పనిమనిషి

Panimanishi - Telugu Family Story | Merla Srilakshmi
పనిమనిషి - తెలుగు కుటుంబ కథ | మెర్ల శ్రీలక్ష్మి
Published in manatelugukathalu.com on 03/10/2026
పెళ్లి తర్వాత ఇంటి పనులకే పరిమితమై, అవమానాలు ఎదుర్కొన్న కీర్తి తన చదువుతో జీవితాన్ని ఎలా మార్చుకుంది? భర్త ప్రేమ, ప్రోత్సాహం, ఆత్మగౌరవం చుట్టూ అల్లుకున్న హృదయస్పర్శి సామాజిక కుటుంబ కథ “పనిమనిషి”.
“ఏయ్ కీర్తీ, ఎక్కడికి పోయావే... బాత్రూంలో వేడినీళ్లు పెట్టకుండా..” అని కేక వినిపించింది.
“ఆ వస్తున్నా అత్తయ్యా!” అంటూ నిద్రలోనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది కీర్తి.
కళ్ళు తెరిస్తే తను పుట్టింట్లో ఉంది. తలంతా భారంగా ఉంది. అప్పుడే వంట చేసి వచ్చిన తల్లి సావిత్రి, “లేచావా కీర్తీ! టిఫిన్ చేయకుండా పడుకున్నావు. ఏంటా నిద్రా..” అంది.
కీర్తి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయిందో!
“ఆ కళ్ళేంటే అంత ఎర్రబడ్డాయి.. ఒంట్లో బాగానే ఉందా?” అంది చెయ్యి పట్టుకుని చూస్తూ.
“బాగానే ఉందమ్మా! తలనొప్పిగా ఉంటే పడుకున్నాను.”
“అలాగా.. టీ పెట్టి ఇవ్వనా!”
“వద్దమ్మా! పడుకుంటే తగ్గిపోతుంది.”
“సరే, తగ్గకపోతే చెప్పు. మీ నాన్నకి ఫోన్ చేసి టాబ్లెట్ తెప్పిస్తాను.”
“సరే అమ్మా!” అని పక్కకు తిరిగి పడుకుంది. కానీ సావిత్రికి కూతురి మొహంలో దిగులు కనిపించింది.
కీర్తికి పెళ్లయ్యి ఏడాది అవుతోంది. పెళ్లికి ముందు జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆమెకు, పెళ్లి తర్వాత జీవితం అంతగా నచ్చడం లేదు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం.
పెద్ద పెంకుటిల్లు. పుట్టింట్లో ఉన్నట్టు అత్తారింట్లో స్వేచ్ఛ ఉండదు. పెళ్లికి ముందు తనకు నచ్చింది చేయొచ్చు. ఎప్పుడు లేచినా ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఏ అవసరం వచ్చినా స్వేచ్ఛగా అమ్మానాన్నలను అడిగే చనువు ఉంటుంది.
అత్తారింట్లో అలా కాదు. ఆకలేస్తే ఎప్పుడు తినమని పిలుస్తారా అని ఎదురుచూడాలి. తెల్లవారుజామునే నిద్రలేవాలి. లేవకుంటే అవమానాలు, తిట్లు.
అలాంటిదే ఒక రోజు అలసటతో త్వరగా నిద్రలేవలేదు. అత్తగారు విసుగ్గా గిన్నెలు పడేస్తూ ఎవరినో తిడుతోంది. అది ఎవరో కాదు, తననే. గబగబా లేచి వెళ్ళింది. అప్పటికే గిన్నెలు పోగేసి కొళాయి దగ్గర పెట్టింది.
“అలారం పెట్టుకోవడం మర్చిపోయా అత్తయ్యా!” అంది కీర్తి.
“వెళ్లి బయట తుడువు.. నీళ్లు చల్లి ముగ్గు వేసి రా..” అంది అత్త.
ఆ తర్వాత గిన్నెలు, బట్టలు ఉతకడం.. ఒక్కొక్కటిగా పనులు చెబుతూనే ఉంది. కానీ టీ, టిఫిన్ ఏదీ తినమని ఇవ్వలేదు. అప్పటికే సమయం పదకొండు దాటింది.
నీరసం వచ్చి కూర్చుండిపోయింది. మంచినీళ్లు అడిగింది. “ఇస్తాను, ముందు బట్టలు ఆరేసి రా.. ఎండిపోతుంది..” అంది.
