top of page

పలుకు లేని గానం

#VijayUppuluri, #ఉప్పులూరివిజయ్, #పలుకులేనిగానం, #PalukuLeniGanam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Paluku Leni Ganam - New Telugu Story Written By  - Vijay Uppuluri

Published in manatelugukathalu.com on 02/07/2025 

పలుకు లేని గానం - తెలుగు  కథ

రచన: విజయ్ ఉప్పులూరి


ఆవురావురుమంటూ తింటున్న సాంబును జాలిగా చూస్తూ మరో ప్లేట్ ఇడ్లీలు తెమ్మని సర్వర్ కు చెప్పారు పట్టాభి. 


సాంబు తినడం పూర్తిచేసి కాఫీ కూడా తాగాక, బిల్లు చెల్లించి "ఇక వెళ్దాం పద!" అంటూ పక్కనే ఉన్న పార్కులోకి దారి తీసారు. ఆ సమయంలొ పార్కులో ఆట్టే జనం లేరు. ఒక కాళీ బెంచీ మీద కూలబడుతూ సాంబును కూడా కూర్చోమని సైగ చేసారు. 


"ఇక చెప్పు!నువ్వెవరు? ఎక్కడినుంచి వచ్చావ్?" అనునయంగా అడిగారు. 


సాంబు బదులు పలకడం మాని ఇబ్బందిగా కదలడంతో - అయ్యో! నాదే పొరబాటు! నీకు మాటలు రావన్న సంగతి మర్చిపోయాను." నొచ్చుకుంటున్నట్టు అన్నారు పట్టాభి. 


తిరిగి తనే - “ఇంతకీ నీకు చదవడం, రాయడం వచ్చుకదా?" అని అడిగారు. 


సాంబు వచ్చని తలాడించడంతో తన చేతిసంచీ లోనుంచి ఒక నోటు పుస్తకం, పెన్నూ వెతికి తీసి ఇస్తూ - "ఇంద! నీ వివరాలన్నీ దీనిలో రాసి చూపించు. ఈలోగా నేను పార్కులో అలా నాలుగు అడుగులు వేసి వస్తాను" అంటూ సాయంకాలం నడక నిమిత్తం బయలుదేరారు. 


పట్టాభి గారు అటు వెళ్ళగానే సాంబు మెల్లగా రాయడం మొదలుపెట్టాడు. నా గురించి నేను ఎలా చెప్పాలో తెలియడం లేదు. అందుకే నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ నాకు చెప్పిన మాటలతో మొదలెడతాను. 


"మాకు పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు కలగక నిరాశలో ఉన్నప్పుడు, నువ్వు కడుపులో పడ్డావన్న విషయం తెలిసి నాకూ, మీనాన్నకూ కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. తీరా నువ్వు పుట్టాక, రెండేళ్ళు దాటినా నీకు మాటలు రాకపోవడంతో పట్నంలో డాక్టర్ కు చూపించాం. అదేదో జన్యు లోపమట. దాని మూలంగా ఏర్పడే అవకరం వల్ల చాలామంది పిల్లల్లో చెవుడుతో పాటు మూగతనం కూడా ఉంటుందిట. కాని, కొంతమందిలో పుట్టుకతో మూగతనం వచ్చినా, వినికిడి లోపం ఉండదట. అలాంటి కొద్దిమందిలో నువ్వొకడివని తెలిపారు. 


నీకు మాటలు రావని తెలిసి ఎంతో బాధ పడ్డా, కనీసం వినిపిస్తుంది కదా అని కొంత ఊరట కలిగింది మాకు. నీకు ఎలాంటి లోటూ రాకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నాం. కాని, నీకు అయిదేళ్ళు వచ్చాక బడిలో చేర్పించడమే చాలా కష్టమయింది. అసలే చిన్న ఊరు కావడంతో మన ఊళ్ళో ఉన్నదల్లా ఒక్కటే బడి. నాన్న ఎంత బ్రతిమాలినా, మూగ పిల్లాడికి చదువు చెప్పడం కష్టం అంటూ స్కూల్ వాళ్ళు నిన్ను చేర్చుకోవడం కుదరదన్నారు. మన గ్రామ సర్పంచ్ ద్వారా ఎమ్మెల్యే గారిని కలిసి విన్నవించుకున్నాం. ఆయన జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు నిన్ను బడిలో చేర్చుకున్నారు. - ఇవీ అమ్మ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు. 


