పడి లేచిన కెరటం
- Veluri Sarada

- Jul 4
- 5 min read
#PadiLechinaKeratam, #పడిలేచినకెరటం, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Padi Lechina Keratam - New Telugu Story Written By Mayukha
Published In manatelugukathalu.com On 04/07/2025
పడి లేచిన కెరటం - తెలుగు కథ
రచన: మయూఖ
ఒకరోజు నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ప్రతి ఆదివారం ఆయన మా వీధి చివర ఉన్న ఇంటిలో ఒక రూమ్ లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటారు.
డాక్టర్ గారి దగ్గరకు అందరూ పెద్దవాళ్లే వస్తారు. డాక్టర్ గారు రూమ్ లోంచి ఒక పెద్దాయన, ఒక చిన్నతను బయటకు వచ్చారు. పెద్దాయన వయసు 65 ఉండొచ్చు. చిన్నతను 30, 35 మధ్యలో ఉండొచ్చు. చిత్రం ఏమిటంటే చిన్న వయసు వ్యక్తికి పెరాలసిస్. కుడి వైపు భాగానికి వచ్చినట్టుంది. కుడి చెయ్యి ఇంకా పూర్తిగా రాలేదు ఇప్పుడు కాలు కొంచెం ఈడుస్తూ నడుస్తున్నాడు. ఎడం చేత్తో స్టిక్ పట్టుకున్నాడు. పెద్దాయన తండ్రి, చిన్న వ్యక్తి కొడుకు అని వాళ్ళ మాటల్ని బట్టి తెలిసింది.
పెద్దాయన కొడుక్కి సపోర్టుగా నడిపిస్తూ ఆటో దగ్గరకు తీసుకు వెళుతున్నాడు. ఆటో వాడు దగ్గరుండి ఇతన్ని లోపల కూర్చో పెట్టాడు. ముగ్గురు కలిపి ఆటోలో వెళ్లిపోయారు.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కుతూహలంగా కూడా అనిపించింది. ఎందుకంటే పెద్దాయన రెండు కాళ్ళతో శుభ్రంగా నడుస్తున్నాడు. చిన్న అతనికి ఏమిటి ఇంత దారుణ పరిస్థితి అనుకున్నాను.
ఇంతలో నా పేరు పిలవడంతో లోపలికి వెళ్లాను. డాక్టర్ గారితో నా మందుల విషయం మాట్లాడిన తర్వాత వాళ్ల గురించి అడిగాను. సహజంగా డాక్టర్ గారు ఒకళ్ళ విషయాలు మరొకరికి చెప్పరు. కానీ, నేను బాగా పరిచయం ఉండడంతో చెప్పడం ప్రారంభించారు.
***
సదానందం, లక్ష్మీ లకు ఏకైక కొడుకు రాజేష్. చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడు. డిగ్రీ అవడంతోనే బి. ఎస్. ఆర్. బి. కి సెలెక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఆఫీసర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాకుండా సి. ఏ. ఐ. ఐ. బి పాస్ అయ్యి సీనియర్ మేనేజర్ అయ్యాడు. చిన్న వయసులోనే మేనేజర్ పదవి రావడం, ఎదుటివారికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉండడం, బ్యాంకింగ్ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండడంతో బ్యాంకుకు వచ్చే ప్రతి కస్టమర్ కి తన పరిధి మేరకు, అవతలి వారి అర్హతను బట్టి వాళ్లకి లోన్స్ ఇవ్వడం, డిపాజిట్ సేకరణ చేయడంతో అధికారుల మన్ననలు పొందాడు. ఇతని సేవలు చూసి కష్టమర్లు కూడా ఎంతో సంతృప్తి చెందారు.
కాలం గడుస్తోంది. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శ్రీజ. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు.