ఎండ నెత్తిమీద పడుతుంటే లేచి బట్టలు ఆరేసి వచ్చింది. మంచినీళ్లు తాగి, టిఫిన్ కోసం గిన్నెలు చూసుకుంది. గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. పాల కోసం చూస్తుంటే అత్తగారు, “భోజనం టైము అవుతుంటే టీ ఎందుకు..” అంది.
ఆ ఇంట్లో మొత్తం ఇరవై మంది. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, పెద్ద కోడలు పిల్లలు, ఆడపడుచు, ఆమె భర్త, ఆమె పిల్లలు.
ఆడపడుచు కూతురే రేణుక, పెద్ద కోడలు. మనవరాలిని కొడుకు వంశీకి చేసుకుంది. రేణు చదువుకోలేదు. కానీ పెద్ద కొడుకు డిగ్రీ చదివాడు, బ్యాంకులో ఉద్యోగం.
తను చదువుకుంది, కానీ తన భర్త రాజుకి చదువు లేదు. పది కూడా పూర్తి చేయలేదు.
“అబ్బాయి మంచోడు, వ్యవసాయం చేస్తాడు” అని చేశారు పెళ్లి. కానీ అతను ఆ ఇంట్లో పనోడు, ఆమె ఇంటి పనిమనిషి అన్నట్టు ఉండేది.
ఒక రోజు కీర్తి గుడికి వెళ్లి ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఆ రోజు వంశీ పుట్టినరోజు. బావగారికి ఇష్టమైన వంటలు చేయాలని అత్తగారి ఆర్డర్. ఆఫీస్ వాళ్ళను కూడా ఇంటికి పిలిచారు.
వంటింట్లో నుండి బయటకు వచ్చేసరికి రేణు, అత్త, ఆడపడుచు, వాళ్ళ భర్తలు కొత్త బట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు. అప్పటికే వంశీ స్నేహితులు వచ్చేసారు. కేక్ తేవడానికి వెళ్లిన రాజు ఇంకా రాలేదని మామగారు, అత్త గుమ్మం దగ్గర నిలబడి తిడుతున్నారు.
ఇంతలో రాజు వచ్చాడు తన పాత సైకిల్ మీద. వీధి గదిలో మంచం మీద కూర్చున్న బామ్మగారు రాజు అలసిపోయి రావడం చూశారు.
“రాజు, మంచినీళ్లు తెచ్చి పెట్టు” అనే మాటకి అతను భార్యను పిలిచాడు. ఆమె మంచినీళ్ల గ్లాస్ ఇవ్వడానికి అలాగే బయటకు వచ్చింది - చెదిరిన జుట్టు, ఒళ్ళంతా చెమటలు కారుతుంటే చీర కొంగుతో తుడుచుకుంటూ.
అప్పుడే ఒకామె జ్యూస్ తాగుతూ గ్లాస్ కింద పడేస్తే తీయబోయింది.
“అయ్యో మీరెందుకమ్మా తీయడం... ఆగండి, మీరు మా అతిథులు.. కీర్తీ..” అని కేకేసింది ఆ వచ్చినామె.
కీర్తి భర్త చేతికి గ్లాస్ ఇచ్చి అత్త పిలిచిందని వెళ్ళింది.
“ఇక్కడ శుభ్రం చెయ్. పిల్లలు అటూ ఇటూ తిరుగుతారు. గాజు ముక్కలు గుచ్చుకుంటాయి..”
కీర్తి వెళ్లిపోతుంటే మళ్ళా పిలిచి, “ఇదిగో ఈ డబ్బులు ఉంచు..” అంది ఐదు వందల కాగితం ఇస్తూ. కీర్తి ఏం మాట్లాడకుండా కళ్ళు పెద్దవి చేసి చూసింది.
“అరే ఏంటి అలా చూస్తావు? నీ ఒంటి మీద చీర, నీ వాలకం చూస్తేనే నీ పేదరికం తెలుస్తోంది. ఈ డబ్బుతో మంచి చీర కొనుక్కో..” అంది పర్సులో నుండి ఇంకో ఐదు వందలు తీసి ఇవ్వబోతూ.
మధ్యలో అత్తగారు, రాజు ఆవేశంగా లోపలికి రావడం చూసి, “అయ్యో మీరెందుకు ఇవ్వడం.. మేము ఉన్నాం కదా!” అని అడ్డుపడింది.
