top of page

పరివ్రాజకుడు

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #Parivrajakudu, #పరివ్రాజకుడు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Parivrajakudu - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 13/07/2025

పరివ్రాజకుడు - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అప్పుడప్పుడు బ్రతుకు బాటలో అనుకోని విధంగా కొందరు విచిత్ర వ్యక్తుల్ని కలుసుకోవలసి వస్తుంది. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే, ఆ రీతిన కొందరు గొప్ప వ్యక్తుల్ని కూడా కలుసుకోగల అవకాశం కలుగుతుంటుంది.. కొందరికిది అనుభవైద్యకమే! 


ఒకరోజు నేను మా మేనమామ ముద్దాల మోహనరావుని చూడటానికి విద్యానగర్ వెళ్ళాల్సి వచ్చింది; జిల్లాపరిషత్తులోనూ సచివాలయంలోనూ భర్తీ చేయబోతూన్న ఊద్యోగ వివరాలు గురించి తెలుసుకోవడానికి.. 


మామయ్యకు అటువంటి విషయాలు తెలుసుకోవడంలో రెడీ మేడ్ నాలెడ్జి ఉంది, ఇంతకూ అవన్నీ తాత్కాలిక స్థాయి ఖాళీలే.. మరి నావంటి నిరుద్యోగికి అటువంటి తాత్కాలిక కొలువు ఎడారి బ్రతుకులో పన్నీటి జల్లువంటిదే కదా! వేన్నీళ్లకు చన్నీళ్ళలా చిల్లర డబ్బుల తో బాటు కొద్దిబాటి అనుభవం కూడా లభిస్తుందిగా.. ఇక విషయానికి వస్తే— అప్పటికి మా ఇంటి పరిస్థితి అలాగుందన్న మాట. నట్టింట దూలంలా నిల్చోవలసిన నాన్న మెడికల్ గ్రౌండు పైన ఉద్యోగ విరమణ చేసి ఇంట్లో కూర్చుంటే సగటు తెలుగు కుటుంబ పరిస్థితి అలాగే ఉంటుంది మరి. 

నేను విద్యానగరం చేరుకునేటప్పటికి పదిన్నర కావస్తోంది. మామయ్య వేరొక రాచకార్యంపైన మరెక్కడికైనా వెళ్ళపోతాడే మోనన్న ఆందోళనతో ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరేటప్పటికి అక్కడ మామయ్యలేడు. అత్తయ్యా లేదు. పెంచుకున్న తెల్లటి గడ్డంతో మెడన వ్రేలాడుతూన్న రూద్రాక్షలతో యెవరో ఆసామి కాలుపైన కాలేసుకుని పుస్తకం చదువుతూ కనిపించాడు.


నన్ను చూసి కనుబొమలెగరేస్తూ అడిగాడు- “ఎవరయ్యా మీరు? గడప వద్ద ఆగకుండా చెప్పా చెయ్యకుండా తిన్నగా లోపలకు వచ్చేయడమే! ఇప్పుడు నిన్ను నీవు పరిచయం చేసుకో”

క్లాసు మేష్టర్ ధోరణిలో ఉన్న అతగాడి కంఠస్వరానికి మొదట విస్తుపోయి ఆ తరవాత నన్ను నేను నిలద్రొక్కుకుంటూ నా గురించి నేను చెప్పాను.


నా పరిచయ వాక్యం విని అతడు నవ్వు ముఖంతో అన్నాడు- “హో! నువ్వు మా మోహనరావు మేనల్లుడివా! మీ మామయ్య ఇప్పుడిక్కడ లేడయా! ఏదో ప్రక్కవీధిలోని వారి శుభకార్యానికి భార్య సమేతంగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు నీగురించి చెప్పేవెళ్ళాడులే.. ”


అప్పుడు అడ్డువచ్చి-యేమని-అని అడిగాను. 


“నువ్వు గట్టివాడివని, చురుకైన వాడివని.. మితి మీరిన తెలివి తేటలు చూపింవని. ఏదో తాత్కాలిక ఉద్యోగ ఖాళీల గురించిన గ్రేడ్ వైస్ జాబితా ఉందని—“


ఆ మాట విన్నంతనే- “మరి ఆ ఖాళీల పట్టీ నాకు ఇవ్వగలరా అంకుల్!” అని అడుగుతూ ఆయన చేతిలోని పుస్తకం వేపు చూసాను. అది శ్రీభక్తి సిధ్ధాంత సరస్వతి గోస్వామి వారు విరచిత- బ్రహ్మ సంహిత—


“అదెక్కడుందో నాకు తెలుసు. కాని నీ ఆతృత చూస్తుంటే దానిని అందుకున్న తక్షణం గాలిలోకి ఉడాయించేలా ఉన్నావే! మీ మామయ్య వచ్చింతర్వాత పలకరించి నిదానంగా వెళ్ళు. సరేనా!”

ఆయన మాటకు ఔనని తలూపుతూ నాకు యెరుకే కాబట్టి- వంటగదిలోకి వెళ్లి మా ఇద్దరికీ రెండు కప్పుల కాఫీ కలిపి తీసుకు వచ్చాను. ఒక కప్పుని ఆయనకు అందిచ్చి మరొకటి నా చేతిలో ఉంచుకుని ఆయనకు యెదురుగా స్టూలు తెచ్చు కుని కూర్చున్నాను. 


