top of page

ఓబయ్య గేదె

#Thirumalasri, #తిరుమలశ్రీ, #ObaiahGede, #ఓబయ్యగేదె, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

ree

Obaiah Gede - New Telugu Story Written By Thirumalasri

Published In manatelugukathalu.com On 08/08/2025

ఓబయ్య గేదె - తెలుగు కథ

రచన: తిరుమలశ్రీ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఓ తెలుగు రాష్ట్రంలోని ఆ గ్రామంలో పట్టుమని పాతిక గడపలు కూడా ఉండవు. వాటిలో ఓబయ్య గడప ఒకటి. ఓబయ్యకు ఇరవయ్ ఆరేళ్ళు వుంటాయి. నిరక్షరకుక్షి అయినా కష్టజీవి. పెళ్ళయి రెండేళ్ళు అయింది. పెళ్ళిలో మావగారు కట్నంగా ఇచ్చిన గేదె అతని ఆరో ప్రాణం అయింది. 


అది ముర్రా బ్రీడ్ కి చెందిన ఆడగేదె. నల్లగా నిగనిగ లాడుతూ, నల్లటి పెద్ద కళ్ళతో బాగుంటుంది. రోజుకు ఇరవయ్ లీటర్ల పాలు ఇస్తుంది. సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆ పాలను వతనుగా పోస్తుంటాడు ఓబయ్య. ఆ గేదె వచ్చాక అతని ఆర్థిక పరిస్థితి మారిపోయింది. దానికి ‘లక్ష్మి’ అని పేరు పెట్టుకుని, ఎంతో అపురూపంగా చూసుకుంటాడు.


‘నాకంటే కూడా నాతోపాటు వచ్చిన ఆ గేదే ఎక్కువయి పోయింది నీకు!’ అంటూ అలుగుతుంటుంది అతని భార్య మురిపెంగా. 


‘నువ్వూ, లక్ష్మీ నా రెండు కళ్ళూనే!’ అంటాడు ఓబయ్య నవ్వు తూ.


ఇలా ఉండగా ఓ రోజున మేతకు వెళ్లిన ‘లక్ష్మి’ ఏమయిందో, ఇంటికి తిరిగిరాలేదు. ఊరు, ఊరి పొలిమేరలూ, చుట్టుపక్కల ప్రాంతాలూ పిచ్చి పట్టినవాడిలా వెదికాడు ఓబయ్య. గేదె ఎక్కడా కనిపించలేదు.


“వాకింగ్ కి వెళ్లి తెలియకుండానే చాలా దూరం వెళ్లిపోయి వుంటుంది. అదే తిరిగి వస్తుందిలే. విచారించకు” అంటూ ఓబయ్యను ఓదార్చడానికి చూసారందరూ. స్థిమితపడలేదు అతను. నాలుగు రోజులు అయినా గేదె జాడ లేదు. ఓబయ్య బెంగతో నీరసించిపోయాడు. 


ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎలిమెంటరీ స్కూలుకు ఏకైక ఉపాధ్యాయుడు అయిన రాజయ్యకు ముప్పయ్ ఏళ్ళుంటాయి. గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అతన్నే సంప్రదిస్తారు.


ఓబయ్య మాస్టారితో తన గోడును చెప్పుకుని దుఃఖించాడు. “నా గేదె పాలు ఎక్కువ ఇస్తుందని కన్నుకుట్టి, నా లక్ష్మి ని ఎవరో అసూయతో దొంగిలించుకునిపోయివుంటారు, ” అంటూ వాపోయాడు.


రాజయ్య ఆలోచించి, “లక్ష్మికి ప్రమాదం ఏదైనా జరిగివుంటే ఈపాటికి మనకు తెలిసేది. దాన్ని ఎవరో కిడ్నాప్ చేసివుంటారనడంలో సందేహం లేదు. ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది” అని సలహా ఇచ్చాడు. 

ఓబయ్య పక్క టౌన్ లో ఉన్న పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు. ఎస్సయ్ ని కలుసుకుని, “సార్! నా లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేసారు. మీరు వెంటనే వెదికి తీసుకురావాలి” అని చెప్పాడు.


“లక్ష్మి వయసెంత?” అనడిగాడు ఎస్సయ్. అయిదేళ్ళు అని చెప్పాడు ఓబయ్య. 


