top of page
Original.png

పాపం గోపాలం

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #PapamGopalam, #పాపంగోపాలం, #తెలుగుపల్లెకథలు, #TeluguHeartTouchingStories

ree

Papam Gopalam - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 02/12/2025

పాపం గోపాలం - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

సంధ్యాసమయం. పడమటి కొండల్లో ఒరిగిపోతున్న సూర్యుడు అరుణారుణా కిరణాలను ప్రసరిస్తూన్నాడు. ఆ కాంతి కిరణాలతో లోకమంతా ఎర్రదనం పులుముకున్నది. 


ఊరి చివర ఓ వెడల్పాటి బండపై కుర్చోని తదేక దీక్షతో తన్మయంతో చూస్తున్నాడు నిండా పదేండ్లైనా నిండని ఒక బాలుడు. చూస్తుండగానే పడమటి కొండల్లో మునిగిపోయాడు సూర్యుడు. మసక చీకటి అంతటా వ్యాపిస్తోంది. 


సూర్యాస్తమయం అవగానే ఆ బాలుడికి తాను చేయాల్సిన ముఖ్యమైన పని జ్ఞాపకమొచ్చి ఉన్నపళంగా ఊరి వైపు పరుగందుకున్నాడు. 


వీధి గుండా ఇంటివైపు పరిగెడుతున్న బాలున్ని ఆపింది ఓ మధ్యవయసు ఆవిడ.


"ఒరేయ్! పొట్టోడా! అంగడికి పోయి వక్కాకు తెచ్చీయ్యరా!" అంది తన ఇంటి ముంగిట కూర్చుని.

 

"ఇప్పుడు కాదు మల్ల తెచ్చిస్తాలే! " అన్నాడు పొట్టోడనే గోపాలు. 


వీధి మలుపు తిరగ్గానే గోపాలుకు ఊరి పెద్ద రెడ్డయ్య ఎదురుపడ్డాడు. రెడ్డియ్యను చూస్తూనే వినయంగా నిలబడ్డాడు. "ఏరా! వెధవా! ఉదయాన్నే చెప్పిన పని చేసినావా!" గద్దించి అడిగాడు రెడ్డయ్య. 


గోపాలు భయంగా "మరచి పోయానయ్యా! పొద్దున్నే చేస్తానయ్యా తప్పకుండా!" అంటూ ఒదిగి చెప్పుకున్నాడు. 


"సరే పొద్దున్నే చెయ్! ఈసారి మరిచిపోయానని చెప్పావో! ఒళ్ళు పగులుతుంది. జాగ్రత్త!" కటువుగా చెప్పి వెళ్ళిపోయాడు రెడ్డయ్య. 


రెడ్డయ్య తనను వదిలి వెళ్ళగానే మళ్లీ పరుగందుకున్నాడు. తెరలు తెరలుగా బొరకలు పడ్డ ఓ పూరిపాకలోకి దూరాడు గోపాలు. పూరిపాకలో నులక మంచం మీద బక్కచిక్కిన ఒకావిడ తెరపలు తెరలుగా దగ్గుతూ పడుకొని ఉంది. గోపాలు మంచం పక్కన నిలబడి, "అమ్మా! బువ్వ తిన్నావా!" అన్నాడు. 


"ఎక్కడిది రా! గోపురాలూ! నువ్వు తెస్తేనే కాదరా! నే తినేది. " అంది అమ్మ అలవికాని నీరసంతో. 


"నా మతిమరుపుతో ఎంత పని జరిగిపోయిందీ." అనుకొని పూరిపాక నుంచి మళ్లీ పరుగుతీశాడు గోపాలు. అతడి పరుగు రెడ్డయ్య ఇంటి ముందర ఆగింది. ఇంటిముందు నిలబడి "అమ్మా! రడ్డమ్మా! అన్నం పెట్టమ్మా!" అడిగాడు. 


ఆ పిలుపు విన్న రెడ్డమ్మ అన్నం కూరలు తీసుకొచ్చి "ఎక్కడికి పోయావు రా బుడ్డోడా! ఇంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నా!" అని వాడికి అన్నం పెట్టింది.