అప్పుడాయన కాఫీ చప్పరిస్తూ అన్నాడు- “కాఫీ బాగా చేసావు. వంట కూడా చేస్తావా? ”


తలూపాను. 


“ఐతే నీకు కాబోయే పెళ్లాం అదృష్టవంతురాలే.. సరే ఇక విషయానికి వద్దాం! సర్కారు ఉద్యోగం పట్ల నువ్వు చూపించే వెంపర్లాట చూస్తుంటే నీకు ప్రైవేట్ సెక్టార్ పట్ల ఆసక్తి లేనట్లుంది”


నేను తల అడ్డంగా ఊపి- “నేను రెండు మూడు ప్రైవేట్ కంపెనీల్లో లీవ్ వెకెన్సీలో పని చేసానండి. రెండు మూడు నెలలు వరకూ పని చేయనిచ్చారు” అని బదులిచ్చాను. 


అప్పుడాయన కొంచెం యెడబాటు ఇచ్చి అన్నాడు- “నీ దృక్పథం నాకు నచ్చిందోయ్. అదీ ఇదా అని చూడకుండా ఏదైనా చేయడానికి సిధ్ధపడుతున్నావు చూడూ- అది పురుష లక్షణం. ఇప్పుడు దీనికి బాగా ఆలోచించి బదులియ్యి. నువ్వొక చిన్నపాటి ప్రైవట్ కంపెనీలో పనిచేస్తున్నావు, కంపెనీ వా ళ్ళకు క్యాష్ క్రంచ్ వచ్చిపడింది. కాని అదే రోజు ఒక సప్లయిర్ కి చెక్ పేమెంట్ చేయాలి. కాని కంపెనీ బ్యాంక్ అకౌంటులో చాలినంత క్యాష్ లేదు. ఇక విషయానికి వస్తే- మీ కంపెనీకి గుడ్స్ సప్లయ్ చేసే వ్యాపార సంస్థేమో అదే రోజు చెక్కుని క్లియరెన్సుకి పంపించేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. గుడ్స్ సప్లయిర్ కి అదే రోజు చెక్ పేమెంటు చేయాలి. నువ్వు గాని అక్కడుంటే పరిస్థితిని యెలా సంబాళిస్తావు? ” 


నేను ఒక్క నిమిషానికి కూడా తావివ్వకుండా బదులిచ్చాను- “ఆ గడ్డు పరిస్థితిని ఇలా సంబాళిస్తాను సార్. మహానుభావుడు పోతనా మాత్యుడు వెసులు బాటు ఇచ్చే ఉన్నాడు కదండీ- ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబధ్ధం చెప్ప వచ్చని. సప్లయిర్ కి చెక్కు అందించిన వెంటనే నేను మా కంపెనీ బ్యాంకర్ వద్దకు పరుగు తీస్తాను. ఇష్యూ చేసిన చెక్ క్లియరన్సుకి వస్తే ఏదో ఒక విధంగా రెండు రోజుల పాటు అట్టెపెట్టమని- ఆ లోపల కంపెనీ అకౌంటులోకి క్యాష్ డిపోజిట్ చేస్తామని” 


“మీ కంపెనీ వాళ్ల బ్యాంకు అకౌంటెంటు ఒప్పుకోకపోతే.. “


 “వాస్తవమో కథో గాని తెలియదు గాని, అక్కడక్కడ చెప్తుంటారు కదండీ— శ్రీకృష్ణుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని— అదే రీతిన బ్యాంక్ అకౌంటెంటు కాళ్లు పట్టుకుని కంపెనీ గుడ్ విల్ ని కాపాడతానండి. అది కూడా వీలుపడకపోతే— పట్టువ దలని విక్రమార్కుడిలా పలు మార్గాలు అన్వెషిస్తుంటానండి”


అంతావిని తలూపుతూ కాఫీ తాగడం పూర్తే చేసేలోపల మా మా మయ్యా అత్తయ్యా ఇంట్లోకి ప్రవేశించారు.


“టెంపరరీ ఉద్యోగాల పట్టీ తీసుకున్నావురా అబ్బాయీ? ”


నేను లేచి నిల్చుని తలూపాను అత్తయ్య అందించిన అరిసె ముక్క అందుకుంటూ-

అప్పుడు మిత్రుణ్ణి పరిచయం చేసాడు- “ఈయన మరెవ్వరో కాదురా! నా స్కూలు మేట్. నాకు సీనియర్-మనవాడే— మనలా నాన్ విజేటిరియన్నే, కాని ఇప్పుడు కాదు. ఆధ్యాత్మికా ప్రపంచంలో పడి బాగా మారిపోయాడు. ఇంతకీ ఈయన పేరు తెలుసుకున్నావా? వచ్చిన పని తెలుసుకున్నావా? ”


నేను నోరు మెదప కుండా తల ఆడించాను. 