 ఆ తరవాత జరిగిన విషయాలన్నీ నాకు బాగానే గుర్తున్నాయి. క్లాస్ లో పాఠాలు అర్థం చేసుకోవడంలో నాకు పెద్ద ఇబ్బంది కలగలేదు కానీ - వచ్చిన బాధల్లా మా క్లాస్ పిల్లలతోనే! సందు దొరికిందంటే చాలు - నన్ను మూగోడు.. మూగోడు అని పదే పదే వెక్కిరించి, ఏడిపించడం వాళ్ళకు సరదాగా మారింది. రోజు రోజుకీ అది శ్రుతి మించడంతో నాకు భరించడం కష్టమైంది. 


ఏడుస్తూ, ఇక స్కూల్ కి వెళ్ళనని మొరాయించాను. విషయం తెలుసుకున్న నాన్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని నచ్చచెప్పాక నేను అయిష్టంగానే బడికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. గేలి, వెక్కిరింతలు భరిస్తూనే ఎలాగోలా నా అయిదో తరగతి చదువు పూర్తయింది. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది కాని మా గ్రామంలో హైస్కూల్ లేదు. మా ఊరికి దూరంగా ఉన్న పట్నం పంపి, హాస్టల్ లో ఉంచి చదివించే స్తోమత మా నాన్నకు లేదు. 


అలా నా చదువుకు అడ్డంకి ఏర్పడింది. మా నాన్న వడ్రంగి పని చేసేవాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ, నేనూ పని నేర్చుకునేవాడ్ని. సాయంత్రం వేళల్లో మా ఊర్లోని లైబ్రరీకి వెళ్ళేవాడ్ని. అక్కడ జీర్ణావస్థలో ఉన్న పాత చందమామ, బొమ్మరిల్లు లాంటి పత్రికలూ, బాలల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం నాకు పెన్నిధిలా లభించాయి. అవి చదువుతూ కూర్చుంటే అసలు సమయమే తెలిసేది కాదు. 


బాష మీద కొద్దో గొప్పో పట్టు ఏర్పడింది. ఇప్పుడు నాగురించి ఈమాత్రం రాయగలుగుతున్నానంటే అప్పుడు చదివిన పుస్తకాల మహిమే! ఇలా ఉండగా ఒకరోజు మా ఎమ్మెల్యేగారు ఎన్నికల ప్రచారం చేస్తూ మాఊరొచ్చారు. నా చదువు అటకెక్కిందని తెలిసి నొచ్చుకున్నారు. భద్రాచలం దగ్గరలో ఒక స్వచ్ఛంద సంస్థ - చెవిటి, మూగ, దృష్టి లోపం గల పిల్లల కోసం విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఒక ఆశ్రమం నడుపుతున్నారనీ, అక్కడ చేరితే ఎలాంటి ఖర్చూ లేకుండా పదో తరగతి వరకూ చదువుకోవచ్చనీ తెలిపారు. తాను సిఫారసు లెటర్ ఇస్తానని చెప్పారు. 


నాకు చాలా సంతోషం కలిగింది. భద్రాచలంకి మా ఊరినుంచి బస్సులో అయినా, ట్రైన్ లో అయినా, అయిదు గంటల ప్రయాణం. అంతదూరం నన్ను పంపించడానికి మా అమ్మానాన్నా వెనుకాడారు. సెలవుల్లో వచ్చిపోతుంటానుగా అని వాళ్ళకు నచ్చచెప్పాను. చివరికి నన్ను ఆ అశ్రమంలో చేర్చి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ మా వాళ్ళు తిరిగి వెళ్ళారు. 


 మా ఆశ్రమం భద్రాచలం పట్టణానికి పది మైళ్ళ దూరంలో అడవి ప్రాంతంలో ఉంది. మా ఆరో తరగతి క్లాసులో నేను కాకుండా మరో తొమ్మిదిమంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరూ పూర్తిగా చెవిటి, మూగ పిల్లలే! వాళ్ళతో నేనూ సైగల బాషలోనే సంభాషించే వాడ్ని. ఎటొచ్చీ, పాఠాలు నేను మిగతా వారిలా కాకుండా వినగలగడం, సైన్ లాంగ్వేజ్ ద్వారా కాక ఎకాఎకి మన లిపిలో చకచకా రాయగలగడం నన్ను వారికి పరాయి వాడిగా మార్చింది. 


