పరదేశి
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 30
- 4 min read
#Paradesi, #పరదేశి, #సైనికకథ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguHeartTouchingStories

Paradesi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 30/05/2025
పరదేశి - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
పరదేశి డెబ్బై సంవత్సరాల మాజీ సిపాయి. తండ్రి బర్మా యుద్ధ సమయంలో రంగం (రంగూన్) నుంచి పసివాడైన కొడుకుతో తాతల నాటి తాటిపూడి గ్రామానికి చేరుకున్నాడు. పసివాడికి పరదేశి పేరు పెట్టి, పెంచి, పెద్దవాణ్ణి చేసాడు.
ముసలి తండ్రి చనిపోయిన తర్వాత చదువు సంధ్యలు లేని పరదేశి జీవనాధారం కోసం భారత సైన్యంలో సిపాయిగా చేరి, చైనా యుద్ధంలో మందుపాతర పేలి, కాలి కింద భాగం పోగొట్టుకుని స్వగ్రామం తాటిపూడికి చేరి, పెళ్లి చేసుకుని, ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేస్తూ ఊరి పురోభివృద్ధికి పాటుపడుతున్నాడు.
అక్షరం ముక్క జ్ఞానం లేని పరదేశి, సబ్యత, సంస్కారం, సైన్యంలో సుశిక్షితుడైన క్రమశిక్షణ గల సిపాయిగా లోకజ్ఞానం సంపాదించాడు.
కొడుకును హైస్కూలు వరకు చదివించి ఆర్మీకి పంపేడు. కూతుర్ని మిలిటరీ సిపాయికి ఇచ్చి పెళ్లి చేసాడు.
మిలిటరీలో పనిచేసిన నువ్వు వికలాంగుడిగా తిరిగి వచ్చావు. మళ్లీ కొడుకును మిలిటరికే పంపుతున్నావు. దినదిన గండం ఆర్మీ కొలువున్న కుర్రాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేసావని ఊరి పెద్దలు నచ్చచెప్పినా వినలేదు.
పరదేశి వారందరికీ సమాధానం ఇస్తూ – “నేనొక మాజీ సైనికుడిగా సైన్యంలో కష్టనష్టాలు నాకు తెలుసు. అందరూ మీలాగే ఆలోచిస్తే దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడే మిలిటరీ దళానికి సైనికులు ఎలా వస్తారు?” అన్నాడు.
దట్టమైన మంచు కొండలు, ఎముకలు కొరికే చలి, భయంకర అడవులు, భీకర పర్వతాలు, వేడికి తట్టుకోలేని, కంటిచూపులో మొక్క మోడు కనిపించని ఎడారి ప్రాంతం – ఇలాంటి క్లిష్ట వాతావరణంలో భార్యాబిడ్డలు, కన్నవారికి దూరంగా, ఎప్పుడు ఏ వైపు నుంచి శత్రు సైనికులు మన సైనిక శిబిరాల మీద విరుచుకు పడతారనే సతర్కతతో ఇరవై నాలుగు గంటలూ దేశ సరిహద్దులను కాపాడుతున్న సాహస సైనికుల త్యాగాల వల్ల మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. వారికి మనోదైర్యాన్ని ఇవ్వండి. మన వంతు సాయం చేద్దాం. మిలిటరీలోనే కాదు, చావు అనేది ఎక్కడైనా రావచ్చు,” అని వారందరికీ నచ్చచెప్పాడు పరదేశి.
అన్ని వర్గాల వారు, అంటే చదువు ఉన్నవారే కాదు, చాకలి, మంగలి, సఫాయి వారు, వంటలవారు, వడ్రంగి లాంటి అన్ని కులవృత్తుల వారు సైన్యానికి అవసరం. యుద్ధ సమయంలో వారు కూడా అవసరమైతే ఆయుధాలను ఉపయోగిస్తారు.
ఈ పల్లె వాతావరణమే కాదు, దేశం నాలుగు దిక్కుల ప్రాంతీయ వేష, భాషలు, తిండీ అన్నీ తెలుసుకోవచ్చు. దేశ సేవలో కొన్ని త్యాగాలు తప్పవు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవల్సి వస్తుంది.
