top of page
Original.png

కోపం మామ - పాపం అల్లుడు

48 minutes ago
4 min read

కోపంతో ఉన్న మామ సుబ్బరాజు, అమాయకంగా నిలబడిన అల్లుడు ముత్యం – తెలుగు హాస్య నీతి కథ కోపం మామ పాపం అల్లుడు చిత్రణ.

Kopam Mama - Papam Alludu - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.

కోపం మామ - పాపం అల్లుడు - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 05/10/2026


కోపం మామ - పాపం అల్లుడు అనేది నవ్వులు పూయిస్తూ మంచి సందేశాన్ని అందించే తెలుగు హాస్య నీతి కథ. ఆస్తి, అహంకారం, కోపంతో నిండిన సుబ్బరాజుకు అమాయకుడైన అల్లుడు ముత్యం చేసే పనులు ఊహించని చిక్కులు తెచ్చిపెడతాయి. మామ చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించే అల్లుడి వ్యవహారం ఈ కథలో హాస్యాన్ని పండిస్తుంది. ఇతరులపై కోపంతో ఆదేశాలు ఇచ్చే ముందు ఆలోచించాలనే సందేశాన్ని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.


సుబ్బరాజుకు ఒక్కగానొక్క కూతురు బిందు.


మూడు తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టారు సుబ్బరాజు తాతముత్తాతలు. పుట్టడమే గోల్డ్ స్పూన్‌తో పుట్టడం వల్ల సుబ్బరాజుకు గర్వంతో పాటు కోపం కూడా ఎక్కువే.


తన మాటకు ఎదురు చెబితే వాళ్లను ఏదో ఒకటి చేస్తే కానీ కోపం తగ్గదు. ఊరేమో చిన్నది, పైగా సుబ్బరాజుతో సమానమైన ఆస్తి ఎవరికీ లేదు. దాంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోమంది సుబ్బరాజు మీద ఆధారపడి బ్రతికేవాళ్లే.


బిందుకు యుక్తవయసు రావడంతో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన సుబ్బరాజు తనకంటే ఎక్కువ ఆస్తి ఉన్న పెళ్లికొడుకు కోసం జిల్లానే కాదు, రాష్ట్రాన్నే జల్లెడ పట్టాడు. ఎట్టకేలకు ఆరు నెలలు గడిచేసరికి ఓ సంబంధం కుదిరింది బిందుకు.


సుబ్బరాజు కంటే మూడురెట్ల ఆస్తి కలిగిన జమీందార్ చిట్టచివరి కొడుకు ముత్యంతో వివాహం నిశ్చయమయ్యింది. ఇద్దరు అన్నలకు, తల్లిదండ్రులకు కూడా ముత్యమంటే ఎంతో ఇష్టం; పైగా అమిత గారభం. దాంతో అతి మంచితనంతో పాటు లోకజ్ఞానం కొంచెం తక్కువ ముత్యానికి.


ఒక్కడే కొడుకు/చివరి కొడుకు కావడం, బిందు ఒక్కతే కూతురు కావడంతో ఇల్లరికానికి ఒప్పుకున్నాడు ముత్యం తండ్రి.


పెళ్లి అంగరంగ వైభవంగా చేసిన సుబ్బరాజు ఆరు నెలల తర్వాత తనకున్న ఆస్తిపాస్తుల్ని అప్పజెప్పాడు.


ఇల్లు పీకి పందిరి వేయడం


ఒక రోజు ముత్యాన్ని పిలిచి, "అల్లుడూ! మనదగ్గర అప్పు తీసుకున్న విశ్వనాథం బాకీ చెల్లించడం లేదు, సరికదా నన్ను ఎన్నో మాటలన్నాడట.


నువ్వెళ్లి వాడి ఇల్లు పీకి పందిరి వేసిరా!" అని కోపంతో చెప్పేసరికి మందిమార్బలంతో బయల్దేరి వెళ్లాడు ముత్యం. విశ్వనాథం కాళ్లవేళ్లా పడి బ్రతిమాలినా ఒప్పుకోక, మావగారి మాట తుచ తప్పకుండా ఇల్లు పీకేసాడు.


