top of page

ఒక యోచన - ఒక అవలోకన'Oka Yochana Oka Avalokana' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 02/04/2024

'ఒక యోచన - ఒక అవలోకన' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్మంగళాపురం కాలనీ మొదటి రోడ్డు వచ్చేటప్పటికి దక్షిణ మూర్తి కారు వేగం తగ్గించి సుదీర్ఘంగా సాగే పక్క దారిలోకి మలుపు తిప్పాడు. కాసేపు ముందుకు కారుని డ్రైవ్ చేస్తూ ఆపాడు. పిదప ఫ్రంట్ డోరు తెరిచి డ్రైవింగు సీటునుండి క్రిందకు దిగి నవ్వు ముఖంతో మేనల్లుడు సుదర్శనం వేపు సాభిప్రాయంగా చూసి, ఇక దిగమన్నట్టు సంజ్ఞ చేసాడు. 


సుదర్శనం వెంటనే దిగలేదు. ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ “మీ ఫ్రెండు వాళ్ళ యిల్లు అన్నావే! ఇదేనా మామయ్యా! ” 


దక్షిణమూర్తి విప్పారిన ముఖంతో తలూపాడు. అప్పుడు సుదర్శనం తల విదిలిస్తూ అన్నాడు- “కాదు మామయ్యా! ముమ్మాటికీ ఇది ఇల్లు కాదు. సుందరమైన శ్వేత భవంతి” అంటూ ఆ ఇంటిని ఇంకా విస్మాయాత్మకంగా పరకాయిస్తూ కారు నుండి దిగాడు. ఆ యింటిని చూసి సుదర్శనం అంతలావు అబ్బురపడటానికి కారణం ఉంది. బోలెడంత కారణం ఉంది. దక్షిణామూర్తి వాళ్ల చిన్ననాటి మిత్రుడింటికని బయల్దేరదీసినప్పుడు అదేదో తమ స్థాయిలోనో లేక తమకంటే కాస్తం పై ఎత్తున ఉండే బంగళా టైపు ఇల్లో అయుంటుందనుకునే మామయ్య వెంటవచ్చాడు. తీరా యిప్పుడిక్కడకు వచ్చి చూస్తే అదొక వైట్ హౌస్ తరహా కళాత్మక కట్టడంలా ఉంది. 

మామయ్యతో కలసి అడుగులు చేస్తూ అన్నాడతను- “అయితే మామయ్యా.. మొత్తానికి మీ దివంగత ఫ్రెండు మోతుబరి వ్యాపారస్థుడే కాదు, మంచి రసికత గల కళాకారుడు కూడానన్నమాట! ”


“వ్యాపారం వల్ల చేకూరిన ద్రవ్యార్జన మాత్రమే కాదు, అతడికి పిత్రార్జితంగా యాబై యెకరాల వరిభూమి కూడా సక్రమించింది”.


అప్పుడు సుదర్శనం గంభీరవదనంతో అన్నాడు-“బ్యాడ్! వెరీ బ్యాడ్! పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళి పోయినవాడు తానుగా వెళ్ళిపోకుండా తన భాగస్వామినిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు. అందుకే అంటారు దేనికైనా ప్రాప్తం ఉండాలని! ”


ఈ లోపల దక్షిణమూర్తి వచ్చిన అలికిడి గమనించి, నౌఖర్లిద్దరూ మెయిన్ గేటు తీసి దక్షిణాముర్తికి దండాలు పెట్టి అతడి చేతినుండి సూటుకేసు అందుకుని “అమ్మగారు మీ కోసం యెదురు చూస్తున్నారయ్యా! ” అంటూ లోపలకు వెళ్ళిపోయారు; వాళ్ళు వచ్చిన కబురు మృణాళినికి అందజేయడానికి. 


