top of page

పరివర్తన వైపు పయనం


'Parivarthana Vaipu Payanam' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

'పరివర్తన వైపు పయనం' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఏమండీ శ్రీవారూ! ఎంత ఆదివారమైతే మాత్రం ఏమిటండీ! పది గంటలైనా నిద్రలేవలేదూ! లేవండీ స్వామీ! మార్కెట్ పోయి కూరగాయలు తెస్తురు!" అన్నది జంకుతూ, నసుగుతూ, లేని గాంభీర్యం ప్రదర్శిస్తూ.. రాజేంద్ర భార్య త్రివేణి.


రాజేంద్ర ఆఫీసు సెలవు దినాలలోనూ, ఆదివారాలలోనూ కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం పరిపాటి. భార్య పిలుపుతో లేచి, బాత్ రూముకి పోయి ముఖం కడిగి, స్నానం ముగించి, డ్రెస్ వేసుకొని డైనింగ్ హాల్ లోకి వచ్చాడు రాజేంద్ర. త్రివేణి వడ్డించిన టిఫిన్ తిని "ఇంకేమిటి విషయం" అన్నట్లుగా భార్య వైపు చూశాడు.


"ఏమీ లేదండీ ! మార్కెట్టుకు పోయి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు తేవాలి. అంతేనండి." అంది ఏమంటాడోనని అనుకుంటూ.. అనుమానిస్తూ..


"బ్యాగ్ యివ్వు! తెస్తాను" భర్త అనగానే త్రివేణి ముఖం సూర్య బింబంలా వెలిగిపోయింది. పరుగున పోయి బ్యాగ్ తెచ్చి భర్త చేతిలో పెట్టింది త్రివేణి, ఆలస్యమైతే మనసు ఎక్కడ మార్చుకుంటాడేమోనని.


రాజేంద్ర బ్యాగ్ తీసుకుని స్కూటరుకు తగిలించుకొని మార్కెట్టుకు బయలుదేరే సరికి టైమ్ పదకొండు దాటింది. ఎండ తీక్షణంగా కాస్తుంది. ఏప్రిల్ నెల కావడం వల్ల ఎండలు తీవ్రంగా వున్నాయి. మార్కెట్ విపరీతమైన రద్దిగా వుంది. కొనుగోలుదారులతో వ్యాపారస్తుల అరుపులతో కేకలతో అడుక్కునే వారి దేబరింపులతో మార్కెట్టు గందరగోళంగా ఉంది.


రాజేంద్ర స్కూటరును పార్కింగ్ స్థలంలో నిలిపి బ్యాగ్ తీసుకుని మార్కెట్లోకి పోతుంటే - ఏడేళ్ల పాప తన తల్లితో కలిసి అడుక్కునే దృశ్యం చూసి ఆగిపోయాడు. ఎర్రటి ఎండలో వచ్చిపోయే వాళ్ళను "ధర్మం చేయండి బాబు! ధర్మం చేయండి బాబు!" అంటూ దీనంగా భిక్షం అడుగుతుంది.


జనం పాపను చూసి జాలిపడి రూపాయో, రెండు రూపాయలో ఆమె గిన్నెలో వేస్తున్నారు. నిజానికి పాప అమ్మది అదే ఉపాయం కూడా. చిన్న పిల్లను వెంటబెట్టుకుని వస్తే పాపను చూసి జాలిపడి డబ్బులు వేస్తారని ఆమె ఉద్దేశం.


పాప ఘోరమైన ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ముఖమంతా చెమట కారిపోతూ ఉండడాన్ని చూసిన రాజేంద్ర మనసు కలిచి వేసింది. హృదయం ద్రవించుకుని పోయింది. ప్రక్కనే వున్న చెప్పుల షాపుకు పోయి పాపకు సరిపడే జత హవాయి చెప్పులు కొన్నాడు. పాప దగ్గరికి పోయి చెప్పులు వేసుకోమన్నాడు. పాప సంతోషంగా వేసుకొని కృతజ్ఞతగా రాజేంద్రను చూసింది.


