top of page

ఓ స్త్రీ నీకు వందనమమ్మ.O Stree Neeku Vandanamamma Written By Abburi Rathnalakshmi

రచయిత్రి : అబ్బూరి రత్నలక్ష్మి

నా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. కట్టలుతెంచుకున్న దుఃఖం కన్నీరై పోటెత్తుతోంది. మగవాడు ఏడవ కూడదు అంటారు .కానీ......ఆగే దుఃఖమా ఇది. అత్తతో తన అనుబంధం అలాంటిది. తన జీవితంలో ఇలాంటి ఒక వార్త వినవలసి వస్తుందని తను కలలో కూడ ఊ హించు కోలేదు. ఈ రోజ ఉదయమే నిద్రమంచం మీద ఉండగానే నాన్న ఫోను చేసి సీతత్త ఇక మనకు లేదురా...అన్నారు. ఒక నిమిషం నాకు ఏమీ అర్ధం కాల.


ఏమి మాట్లాడుతున్నావు నాన్న అని గట్టిగా అరిచాను.


"రవీ! సీతత్త ...."నాన్న గొంతు దుఖః తో పూడుకుపోయి మెల్లగా "రాత్రి నిద్దరమాత్రలు ఎక్కువ వేసుకుందంట" అని చెప్పి ఒక్కసారి బావురుమని ఏడుస్తున్నారు నాన్న. ఒక్కసారి నా మనసంతా చీకట్లు కమ్మినట్లయింది.


'అత్తా !ఎంత పనిచేసావు. ఈ రవి ఒక్కసారి కూడ నీకు గుర్తు రాలేదా' అని మనసులో ఏడ్చుకుంటూనే , వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.....సీతత్తకు చివరి వీడ్కోలు ఇవ్వటానికి హైదరాబాదు బయలుదేరాను.


కారు వేగంగా పోనివ్వమని డ్రైవరుకు చెప్పాను.


అంత కంటే వేగంగా నా ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీతత్తకు అంత భరించలేని కష్టం ఏమి వచ్చింది . అలాంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎంత ఆలోచించినా నామనసుకు తట్టటంలేదు. అసలు మామయ్య ఎలా తట్టుకుంటారు. సీతత్త కూతురు మైధిలి ఇంత విషాదాన్ని ఎలా తట్టు కుంటుందో. నేను వాళ్ళను ఎలా వోదార్చగలను. అది నా వల్ల అవు తుందా. నా ఆలోచనలు మళ్ళీ గతం లోకి సాగిపోతూనే వున్నాయి.


నెమలి మా ఊరు. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయిన నాకు తన ప్రేమతో ఏ లోటూ తెలియకుండా చూసింది సీతత్త. ఎంత అందంగా వుండేది . పాలరాతి శిల్పం లాగ , కెంపులు పూసినట్లు చెక్కిళ్ళు, కలువ రేకుల లాంటి కళ్ళు అమృతధారలు కురిపిస్తూ , నవ్విందంటే ముత్యాల సరాలు రాలి పడ్డట్టు , లేత గులాబీలు ఇంతందం ఏమిటని అసూయ పడేట్టు, శాప వసాత్తు భూలోకం వచ్చిన దేవత లాగ ఎంత అందంగా వుండేది. అత్తను చూసి పలవరించని కుర్రాళ్ళే లేరు మా ఊరిలో . కృష్ణ భగవానుని భక్తురాలు సీతత్త . కృష్ణ లీలలు ,భాగవతం లోని పద్యాలు ఎంతబాగ పాడేదో. రోజూ.... గుడిలోని కృష్ణయ్యకు మంగళ హారతి అత్తపాడవలసిందే..।

అలా గుడిలో .. అత్తను చూసి మనసు పారేసుకున్న మామయ్య పెద్దవాళ్ళను వొప్పించి సీతత్తను పెళ్ళి చేసుకున్నారు. ఊరంతా ఎంత గొప్పగా చెప్పుకున్నారు. కోటీశ్వరుల సంబంధం అని. పెళ్ళిలో పెట్టిన ఏడువారాల నగలు , వెండిసామానులు. పెద్దంచు కంచిపట్టు చీరలు చూసి ......సీతమ్మది ఎంత అదృష్టం ....ఎంత అదృష్టం అని అందరూ పొగడటమే. అత్తను తీసుకు వెళ్ళటానికి మామయ్య వేసుకు వచ్చిన బెంజ్ కారు చూసి ఎందుకో తెలియదు కాని , నాక్కూడ ఎంత గర్వమనపించిందో..........