మా ఊరి బడిలో నన్ను మూగోడు అని మాత్రమే ఏడిపించే వాళ్ళు. కాని, ఇక్కడి పిల్లలు నాపై ద్వేషం పెంచుకుని, నన్ను ఒక విరోధిగా భావించేవాళ్ళు. ఒక జట్టుగా మారి కక్షపూరితంగా వ్యవహరించేవాళ్ళు. నా పుస్తకాలూ, వస్తువులూ దాచేసి వేధించేవాళ్ళు. నేను వీలైనంతవరకూ ఓర్పుతో సహిస్తూ, వాళ్ళకు స్నేహితుడిలా ఉండడానికి ప్రయత్నం చేసేవాడ్ని. 


కాని, వాళ్ళలో మార్పు రాలేదు సరి కదా - ఒకరోజు మా వసతిగృహంలో నేను లేని సమయం చూసి నేనెంతో అపురూపంగా చూసుకునే నా ట్రాన్సిస్టర్ రేడియోను పగలగొట్టి ముక్కలు చేసారు. నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం కనుక ఆ బుల్లి ట్రాన్సిస్టర్ నేనిక్కడికి వచ్చేటప్పుడు మానాన్న కొనిచ్చారు. అదింక నాకు లేదని తెలిసాక నా దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఒక్క పరుగున మా ఆశ్రమం వెనుక వైపున్న అడవికి దగ్గరలో ప్రవహించే ఏరు వైపు పరుగు తీసాను. 


నేను అశ్రమానికి వచ్చిన తొలినాళ్ళనుంచీ, మా అమ్మానాన్నా గుర్తొచ్చి గుబులుగా అనిపించినప్పుడల్లా - చాటుగా వచ్చి ఆ ఏటిగట్టున కాస్సేపు కూర్చుని చెట్ల మీద పక్షుల కిలకిలారావాలు వింటూ ఊరట చెందడం అలవాటయింది. 


ఆరోజు ఏటిగట్టున ఒంటరిగా నా దీనస్థితిని తలచుకుని విలపిస్తున్న సమయంలో - దూరంగా చెట్లకొమ్మల మధ్య కుహు కుహు అంటూ తియ్యని కోయిల కూత వినబడింది. వీనులకింపైన ఆ కోయిల గానం విని నేను పరవశానికి లోనయ్యాను. నేను అనుభవిస్తున్న బాధకు ఉపశమనం లభించినట్లనిపించింది. నాకలా సాంత్వన కలిగించిన కోయిలకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. 


కానీ.. ఎలా? మాటలు రాని నేను ఎలా వ్యక్తం చెయ్యగలను? సరిగ్గా.. అప్పుడే.. అదే క్షణంలో.. నా జీవితం మలుపు తిరగడానికి కారణభూతమైన చిత్రమైన కోరిక నాలో మొలకెత్తింది. 


"కోయిల స్వరాన్ని నేను అనుకరించగలిగితే.. ?"


"అంతే!"


ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు నేను!


"సాధ్యాసాధ్యాల గురించిన తలంపు లేకుండా - ఏదో అజ్ఞాతశక్తి ప్రేరేపించినట్లు.. స్వరసాధనకు పూనుకున్నాను. నాక్రింది పలువరుసను నాలుకతో అదిమిపట్టి రెండు పెదాలు దగ్గరకు చేర్చి, సున్నాలా చుట్టి, పెదాల మధ్య ఏర్పడ్డ సన్నటి సందు గుండా గట్టిగా ఊది ప్రయత్నించాను.


శబ్దం ఏదీ రాలేదు. గాలి మాత్రం బయటికి వచ్చింది. నేను నిరాశ చెందలేదు. మళ్ళీ ప్రయత్నించాను. ఫలితం శూన్యం. నేను పట్టు విడువలేదు. ప్రయత్నం కొనసాగించాను. చిట్టచివరికి నా పెదాల మధ్య నుంచి శబ్దం సన్నగా వెలువడింది. రెట్టించిన ఉత్సాహంతో నా ప్రయత్నం ముమ్మరం చేసాను. ఫలితంగా, నా నోటినుండి వెలువడే శబ్దం క్రమేపీ పెరుగుతూ ఈలగా పరివర్తన చెందింది. 


సాధించిన దానితో సంతుష్టి చెందక నాకృషిని కొనసాగించాను. సునాయాసంగా ఈల వేయడం వచ్చాక కోయిల స్వరాన్ని అనుకరించేందుకు పూనుకున్నాను. ఎట్టకేలకు నా ప్రయాస ఫలించింది. కోయిల స్వరాన్ని పోలిన కుహు శబ్దాన్ని నానోట పలికించగలిగాను. 


