పరమపావని గంగ
- T. V. L. Gayathri
- 2 days ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పరమపావనిగంగ, #Paramapavani Ganga, #దానముధర్మము

గాయత్రి గారి కవితలు పార్ట్ 20
Paramapavani Ganga - Gayathri Gari Kavithalu Part 20 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 14/05/2025
పరమపావని గంగ - గాయత్రి గారి కవితలు పార్ట్ 20 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
పరమపావని గంగ
(గేయం )
**********************************
గలగల పారును గంగ
జలజల జారును గంగ
మిలమిల లాడును గంగ
కులుకుచు పోవును గంగ
హరిపద సేవిత గంగ
సురముని సన్నుత గంగ
హరుని శిరంబున గంగ
ఉరుకుతు దూకిన గంగ
పాపవినాశిని గంగ
శాపవిమోచని గంగ
తాపనివారిణి గంగ
ఆపరదేవత గంగ
పరమపావని గంగ
కరువులు బాపును గంగ
భరత భూమిలో గంగ
బిరబిర సాగును గంగ
హిమవత్పుత్రిక గంగ
విమల ప్రకాశిని గంగ
ఉమకు సహోదరి గంగ
మమతకు వారధి గంగ
పురాణపూజిత గంగ
పరోపకారిణి గంగ
పరంబు జూపును గంగ
పరాత్పరియె శివగంగ//
************************************
దానము- ధర్మము.
(కవిత)

దాహంబుతో జనులు 'త్రాహి!'యనుచుండగా
దేహంబులే వడలి దీనులై క్రుంగగా
చల్లని జలంబులనొసంగు చలివేంద్రాలు
తల్లడిల్లినవారి దాహంబు తీర్పగా
ప్రాణాలు నిల్పుచూ ప్రజలకూరట నిచ్చు
దానశీలుర చెంత దైవంబు నిలుచురా!
మండుటెండలలోన మంచినీరును పంచి
డండితనమును చూపు ధర్మంబు మనదిరా!
అన్నదానము కన్న నధికమౌ పని యేది?
పున్నెంబులను పొందు భోగంబు మనదిరా!
పేదసాదల కెపుడు భీతినే పోద్రోలి
ఆదరించుటే మన కాదర్శమగునురా!
సమసమాజంబుకై సంతతము కృషిచేసి
మమతలను పంచుచూ మనిషిగా బ్రతకరా!
ఘనమైన సంస్కృతిని కాపాడుతూ నీవు
ఎనలేని కీర్తితో నీ భువిని మెలగరా!
నీవు నేర్చిన విద్య నిత్యమై సత్యమై
భావి పౌరులకెల్ల భవితవ్యమిడునురా!//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link: