top of page

ఓట్ల పండుగ


'Otla Panduga' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 27/11/2023

'ఓట్ల పండుగ' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

ఓట్ల పండు గొచ్చె ఒచ్చెను సిరులంటు

నేత లెంట దిరిగి నేర మనక

ధనము కొంత బొంది ధర్మము వదలుచు

ఆశ పరుడు ఓటు అనగ వేయు


కాయ కష్ట మెపుడు కానరు బతుకున

ధవళ బట్ట లేసి ధర్మ మొదిలి

నేత రూపు దాల్చి నేరము అనకను

కొల్ల గొట్టు చుంద్రు కోశ మంత


నేత లెపుడు మదిని నేరము దలువక

ప్రజల దోచు కొనగ పాటు పడుచు

రాష్ట్ర మంత పెంపు రయమున జరుగంటు

మెక్కు చుంద్రు ధనము మేలు మరచి


స్వేదము కారగ దిరుగును

పాదము లైనను ప్రజలది పట్టగ బూనున్

జూదము మాదిరి నోటిడి

యాదిని మరచును గెలుపుతొ అక్కర దీరన్


అనుభవ మొందుట తప్పదు

అనుభవ హీనుడు ప్రభువవ ఐదును యేండ్లున్

కనుకను ఓటుకు నోటన

అనకుము చేటగు అదియొక ఆయుధ మిపుడే


ఎన్నిక లందును ఓడను

పన్నును కుట్రలు ప్రభుతను పదవిని దించన్

సున్నిత కారణ మయినను

తన్నుక చత్తురు పదవిక తమకే అనుచున్


పుట్టెడు ఆశతొ నేతలు

పెట్టను బూనుచు వ్యయమును పెట్టుబడనగన్

కట్టడి అయినను వెరువక

పట్టుతొ గెలువను దలుతురు పంచుతు ధనమున్


నాయకు డెంతటి వాడన

వేయకు ఓటును ఎరుగక వెతలును గల్గున్

మాయపు మాటలు జెప్పుచు

మేయును రాష్ట్రము ధనమును మెలకల తోడన్


దుష్టుని కనగను ఓటన

నష్టము కలుగును కనగను నరకమె ముందున్

ఇష్టము వచ్చిన విధముగ

భ్రష్టము జేయుచు ధనమును భరతము పట్టున్


అయిదు వత్స రాల ఆయుస్షు నేతకు

ఆయు ధంబు మనకు అనెడి ఓటు

జంక కుండ వేయ జయమన గలుగును

ధనము పొంది వేయ ధర్మ మనరు


ఓటను ఆయుధ మొక్కటి

చాటుగ వాడిన జయమగు చక్రము వదలన్

చేటగు డబ్బును గోరుచు

ఓటన ధూర్తుని గెలుపుతొ ఒనరును కీడే…


కపటుని ఎదురిడ జడిసిన

ఉపయోగ మనగ దలువుము ఉండగ ఓటున్

మపువుగ మంచికె ఓటన

ఉపయుక్తమగును ఫలితము ఉక్కివు డోడున్


అందల మంటును జూపుచు

పొందును ఓటును ధనముతొ పొసగని తీరున్

మందిని మోసము చేయుచు

దందయు మొదలిడు ప్రభువయి దర్జాగనగన్


-సుదర్శన రావు పోచంపల్లి

62 views0 comments
bottom of page