణ




Comments