top of page
Original.png

ఒక తండ్రి కోరిక

1 hour ago
7 min read

స్ట్రోక్‌తో బాధపడుతున్న వృద్ధ తండ్రికి హోటల్‌లో ప్రేమగా భోజనం తినిపిస్తున్న కొడుకు ప్రతాప్; చుట్టూ మానవత్వాన్ని గుర్తించిన హోటల్ మేనేజర్, అతిథులు.

Oka Tandri Korika - Telugu Family Story | Lakshmi Nageswara Rao Velpuri

ఒక తండ్రి కోరిక - తెలుగు కుటుంబ కథ | లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

Published In manatelugukathalu.com On 09/09/2026


వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు రచించిన “ఒక తండ్రి కోరిక” ఒక హృదయస్పర్శి సామాజిక సందేశాత్మక కుటుంబ కథ. వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి గారు, తన జీవితంలో మిగిలిన రోజుల్లో ఒకసారి బయటకు వెళ్లి రుచికరమైన భోజనం చేయాలనే చిన్న కోరికను కొడుకు ప్రతాప్‌తో పంచుకుంటారు. తండ్రి కోరికను తీర్చేందుకు కొడుకు చూపించే ప్రేమ, సేవ, త్యాగం ఈ కథకు ప్రధాన బలం.


ఆరోజు ఆదివారం. రాఘవాచారి గారి మూలుగు లీనంగా వినబడుతుంది. కొడుకు ప్రతాప్, కోడలు రమ, ఇద్దరు పిల్లలు కలిసి సరదాగా టీవీలో మంచి సినిమా చూస్తున్నారు.


"ఏవండీ! మీ నాన్నగారు మళ్లీ మూలుగుతున్నారు చూడండి" అనగానే, "సరే, నేను చూస్తానులే!" అంటూ గాభరాగా ప్రతాప్ నాన్నగారి గదిలోకి వెళ్ళాడు.


రాఘవాచారి గారికి 82 ఏళ్లు దాటాయి. భార్యావియోగంతో సతమతమవుతూ తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. కోడలు రమ మొదట్లో మామగారికి, అత్తగారికి చాలా సేవలు చేసి విసిగిపోయింది. భర్త ప్రతాప్ భయంతో, ఎంతో సహనంతో అణిగిమణిగి సంసారం సాగించేది. కానీ రాను రాను అత్తగారు పోవడంతో, మావయ్య గారి ఆరోగ్యం దెబ్బతిని అలాగే ఇంట్లోనే ఉంటూ మందులు వేసుకుంటూ, మనవళ్లతో కబుర్లు ఆడుతూ, చీటికిమాటికి, "రమా! ఇది చేయు, అది చేయు" అంటూ విసిగిస్తూనే ఉండేవారు. చేసేది లేక రమ పడుతూ లేస్తూ, పిల్లలకు క్యారేజీలు, భర్తకి లంచ్, ఇంటి శుభ్రత చేసుకుంటూ, బాగా అలసిపోయి విసుక్కుంటూ మొక్కుబడిగా మావయ్య గారికి సేవలు చేస్తూ ఉండేది.


కోడలు రమ కూడా, ఆయన చాదస్తం, అస్తమానం "అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి!" అంటూ పిలవడం, కనీసం ఆదివారం అయినా భర్త పిల్లలతో కలిసి సరదాగా గడపడం ఆయనకు ఇష్టం లేదేమో, అలా మూలుగుతున్నారు అంటూ మనసులోనే తిట్టుకుని నిట్టూర్పులు విడుస్తుంది రమ.


రాఘవాచారి గారు ఎంతో ఉన్నత హోదాలో రిటైర్ అయి, సొంత ఇల్లు నిర్మించి, ఒకగానొక కొడుకు ప్రతాప్‌కు ఘనంగా వివాహం జరిపించి, దాచిన ఆస్తినంతా కొడుకుకు, మనవళ్లకు రాసి, భార్య చివరి రోజులలో కూడా కొడుకు మీద ఆధారపడి తన శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో, భార్య వియోగం అతనిని మరింత కృంగదీసింది.