 - నా జీవితంలో మరపురాని ఘడియ అది. -


అవధులు దాటిన ఆనందంతో, అంబరాన్ని తాకిన అనుభూతి స్వంతం కాగా - మైమరచిన నాకళ్ళ నుంచి కన్నీటి ధార పెల్లుబికింది. నేను బాధలో ఉన్నప్పుడు తన్నుకొచ్చిన అశ్రువులు లాంటివి కావవి. నేను కథల్లో చదివిన ఆనంద బాష్పాలు ఇవేనని నాకు గ్రాహ్యమయింది. 


 అంతవరకూ నేను పడుతున్న తంటాలను పట్టించుకోకుండా నిర్విరామంగా తన గానాన్ని వినిపిస్తున్న కోయిల నా "కుహూ నాదం" విని ఉలిక్కిపడినదానిలా ఒక్కసారిగా మౌనం దాల్చింది. నా చెంపలమీదకి కారుతున్న బాష్పధారల్ని తుడుచుకుంటూ, మరోమారు ఈలతో కుహూ స్వరాన్ని పలికించాను. మరో కోయిల పోటీకి వచ్చిందని అనుకుందేమో, కోయిల తనూ తగ్గేది లేనట్లు 'కుహూకుహూ' అంటూ రాగం తీసింది. నేనూ నా ఈలతో ప్రతిస్పందించాను. 


ఇక చెప్పేదేముంది? మేమిద్దరం పోటాపోటీగా కుహూ కుహూ రాగాలు తీస్తుంటే, చీకటి పడిన సంగతే తెలియలేదు. కోయిల నాకు వీడ్కోలు పలికి తన గూటికి చేరినా, నాకు వసతి గృహానికి వెళ్ళాలనే ధ్యాసే లేకుండా పోయింది. నా ఈల వివిధరీతుల్లో పలికించడం సులువుగా మారిన తరువాత ఈలను పాటగా మలచాలనే ఆలోచన మదిలో మెరిసింది. 


మరి తొలి ప్రయత్నంగా ఏ పాటను ఎంపిక చేసుకోవాలన్న ప్రశ్న ఎదురయింది. నిజానికి చిన్నప్పటినుంచీ వింటున్న ఎన్నో సినిమా పాటల బాణీలు నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎంతో తర్జన భర్జన పడ్డ పిదప అవేవీ కాదనుకుని, మొట్టమొదటిసారిగా బడిలో ఎన్నోసార్లు విన్న "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" పాటను ఎంచుకున్నాను. ప్రయత్నం మొదలు పెట్టాక అర్థమయింది - ఈలను కావల్సిన సరళిలో రాగబద్ధమైన పాటగా మల్చడం అనుకున్నంత సులభం కాదని. 


అయినా దీక్షగా సాధనలో నిమగ్నమయ్యాను. చిట్టచివరకు అర్థరాత్రి సమయానికి విజయం సాధించాను. ఆ నిశీధిలో - హృద్యమైన వేణు గానాన్ని తలపించేలా సాగిన నా ఈలపాటలోని మాధుర్యానికి నా చుట్టూ ఉన్న చెట్టూ చేమా పులకించి తలలూపుతున్న భావన కలిగింది. ఇక వరుసగా నాకు నచ్చిన శ్రావ్యమైన సినిమా పాటల బాణీలు ఈలపాటలుగా ఆలపించడంలో నిమగ్నమై కృతకృత్యుణ్ణి అయ్యాను. 


 ఏ సంగీత బాణీనైనా, చెవులకింపైన ఈలపాటగా మలచి, అలవోకగా ఆలపించగలిగే సామర్థ్యం నా సొంతమయిందని అర్థమయింది. అలా పాడుతూ, పాడుతూ అలసిసొలసి ఎప్పుడు నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నానో తెలియదు. 

 తెల్లవారాక, నన్ను వెతుకుతూ వచ్చిన ఆశ్రమ సిబ్బంది లేపితే మెలుకువ వచ్చింది. వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి ఆశ్రమ అధికారుల ముందు నిలబెట్టారు. 


అనుకోకుండా ఆశ్రమం అవతల ఉన్న అడవిలోకి వెళ్ళి దారి తప్పాననీ, తిరిగిరావటం తెలియలేదనీ కథలల్లి చెప్పాను. ఇంకెప్పుడూ అలా అడవిలోకి వెళ్ళరాదని మందలించి సరిపెట్టారు అధికారులు. 


