నా సాహితీ ప్రయాణం

Na Sahithi Prayanam - Telugu Inspirational Article | Kasivarapu Venkatasubbaiah
నా సాహితీ ప్రయాణం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కాశీవరపు వెంకటసుబ్బయ్య
Published In manatelugukathalu.com On 05/10/2026
నా సాహితీ ప్రయాణం పేరుతో ప్రముఖ కవి, కథారచయిత కాశీవరపు వెంకటసుబ్బయ్య తన బాల్యం నుంచి రచయితగా ఎదిగిన జీవిత అనుభవాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. కడప జిల్లా కమలాపురం ప్రకృతి వాతావరణం, ప్రొద్దుటూరులోని సాహిత్య సభలు, ప్రముఖ కవులు–రచయితల పరిచయాలు, కవిత్వం నుంచి కథారచన వైపు సాగిన ప్రయాణం, తొలి కథలకు లభించిన గుర్తింపు—ఇవన్నీ ఈ సాహిత్య ఆత్మకథలో ఆసక్తికరంగా ఆవిష్కృతమవుతాయి.
నా సాహితీ ప్రయాణం – కాశీవరపు వెంకటసుబ్బయ్య
నేను వృత్తిరీత్యా వ్యవసాయదారుడిని. ప్రవృత్తిరీత్యా సాహిత్యకారుడిని. నేను కవిత్వ పిపాసిని, కావ్యారాధకుడిని, కథా ప్రేమికుడిని, నాటకాభిమానిని, సాహిత్య ఉపాసకుడిని, ప్రకృతి సౌందర్య ఆస్వాదకుడిని.
1960 సంవత్సరంలో పుట్టాను. నాన్న చదిపిరాళ వెంకటసుబ్బన్న, అమ్మ చిన్నక్క. మా నాన్న చదిపిరాళ్ళ గ్రామంలో పుట్టి పెరగడం వల్ల ఆయనకు ఊరి పేరే ఇంటి పేరైంది. నన్ను బడిలో చేర్చేటప్పుడు ఇంటి పేరుతో "కాశీవరపు వెంకటసుబ్బయ్య" అని రాయించారు. అందువల్ల ఆయన ఊరి పేరుతోనూ, నేను ఇంటి పేరుతోనూ పిలవబడ్డాము.
1980లో ప్రొద్దుటూరుకు చెందిన కళావతితో నా వివాహం జరిగింది. 1990లో రాజేంద్రకుమార్, 1995లో లక్ష్మిప్రసన్న, 2000లో నరసింహ ప్రసాద్ పుట్టారు.
యాభై సంవత్సరాల క్రితం మా కుటుంబం ప్రొద్దుటూరు వచ్చింది. అంతకు మునుపు నేను పుట్టి పెరిగి, పదేండ్ల వయసు వచ్చే వరకు కడప జిల్లా కమలాపురంలో ఉండేవాడిని. మా ఊరు పెన్నానది (పినాకిని), దాని ఉపనదులైన కుందూ (కుముద్వతి), పాగేరు (మాండవి), గండేరు (పాపాఘ్ని) కలిసే చోట ఉంది. అప్పట్లో వర్షాలు బాగా పడేవి. నదులు, ఏర్లు ఎండాకాలంలో సహితం ప్రవహిస్తూ ఉండేవి. రెండు ఊట కాలువలు ఉండేవి. అవి నిరంతరం పారుతుండేవి. వాటి క్రింద వందలాది ఎకరాలు పండేవి.
చదిపిరాళ్ళ, కొత్తపల్లి, అప్పాయపల్లె, కమలాపురం చాలా దగ్గరగా ఉండేవి. అవన్నీ కలిసిపోయి ఇప్పుడు పట్టణమైంది. వీటన్నిటి మధ్య చదిపిరాళ్ళ చెరువు, కమలాపురం చెరువు ఉండేవి. చదిపిరాళ్ళ చెరువు నిండి, కమలాపురం చెరువుకు కాలువల ద్వారా నీళ్ళు పోయి అదీ నిండేది. ఈ రెండు చెరువులకు నీళ్ళు గండేటి నుండి వచ్చేవి.
ఈ నీటి వనరుల ద్వారా వరి, శనక్కాయ, పసుపు, చెరుకు, ఆకుతోటలు పుష్కలంగా పండేవి. రాయలసీమకు కరువోస్తే మా కమలాపురం ఊరి దరిదాపులకు కూడా వచ్చేది కాదు.
