top of page
Original.png

మీకు షుగర్ వచ్చింది!

1 hour ago
4 min read

మీకు షుగర్ వచ్చింది తెలుగు హాస్య కథలో జిలేబీ తినబోతూ డాక్టర్ మరియు భార్యకు పట్టుబడిన రామారావు

Meeku Sugar Vachhindi - Telugu Comedy Story | Mohana Krishna Tata

మీకు షుగర్ వచ్చింది! - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 05/10/2026


స్వీట్స్ అంటే ప్రాణం పెట్టే వ్యక్తికి ఒక్కసారిగా “మీకు షుగర్ వచ్చింది!” అని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

రామారావు జీవితంలో మొదలైన ‘షుగర్ లెస్’ కష్టాలను సరదాగా చూపించే హాస్య కథ ఇది.

భార్య జానకి పెట్టే ఆహార నియమాలు, జిలేబీ కోసం రామారావు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. నవ్వులతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమనే విషయాన్ని కూడా కథ గుర్తుచేస్తుంది.


"హలో రామారావు గారు! నేను స్వీట్స్ షాప్ అప్పారావుని మాట్లాడుతున్నాను."


"చెప్పండి... ఏమిటా తీపి కబురు?"


"మా షాప్‌కి కొత్త కొత్త స్వీట్స్ వచ్చాయి... మీరు వచ్చి టేస్ట్ చేస్తారని ఫోన్ చేశాను."


"తీపి తినాలని అసలే నోరు ఊరిపోతోంది... వెంటనే వచ్చేస్తున్నాను. అన్నీ ఒక కిలో ప్యాక్ చేసి నా కోసం ఉంచండి... మళ్ళీ స్టాక్ అయిపోయిందంటారుగా!"


"ఎంత మాట! మీ కోసం ఆల్రెడీ కట్టేశాను లెండి... మీరు మా స్పెషల్ కస్టమర్!"


ఇలా షాప్‌వాడు ఫోన్ పెట్టాడో లేదో... రామారావు షాప్‌‌లో ప్రత్యక్షమయ్యాడు.


స్వీట్స్ అందుకున్న రామారావు ఒక్క పది నిమిషాలలో అన్నీ ఖాళీ చేసేశాడు. రామారావుకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. ముఖ్యంగా స్వీట్లు అంటే ఎంత ప్రాణమో పై సీన్ చదివితే ఎవరికైనా తెలిసిపోతుంది. మనిషి పొడుగు... ఆ పై భారీ శరీరానికి ఆ మాత్రం ఆకలి ఉండడం కామన్ కదా మరి!


ఒకరోజు కడుపునొప్పి రావడంతో రామారావు డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ ఏమీ ఆలోచించకుండా... పెద్ద పేజీలో ఒక వంద రకాల టెస్ట్స్ రాసేశాడు. ఆ టెస్ట్స్ చేసుకుని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి సీరియస్‌‌గా... "అంతా బాగానే ఉంది కానీ... షుగర్ మూడు సెంచరీలు దాటేసింది రామారావు గారూ. మీకు షుగర్ వచ్చింది!" అని అన్నాడు.


అది విన్న రామారావుకు గుండె ఆగిపోయిందేమో అన్న అనుమానంతో గుండె పట్టుకుని చూశాడు... కానీ ఇంకా ఆగిపోలేదని గుర్తించాడు. "షుగర్ నాకు రావడానికి దానికి ఎంత ధైర్యం?" అంటూ ఏడుపు ముఖం పెట్టాడు.


డాక్టర్... "ఏమీ పర్వాలేదు... కాకపోతే నేను చెప్పినట్టుగా వినాలి" అని అన్నాడు. 


"ఈ రోజు నుండి స్వీట్లు బంద్, అన్నం బంద్; కేవలం జొన్న రొట్టెలు, చేదు కూరగాయలు మాత్రమే తినాలి. ప్రతిరోజూ కనీసం ఐదు కిలోమీటర్లు నడవాలి" అని ఒక పెద్ద ప్రిస్క్రిప్షన్ రాసి చేతిలో పెట్టాడు.


ఇంటికి రాగానే రామారావు భార్య జానకికి విషయం తెలిసింది. వెంటనే ఇంట్లో ఎక్కడెక్కడో దాచిన స్వీట్ డబ్బాలన్నీ తీసి వీధిలో వాళ్ళకి గిఫ్ట్స్ అని చెప్పి ఇచ్చేసింది. ఇంట్లో 'షుగర్' అనే మాట లేకుండా చేసింది.


మనోడి జీవితంలో 'షుగర్ లెస్' రోజులు స్టార్ట్ అయ్యాయి...


ఉదయం కాఫీలో పంచదార కట్... ఓన్లీ బ్లాక్ కాఫీ చేదుగా! డైనింగ్ టేబుల్ మీద జొన్నరొట్టె, తోటకూర పప్పు ఉన్నాయి. ఆ జొన్నరొట్టె ఎంత గట్టిగా ఉందంటే, దాన్ని విరవడానికి రామారావు సుత్తి, ఉలి వాడాల్సి వచ్చింది. ఎలాగోలా కష్టపడి నములుతుంటే, టీవీలో 'స్వీట్స్' యాడ్స్ చూసి రామారావు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 'ఐ మిస్ యు' అని అనుకున్నాడు.


రామారావు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే... జానకి ఒక పెద్ద గ్లాసుడు కాకరకాయ రసం తెచ్చి రామారావు నోట్లో పోసింది. అది ఎంత చేదుగా ఉందంటే, రామారావుకు జీవితం మీద విరక్తి వచ్చేసింది.


"ఎవరైనా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వేడివేడిగా కాఫీ ఇస్తారు... ఇదేంటే కాకరకాయ జ్యూస్? ఇంత చేదుగా తాగితే ఇప్పుడే నేను బకెట్ తన్నేస్తానే!" అని అరిచాడు.


"అలాంటి జ్యూస్ తాగడమే మీ ఆరోగ్యానికి మంచిది... మీరు బకెట్ తన్నకూడదనే ఈ ఏర్పాట్లన్నీను. మీరు పోతే... నాకు చీరలు, నగలు ఎవరు కొంటారు చెప్పండి?" అంటూ మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంది.


రామారావు ఇక ఆగలేకపోయాడు... ఏం చేస్తాడు? ఆ స్వీట్స్ షాప్ గుర్తుకు వచ్చింది. భార్యకు వాకింగ్‌కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు.


"బాబూ! ఒక వేడి వేడి జిలేబీ ఇవ్వు, ఎవరైనా చూసేలోపు నోట్లో వేసుకోవాలి" అన్నాడు కంగారుగా.


షాపువాడు జిలేబీ ప్లేట్ ఇచ్చాడు. రామారావు కళ్లు మూసుకుని, ఎంతో భక్తిగా ఆ జిలేబీని నోటి దగ్గరకు తీసుకెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి వెనుక నుండి ఒక పలకరింపు... "ఏవండీ! బాగున్నారా?"


కళ్లు తెరిచి చూస్తే... అక్కడ వాళ్ల డాక్టర్ నిలబడి ఉన్నాడు! రామారావు చేతిలో జిలేబీ వణికిపోయింది.


"అది... అది... డాక్టర్ గారు... జిలేబీలో తీపి సరిగ్గా ఉందో లేదో టెస్ట్ చేద్దామని..." అని నసిగాడు. అన్నీ ఒకేసారి కలిసివచ్చినట్టుగా, అప్పుడే పక్కనే మార్కెట్‌కి వచ్చిన భార్య జానకి కూడా అక్కడ ప్రత్యక్షమైంది. అంతే! జానకి చేతిలో ఉన్న కూరగాయల సంచితో రామారావుకు అక్కడే సన్మానం జరిగింది. డాక్టర్ గారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.


"మీరు ఇలా బయట తింటారనే... అందరికీ మీకు షుగర్ వచ్చిందని చెప్పేశాను... మన బంధువులకి కూడా! మీరు ఎవరింటికి వెళ్ళినా మీకు స్వీట్స్ పెట్టరు, షుగర్ కాఫీ ఇవ్వరు. మీ ఆఫీస్ వారితో కూడా చెప్పేశాను. మీరు ఎంత మేనేజ్ చేసినా ఇక స్వీట్స్ దొరకవు. సోషల్ మీడియాలో కూడా పెట్టేశాను... మీరు ఇక ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా స్వీట్స్ దొరకడం కష్టమే. అందరికీ విషయం తెలిసిపోయింది. అయినా సరే ప్రయత్నిస్తే నా మీద ఒట్టే! జాగ్రత్తగా ఉండండి!"


"నాకేమైనా వచ్చిందా ప్రమోషనా ఏమిటే... అందరికీ చెప్పడానికి?" అంటూ లబోదిబోమన్నాడు రామారావు.


చివరకు రామారావుకు అర్థమైంది ఏంటంటే... షుగర్ రావడం కంటే, అది వచ్చాక పెళ్ళాం కళ్లు గప్పడం చాలా కష్టం అని! అప్పటి నుండి మనోడు బుద్ధిగా జొన్నరొట్టెలు తింటూ, కాకరకాయ రసం తాగుతూ, రోజూ వాకింగ్ చేస్తూ... నిజమైన 'షుగర్ లెస్' లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతగా చెప్పాక తప్పుతుందా మరి!


సమాప్తం. 

***********



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

తాత మోహనకృష్ణ

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page