రాజేంద్ర పాప అమ్మతో "పాపను ఇంత భయంకరమైన ఎండలో నిలబెట్టినావే నువ్వు తల్లివేనా! తల్లివైతే కనికరం లేకుండా ఇలా చేస్తావా! నీకు నిండా ముప్పై ఏళ్ళు కూడా ఉండవు. ఏదైనా పని చేసుకుంటే ఈ అడుక్కునే దానిమైన ఆదాయం రాదా! పైగా ఇక్కడ అందరితో ఛి ఛ అనిపించుకోవడం మేలా! గౌరవంగా నీడ పట్టున పని చేసుకోవడం మేలా! అప్పుడు పాపను కూడ బడికి పంపించవచ్చు కదా! ఆలోచించు! జీవితాన్ని మార్చుకుని గౌరవంగా బతుకు! పాప జీవితాన్ని బాగుచేయ్యి! నిజానికి అడుక్క తినాల్సిందెవరో తెలుసా? ఏ ఆధారం లేని ముసలివాళ్శు, ఏ ఆదరణ లేని కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వాళ్ళకు కూడా ఉండడానికి వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు ఉన్నాయి. నీలాంటి వయస్సులో ఉన్న వాళ్ళు ఆడుకోవడం సిగ్గు చేటు" అని చెప్పి వికలమైన మనసుతో తన దారిన తాను పోయాడు.


రాజేంద్ర చెప్పుతున్న మాటల్ని బడిలో ఉపాధ్యాయుడు చెప్పుతుంటే విద్యార్థి శ్రద్ధగా విన్నట్లు వినింది పాప. ఇలాంటి మాటలు మామూలే అని గాలికి వదిలేసింది ‌‌ పాపతల్లి. కానీ పాప మనసులో అతని మాటలు నాటుకున్నాయి. మార్పు దిశగా ఆలోచించ సాగింది పాప.


చీకటి పడే వేళకు యిల్లు చేరుకున్నారు తల్లి బిడ్డ. వీరి కోసమే ఎదురు చూస్తూ కుర్చున్న తండ్రి భిక్షమెత్తుకున్న డబ్బులో సగం లాక్కొని మందు తాగి వచ్చాడు. రాజేంద్ర చెప్పిన మాటలే పాప మనసులో గిరగిరా తిరుగుతున్నాయి.

"సార్ చెప్పింది నిజమే. అంత ఎండలో అందరితో ఛి ఛ అనిపించుకుంటూ పొద్దు నుంచి సాయంత్రం వరకు భిక్షమెత్తుకొనే కంటే నీడపట్టున ఏదోక పని చేసుకుంటే భక్షమెత్తుకొనే దానిమైన ఆదాయం రాదా! పైగా పదిమందిలో మర్యాద కూడ ఉంటుంది" అనుకుంది పాప.


"అమ్మా నాన్నలతో ఏదోకటి చేయించాలి" అనుకుంటూ ఆరాత్రి నిద్రపోయింది.


మరునాటి ఉదయాన్నే భిక్షానికి పోతూ పాపను రమ్మని పిలిచింది పాప తల్లి.


"నేను రాను. ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ భిక్షానికి రాను" కరాఖండిగా చెప్పింది పాప.


"నేనే కాదు నువ్వు కూడ పోకూడదు. ఏదోక పని చేసుకొని గౌరవంగా బతుకుదాం! నాన్నను కూడ మందు మానిపించి అందరం కలిసి పని చేద్దాం" పాప అన్నది దృఢంగా స్థిరచిత్తంతో.


"భిక్షమెత్తుకోవడం మన వృత్తమ్మ. మనకు ఏ పని చేత కాదు. కాబట్టే మనం భిక్షం ఎత్తుకుంటున్నాం. పోదాం రామ్మా! ఇప్పటికే ఆలస్యమైంది" పాపను తొందర పెట్టింది తల్లి.


"భిక్షమెత్తుకోవడం ఎవరికీ వృత్తి కాదమ్మా! సోమరి జనానికి యిదొక సాకు మాత్రమే. నేను రాను. అంతే కాదు మీరు కూడా మానే వరుకు నేను తిండి తినను. నీళ్ళు తాగాను" అని పాప భీష్మించుకొని కుర్చుంది.