ఆమెకు బదులు చెప్పి మళ్లీ వడివడిగా పాక వైపు నడిచాడు గోపాలు. గోపాల్ని రకరకాల అడ్డపేర్లతో పిలువడం జనానికి రివాజైంది. 


గోపాలు అమ్మకు జబ్బొచ్చి మంచం పట్టినప్పటి నుంచి ఊర్లో వాళ్ళు ఎవరేపని చెప్పినా అ పని చేసి, వాళ్ళు పెట్టిన అన్నం తెచ్చుకొని అమ్మ, తను తిని బతుకు నెట్టుకొస్తున్నారు. 


రెడ్డమ్మ పెట్టిన అన్నాన్ని అమ్మకు గిన్నెలో పెట్టే నీళ్ళ చెంబు దగ్గరగా పెట్టాడు. అమ్మా కొడుకులిద్దరూ అన్నం తిని ఆకలి బాధ తీర్చుకున్న తరువాత అమ్మ తన కొడుకును దగ్గరగా కుర్చోబెట్టికుని,


"నాయనా గోపాలూ! ఇందాక చాలసేపు కనిపించకుండా పోయావు. ఎక్కడికి పోయావు నాయనా" అడిగింది లాలనగా.

 

"అమ్మా! పొద్దు కుంకడాన్ని చూడడానికి ఊరి వెలుపలికి పోయాను. పొద్దు కుంకడం చాల అందంగా ఉంటుందమ్మా! అందుకే పొద్దు కుంకడాన్ని చూడటానికి ప్రతి రోజూ పోతుంటానమ్మా" చెప్పాడు గోపాలు ఎంతో సంబరంగా. 


"అలాగా బాబూ! అయితే పొద్దు కుంకడం కన్నా పొద్దు పొడవడం ఇంకా చాల అందంగా ఉంటుందిరా గోపాలూ. అంతేకాదు పొద్దు కుంకుడు నిరాశావాదానికి, పొద్దు పొడవడం ఆశావాదానికి గుర్తని పెద్దలు చెప్పుతారు " అంటూ చెప్పుకొచ్చింది గోపాలు అమ్మ. 


"అలాగామ్మా. అయితే రేపు పొద్దున్నే పొద్దు పొడవడాన్ని చూడడానికి పోతాను " అన్నాడు గోపాలు ఎంతో ఆసక్తి కనబరుస్తూ. 


"అమ్మా ఈమధ్య నాకు మతిమరుపు ఎక్కువైందమ్మా! నిన్న రెడ్డయ్య ఒక పని చెప్పాడు. అది మరిచిపోయి చేయలేదు. ఇప్పుడు రెడ్డయ్య ఎదురై చెప్పిన చేయనందుకు కోప్పడ్డాడు"


“అది కాదురా గోపాలూ! ఒకటా రెండా పనులు! ఒకరికా ఇద్దిరికా! అందరికీ నీవే పనులు చేసిపెట్టాలి. ఎన్నని గుర్తు పెట్టుకుంటావు.? అందుకే మరిచిపోయింటావు" సర్ది చెప్పింది అమ్మ, పడుకున్న కొడుకు వీపు తడుతూ. 


"అమ్మా పొద్దున్నే నేను పొద్దు పొడవడాన్ని చూడాలమ్మా" అంటూ నిద్రలోకి జారుకున్నాడు గోపాలు. 


గోపాలు చీకట్లోనే లేచి ఊరి వెలుపలికి పోయి తూర్పు అభిముఖంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడే సూర్యుడు ఎర్రెర్రని వెలుగు రేఖలను విరజిమ్ముతూ సప్తవర్ణాలతో ఉదయిస్తున్నాడు. గోపాలు ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ మైమరచి నిలుచుండి పోయాడు. 


అటు వైపుగా సైకిలుపై వెలుతున్న తిరుపాలు గోపాల్ను చూసి "ఎరా! పొట్టోడా! ఇక్కడ నిలబడి ఏం చూస్తుండవ్ రా! " అన్నాడు. 