“చిన్నపిల్లలను అలా ఒంటరిగా ఎలా వదిలేసారు? జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదూ?” అంటూ తీవ్రంగా మందలించాడు ఎస్సయ్. “ఫోటో వుందా?” అని అడిగాడు.


లేదన్నాడు ఓబయ్య. ఎలా వుంటుందో వర్ణించమని అడిగితే- “మెరిసే పెద్దకళ్లతో, నిగనిగలాడే నల్లటి ఒంటిరంగుతో అందంగా ఉంటుంది, సార్! తోక కూడా పొడవుగా ఉంటుంది” అని చెప్పాడు. 


ఉలిక్కిపడ్డ ఎస్సయ్, “తోక ఉండడం ఏమిటి? తోకతో పుట్టిందా?” అనడిగాడు విభ్రాంతితో.


“గేదెలకు తోకలుంటాయి కదు సార్?” అని జవాబిచ్చాడు ఓబయ్య అమాయకంగా.


ఆ సమాధానంతో కుర్చీలోంచి తాడెత్తున ఎగిరిపడ్డాడు ఎస్సయ్. సీలింగుకి కొట్టుకుని తల బొప్పికట్టడంతో తల చేత్తో రుద్దుకుంటూ కోపంగా చూసాడు ఓబయ్య వంక. “ఏమిట్రా, వేషాలేస్తున్నావా? లక్ష్మి అంటే నీ కూతురు కాదా?” అన్నాడు.


ఓబయ్య మాత్రం, “కాద్సార్! నా గేదె. కూతురికంటే ఎక్కువ. నా మావగారు పెళ్లిలో కట్నంగా ఇచ్చాడు దాన్ని. అది మామూలు రకపు గేదె కాదు. రోజుకు ఇరవై లీటర్ల పాలిస్తుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టుకున్నాను. అదంటే నాకు ప్రాణం సార్!” అని చెప్పాడు.


ఎస్సయ్ కి ఒళ్ళు మండిపోయింది. “ఏమిరా, పోలీసులంటే నీ కళ్ళకు పనీపాటూ లేని పోరంబోకుల్లా కనిపిస్తున్నార్రా? గేదెల్నీ, ఆవుల్నీ వెదకడానికే ఇక్కడ ఈగల్నీ దోమల్నీ తోలుకుంటూ ఖాళీగా కూర్చున్నాం అనుకున్నావట్రా?” కళ్ళలో నిప్పులు చెరుగుతూ పైకప్పు ఎగిరిపోయేలా అరచాడు. 


“సార్! నా గేదెని దొంగలు ఎత్తుకుపోయారు. దొంగల్ని పట్టుకునేది పోలీసులే కద్సార్? అందుకే మీ దగ్గరకు వచ్చాను, ” అన్నాడు ఓబయ్య ఎస్సయ్ రియాక్షన్ కి బిత్తరపోతూ.


“ఒరేయ్! నాకు వచ్చిన మంటకు మెంటలెక్కిపోకముందే ఇక్కడినుండి వెనక్కి తిరిగిచూడకుండా పారిపో నువ్వు! ఇంకోక్షణం ఇక్కడే ఉన్నావంటే లాకప్ లో త్రోసి కుళ్లబొడిచేస్తాను నిన్ను. అంతేకాదు, మళ్ళీ ఎప్పుడైనా ఈ దరిదాపుల్లో కనిపించావంటే ఎన్ కౌంటర్ చేసిపడేస్తాను, జాగ్రత్త!…” అంటూ శివమెత్తినవాడిలా ఊగిపోతూ పెద్దగా అరచాడు ఎస్సయ్.


దాంతో హడలిపోయిన ఓబయ్య పంచె ఊడిపోయి కాళ్ళలో పడుతున్నా పట్టించుకోకుండా బయటకు పరుగెత్తాడు…


పోలీసు స్టేషన్ లోని ఎపిసోడ్ గురించి ఆలకించిన రాజయ్య ఓబయ్య వంక జాలిగా చూసాడు. “నిజమేలేరా, మనుషుల్నే వెదికి పట్టుకోలేని పోలీసులు పశువుల్ని ఏం కనిపెడతారులే” అన్నాడు ఓదార్పుగా.