కూడ ఉన్న మామగారి అనుచరులు అల్లుడి ధైర్యానికి ఫిదా అయిపోయి చప్పట్లు కొట్టారు.

అందరూ వెనక్కి తిరిగి వెళ్తుండగా ముత్యం తన అనుచరులను పిలిచి, "ఇదిగో పదివేలు.

మీరు కొత్త సామాగ్రి కొని విశ్వనాథంకు పందిరి వేసి రండి" అని వారి చేతిలో డబ్బు పెట్టాడు. ఇంటికి వచ్చి మావగారితో, "మీరు చెప్పినట్టు ఇల్లు పీకి పందిరి వేసాను" అని చెప్పేసరికి సుబ్బరాజు నోట మాట లేకుండాపోయింది.


విచిత్రమైన వ్యవసాయం


అల్లుడి ప్రతిభ తెలుసుకున్న సుబ్బరాజు అతన్ని వ్యవసాయంలో పెట్టాడు.


బాధ్యతను అప్పజెప్పే ముందు, "అల్లుడూ! వ్యవసాయం అంత సులువైనదేమీ కాదు. పండిన ప్రతి గింజ ఒక్కో పైసాతో సమానం.


ఒక్కొక్క గింజ కలిసి ఒక బస్తా అయినట్టు, ఒక్కొక్క పైసా పోగుచేస్తేనే ఒక రూపాయి అవుతుంది. జాగ్రత్తగా దగ్గరుండి వ్యవసాయం చేసుకో" అని ఇంకా ఎన్నో మెళకువలు చెప్పాడు.


అన్నింటినీ శ్రద్ధగా విన్న ముత్యం ఎంతో కష్టపడి రేయింబవళ్లు తేడా లేకుండా పొలాన్ని అంటిపెట్టుకునే ఉండి పంట పండించాడు.


ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ బస్తాలు పండటంతో ఎంతో సంతోషించిన సుబ్బరాజు, తీరా లెక్కలు చూసేసరికి గుండె ఆగినంత పనయ్యింది. పంట ఎక్కువ పండినా గతంలో ఎన్నడూ లేనంతగా లాస్ (నష్టం) రావడంతో తానే రంగంలో దిగి విచారణ చేసేసరికి చుక్కలు కనిపించాయి! బస్తాల మీద వచ్చే డబ్బు కన్నా కూలీలకు ఎక్కువ ఖర్చు అయి లాభం కన్నా నష్టమే మిగిలింది సుబ్బరాజుకు.


అంతలో తన దగ్గర పనిచేసే కూలీలందరూ కలసికట్టుగా వచ్చి చేతులు జోడించి, "అయ్యా! తమరి అల్లుడిగారి దయవల్ల మా అందరికీ తమ పొలంలో పని దొరికింది.


ఇదివరకు ఎప్పుడూ, ఎవరూ చేయనట్టి—చేలో రాలిపోయిన ప్రతి గింజను కూడా కూలీలను పెట్టి మరీ ఏరించి ఎకరానికి పది బస్తాలు ఎక్కువ వచ్చేలా చేశారు. దానివల్ల మాబోటి నలుగురికి ఇంకో పదిరోజుల పాటు పని కూడా దొరికిందయ్యా.


ఆ మహానుభావుడు పది కాలాల పాటు చల్లగుండాలయ్యా" అని వాళ్లు దీవించేసరికి అరికాలి మంట నెత్తికెక్కింది సుబ్బరాజుకు. కానీ కూతురి ముఖం చూసి ముత్యాన్ని పల్లెత్తు మాట అనలేక, ఇక వ్యవసాయం వద్దని ఇంట్లో కూర్చోమన్నాడు.


నామినేషన్ గొడవ


ఇది జరిగిన ఐదు నెలలకు ఓ రోజు రాత్రి ఏడు గంటలకు సుబ్బరాజు ప్రెసిడెంట్‌గా నిలబడటానికి, మరునాడు నామినేషన్ వేయడానికి ఊరి పెద్దలతో సమావేశమయ్యాడు.


మొట్టమొదటిసారిగా పదవిని చేపట్టాలనుకునేసరికి ఒక యువకుడు, "మీకు వయసైపోయింది. అందుకు నన్ను సపోర్ట్ చేయండి, లేకపోతే పోటీకి దిగుతాను" అని హెచ్చరించాడు.