"పొద్దు పొడుపును చూస్తున్నాను. ఎంత అందంగా ఉన్నాడో సూర్యుడు." అన్నాడు గోపాలు తన్మయత్వం అమాయకత్వం కలగలిపి. 


"బో చూసినవ్ గ్గాని రెడ్డయ్య ఎందుకో నిన్ను రమ్మన్నాడు పో" కసురుకున్నట్లు చెప్పి వెళ్ళిపోయాడు.


"ఆఁ ఇప్పుడే పోతాండయ్యా" అని గోపాలు రెడ్డయ్య ఇంటికి కాలు కాలిన పిల్లిలా కదిలాడు. నిన్నా రెడ్డయ్య చెప్పిన పని గుర్తుకొచ్చి, ఏం కోప్పడుతాడో అనుకున్నాడు. 


గోపాలు రెడ్డయ్యకు ఎదురు పడడం, రెడ్డయ్య కోపపడడం, స్కూల్లో మొక్కలు నాటే పని పురమాయించడం, గోపాలు వెంటనే పనిలోకి దిగిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. 

గోపాల్తో పాటు మరికొందరు మొక్కలు నాటుతున్నారు. వీరిపై ఒకడు అజమాయిషీ చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. 


గోపాలు చిన్న గుంత తీసి పూల మొక్కను అందులో నాటి ఎరువును కలిపిన మట్టితో కనిపెట్టి మొక్కచుట్టూ పాదుచేసి నీళ్ళు పోస్తున్నాడు. స్కూలు గదుల్లో పిల్లలకు పాఠాలు చెప్పుతున్నారు టీచర్లు. గోపాలుకు గది కిటికీలోంచి టీచర్ పాఠం చెప్పుచున్నది వినిపిస్తున్నది, బోర్డు మీద రాస్తున్నది కనిపిస్తున్నది. 


మొక్క కోసం గుంత తీయడంతో వచ్చిన మట్టిని చదరంగా నెరిపి బోర్డుపై టీచర్ రాస్తున్న అక్షరాను రాయడం మొదలు పెట్టాడు గోపాలు. మొక్కలు నాటిస్తున్న వ్యక్తి గోపాలు వైపుగా వచ్చి గోపాలు చేస్తున్న పని చూశాడు. 


"ఎరా! పొట్టోడా! చదవుకోవాలనుకుంటే ఎంచక్కా బడికి పోయి చదువుకోవాల్రా! మా పనికి వచ్చి మమ్ములెందుకు ఇబ్బంది పెట్టడం రా!" అన్నాడు తన సొమ్మేదో పోతున్నట్టు.

 

"నేను చదువుకోవడానికి పోతే జబ్బుతో మంచంపై ఉన్న మా అమ్మకు బువ్వ ఎవరు పెడుతారు. ఏదోక రోజు మమ్మల్ని వెదుక్కుంటూ మా మామ వచ్చి నన్ను తీసుకుని పోయి చదివిస్తాడు" అని గోపాలు అమాయకంగా సమాధానం చెప్పాడు. 


"ఓహో! మీ మామ వస్తాడు. నిన్ను తీసుకుపోయి చదివిస్తాడు. నువ్వు కలెక్టరై మా ఊరొచ్చి రోడ్లు భవనాలు కట్టిస్తావు. అవన్నీ మేం చేతులు కట్టుకుని చూస్తాం" వ్యంగ్యంగా వెగటు భావాన్ని కక్కాడు ఆవ్యక్తి. 


అవేవి పట్టని గోపాలు మళ్లీ మొక్కలు నాటడంలో పడ్డాడు. మొక్కలు నాటడం పూర్తి అయ్యేసరికి మిట్టమధ్యాహ్నం అయింది.. 


"బువ్వేళయింది, రెడ్డయ్య ఇంటికి పోయి బువ్వ పెట్టించుకొని అమ్మకు పెట్టాలి" అనుకుంటూ రెడ్డయ్య ఇంటికి బయలుదేరాడు గోపాలు. 