అప్పుడు దక్షిణమూర్తి అదే చెరగని చిరునవ్వుతో వెనుతిరిగి అడిగాడు- “తోట నచ్చింది కదూ! ”

దానికి సుదర్శనం నవ్వూతూ స్పందించాడు- “మళ్ళీ అదే మాటా! ఇది భూలోకానికి చెందిన తోట కాదు మామయ్యా! కుబేరుడి చైతన్యరథం. ఇంకానయం, దీనిని సత్యభామ చూడలేదు. చూసుంటే శ్రీకృష్ణుడి చెవిలో ఊది సొంతం చేసుకున్ను. మరి దీనిని సాకటానికి చాలా ఖర్చే--”

“కాదు. అంతవదు. హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన మృణాళినికి ఈ పనంటే చాలా ఇష్టం. తోటిమాలితో కలిసి అంతా తానై చూసు కుంటుంది. తోటిపని ఆహ్లాదకరమైన వ్యాయామం కదూ! “


“వావ్! షి ఈజ్ గ్రేట్! అయినా నువ్విక్కడికి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి నాకు అన్యాయం చేసావు మామయ్యా! ”


“అన్నీ కుదరాలి కదోయ్! మనూరేమో ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. నువ్వేమో ఊళ్లో ఎప్పుడు కుదురుగా ఉన్నావని? ఆది నుంచీ రెసిడెంటు స్కూల్లోనూ, కాలేజీ హాస్టల్ లోనూ కాలం గడిపేవాడివి. ఇప్పుడిప్పుడే కదా కోర్సులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి ఊరుచేరావు. ఆ తరవాత తీరుబడిగా నా కంటబడ్డావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? “


“అమ్మా నాన్నా ఇక్కడికెప్పుడైనా వచ్చారా మామయ్యా! ”


“రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఒకసారేమో తిరునాళ్ళప్పుడు మృణాళినితో రోజుంతా గడిపి వెళ్ళారు కూడాను“


“ఇంతకూ నేనెందుకు ఇక్కడికి వచ్చానో మృణాళినికి తెలుసా మామయ్యా? లేక ఆమెను సస్పెన్షన్ లో ఉంచేసావా? ”


దక్షిణ మూర్తి బదులివ్వలేదు. నవ్వి ఊరుకున్నాడు. చిరువయసు నుండీ అతడికి మామయ్య వద్ద మాలిమెక్కువ. ఇద్దరూ లోపలకొచ్చి ఆసీనులవడానికి సిధ్ధమవుతున్నప్పుడు మృణాళిని మేనత్త కాంచనమాల కళ్లజోడు సవరించుకుంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. దక్షిణామూర్తి సోఫాలో కూర్చున్నాడు గాని సుదర్శనం మాత్రం ఆసీనుడు కాలేదు. నమస్కరించి నిల్చున్నాడు. 


ఆమె తనలోని ఆరాటాన్ని ఆపుకోలేక అతడి నమస్కారాన్ని అందుకోకుండానే కూర్చోమని సైగ చేస్తూ అతణ్ణి కన్నార్పకుండా చూడసాగింది. సుదర్శనం మరుపలుకు లేకుండా కూర్చున్నాడు, లోలోన యిబ్బందికి లోనవు తూనే-- ఆమె అంత దీర్ఘంగా యెందుకు చూస్తుందో అతడికి తెలియకపోలేదు. సకల సంపదలకూ యేకైక వారసురాలైన ఆమె మేన గోడలకు తను తగిన వాడా కాడా అన్నదే ఆమె కున్న జిజ్ఞాస! 


అసలామెగారి మేనగోడలు అంతటి శ్రీమంతురాలని తన కెలా తెలుసు? మామయ్య పూర్తిగా చెప్తేనేగా! ఎట్టకేలకామె తనలో తను నవ్వుకుంటూ మనసున కలిగిన సంతృప్తి భావానికి సూచనగా తల పంకిస్తూ దక్షిణమూర్తి వేపు మెచ్చుకోలుగా చూసింది. మొత్తానికి ఎక్స్ రే వంటి ఆమె చూపులు మొదట సుద ర్శనానికి అసహనం కలిగించినా ఆమె ప్రశాంత వదనం తెరపిని కలిగించింది. సోఫాలో కుదురుగా సర్దుకుని కూర్చుంటూ అనుకున్నాడు; ఇక్కడ కథ కొంచెం తారు మారుగానే ఉందనిపించింది. 