ఇక అత్త దూరమైపోతోందని నా చిన్ని మనసుకు అప్పుడు తెలియలేదు. చాల రోజులుఅత్తకోసం ఏడ్చేవాడిని. కాలం తెలియ కుండానే జరిగిపోయింది . సీతత్తకు సంవత్సరానికే ... ఒకకూతురు పుట్టింది. పేరు మైధిలి. అత్తలాగానే ఎంత బాగుంటుందో. చిన్నప్పుడు ఎప్పుడూ 'నీ పెళ్ళాంరా.. నీ పెళ్ళాంరా...' అనేది. నాకెంత సిగ్గు వేసేదో.


అప్పుడప్పుడు సీతత్తను వెంటపెట్టుకొని మామయ్య వచ్చేవారు. మహలక్ష్మి లాగ పెద్ద పట్టుచీర కట్టుకొని వంటినిండా నగలతో అత్త కారు దిగుతుంటే చూడటానికి కళ్ళు చాలవనిపించేది.

నాకు ఎన్ని పళ్ళు, మిఠాయిలూ తెచ్చేదో. అత్త వస్తే పండుగ లాగ వుండేది. మామయ్య వ్యాపారాల బిజీతో మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయేది.


నాన్న కోప్పడుతున్నా ఎన్నిసార్లో 'కొన్ని రోజులు మా దగ్గర వుండమ'ని అడిగేవాడిని. సీతత్త వెన్నల కురిసినట్టు నవ్వేసేది. వెళ్ళి పోయేది.


సీతత్త ఒక తల్లిగా ఒక స్నేహితురాలిగా ఒక ఆత్మబంధువుగా , ఒక మార్గ దర్శకురాలిగా వెనుక నుండి నా వెన్నుతట్టి నడిపించేది. నా అన్ని విజయాల వెనుక నా సీతత్త వుంది.

ఎప్పుడూ అను కుంటాను సీతత్తకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని. అత్త నన్ను ఇంతలా మోసం చేస్తుందని అసలు ఊహించలా. ఈ విషాదాన్ని నేను ఎలా తట్టు కోవాలి.

సీతత్త క్రమంగా మా ఇంటికి రావటం తగ్గి పోయింది . నేను కూడ ఐ ఐ టి ఖరగ్ పూర్ లో సీటు తెచ్చుకోవటం . క్రమంగా అత్తను కలవటం తగ్గింది కాని , రోజూ మాట్లాడక పోతే నాకు ఎంతో లోటుగా వుంటుంది.


నా కు ఇంజనీరింగ్ చదువు పూర్తి అవటం అనంతపురంలోని కియా మోటార్స్ కంపెనీలో పోస్టింగ్ రావటం జాయనయి పోవటం జరిగింది.


అత్తతో ఫోనులో మాట్లాడటమే కాని చూసి రెండు సంవత్సరాలయి పోయింది. సీతత్త కూతురిని కొడైకెనాల్ లో వుంచి చదివించారు. తరువాత మెడిసిన్ సీటు కొని ఢిల్లీ లో చదవిస్తున్నామని సీతత్త చెప్పింది. రాత్రి కూడ నాతో మాట్లాడింది .


పెళ్ళయిన ఈ ఇరవై ఐదు సంవత్సరాల లో ఎప్పుడూ ఒక్కరోజు కూడ బాధ పడినట్టు కనపడలేదు. అయినా అత్తకి .....ఏమిటి.! లంకత ఇల్లు, డబ్బుకు లోటులేదు . ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ చలాకీగా వుండేది.


