top of page
Original.png

ఆ ఒక్క ఆలోచన..      


ఒక స్నేహం… ఒక అవకాశం… ఒక్క ఆలోచనతో జీవితాలు మారిపోతాయి!

Aa Okka Alochana - Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma 

ఆ ఒక్క ఆలోచన.. - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ

Published in manatelugukathalu.com on 02/04/2026


జోరు వాన.. ఆటో దిగిన సంధ్య తడుస్తూనే సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్ కిటకిటలాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం. ఇంతలో అనౌన్స్‌మెంట్... 


"దయచేసి వినండి! విజయవాడ వెళ్ళవలసిన రైళ్లు అన్నీ ఆలస్యంగా నడుచుచున్నవి. ఆలస్యానికి చింతిస్తున్నాము!" 


వాన కురుస్తూనే ఉంది. బాబాయ్ వద్దని వారించినా వినకుండా వానలో బయలుదేరింది సంధ్య.

………………………………

సంధ్య వెళ్లాల్సింది విజయవాడ. నాన్న, అమ్మ ఇద్దరూ స్కూల్ టీచర్స్. తను MCA చేసింది. తమ్ముడు B.Tech చదువుతున్నాడు. బెన్జ్ సర్కిల్ దగ్గర ఉంటారు. సాదాసీదాగా ఉండే సంసారం. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. తను ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చింది. అది ఓ స్టార్టప్ కంపెనీ. ఇంటర్వ్యూ బాగానే చేసింది. బాబాయి హైదరాబాద్‌లో నిజాం కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. పిన్ని కూడా అదే కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్, తనది తెలుగు డిపార్ట్‌మెంట్. ఇద్దరూ చాలా సరదాగా ఉంటారు.

………………………………

వాన కురుస్తూనే ఉంది. కుండపోత వర్షం అంటే ఇదేనేమో అనుకుంది. రైళ్ల రాకపోకలు లేవు. అరుపులు, కేకలతో స్టేషన్ దద్దరిల్లుతోంది. తిరిగి వెనక్కు పోదామంటే బాబాయ్ ఇల్లు చాలా దూరం. బాబాయితో మాట్లాడాలన్నా నెట్‌వర్క్ లేదు. రాత్రి 11 గంటలు అవుతోంది. నిద్ర ముంచుకొస్తోంది సంధ్యకు. 


పలకరించడానికి కూడా ఎవరూ తెలిసిన వాళ్లు లేరు. తెలీకుండానే అప్పుడప్పుడూ తను తూలుతోంది. అంతలో ఎవరో ‘సంధ్యా’ అన్న పిలుపు విని ఉబ్బితబ్బిబ్బయ్యింది. దూరంగా తన ఫ్రెండ్ వీణ. ఏదో తెలియని ఆనందం. పరుగెత్తుకొచ్చి తనను హత్తుకుంది వీణ. తనను చూడగానే ఎడారిలో ఎండమావిలా తనకెంతో ఆనందాన్ని ఇచ్చింది. 


అప్పటివరకు తనలో ఉన్న నిశ్శబ్దం చెదిరిపోయింది. అందుకే అంటారు, నలుగురితో స్నేహంగా ఉండాలని.

“నువ్వేంటి ఇక్కడ?” ఆశ్చర్యంగా అడిగింది సంధ్య.


“నేను కూడా విజయవాడకే. మా అన్నయ్య పెళ్లి. రైళ్లు లేట్ అన్నారు. నీకు ఫోన్ చేయాలనుకున్నా, నెట్ లేదు,” అంది వీణ.


ఇద్దరూ ప్లాట్‌ఫామ్ చివర్లో ఖాళీగా ఉన్న బెంచ్ దగ్గర కూర్చున్నారు. వాన చినుకులు షెడ్ అంచుల మీద నుంచి జారుతూ చప్పుళ్లు చేస్తున్నాయి. చల్లని గాలి తాకుతూ ఉంది. భయం క్రమంగా తగ్గి, స్నేహం వేడిమి పెరిగింది.


“ఇంటర్వ్యూ ఎలా అయింది?” అడిగింది వీణ.


సంధ్య చిరునవ్వు నవ్వింది. “బాగానే అయింది. కానీ సెలెక్ట్ అవుతానో లేదో…”

“నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు,” అంటూ ధైర్యం చెప్పింది వీణ.

ఆ మాటలు సంధ్య మనసులో దీపం వెలిగించినట్లు అయ్యింది. తను చదివిన రాత్రులు, తల్లిదండ్రుల కష్టాలు, తమ్ముడి ఆశలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఈ ఉద్యోగం తన కుటుంబానికి ఎంత ముఖ్యమో తనకు బాగా తెలుసు.

ఇంతలో బిగ్గరగా అనౌన్స్‌మెంట్! 