చేసేది లేక తానొకతే పోయింది భిక్షాటనకు. పాప తల్లి సాయంత్రం యింటికి వచ్చేసరికి పాప నిస్సత్తువగా నీరసంగా పడుకొని వుంది. తండ్రి పాపను బువ్వ తినమని బతిమాలుతున్నాడు. పాప ససేమిరా వినలేదు. ఆ దృశ్యాన్ని చూసి పాప తల్లి ఆందోళనతో‍ పరుగున వచ్చి పాప పక్కన కుర్చోని "ఏమిటమ్మా! యిదీ మొండిగా ప్రవర్తిస్తున్నావూ? మనకు ఏ పని రాదమ్మా! చేయడానికి" పాప పరిస్థితికి బాధపడుతూ అన్నది పాప తల్లి.


"పాపకు చెప్పులు కొనిచ్చినాయన చెప్పిన మాటలు విన్నప్పుడు నుంచి పాప ఇలా మారిపోయిందయ్యా" అని భర్తతో బాధగా చెప్పింది తల్లి.


"సరేనమ్మా! ఏపని చేద్దాం. నీవే చెప్పు" పాపను తండ్రి అడిగాడు.


"ఆలోచిస్తే ఏదోక పని గుర్తుకొస్తుంది. మాటకు ఇక్కడి జనానినే చూడండి. ఈ చుట్టు పక్కల వున్న వాళ్ళంతా పేదలు. పొద్దున లేస్తే పనులు చేసుకోవడానికి ఆడావుడిగా వెళ్ళిపోతారు. మళ్లీ సాయంకాలానికి యిండ్లకొచ్చి ఆదరా బాదరాగా అన్నం చేసుకుంటారు. కూరల కోసం కిలోమీటరు దూరమున్న గాంధీ రోడ్డుకు పోయి కొనుక్కుని వస్తారు. అదేదో మనమే చేస్తే, అంతా దూరం పోయేకన్నా మన దగ్గరే కొంటారు కదా! " ఉపాయం చెప్పింది పాప. తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.


"మనం కూరలు చేస్తే జనం కొంటారంటావా పాప" అనుమానం వ్యక్తం చేశాడు తండ్రి.


"ఎందుకు కొనరూ? కొంటారు! నువ్వు ముందుగా మందు మానేయాలి నాన్నా!. యింటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉన్న బట్టల్నే ఉతుక్కొని వేసుకోవాలి. శుచిశుభ్రంగా కూరలు చెయాలి. అప్పుడు కొంటారు నాన్నా" కర్తవ్య బోధ చేసింది పాప.


"ఏయే కూరలు చేయాలి" పాపను అడిగింది తల్లి.


"పప్పు, చారు, ఆకుకూరల తాలింపు, కురగాయల పులుసు, సాంబారు, పెరుగు.. మధ్యాహ్నమూ సాయంత్రమూ చేస్తే సరిపోతుంది " పాప సవివరంగా వివరించి చెప్పింది.


"పాపా! నువ్వు అంత పట్టుదలగా ఉంటే మేము కాదంటామా తల్లీ? నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురువి. నీవే మా ప్రాణం. నీకోసం ఏమైనా చేస్తాం. మేము మారుతాం. నువ్వు చెప్పినట్లే చేస్తాం. " తల్లిదండ్రులు ఆర్ద్రత నిండిన స్వరంతో పాపకు చెప్పారు.


మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలు పెట్టారు. యింటికి సున్నాలు వేసి శుభ్రం చేశారు. యింటిల్లపాది స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నారు. చక్కగా తల దువ్వుకుని, బొట్టు పెట్టుకొని, దేవుడి పటాలకు టెంకాయ కొట్టి, దండం పెట్టుకొని కూరలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నానికి కూరలు తయారు చేసి యింటి ముందర బెంచ్ వేసి దాని పైన కూరల పాత్రలు పేర్చి పెట్టారు. అంజలి కూరలు అని తన కూతురు పేరు రాసిన అట్టను యింటి చూరుకు తగిలించారు.


వీధిలో అటూ ఇటుగా పోయేవాళ్ళు చూసి "ఏమిటి మీరు చేస్తున్నది" అడిగారు.