ఒకరోజు'ఉరవని పిడుగులా '500, 1000 నోట్ల రద్దు వార్త వచ్చింది. అప్పటినుంచి రాజేష్ కి కష్టాలు మొదలయ్యాయి. రాజేష్ ఇంటి పక్కనే ఉన్న మాస్టారు అమ్మాయికి పెళ్లి కుదిరింది. రాజేష్ మీద నమ్మకంతో డబ్బంతా ఈ బ్యాంకు లోనే వేశారు. ఇప్పుడు అవసరం ఏర్పడింది.
దాంతో ఒక రోజు బ్యాంకు కి వెళ్లి "రాజేష్! మా అమ్మాయి పెళ్లి కుదిరింది డిపాజిట్ డబ్బులు విత్ డ్రా చేసుకుంటాను" అన్నారు మాస్టారు.
కానీ రాజేష్ కి డబ్బు అంతా ఇవ్వడానికి కుదరని పరిస్థితి. రూల్స్ ఒప్పుకోవు. అదే విషయం మాస్టారు తో చెప్పడంతో ఆయన చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు.
రాజేష్ మీద ఉన్న నమ్మకంతో చుట్టుపక్కల వారు కూడా రాజేష్ పనిచేసే బ్యాంకు లోనే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వాళ్ల అవసరాలకి డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో రాజేష్ ఉన్నాడు.
కిరాణా కొట్టు నడుపుతున్న అంజయ్య కి, చాకలి రంగమ్మ ఇస్త్రీపెట్టె కొనుకొవడానికి లోన్స్ కి అప్లై చేయమని వాళ్ళకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఇదివరకే పూర్తి చేశాడు రాజేష్. ఇక లోన్ ఇవ్వడమే తరువాయి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఈ ఉత్తర్వు వచ్చిందో అందరివి, అన్ని పనులు ఆగిపోయాయి. కస్టమర్లకి సమాధానం చెప్పలేక సున్నిత మనస్కుడైన రాజేష్ కుమిలిపోతున్నాడు.
మాస్టారు దగ్గరికి వెళ్లి "మాస్టారు! నా దగ్గర డబ్బు ఉంది. మీ అమ్మాయి పెళ్లి చేయించండి. నాకు తర్వాత ఇద్దరు గాని. నేను మీ డబ్బు మీకు ఇవ్వలేని పరిస్థితి. అందుకని నన్ను క్షమించండి. మీ పరిస్థితి నాకు తెలుసు. కానీ రూల్స్ అతిక్రమించలేను" అన్నాడు బాధగా రాజేష్. చదువుకున్న మనిషి కాబట్టి మాస్టారు అర్థం చేసుకున్నారు. మాస్టారి అమ్మాయి పెళ్లి క్లుప్తంగా జరిగింది. కానీ నిరక్షరాస్యులైన అంజయ్య, రంగమ్మ మాత్రం రాజేష్ ని ఎన్నో శాపనార్ధాలు పెట్టారు.
తెల్లవారితే రాజేష్ కి బెంగ, భయం పట్టుకున్నాయి. బ్యాంకుకు వచ్చే కస్టమర్లకి సమాధానం చెప్పలేక పోతున్నాడు. ఎవరి అవసరాలు వారివి. ఎవరిని తప్పు పట్టలేం. బ్యాంకు సిబ్బంది అంతా వెళ్ళిపోయిన మేనేజర్ అవడంతో రాజేష్ రాత్రి వరకు బ్యాంకు లోనే ఉండి, పనులు చూసుకుని ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడు.
బ్యాంకు కి వచ్చే పెద్ద కస్టమర్లు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. కానీ బ్యాంకు నిబంధనల ప్రకారం వారు అడిగినంత డబ్బు వారికి ఇవ్వలేకపోవడంతో, వాళ్లు బ్యాంకు పై అధికారులకి కావాలని రాజేష్ మీద తప్పుడు అలిగేషన్స్ పెట్టి కంప్లైంట్ చేశారు. దాంతో పై వాళ్ళ ఎంక్వయిరీ, కస్టమర్ల ఒత్తిడి మూలంగా తన నిజాయితీని వదులుకోలేక నలిగిపోతున్నాడు. దాంతో టెన్షన్ పెరిగి బిపి వచ్చి పెరాలసిస్ వచ్చింది.