రాజయ్య టెంత్ వరకు చదువుకున్నాడు. టీచర్ ట్రెయినింగు అయి, ఆ స్కూల్లో ఉద్యోగం సంపాదించాడు. అతని నాలెడ్జ్ ఆ పరిసరాలకే పరిమితం. కాకపోతే దినపత్రికలు చదువుతాడు. టీవీ వాచ్ చేస్తాడు. లోగడ ఎప్పుడో ‘సమాచార హక్కు’ (సహ) చట్టం గురించి ఆలకించివున్నాడు. ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చింది.


‘సహ చట్టం’ గురించి ఓబయ్యకు చెప్పి, ఓ అర్జీ పెట్టుంటే, ప్రభుత్వమే వాడి ‘లక్ష్మి’ ని వెదికి పట్టుకు వస్తుందన్నాడు. ఓబయ్య ఆనందానికి మేరలేకపోయింది. 


‘లక్ష్మి’ ఎవరో, అది ఓబయ్యకు ఎలా వచ్చిందో, దాని జాతి ఏమిటో, రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో, ఎప్పట్నుంచి తప్పిపోయిందో…’ వగైరా వివరాలతో ఓబయ్య తరపున ఓ అర్జీని తయారుచేసాడు రాజయ్య. చివరగా, ‘నా లక్ష్మిని ఎవరు దొంగిలించారు? అది ఇప్పుడు ఎక్కడ వుంది? క్షేమంగానే ఉన్నదా? నా లక్ష్మిని నాకు ఎప్పుడు తీసుకువచ్చి అప్పగిస్తారు?...’ అంటూ ముగించాడు.


 అయితే, ఆ అర్జీని ఎవరికి పంపించాలో తెలియలేదు రాజయ్యకు. ఆలోచిస్తే, ‘ఆ చట్టం చేసింది కేంద్రప్రభుత్వం కనుక దాన్ని వాళ్లకే పంపించాలి’ అనిపించింది. అంతే! ఆ అర్జీని కవర్లో పెట్టి స్పీడ్ పోస్టులో ప్రధానమంత్రికి పంపించాడు…


అయితే, వారంరోజుల్లోనే ప్రధాని కార్యాలయం నుంచి కవరు రావడంతో, తన గేదె తిరిగివచ్చేసినంత ఆనందంతో చంకలు కొట్టుకుంటూ దాన్ని పట్టుకుని రాజయ్య దగ్గరకు పరుగెత్తాడు ఓబయ్య. కవరు విప్పి అందులో జతపరచిన లేఖను చదివాడు రాజయ్య- ‘రూల్సు ప్రకారం అప్లికేషన్ ఫీజు పదిరూపాయలు కట్టనందున ఆ అర్జీని వాపసు చేయడమయింది’. 


నిరుత్తరుడయ్యాడు ఓబయ్య. అంతలోనే కోపం తన్నుకువచ్చింది. “నా గేదెను నాకు తెచ్చివ్వడానికి నేను డబ్బులు కట్టాలా? పదిరూపాయల కోసం నా అర్జీని వాపసు చేసేసారా!?” అంటూ చిందులు త్రొక్కాడు.


అతన్ని శాంతింపజేస్తూ, “అది ప్రభుత్వపు రూలు. ఎవరైనా పాటించవలసిందే” అన్నాడు రాజయ్య. తరువాత పక్క టౌన్ లో వున్న పోస్టాఫీసుకు వెళ్ళి పదిరూపాయలకు పోస్టల్ ఆర్డర్ తీసుకున్నాడు. దాన్ని ఓబయ్య అర్జీకి జతచేసి మళ్ళీ స్పీడ్ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాడు…


ఓబయ్య రెండో అర్జీ ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ సెక్షన్ ఆఫీసరు టేబుల్ మీద ల్యాండ్ అయింది. అతనికి తెలుగు రాదు. తెలుగు తెలిసిన ఓ ఉద్యోగిని పిలిపించి దాన్ని చదివించుకున్నాడు. ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకుని తన బాస్- అండర్ సెక్రెటరీ- దగ్గరకు పరుగెత్తాడు.


“సాబ్! ఏ పిటీషన్ టెలుగూమే హై…” అన్నాడు ఉపోద్ఘాతంగా.


“టెలుగూ? ఏ టెలుగు క్యా హోతా హై?” అనడిగాడు బాస్. 


అతనికీ, జనరల్ నాలెడ్జ్ కీ అసలు పడదు!


“ఎన్టీయార్ కా భాషా హై సాబ్!’ అన్నాడు సెక్షన్ ఆఫీసర్. 