నేను తిరిగి మా వసతి గదిలోకి వెళ్ళేసరికి, నా సహ విద్యార్థులందరి ముఖాల్లో అపరాధ భావన కొట్టొచ్చినట్టు కనిపించింది. అందరూ నా చుట్టూ చేరి, నా ట్రాన్సిస్టర్ పగలగొట్టింది తామేననీ, తమ తప్పును మన్నించమనీ సైగలతో వేడుకున్నారు. నాకు మరో ట్రాన్సిస్టర్ కొనిపెడతామని వాగ్దానం చేసారు. వాళ్ళలో కలిగిన పరివర్తనకు నేనెంతో సంతోషించాను. 

ఆరోజు నుంచి వాళ్ళు నాతో స్నేహంగా మెలగడమే కాకుండా అన్నమాట ప్రకారం వాళ్ళు దాచుకున్న డబ్బుల్లోంచి తలా కొంత వేసి, మా వసతిగృహానికి సరుకులు తెచ్చే వాన్ డ్రైవర్ చేత భద్రాచలం నుంచి నాకొక చిన్న ట్రాన్సిస్టర్ తెప్పించి ఇచ్చారు. 


తెలియకుండానే రోజులు గడుస్తున్నాయి. మధ్యలో ఒకసారి మాత్రం మా అమ్మానాన్నా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. నా చదువు సాఫీగానే సాగింది. మరో నెల రోజుల్లో పరీక్షలు జరిగి వేసవి సెలవులకు మా ఊరు వెళతానని నేను ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో, సరిగ్గా అప్పుడే ఎవరూ ఎన్నడూ ఊహించని పెను విపత్తు కరోనా వైరస్ రూపంలో యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 


ఎందుకొస్తుందో, ఎలా పోతుందో తెలియని ఆ మహమ్మారి కొద్దిరోజుల్లోనే లెక్కలేనంత మందిని పొట్టన పెట్టుకుంది. తప్పనిసరై మన ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో దేశ ప్రజలందరితో పాటు మా ఆశ్రమంలో పిల్లలందరం కూడా బితుక్కు బితుక్కుమంటూ నెలల తరబడి బందీలుగా గడపసాగాం. ఎట్టకేలకు కరోనా వైరస్ కాస్త తగ్గు ముఖం పట్టి లాక్ డౌన్ లు ఎత్తేసి, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాక ఆశ్రమంలోని పిల్లలు ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళేలా ఆశ్రమ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. 


మా అమ్మానాన్నలను ఇన్నాళ్ళకు తిరిగి చూడబోతున్నానన్న సంతోషంతో నేనూ మాఊరు చేరుకున్నాను. కాని, మా అమ్మానాన్నల బదులు దురదృష్టం అక్కడ నాకోసం ఎదురుచూస్తోంది. 


మాఇంటికి చేరుకోగానే, మా అమ్మానాన్నలు ఇద్దరినీ కరోనా రక్కసి పొట్టన పెట్టుకుందన్న వార్త పిడుగులా చెవిన పడింది. మాఊరిలో కరోనా బారిన పడి మరణించిన ఇతరులతో పాటు మా అమ్మానాన్నలకు కూడా సామూహిక దహన సంస్కారాలే గతయ్యాయని తెలిసి హతాశుడ్ని అయ్యాను. సామూహిక దహనాలు జరిగిన చోటికి వెళ్ళి గుండెలు పగిలేలా విలపించాను. 


పిచ్చి పట్టిన వాడిలా రోజులు తరబడి ఆ ప్రదేశం చుట్టుపక్కలే తిరుగుతూ గడిపేవాడ్ని. ఎవరైనా దయ తలచి ఒక ముద్ద పడేస్తే తిన్నట్టు - లేకుంటే లేనట్టు. 


చివరికి దుఃఖాన్ని దిగమింగి మాఇంటి నాలుగు గోడలు పక్కింటి కామాక్షమ్మగారికి అప్పగించి మా ఆశ్రమం దారి పట్టాను. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది - ఆశ్రమం తాత్కాలికంగా మూసేసారనీ - తిరిగి ఎప్పుడు తెరుస్తారో తెలియదనీ! నాకు దిక్కు తోచలేదు. వెనుతిరిగి రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. అనాలోచితంగా ఏదో కదులుతున్న ట్రైన్ ఎక్కేసాను. 


నేను టిక్కెట్టూ కొనలేదు. ఆ రైలు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. ఒక పక్క ఆకలి దహించేస్తోంది. నా దగ్గర పైసా లేదు. ఇక చెయ్యి చాచి అడుక్కోవడం ఒక్కటే దారి. ఐతే, అందుకు ఒక పట్టాన మనసొప్పుకోలేదు. చివరికి ఎలాగైతే మనసుతో రాజీ పడి నా ఈలపాటతో ప్రయాణీకులను రంజింపజేసి, ఎవరైనా స్పందించి డబ్బులిస్తే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. 