ఫెళ్ళి చేసుకోబోయేవాడికి అమ్మాయి నచ్చిందో లేదో అన్నది కాదిక్కడ ముఖ్యమైన అంశం. తను నచ్చాలి! అలా ఆలోచిస్తున్నప్పుడు అటునుంచి వినిపించింది ఉత్సాహంతో ఉరకలెత్తే ఒక తియ్యటి గొంతు-“ఎప్పుడొచ్చారు పెదనాన్నా? మీరొచ్చిన అలికిడే వినిపించలేదు, తోటమాలి వచ్చి చెప్తే తెలిసింది“ అని రంగుల రవ్వల్ని వెదజల్లుతున్నట్లు గల గలా మాట్లాడుతూ సుదర్శనాన్ని ఓపారి నిదానందా చూసి “హాయ్ ఎలాగున్నారు? బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసరు పోస్టులో జాయినయారటగా! ప్రక్క ఊళ్ళోనే పోస్టింగటగా! కంగ్రాట్స్! “అంటూ వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చుంది. 


సుదర్శనం మర్యాదపూర్వకంగా లేచి ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాడు. మామయ్య చెప్పినట్టు మృణాళిని అందంగా విరబూసిని గుళాబీ మొక్కలా నిండుగా ఉంది. ఫొటోలో చూసినట్లే చెక్కుచెదరని సౌందర్యం! నిగనిగలాడే తుమ్మెదల్లాంటి విశాలమైన కురులామెవి. నుదుట గుండ్రటి బొట్టుతో చేతిలోని చిత్ర వీణ మీటుతూన్న సరస్వతీదేవి రూపంలా ముఖం కళకళ్ళాడుతూంది. ఆమె నిండు రూపంలో యేదో ఒక సౌమ్ర శుభ్ర తేజస్సు ఉన్నట్లని పించిందతనికి. ఇంకా అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తూంది. 


వెనువంటనే ఒక అనుమానం కూడా పొడసూపింది. మరింతటి పొడవైన జుత్తుతో రేపు పై చదువుల కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళి యెలా మనుగడ సాగించగలదు! ఈమె వెళ్ళబోయేది వాషింగ్టనో ఇంగ్లాండో అని మామయ్య తనతో చెప్పాడాయె. అక్కడ ఇంత పొడవైన ఒత్తైన శిరోజాలను పరామర్షించుకోవడం వీలుపడని కార్యం. తను విన్నంతవరకు- చాలా మంది భారతీయ యువతులు అక్కడకు చేరిన తరవాత చేసే మొదటి పని జుత్తుని కత్తిరించుకుని బాబ్డ్ హెయర్ గా మార్చుకోవడం లేదా సగానికి పైగా కుదించుకోవడమే!


ఆ తరవాత తెల్లమ్మాయిలతోనో లాటిన్ అమ్మాయిలతోనో కలగలసి పోవడానికి ప్రయత్నించడం. 

మరింతటి ఒత్తైన జుత్తుని షార్ట్ గా కత్తరించకోవడానికి మృణాళినికి మనసొప్పుతుందో లేదో! తల్లి దండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయిన మృణాళినికి వితంతువైన వాళ్ళ మేనత్తగారే అంతా తానై ఆమె ఆలనా పాలనా చూసుకొస్తున్నట్టున్నారు. ఇంతటి పొడవై న జుత్తు ఈమెగారి చలవే అయుంటుంది. ప్రాత కాలపు స్త్రీలకు జుత్తే కదా ఆభరణం! 


అప్పుడతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, కాంచనమాలగారికి సంకేతం యిస్తూ లేచాడు దక్షిణమూర్తి “ఈ యేడాదికి సంబంధించిన ప్రొపర్టీస్ రిటార్న్ సరిచూసుకోవాలి. రేపు టాక్స్ కన్సెల్టెంటని కూడా చూసిరావాలి. మీరిద్దరూ పక్క గదిలోకి వెళ్ళి టీ పుచ్చుకుంటూ మాట్లాడుతుండండి. అన్నట్టు-- మృణాళిని టీ బాగా చేస్తుంది. అంతేకాదు. జపానీయుల్లా కళాత్మకంగా చేస్తుంది” అంటూ అటు తిరిగి అన్నాడు “కాంచనమాలగారూ! మీకిది గుడికెళ్ళే సమయం కదూ! ”అని. ఆమె తలూపుతూ అతణ్ణి వెన్నంటి వెళ్ళింది. 


పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరవాత సుదర్శనం మృణాళినీ యిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని అసంకల్పితంగా నవ్వుకున్నారు. అలా నవ్వుకుంటూనే పక్కగది వేపు నడిచారు. గది లోపలకు వెళ్ళిన వెంటనే సుదర్శనాన్ని కూర్చోమని చెప్పి ఆమె అంది “అవును సుదర్శనం గారూ! నేను చేసే టీ మీకు నచ్చుతుందో లేదో గాని నాకు మాత్రం జపానీయుల్లా టీని సంప్ర దాయ బధ్ధంగా చేయడమంటే ఇష్టం. మీరుండండి. ఐదు నిమిషాలలో టీ చేసి తీసుకొస్తాను. ”అంటూ వంటగది వేపు వెళ్ళింది. 


ఆమె అక్కణ్ణించి కదలివెళ్ళిన వెంటనే అతడి ఆలోచనలు కూడా దిగ్గున లేచి ఆమెను వెన్నంటి వెళ్ళాయి. మాటల సందర్భన మామయ్య చెప్పినట్టు గుర్తు, ఆమెది కుంభరాశని. కుండ నిండా నీళ్లున్నట్లు గుండెనిండా ప్రేముంటుందట ఆ రాశి గలవాళ్లకు. ఆ ప్రేమను సరైన రీతిలో అందుకుంటే- దానికి తగ్గట్టు సరైన మోతాదున స్పందిస్తే ఆ రాశిగల వాళ్ళ ఆనందానికి హద్దుండదట. ఈ రాశివాళ్లు రహస్యాలు దాచుకోలేరు. అంతర్గతంగా నీతీ నిబధ్ధతా కోరుకుంటారు. లాలనగా మాట్తేడేవారిని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అలా లాలనగా ప్రేమను చూపించే వారికి తనివిదీర ఆనందాన్నిస్తారు. 


స్వాభావికంగా ఈ రాశిగలవాళ్ళకు అమోఘ మైన తెలివి తేటలుంటాయట. అయితే యెటొచ్చీ ఆ రాశుల్నీ, అటువంటి జాతకాలనీ యెంత వరకు నమ్మోలో, నమ్మి యెన్నిటిని ఆచరణలో పెట్టగలమో అన్నది అతడికి అంతుపట్టని విషయం.. 


కాసేపు తరవాత దక్షిణమూర్తి తనకున్న అత్యవసరమైన పనులన్నీ ముగించుకుని తిన్నగా మృణాళిని స్టడీ రూములో కి వచ్చి చూసాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతడికి ఆశ్యర్యం కలిగింది. ”ఎక్కడికి వెళ్ళుంటారు చెప్మా! ” అనుకుంటూ నడవమ్మట వచ్చి చూపు సారించాడు. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడతను. బయట తోటలోనున్న బొగడ చెట్టు క్రింద ఒంటరిగా నిల్చుని కనిపించాడు సుదర్శనం. 


మేనల్లుడలా ఒంటరిగా ఉండటం అతడికి అసహనాన్ని కలిగించింది. అంతేకాక, అతడికది అంత శుభసూచకంగా కూడా తోచలేదు. ఆదిలోనే హంసపాదవుతుందేమో! అతడు మెట్లుదిగి మేనల్లుడి వద్దకు నడిచి వెళ్ళాడు. ”ఏమైందోయ్? నువ్వేమిటి ఒంటరిగా మీనమేషాలు లెక్కిస్తూ-! ”

“అబ్బే! మరేం లేదు మామయ్యా! తోటంతా అలా ఓసారి హాయిగా తిరిగొద్దామని--“


“అది సరేనోయ్! అదే పని మృణాలనీతో కలసిచేయొచ్చుకదా? ఇంతకీ మృణాళిని యెక్కడికెళ్ళిందని? ”


“ఇంట్లోనే ఉంది మామయ్యా! ప్రతిరోజూ పూజాగదిలోని పూజాసామగ్రిని ఆమే శుభ్రం చేస్తుందట, అవన్నీ చూసుకుని వస్తానంది“