ఆఫీసు వర్క్ ని అటక ఎక్కించి, పదోన్నతికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటాడు. కనుక జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది అతనికి.


“ఎమ్టీయార్ కా? ఓ మసాలావాలా?” అడిగాడు బాస్.


“నై, సాబ్! ఎమ్టీయార్ నై, ఎన్-టీ-యార్… ఎన్టీ రామారావ్. ఓ సౌత్ మే బహుత్ బడా ఫిల్మ్ స్టార్ థే. ఔర్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కొ చీఫ్ మినిస్టర్ భీ థే” వివరించాడు సెక్షన్ ఆఫీసరు. 


“ఠీక్ హై… ఇస్ మే క్యా లిఖా హై?” అడిగాడు బాస్, ఉత్సాహరహితంగా. 


సెక్షన్ ఆఫీసర్ చెప్పింది ఆలకించగానే కోపంగా ఆ అర్జీని విసిరికొట్టాడు బాస్. “ఓ పాగల్ హై క్యా? డస్ట్ బిన్ మె ఫేక్ దో…” అన్నాడు.


“హాఁ, సాబ్! లేకిన్… ఏ ఎలెక్షన్ టైమ్ హై నా?” నసిగాడు సెక్షన్ ఆఫీసరు.


అది సార్వత్రిక ఎన్నికల సమయం. సామాన్య ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి యమస్పీడులో పరిష్కరించవలసిందిగా స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. 


బాస్ ఆలోచించాడు. ఓబయ్య అర్జీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది కనుక, ‘తగు చర్య’ నిమిత్తం దాన్ని ఆర్.టి.ఐ. (రైట్ టు ఇన్ఫర్మేషన్) కమీషనర్ కి పంపవలసిందిగా ఆదేశించాడు. సెక్షన్ ఆఫీసరు దాన్ని అదే రోజున స్పీడ్ పోస్ట్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు…


ఆర్.టి.ఐ. కమీషనరు ఆఫీసు నుంచి ఓబయ్యకు జవాబు వచ్చింది- ‘అది తమ పరిధిలోకి రాదంటూ’. ఓబయ్య ఏడ్పుముఖం చూసిన రాజయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. బాగా ఆలోచించి, ఓబయ్య గేదె ఉదంతం గురించి ఓ దినపత్రికకు సమాచారం పంపించాడు. 


అది ప్రచురింపబడ్డ మర్నాడే పాప్యులర్ ఆర్.టి.ఐ. యాక్టివిస్ట్ ఉలగనాథన్ చెన్నయ్ నుండి రెక్కలు కట్టుకుని వచ్చి ఆ గ్రామంలో వాలాడు. ఆర్.టి.ఐ. కమీషనర్ నుండి ఎవరికి న్యాయం జరగకపోయినా రంగంలోకి దిగుతాడు అతను. ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడతాడు. సంబంధిత అధికారులను పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఉతికి ఆరేస్తాడు. అందువల్ల అతనంటే భయపడతారంతా. 


ఓబయ్యను వీడియో ఇంటర్ వ్యూ చేసాడు ఉలగనాథన్. ‘గేదె తన ఆరో ప్రాణం అనీ, తన జీవనాధారం అదేననీ, అది దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటాననీ’ వాపోయాడు ఓబయ్య. ఎందుకైనా మంచిదని, అతని చేతిలో ఓ ఎండ్రిన్ డబ్బా కూడా పెట్టాడు ఉలగనాథన్. తరువాత ఓబయ్య తరపున ఓ పెద్ద అర్జీని స్వయంగా తయారుచేసి, దానికి ఆ వీడియోని జతచేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాడు. 


అది పి.ఎమ్.ఒ. లో ఓ సీనియర్ అధికారికి వెళ్లింది. దాన్ని చదివి అగ్గిగుగ్గిలం అయిపోయిన అతగాడు దాన్ని చెత్తబుట్టలో పడేయబోయాడు. ఐతే, దాన్ని పంపించింది ‘నొటోరియస్’ ఉలగనాథన్ అని స్ఫురించడంతో ఆగిపోయాడు. దాంతోపాటే, ప్రధాని యొక్క పాప్యులర్ స్లోగన్ ‘జనతా జానార్ధన్’ అన్నదీ బుర్రలో మెదిలింది. ఆలోచించి, దాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఏర్పాటుచేసాడు- 


‘దాన్ని అందుకున్న డెబ్బయ్ రెండు గంటల్లో దొంగిలింపబడ్డ ఓబయ్య గేదెను కనిపెట్టి అతనికి అప్పగించవలసిందనీ, ఆ విషయం తమకు నిర్ధారించవలసిందనీ…’ ఆదేశించుతూ.