నేను కంపార్ట్ మెంట్ మధ్యలో నిలబడి "ఈ గాలీ, ఈ నేలా" అంటూ సిరివెన్నెల సినిమాలో పాటను ఆలపించగానే సమ్మోహితులైన సంగీతాభిమానులు కొందరు తోచినన్ని డబ్బులు నా చేతికందించారు. నేను తర్వాత వచ్చే స్టేషన్ లో దిగి ఆ చిల్లర డబ్బులతో క్షుద్బాధ తీర్చుకున్నాను. 


అలా నాకు వచ్చే పోయే రైళ్ళలో ఈలపాటలూ, వచ్చిన డబ్బులతో కనీస అవసరాలు తీర్చుకోవడాలూ, ఫ్లాట్ ఫాం నిద్రలూ అలవాటయిపోయాయి. ఈ రెండేళ్ళలో, ఈ రెండు రాష్ట్రాల్లో నేను ఎక్కని రైలూ లేదు - తిరగని ఊరూ లేదు. ఈరోజు ట్రైన్ లో మీరు నా ఈలపాట విని, అభిమానంతో దగ్గరకు తీసి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇదీ నా కథ. 


సాంబు రాయడం ముగించి తలెత్తి చూసేసరికి, కొద్ది దూరంలో నిలబడ్డ పట్టాభి కనిపించారు. సాంబు నోటు పుస్తకంలో రాసింది ఆసాంతం చదివి చిన్నగా నిట్టూర్చారు పట్టాభి. 


"చాలా చిత్రమైన కథ నీది సాంబూ! పద్నాలుగేళ్ళ చిన్న వయసులో ఇన్ని కష్టాలు చవి చూడడం దురదృష్టకరం. అయినా, మొక్కవోని ధైర్యంతో నెట్టుకొస్తున్నావ్ చూడు! అందుకు నిన్ను అభినందిస్తున్నాను. సరే! చెప్పు! నీకింకా నిజంగా చదువుకోవాలని ఉందా?" 

పట్టాభి అడిగిన ప్రశ్నకు క్షణం ఆలోచించకుండా ఉందన్నట్లు తలూపాడు సాంబు. 


"అయితే విను. నేను హైస్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయినవాడ్ని. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఉండేది నేనూ, నా భార్యా మాత్రమే! నాతో వస్తే - నీకు చదువు చెప్పి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి. ఏ చదివించే బాధ్యత నాది. నువ్వు మాకు తోడుగా ఉన్నట్టూ ఉంటుంది. ఏమంటావ్?” 


పట్టాభి అలా అడగడమే అదృష్టంగా భావించిన సాంబు మరో ఆలోచన లేకుండా ఆయన వెంట నడిచాడు. పట్టాభి గారి భార్య సుమతి కూడా సాంబును ఆప్యాయంగా ఆదరించారు. శ్రద్ధగా చదువు కొనసాగిస్తూ, పట్టాభి దంపతులకు ఇంటి పనుల్లో సాయపడుతూ, తీరిక వేళల్లో వారిని తన ఈలపాటలతో అలరిస్తూ - త్వరిత కాలంలోనే సాంబు వారికి స్వంత మనిషిలా మారిపోయాడు. 


ఇలా ఉండగా, ఆ ఊరిలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేసిన పందిళ్ళలో ప్రతి రాత్రీ పూజల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆరోజు ఆ ఊరికే చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు రామశాస్త్రి గారి సంగీత కచేరీ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి హాజరవుతూ, పట్టాభి తనతో సాంబును కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. శాస్త్రిగారు రావడం కొంచెం ఆలస్యం కావడంతో, ఈలోగా ఔత్సాహికులు ఎవరైనా ఉంటే తమ గాత్రం వినిపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. 


వెంటనే పట్టాభి గారు ఈలపాట వినిపించమని సాంబును ముందుకు తోసారు. కొంత బిడియపడుతూనే స్టేజి మీదకు వెళ్ళిన సాంబు "నను పాలింపగ నడచీ వచ్చితివా" అంటూ ఆలపించిన ఈలపాటకు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపిన శ్రోతలు మరికొన్ని పాటలు పాడాల్సిందిగా ప్రోత్సహించారు. సాంబు వారి కోరికను మన్నించాడు. 