ప్రభుత్వం పదవీ విరమణ చేసిన విశ్రాంత సైనిక సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. సైనికునిగా దేశ సేవకే కాదు, మనకు జన్మనిచ్చి పెంచిన ఊరికీ, సమాజానికి చేతనైనంత మేలు చేయడం పౌరులుగా మన కర్తవ్యం.
సిపాయి పరదేశి రక్షణదళం నుంచి పదవీ విరమణ అనంతరం, ప్రభుత్వం ఇచ్చిన బంజరు భూమిని స్వయంకృషితో కుటుంబ సభ్యులతో కష్టపడి ఫలసాయ భూమిగా మార్చి, ఫలవృక్షాలు, కాయగూరలు పండిస్తూ, పాడి గేదెలను సాకుతూ, పాల ఉత్పత్తులను పట్టణానికి పంపుతూ ఊరి మిగతా రైతులకు మార్గదర్శకుడయ్యాడు.
గ్రామ సర్పంచిగా బాధ్యతలు తీసుకుని పంచాయతీకి ఆర్థిక వనరులు సమకూర్చాడు. నీటి పారుదల శాఖ అధికారులను మెప్పించి, కొండ దిగువ కాలువకి చెక్‌డ్యామ్ నిర్మింపచేసి వర్షాకాలం వరద నీటిని గ్రామ చెరువుకి మళ్లించి, చేపల పెంపకం ద్వారా ఆదాయ వనరులు కల్పించాడు.
విద్యాధికారుల సహకారంతో ప్రాథమిక పాఠశాల ఏర్పరచి, వ్యవసాయ పనులకు, పసువులను మేతకు తోలుకుపోయే పిల్లలను పాఠశాల వైపు మళ్లించి విద్యార్థులుగా మార్చాడు.
బ్యాంక్ అధికారులను సంప్రదించి, పనులు లేక తిరుగుతున్న దుర్వ్యసనాలకు పాల్పడుతున్న కూలీ జనాలకు లోన్లు ఇప్పించి, కోళ్లఫారాలు, పాడి పశువుల డెయిరీ ఫారంల ద్వారా ఆర్థికంగా సహకారం అందించాడు. సహకార సంఘాల ద్వారా డబ్బు పొదుపుపై అవగాహన కల్పించాడు.
రోడ్డు సౌకర్యంతో రవాణా సదుపాయాలు ఏర్పడి, గ్రామీణ ఉత్పత్తులు పట్టణానికి చేరవేయ గలుగుతున్నారు రైతులు.
గ్రామంలో పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి ట్యాంకు, విద్యుత్ వెలుగులు సమకూరాయి. నిరక్షరాస్యత, మూఢనమ్మకాల కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే జనాలను చైతన్యవంతులుగా చేసి, వారి జీవనోపాధికి వనరులు ఏర్పాటు చేసాడు.
గ్రామం చుట్టూ బంజరు భూముల్లో ఫలవృక్షాలు, జీడితోటలు, సరుగుడు, యూకలిప్టస్ వంటి వృక్షసంపదతో పర్యావరణానికి పాటుపడ్డాడు. పనికి ఆహార పథకం అమలు చేశాడు.
బోరుబావుల సాయంతో ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు రైతులు. రసాయన ఎరువులకు బదులు సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల కూరగాయలకు పట్టణంలో డిమాండ్ పెరిగి ఆర్థికంగా మేలు జరుగుతోంది.
వయసు మళ్లిన ముసలివారికి కూర్చుని చేయగలిగే చేతివృత్తులు — గంపలు, బుట్టలు అల్లడం, తాళ్లు పేనడం — నేర్పించి జీవనోపాధి ఏర్పరిచాడు.
పనులు లేక ఊరు వదిలి పోయిన యువత ఇళ్లకు తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో సుఖంగా ఉంటున్నారు.
మాజీ సిపాయి పరదేశి కృషి, పట్టుదలతో, గ్రామస్తుల సహకారంతో తాటిపూడి రూపురేఖలే మారిపోయాయి.
నవనాగరిక ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామం తాటిపూడి అన్ని విధాల అభివృద్ధి చెంది, జిల్లాలో ఆదర్శ పంచాయతీగా ఎన్నిక కాబడి, సర్పంచ్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments