top of page

పరిమళ పత్రం

#ParimalaPathram, #పరిమళపత్రం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Parimala Pathram - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 22/07/2025

పరిమళ పత్రం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


 అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనం జయ, నరేష్. నరేష్ కేంద్ర ప్రభుత్వంలో కొలువును నిర్వర్తిస్తూ ఉండగా, జయ ఇంటిపట్టునే ఉంటూ కొడుకు, కూతురుల ఆలనా పాలనా, సంసార బాధ్యతలో నిమగ్నం అయ్యేది. కొడుకు ఎంటెక్ చదివి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. 


"ఒరేయ్! మీ అన్నా చెల్లెల అల్లరికీ అంతు పొంతూలేవి ఉండవా?"


"అమ్మా! అక్కడున్నానన్న మాటే గాని రోజుకు ఎన్నిసార్లు బంగారు చెల్లి గుర్తుకొస్తుందో తెలుసా"


"ఆ, ఏమీ కాదు, నేను బంగారు, వెండి అంటూ లోహాలతో పోలుస్తావా" శిష్ట్లా మండిపాటు. 


"నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే, నువ్వెంత పరిశోధకురాలువైతే మాత్రం ఇలా నిలదీస్తావా?" తలపై మొట్టికాయ వేసాడు అన్నయ్య. 


"అదేం కాదన్నయ్య, నీవు లేని లోటు బాగా తెలుస్తుంది. బాధ తన్నుకొస్తుంది, కానీ ఫోన్లో నీతో అన్ని విషయాలు చర్చించలేను కదా!"


"అవునమ్మా! మనం పెరిగిన వాతావరణం, అమ్మమ్మ, నాన్నమ్మల ఆప్యాయత, స్నేహితులతో ఆటపాటలు, నీటిలో కాగితపు పడవలు వేసి అవి పోయేంత దూరం చప్పట్లతో టాటా చెప్పడం, బంక మట్టితో రబ్బర్లు చేయటం, ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో కదా, బంగారు"


"లేవండర్రా! ఇవాళ మీకు ఇద్దరికీ ఇష్టమైన వంటకాలు చేశాను, ఆరగిద్దురూ గాని, రండి" అమ్మ గంభీర పిలుపు. 


"నాన్నగారు కూడా రానీయమ్మ, అందరూ కలిసి భోజనం చేద్దాం"


"ఆయన రావడానికి బోలెడు టైం పడుతుంది. చల్లారిపోతాయి"


"నాన్నగారు వచ్చిన తర్వాతే వస్తాం" ఇద్దరూ ముక్తకంఠంతో ఒకేసారి జవాబు. 


"అన్నయ్య! నీకు తెలుసు కదా మొన్న పిహెచ్డి కి ఎంట్రెన్స్ రాశాను, 18వ ర్యాంకు వచ్చింది, విశ్వవిద్యాలయానికి వెళ్లి సీనియర్ సర్ ను కలిశాను తన దగ్గర చేరుదామని, కానీ పదవీ విరమణకు చాలా దగ్గరగా ఉన్నారని, వద్దన్నారు, ఇప్పుడేమో ర్యాంకులు బట్టి అలాట్మెంట్ ఉంటుందట. "

 

"పర్వాలేదమ్మా! ఎవరి దగ్గరైనా నువ్వు చేయగలవు అన్న నమ్మకం బలంగా ఉంది. "


"థాంక్యూ సో మచ్ ఫర్ యోర్ మోరల్ సపోర్ట్ అన్నయ్య"


పారిశ్రామిక రంగంలో అనలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శిష్ట్లా అదనపు విజ్ఞానానికై పరిశోధన ఎంతో అవసరమని ఉత్సుకతతో విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ నిద్రాహారాలు మానీ, కష్టపడి చదివి 120 మందితో పోటీపడి 18వ ర్యాంకు సాధించడం ఆశామాషి విషయం కాదు. మంచి టాపిక్ ల గురించి అన్నాచెల్లెళ్లు వీలున్నప్పుడు చర్చించుకునేవారు. 


"టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్" అంటూ భోజన బెల్ మ్రోగించింది శిష్ట్లా. 


"పిలిస్తే పోయేదానికి ఈ కర్ణశోష ఎందుకమ్మా?" నాన్న హాస్యధోరణి. 


"కాదు నాన్న! లోహాల సంఘటనల లక్షణాలను చెప్పకనే చెప్పటానికి ఇదో ప్రయోగం, కదూ!" అన్నయ్య వ్యంగ్య వాక్యం. 


"తినండి, దాని మొహం చూడండి, ఎంత ఎర్రగా కందిపోయిందో కందిపప్పులా" అమ్మ చలోక్తి. 


"మీ అందరిపై ప్రకృతి ప్రకోపిస్తూ శిక్ష వేస్తుంది పొండి" బుంగమూతితో శిష్ట్లా జవాబిచ్చింది. 