ఆకుతోటల్లో, పూలతోటల్లో, మామిడి తోటల్లో, తాటి తోపుల్లో, ఊట కాలువపైన, చెరువు కట్టల మీద, ఏర్ల మధ్య తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పెరిగాను. మా ఊరి నీళ్ళల్లో అత్యంత రుచికరమైన 'ఉలస' చేపలు విరివిగా దొరికేవి.
ఇక్కడి మహిళలు వ్యవసాయ పనులు చేసుకుంటూ అతి మధురంగా జానపద గీతాలు పాడేవారు. మా నాన్న పౌరాణిక, జానపద కథలతో పాటు ఫ్యాక్షన్ కథలు కూడా చెప్పేవారు. వీటన్నిటితో నాకు తియ్యటి అనుబంధం ఏర్పడి, ఆ వయసులోనే భవిష్యత్తులో కవి కావడానికి బీజాలు పడ్డాయేమో అనిపిస్తుంది.
ఆ తరువాత మా నాన్నను ఫ్యాక్షన్ గ్రూపుల్లోకి లాగుతున్నారనో, వేరే కారణం వల్లనో ప్రొద్దుటూరు వచ్చి స్థిరపడ్డాం. అప్పట్లో కడప జిల్లాలో ఊరూరా ఫ్యాక్షన్ ఉండేది. అదేదో గొప్పదైనట్లు వీరోచితంగా చెప్పుకొనేవారు.
మేము ఒక అందమైన ప్రదేశం నుంచి ఒక చారిత్రాత్మకమైన ఊరికి రావడం వలన మేలే జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా మా జీవితాల్లో పెద్ద మార్పు వచ్చింది. కడప జిల్లాలో ప్రొద్దుటూరు జనాభాపరంగా కడప కన్నా పెద్దది. కడప అధికార కేంద్రమైతే, ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రం.
బ్రిటీష్ కాలం నాటికే మునిసిపాలిటీ. ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బంగారు వ్యాపారంలో సెకండ్ బాంబే గాను, సాంస్కృతికంగా రెండవ మైసూర్ గాను ప్రసిద్ధి గాంచింది. పెన్నానది ఒడ్డున వెలసిన ప్రొద్దుటూరు ప్రాచీన దేవాలయాలతోనూ, ప్రసిద్ధ కట్టడాలతోనూ పర్యాటకంగా కూడా ఖ్యాతి తెచ్చుకుంది.
పట్టణంలో ఒకవైపు సాహిత్య సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటే, మరోవైపు ఫ్యాక్షన్ గొడవలతో రక్తం పారుతూ ఉండడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉండేది.
కమలాపురానికి ప్రొద్దుటూరుకి దూరం ముప్పై కిలోమీటర్లు కూడా లేదు. అయినా ఆ ఊరితో నాకు పూర్తిగా సంబంధం తెగిపోయింది. కారణం ఆ వయసులో స్నేహితులు లేకపోవడం, బంధువులూ లేకపోవడం కావచ్చు.
ప్రొద్దుటూరు వచ్చాక గొప్ప చరిత్ర కలిగిన అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్లో చేరాను. ఆ స్కూల్లో గడియారం వెంకటశేషశాస్త్రి, ఏసీ దస్తగిరి, వంకం సుబ్బన్న, ఇంకా ఎందరో కవులు ఉపాధ్యాయులుగా ఉండేవారు.
ఆ ప్రక్కనే ఉన్న తాలూకా కోర్టులో పనిచేస్తున్న దుర్భాక రాజశేఖర శతావధాని, దాని ప్రక్కనే ఉన్న తాలూకా ఆఫీసులో పనిచేస్తున్న రాజన్న కవి, ఊరి మధ్యలో ఉన్న శ్రీకృష్ణగీతాశ్రమము ఓరియంటల్ స్కూల్ మరియు కాలేజీల్లో పనిచేస్తున్న కొండూరు నరసింహాచార్యులు, బండ్ల వెంకటరమణయ్య, నరాల రామారెడ్డి, మా ఇంటికి సమీపంలో ఉన్న ఎస్.సి.ఎ.న్.ఆర్. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ గా ఉన్న డా: ఎన్. రామచంద్ర మొదలైనవారే కాక, ప్రఖ్యాత కవి పుట్టపర్తి నారాయణాచార్యులు, సి.వి. సుబ్బన్న, కొడవులూరు రామచంద్రరాజు, పెద్దబ్బి కవి, అవధానం చంద్రశేఖర శర్మ, గంటి కృష్ణవేణిమ్మ, మహమ్మద్ ముస్తఫా మొదలైన వారి మూలంగా సాహిత్య సభలు, సమావేశాలు, అవధానాలు విరివిగా జరుగుతుండేవి.
దేన్నీ వదలకుండా అన్నింటికీ హాజరు అవుతుండేవాడిని. అలవికాని పిరికితనం వలన ఎవరితోనూ పరిచయాలు చేసుకొనేవాణ్ణి కాదు. కనీసం మాట్లాడేవాణ్ణి కాదు. డిగ్రీ పూర్తి అయ్యాక కొంత ధైర్యంతో సభల్లో ముందు వరుసలో కూర్చొని శ్రద్ధగా వినేవాడిని.
దాంతో కొంతమంది కవుల, రచయితల దృష్టిలో పడ్డాను. ముఖ్యంగా నిర్వాహకులైన సర్దార్జీ, మోతుకూరి మునిస్వామి, రామచంద్రారెడ్డి మొదలైన వారి దృష్టిలో పడడం వలన వారు చందాలు అడగడం మొదలు పెట్టారు. నేను సాహిత్య అభిమానిగా సంతోషంగా ఇచ్చేవాడిని. దాని వలన మరింత దగ్గరయ్యాను.
నిర్వాహకులు నాతో స్టేజి పైన బహుమతులు, జ్ఞాపికలు ఇప్పించేవారు. అప్పుడప్పుడు కవులకు శాలువాలు కప్పించేవారు. క్రమంగా అవధాన కవి డా: నరాల రామారెడ్డి, డా: ఎన్. రామచంద్ర, వి.ఎమ్. భాస్కరరాజు, పెద్దబ్బి కవి, రాజన్న కవి, ఏ.సి. దస్తగిరి, మహమ్మద్ ముస్తఫా, జింకా సుబ్రహ్మణ్యం, విద్వాన్ వెంకటేష్ మొదలైనవారు పరిచయం అయ్యారు.
సాంప్రదాయక సాహిత్యం ఇలా సాగుతుండగా, సమాంతరంగా అభ్యుదయ సాహిత్యం ఎదగలేకున్నా ఒక వర్గమైతే ఉండేది. దానికి రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) పెద్ద దిక్కుగా ఉండేవారు.
సోదుం జయరాం, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, దాదా హయత్, డా: రాధేయ, వై.సి.వి. రెడ్డి, పి. రామకృష్ణారెడ్డి, డా: ఎన్. రామచంద్ర, డా: ఎం.వి. రమణారెడ్డి మొదలైనవారు అభ్యుదయ పంథాలో ఉండేవారు.
1979 చివరిలోనో, 1980 మొదట్లోనో యర్రగుడి రామాంజనేయులరెడ్డి పరిచయమైనాడు. అతడిది పులివెందుల. అతను ప్రొద్దుటూరులో టి.పి.టి. చేస్తున్నప్పుడు అతనితో గాఢమైన స్నేహం ఏర్పడింది. అతను అప్పటికే పద్యాలు, వచన కవితలు, కథలు రాసేవాడు. మా చర్చలు సాహిత్యంపై సాగుతుండేవి. అతని ప్రేరణ నాపై పడింది.
అంతవరకు సాహిత్య అభిమానిగా ఉన్న నేను 1991 సంవత్సరంలో డా: రాధేయ పరిచయంతో అడపా దడపా రాయడం మొదలు పెట్టాను. రాధేయ పరిచయం నా జీవితంలో సాహిత్య పరంగా పెద్ద మార్పే తెచ్చింది. కవిగా అంకురార్పణ జరిగింది ఆయనతోనే.
రాధేయ స్నేహితులైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, తవ్వా ఓబుల్ రెడ్డి, శశిశ్రీ, నూకా రాంప్రసాద్ రెడ్డి లాంటి కవులు, రచయితలు నాకూ స్నేహితులైనారు.
1991 సంవత్సరం రాధేయ అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా "చైతన్య సాహిత్య కళా వేదిక" అనే సాహిత్య సంస్థను స్థాపించి ఎన్నో సాహిత్య సభలు, సమావేశాలు, వర్క్ షాపులు, పుస్తకావిష్కరణలు, పుస్తక పరిచయాలు నిర్వహించాం.
కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా రాధేయ గారు - అరసం అధ్యక్షులు యస్.వి. సత్యనారాయణ, కె. శివారెడ్డి, ఆశారాజు, అద్దేపల్లి రామమోహనరావు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, మధురాంతకం రాజారాం, సుధామ, త్రిపురనేని మధుసూదనరావు లను పరిచయం చేశారు. సుధామ, శశిశ్రీ గార్లకు ప్రశంసా పత్రాలు రాసి వారికే బహూకరించాను.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నేను లేటుగా పదేండ్ల వయసులో ఒకటవ తరగతిలో చేరాను. పదవ తరగతి వచ్చేసరికి నాకు ఇరవై సంవత్సరాలు. అప్పట్లో నేను చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర బాగా చదివేవాణ్ణి.
చందమామలోని భేతాళ కథలు, బొమ్మరిల్లులోని కరాళ కథలు ఇష్టంగా చదివేవాడిని. కరాళ కథలు రాసింది నాకన్నా వయసులో చిన్నవాడు, అందునా మా ఊరివాడు, నేను నిర్వహించే సాహిత్య సభల్లో ప్రేక్షకుడిగా వస్తున్న వాడైన డి.కె. చదువుల బాబు అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను.
రాధేయ గారితో ఆత్మీయ ప్రయాణం రెండు సంవత్సరాలే సాగింది. అయినా అదే నాపై గొప్ప ప్రభావం చూపింది. పదోన్నతిపై ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లిపోయారు. పోతూపోతూ నాకు ఎన్నో సాహిత్య పుస్తకాలు ఇస్తూ, చాలా సాహిత్య మెలకువలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా అడపాదడపా వచ్చి నాతో కలిసి మాట్లాడి పోతుండేవారు. మళ్ళీ అంతటి స్నేహం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఏర్పడింది.
1995 నాటి మాట. ప్రొద్దుటూరు గాంధీరోడ్డులో బాషా అనే అబ్బాయిది స్నేహజ్యోతి ఆప్టికల్స్ షాప్ ఉండేది. బాషా మంచి సాహిత్యాభిమాని. ఆ అబ్బాయి దగ్గరికి యువకవులు, వృద్ధకవులు, పద్యకవులు, వచనకవులు అనేక మంది వచ్చేవారు. ఒకసారి రాధేయ అనంతపురం నుండి వచ్చి బాషా సాహితీ బృందానికి పరిచయం చేశారు. ఆ పరిచయం నా సాహిత్య ప్రయాణంలో పెద్ద మలుపు.
అక్కడే నాకు షేక్పీర్ల మహమూద్, ఎన్.ఎస్. ఖలంధర్, విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మి, అవధానం ఉమా మహేశ్వరరావు, జలదుర్గం పెద్దమునిస్వామి, జలదుర్గం రాము మొదలైన వారితో పరిచయమైంది.
అక్కడికి ఏ.సి. దస్తగిరి, మహమ్మద్ ముస్తఫా, దాదా హయత్, మల్లెల నారాయణ, జింకా సుబ్రహ్మణ్యం, పద్యకవి భాస్కరరాజు, కొమ్మిశెట్టి మోహన్ మొదలైన వారు వచ్చేవారు. ప్రతిరోజు సాయంత్రం కలిసేవారం.
బాషా అందరికీ టీ, కాఫీలు తెప్పించేవాడు. ఎవరో ఒకరు కవితో, కథో రాసుకొచ్చి అందరి ముందర చదివేవాడు. అందరూ విని చేర్పులు, మార్పులు సూచించి చక్కగా రూపొందించి పత్రికలకు పంపేవారం. అవి అచ్చైతే అందరమూ ఆనందపడేవారం.
నేను ఆ ప్రేరణతో విరివిగా కవితలు రాసేవాడిని. అవి వరుసగా పత్రికల్లో అచ్చు అయ్యేవి. అదే సమయంలో పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, డి.కె. చదువులబాబు, దాదా హయత్, ఎన్.ఎస్. ఖలంధర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, తవ్వా ఓబుల్ రెడ్డి మొదలైనవారు నా సమ వయస్కులు కథలు రాస్తుండేవారు.
అవి పత్రికల్లో ప్రచురింపబడేవి. వారిని చూసి నాకు కథలంటే ఉబలాటం కలిగింది. కథ రాయాలనుకున్నాను. వ్యవసాయదారుడిగా నా అనుభవాలనే కథావస్తువుగా తీసుకుని "పెన్నేటి బతుకు" అనే పేరుతో కథ రాశాను. ఆ కథను అందరి ముందు చదివి వినిపించాను. ఎన్నో సూచనలు చేశారు.
అదే సమయంలో డా: యం.వి. రమణారెడ్డి కథా సదస్సు ఏర్పాటు చేసి మా అందరినీ ఆహ్వానించారు. ఆ సదస్సులో నా కథను నా తరుపున కమ్యునిస్టు సోదరుడు బి. రామయ్య చదివాడు. విన్న వారందరూ రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు.