అలా పది సంవత్సరముల తర్వాత తన 81వ ఏట పక్షవాతం పాలై మంచాన పడ్డారు. కోడలు సేవలు చేయలేక అసహనంగా ప్రవర్తించడం భర్త ప్రతాప్ గమనించినా, సంసార భారం మోస్తున్న భార్యను కూడా ఏమీ అనలేక, నెలకు ఒకసారి తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లి మందులు ఇప్పింప సాగాడు ప్రతాప్. ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి తన చదువు కోసం, భవిష్యత్తు కోసం ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటూ, కన్న తండ్రికి తానే స్వయంగా దగ్గర ఉండి సేవలు చేస్తుండేవాడు.


కోడలు రమ భర్త మీద అనురాగంతో తన శాయశక్తుల సహకరించేది. రాను రాను మామగారి ఆరోగ్యం క్షీణించడంతో, పిల్లలకు, భర్తకు మాత్రమే చూస్తూ మిగతా వారిని నిర్లక్ష్యం చేసేది. అయినా ఆమె తప్పు కూడా లేదు; ఒకపక్క భర్త వ్యాపారంలో ఒడిదుడుకులు, పిల్లల చదువులతో ఆమెకు క్షణం తీరిక ఉండేది కాదు.


ఆరోజు నాన్నగారి గదిలోకి వచ్చిన ప్రతాప్, "ఏంటి నాన్నగారు! అంత గట్టిగా మూలుగుతున్నారు, ఒంట్లో ఎలా ఉంది?" అని అడిగి, నాన్నగారికి వేసిన డైపర్ చెక్ చేసి మార్చి, సమయం రెండు గంటలు అవుతున్నది కనుక పెరుగు అన్నం కలిపి, కారం ఉప్పులేని కూరను నంచుకు పెడుతూ, తానే స్వయంగా ఒక్కొక్క ముద్ద మెల్లిగా తండ్రికి తినిపిస్తూ, అప్పుడప్పుడు నోటిని శుభ్రం చేస్తూన్న కొడుకుని చూస్తూ, "ఏరా, మిమ్మల్ని నేను చాలా బాధ పెడుతున్నాను. నా నోరు ఒక పక్క వంగిపోయింది, నా ఎడమ చేయి లేవడం లేదు, నన్ను చూసి పిల్లలు కూడా దగ్గరకు రావడం మానేశారు. పాపం కోడలు పిల్ల ఎంత సేవ చేస్తుందో తెలుసు, మీరందరూ నన్ను క్షమించండి!" అంటూ నత్తి నత్తిగా మాట్లాడుతున్న నాన్నగారి కన్నీళ్లు తుడుస్తూ తల నిమురుతూ, "పర్వాలేదు నాన్నగారు! తొందరలో మీకు నయం అవుతుంది, మంచి మందులు ఇప్పిస్తున్నాను, నేనున్నానుగా మిమ్మల్ని చూసుకోవడానికి" అంటూ అనునయిస్తున్న కొడుకుని చూస్తూ, "ఇన్ని బాధలు పడే కన్నా ఆ దేవుడు నన్ను కూడా మీ అమ్మ దగ్గరకు తీసుకుపోతే ఎంతో బాగుంటుంది, ప్రతిరోజు ఆ దేవుడిని నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడో అని ప్రశ్నిస్తే జవాబు దొరకటం లేదు, ఆ దేవుడు దయ ఎప్పుడు చూపిస్తాడో అర్థం కావడం లేదు" అంటూ కొడుకు చేతులు పట్టుకొని, నోటి వెంట చొంగ కారుతూ మాట్లాడుతున్న తండ్రిని చూసి కన్నీళ్లు తుడుస్తూ, "నాన్నగారు బాధపడకండి! మంచి మంచి డాక్టర్లకు చూపిస్తున్నాను, త్వరలోనే మీకు పక్షవాతం తగ్గి, మీ కాలు, చెయ్యి, నోరు అదుపులోకి వస్తాయి, మీకు ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి, అవి కూడా తీరుస్తాను!" అంటూ తడిగుడ్డతో ఆయన శరీరాన్ని తుడుస్తూ చెప్తున్న ప్రతాప్‌ని తన దగ్గరగా తీసుకుని సంతృప్తిగా నిద్రపోయారు రాఘవాచారి గారు.