దక్షిణమూర్తి అసంకల్పితంగా నోరు తెరిచాడు. ”పూజా గదిలోకి వెళ్ళిందా! ఇప్పుడా! ” అతడి బుర్ర గిర్రున తిరిగినట్లయింది. జోరున దొర్లే రథ చక్రాల్లా అనుమానాలు చెలరేగాయి. ఇద్దరి మధ్యా యేదో జరిగుంటుంది! సుదర్శనం అంత దూరం నుంచి యింటికెందు కొచ్చాడో మృణాళినికి తెలియదా! ఎందుకిలా ప్రవర్తిస్తుంది? సుదర్శనమంటే ఇష్టం ఉన్నదీ లేనిదీ చెప్పడానికి మొహమాటం అడ్డువస్తే ఆ మాట కాంచనమాలతోనే చెప్పి ముగించవచ్చు కదా! 

అప్పుడు సుదర్శనం మామయ్య చేయి పట్టుకుని అన్నాడు:“మామయ్యా! నీతో మృణాళిని గురించి కొంచెం మాట్లాడాలి. లోపలకు వెళ్థామా! ”


అతడు తలూపి మేనల్లుణ్ణి వెంబ డించాడు. ఇప్పుడతడిలోని అనుమానం రెట్టింపయింది. అంతా అశుభసూచకంగానే తోచనారంభించింది. 


ఇద్దరూ స్టడీ రూములోకి వచ్చింతర్వాత సుదర్శనం చెప్పనారంభించాడు- “నేనిలా అంటున్నానని మరోలా అనుకోకు మామయ్యా. ఆమెను యిప్పుడిప్పుడే పెళ్ళి చేసుకొమ్మని బలవంతపెట్టకు మామయ్యా! ”


కనురెప్పల్ని అల్లల్లాడించి చూసాడు ఎందుకన్నట్టు దక్షిణమూర్తి. 


”షీ ఈజ్ ఎ జీనియస్! ఆమె జ్ఞాన సంపత్తిని మొక్కలోనో తుంచేయకండి. మామూలు చిన్నాచితకా పనులకు ఆమె సరిపోదు. ఉన్నవ ప్రేమాబాయిలా, సరోజినీ నాయుడులా, విజయలక్ష్మిపండిత్ లా, పి, శారదా దేవిలా గొప్పగొప్ప కార్యాలు చేయగల దిట్ట. ఆమెను అమెరికాకి గాని పంపిస్తే ఆమె తప్పకుండా కొన్నాళ్ళకు కౌంటీ హెడ్గానో బిజినస్ సి ఇ వో గానో యెదగ గల సర్వ సమర్థురాలు”


అతడదంతా విని ముఖం అదోలా పెట్టాడు. ”అదంతా తరవాత వింటాను గానీ! మొదట దీనికి బదులియ్యి. నికార్సుగా బదులిస్తావా? ’ 


సుదర్శనం బుర్రూపాడు. 

“నువ్వన్నట్లు మృణాళిని నిజంగానే చాలా గొప్ప జీనియస్సే అనుకో! ఆరు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల నుండి స్కాలర్ షిప్పులతో సీట్లిస్తామని ఆఫర్లు వచ్చాయి కాబట్టి ఆమె నిజంగానే గగన కుసుమాన్ని అందుకోగల మేధావే అనుకో! మరి ఆమెకు జీవితంలో ఏదో ఒకనాడు తోడన్న వాడు కావాలా వద్దా? రేపో మాపో ఆ పిల్లకు తనకంటూ ఒక కుటుంబం ఉండాలా వద్దా! కాలమంతా నేనూ కాంచనమాలగారు ఆ పిల్లకు తోడుగా ఉండం కదా! బంగారు పళ్ళేనికి కూడా గోడ ఆసరా ఉండాలి కదా! ”


ఆ మాటతో సుదర్శనం కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరవాత తన రీతిలో బదులిచ్చాడు- “కాదనను మామ య్యా! కాని ఆమె తన కాబోయే భర్తను వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురవదు. ఆమె ఔననాలేగాని ఎంత మంది క్యూ కట్టరూ? ” 


ఈసారి దక్షిణమూర్తి సన్నటి నిట్టూర్పు విడుస్తూ ఉండిపోయాడు. కాసేపు తరవాత, ఆలోచనలనుండి తేరుకుంటూ అన్నాడు. ”ఇంత చెప్పావు. ఇంకా యేదేదో చెప్పాలను కుంటున్నా వు. ఒకటి మాత్రం ఇంతవరకూ నువ్వు చెప్పనేలేదురా సుదర్శనం! ” 

అదేమటన్నట్టు కళ్లెత్తి చూసాడతను. 