"కథా వస్తువు బాగుంది కానీ, మనకు తెలిసిందల్లా కథలోకి చొప్పించకూడదు. సంక్షిప్తత కథకు ముఖ్యం" అని యం.వి. రమణారెడ్డి గారు సలహా ఇచ్చారు.
తర్వాత ఆ కథను ఎడిటింగ్ చేసి అరుణతార పత్రికకు పంపాను. అందులో ప్రచురణ అయ్యి నాకు మంచి గుర్తింపు తెచ్చింది.
అదే కథను కర్నూలు సాహితీవేత్తలు "రాయలసీమ రైతు కథా సంకలనం"లో వేసుకోవడం నాకు ఉత్సాహాన్ని కలిగించింది. దాని తర్వాత మా ఊరిలో జరిగిన ఒక యథార్థ సంఘటనకు కథా రూపమిచ్చి "మల్లక్క కయ్య" అని పేరు పెట్టి సాహిత్యప్రస్థానం పత్రికకు పంపాను. అది అచ్చు కావడమే కాకుండా ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం అందుకుంది. అప్పటి నుంచి కథలు రాయటం మొదలు పెట్టాను.
2000 సంవత్సరంలో రమణారెడ్డి గారితో పరిచయం నా సాహిత్య జీవన పయనంలో ముఖ్యమైన సంఘటన. యం.వి. రమణారెడ్డి గారు డాక్టర్, మాజీ యం.ఎల్.ఎ, ట్రేడ్ యూనియన్ నాయకులు, లాయర్, ప్రముఖ కథారచయిత.
ఆయనతో నేను సాహిత్య, సామాజిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక అంశాలపై చర్చించుకునేవాడిని. చర్చలు చాలా లోతుగా వెళ్ళేవి. ఒక్కొక్కసారి రాత్రి పది, పదకొండు వరకు చర్చలు సాగేవి. మాతోపాటు చాలా మంది ఉండేవారు. ఆయన నుంచి నేను చాలా విజ్ఞానం పొందాను.
అవధాన కవి నరాల రామారెడ్డి గారికి నేనంటే చాలా అభిమానం. మేము తరుచు సాహిత్య చర్చలు సాగించేవాడిని. ఆయన పద్య సాహిత్యం గురించి, అవధానాల గురించి వివరించేవారు. అప్పుడప్పుడు మూలే రామముని రెడ్డి మాతో కలిసేవాడు.
డా: ఎన్. రామచంద్ర కొత్త కథ రాసినప్పుడల్లా ఇతర సాహిత్యకారులతో పాటు నన్ను పిలిచి కథ చదివి అభిప్రాయం చెప్పమనేవారు. పల్లా కృష్ణ కడప కథపై పి.హెచ్.డి చేసినప్పుడు తన సిద్ధాంత గ్రంథంలో నా కథలపై చర్చించారు. ఆయన అనేక కవి సమ్మేళనాలు నిర్వహించి అసందర్భంగా నన్ను సన్మానించారు.
నేను కవిగా, రచయితగా ఎదిగాక కామనూరు రామ్మోహన్, పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం, భూక్యా గోపాల్ నాయక్, కొత్తపల్లి శీను, గొట్టిముక్కల గొవిందు, గొరిగె వెంకటేశ్వర్లు, పల్లా వెంకటరామారావు, బొల్లు రామ్మోహన్, నీలం బాలగంగాధర తిలక్, కుంభం పామిలేటి, గజ్జెల వెంకటేశ్వరరెడ్డి, చిన్న లక్ష్మి కళావతి, దుర్గా భవాని, అవధానం అమృతవల్లి మొదలైన కవులు, కవయిత్రులు, గాయకులతో పరిచయమైంది.
జానుమద్ది హనుమచ్ఛాస్త్రి దగ్గర నాకు చాలా చనువు ఉండేది. ఆయనకు నేను ఎదురు పడినప్పుడల్లా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. నేను ప్రొద్దుటూరు కమ్యునిస్టులతోను, విరసం సభ్యులతోను సన్నిహితంగా ఉండేవాడిని.
నేను నా కవితలను "ఎద మీటిన రాగాలు" కవితా సంపుటిగాను, నా మినీ కవితలను "తుమ్మెద పదాలు" మినీ కవితా సంపుటిగాను తెచ్చాను. ఇప్పుడు నా కథలను "పినాకిని కథలు" అనే పేరుతో కథా సంపుటి తెస్తున్నాను. దీని తర్వాత "చమత్కారం కథలు" చిన్న పిల్లల కథలు తెస్తాను.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను












Comments