దోవలో సూరవ్వ కనబడి "ఒరేయ్! మనుమడా! ఇట్లా రా రా ! రోంతా పనుంది. " అంది గోపాలును చూసి. 


"ఉండవ్వా! ఇప్పటికే వేళ మించిపోయింది. రెడ్డియ్య ఇంటికి పోయి బువ్వ పెట్టించుకొని అమ్మకు పెట్టాల" గస పెట్టుకుంటూ పోతూ అన్నాడు గోపాలు. 


"ఏరా మనుమడా! నా మనుమడైతే ఇట్టా అంటాడా! ఆ బువ్వేదో నేనే పడ్తాగాని చిన్న పని చేసి పోరా!" అంది సూరవ్వ. 


గోపాలు ఆలోచనల్లో పడ్డాడు. "రెడ్డయ్య ఇల్లు చాలా దూరం వుంది. అంత దూరం పోవాలంటే వేళ మించిపోతుంది.. అదేదో పని చేసి ఇక్కడే బువ్వ పెట్టించుకుంటే సరిపోతుంది. " అనుకున్నాడు.


“సూరవ్వా. ఏం పని చేయ్యాల" అన్నాడు. 


"పెద్ద పనేం కాదురా! అంగడికి పోయి నూనె డబ్బా తీసుకురావాల అంతే!" అందామె.


అంగడికి పోయి పది కేజీల నూనె డబ్బా అతికష్టం మీద తీసుకొచ్చి పెట్టాడు. 

ఆమె పెట్టిన అన్నం తీసుకుని ఆసుపత్రి పక్కనబడి, కాలికొద్దీ నడిచి ఇంటికి పోతున్న గోపాలుని చూసి డాక్టర్ సోమయ్య "బుడ్డోడా మీ అమ్మ విపరీతంగా దగ్గుతావుంది అంటివి కదా, టానిక్ ఇస్తాను తీసుకుని పోయి మీ అమ్మకు ఇచ్చి తొందరగా రా! డిపోలో కట్టే పుల్లలున్నాయి, ఇంట్లో వేద్దువుగాని" సోమయ్య ఎరవేసి చెప్పాడు. 


అమ్మ రాత్రంతా దగ్గుతూ ఉన్న విషయం గుర్తుకొచ్చి"ఇయ్యి సార్! అమ్మకిచ్చి వెంటనే వచ్చి మీ పని చేస్తాను. " అన్నాడు ఆతృత పడుతూ. 


డాక్టర్ ఇచ్చిన టానిక్, సూరవ్వ పెట్టిన అన్నం అమ్మ దగ్గర పెట్టి "అమ్మా! అన్నం తిని టానిక్ తాగు" చెప్పి అంతే వేగంగా వెనక్కి తిరిగాడు. 


"బాబూ గోపాలూ ! ఉండు రా! నీతో పనుంది. " అంటున్న అమ్మ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. 


డాక్టర్ చెప్పినట్లు డిపోలో అన్నీ యిన్నీ పుల్లలు కాదు పది మోపులున్నాయి. అవన్నీ డాక్టర్ ఇల్లు చేర్చేసరికి సాయంత్రమైంది. మధ్యాహ్నం అన్నం తినకుండా పనిచేయడం వల్ల అలసిపోయాడు గోపాలు. సొక్కుతూ సోలుతూ ఇంటికొస్తున్న గోపాలుతో నాగరాజు "ఒరేయ్! అల్లుడూ ఇట్లా రా రా! నీతో కొంచెం పనుంది" అన్నాడు. 


" లేదు మామా! చాల అలసటగా ఉంది మామా! రేపొచ్చి నీ పని చేస్తొలే మామా!" నీరసంగా అన్నాడు. 


"అల్లుడూ! నీ మామను చెపుతే వినవా రా!” నిష్టూరంగా అన్నాడు నాగరాజు. 


“లేదు మామా! ఒళ్ళంతా పులిసి పోయినట్లుంది. తప్పకుండా రేపొచ్చి చేస్తా" అంటూ ఇంటికెళ్లి పడకలో పడిపోయాడు. 