“మృణాళినిని పెళ్ళి చేసుకోవడం నీకిష్టమేనా? “


“అదేం ప్రశ్నమామయ్యా? నేనెప్పడు వద్దన్నానని! మీరేది చేసినా నామంచికే చేస్తారన్నది నాకు తెలియనిదా? నేను చెప్పొచ్చే దేమంటే ఆమెను యే మగాడూ కాదనలేడంటాను”


“విషయం పూర్తిగా తెలుసుకోకుండా నువ్విక్కిడే తడుముతూ పొరపడుతున్నావోయ్! మృణాళినికి కావల్సింది మగాడు కాదు. జీవితాంతం తోడుగా నీడగా ఉండాల్సిన భర్త. పాణి గ్రహణం చేసిన భర్త. ఈ మామూలు విషయాన్ని నేనింత సీరియస్ గా యెందుకు నొక్కి చెప్తున్నాననే కదూ ఆశ్చర్యపోతున్నావు! ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. నేను చెప్పబోయే ఈ విషయం కాంచన మాలగారికి కూడా తెలియదు. 


మృణాళిని చిన్నప్పట్టినుంచి ఒంటరిగానే పెరిగి పెద్దదయింది. బియ్యం బస్తాల గోడౌన్ లో చిక్కు కున్న చిట్టెలుకలా పెరిగింది. ఎందుకంటే ఆ పిల్ల జీవితం చిన్నప్రాయం నాడే అస్తవ్యస్థంగా తయారయింది. నీకు ఒకవిషయాన్ని సగం చెప్పా ను, మరొక సగం విప్పలేదు. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కాబట్టి ఇక చెప్పకుండా ఉండలేను. ఆ పిల్ల తల్లి దండ్రులిద్దరూ యెలా చనిపోయారనుకుంటున్నావు? ”


”చెప్పారు కదా మామయ్యా! భార్యా భర్తలిద్దరూ పయనం చేస్తున్న విమానం నడి సముద్రాన కూలిపోవడంవల్లపోయారని—“


“కాదు! నిజం అది కాదు. నేను చెప్పబోయే విషయాన్ని యెక్కడా పొక్కనివ్వకు. ఇద్దరూ స్విసైడ్ చేసుకున్నారు. మామూలుగా కాదు. ఒప్పందం ప్రకారం. అంటే స్వీసైడ్ ప్యాక్టు ప్రకారం కూడబల్కుకొని ప్రాణత్యాగం చేసుకున్నారు! ” అది విని సుదర్శనం ఆశ్చర్యంగా కుర్చీనుండి లేచి నిల్చున్నాడు. ”మ్యూచ్వల్ అగ్రిమెంటుతో ప్రాణాలు తీసుకోవడమా! ఎందుకు మామయ్యా? ”


“ చెప్తాను. ముందు కూర్చో! విపరీతమైన మనోద్రేకాలతో చెలరేగి పోయే రెండు మదపుటేనుగులు గుద్దుకుంటే యేం జరుగు తుంది? అడవి దద్దరిల్లిపోతుంది. అదే జరిగింది! ఇద్దరిదీ ఒకరితో ఒకరు సర్దుకుపోయే మనస్తత్వం కాదు. ఇద్దరిదీ ఒకే విధమైన సైకలాజికల్ కంపల్సివ్ డిస్ ఆర్డర్. అంటే-ఎక్స్టీమ్ టెంపర్ మెంటల్ సైకలాజికల్ డిస్ ఆర్డరన్నమాట. పూర్తిగా ఒకరినొకరు ద్వేషిం చుకోలేరు. అదే సమయంలో పూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకోనూ లేరు. ఆ అవగుణాలు సరాసరి వాళ్ల జన్యువుల్లో యిమిడి ఉన్నప్పుడు దాని ప్రభావం నుండి వాళ్లెలా బయట పడగలరు? సహనాన్ని ఎలా అలవర్చేకోగలరు?