అప్పుడు మామయ్య అందుకున్నాడు- “పేరు మనోహరరావు. మా ఇంటర్ రోజుల్లో మన్మధుడన్న నామాన్ని సార్థకం చేసుకున్న స్ఫురద్రూపి. ఇప్పుడితను నిర్వహిస్తూన్న కార్యం బహు దివ్యమైనది. ఎలాగంటే— ప్రతి ఊరికీ వచ్చి అక్కడున్న ప్రాచీన ఆలయాన్నో బొడ్రాయి తల్లినో సందర్శించి ఆ క్షేత్ర విశేషాలను అధ్యయనం చేసుకుని వివరాలన్నీ పుస్తక రూపంలోకి తీసుకు రాబోతున్నాడు. ఈజిట్ నాట్ ఎ గ్రేట్ ట్రాస్క్? ”


నేనేమీ అనలేదు. వినమ్రంగా తలూపుతూ మిస్టర్ మనోహరరావు వేపు కళ్ళెత్తి చూసాను. నా కళ్లకాయన పెద్దమనిషిలా కనిపించాడే గాని- గొప్ప వ్య క్తిగా కనిపించలేదు. ఈయనిప్పుడు తలపెట్టిన ఘనకార్యాన్ని ఇంతకు ముందు చాలా మందే చేసి ముగించారు. అటువంటి వారిలో సంగీత ముమ్మూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులుగారున్నారు. ఆయన ఆరాధించే దైవం- సుబ్రమణ్యస్వామి. ఆ రోజుల్లో ఆయన దర్శించే ప్రతి ఆలయ పరిసరాలలో కొన్ని రోజులు గడిపి మూల విరాట్టు మహత్యం గురించి ఆమూలాగ్రంగా తెలుసుకుని ఆ దైవం పైన సంస్కృత శ్లోకం వ్రాసి ముగించేవాడు. నేనప్పుడలా ఆలోచనా తరంగాలలో తేలుతూ పోతున్నప్పుడు మామయ్య నన్ను గట్టిగా కుదిపాడు. 


“ఇప్పుడు నీకొక ముఖ్యమైన పని వచ్చి పడిందిరా అబ్బాయీ! నేనూ మీ అత్తయ్యా అర్జంటుగా తెనాలి వెళ్తున్నాం. పరిమళ ఉంటూన్న హాస్టల్ లో యేదో అలజడి రేగిందట. ఆడామగా తేడా లేకుండా అందర్నీ తట్టా బుట్టా సర్దుకుని హాస్టల్ ఖాళీ చేయమన్నారట. పరిమళకు మంచి గది యేర్పాటు చేసి రావాలి. తిరిగి రావడానికి యెన్ని రోజులు పడ్తుందో చెప్పడం కష్టం. కాబట్టి మనోహర రావుని మీ ఇంటికి తీసుకు వెళ్లాలి. కొన్ని రోజుల పాటు ఆయనతోనే ఉండాలి” అంటూ కొన్ని రూపాయి నోట్లను నా జేబులోకి జొప్పించాడు.


నేను మామయ్య మాట తు. చ. తప్పకుండా మనోహరరావుగారి మకాం మాయింటి పూజాగది ప్రక్కకు మార్చాను. ఆయన బావి నీళ్ళే పోసుకుంటారు కాబట్టి దానికి దగ్గర్లోనే ఆయన గది యేర్పాటు చేసాను. శుచీ శుభ్రత కడు జాగ్రత్తగా పాటించాలని ఇంట్లో వాళ్లకు ఖరాకండీగా చెప్పాను. అనారోగ్యంతో మంచాన సేద దిర్చుకుంటూన్న నాన్నకు రావుగారిని పరిచయం చేసాను. 


మరునాడు కాలహరణకు తావివ్వకుండా ఆయన తీర్చిన పథకం ప్రకారం మా ఊరిపొలిమేరన ఉన్న ప్రాచీన నేపథ్యంగల మారమ్మ బొడ్రాయి వద్దకు తీసుకు వెళ్ళాను. చిన్నటి అంశాన్ని కూడా విడిచి పెట్టకుండా ఆయన భక్తి పూర్వకంగా వివరాలన్నిటినీ వ్రాసుకుని అమ్మవారికి కుంకుమార్చన చేసి ఇల్లు చేరేటప్పటికి మధ్యాహ్నం దాటింది. ఆలయ వివరాలు యెంత త్వరగా వ్రాస్తున్నప్పటికీ ఆయన వ్రాస్తూన్న అక్షరాలు ముత్యాల వరసలా ఉన్నాయి. ముచ్చటేసింది. 


భోజనాలు ముగించి అలా ఆరుబయటకు వెళ్ళి స్వఛ్ఛంగా వీస్తూన్న గాలిలో కూర్చున్నామో లేదో గాని- మూడవ వీధి లో ఉంటూన్న మా పెద్దక్కయ్య ఆండాలమ్మ దూసుకు వస్తూ అడిగింది. “ఏంరా తమ్మూ! యెక్కడికి వెళ్ళావు? ” 


“ఏం? నేనెక్కడి వెళ్ళానో అమ్మ చెప్పలేదూ! ముందు వచ్చి కూర్చో ఆపసోపాలు పడిపోకుండా-’ అంటూ నేను కూర్చున్న కుర్చీ ఖాళీ చేసి లేచి నిల్చున్నాను. కూర్చోకుండానే మనోహరరావుకి రెండు చేతులూ యెత్తి నమస్కరించింది. 