తలవని తలంపుగా, మరుసటి రోజు ఉదయం రామశాస్త్రిగారు పట్టాభి గారి ఇంటికి వచ్చారు. అతిథి మర్యాదలు అయ్యాక, శాస్త్రిగారు పట్టాభి గారితో ఇలా అన్నారు - "మాస్టారూ! నిన్న రాత్రి నేను అక్కడికి చేరుకునే వేళకి, తన ఈలపాటతో శ్రోతల్ని అలరిస్తున్న ఈ చిరంజీవి ప్రతిభకు నేను మంత్రముగ్ధుడ్ని అయ్యాను. దైవం ఇతనికి ఒక విధంగా అన్యాయం చేసినా, అపూర్వమైన వరాన్ని ప్రసాదించాడు. మీకు అభ్యంతరం లేకపోతే, ఇతనికి శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను."


"అంతకన్నానా? మహాభాగ్యం!" అంటూ పట్టాభి సాంబు వైపు చూసారు. వెంటనే సాంబు శాస్త్రి గారికి సాస్టాంగ నమస్కారం చేసాడు. శాస్త్రి గారు అతడ్ని ఆశీర్వదిస్తూ - "చూడు బాబూ! సంగీత సాధన తోడైతే - ఈలపాట రఘురామయ్య వంటి ప్రజ్ఞావంతుల కోవలోకి చేరే ప్రతిభ నీకుంది. మంచిరోజు చూసి సంగీత పాఠాలు మొదలెడతాను." అన్నారు. 

అన్నమాట ప్రకారం శాస్త్రిగారు పాఠాలు మొదలుపెట్టిన రెండేళ్ళకల్లా, ఏకసంతాగ్రాహి కావడంతో పాటు శ్రద్ధాసక్తులు తోడవడంతో సాంబు కృషి కీర్తనలు నేర్చుకునేవరకూ వచ్చింది. 


ఒక శుభోదయాన శాస్త్రిగారు ఒక పత్రికా ప్రకటన తెచ్చి పట్టాభిగారికి, సాంబుకి చూపిస్తూ- ప్రముఖ సినీ దర్శకులు గౌరీనాథ్ త్వరలో పృథ్వీరాజా సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో ఈలపాట పాడే వ్యక్తిదే ప్రధాన పాత్రనీ, ఆ పాత్రకు ఈలపాటలు ప్లేబాక్ పాడడానికి, ప్రతిభావంతుడైన యువ కళాకారుడ్ని ఎంపిక చేయడానికి విజయవాడలో ప్రాథమిక స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారనీ, ఎంపిక చేసిన పదిమందికీ హైదరాబాద్ లో పేరొందిన సినీ సంగీత దర్శకులు న్యాయనిర్ణేతలుగా ఫైనల్ పోటీ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారనీ తెలిపారు. 


సాంబు ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇదే సదవకాశం అని పట్టాభిగారు కూడా భావించి ప్రాథమిక దశ పోటీకి సాంబును విజయవాడ తీసుకువెళ్ళారు. ఆ పోటీలో సాంబు అవలీలగా ఎంపికయ్యాడు. 


ఊరికి తిరిగి వచ్చిన వెంటనే, మరో వారం రోజుల్లో హైదరాబాద్ లో జరిగే ఫైనల్ పోటీకి సాంబును సిద్ధం చేయసాగారు శాస్త్రిగారు. మరుసటిరోజు ప్రయాణమనగా, పట్టాభిగారికి తీవ్రమైన జ్వరం రావడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. శాస్త్రిగారు వయోభారం కారణంగా ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. 

ఎన్నో ఊళ్ళు తిరిగినవాణ్ణి - హైదరాబాద్ వెళ్ళి రావడం తనకొక సమస్య కాదని సర్దిచెప్పి సాంబు హైదరాబాద్ ట్రైనెక్కాడు. కాని, ఉదయం ఏడింటికల్లా చేరాల్సిన రైలు మూడు గంటలు ఆలస్యమై పది గంటలకు కాని హైదరాబాద్ చేరుకోలేదు. ప్రముఖ ఆడిటోరియంలో పది గంటలకే పోటీ ప్రారంభం కానున్నది కనుక సాంబులో ఆందోళన పెరిగింది. చక చకా స్టేషన్ నుండి బయటకు వచ్చి అప్పుడే వచ్చి అంతదూరంలో ఆగిన ఆటో వైపు పరుగు తీస్తుండగా వేగంగా వచ్చిన స్కూటరిస్ట్ ఢీ కొట్టడంతో ఎగిరి అంత దూరంలో పడ్డాడు. 