ఇద్దరూ ఒక రోజు కూడబలుక్కుని నాకు ఫోను చేసి- తాము చేసుకోబోయే దాని గురించి నాకు చెప్పి- నేను వద్దంటూ గోలపెడ్తూ వచ్చే లోపల ఇద్దరూవి గత జీవులై పడున్నారు. నేనొచ్చేటప్పటికి పాప గుక్క తిప్పుకోకుండా యేడుస్తూ నేల పైన దొర్లుతూంది. పాపతో బాటు నాకంతా అప్పజెప్పి వెళ్తున్నట్టు ఇద్దరూ వ్రాతమూలంగా వ్రాసి పెట్టారు. నా వరకు మృణాళిని నాకు మేనకోడులు వంటిది కాదు. కూతురు కంటే అధికం. నా ప్రాణానికి మరు ప్రాణం”

సుదర్శనం మాట్లాడుకుండా మౌనంగా ఉండిపోయాడు. 


“ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు. వాళ్ళిద్దరిలో కొట్టుమిట్టాడిన మనోభావాల తీవ్రత కొంతలో కొంతైనా మృణాళినిలో కూడా ఉంటుందా లేదా! ”


అతడు దిగ్భ్రాంతితో మామయ్య వైపు చూసాడు. మామయ్యది ఎంతటి లోతైన ఆలోచన! సాలోచనగా బుర్రూపాడతను “శ్రీ రామచంద్రుడిలో చాలా గొప్ప గుణాలున్నాయి. వాటిలో రెండు చాలా ఉన్నతమైనవి-ఒకటి శాంత స్వభా వం. రెండవది-కృతజ్ఞతా భావం. చిన్నప్పటినుంచీ నిన్ను చూస్తున్నవాడిని కాబట్టి ఆ గుణాలు నీలో కూడా ఉన్నాయనుకుంటు న్నాను. అందుకే మృణాళినిని నీకప్పగించి మీ అత్తయ్యతో కలసి తీర్థయాత్రలకు బయల్దేరా లనుకుంటున్నాను. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఆ పిల్ల ప్రవర్తన చూస్తుంటే ఇప్పటికిప్పుడే పెళ్ళి చేసుకునే మూడ్ లో లేదనుకుంటాను. ఇక నేను మాత్రం చేసేదేముంది? ఆ పిల్ల తలవ్రాత! వేదాంతం వల్లించడం కాదు గాని, మనం అనుకున్నవన్నీ మనకు అనుకూలంగా జరగవుకదా! ” 


అప్పుడు గది గుమ్మం వద్ద అలికిడి వినిపించింది. ఇద్దరూ అటు తిరిగి చూసారు. కొత్త చీర కట్టుకుని మృణాళిని గది గుమ్మం వద్ద నవ్వుతూ నిల్చుంది. “నేను డిస్టర్బ్ చేస్తున్నానా పెద నాన్నా! ”


“లేదమ్మా! నీ కోసమే యెదురు చూస్తున్నాం. సుదర్శనం బయల్దేరుతానంటున్నాడు. నేనే నీ కోసం ఆపాను! “


అది విని నివ్వెర పోయినట్లుచూసింది మృణాళిని. ”ఏంవి టేంవిటీ! ఇచ్చిన మాట మరచి వెళ్ళిపోతాడా మీ మేనల్లుడు! అయినా ఇంతచిన్నవయసులో ఇంతటి మతిమరుపా? ” 

దక్షిణమూర్తిఅర్థం కానట్టు మేనల్లుడి వైపు చూసాడు సంగతేమిటన్న ట్టు. సుదర్శనమేమో అయోమయంగా మృణాళినిని చూడసాగాడు కళ్ళప్పగించి. 


“ఇంకా జ్ఞాపకం రావడం లేదా మహాశయా! ”


తల అడ్డంగా తిప్పాడు సుదర్శనం అర్థం కానట్టు.