బాగా అలసి ఉన్నందున వెంటనే నిద్ర పట్టి గాఢనిద్రలోకి జారుకున్నాడు గోపాలు. రాత్రి ఎనిమిది గంటలు దాటి తొమ్మిది కావస్తోంది. గోపాలు గురకపెట్టి నిద్రపోతున్నాడు. అమ్మా గోపాలుని లేపాలని చూసింది ఏమి తినకుండా పడుకున్నాడని బాధపడింది. నాలుగు మెతుకుల కోసం ఊరందరికీ పని చేసే పెడుతున్న కొడుకును చూసి విపరీతమైన వ్యధకు గురైంది గోపాలు అమ్మ హేమ. గోపాలును దగ్గరకు తీసుకొని ఏదో చెప్పాలని హేమ మనసు ఆరాటపడుతుంది. 


హేమ కలిగినింట్లో పుట్టిన అమ్మాయి. 15 సంవత్సరాల కిందట శరత్ ను నమ్మి అతన్ని ప్రేమించి తల్లిదండ్రులు,,, తోబుట్టువులతో తెగదెంపులు చేసుకుని ఈ ఊరొచ్చింది. శరత్ మంచి ఆదర్శాలు ఉన్నవాడు. ఉన్నన్నాళ్ళు అపురూపంగా చూసుకున్నాడు. ఆనందంగా ఐదేండ్లు గడిచాయి. అప్పటికి హేమ గర్భవతి. దురదృష్టవశాత్తు హటాత్తుగా ఒకరోజు శరత్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. 


హేమ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఓరోజు గోపాలుని కన్నది. శరత్ సంపాదించిన కొద్దిపాటి ఆస్తి గోపాలు పుట్టిన రెండు మూడేండ్లల్లోనే అయిపోయింది. రెండేండ్ల పిల్లాడితో పాటు తాను ఎలా బతకాలి.. ఆలోచించింది హేమ. 


అత్తింల్లులేని హేమ పుట్టింటికి పోవడానికి మనసు ఒప్పుకోలేదు. అందంతోపాటు మంచి యవ్వనంలో ఉన్న ఒంటరి హేమపై ఊరి పెద్దల కళ్ళు పడ్డాయి. ఏ దిక్కు దిశ లేని హేమ బిడ్డను బ్రతికించుకోవడం కోసం పెద్దమనుషులకు లొంగిపోవాల్సి వచ్చింది. 


అలా మరో ఎనిమిదేండ్ల గడిచాయి. రకరకాల జబ్బులు హేమను చుట్టుముట్టాయి. హేమ దగ్గర ఉన్న సోమ్మంతా జబ్బులకే కరిగిపోయింది. కానీ జబ్బులు మాత్రం నయం కాలేదు. అవి ప్రాణాంతక జబ్బులనీ తేలింది. ఇప్పుడు హేమ తన గురించి కాదు ఆలోచిస్తున్నది. తన బిడ్డ గోపాలు భవిష్యత్తు పట్ల బెంగ పెట్టుకుంటున్నది. 


అతని జీవితం అంధకారం అవుతుందేమోనని భయపడుతున్నది. గతంలో ఓ రోజు హేమ గోపాలును పక్కలో కూర్చోబెట్టుకుని చెప్పింది. 


"నాయనా! గోపాలు నీకు మామయ్య వున్నాడు. అతడితో కొట్లాడి నేను మీ నాన్నతో వచ్చాను. ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో మీ మామయ్య దగ్గరికి పోలేను. నిన్ను పంపుదామన్నా నీవు కనుక్కోలేవు. అయినప్పటికీ ఏదో ఒక రోజు మీ మామయ్య మనల్ని ఎదుకుంటూ వస్తాడు. నిన్ను తీసుకొని పోయి బాగా చదివిస్తాడు. భయపడకుండా ఎదురు చూడు గోపాలూ." అంది హేమ గోపాలుకు భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తూ. 