సెలవులు అయిపోవడంతో అన్నయ్య వెళ్లిపోయాడు. ఈసారి వచ్చేలోగా వీసాలు రెడీ చేసుకోమని అమ్మానాన్నను తీసుకెళ్తానని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి సిద్ధంగా ఉంచుకున్నారు పెద్దలు. ఇంతలో శిష్ట్లా కౌన్సిలింగ్ జరిగి మంచి గైడ్ను అల్లాట్ చేశారు. 


 "గుడ్ మార్నింగ్ సర్, మే ఐ కమ్ ఇన్ సర్"


 "రామ్మా, శిష్ట్లా"


"ఈ వారంలో టాపిక్ ఫిక్స్ చేస్తాను, తర్వాత మీరు గ్రంథాలయానికి వెళ్లి సైంటిఫిక్ లిటరేచర్ కలెక్ట్ చేసుకుని రాసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి దీర్ఘంగా స్టడీ చేయాలి. వాటికి సంబంధించి మొదట ప్రాథమిక పరీక్షలు చేయాలి మనకు కరెక్ట్ గా క్లిక్ అయిన దానిపై పరిశోధన ప్రారంభిస్తాము. "


 "సరే, సార్" 


మరుసటి రెండు రోజుల తర్వాత టాపిక్ అలాట్మెంట్ జరిగింది. వెనువెంటనే సార్ చెప్పిన విధంగా గ్రంథాలయానికి వెళ్లి పనిలో నిమగ్నమైంది. ఒక ఐడియా క్లిక్ అయిన మరుక్షణమే ప్రాథమిక పరీక్షలు చేసి ఫలితాలను రాసుకొని ప్రతిరోజు గైడుకు చూపిస్తూ విశ్లేషిస్తూ ముందుకు వెళుతూ ఉండేది శిష్ట్లా. పూర్తి వివరాల కొరకు పేరొందిన సంస్థకు వెళ్ళి తన లిటరేచర్ కు సంబంధించిన మెటీరియల్ ను సేకరించింది. వారాంతపు మరియు నిర్ధారిత సెలవుల్లో వస్తూ పరిశోధన చేస్తూ ఉండేది. నాలుగు ఐడియాలు బాగా క్లిక్ అవడంతో వాటితోనే శాఖోపశాఖలుగా ప్రయోగాలు చేసింది. 


"ఇంకా అదనంగా ఉండాలమ్మా" అని సార్ అన్నప్పుడు వేరే వాటితో కూడా ప్రాథమిక పరీక్షలు, ప్రయోగాలు, విశ్లేషణ అన్నీ చేసి ముగించింది శిష్ట్లా. థీసీస్ రాయడమే తరువాయి. 


ఇంతలో అన్నయ్య ఇండియాకి వచ్చి వారం రోజులు ఉండి అమ్మానాన్నను విదేశాలకు తీసుకెళ్లాడు. ఆపదలు చెప్పి వస్తాయా మనకు. అనుకోని ప్రళయాల అగ్నిగుండం గండంగా మారి అన్నయ్యను తీసుకెళ్లి, అమ్మానాన్న అనారోగ్య గాయాలను మిగిల్చింది, ఎంతో కష్టపడి వారిని ఇంటికి తెచ్చుకొని నిరంతరం సేవలు చేయడమే పనిగా మారిపోయింది శిష్ట్లా కు. 


దగ్గరున్న పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ తన కార్యాలయానికి సంబంధించిన డేటాను పంపిస్తూ ఉండేది. ఈ సేవా చక్రంలోనే పరిశోధన వ్యాసాలను కూడా రాసి పంపించేది. తల్లిదండ్రుల ఆరోగ్యం దినదిన గండంగా మారుతూ ఉండేది. ఏడేళ్ల అనంతరం వారు కాలం చెల్లించగా అప్పుడు మొదటికొచ్చింది పరిశోధన పని. సార్ తో పత్రాలను దిద్దించుకుంది, ప్రయోగ వ్యాసాల ప్రచురణలు సిద్ధం చేసుకుంది. 


"అమ్మా! మనం చేయాల్సినవన్నీ అయిపోయాయి, పరిపాలనా భవనం వారి పనులన్నీ పూర్తి చేయి." 


"సరే, సార్"


పరీక్షల విభాగం వారి దగ్గరకు ఆరుసార్లు వెళ్ళగా పని అవ్వలేదు సరి కదా ఏడోసారి కేవలం 15 నిమిషాల జవాబు కొరకు పది గంటలు ప్రయాణంతో అలసిపోయింది. రిజిస్ట్రార్ తో సంతకానికై మూడు రోజులు 18 గంటల పాటు కుక్కలా బయట కాపలా కాసింది. 


"సర్, ఈ పత్రంపై మీ సంతకం కోసం వచ్చాను"


"అంతా బాగానే ఉంది కానీ నువ్వు, మీ సార్ ఇద్దరూ మొత్తం ఆక్రమించుకుంటే నేనెక్కడ పెట్టాలి సంతకం" 


"వెనకాల కూడా కంటిన్యూ అయింది కదా సార్" 


"లేదు. ఇదంతా ఒక్క పేజీలోనే తీసుకుని మీరిద్దరీ సంతకాలతో వస్తేనే చేస్తా"


"థాంక్యూ సర్"


18 గంటల పాటు నిద్రాహారాలు మాని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అలసి సొలసిపోయి వస్తే చివరికి వచ్చిన ఫలితం ఇది. ఏడుపుతో కూడిన నవ్వుని వెంటబెట్టుకొని చాంబర్ నుండి బయటకు వచ్చింది శిష్ట్లా. 


నో డ్యూస్ కొరకు ఓ మోస్తారు ఉద్యమమే చేసింది. డీన్ సంతకం కోసం అరికాళ్ళు అరిగిపోయి ఆవిరైపోయేలా ప్రయత్నించినా ఫలితం శూన్యం. 


"గుడ్ మార్నింగ్ సర్, మే ఐ కమ్ ఇన్ సర్" 


"ఎస్, కమ్ ఇన్"


సంతకాలు చేయాల్సిన పత్రాలను ముందు ఉంచుతూ 

"సర్, పిహెచ్డి సమర్పణకు మీరు అనుమతిస్తూ సంతకం కావాలి"


"ఇన్నేళ్లు ఏం చేశావు"


"కుటుంబ పరిస్థితులు కుదరకపోవడం వలన సర్" 


"అలాంటప్పుడు ఎందుకు చేరుతారు?" 


"నిజంగానే మా తల్లిదండ్రులు అనారోగ్యంతో కాలం చేశారు, వారి సేవకే సమయం సరిపోయేది కాదు"


"ఆ, పరిశోధన చేయడానికి చేతకాక ఇలాంటి కాకమ్మ కథలు బాగానే అల్లుకుని వస్తారు, కుదరదు వెళ్ళు"


శిష్ట్లా పరిపరి విధాల వాస్తవాలు చెప్పినా వినకపోయేసరికి నయనాలు పూర్తిగా కన్నీటితో అలముకున్నాయి. కాలానికి నిజంతో పనిలేదు కాబోలు. తాళలేని దుఃఖం తన్నుకు వచ్చింది. 


ఈ ప్రవాహంలో అనుకోకుండా ఒక రోజు అక్కడ పనిచేస్తున్న తమ కుటుంబ స్నేహితుల్లోని సోదరుడు కనిపించాడు. 


"ఏమ్మా! శిష్ట్లా, ఎలా ఉన్నావు? విషయం తెలిసిందమ్మా చాలా బాధ కలిగింది, ఇప్పుడేంటి ఇక్కడ! ఏం పని?”


ప్రశ్నల వర్షానికి కట్టే కొట్టే తెచ్చే చందాన సమాధానాలు చెప్పింది.


"సరే అయితే, ఒకసారి ఆయన చాంబర్ కు వెళ్దాము రామ్మా!"


"గుడ్ మార్నింగ్ సర్, ఎలా ఉన్నారు? ఈ అమ్మాయి ఇదివరకు మీ దగ్గరకు సంతకానికి వచ్చింది"


"ఆ, ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు" 


"తనది జెనైన్ కేస్ సర్" ఉన్న విషయాన్ని చెప్పారు మైకెల్. 


"ఆ, అవునవును తల్లిదండ్రులు పోయారంటూ.. గుర్తొచ్చింది"


"మీ సంతకం లేకపోవడం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటుంది సార్"


"సరేనమ్మా! మూడు రోజుల తర్వాత కనిపించు"


"జాగ్రత్తమ్మ! అయిపోతుందిలే, దిగులు పడకు" మైకేల్ ఓదార్పు. 


"థాంక్యూ సో మచ్ అన్నయ్య" 


తన అన్నయ్య గుర్తుకు రావటంతో శిష్ట్లా కు

కంటిలో నీరు టపటపటప రాలిపోయాయి. 


కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్న చందాన పలు విధాల కష్టపడి, వివిధ ఫీజులు కట్టి, పరిపాలనా భవనంలో థీసిస్ పుస్తకాలు సమర్పణ చేసింది. కొన్ని నెలల అనంతరం వైవాతో పిహెచ్డి పట్టాను పొందింది. 


స్నాతకోత్సవంలో తన తల్లిదండ్రుల నడుమ నిల్చుని పిహెచ్డి పట్టాతో ఫోటో తీయించుకుని ఫ్రేమ్ వేయించి చెరగని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నా శిష్ట్లా కు కల నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆ రోజుటిలా అనుకోకుండా వచ్చిన మైకేల్ అన్నయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటో తీయించుకుంది. 


స్వయంకృషి, పట్టుదల, లక్ష్యం, సాధనలతో స్నాతకోత్సవ వేడుకల్లో ఉపకులపతి గారు, విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా పరిమళ పత్రాన్ని అందుకుంది శిష్ట్లా. 


నీతి : సమానత్వ, సౌభ్రాతృత్వ, సర్వసత్తాకకు సరస్వతీ నిలయాలు విశ్వవిద్యాలయాలు. నేడు రకరకాల భేదాలతో విద్యార్థుల్లో వ్యతిరేక బీజాలు నాటకుండా, జ్ఞాన సముపార్జనకు పాటుపడితే కొందరినైనా శాస్త్రవేత్తలుగా తిలకించగలము. 


 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments


bottom of page