top of page
Writer's pictureParupalli Ajay Kumar

మా దేవుడు మీరే మాష్టారు

విజయదశమి 2023 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ

'Ma Devudu Mire mastaru - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'మా దేవుడు మీరే మాష్టారు' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

స్టాఫ్ రూం లో పిల్లల నోట్సులు దిద్దుతున్న శ్రావణ్ కుమార్ దగ్గరకి అటెండర్ వచ్చి "సార్, మిమ్ములను ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు" అని చెప్పాడు.


శ్రావణ్ కుమార్ దిద్దుతున్న నోటుబుక్ ను మూసి ప్రిన్సిపాల్ రూం కు వెళ్ళాడు.


రూం లో తొమ్మిదవ తరగతి విద్యార్థులు విజయ్, రాజేష్, అనిల్ కనిపించారు. వారిని అక్కడ చూడగానే విషయం అర్ధమయింది శ్రావణ్ కుమార్ కు.


ప్రిన్సిపాల్ గారికి యెదురుగా వున్న కుర్చీల్లో ముగ్గురు వ్యక్తులు కూర్చొని వున్నారు.


ప్రిన్సిపాల్, శ్రావణ్ కుమార్ ను చూస్తూనే "రండి శ్రావణ్ కుమార్ గారూ.. ఇటు కూర్చోండి. వీరు విజయ్, రాజేష్, అనిల్ ల తండ్రులు. మీమీద ఒక కంప్లైంట్ వచ్చింది. అందుకే పిలిపించాను. " అన్నాడు.


శ్రావణ్ కుమార్ కుర్చీలో కూర్చొని పిల్లల వైపు చూసాడు.


శ్రావణ్ కుమార్ తమవైపు చూడగానే వాళ్ళు ముగ్గురూ తలదించుకుని నేలచూపులు చూసారు.


"నిన్న రాత్రి మీరు బాగా తాగి వచ్చి ఈపిల్లలను కొట్టారని పిల్లలు అంటున్నారు. పొద్దున్నే ఫోన్ చేసి వారి తండ్రులను పిలిపించుకున్నారు. వారు మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. పిల్లలను కొట్టినందుకు పోలీస్ స్టేషను లో కంప్లయింట్ చేస్తామంటున్నారు. మీ క్వార్టర్స్ లో వెతికితే మందు సీసాలు దొరుకుతాయని ఈ పిల్లలు గట్టిగా చెపుతున్నారు. నిజమేనా? దీనికి మీ సమాధానం ఏమిటి?"


ప్రిన్సిపాల్ ప్రశ్నించాడు శ్రావణ్ కుమార్ ను చూస్తూ..


శ్రావణ్ కుమార్ గట్టిగా ఊపిరి పీల్చుకొని "ఈ విషయం మీదాకా రాకుండానే నేనే పరిష్కరిద్దామనుకున్నాను. కానీ వీళ్లంతట వీళ్ళే బయటబడ్డారు. ఇప్పుడు అసలు సంగతి చెప్పకుండా దాస్తే ఇటు నా ఉద్యోగానికి, అటు పిల్లల భవిష్యత్తుకు కూడా నష్టం వాటిల్లుతుంది. " అని అటెండరు ను పిలిచి


"మా క్వార్టర్స్ లో నాటేబుల్ ప్రక్కన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. మేడంను అడిగి అది తీసుకుని రా " అని పంపించాడు.


సెల్ తీసి స్థానిక పోలీస్ స్టేషను SI కు ఫోన్ చేసి వెంటనే స్కూలుకు రమ్మని చెప్పాడు.


నిలబడివున్న విద్యార్థులను చూస్తూ


"మిమ్ములను కొట్టానని చెప్పారు. నిజమే కొట్టాను. మరిఎందుకు కొట్టానో చెప్పలేదా?" అని అడిగాడు.


పిల్లలు ఏం సమాధానం చెప్పలేదు.