అన్నం తినకుండా నిద్రలోకి జారుకున్న గోపాలు చీకట్లో లేచి ఎప్పటిలాగే సూర్యోదయాన్ని చూడడానికి ఊరి వెలుపలకు పోయాడు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి తాదాత్మ్యం చెంది చూస్తున్న గోపాలును అటుగా పోతున్న కొండారెడ్డి. 

"ఒరేయ్ గోపాలూ ! మీ ఇంటి ముందర జనం గుమిగూడి ఉన్నారు. ఏంటో పోయి చూడరా! నేను పని తొందరలో విషయం తెలుసుకోకుండా వచ్చాను. " అన్నాడు. గోపాలం ఉలిక్కిపడి భయంతో గుండెలు అదురుతుండగా ఇంటికి పరుగు తీశాడు. 


అల్లంత దూరం నుంచే తన ఇంటి ముందర జనం ఉండడం చూసి భయం రెట్టింపై ఇంటిని సమీపించాడు గోపాలు. గుంపును తోసుకుంటూ లోనికి పోతుండగా ఓ ముసలావిడ అంటున్నది. 


"ఓ గంట కిందట నేను ఈ పక్క నుంచి పోతుంటే పెద్దగా మూలిగిన అలికిడైంది. ఏంటో చూద్దామని పాకలోనికి పోయి చూశాను. నోటి నుండి నెత్తురు కారుతోంది. ముక్కు దగ్గర వేలుపెట్టి ఊపిరి ఉందేమోనని చూశాను. అప్పటికే ఊపిరి ఆగిపోయి ఉంది" అంటుండగా గోపాలు లోపలికి పోయి అమ్మపై పడి భోరున ఏడ్చాడు. 


"పాపం పొట్టోడు ఒంటరివాడైపోయాడు వాని అమ్మ ఉన్నన్నాళ్ళు ఊళ్ళో ఆపని ఈపని చేసి వాళ్ళు పెట్టే కూడు తిని బతికారు. ఇప్పుడు ఆమె పోయింది. ఇక ఎలా ఉంటాడో ఏమో" అంటున్నాడు గుంపులోనుంచి ఒకడు దయను ఒలకపోస్తూ. 


"వాడికేం బాగుంటాడు. రోగిష్టి అమ్మను ఏగించే బాధ తప్పింది. ఎవరింట్లోనో పనిచేస్తూ వాళ్ళు పెట్టేది తింటూ బతికేస్తాడు. " అంటున్నాడు మరోకరు జాలి చూపించాల్సిన పనేం లేదన్నట్లు. 


"పాకలో శవం ఎంతసేపు ఉంటుంది. బయటికి తెస్తాం రాండి" అంటూ ఇంకోకడు ఉచితోక్తి వదిలాడు. 


"చాల్లేవోయ్ బో చెప్పుకొచ్చావ్! ఇది ఎలా బతికిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపిష్టిదాన్ని మనం తగిలి తీసుకు రావడానికి మనకేం కర్మ పట్టిందీ. " అంటున్నాడు మరొకడు చీదరించుకుంటూ. 


"ఇట్లేవుంటే వాసన కొట్టదూ!, పైగా నానారోగాలున్న రోగిష్టిది. ఏదోకటి చేయండి. చూస్తూ ఊరుకుంటే ఎట్లా? దానికంపు ఊరంతా అల్లుకుంటే అందరికీ రోగాలు వస్తాయి. " గుంపులోంచి ఇంకెవరో కర్కశంగా అంటున్నాడు. 


ఇంతలో ఊరి పెద్ద రెడ్డయ్య అక్కడికి వచ్చాడు. "ఏరా! చిన్నిగా! మునిసిపాలిటోళ్ళకు ఫోన్ చేయమన్నాను, చేశావా? పొట్టోడు పిల్లోడైపాయా! ఎలా పారేస్తాడు, మునిసిపాలిటోళ్ళకు తెలియజేస్తే అంతా వాళ్లే చూసుకుంటారు" అన్నాడు రెడ్డయ్య ఎంతో ఉదారాన్ని వర్షంలా కురిపిస్తూ. 