బ్యాంకు సిబ్బంది అతన్ని హాస్పటల్ కి తీసుకు వెళ్లారు. వైద్యం చక చక జరిగింది కానీ బిపి కంట్రోల్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంది. వారం తర్వాత పడిపోయిన కాలు, చెయ్యితో ఇంటికి వచ్చాడు. తల్లి తండ్రి దగ్గరుండి రాజేష్ ని చూసుకుంటున్నారు.
పల్లెటూరు నుంచి మనిషిని తెప్పించి ఆయుర్వేద తైలాలతో మర్దనాలు చేయిస్తున్నారు. రాజేష్ లో మార్పు రాలేదు మానసికంగా కృంగిపోతున్నాడు. చిత్రంగా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. పూర్తిగా రాజేష్ ని విస్మరించి తన పని తాను చేసుకుంటోంది. ఇది గమనించిన రాజేష్ తల్లి, శ్రీజ ని మందలించడంతో రాజేష్ ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. డీలపడిపోతున్న రాజేష్ కి ధైర్యం చెబుతూ, విసుకు చెందకుండా వైద్యం చేయిస్తున్నారు.
చాటుగా ఇద్దరు చాలా ఆందోళన పడుతున్నారు. "ఎప్పటికీ వీడు మామూలు మనిషి అవుతాడు? అందరిలా ఎప్పటికీ నడుస్తాడు? మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం. భవిష్యత్తు ఎలాగా" అని బాధపడుతున్నారు.
రాత్రి రోజు రాజేష్ పక్కనే మంచం వేసుకుని పడుకుంటుంది లక్ష్మి. రాత్రి ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తే లేచి లైట్ వేసింది. రాజేష్ ఎక్కుతూ ఏడుస్తున్నాడు లక్ష్మి మనసు కుమిలిపోయింది.
"నాన్న! రాజేష్.. ఏడవకు. నీకు తగ్గిపోతుంది. అందరిలాగే మళ్లీ నువ్వు నీ పనులు చేసుకుంటావు. బీపీ పెరగవచ్చు. ఏడవకు" అంటూ సముదాయించింది రాజేష్ తలని నిమురుతూ.
"అమ్మా! నేను ఎవరికి అక్కర్లేదు. నేను సంపాదించినంత సేపు బాగుంది. ఎప్పుడైతే మూల పడ్డానో, నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. పెళ్లి అంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి తప్ప, ఇలా విడిచి ఎవరైనా వెళ్ళిపోతారా" అంటూ బావురుమన్నాడు. వెంటనే లక్ష్మి అర్థం చేసుకుంది "కోడలి నుంచి డైవర్స్ పేపర్లు వచ్చాయి. అందుకని అన్నమాట" అనుకుంది.
"లేదు నాన్న! నీకు నేను, నాన్న ఉన్నాము. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. నీకు మంచి జీవితం ఉంది. నీ గ్రహస్థితి బావు లేక ఇలా జరిగింది. పూజారి గారితో చెప్పి నీ పేరు మీద పూజలు చేయిస్తున్నాను. దేవుళ్ళకి మొక్కుతున్నాను. ఏదో ఒక ఆశ ఉంది నువ్వు మామూలు మనిషివి అవుతావని. బాధపడకు. " అంటూ ధైర్యం చెప్పింది.
రాజేష్ కళ్ళు తుడుచుకుని తల్లి చెప్పిన ధైర్యవచనాలతో తెప్పరిల్లి పడుకున్నాడు.
***
రాజేష్ కి కోర్టు విడాకులు మంజూరు చేసింది. "అవునులే మరి ఈ మంచాన పడ్డ మనిషితో తను ఏం సుఖపడుతుంది?" అనుకున్నాడు శ్రీజని తలుచుకొని విరక్తిగా.