అనిల్ తండ్రి శ్రావణ్ కుమార్ ను కోపంగా చూస్తూ


"చూసారా పిన్సిపాల్ గారూ మీఎదుటే కొట్టానని అంటున్నాడుగా. చిన్నప్పటి నుండి మావాడిని మేము చిన్న దెబ్బ అయినా వేయలేదు. ఏదో నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకొని బాగుపడతాడని మీ దగ్గర చేర్చాము.


ఇలా దెబ్బలు కొట్టి పిల్లలను భయపెడతారా? వాడు అవమానంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే జీవితాంతం ఏడ్చేది మేమేగా.


పిల్లలకు బుద్దులు చెప్పి పాఠాలు చెప్పాల్సిన మీరే తాగి తందనాలాడితే.. ఛీ ఛీ.. చెప్పుకోటానికే సిగ్గుచేటుగా వుంది. " అన్నాడు.


ప్రిన్సిపాల్ కు తల కొట్టేసినట్లనిపించింది.


ప్రిన్సిపాల్ దృష్టిలో శ్రావణ్ కుమార్ మంచి ఉపాధ్యాయుడు.

ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి ఆశయాలు గలమనిషి.

విద్యార్ధుల బాగుకోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి.


మాథ్స్ టీచర్ అయినా సైన్స్ ఫెయిర్ లు వున్నప్పుడు సైన్స్ టీచరు కు, గేమ్స్ పోటీలప్పుడు P. D. కు, సాంస్కృతిక ఉత్సవాలప్పుడు తెలుగు సార్ కు అన్నింటా తానే అయి సాయం చేస్తుంటాడు.


స్కూలు లో జరిగే ప్రతీ కార్యక్రమం లోను విసుగు అనేది లేకుండా పార్టిసిపేట్ చేస్తుంటాడు. చాలామంది విద్యార్థులకు కూడా శ్రావణ్ కుమార్ అంటే ఇష్టం. అతనిపై వచ్చిన అభియోగాన్ని నమ్మలేదు. కానీ ప్రిన్సిపాల్ గా తను తనబాధ్యత నిర్వహించాలి.


అటెండర్ ఒకప్లాస్టిక్ సంచి తెచ్చి ప్రిన్సిపాల్ టేబుల్ పైన వుంచాడు.


ఈలోపున SI శ్రీకాంత్ వచ్చాడు. ప్రిన్సిపాల్ గారిని విష్ చేసి


"ఎందుకు శ్రావణ్ రమ్మన్నావు? ఏమిటి సంగతి? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? " అన్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ.


శ్రావణ్ కుమార్ చిన్నగా నవ్వుతూ " ఒక విషయంలో నీ హెల్ప్ కావలసి వచ్చింది. చెపుతా" అంటూ పిల్లల తండ్రుల తో


"వీరు శ్రీకాంత్ గారు. ఇక్కడి పోలీస్ స్టేషన్ లో SI గా పనిచేస్తున్నారు. నాకు చిన్ననాటి మిత్రుడు" అన్నాడు.


ప్రిన్సిపాల్ గారిని చూస్తూ " సార్, ఒక గంటసేపు ఈరూం లోకి ఎవ్వరినీ పంపించవద్దని, ఇక్కడ ఎవరున్నదీ బయటకి పొక్కకూడదని అటెండరు కు గట్టిగా చెప్పండి. "అని రిక్వెస్ట్ చేసాడు.


ప్రిన్సిపాల్ అటెండరును పిలిచి ఆ విషయం చెప్పిరూం తలుపు మూయమన్నాడు.


శ్రావణ్ కుమార్ "శ్రీకాంత్! ఈస్కూల్ కు దగ్గిరలో రెండు వైన్ షాపులు వున్నాయి. వారికి ఫోన్ చేసి రాత్రి తొమ్మిది, పది గంటల మధ్య వారి సీసీకెమెరా ఫుటేజ్ ను కాపీచేసి నీసెల్ కు పంపమని చెప్పు " అన్నాడు.