కాళ్ళూ, చేతులతో పాటు నుదుటికి కూడా దెబ్బలు తగిలాయి. క్రింది పెదవి సైతం చిట్లి రక్తం వచ్చింది. అతికష్టం మీద లేచి కూర్చోగలిగాడు సాంబు. ఎవరో వచ్చి లేపి బాగ్ చేతికందించి ఆటో ఎక్కించారు. తగిలిన గాయాలకన్నా, పోటీకి సకాలంలో చేరలేకపోతున్నానన్న బాధ అతడ్ని అమితంగా వేధించసాగింది. సరిగ్గా అతను ఆడిటోరియంలో అడుగుపెడుతుండగా, చిట్టచివరి అభ్యర్థిగా అతని పేరు అనౌన్స్ చేయడం వినిపించింది. 


వంటి నిండా గాయాలతో, దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో కుంటుతూ వస్తున్న అతడ్ని నిర్వాహకులు వింతగా చూస్తుండగా స్టేజ్ పైకి చేరి మైక్ ముందు నిలబడ్డాడు సాంబు. తనను తాను నిరూపించుకోవాలన్నా, తన గురువుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నా ఇది పరీక్షా సమయం అని అతనికి తెలుసు. అందుకే, సలుపుతున్న శారీరక గాయాల్ని లెక్కచేయక, చిట్లిన పెదవి పెడుతున్న మంటను ఓర్చుకుంటూ, గుండెలనిండా గాలి పీల్చుకుని వదిలాడు. 


తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫణంగా పెడుతూ కార్యసాధనకు ఉపక్రమించాడు. కాని, ఆ పోటీలో పాడడానికి ముందుగా సాధన చేసిన పాట కాకుండా - అతని ఆవేదనకు అద్దం పడుతున్నట్లు, అసంకల్పితంగా అతని నోట "నగుమోము గనలేని నా జాలి తెలిసి" త్యాగరాజ కీర్తన ఈలపాట రూపంలో జాలువారింది. 


మొసలి బారిన పడ్డ గజేంద్రుడు కూడా విష్ణుమూర్తికి మొరలిడుతూ ఈలపాటలో తన బాధ వ్యక్తం చేసి ఉంటే ఇలాగే ఉండి ఉండేదేమోనన్నట్లు, సాంబు గుండె లోతుల్లోంచి వ్యధాభరిత గాన ప్రవాహం పెల్లుబికింది. ఆ గానలహరిలో ఓలలాడని శ్రోత లేడా ఆడిటోరియంలో! 


సాంబు ఈలపాట ముగియగానే శ్రోతల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. సాంబు అపూర్వ గాన మాధుర్యం చవి చూసిన న్యాయ నిర్ణేతల విధి నిర్వహణ నల్లేటిపై బండి నడకే అయింది. మరో కొద్ది సేపటిలోనే సభికుల హర్షధ్వానాల మధ్య సాంబును విజేతగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది. 


అంతులేని ఆనందంతో చెమర్చిన సాంబు కళ్ళ ముందు తన విజయానికి కారకులైన పట్టాభి దంపతులు, శాస్త్రి గారు మెదిలారు. మనసులోనే వారికి నమస్కరించాడు. ఇక ఊరు వెళ్ళి వారి ఆశీస్సులతో చెన్నై కి పయనం కట్టడమే అతని తక్షణ కర్తవ్యం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి మున్ముందు జీవన ప్రస్థానంలో ఒడిదుడుకులు తట్టుకుని అతడెన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తాడో ఎవరికెరుక!? 


 0—---------0—----------0


విజయ్ ఉప్పులూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: విజయ్ ఉప్పులూరి

అడపా దడపా మాత్రమే కథలు రాసిన నన్ను నేను " నిత్య నూతన రచయితగా అభివర్ణించుకుంటాను. అచ్చు పత్రికల స్వర్ణ యుగంలో నా కథలు ప్రముఖ వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. లోగడ స్వాతి మాస పత్రిక నిర్వహించిన పోటీలో నా నవల "లలాట లిఖితమ్" కు బహుమతి వచ్చింది.

ఇటీవల ఛాయా బుక్స్ ద్వారా నా రెండు కథా సంపుటాలు - 1) "అనుభూతి కథలు", 2) "తిరిగి పాత రోజుల్లోకి" వెలువడ్డాయి. ఈ పుస్తకాలు అమెజాన్. కామ్ లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల "సహారి" వార పత్రిక నిర్వహించిన " క్రైమ్ కథల పోటీలో నా కథ "ఫలించని ఎత్తు" బహుమతిని గెలుచుకుంది.

భవదీయుడు

విజయ్ ఉప్పులూరి

留言


bottom of page