ఇలా కొన్ని నెలలు గడిచాక, రాఘవాచారి గారి ఆరోగ్యం కుదుటపడక, కొడుకు ఆసరా లేకుండా బయట కూడా రాలేని పరిస్థితిలో, ఆరోజు "ఒరేయ్ ప్రతాప్, ఈరోజు డాక్టర్ గారి దగ్గరకు వెళ్లాలి కదా!" అని అడిగారు.


"అవును నాన్నగారు, సరిగ్గా 10:30 తర్వాత డాక్టర్ గారి కన్సల్టేషన్ ఉంది, మీకు అన్ని పరీక్షలు చేసి మంచి మందులు రాస్తానన్నారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు తయారుగా ఉండండి" అని చెప్పేసరికి, "ఒరేయ్, నాది ఒక కోరిక ఉందిరా, తీరుస్తావా?" అని జాలిగా అడుగుతున్న నాన్నగారిని "చెప్పండి" అనగానే, "మరేం లేదురా, ఎలాగైనా ఒక మంచి హోటల్కి వెళ్లి భోజనం చేయాలని కోరిక ఉందిరా, సంవత్సరాల తరబడి ఇంట్లోనే కోడల పిల్ల వంట తింటూ బయట రుచులకు దూరమయ్యాను. పాపం, కోడలు ఎంతో కష్టపడి మంచిగానే చేస్తుంది, అయినా నా జిహ్వాచాపల్యం ఆగటం లేదు. ఆమె చూడకుండా అప్పుడప్పుడు ఒక ఆవకాయ ముక్క, గోంగూర పచ్చడి దొంగతనంగా తింటున్నాను, షుగర్ వల్ల స్వీట్లు కూడా తినక చాలా రోజులైంది, ఇంకా ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు, బయటకు వెళ్లి అన్ని రుచులు తినాలని అనిపిస్తుంది, ఇది నా చివరి కోరిక అనుకో!" అంటూ ఆత్రుతగా ఆయాసపడుతూ నత్తి నత్తిగా చెప్తున్న నాన్నగారి నోటిలోంచి కారుతున్న చొంగను తుడుస్తూ, "నాన్నగారు, మీకు ఈరోజు అనుకున్నవన్నీ తినిపిస్తాను, మీ కోడలికి చెప్పకండి, మీ అనారోగ్యానికి బయట తిండి పనిచేయదని బాధపడుతుంది" అని తండ్రిని ఓదార్చాడు కొడుకు ప్రతాప్.


ఆ మర్నాడు ప్రతాప్ నాన్నగారి మెడికల్ ఫైల్ తీసుకుని తన కారులో కూర్చోబెట్టి భార్యకు వీడ్కోలు పలకగానే, భార్య రమ కూడా మామగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే భర్త తన తండ్రిని ఎంతో శుభ్రంగా తయారు చేసి, మంచి వైట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, చెప్పులకు బదులు బూట్లు వేసి, ఆయనకు నీటుగా షేవింగ్ చేసి, ఆయన వయస్సును పదేళ్లకు తగ్గించినట్లుగా తయారుచేసిన వైనం చూసి నిర్ఘాంతపోయి, "ఏమిటండీ! మామయ్య గారిని కుర్రాడిలా తయారు చేశారు, డాక్టర్ గారి దగ్గరికైనా?" అని అడిగేసరికి, "అవునే, ఇవాళ ఇంగ్లాండ్ నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నా, అందుకే నీటుగా తయారు చేశాను" అంటూ బై చెప్పి తన కారును పోనిచ్చాడు ప్రతాప్.