శ్రీకాంత్ ఎందుకని అడగకుండానే శ్రావణ్ కుమార్ చెప్పినట్లు చేసాడు.


శ్రావణ్ కుమార్ చెప్పటం మొదలు పెట్టాడు.


"నిన్న రాత్రి పదిగంటల వరకు నా స్టూడెంట్స్ రాసిన అస్సైన్ మెంట్లు కరక్ట్ చేస్తూ వున్నాను. రోజూ పడుకునే ముందు ఒకసారి స్కూలు గ్రౌండ్, పరిసరాలు, క్లాసు రూం లు, డార్మెటిరీలు తిరిగి చూడటం, చెక్ చేయడం నా అలవాటు. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు.


నిన్న కూడా అలా ఒక రౌండ్ వేస్తున్నప్పుడు ఒక తరగతి గదిలో ఒక మూలకు కూర్చొని ఉన్న విజయ్, రాజేష్, అనిల్ లు కనిపించారు. వాళ్ళ ముందు ఒకమందుబాటిల్,

గ్లాసులు కనిపించాయి.


వాళ్ళ వాలకం చూస్తుంటే అప్పటికే కొంత మందు తాగినట్లు అనిపించింది. నన్ను చూస్తూనే గాభరాగా లేచి నిలుచోబోయి నిలదొక్కుకోలేక తూలి క్రిందపడ్డారు.


ఆ స్థితిలో వాళ్ళని చూసి కోపం ఆపుకోలేక ఆ ముగ్గురినీ పట్టుకొని ఆచెంపా, ఈచెంపా వాయించాను. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియని మైకంలో నన్ను పట్టుకొని ఎదురుతిరుగుతూ దుర్భాషలాడారు. నానా మాటలన్నారు.

అవన్నీ ఇక్కడ చెప్పలేను. నాకు చిరెత్తుకొచ్చి అక్కడ కనపడిన కర్రముక్కతో చితక బాదాను.


వాళ్ళ మీద కోపంతో కాదుకొట్టింది. చిన్నపిల్లలు మంచేదో, చెడు ఏదో తెలియక తాగి చెడిపోతున్నారన్న బాధతో.

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వారిని దండిస్తుంటే.


"దండం దశగుణ భవేత్" అనుకొని ఆ పని చేసానే కానీ రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు.


ఆ మందు సీసా, గ్లాసులు అక్కడున్న ప్లాస్టిక్ కవర్ లో వుంచి


"రేపే ఈ విషయం మీ పేరెంట్స్ కు ఫోన్ చేసి చెపుతా. " అని బెదిరించి వాళ్ళను వారి డార్మెటిరీకి పంపించి ఆ ప్లాస్టిక్ సంచి తీసుకెళ్ళి మా యింట్లో వుంచాను.


అయితే నాకు వారి తల్లితండ్రులకు ఈ విషయం చెప్పే ఉద్దేశ్యం లేదు. నాలుగు రోజులు ఈ ముగ్గురినీ నయానో, భయానో నచ్చచెప్పి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనుకున్నాను.


ఈ విషయం బయటకి తెలిస్తే సాటి పిల్లలముందు వీరు పలుచన అవుతారని, అది వారి విద్యార్థి జీవితానికి మాయని మచ్చ అవుతుందని భావించి నేను మీ దృష్టికి కూడా తీసుకురాలేదు.


నేను వారి పేరేంట్స్ కు చెపుతానని భయపడి ముందుగానే వారు ప్లేటు ఫిరాయించి నామీద నిందమోపారు. "


శ్రావణ్ కుమార్ చెప్పినది వింటూనే పిల్లల తండ్రులు వారివైపు చూసారు. పిల్లలు వొణికిపోతున్నారు.

తండ్రుల ముఖంలోకి చూడకుండా తలలు దించేసుకున్నారు.


శ్రీకాంత్ సెల్ కు వాట్స్ అప్ లో వీడియో వచ్చింది. అది ఆన్ చేసి సెల్ ను టేబుల్ పై వుంచాడు.