ఆదిలోనే హంసపాదుగా అడ్డువచ్చేసరికి నరసింహస్వామిలా రెచ్చిపోయిన సుబ్బరాజు కోపంతో, "నాకే అడ్డుతగులుతావా? నీ అంతు చూస్తాను. మీ నాన్న నాకు ఇంకా డబ్బులు బాకీ ఉన్నాడు. ముందు నువ్వు ఆ అప్పు తీర్చు, ఆ తర్వాత పోటీ చేయి దుస్తువు గాని!" అన్నాడు.


అందుకు ఆ యువకుడు, "మా నాన్న అప్పు చేస్తే వాడినే అడగండి. చచ్చి స్వర్గంలో ఉన్నాడు, అక్కడికి వెళ్లి అడగండి" అని పెడసరంగా అనేసరికి, సుబ్బరాజు ఒక్కసారిగా కూర్చున్నవాడల్లా లేచి అతన్ని కొట్టడానికి మీదకు వెళ్లాడు.


మిగిలిన వారు వెంటనే కలుగజేసుకుని సుబ్బరాజును ఆపి, ఆ కుర్రాణ్ణి బయటకు పంపించేశారు. సభ కాస్తా రసాభాస కావడంతో ఎక్కడి వాళ్లు అక్కడికే వెళ్లిపోయారు.


తెల్లవారేసరికి... కనపడకూడదు!


అయినా కోపం తగ్గని సుబ్బరాజు ఇంట్లోకి వచ్చి పళ్లు నూరుతూ, "తెల్లారేసరికి వాడు నాకు కనపడకూడదు అల్లుడూ! అందుకు నువ్వు ఏదో ఒకటి చేయి" అని ముత్యంతో అన్నాడు.


"అలాగే మావయ్యా!" అని ముత్యం చెప్పి, గతంలో తనకు జరిగిన అవమానాలను గుర్తుచేసుకుని, వాటిని ఈ దెబ్బతో కనుమరుగయ్యేలా చేసి మావగారి మెప్పు పొందాలని నిర్ణయించుకున్నాడు.


ఇంకా తెల్లవారుతోందనగా సుబ్బరాజు తన గదిలోంచి, "బాబోయ్... నా కళ్లు కనపడటం లేదు! మండిపోతున్నాయి... అమ్మోయ్!" అని పెద్దగా గావుకేకలు పెడుతుంటే అందరూ

కంగారుపడుతూ వెళ్లి "ఏమైంది?" అని అడిగారు.


"నాకేమీ తెలియడం లేదు, చూపు పోయింది!" అని ఏడుస్తూ చెప్పాడు.


బిందు తండ్రి కళ్లను దగ్గరకెళ్లి పరీక్షగా చూసి, "కళ్ల కొలుకుల్లో తెల్లగా ఉందేమిటి?" అని అడిగింది. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు.


అక్కడే ఉన్న ముత్యం, "అది జిల్లేడు ఆకు పాలు. రాత్రి మావయ్య ఒళ్లు తెలియకుండా పడుకుంటే నేనే జిల్లేడు ఆకు పాలు తెచ్చి కళ్లు విడదీసి పోసాను" అన్నాడు.


అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతూ కోపంగా "ఎందుకు?" అని ఒకేసారి అరిచారు.


"రాత్రి జరిగిన గొడవ తర్వాత మావయ్య కోపంతో నాతో 'తెల్లారేసరికి వాడు నాకు కనపడకూడదు' అన్నాడు. అందుకే మావయ్య వాణ్ణి జీవితంలో ఎప్పుడూ చూడకుండా కళ్లు పోయేలా జిల్లేడు పాలు వాడాను... తప్పా?!" అని ముత్యం అమాయకంగా అడిగాడు.


"నీకు మీవాళ్లు 'ముత్యం' కాదు, 'స్వాతిముత్యం' అని పేరు పెట్టాల్సింది!" అనేసి, ఏడుస్తూ భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్లే పనిలో పడ్డారు సుబ్బరాజు భార్య మరియు అత్తగారు.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page