ఆరోజు 10:00 గంటలకల్లా డాక్టర్ చెకప్ అయ్యింది. మళ్లీ నెల రోజుల వరకు మందులు రాయించి, ప్రతాప్ అడిగాడు, "డాక్టర్ గారు, ఎలా ఉంది నాన్నగారికి?" అనగానే ఆయన కొంచెం ముభావంగానే, "బానే ఉంది సార్, మీ నాన్నగారు ఎందుకో చాలా డిప్రెషన్‌లో ఉన్నారు, వయసు పెరుగుతుంది కదా, ఇలా ఉంటే ఏ మందులు పని చేస్తాయి? శరీరంలో మిగతా అవయవాలు కూడా చచ్చుబడిపోతాయి. కనుక మంచి మందులు, తగిన విశ్రాంతి, సరదాగా ఉండే సంగతులు గుర్తుచేస్తూ ఆయనను కాపాడుకోవాలి. ఇప్పటికైతే పరవాలేదు, జాగ్రత్తగా చూసుకోండి!" అంటూ పంపించేశారు.


డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఎంతో నిరాశ చెందిన ప్రతాప్, ఇక నాన్నగారికి అన్ని కోరికలు తీర్చాలి, ఎలాగైనా సంతోషంగా ఉండేటట్టు చేయాలన్న కృతనిశ్చయంతో ఆయన కోరినట్టు మంచి పెద్ద హోటల్‌కు తీసుకువెళ్లాడు ప్రతాప్.


హాస్పిటల్ నుంచి నేరుగా ఒక త్రీ స్టార్ హోటల్‌కి తీసుకువెళ్లాడు ప్రతాప్. ఎంతో ఆశ్చర్యంగా "ఏరా, మనం ఇక్కడికి వచ్చాం!" అంటూ అడిగేసరికి, "నాన్నగారు, మీరు బయట మంచి రుచి గల భోజనం చేయాలి అన్నారు కదా, మీరు ఏం తింటారో తినండి, డాక్టర్ గారు మీరు సంతోషంగా ఉండి, ఆనందంగా ఉంటే మీ జబ్బులు త్వరలో తగ్గిపోతాయి అన్నారు కదా! అందుకే మంచి హోటల్‌కి తీసుకువచ్చాను" అంటూ కారు డోరు తెరిచి నాన్నగారిని మెల్లిగా ఒక చెయ్యి అతని భుజం మీద వేసుకుని లోపలికి రాగానే, అక్కడే నిలబడిన సెక్యూరిటీ గార్డు పెద్దాయనను చూసి వినయంగా నమస్కరిస్తూ, "వెల్కమ్ సార్!" అంటూ తాను కూడా సాయం చేస్తూ లోపలికి తీసుకువెళ్లారు.


రాఘవాచారి గారు ఎనలేని ఆనందంతో, ఆ హోటల్ డైనింగ్ హాల్, దాని రంగులు, లైట్లు చూస్తూ సంతోషంగా ప్రతాప్ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర నిలబడేసరికి, అక్కడే ఉన్న మేనేజరు నమస్కరిస్తూ కుర్చీ వెనక్కి తోసి రాఘవాచారిని కూర్చోబెట్టిన వైనం ఆ హోటల్ మర్యాదలకు నిదర్శనం. అప్పటికే డైనింగ్ హాల్ అంతా కస్టమర్లతో నిండిపోయింది. దేశీ, విదేశీ భోజన ప్రియులంతా హడావిడిగా తింటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, గట్టిగా నవ్వుతూ ఆహార పదార్థాలు రుచి చూస్తున్నారు.


ప్రతాప్ తన తండ్రికి "ఏం కావాలి నాన్నగారు, ఇక్కడ చాలా రుచికరమైన ఐటమ్స్ ఉంటాయి" అంటూ నవ్వుతూ అడిగేసరికి, "ఏరా, ఎందుకురా ఇంత పెద్ద హోటల్? నా ఒక చిన్న కోరిక వలన నీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది! నేను సరదాగానే నీతో అన్నాను, ఈరోజు నువ్వు నిజం చేస్తున్నావ్, ఎంతో ఆనందంగా ఉందిరా" అంటూ కొడుకు చేయి పట్టుకుని అన్నారు రాఘవాచారి గారు.