తొమ్మిది నలభయికి ముగ్గురు పిల్లలు వైన్ షాప్ ముందు నిలబడి మందుసీసా కొనటం కనిపించింది.


శ్రావణ్ కుమార్ సెల్ ఆపుచేసి "చూసారుగా.. ఇంకా నమ్మకపోతే నా బ్లడ్ సాంపుల్ హాస్పిటల్ లో పరీక్షిద్దాం.

నా రక్తంలో ఆల్కహాల్ వున్నదీ లేనిది తెలుస్తుంది.


ఈ సంచిలో వున్న సీసాను, గ్లాసులను వేలిముద్రలు పరీక్షించే వారికి పంపితే వీటిమీద ఎవరెవరి వేలి ముద్రలు వున్నదీ తెలుస్తుంది. నేను నా నలభయి సంవత్సరాల జీవితం లో మందు జోలికే వెళ్ళలేదు.


తాగే వారిని తాగొద్దని మంచిమాటలతో వారిని ఆ వ్యసనం పాలు కాకుండా కాపాడానే గానీ నేనెప్పుడూ దానికి దూరంగానే వున్నాను. " అన్నాడు.


వచ్చిన తండ్రులు కోపంతో లేచి పిల్లలను ఎడాపెడా బాదటం మొదలుపెట్టారు. శ్రావణ్ కుమార్ విసురుగా లేచి వారిని ఆపాడు.


"ఎప్పుడైనా ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆ మనిషి ఎటువంటి వాడు అని తెలుసుకుని అనాలి. నోరు జారిన మాటను వెనక్కు తీసుకోలేము.


వీరు ఈ రోజు ఇలా మందు తాగారంటే అలా తాగటం తప్పు అని తెలుసుకోలేని వయసులో వున్నారు. నేననుకోవటం మీఇళ్ళల్లో మీరు మీపిల్లల ఎదుటే తాగుతూ వుండివుంటారు.

అదిచూసి వీళ్ళు కూడా అలా తాగటం గొప్ప అనుకొని మీ బాటలోనే నడుద్దామనుకున్నారు"


శ్రావణ్ కుమార్ మాటలకు ముగ్గురి తండ్రులు తలలు దించుకొని "మమ్ములను క్షమించండి సార్" అన్నారు.


ప్రిన్సిపాల్ " మీ ముగ్గురికీ టీసీలు ఇచ్చి ఇక్కడినుండి పంపించివేస్తాను. వేరే ఎక్కడైనా చేరండి. మీలాంటి పిల్లలు ఇక్కడుంటే మిగతా పిల్లలు కూడా ఆగమాగం అవుతారు." కోపంగా అన్నాడు.


తండ్రులు శ్రావణ్ కుమార్ కాళ్ళమీద పడ్డారు. శ్రావణ్ కుమార్ వాళ్ళను లేపి కుర్చీలలో కూర్చోబెట్టాడు.

అటెండరు ను పిలిచి పిల్లలను క్లాసుకు తీసుకెళ్ల మన్నాడు.

అటెండరు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకి వెళ్ళాడు.


"ప్రిన్సిపాల్ గారూ! వారిని క్షమించండి. మంచేదో, చెడు ఏదో తెలియని వయసులో ఉన్నారు. ఇప్పుడు వారికి టీసీ ఇచ్చి పంపిస్తే అది వారి భావి జీవితాలకు పెద్ద దెబ్బ అవుతుంది. వారిని ఈ రోజు నుండి నేను నా పర్యవేక్షణలో ఉంచుకుంటాను. వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తాను. వారు చిన్నపిల్లలు. మనం ఎటు వంచితే అటు వంగుతారు. నామీద నమ్మకముంచి వారిని ఈ స్కూళ్ళో కొనసాగనివ్వండి. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరుగకుండా నేను చూస్తాను" అని శ్రావణ్ కుమార్

ప్రిన్సిపాల్ ను రిక్వెస్ట్ చేసాడు.


ప్రిన్సిపాల్ సరేనని తలవూపాడు.


శ్రావణ్ కుమార్ విద్యార్థుల తండ్రులను చూస్తూ

"మీకు చెప్పేటంత వయసు నాకు లేదు. ఈ కాలంలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులంటే చులకన భావం ఏర్పడింది.


చిన్న చిన్న విషయాలకు టీచర్లను ద్వేషించడం, దూషించడం, వాళ్లను చులకనగా చూడటం, కొన్ని సార్లు వారిపై దాడిచేయడం ఎక్కువైపోతున్నది.


మీ పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాలతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దే మా టీచర్ల స్థాయిని దిగజార్చుతున్నారు మీరు మీ మాటలతో.


మీ పిల్లలు చెప్పింది విని నిజానిజాలు తేల్చుకోకుండా మా మీద నింద మోపబోయారు.


విద్య మనిషిజీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.


అటువంటి విద్యను అందించి విద్యార్థులను సరైన మార్గంలో నడిచే విధంగా బోధన అందించడం, విద్యార్థులను గొప్ప వాళ్లుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయులుగా మా కర్తవ్యం.


మమ్ములను మీరు దండలేసి సన్మానించ నక్కరలేదు.

మనిషిగా గౌరవిస్తే చాలు.


మిమ్ములను చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. కనీసం తాగుడు లాంటి మీ చెడు అలవాట్లు మీ పిల్లలు యెదురుగా ప్రదర్శించకండి" అన్నాడు.


వారు ముగ్గురూ ప్రిన్సిపాల్ గారికీ, శ్రావణ్ కుమార్ కు చేతులెత్తి దండం పెట్టారు. నీళ్ళు నిండిన కళ్ళతో తాము ఇక జన్మలో తాగమని చెప్పారు.


"ఇది మనమందరం ఇక్కడితో మరచిపోతే మంచిది.

పొరపాటున మీ యింట్లో మీ భార్యలకు కూడా చెప్పవద్దు.

ఈ విషయం మనలోనే సమాధి కావాలి. పిల్లలను పదేపదే దీని గురించి అడగొద్దు. వారు సెలవలలో ఇంటికి వచ్చినప్పుడు మామూలుగానే వుండండి. పిల్లల లేత మనసులను బాధ పెట్టొద్దు" అన్నాడు శ్రావణ్ కుమార్.


ప్రిన్సిపాల్ తో "సార్, మన స్కూలుకి దగ్గరలో వున్న వైన్ షాప్ లను తొలగించమని అధికారులకు, SI గారికి,

ప్రెస్ కు లెటర్స్ రాయండి" అని


శ్రీకాంత్ ను చూస్తూ


"శ్రీకాంత్! నీ మిత్రునిగా నాదొక రిక్వెస్ట్. ప్రిన్సిపాల్ గారి లెటర్, CCTV ఫుటేజ్ ఆధారంగా మైనర్ పిల్లలకు మద్యం అమ్మారనే మిషతో ఆ వైన్ షాప్ ను మూసేసే ప్రయత్నం చేయి. మా స్కూల్ పిల్లల విషయం మాత్రం బయటకు రాకుండా మానేజ్ చేయి" అన్నాడు శ్రావణ్ కుమార్.


***********************************


వింటున్న శ్రోతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.


స్టేజ్ పైనున్న ముప్పై ఏళ్ళు పైబడిన యువకులు విజయ్, రాజేష్, అనిల్ లు ఒకరి తరువాత ఒకరు అందుకొని చెపుతున్నారు.


"ఇది కథ కాదు. మా ముగ్గురి జీవితాల్లో జరిగిన యదార్ధ సంఘటన. ఆరోజు మా మాష్టారు దైవంలా మమ్ములను ఆదుకున్నారు. మా తండ్రులలో కూడా మార్పు తెచ్చారు. ఆనాటి నుండి వారు మద్యం తాగటం మానేశారు.