"కూరలు అమ్మకానికి చేస్తున్నాం. మన ఏరియా వాళ్ళు గాంధీ రోడ్డుకు పోయి కూరలు తెచ్చుకుంటున్నారు కదా! అంత దూరం పోకుండా మేమే చేస్తున్నాం" పాప తండ్రి చెప్పాడు.


"అలాగా! చాల మంచి పని చేస్తున్నారు. మాకు ఇబ్బంది, శ్రమ తగ్గించారు." సంతోషం పడ్డారు దారిన పోయేవాళ్ళు.


ఈ విషయం ఆ నోటా ఈ నోటా వాడంతా పాకింది. అందరూ బిలబిలామంటూ వచ్చి కూరలు కొన్నారు. చేసిన కూరలన్నీ అయిపోయాయి. భిక్షమెత్తుకున్న దానికన్నా రెండింతలు లాభం రావడం చూసి కుటుంబమంతా ఆనందపడ్డారు.

రోజు రోజుకు గిరాకీ పెరుగుతుండడంతో కూరలు మోతాదు పెంచారు. ఉదయంపూట టిఫిన్ కూడా సిద్ధం చేశారు.


త్వరగా కూరల వ్యాపారం పుంజుకోవడంతో పెద్దల సలహా అనుసరించి మాంసాహారాలైన బోటి, తలకాయ కూర, చికెన్ పకోడా పెట్టారు. కొన్నాళ్ళకు ప్రజల కోరిక మేరకు మధ్యాహ్నం, సాయంత్రం రాగి సంగటి, జొన్న రొట్టె, బాయిలర్ కోడి కూర తయారు చేశారు.


క్రమంగా వ్యాపారం పెరగడం వలన చూస్తూ చూస్తూండగానే నలుగురు కూలివాండ్లతో హోటల్ స్థాయికి ఎదిగింది వ్యాపారం. రాబడి పెరగడంతో ఓ ఐదు సెంట్లు సొంత స్థలంలో హోటల్, ఇల్లు కట్టుకున్నారు. పాప అంజలిని బడికి పంపారు. ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరొచ్చింది. అందరూ మర్యాదగా గౌరవంగా చూడడం మొదలు పెట్టారు. తన కుటుంబంలో మార్పు వచ్చినందుకు పాప అంజలి మహానందపడి పోయింది.


ఓ సెలవు రోజు రాజేంద్ర కూరగాయల కోసం మార్కెట్టుకు వచ్చాడు. అక్కడ కూరగాయలు కొనుగోలు చేస్తూ అంజలి, ఆమె తల్లి అందమైన దుస్తుల్లో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కూతూహలం కొద్ది పాపను

"పాప నువ్వూ.. !" అంటూ అర్దోక్తిలో ఆగిపోయాడు రాజేంద్ర.


అంజలి చూసి ఆనందంతో

"సార్! నేను మీరు చెప్పులు తీయించిన అమ్మాయినే సార్. మీ మాటలు చలువ వల్ల మేము భిక్షాటన మానుకున్నాం. మేం కూరలు అమ్మకాలతో మొదలు పెట్టి, చిన్న హోటల్ స్థాయికి ఎదిగాం సార్. ఇదంతా మీ మాటల ప్రభావంతోనే జరిగింది సార్. మీకు జీవితాంతం కృతజ్ఞతలమై ఉంటాం సార్. " అన్నది అంజలి, "పైగా నేను ఇప్పుడు చదువుకుంటున్నాను కూడా సార్ " రాజేంద్రతో ఉత్సాహంగా చెప్పింది అంజలి.


"చాల సంతోషం పాపా! మీలా అందరూ భిక్షమెత్తుకోవడం మాని స్వయం కృషితో పైకొస్తే మనదేశంలో భిక్షాటనే ఉండదమ్మా! నిన్ను అభినందిస్తున్నాను." అంజలి కృషిని మెచ్చుకుంటూ, తనవల్ల ఒక కుటుంబం మారినందుకు సంతృప్తి పడుతూ వెళ్ళిపోయాడు రాజేంద్ర.


అడుక్కోవడం ఎవరికీ వృత్తి కాదు. అది సోమరితనాని నిదర్శనమని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది.

----------

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
53 views0 comments

Comentários


bottom of page