అది పెద్దవాళ్ళ ముందు, ముఖ్యంగా అపరిచితుల ముందు కూర్చోదని నాకు తెలుసు. ఇక అమ్మ విషయానికి వస్తే ఆమె మెట్ట వీధిలో సాగుతూన్న గాయత్రీ మంత్ర పఠన మందిరానికి వెళ్లుంటుందని గ్రహించాను. అందుకే అడిగాను- “ఇంతకీ విషయం యేమిటక్కయ్యా? ” అని. 


అక్కయ్య బదులిచ్చింది- “భలే వాడివేరా తమ్మూ! అంతా విని రాముడికి సీతమ్మ యెమవుతుందని అడిగినట్లుంది. నెలసరి ఆదాయపు పత్రం లేకుండా రేషన్ కార్టు ఇవ్వనంటున్నారని చెప్పలేదూ! దీనికి తోడు గోరుచుట్టుపైన రోకలి పోటులా మీ మేనగోడలికి స్కాలర్ షిప్ సాంక్షన్ కావడానికి కులపత్రం కావాలంటున్నారు. నేనూ మీ బావా పడరాని పాట్లు పడ్తున్నామనుకో” కంటనీరు పెట్టుకున్నంత పని చేసింది. 


’ఓట్లు వేస్తున్నప్పుడల్లా రాబోయే సర్కారు మనదనుకుంటాం గాని నిజంగా అది మనదేనా!’ అని మనసున మధనపడుతూ అడిగాను- “బావతో ఓసారి ఆర్ డి వో గారిని కలవమన్నాను. కలిసావా?”

 

“ఆ మహానుభావుడా! ఇక చెప్పనే అవసరం లేదు. ఒకరోజేమో సచివాలయానికి వెళ్తుంటారు. మరొకరోజేమో ఢిల్లీలో సమావేశమని మాయమయిపోతుంటారు. కాని అక్కడున్నవాళ్ళలో ఆయనొక్కరే నికార్సుగా నిర్ణయాలు తీసుకుంటారట. మరి ఆయన ఉంటే కదా! ”


 అప్పుడు మనోహరరావు కలుగ చేసుకున్నాడు. “ఆర్ డి వో అంటే గోవర్థనరావే కదూ! ” అని అడిగాడు. 


అక్కయ్య విస్మయాత్మకంగా చూసింది- “ఔనండీ! ఆయేనే— మరి మీకెలా తెలుసు ఆయన పేరు?” 


“వాడి గురించి నాకు బాగానే తెలుసులే- చీటీ వ్రాసిస్తాను. రేపు దానిని తీసుకెళ్ళి ఇవ్వు. రేపు వాడుంటాడు. ఫోను చేసి చెప్తాను” 


అక్కయ్య తలాడిస్తూ నమస్కరించి వెళ్లిపోయింది. అది నిష్క్రమించిన మరుక్షణం నిలదీసాను. “అదేంవిటి సార్! మీరు వయసు లో పెద్దవారయినంత మాత్రాన ఆర్ డి వో స్థాయి గవర్నమెంట్ ఆఫీసరుని వాడూ వీడూ అంటారా? వినేవారు మనగురించి యే మనుకుంటారు? ” 


ఆయన వెంటనే బదులివ్వకుండా నా వేపు తేరి చూసి అన్నాడు- “ఏమని సంబోధించ మంటావు? ఏమండీ గోవర్థనరావుగారూ మా మొక్కుబడి తీర్చండని పొర్లు దండాలు పెట్టమంటావా! కొడుకుని- తండ్రి- కన్నతండ్రి వారూ వీరూ అని సంబోధించడు, గుర్తుంచుకో”


ఆ మాటతో కళ్లు తేలేయడం నావంతయింది. 

నిజమే! ఆర్ డి వో గోవర్థనరావు మనోహరరావుగారి సుపుత్రుడే! 


ఆర్ డి వో గారు అప్పటికప్పుడు అక్కయ్యకు రెండు పత్రాలూ అందేలా చూడటమే గాక అదే రోజు సాయంత్రం భార్యా బిడ్డలతో మా ఇంటి ముందు వాలాడు. కాళ్ళా వ్రేళ్లా బడి యెంత బ్రతిమాలినా కొడుకింటికి వెళ్ళడానికి తిరస్కరించాడు రావు. మరో మూడు నాలుగు ఆలయాలలో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని అవి పూర్తి చేసుకుని తన గురువుగారి చెంత కు చేరాలని వచ్చిన వాణ్ణి వచ్చినట్టుగా పంపించేసాడు; మనవళ్ళిద్దరినీ నుదుట చేయి పెట్టి ఆశీర్వదించి..


“నిజంగానే మామయ్య అన్నట్టు మనోహరరావు మామూలు వ్యక్తి కాడేమో! సరాసరి వానప్రస్థానంలోకి ప్రవేశించిన వ్యక్తి ఇక అటు రాకుండానే అటు అలా వెళ్లిపోతాడేమో!