మా మాస్టారుని ద్వేషించి వారిమీద నిందలు వేసిన మమ్ములను నిరంతరం వెంటవుండి ప్రేమతో బుజ్జగించి, బుద్దులు చెప్పి లాలించి, మంచి మాటలతో శాసించి మా జీవితాలకు బంగరుబాటలు పరిచారు.


'ద్వేషాన్ని జయించు ప్రేమతో' అన్నట్లు మమ్ములను తన ప్రేమపాశంతో బంధించి మా ఉన్నతికి కృషి చేసారు.

మరుసటి సంవత్సరం పదవతరగతిలో మేము ముగ్గురం రాష్ట్ర స్థాయి రాంకులు సాధించాము. విజయపథం వైపు అప్పుడు వేసిన అడుగులు ఆగలేదు. ఇప్పటికీ

ఇంకా కొనసాగుతూనే వున్నాయి.


ఈ రోజు మావెనుక మేము సంపాదించిన కోట్లాది ఆస్తులు మీకు కనపడుతుండవచ్చు. మాకు మాత్రం మావెనుక నిలబడి చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ కరుణామృతాన్ని కురిపిస్తున్న మా మాస్టారి చూపులే కనపడుతుంటాయి.


ఈరోజు మా మాష్టారు ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసారు. వారికి సన్మానాలు, పొగడ్తలు, దండలు, శాలువాలు అస్సలు ఇష్టం వుండవు. స్కూలు నుండి కూడా రోజూ వచ్చినట్లే ఈ రోజు కూడా సాదాసీదాగా బయటకు వచ్చారు. ఇక్కడికి బలవంతాన మేమే తీసుకువచ్చాము.

మాష్టారు గారూ ఒక్కసారి స్టేజ్ మీదకు రండి. "


అని అనిల్ పిలువగానే విజయ్, రాజేష్ లు శ్రావణ్ కుమార్ ను సగౌరవంగా వేదిక మీదకు తీసుకుని వచ్చారు.


ఆసమయంలో మైక్ లో


'నూటికో కోటికో ఒక్కరు


ఎప్పుడో ఎక్కడో పుడతారు


అది మీరే మీరే మాస్టారు..


మా దేవుడు మీరే మాస్టారు.. '


పాట రాసాగింది.


శ్రావణ్ కుమార్ ను స్టేజి మీద వున్న సోఫాలాంటి కుర్చీలో కూర్చోబెట్టి విజయ్ చెప్పసాగాడు..


"ఈ నవీన నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి..

ఋషితుల్యుడు.. జాతి జీవన వికాసానికి మార్గదర్శకుడు అతను.. నిరంతర శ్రమజీవి. నిత్య విద్యార్థి.


దేశ, రాష్ట్ర, సమాజ అభివృద్ధిలోకీలక పాత్ర పోషించే యువత సర్వతోముఖాభివృద్ధిలో అతడే కీలకం.


అతనే మా గురువు. మా దైవం. వారే మా మాష్టారు గారు.


అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చెప్పిన మాటలు మీరు విన్నారా!


'One Child, One Teacher, One Pen And One Book Can Change The World. '


అటువంటి టీచర్ మా మాష్టారు గారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి మా మాష్టారు గారికి వుంది. మా మాష్టారు గారు ఎప్పుడూ చెపుతుండేవారు.


'పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగానికే గాని చేసే పనికి కాదు' అని.


మా మాష్టారు గారు ఉపాధ్యాయుడిగా మరెన్నో జీవితాలను తీర్చిదిద్దాలని, మాలాంటి ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలని మా కోరిక.


అందుకే మేము ముగ్గురు మిత్రులం కలసి 'వెలుగు బాట '

అనే ఈ స్కూలును నిర్మించాము. ఈ స్కూలులో విద్యార్థులకు ఎటువంటి ఫీజులు ఉండవు. ఈ స్కూలు నిర్వహణ ఖర్చులు, టీచర్లకు జీతాలు వంటి ఆర్థికపరమైన విషయాలన్నీ మేము భరిస్తాము.