“యువర్ అటెన్షన్ ప్లీజ్! ట్రైన్ నంబర్ 12760, సికింద్రాబాద్ టు చెన్నై ‘చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’, విల్ అరైవ్ షార్ట్‌లీ ఆన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1.” 

ఇద్దరి ముఖాల్లో ఒక వెలుగు వెలిగింది. జనాలు ఒక్కసారిగా కదిలారు. వాన కొంచెం తగ్గింది. రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చింది. రైలు శబ్దం వినిపించగానే అందరిలో కదలిక మొదలైంది.

రైలు ఎక్కే ముందు వీణ చేతిని గట్టిగా పట్టుకుంది సంధ్య. “ఈరోజు నిన్ను చూడకపోతే నేను ఎంత భయపడేదాన్నో!” అని వాపోయింది సంధ్య.

వీణ నవ్వింది. “జీవితంలో ఒడిదుడుకులు సహజం. అయితే తోడు నిలిచే వాళ్లు ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు,” అంది. రైలు నెమ్మదిగా కదిలింది. కిటికీ బయట చూస్తే ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. సంధ్య హృదయంలో మాత్రం ఏవో కొత్త ఆశలు చిగురించాయి.

………………………………

రైలు నెమ్మదిగా కదిలింది… క్రమంగా వేగం పెరిగింది.

ప్లాట్‌ఫామ్ మీదున్న జనాలు, లైట్లు, శబ్దాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతుండగా సంధ్య గుండె మాత్రం వేగంతో కొట్టుకుంటోంది. ఏదో తెలియని నిర్లిప్తత ఆమె మనసులో చోటు చేసుకుంది.

వీణ పై బెర్త్ ఎక్కి పడుకుంది. “రేపు మాట్లాడుకుందాం సంధ్యా! ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకో,” అంది.


సంధ్య కిటికీ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తడిసిన జుట్టు, అలసిన కళ్ళు... హృదయంలో ఏవో కానరాని ఆలోచనలు, ఆశల మెరుపులు. ఆ క్షణం ఆమెకు తన జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతున్నట్టుగా అనిపించింది.

రైలు వేగంగా వెళుతోంది.


సంధ్యకు నిద్ర రావడం లేదు. రైలు శబ్దం తన గుండె చప్పుళ్లతో కలిసిపోయినట్టనిపించింది. ఒక్కసారిగా ఫోన్ వైబ్రేట్ అయింది. నెట్ వచ్చేసింది. తెలియని నంబర్ నుంచి మెసేజ్.


“Congratulations Sandhya! You are selected…” అని.

ఆ క్షణం ఆమె చేతులు వణికాయి. మళ్లీ మళ్లీ చదివింది. అదే మాటలు. అది తన ఇంటర్వ్యూ ఇచ్చిన స్టార్టప్ కంపెనీ నుంచే.

సంధ్య కళ్లలో ఆనంద భాష్పాలు. హృదయం మరింత వేగంగా కొట్టుకుంటోంది, ఏదో తెలియని అనుభూతి మనసును ఆవహించింది. వెంటనే మొబైల్ తీసుకొని అమ్మకు కాల్ చేసింది. అప్పుడు రాత్రి మూడు గంటలయింది. అయినా అమ్మ వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకుంది.


“అమ్మా…” అంటూనే

ఒక్కసారిగా “ఏమైంది అమ్మా?” అని ఆందోళనగా అడిగింది అమ్మ.


“జాబ్ వచ్చేసింది అమ్మా…” అంటూ ఆత్రుతగా సమాధానం ఇచ్చింది.

అమ్మ గొంతు కంపించింది. “నాన్నకు చెప్పు... తమ్ముడికి చెప్పు...” అంటూన్న సంధ్యకు అవతల నుంచి నాన్న గళం వినిపించింది. ఆ చిన్న ఇల్లు ఆ రాత్రి ఆనందంతో నిండిపోయింది.


తన సెలక్షన్ గురించి బాబాయికి, ఫ్రెండ్స్‌కు మెసేజ్ పెట్టింది.

వీణ కేసి చూసింది. గాఢ నిద్రలో ఉంది. ‘సరే! ఈ విషయం తనకు రేపు చెప్తాను’ అనుకుంది. మొబైల్ పక్కకు పెట్టి కిటికీ బయట చూసింది సంధ్య. కారు చీకటి.. మధ్య మధ్యలో మినుకు మినుకు మంటున్న చిన్న చిన్న దీపాల కాంతులు. మదినిండా ఏవో ఆలోచనలు..


“నేను మాత్రమే కాదు... ఇంకెంతమంది అమ్మాయిలు తమ కలల కోసం ఇలా ప్రయాణిస్తుంటారు? వాళ్లకు కూడా ఒక తోడు, ఒక అవకాశం ఉంటే?” అని నిట్టూర్చింది.