మరునాడు మరొక ప్రాచీన దేవాలయానికి వెళ్తూ సౌమ్యంగా సావధానంగా అడిగాను- “మీరెంతటి 

బృహత్తర కార్య నిర్వహణలో నిమగ్నులై ఉన్నా, ప్రక్క ఊళ్లోనే ఉన్న మీ జీవన సహచరి వద్దకు వెళ్లక పోవడం నాకు సంకటంగా తోస్తుందండీ! పెద్దవారు. మిమ్మల్నిలా నిలదేసి అడుగుతున్నందుకు అన్యధా భావంపవలదు—“


ఆయన వెంటనే బదులివ్వ కుండా తేరిపార చూసి అన్నాడు- “నాకు తెలుసు నువ్వు గోవర్థనరావు గారి మాతృమూర్తి అన్నపూర్ణా దేవి గురించి ఆలోచిసున్నావని. నేనెక్కడున్నా యేమి చేస్తున్నా నేనామె ప్రక్కన ఉన్నట్లే! నేనేమి చేస్తున్నానో యెందుకు చేస్తున్నానో ఆమెకు తెలుసు, అంచేత ఒండురులు ఒకరినొకరు చూసుకోనక్కర లేదు” నేను మాట్లాడకుండా అనుసరించాను. 


 ఆరోజు సాయంత్రం బావి నీళ్ళతో స్నానం చేసి వస్తున్నప్పుడు అమ్మ ఎదురొచ్చి అడిగింది- “అదేమిట్ర్ అలాగున్నావు? ఉద్యోగంలో చేరమని కబురు వచ్చిన తరవాత కూడా నువ్వలా ముఖం వేలాడదీసుకుంటే యెలా రా! ”


నేను అమ్మ ముఖంలోకి చూసి నిట్టూర్పు విడిచాను. “ఇదేమి జీవితం? ఇదేమి ఉద్యోగమమ్మా? ఇది నూరు శాతం తాత్కాలికమైన కొలువే.. రెండు నెలల తరవాత గేటు కవతలకి గిరాటు వేస్తారు. రెండు రోజుల్లో పెద్దాయన వెళ్లిపోతారులే- అప్పుడు వెళ్లి చేరుతాను”


అమ్మ తలూపింది. 


ఆరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. పూజా గదిలో అరగంటసేపు కూర్చుని పూజాదికాలు ముగించి మనోహరరా వు నన్ను పిలిచాడు. అప్పటికి నేను దుస్తులు మార్చుకుంటున్నాను ఆయన్ను బైటకి తీసుకెళ్లడానికి. 


“ఈరోజు మనం యెక్క డకీ వెళ్ళడం లేదోయ్. మనం తిన్నగా నగర బిజినెస్ చేంబర్ హాలుకి వెళ్తున్నాం” 


నాకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఈయన గారు ఆలయ దర్శనం చేసుకోకుండా ఉండటమా! ఆలయ దర్శనం చేసుకోకుండా ఊపిరి తీసుకోవడమా! నా పరిస్థితి గమనిం చి ఆయన బ్రాడ్ స్మైల్ చేసారు. “మరేం లేదోయ్. నాకు తెలిసిన ఒకావిడ ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రసంగించబోతున్నారు. వినాలని ఉంది” 


ఇక మాట్లాడటానికేముంది? బిజినెస్ చేంబర్ హాలుకి బయల్దేరాం ఆటోరిక్షాలో. 


మేం వెళ్ళేటప్పటికి బిజినెస్ సెంటర్ హాలు కిటకిట లాడిపోతూంది; పత్రికా విలేఖరులతో- బిజినెస్ మ్యా గ్నెట్లతో. ఎట్టకేలకు మాకిద్దరికీ ఓ మూల కూర్చోవడానికి సీట్లు దొరికాయి.


కూర్చున్న తరవాత మనోహరరావుకి చెప్పాను- “సభ అధ్యక్ష పీఠంపైన కూర్చున్నామెను రెండు మూడు సార్లు చూసున్నానండి. తరచుగా ఆమెతో జరిపిన అంటర్వ్యూలు పత్రికల్లో వస్తుంటాయండి. వేంకట్ బయో కెమికల్ ఫ్యాక్టరీకి ఆమె యేమ్డీ. సిబ్బందిని చాలా బాగా చూసుకుంటారన్న పేరుందామెకు. అందరికీ ఫ్యాట్ సాలరీ లు. ఆమెగారిలో ఒక స్త్రీశక్తిని చూడవచ్చండి, జాబ్ కోసం రెండు మూడు సార్లు అప్లయ్ చేసాను గాని, పిలవ లేదు” 


“ఆమె గురించి నాకు చెప్తున్నావా! యవ్వన ప్రాయంలో కాలేజీ బ్యూటీ- ఆ తరవాత సిటీ మిస్ బ్యూటీ. ఇప్పుడు నేనొక పని చెప్తాను. చేస్తావా? ”


నేను చేస్తానన్నట్టు తలూపాను. 


“ఈచీటీని తీసుకు వెళ్లి ఆమెగారికి అందజేయమని సభ నిర్వాహకులకు ఇచ్చి రా! “


నేను తెల్లబోయి చూసాను. “ఇక్కడ కూర్చుని ఆమెగారికి చీటీ పంపిస్తారా! అమెవరో తెలుసాండీ? నగర వ్యాపార ప్రముఖురాలు. ఆమెగారి ఆధ్వర్యంలో పదికాలేజీలు- ఐదు అనాధాశ్రమాలు నడుస్తున్నాయని చెప్పుకుంటారు. షీ ఈజ్ వర్త్ ఆఫే బిలియన్స్” 


నా మాటకు ఆయన అడ్డువచ్చారు. “అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ చీటీ తీసుకెళ్లి ఇవ్వు”


ఇక చేసేదేముంది? మామయ్య ముందే చెప్పాడుగా ఆయన చెప్పిందల్లా చేసి పెట్టమని- నేను లేచి ఆయన చెప్పినట్టే చీటీని సభ నిర్వాహకులకు అందిచ్చి వచ్చాను. 


ఆశ్చర్యం! పెను ఆశ్చర్యం! కొన్ని నిమిషాల తేడాలో ఇద్దరు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు మా ముందుకు వచ్చి నిల్చున్నారు. వాళ్ల వెనుక మేడమ్ మాధురిగారు నిల్చున్నారు. నేను అదిరిపోయి లేచి నిల్చున్నాను. మనోహరరావుని తదేకంగా చూస్తూ అందామె- “మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కలలో కూడా అనుకోలేదు మనోహరా!” 


“ఔను. నేనూ అనుకోలేదోయ్. ఎలాగున్నావు? మీవారెలా ఉన్నారు? ” 


“అంతా చెప్తాను. మనం అలా గ్రీన్ రూములోకి వెళ్లి మాట్లాడుకుందామా! ” అని ఆమె రెండు చేతులూ చాచింది. 


కాని ఆయన అందుకోలేదు. లేచి ఆమె వెంట నడుస్తూ వెనక్కి తిరిగి చూసి నాకు సైగ చేసాడు వెన్నంటి రమ్మనమని. నేను చివ్వున కదిలాను. గ్రీన్ రూములోకి ప్రవేశించినంతనే మనోహరరావు మాధురీదేవిగారికి నన్ను పరిచయం చేసారు. “ఈ అబ్బాయి పేరు సంగీతరావు, నా మిత్రుడు మోహనరావుకి స్యయాన మేనల్లుడు, కత్తిలా పదునుగా ఉంటాడు. 

చురుగ్గా కదుల్తూ కొన్ని రోజులుగా నా వెంటే ఉంటున్నాడు. ముఖ్యంగా నమ్మకస్థుడు. మీ కంపెనీలో చేర్చుకో! ”


మాధురీదేవి అలాగే అంటూ నా వేపు తిరిగింది. “ఇంతకు ముందు యెక్కడ పని చేసారు? ఏ ఫీల్డులో పని చేసారు? ”అని అడిగారామె. 


అప్పుడు మనోహరరావు కలుగ చేసుకుని ఆమె సాగించబోయిన ప్రశ్నా పరంపరకు అడ్డు పుల్ల వేసాడు. “ఒకసారి ఆగు మాధురీ! ఇక్కడకు తీసుకురాకముందే ఇతణ్ణి ఇంటర్వ్యూ చేసాను. ఏ ఫీల్డులోనైనా చొచ్చుకు పోగల సమర్థుడు. ఇది నామాట”


ఆ మాట విని నవ్వుతూ నా వేపు మరొకసారి తిరిగింది. “మనోహరరావుగారు చెప్తే ఇక తిరుగేముంటుంది? కంపెనీ సేల్స్ ఆఫీసర్ గా జాబ్ చేస్తారా! ” 


ఆమెగారు చేసిన ఆఫర్ కి తత్తర పడ్డాను. “ఇంత పెద్ద పోస్ట్ బాధ్యతల్ని నేను—“ 


“పర్వాలేదు. మీరు కంగారు పడనవసరం లేదు. నేను గైడ్ చేస్తాను, మొదట ఆరు నెలల పాటు మా బెంగుళూరు ట్రైనింగ్ ఇన్స్టి ట్యూట్లో ప్రాక్టికల్ ట్రైనింగు తీసుకోండి. ఈ ఆరునెలలూ కంపెనీ గెస్ట్ హోస్ లోనే ఉండండి. ట్రైనింగ్ పీరియడ్ లోనూ మీకు జీత భత్యాలు అందుతాయి. ఓ కే! ”


నాకు మాటలు కరువయాయి. ఉప్పొంగిన ఆవేశాన్ని అణచుకోలేక ఆమె కుడిచేతిని అందుకుని కళ్ళకు హత్తుకున్నాను. “ఇటీజ్ ఓ కే” అంటూ వెనక్కి తిరిగి తనకు దూరంగా ఒదిగి నిల్చున్న సీనియర్ ని పిలిచి ఆజ్ఞలు జారీ చేసింది. “ఇతను రేపు ఆఫీసుకి వస్తాడు. తిన్నగా నా వద్దకు పంపించండి. ఇప్పుడు నిర్మల్ ని పంపించండి”అని చెప్పింది. 


ఆ మాట విని అతనెవరని అడిగాడు మనోహరరావు. 


“చూడబోతున్నారుగా!” అని నవ్వింది. 


మరి కాసేపటికి ఫుల్ సూటులో ఉన్న నిర్మల్ వచ్చాడు. “ఇక్కడ డిప్యుటీ జనరల్ మేనేజర్ గా ఉంటున్నాడు” అని కొడుకు వేపు తిరిగి మనోహరరావుని తన కాలేజీ మేట్ గా పరిచయం చేసింది. 


అతను ఇప్పటి ఆనవాయితీ ప్రకారం- “హాయ్! ” అం టూ చేతులు కలపడానికి ముందుకు వంగాడు. 


అప్పుడు మాధురీదేవి కొడుకుని ఆపింది. “ఇక్కడ హాయ్ పనికి రాదు. వంగి కాళ్లకు నమస్కరించు” అని ఆదేశించింది. 


ఆమాటతో నిర్మల్ వంగి మనోహరరావు కాళ్లకు నమస్కరించి దీవెనలు అందుకున్నాడు. దీవించిన తరవాత ఆయన కళ్ళు తిప్పుకోకుండా నిర్మల్ నే చూస్తూండిపోయాడు. 


ఆ తరవాత ప్యాంట్రీనుండి వచ్చిన పానీయాలు తీసుకుని అందరమూ గ్రీన్ రూమునుండి బెటకు వచ్చాం. నేను కాస్తంత యెడంగా జరుగుతూ వెనక్కి తిరిగి చూసాను, మాధురిదేవి కంటనీరు నింపుకుంటూ ఉన్నపళంగా మనోహరరావు రెండు చేతుల్నీ అందుకుని- “థేంక్స్ చాలా థేంక్స్”


చేతుల్ని విడిపించుకుంటూ కనుబొమల్ని యెగరేసి చూసాడు-ఎందుకున్నట్టు. 


“నిర్మల్ని మనసార ఆశీర్వదించినందుకు. ఇక మా వారి విషయమంటారా- ఆయన బిజినెస్ టూర్ పైన లాటిన్ అమెరికా వెళ్ళా రు” 


మనో హరరావు బదులివ్వలేదు, నా భుజం తడ్తూ లిఫ్ట్ వేపు కదిలాడు. ఆయనతో బాటు లిఫ్ట్ లోకి ప్రవేశిస్తూ అడిగాను- “ఇక తమ తదుపరి కార్యక్రమం గురించి చెప్తారా? ” 


“ఇంకేమీ లేదు, నేను వ్రాసుకున్న నోట్లన్నీ మోహనరావుకిచ్చి ప్రింటింగ్ చేయించమను. అమూల్యంగా యెంచి ముద్రించమను. తగురీతిన పంపిణీ చేయమను. ప్రింటింగ్ ఖర్చులకు చెక్కు వ్రాసిస్తాను. అతడికి అందివ్వు. ప్రింటింగ్ సమయంలో మీ మామయ్య కు వత్తాసుగా ఉండు” 


నేను రవంత సేపు ఆగి అన్నాను- “ఈలోపల బెంగళూరు వెళ్ళమని మేడమ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే.. ”


“వెంటనే బెంగులూరు వెళ్లిపో! మిగతావన్నీ వాటికవి జరిగిపోతాయిలే—“


అలా మాట్లాడుకుంటూ రోడ్డు పైకి వచ్చేసరికి మాధురీ దేవి పంపిన కారు వచ్చి ఆగింది, తనకది అవసరం లేదుంటూ వెనక్కి పంపించేసి నడవసాగాడు మనోహరరావు. 


సమయం దొరి కిందనుకున్నాను. అంత వరకూ ఉగ్గబట్టి ఉంచుకున్న ప్రశ్నను సంధించాను. “వ్యక్తిగతమైన ప్రశ్న వేయాలనుకుంటున్నాను. పెద్దవారు క్షమిస్తారు కదూ! ” 


తలూపాడతను. 


“మీరూ మేడమ్ గారూ కాలేజీ మేట్స్ అన్నారు. ఒప్పుకుంటున్నాను. మరైతే మీకూ ఆమెకూ మధ్య మెరెటువంటి దగ్గరతనమూ లేదంటారా!” 


అతడు నడుస్తూనే నావేపు తిరిగి అన్నాడు- “ముందే చెప్పాగా మేమిద్ద రమూ పాతకాలపు క్లాస్ మేట్లమని—”


నేను వెంటనే రియాక్ట్ అయాను- “లేదు. ఇంకేదో ఉంది. అంతటి పెద్ద స్థాయిలో ఉన్న మాధురీదేవిగారు కంటనీరు నింపుకుని మీ రెండు చేతుల్నీ అంది పుచ్చుకున్నారంటే మీ మధ్య చాలానే ఉందని తెలుస్తూంది” 


“ఇంకేముందని అనుకుంటున్నావు?” 