అందరి మాటల్ని అంత వేదనలోను గోపాలు వింటున్నాడు. వీరంతా తనపై దయ తలుస్తున్నారో, జాలి చూపిస్తున్నారో, ఉపకారం చేస్తున్నారో లేక ఈసడించుకుంటున్నారో అర్థం కాలేదు ఆ పసి వయసు గోపాలుకు. అమ్మ శవం పక్కనుంచి లేచి ఏడ్చుకుంటూ గుంపు దగ్గరకు వచ్చాడు. 


"రెడ్డయ్యా! అప్పుడు మీయమ్మ క్యాన్సర్ తో చనిపోతే అందరూ కలిసి పారేసినారే, అట్లే మా అమ్మను కూడా పారేయండయ్యా!, బుద్ధొచ్చినప్పుటి నుంచి నీ కొడుకులా నువ్వు చెప్పిందల్లా చేస్తూ వస్తున్నానే. మా అమ్మను కూడా అందురు కలిసి పారెయండయ్యా" అని ప్రాధేయపడ్డాడు గోపాలు. 


"మా అమ్మకు నీయమ్మకు సాటేమిరా యదవా! అయినా ఒరేయ్ బుడ్డోడా! నీవేమన్నా నా కన్న కొడకవట్రా! మీ యమ్మను పారెయడానికి. నువ్వు పని చేసిందానికి నేను కూడు పెట్టా. ఎచ్చులు పోకురోయ్ పొట్టి యదవా!" అని ఎగతాళి చేశాడు రెడ్డయ్య మానవత్వం మరచి. 


గుంపులో నుంచి చల్లగా జారుకుంటున్న నాగరాజును "నాగరాజు మామా! నన్ను అల్లుడంటివే నీవన్నా సాయం చేయి మామా!" నాగరాజు కాళ్ళు పట్టుకున్నాడు. 


"ఒరేయ్ బుడ్డోడా! సామెతకు అల్లుడంటానే నిజంగా అల్లుడివై పోతావా ఏందిరా! అనేవాళ్ళంతా చేస్తారా? పోరా పిచ్చోడా!" గేలిగా అన్నాడు హృదయంలేని నాగరాజు. 


ఆ పక్కనే ఉన్న సూరవ్వను " అవ్వా! నా మనమడివి నీవురా, అన్నావే ! మా అమ్మను దానం చేయడానికి నీవన్న సాయం చేయవా అవ్వా!" సూరవ్వను బతిమిలాడాడు. 


"ఓరినాయనో! నా మీద పడ్డావు ఏమిట్రా! ముసలిదాన్ని, నాకే దిక్కులేదు, నేనేం చేస్తాను. పనులు చేయించుకోవడానికి లక్ష చెపుతాం, అవన్నీ నిజమనుకుంటే ఎట్లారా ఎర్రోడా! " అంది సూరన్వ చులకనగా. 


"మీలాంటి దిక్కలేనోళ్ళకు మునిసిపాలిటీ వాళ్ళే ఎక్కువ. వాళ్ళే వచ్చి పారేస్తారులే తిక్క ఎదవా!" అన్నాడు రెడ్డయ్య మరోసారి ఉచిత సలహా ఇస్తూ. వాడి అవస్థ చూసి అందరూ గొల్లున నవ్వారు. 


"అందరికీ ఎవరేమి చెప్పినా కాదనకుండా పనులు చేసి పెట్టాను. ఈరోజు మా అమ్మ చనిపోతే బూర్చోడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. మీకు మనసు ఉందా! మంచితనం ఉందా!" అని అందరి వైపు చూస్తూ గుండెలు అవిసిపోయేలా ఏడుస్తూ అన్నాడు గోపాలు. 


అమాయకంగా ఎవరైనా సాయం చేస్తారేమో అని అందరి వైపు దీనంగా చూస్తున్న గోపాలు భుజం మీద ఒక చేయి పడింది. ఎవరాని చూస్తే ఒక కొత్తాయన. నిలువెత్తు మానవత్వం మూర్తీభవించినట్లు నిలుచున్నాడు ఆ పెద్దాయన. 