మరి ఇంత విషాదమైన ముగింపు ఎందుకు కోరుకుంది? ఎడ తెగని ఆలోచనలలో వుండగానే లీలగా వినిపిస్తున్న ఏడుపులు ఈ లోకంలోకి తెచ్చాయి.


పెద్ద బంగళా ఇల్లు ఎప్పుడూ కళకళ లాడుతూ వచ్చే పోయే వారితో సందడిగా వుండే ఇల్లు. కళతప్పి . ఇల్లంతా మనుషులతో నిండి పోయింది. అందరి ముఖాలలో విషాదం. ఏదో తెలియని ఒక నిస్సబ్దం భయం కొలుపుతూ.....పూలరధం పై అత్త పార్ధివశరీరం ...చిరునవ్వుతో వచ్చావా రవీ అని నన్ను పలకరిస్తున్నట్టు.


కళ్ళుతిరగి నట్లయింది లీలగా .....నాన్న చేతులు ....నన్ను పట్టుకున్నట్టు గుర్తు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి అత్త అంతిమ యాత్ర సన్నాహాలు జరుగుతున్నాయి.


మామయ్య మనసు మూగపోయి మౌనంగా కూర్చుని వున్నారు. మైధిలిని ఓదార్చటం ఎవరి వల్ల కావటంలేదు.


ఏది ఏమైనా జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. చీకటి పడింది . మా మనసుల లాగానే.

మా సీతత్త జ్ఞాపకాలే ఇక మాకు మిగిలాయి. మనసు ఉగ్గతీసుకొని. ఒకసారి మైధిలి ని పలకరించి ఊరు బయలు దేరదామని గదిలోకి వెళ్ళాను.


ఎలా ఓదార్చాలో తెలియటంలేదు . మాటలు రాక మౌనంగా వుండి పోయాను.


మైధిలి మెల్లగా లేచి అలమరా వద్దకు వెళ్ళింది . అమ్మ గదిలో నీకు రాసిన ఈ ఉత్తరం దొరికింది బావ అని ఒక కవరు చేతిలో పెట్టింది. అది తీసుకొని మైధిలిని వోదార్చి అనంతపురం బయలుదేరాను.


మనసంతా దిగులుతో నిండి పోయింది. అత్త ఉత్తరంలో ఏమి రాసిందో ఆత్రుత పెరిగి పోసాగింది. వణుకుతున్న చేతులతో కవరు లోని కాగితం చదవ సాగాను.


" రవీ ......నా చిన్ని కన్నయ్యా..... నాకు నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ చేదు జ్ఞపకాలే. నేను బ్రతికింది ఒక బ్రతుకంటావా? నేను జీవించింది ఒక జీవితమంటారా..... నా అస్థిత్వాన్ని కోల్పోయి నిస్సారంగా గడిపిన రోజులే అన్నీ.


కన్నీటి చెలమ ఆరని నా అఃతరంగ సముద్రపు ఘోష ఎవరికి తెలుసు నా లాగే ఎంతో మంది ఇల్లాళ్ళు సాంప్రదాయాలకు తలవొగ్గి , పరువు మర్యాదల ముసుగు వేసుకుని తల్లి తండ్రులకు తలవంపులు తీసుకు రాకూడదని సంఘానికి భయపడి మనసు చేసే సంఘర్షణలను మౌనంగా నిదరపుచ్చి బయటకు నవ్వులు చిందిస్తూ , ఆనందంగా వున్నట్టు నటిస్తూ బ్రతికేస్తున్నాము.

అందరూ నన్ను చాల మహర్జాతకురాలు, అదృష్టవంతురాలు, పెట్టి పుట్టింది, పూర్వజన్మలో ఎన్ని పూజలు చేసిందో అని నా జీవితం గురించి అనకునేవారు.


కాని ఈ ఇరవై అయిదు సంవత్సరాల జీవితంలో నాకు నచ్చిన చీర కట్టలేదు, నాకు నచ్చిన తిండి తినలేదు , నాకు నచ్చిన సినిమా చూడలేదు ,నాకు నచ్చిన పుస్తకం చదవలేదు. నాకు నచ్చిన చోటుకు వెళ్ళి వుండలేదు, ఆఖరికి నా బిడ్డను నా దగ్గర పెట్టుకొని పెంచుకోలేదు. నాకు నచ్చినదేది నా జీవితంలో లేదు.