రాజును తండ్రి అడ్డుపడి ఆపి బయటకు లాక్కుని వెళ్తున్నాడు.
“ఏంటి నాన్నా! ఆ అమ్మాయి కీర్తిని అలా డబ్బులు ఇచ్చి తక్కువ చేసి, ఇంటి పనిమనిషిలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే..”
“ఏం మాట్లాడాలిరా.. వాళ్ళు అసలే గొప్పోళ్ళ బిడ్డలు.. వాళ్ళు మీ అన్నయ్య స్నేహితులు.. నీ భార్య కోసం వాళ్ళని మాట అంటే బాధ పడతారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి.”
ఆ మాటతో రాజు అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. బామ్మ పిలుస్తున్నా వినకుండా కళ్ళలో నీళ్ళు కనపడకుండా దాచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ కీర్తి అతని కళ్ళలో నీళ్ళు ఎదురుగా ఇంటి ముందు నిలిపిన కారు అద్దంలో చూసింది.
బామ్మ గదిలోకి వెళ్ళింది కీర్తి. “రాజు ఉన్నాడా బయటా?” అడిగింది బామ్మ.
“లేదు బామ్మా! పని ఉందని వెళ్ళిపోయారు.”
“వీళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నానని ఎవరూ నా మాట వినరు. ఎవరి మీదా ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకుని బతుకుదామంటే ఒంట్లో ఓపిక లేదు” అంది కళ్లద్దాలు పెట్టుకుంటూ.
“ఏం లేదమ్మా, లోపల వాళ్ళ మాటలు విన్నాను. నువ్వు బాధపడ్డావేమో ఓదార్చమని చెప్పడానికి పిలిచాను. వీళ్ళంతేనమ్మా.. చేతిలో రూపాయి ఉంటేనే విలువ ఇస్తారు.
నువ్వు ఎలాగో చదువుకున్నావు. ఏదైనా బడిలో పంతులమ్మగా చేరాల్సింది” అంది బామ్మ.
ఆ మాటతో కీర్తికి మనసు మళ్ళింది.
అప్పటి వరకు కీర్తికి భర్త అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఆ ఇంట్లో తనని ఎలా చూస్తారో, తనూ అలాగే భర్తను విలువ లేని మనిషిలా చూసేది. కానీ ఎప్పుడైతే తనకి అవమానం జరిగి, భర్త కళ్ళలో కోపం, ఆవేశం కనిపించాయో, ఆమెను అతని ప్రేమలో కట్టి పడేశాయి.
తల్లి ఇచ్చిన టీ తాగుతుంటే ఫోను మోగింది. స్క్రీన్ మీద భర్త నెంబర్ చూడగానే ఆమె మొహంలో చిరునవ్వు.
ఫోన్లో భర్త “రెడీ అవ్వు” అని చెప్పగానే హడావిడిగా బయలుదేరింది. భర్త స్నేహితుడి బైక్ మీద వచ్చాడు. తనని ఎక్కమని కనుసైగ చేశాడు. ఆమె ఎక్కి కూర్చుంది.
ఒక అరగంట తర్వాత బైక్ ఒక స్కూల్ ముందు ఆగింది. అది వంశీ కొడుకు చదివే స్కూల్.
“పండు వాళ్ళ స్కూల్లో లెక్కల మాస్టారు లేరంట. నీ మార్కులిస్ట్ అన్నీ చూశాను. అవి సార్‌కి చూపిస్తే రమ్మని కబురు చేశారు. ఇంక నీకు ఉద్యోగం వచ్చినట్టే.. ఎవరి ముందూ చెయ్యి చాచే అవసరం ఉండదు.”
ఆ మాటకి కీర్తి కళ్ళలో కన్నీళ్లు..
ఇంతలో లోపల నుండి మాస్టారు వచ్చి, “ఇన్నాళ్లు ఎక్కడున్నారమ్మా! మీ మార్క్స్ చూశాం. మాకు ఓకే. లోపలికి రండి, శాలరీ మాట్లాడదాం” అన్నారు.
కీర్తి భర్త చెయ్యి పట్టుకుని లోపలికి అడుగు పెట్టింది.
~ సమాప్తం ~
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మెర్ల శ్రీలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నా పేరు మెర్ల శ్రీలక్ష్మి






Comments