“నేను పూజాగది శుభ్రం చేసి స్నానం చేసి వచ్చింతర్వాత నన్ను సర్వ మంగ ళ ప్రదాయిని మీ ఊరి అమ్మవారి గుడికి తీసుకెళ్తాననలేదూ! ” 


అతడికేమి చెప్పాలో తెలియక అవున్నట్టు తలూపాడు.

“అంతేకాదు. నన్నొక విషయంలో చాలెంజి కూడా చేసారు కూడాను! అదైనా జ్ఞాపకం ఉందా లేదా? ” 


ఈసారి ఉలిక్కిపడుతూ లేచి నిల్చున్నాడు-: “నేను మీతో సవాల్ చేసానా! ”


“కాక పోతే మీ మామయ్యగారితోనా? నేను బాగా వంట చేస్తానంటే, మీరేమన్నారు? మీ అమ్మగారి కంటే బాగా చేయలేరని నన్ను నిలదీయ లేదూ! అప్పుడు నేనేమన్నాను? బాగా జ్ఞాపకం చేసుకోండి”


“నిజంగా నాకేమీ జ్ఞాపకం రావటం లేదండీ! “అంటూనే మనసు లోపల అనుకున్నాడు-“అబ్బో! మహా గడుసుదానిలాగుందే! అనని మాటల్ని తన నోటమ్మట అన్నట్టు యెంత చక్కగా రప్పిస్తూంది! ”


“అదీ నేనే చెప్పాలా! చెప్తాను. నేను మీ అమ్మగారి కంటే బాగా చేయలేక పోవచ్చుగాని కచ్చితంగా మీ అమ్మగారిలా వంటా వార్పూ చేయగలన్నాను. కావాలంటే నేనిప్పుడే మీ యింటికొచ్చి చేసిపెడ్తానన్నాను. అప్పుడు మీరేమన్నారూ! ఇప్పుడు గాని బస్సులో గాని వెళ్తే చాలా ఆలస్యమవుతుందని- ఆ విషయం తరవాత చూద్దామన్నారు. అప్పడు నేనేమన్నానూ! ఆలస్యం అవదూ, నేనే స్వయంగా కారునడిపి మిమ్మల్ని మీ ఊరు చేరుస్తానన్నాను. ఇవన్నీ మీ యింట్లోవాళ్ళకు చెప్పకుండా సైలెంటు గా వచ్చి వంటావార్పూ చేసి ఇంటిల్లిపాదికీ నేనే వడ్డన చేస్తానన్నానా! “


అతడు బిత్తర పోయినట్లు చూస్తూ తలూపాడు మరొకమారు. ఇంతకీ అతడెన్నిసార్లు తలుపాడు? లెక్కకందలేదు. 


“మరింకా ఆలస్యం యెందుకండీ! ఇక నన్ను తీసుకెళ్లండి సుదర్శనంగారూ! “అంటూ మృణాళిని కుడి చేతిని ముందు కు చాచింది. ఈసారి అతను జంకలేదు. తను తక్కువ తిన్నవాడేమీ కాదని నిరూపించడానికి పూనుకుంటూ నున్నటి ఆమె చేతి ని అందుకుని మృదువుగా తన పెదాలాతో స్ప్శశించి ఆమె నడుం చుట్టూ చేతుల్ని పోనిచ్చి ముందుకు నడిపించాడు. ”అందుకున్న చేతిని మధ్యలో విడిచి పెట్టేయరు కదూ! ”


“అది మా యింటి వంశంలోనే లేదు. కావలిస్తే మీ పెదనాన్నగారినే అడిగి చూడు! ”


మేఘాల్లో కదిలే గాంధర్వుల్లా నడచి వెళ్ళి పోతూన్న ఆ జంటను పూరించిన మనసుతో కనులప్పగించి చూస్తూండి పోయాడు దక్షిణమూర్తి. ఇప్పుడతని మనసు తేలికపడింది. స్వర్గానికేతెంచిన మిత్రుణ్ణీ మిత్రుడి భార్యనూ తలచుకుని తడిసిన కళ్ళను తుడుచుకున్నాడు.


***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
75 views0 comments

Comments


bottom of page