ఆయన కళ్ళల్లో తిరుగుతున్న ఆనందభాష్పాలు, ఒంగిపోయిన నోటి నుంచి కారుతున్న చొంగను కొడుకు ప్రతాప్ తన రుమాల్‌తో తుడుస్తూ, "నాన్నగారు, మీరు ఇలా బాధపడకండి, నచ్చినది తినండి" అంటూ నాన్నగారి క్రాఫ్‌ను సరిచేస్తూ, "ఇవాళ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు నాన్నగారు, అందరు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు" అంటూ తండ్రికి కావలసిన ఆహార పదార్థాలన్నీ తెప్పించి, చెంచాలతోనూ, ఫోర్కులతోనూ తినలేని తండ్రికి తానే నోటికి అందిస్తూ, జీవితంలో తండ్రి గడిపిన సరదా ఘడియలను అడుగుతూ, తాను తింటూ ఎంతో ఆత్రుతగా రుచులను అనుభవిస్తూ, తండ్రి తన పాత మధుర జ్ఞాపకాలను కొడుకుకు వివరిస్తూ సంతోషంగా ఉన్న సమయాన, వారిద్దరినీ చూసిన అక్కడ కస్టమర్లు ఆశ్చర్యపోతూ ఉండగా, రాఘవాచారి గారు ప్రతాప్‌తో "బాత్రూమ్ ఎక్కడ?" అని అడిగి తోడు రమ్మన్నారు.


ప్రతాప్ కూడా తండ్రిని లేవదీసి ఆయన ముఖము, నోరు తుడిచి మెల్లగా నడిపిస్తూ బాత్రూమ్ వైపు వెళ్లే సమయంలో, పక్కనే ఉన్న ఖరీదైన కస్టమర్లు ఎంతో యావగింపుగా, అసహ్యంగా చూస్తూ, "ఇలాంటి వాళ్ళని హోటల్ వాళ్ళు ఎందుకు రానిస్తారు? ఛీ ఛీ, ఈ వయసులో ఏమ్మా సరదాలు, హాయిగా ఇంట్లో ఉండి తినొచ్చు కదా, చూడండి ఆయన ప్యాంటు మీద, షర్టు మీద ఎన్ని ఆహార పదార్థాలు పడి ఉన్నాయో, ఆ పెద్దాయన కొడుకుకైనా బుద్ధి లేదా!" అంటూ తమ టేబుల్స్‌ని పక్కకు జరిపి ఎంతో అవమానంగా గుసగుసలాడుతూ నవ్వుకుంటున్నారు.


చుట్టుపక్కల భోజనాలు చేస్తున్న వాళ్ళ అవహేళనలు, అసహ్యించుకోవడం, ముఖాలు తిప్పుకోవడం, ఎగతాళిగా నవ్వడం గమనిస్తున్న ప్రతాప్ కూడా, కాలు, చేయి చచ్చుబడిపోయిన తండ్రిని పడిపోకుండా పట్టుకుంటూ బాత్రూమ్ వైపు తీసుకువెళ్లి, తండ్రి పనులు అయిపోయాక మళ్లీ వచ్చి కూర్చున్నాడు.


తమ టేబుల్ చుట్టుపక్కల ఉన్న వారందరూ కొంచెం దూరంగా జరిగిపోయి నవ్వుకుంటూ భోజనం చేయడం గమనించిన రాఘవాచారి గారు కూడా కొంచెం బాధపడుతూ, "ఒరేయ్ ప్రతాప్! నావల్ల నీకు చాలా అవమానం జరుగుతుందిరా, నన్ను క్షమించరా!" అని అనగానే, "నాన్నగారు, మీరు బాధపడకండి! మానవతా విలువలు పడిపోతున్నాయి, మీరు తినండి" అంటూ కొసరి కొసరి తండ్రికి ఆప్యాయంగా తినిపించాడు కొడుకు ప్రతాప్.


"ఇంతకన్నా మంచి కొడుకు ప్రపంచంలో ఉండడురా" అంటూ తృప్తిగా భోజనం చేశారు రాఘవాచారి గారు.