బంగళాలు ఉన్నాయి. నా మనసులోకి తొంగిచూసి సేదతీర్చే ఒక చిన్న కౌగిలి నాకు దొరకలేదు. నగలు నాణ్యాలు అక్కరలేదు , నా ఉనికినిమరపించే ఒక ఆత్మీయ స్పర్శ చాలునాకు. పంచ భక్ష్యపరమాన్నాలు అక్కరలేదు ప్రేమతో అనురాగంతో నాలుగు మాటలు చాలు పచ్చడి మెతుకులైనా పరమాన్నము లాగ వుండవా..... కారులు అక్కరలేదు నాకు ఊతంగా నిలిచి జీవితం మీద భరోసా కల్పించి తోడుగా నిలబడితే చాలదా.....! హోదాలు అక్కరలేదు నా గుండె చప్పుడు తానై నా ఊపిరిలో ఊపిరై నా బాధలో కన్నీరు తుడిచే తోడుంటే చాలదా ఈ దిగంతాలను జయించేయనా. చేసుకున్న సహచరుడి ఆత్మీయ పలకరింపుకి తపించి పోయింది నా హృదయం. గట్టిగా అరచి ప్రతి మగవాడికి చెప్పాలని ఉంది. ఎప్పుడైనా ,ఒక్కసారి అయినా

ఆమె మనసు పొరలలోకి తొంగి చూసావా? .


ఆమె వొడిని తలగడ చేసికొని

ఆమె కనులలోని అనురాగ వాహినిని చూసావా ? .


కాలపు ఆటుపోటులకు గురై

నలిగి అలసిన మనసుకు

నీ గుండెచప్పుడు వినిపించి సేద తీర్చావా? .


అక్కున చేర్చుకొని

నీ కౌగిలిలో బంధించి

కాలం తెలియకుండా చేసావా?.


ప్రేమ తో నాలుగు మాటలాడి

ఆమె ఆశలకు ప్రాణం పోసి

భరోసా కల్పించావా ?. 🙏


ఆమెను ఒకసారి ప్రేమించి చూడు.......💖.

పిచ్చిది.

తన జీవితమంతా

మనసు నీ ముందు పరచి

నీకు బానిస అవదా.....💗


వెనక గుణసుందరి సినిమాలో శాపవశాత్తు ఎలుగుబంటే భర్త అయితే దానితోనే ఆ ఇల్లాలు కాపురం చేసింది అని విన్నాను. నిజానికి నా జీవితానికి దానికి తేడాలేదు. అప్పుడప్పుడు చలం గారి కధల లోని నాయకిల లాగా స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో విహరించాలని అనిపిస్తుంది.


కాని నిజ జీవితంలో సాధ్యమేనా. ఊహలకే పరిమితం కదా కధలన్నీ. .... సంఘం చూసే వంకర చూపులు , మనుషులు మాట్లాడే వంకర మాటలు గుర్తువచ్చి ఏ ఆడదైనా అంత ధైర్యం చేయగలదా. మనసు లోనే మౌన సంఘర్షణ . పోరాడి పోరాడి అలసి పోయాను. నన్ను నేను మరచి పోవటానికి ఎంత ప్రయత్నించినా ఓడి పోతూనే వున్నాను.

ఈ కధ నాతోనే ఆగిపోకుండా మళ్ళీ నా కూతురి జీవితంలో మొదలవ్వ పోతోంది. ఇది నేను అసలు సహించ లేక పోతున్నాను. మామయ్య మైధిలిని ఒక పెద్ద వ్యాపార వేత్తకు కట్టబెట్టి పెండ్లి చేయాలని నిర్ణయించారు. దాని మనసు ఏమిటి అని యధాప్రకారమే అడుగలేదు . ఎప్పుడూ మామయ్య నిర్ణయించటమే కాని ,ఎదుటివారి ఆలోచనల గురించి ఆలోచించే తీరిక అలవాటు ఆయనకు తెలియదు. పెద్ద వ్యాపారవేత్తకదా.!