ఈ స్కూలు ఎలా నడపాలి, ఏం చేయాలి, ఏ పిల్లలకు ప్రవేశం కల్పించాలి, ఏ టీచర్లు కావాలి అన్న విషయాలన్నీ మాష్టారు గారే చూస్తారు.


ఇది మా స్కూలు కాదు. మాష్టారు గారి స్కూలు. ఈ స్థలం, ఈ బిల్డింగ్స్ అన్నీ మాస్టారిగారి పేరుమీదనే రిజిష్టర్ చేయించాము. ఆ కాగితాలను మా ముగ్గురి తండ్రులు మాస్టారుగారికి అందచేస్తారు. "


అందరూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసారు.


రాజేష్ మాట్లాడుతూ


"మేమూ ఒకప్పుడు తాగి తప్పుచేసాము అని చెప్పుకోటానికి సిగ్గుపడటం లేదు. మా తప్పులను మేము ఒప్పుకునేలా చేసి ఆ తప్పువల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఎన్నో ఉదాహారణలతో చెప్పేవారు మా మాష్టారు. వీడియోలు చూపించి తాగుడు వల్ల కడుపు, కాలేయం, గుండె ఎలా పాడయిపోతాయో చూపించేవారు. ఎంతో ఓపికగా మమ్ములను సన్మార్గంలోకి నడిచేలా చేసారు.


వారు మాకు లెక్కల మాష్టారు మాత్రమే కాదు..

He was

a great Motivator,

Philosopher,

Psychologist

అన్నీ అన్నీ వారే..


మా జీవితం పదిమందికి ఇన్స్పిరేషన్ కావాలనే మా తపన.


అధఃపాతాళానికి పడిపోవలసిన మా జీవితాలకు చేయూతనిచ్చి మానసికబలాన్ని మాలో పాదుకొలిపి విజయ శిఖరంపై సగర్వంగా మమ్ములను నిలబెట్టింది మా మాస్టారే..


మా మాస్టారుకి ఏమిచ్చినా ఆ ఋణం తీరదు. చంద్రునికో నూలుపోగులా ఈ స్కూలును మాష్టారి కి ఇస్తున్నాము.


మాష్టారు గారు స్కూలు నడపటానికి ముందుకొచ్చారు గానీ స్కూలు తనపేర వద్దన్నారు. కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడి ఒప్పించాము.


మా మూడు కుటుంబాలు మనఃపూర్తిగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ అభినందనలు. వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కూళ్ళో అడ్మిషన్స్ జరుగుతాయి. " అని ముగించాడు.


విజయ్, రాజేష్, అనిల్ తండ్రులు వచ్చి శ్రావణ్ కుమార్ కు దండం పెడుతూ స్కూలు రిజిస్ట్రేషన్ కాగితాలను అందించారు.


విజయ్, రాజేష్, అనిల్, ముగ్గురూ ముక్త కంఠంతో


“గురు బ్రహ్మ గురు విష్ణు


గురు దేవో మహేశ్వరః


గురు సాక్షాత్ పరబ్రహ్మ


తస్మైశ్రీ గురువే నమః”


అంటూ మాష్టారు గారికి సాష్టాంగ నమస్కారం చేసారు.


శ్రావణ్ కుమార్ నీరు నిండిన కళ్ళతో వారిని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు.


"అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాంతిః శాంతిః శాంతిః"


*********************************


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.


113 views3 comments

3 Comments


ajayparu1959
Jul 21, 2023

Thank you Sir

Like

@murali7009 • 8 hours ago

మంచి మెసేజ్ సర్. UPLOAD చేసిన వారికి ధన్యవాదాలు..

Like
ajayparu1959
Jul 21, 2023
Replying to

Thank you Sir

Like
bottom of page