"బాబూ! నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. వీరందరూ ఎందుకు గుంపైనారు" అడిగాడు వచ్చిన పెద్దాయన. 


గుంపు నుండి ఒకడు ముందుకొచ్చి "వీడి అమ్మ చనిపోయింది సార్. వీళ్ళు దిక్కు మొక్కు లేనోళ్ళు. శవాన్ని పాతిపెట్టడానికి మునిసిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేశాము. వీడేమో ఊరందరు కలిసి ఊరేగింపుగా దర్జాగా ఖననం చేయాలంటాడు. అది అయ్యే పనేనా?" ఇది న్యాయం కాదన్నట్లు చెప్పాడు వాడు. 


" బాబూ! అమ్మను చూస్తాం పదా. " వచ్చిన పెద్ద మనిషి గోపాలును లోనికి తీసుకొని పోయి గోపాలు అమ్మను చూశాడు. ఆమెను చూసిన పెద్దాయన దిగ్భ్రాంతికి గురైనాడు. "అమ్మా! హేమా! " అంటూ గుప్పకూలి పోయాడు. 


చూస్తున్న వారమంతా అవాక్కై ఆశ్చర్యంతో స్థాణువులైపోయారు. 


అప్పటికి ఐదురోజుల కిందటే ఎలగోలా ఓపిక చేసుకొని సొక్కుతూ సోలుతూ పోస్టాఫీసుకు పోయి కార్డు కొని తమ పరిస్థితిని వివరిస్తూ తన కొడుకు గోపాలుని తీసుకుని పోవలసిందిగా కోరుతూ జాబు రాసింది హేమ. అన్న, జాబుచూసి వచ్చేసరికి ఈఘోరం జరిగిపోయింది. 


"అమ్మా! హేమా! నీ అన్నను వచ్చానమ్మా! నీ కోసం పది సంవత్సరాల నుండి వెతకని చోటు లేదు చెల్లెమ్మా! చివరికి శవమై కనిపించావా తల్లీ! అష్టైశ్వర్యాలతో బతకాల్సిన దానివి, అష్టకష్టాలు పడి చివరకు అనాథగా మరణించావామ్మా!" అని గోడు గోడున దుఃఖించాడు హేమ అన్న నరేంద్రస్వామి. 


"నీ కొడుకును గొప్పగా చదివించి ఉన్నత స్థొయికి తెస్తానమ్మా! ఏ కొరతా లేకుండా చూసుకుంటాను తల్లీ! నిన్ను నీ కొడుకులో చూసుకుంటాను చెల్లెమ్మా!" కన్నీరు మున్నీరైనాడు నరేంద్రస్వామి. 


గోపాలును దగ్గరకు తీసుకొని "నేను నీ మామయ్యను బాబూ! ఇక నీకేమి భయంలేదు రా! నీకు నేనున్నాను. నీ ఎదుగుదలకు నేను ఊతమవుతాను. " అంటూ గోపాలును గుండెలకు హత్తుకున్నాడు. 


"మామయ్యా! నీవు ఎప్పటికైనా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తావని అమ్మ చెప్పింది మామయ్యా!" అని మామయ్యను అల్లుకుపోయాడు గోపాలు. 


“బాబూ! అమ్మను వైభవంగా ఊరేగింపుగా తీసుకుపోయి ఖననం చేస్తాం. అమ్మకు అందమైన సమాధి కట్టిద్దాం! ఆ తరువాత నిన్ను ఊరికి తీసుకొని పోయి అపురూపంగా చూసుకుంటారు. ఇక నీకు ఏ కష్టాలు ఉండవు.” అని చెప్పుకుంటున్న మామా అల్లుళ్ళను చూసి ఊరివాళ్ళందరూ ఇందాకటి నుండి తాము ప్రవర్తించిన మానవత్వం లేని ప్రవర్తనకు నిర్లజ్జగా తల వంచుకొని నిలబడ్డారు. 

 -------

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

bottom of page