మైధిలి ఈ పెళ్ళి ఇష్టంలేదని చెప్పింది.


రవి బావ అంటే ప్రాణం అనిచెప్పింది నిన్ను అమితంగా ప్రేమించానని చెప్పింది. నేను కోరుకున్న జీవితం రవి బావే నాకందించకలడు అనిచెప్పింది. కాని ఆడంబర ప్రపంచానికి డబ్బు , హోదాలే ముఖ్యమనుకునే నీ మామయ్య తన మాట వినకుండ పెళ్ళి నిర్ణయించేసారు. చివరకు నా ఈ కఠిన నిర్ణయానికి కారణం ,


నా చివరి కోరికతో అయినా మైధిలి జీవితం మారుతుందని నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చూడని ప్రపంచాన్ని ఆమెకు నీవు చూపించాలి. మైధిలిని నువ్వు పెళ్ళి చేసికొని అది కోరుకున్న జీవితాన్ని నీవు అందిస్తావని పూర్తిగా నమ్ముతున్నాను. నా చిన్ని తల్లి జీవితం నీ దగ్గర ఆనందాల బృందావనం అవుతుంది రవి .


ఇక నిశ్చింతగా శెలవు తీసుకుంటాను. మరో జన్మఅంటూ ఉంటే పూర్తి జీవితాన్ని అనుభవించే వరం ఇవ్వమని దేవుడిని కోరుకుంటాను. శెలవు.


నీకు ప్రియమైన సీతత్త


చివరి పంక్తులు కన్నీటితో తడిచి అలుక్కు పోయాయి. ఎక్కడో చదివిన వాక్యం గుర్తు వచ్చింది A women’s heart is a deep ocean of secrets .


ఎన్ని బాధలు వున్నా ఎన్నిగాయాలు మనసుకు తగిలినా ఆ కనుల వెనుక ఎన్ని కన్నీళ్ళు దాగినా మా సీతత్త లాగ ఎంత మంది స్త్రీ మూర్తులు తల్లడిల్లు తున్నారో.


భూదేవి అంత ఓర్పు వున్న ఓ మహిళా నీకు వందనమమ్మ అని వస్తున్న కన్నీటిని ఆపుకుని తల్లి లేని నాకు మాతృప్రేమ తో నాకు బాసటగా నిలిచి ఇంత వాడిని చేసిన సీతత్త కోరిక తీర్చటానికి ,

మనసా వాచా మైధిలిని అక్కున చేర్చుకొని, నా గుండెలో గూడు కట్టి తను కోరుకుంటున్న కొత్త బంగారు లోకం చూపించటానికి వెంటనే హైదరాబాదు బయలుదేరాను. అత్త ఆశీస్సులు వెంట వెంట పెట్టుకొని.

———. ———-. ———-*రచయిత్రి పరిచయం. >>> అబ్బూరి వారి కోడలిని. పేరు. రత్నలక్ష్మి. చిన్న చిన్న కవితలు రాస్తాను కాని, ఏ పత్రికలకు పంపలేదు. నా ఆనందంకోసం వ్రాస్తాను. కొన్ని మహిళా సంఘాలకు ప్రసిడెంటుగా చేసాను. మహిళల అభివృద్ధికి చాల కార్యక్రమాలు నిర్వహించుతున్నాను. అలాగే ప్రతి ఆడపిల్ల చదుకుని తన కాళ్ళమీద తను నిలబడితే సమాజం బాగుపడుతుందని నమ్ముతాను. రూరల్ ఏరియా స్ లో 35 స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాను. నేను చేసిన సేవలకు కొన్ని అవార్డులు కూడ తీసుకున్నాను. ప్రతి ఒక్కరు సమాజంలో మార్పు కోసం బాధ్యతగా ఎంతో కొంత ప్రయత్నం చేయాలని భావిస్తాను.


179 views0 comments

Comments


bottom of page