అప్పటికే ఒకళ్ళిద్దరు కస్టమర్లు మేనేజర్‌ను పిలిచి, "ఏంటండీ, ఇంత పెద్ద హోటల్లో అలాంటి అనారోగ్యంతో ఉన్న ముసలి వాళ్ళని ఎందుకు రానిస్తారు? ఇలా అయితే మీ హోటల్ మూసుకోవాల్సిందే" అంటూ కంప్లైంట్ చేయగానే, "సార్, మాకు మా హోటల్‌కి వచ్చే ప్రతి ఒక్కరూ దేవునితో సమానమే, మీరు ఎలాగో వారు అంతే.


ఆ ముసలి తండ్రి మీద కొడుకు చూపిస్తున్న త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు. రేపు మీ తల్లిదండ్రులను ఇలాగే ఇంట్లో ఉంచి చంపేస్తారా? వారికి కూడా చివరి రోజులు ఆనందంగా గడపాలని ఉండదా!" అని మర్యాదగా మేనేజర్ గారు చెప్తున్నా వినకుండా, కోపంతో ఊగిపోతూ తమ టేబుల్స్‌నించి లేచి వెళ్లిపోబోతున్న సమయంలో, అక్కడే ఉన్న ఒక విదేశీ దంపతులు ఒక్కసారిగా లేచి చప్పట్లు కొడుతూ ప్రతాప్ టేబుల్ దగ్గరకు వచ్చి భుజం తడుతూ, "యు ఆర్ గ్రేట్ మై సన్!" ఇంత మానవత్వం వెల్లివిరిసిన నువ్వు, తండ్రికి ఎనలేని సేవ చేస్తూ, అవమానాలు భరిస్తూ తండ్రిని ఆనందింపజేస్తున్నావు!" అంటూ ఒక్కసారిగా ప్రతాప్‌ని కౌగిలించుకుని అభినందించేసరికి, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు తమ తప్పు తెలుసుకుని అచేతనంగా నిలబడ్డారు.


"ఆహా! భారతదేశపు మానవతా విలువలు మరే దేశంలోనూ ఉండవు, సంసార బాధ్యతలు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం" అంటూ గర్వంగా నవ్వుతూ, ఆ విదేశీ దంపతులు రాఘవాచారి గారిని, ప్రతాప్‌ని అభినందిస్తూ ఉండడం చూసి, "మనం ఈ దేశంలోనే ఉంటూ మన దేశ ఔన్నత్యాన్ని పరాయి దేశపు పౌరుడు మనకు చెప్పడమా, సిగ్గుచేటు!!" అనుకుంటూ, తాము కూడా ఒక్కొక్కరు వచ్చి ప్రతాప్‌ని, రాఘవాచారి గారిని అభినందిస్తూ తమ ప్రవర్తనను క్షమించమని అడిగారు.


ఆ హోటల్ మేనేజర్ కూడా రాఘవాచారి గారిని, ప్రతాప్‌ని సంబోధిస్తూ, "సార్! ఈ వయసులో మీరు తండ్రికి చేస్తున్న సేవను గుర్తించి, హోటల్ యాజమాన్యం మీకు ఈ పూలదండతో సత్కరిస్తోంది, ఈరోజు భోజనం ఖర్చు కూడా మా హోటల్ యాజమాన్యం భరిస్తుంది" అని రాఘవాచారి గారి మెడలో పూలదండ వేశారు మేనేజర్ గారు.


రాఘవాచారి గారిని ప్రతాప్ తమ కారులో కూర్చోబెడుతుండగా, రాఘవాచారి గారు అందరికీ ప్రతి నమస్కారం చేస్తూ, "చూడండి పిల్లలారా, వృద్ధులైన తల్లిదండ్రులను ఏనాటికి నిర్లక్ష్యం చేయక, వారికి కావలసిన వసతులన్నీ ఆప్యాయతతో భరిస్తూ, చివరి రోజులలో తమ సంతానపు అనురాగాన్ని రుచి చూస్తూ ప్రశాంతంగా తనువు చాలించాలి! ఇలా ఉంటే ఏ దేశంలోనూ అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఉండవు. గుడ్ లక్ టు యు ఆల్" అంటూ కళ్ళనిండా నీళ్లతో రాఘవాచారి గారు వీడ్కోలు పలికారు.


 ************


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు

రచయిత పరిచయం : 

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page