‘రూల్… ఆర్… నో-రూల్!’- పి.ఎమ్.ఓ. నుండి వచ్చిన ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం శిరసావహించక తప్పదు. పైగా అది ‘డబుల్ ఇంజన్’ సర్కారాయె! తక్షణమే చీఫ్ సెక్రెటరీ నుండి డి.జి.పి. కి ఆదేశాలు వెళ్ళాయి- ‘నలభయ్ ఎనిమిది గంటల్లో ఓబయ్య గేదెను కనిపెట్టి అతనికి అప్పగించాలనీ, అతని వద్ద సాక్షి సంతకాలతో సహా ఎక్నాలెడ్జ్ మెంట్ తీసుకుని పంపించవలసిందనీను’.


 డి.జి.పి. ఆఫీసు నుండి సంబంధిత ఎస్పీకి, అతని నుండి సి.ఐ. కీ ఆర్డర్స్ వెళ్ళాయి. సి.ఐ. ఎస్సయ్ ని సమన్ చేసి ఆ కాగితాన్ని అతని మీదకు విసిరేసాడు కోపంగా. దాన్ని చదివి ‘కిం కర్తవ్యం’ అనుకుంటూ తల పట్టుకున్నాడు ఎస్సయ్. 


ఓబయ్య రూపం కళ్ళముందు మెదలడంతో తనమీద తనకే కోపం వచ్చింది- కంప్లెయింటుతో తన దగ్గరకు వచ్చిన రోజునే ఓబయ్యను ఎన్ కౌంటర్ చేసిపారేయనందుకు!


రోజంతా ఎవరి జుత్తు వారే పీక్కుంటూ ఆలోచించారు ఇన్స్ పెక్టర్లు ఇద్దరూ. ఆ తరువాత ఓ నిశ్చయానికి రావడంతో వారి పెదవులపైన మందహాసరేఖలు వెలసాయి…


పోలీసులు ముర్రా గేదెను తీసుకొచ్చి అప్పగిస్తూంటే ఓబయ్య ఆనందానికి మేరలేకపోయింది. గేదె అందినట్టు అతని వద్ద రశీదు తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. 


ఆ సమయంలో రాజయ్య ఊళ్ళో లేడు. నాలుగురోజుల తరువాత తిరిగిరాగానే విషయం తెలిసి పరుగెత్తుకొచ్చాడు.


అతను అభినందిస్తూంటే, “నా లక్ష్మి నాకు మళ్ళీ దక్కిందంటే అది మీరు, మీ సహ చట్టం చలవే మాస్టారూ!” అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఓబయ్య. 


“కానీ, ఒక విషయం నాకు బోధపడడంలేదు… పెద్దగా వుండే లక్ష్మి కళ్ళు చిన్నవయిపోయాయి. మునుపటి మెరుపులు కనిపించడంలేదు. నన్ను చూసి పొడవబోయింది కూడాను. పాలు మాత్రం మునుపటిలాగే బాగా ఇస్తోంది, ” అని చెప్పాడు.


“నీకోసం ఏడ్చి ఏడ్చి దాని కన్నులు చిన్నవయిపోయి మెరుపులు తగ్గిపోయివుంటాయి” అన్నాడు రాజయ్య. “ఇకపోతే ‘నన్ను తిరిగితెచ్చుకునేందుకు ఇన్ని రోజులు పట్టిందా నీకు?’ అన్న కోపం అయ్యుంటుంది. అందుకే పొడవబోయింది...”


అదే సమయంలో-


అక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామంలో- ‘ఓ రైతు యొక్క రోజుకు ఇరవయ్ లీటర్ల పాలిచ్చే ‘ముర్రా’ గేదెను దొంగలు ఎత్తుకుపోయారనీ, అది ఎక్కడ వున్నదీ చెప్పవలసిందనీ, వెంటనే తెచ్చిఇవ్వవలసిందనీ…’ ‘సహ చట్టం’ క్రింద ప్రధానమంత్రికి అర్జీని తయారుచేస్తున్నాడు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూలు టీచరు…!!


************

తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."





Comentários


bottom of page