విడాకుల తర్వాత రాజేష్ లో చాలా మార్పు వచ్చింది. ఒకళ్ళ కోసం కాదు. తనకు తానే నిలబడాలి. పడి లేచిన కెరటం లా నిలబడాలి అనుకుంటూ నిరాశ, నిస్పృహలని పక్కకు పెట్టి తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు కాలు చెయ్యి రావాలి నేను మళ్ళీ నా పని నేను చేసుకోవాలి. ఇలా మంచానికి అంటిపెట్టుకొని ఉండకూడదు" అనుకుని ఎక్సర్సైజులు చేయించుకోడం తనకు తెలిసిన డాక్టర్లని సంప్రదించడం చేస్తున్నాడు.
రాజేష్ లో వచ్చిన ఈ మార్పును చూసి తల్లిదండ్రులకి ధైర్యం వచ్చింది. మునపటి రాజేష్ మళ్లీ వస్తాడు అనుకున్నారు.
ఈ మానవ సంబంధాలు సుఖాలు వచ్చినప్పుడే కాకుండా, కష్టాలలో కూడా తోడుంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.
ఒకరోజు పక్కింటి రామనాథం గారు రాజేష్ పరిస్థితి చూసి ఒక హోమియోపతి డాక్టర్ ని ఇంటికి తీసుకువచ్చి చూపించారు. ఆయన చూసి గ్యారెంటీగా కాలు, చెయ్యి వస్తాయి. కానీ చాలా టైం పడుతుంది. అని 10 రోజులకు ఒకసారి మందులు మారుస్తూ ఇవ్వడంతో రాజేష్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇప్పుడు రాజేష్ స్టిక్ పట్టుకుని నడిచే స్టేజికి వచ్చాడు.
******
నేను బయటకు వస్తూ "తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తుంటే వచ్చిన ఆటంకాలను అర్థం చేసుకోలేని సమాజానికి ఒక కుటుంబం బలైపోయిందా " అనుకున్నాను.
రెండేళ్ల తర్వాత పని ఉండి నేను బ్యాంకు కి వెళితే అక్కడ మేనేజర్ సీటులో కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాను. చిరునవ్వులు చిందిస్తూ "సార్ మీకు ఏం కావాలి?” అంటూ పలకరిస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు డాక్టర్ గారి దగ్గర మందు తీసుకున్న ఆ యువకుడే.
సంతోషంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి "సార్! మీకు తెలియకపోయినా మీ గురించి నాకు అంతా తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నారు?” అంటూ ఆత్రుతగా అడిగాను.
"నౌ, ఐ యాం ఆల్ రైట్. నీకు ఎవరు చెప్పారో కానీ నా గురించి, నాకు ధైర్యం చెప్పి నాకు సేవలు చేసిన నా తల్లిదండ్రులకి, హోమియోపతి డాక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. నా ఉద్యోగ నిబద్ధతని, నా సిన్సియారిటీని చూసి బ్యాంకు మేనేజ్మెంట్ వారు నాకు ఈ బ్రాంచ్ లో పోస్టింగ్ ఇచ్చారు. బ్రాంచ్ చిన్నది. హాయిగా పనిచేసుకుంటున్నాను" అన్నాడు రాజేష్.
రాజేష్ సింగిల్ గా ఉండడంతో నా మదిలో మా మేనకోడలు మిగిలింది. మళ్లీ కలుస్తానని వచ్చేసాను సంతోషంతో.
కష్టాలు కలకాలం ఉండవు. వాటిని తట్టుకొని నిలబడ్డప్పుడే మనిషి యొక్క అసలైన సామర్థ్యం బయటపడుతుంది అనడానికి ఉదాహరణ రాజేష్ జీవితం.
సమాప్తం
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.




Comments