ఆ ఒక్క ఆలోచనే ఆమె జీవితాన్ని ఊహించని రీతిలో మార్చింది.

………………………………

విజయవాడ చేరుకున్న వెంటనే సంధ్య బాబాయికి, తన ఫ్రెండ్ వీణకు ఫోన్ చేసి తన శుభవార్త చెప్పింది. బాబాయి, పిన్ని ఇద్దరూ ఆమెకు అభినందనలు తెలిపారు. వీణ మాత్రం “సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను” అని చెప్పింది.

సంధ్యకు భవిష్యత్తు గురించి స్పష్టత కంటే ఆశలే ఎక్కువగా ఉన్నాయి. వారం రోజుల తర్వాత కంపెనీ నుంచి కాల్ వచ్చింది; జాయిన్ అవ్వమని. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంట్లోనే కూర్చొని, కష్టపడి, పద్ధతిగా పని చేస్తూ, రోజుకొక కొత్త విషయం నేర్చుకుంటూ, కొద్దికాలంలోనే సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది.


ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకే మాట వినిపిస్తోంది — “AI నేర్చుకోకపోతే భవిష్యత్తు లేదు.” అదే ఆలోచన సంధ్యను మరో దిశగా నడిపించింది. ఆమె Artificial Intelligence, కొత్త ప్రోగ్రామింగ్ భాషలు, ఆధునిక టూల్స్ నేర్చుకోవడం ప్రారంభించింది. అది ఉద్యోగం కోసం మాత్రమే కాదు... తనకు ఒక స్థానం సంపాదించుకోవడానికి, ఇంకా ముందుకు వెళ్లడానికి అవసరమని ఆమె గ్రహించింది.

………………………………

రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె నేర్చుకోవడం ఆగలేదు. ప్రతి కొత్త టూల్, ప్రతి కొత్త కోడ్ ఆమెను మరింత బలంగా మార్చాయి. కాలంతో పాటు ఆమె ప్రతిభ కంపెనీలో స్పష్టంగా గుర్తింపు పొందింది. కొన్నేళ్లలోనే ఆమె ఒక కీలక స్థానానికి ఎదిగింది. కానీ అక్కడితో ఆమె ప్రయాణం ఆగలేదు.

తనలాంటి సాధారణ కుటుంబాల అమ్మాయిలు కూడా జీవితంలో ముందుకు రావాలని సంధ్యకు బలమైన ఆకాంక్ష ఉంది. ఆ ఆలోచనతోనే ఆమె “నవదిశ” అనే చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదట్లో అది ఒక చిన్న గదిలోనే మొదలైంది—రెండు పాత కంప్యూటర్లు, ఐదుగురు అమ్మాయిలతో.

ఆ అమ్మాయిల కళ్లలో భయం కనిపించేది. కొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్న అనుభవం వాళ్లను కొంత అసహజంగా మార్చేది. సంధ్య మాత్రం నెమ్మదిగా వాళ్లకు దారి చూపుతూ, ఆ భయాన్ని నమ్మకంగా మార్చే ప్రయత్నం చేసేది.

ఆదిలో వాళ్లు మౌనంగా ఉండేవారు. కీబోర్డ్‌ను తాకడానికే వెనుకాడేవారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ భయం క్రమంగా తగ్గింది. మెల్లగా కదిలిన వేళ్లు ధైర్యంగా మారాయి. మౌనం నవ్వులుగా మారింది.

ఒక చిన్న గదిలో ప్రారంభమైన ఆ ప్రయాణం, కొద్ది కాలంలోనే వందల మందికి విస్తరించింది. వారు కేవలం కోడింగ్ నేర్చుకోవడమే కాదు… తమ జీవితాన్ని తామే మార్చుకోగలమనే నమ్మకాన్ని కూడా వారు పొందారు.వారిలో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు.

………………………………

ఒక రోజు బెంగళూరులో జరిగే ప్రముఖ టెక్ సదస్సులో మాట్లాడమని సంధ్యకు ఆహ్వానం వచ్చింది. అది ఆమెకు కలల వేదికలా అనిపించింది. ఆ అవకాశం ఆమె ఎదుగుదలకు ఒక గొప్ప గుర్తింపుగా నిలిచింది.


వేదికపై నిలబడి, AI టూల్స్, భవిష్యత్తు టెక్నాలజీల గురించి ఆమె చెప్పిన ప్రతి మాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. సభ అంతా చప్పట్లతో మార్మోగింది.


ఆ క్షణంలో ఆమె మనసు ఒక్కసారిగా గతాన్ని తాకింది—ఒక చిన్న గది, ఒక పాత కంప్యూటర్, ఐదుగురు అమ్మాయిలతో ప్రారంభమైన ఆ ప్రయాణం గుర్తుకొచ్చింది. 

మరుసటి క్షణం ఆమె దృష్టి ప్రేక్షకుల మధ్య నిలిచిన వీణపై పడింది. ఆశ్చర్యం.. వెంటనే గతం కళ్లముందు మెదిలింది. వీణతో గడిపిన ఆ వర్షపు రాత్రి జ్ఞాపకాలు... అన్నీ కళ్లముందు సజీవంగా నిలిచాయి.


సభ ముగిసిన తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. మాటల్లో చెప్పలేని ఆనందం, గర్వం వారి కళ్లలో కనిపించాయి. “నువ్వు నీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటావని నాకు ముందే తెలుసు,” అని వీణ చెప్పిన మాటలు సంధ్య మనసులో మార్మోగాయి.

………………………………

కొన్ని నెలల తరువాత సంధ్య మరో కీలక నిర్ణయం తీసుకుంది. “నేను నేర్చుకున్న కంప్యూటర్ జ్ఞానం,నైపుణ్యాలు ఇంకా ఎక్కువ మందికి చేరాలి… నేనే వారి దగ్గరకు వెళ్లి నేర్పాలి” అని ఆమె దృఢంగా మనసులో నిశ్చయించుకుంది.

నిరంతర కృషి ఫలితంగా ఆమె ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ చేసింది — “సహచరి”. అది ఒక అడ్వాన్స్‌డ్ AI రోబోట్. కానీ అది యంత్రం మాత్రమే కాదు... ఒక మార్గదర్శి. మాట్లాడగలదు, వినగలదు, వ్యక్తి స్థాయిని అర్థం చేసుకుని నేర్పగలదు. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ముఖ్యంగా... భయపడే మనసుల్లో ధైర్యాన్ని నింపగలదు.

“నవదిశ”లో “సహచరి” చేరిన తర్వాత మార్పు వేగంగా పెరిగింది. సంధ్య కల కొంతవరకు నెరవేరింది. గ్రామాల్లో ఉన్న అమ్మాయిల దగ్గరికి టెక్నాలజీ చేరింది. ఒకప్పుడు సందేహించిన వాళ్లు ఇప్పుడు నమ్మకంతో ముందుకు నడిచారు. కొందరు ఉద్యోగాలు సాధించారు, కొందరు తమ కుటుంబాలను నిలబెట్టారు, మరికొందరు తమలాంటి వారికి మార్గదర్శకులయ్యారు.

………………………………

సంవత్సరాలు గడిచాయి. ఒక అంతర్జాతీయ వేదికపై సంధ్య మళ్లీ కనిపించింది. ఈసారి ఆమె ఒంటరిగా కాదు. ఆమెతో పాటు “సహచరి” అనే రోబో సహాయకం ఉంది. ముందు వరుసల్లో “నవదిశ” ద్వారా మారిన వందలాది జీవితాలు కూర్చున్నాయి. బాబాయి, పిన్ని, వీణను ప్రత్యేకంగా ఆహ్వానించింది. వారు VIP సీట్లలో కూర్చున్నారు. వీణ దూరం నుంచి చిరునవ్వుతో ఆమెను చూస్తోంది.


సంధ్య మైక్ దగ్గరికి వచ్చి హాల్‌ను ఒక్కసారి చూసింది. ఆ నిశ్శబ్దంలో ఆమె స్వరం గట్టిగా, స్పష్టంగా వినిపించింది—


“టెక్నాలజీ మనకు అవకాశాలు సృష్టిస్తుంది... కానీ మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే నిజమైన మార్పు జరుగుతుంది.”


ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తరువాత సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

అలా మొదలైన సంధ్య ప్రయాణం ఎంతోమందిని తన కంపెనీలో చేరేలా చేసింది.

………………………………

కాలం ఎంత విచిత్రం! సంధ్య కలగన్న ఆశలు, ఆమె ఆలోచన ఎందరో జీవితాలకు ఆదర్శంగా నిలిచాయి.

సంధ్య కథ ముగియలేదు…


ఆమె ప్రారంభించిన “నవదిశ” ఇప్పటికీ ఎందరో జీవితాలకు వెలుగునిస్తోంది.


— ఒక చిన్న ఆలోచనను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలిగితే, అది ఒక్కరి జీవితానికే పరిమితం కాదు... సమాజాన్నే మార్చగల శక్తిగా మారుతుంది.

అదే నమ్మకాన్ని జీవితం అంతా తన కార్యాచరణతో నిరూపించింది సంధ్య.

———————————

డా. కృష్ణకుమార్ వేపకొమ్మ


***

డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్కారం,

నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.

మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.

డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ

ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)

వార్తాపత్రిక కాలమిస్ట్

రాజీవ్ నగర్, హైదరాబాద్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page