కాసింత విలంబిత కాలం తరవాత అన్నాను “మీకూ మాధురీదేవి గారి మధ్యే కాదు- మీకూ నిర్మల్ మధ్య కూడా విడదీయలేని దగ్గరితనం ఉందని పిస్తూంది. అతడి ముఖమూ మీ ముఖమూ ఒకేలా ఉంది” 


“అప్పుడప్పుడు ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండటం కద్దని నీవు వినలేదా! ” 


“కాదు ససేమిరా కాదు. నిర్మల్ వి పిల్లి కళ్లు. మీవీ పిళ్లి కళ్లు. ఇప్పుడు చెప్పండి చేతిలో చేయి పెట్టి— మీమధ్య యేమీ లేదని—” 


ఈసారి బుల్టెట్ లా వచ్చిన నా మాటకు ఆయన మిన్నకుండిపోయారు. కాసేపు రోడ్డు ఓరన నడుస్తూనే బదులిచ్చారు- “ఔను. అన్నీ కలిసొచ్చుంటే ఆమె నాకు సతీమణి అవాల్సింది. నిర్మల్ మాఇంట్లో ఉండాల్సింది. కాని అలా అవలేదు” 


“క్షమించాలి ఇలా అడుగుతున్నందుకు. ఆమె గర్భం దాల్చిందని తెలిసి కూడా ఆమెను వివాహం చేసుకోకుండా వెళ్లిపోయారా! ” 


“లేదు. మరీ ఎమోషనల్ అయిపోకుండా నిదానంగా విను, మేమలా భార్యా భర్తలు కాకపోవడానికి ఆమే కారకులు. మితిమీరిన చతురత చూపించింది. ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడే ఆమె అమెరికాలో ఉంటూన్న వాళ్ళ అమ్మానాన్నల వద్దకు వెళ్లిపో యింది” 


“సారీ సార్. నేను నమ్మలేను. ప్రెగ్నంట్ గా ఉన్న ఒక స్త్రీ కాబోయే వాణ్ణి విడిచి తీరాలు దాటి వెళ్లిపోదు”


అప్పుడాయన నావేపు కళ్లు పెద్దవి చేసి చూసాడు-“నువ్వు నోరు మెదపకుండా వింటావా! లేక సంభాషణను తెంచేయ మంటావా!”


 నేను వెంటనే తేరు కుని “సారీ సార్!” అన్నాను. 


మరి కొంత దూరం నడచి ఓసారి దీర్ఘంగా ఊపిరి పీల్చి చెప్పసాగాడు- “నేను ప్రెగ్నంట్ గా ఉన్నాను. నువ్వు అమెరికా వచ్చి స్థిరపడిపోవడానికి ఒప్పుకుంటేనే గాని మన పెళ్లికి అంగీకరించనన్నారు మా అమ్మా నాన్నానూ—అంది. నేను మరుచూపుకి తావివ్వకుండా ఆమె కోరికను తిరస్కరించాను”


అది విని నేను ఖంగుతిన్నాను. నెత్తిపైన చేతినుంచుకున్నాను. “భలే వారండీ! అది లైప్ గోల్డెన్ అవకాశమండీ! మీరు గాని అక్కడికెళ్లి స్థిరపడితే మీకు గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఆ తరవాత మెల్లమెల్లగా మీ ఇంటిల్లి పాదీనీ తీసుకు పోవచ్చు. మైగాడ్! ఎంతటి బంగారు బాతుని విడిచి పెట్టుకున్నారండీ—“ తెగ నొచ్చుకుంటూ అన్నాను. 


“మొత్తానికి నీ కుర్రబుధ్ది పోనిచ్చుకున్నావు కాదు“


 “ఔను. ఒప్పుకుంటాను. నాది కుర్రబుధ్దే. ఇంతకీ ఇక్కడేం చూసి అక్కడకి వెళ్లనన్నారు? ” 


“ఒకటా రెండా! బోలెడు చూసి ఇక్కడుండి పోయాను. ఇక్కడ విస్తరించి ఉన్నకొండలిష్టం. ఆ కొండల్ని తాకుతూ వచ్చే కొండగాలం టే నాకిష్టం. పుష్కరాల పుణ్య స్నానాలంటే ఇష్టం. ముఖ్యంగా చేతులు చాచి ఆహ్వానించే మనూరి దేవాలయాలంటే ఇష్టం. అంత కంటే ముఖ్యంగా మన మట్టి వాసనంటే ఇంకా ఇంకా ఇష్టం” అంటూ అటు పోతూన్న ఆటోరిక్షాను పిలిచాడు-


అప్పుడాయనకు అడ్డు వచ్చి- “ఒక్క నిమిషం ప్లీజ్” అంటూ వంగి ఆయన రెండు పాదాలనూ తాకి నెత్తికి పూసుకున్నాను. 


మరొక మూడు రోజులు మాతో ఉండి ఆయన హిమపర్వతాల మారు మూల ఉన్న పుష్పకాశ్రమానికి వెళ్లిపోయాడు. 


నాకిప్పుడు పెళ్లయి ఇద్దురు బిడ్డలకు తండ్రినయాను. ఉద్యోగంలో మేనేజర్ స్థాయికి యెదిగాను. మరొకసారి-ఒకే ఒక సారి మనోహరరావు గారిని చూడాలని యెదురు చూస్తున్నాను. నా భార్యాబిడ్డలకు కూడా ఆయనను చూపించాలని కళ్లు కాయ లు కాచేలా ఎదురు చూస్తున్నాను.


మరి- ఆయన ఆ మంచు పర్వతాలు విడిచి మళ్లీ ఇటు వేపు యెప్పుడొస్తారో! అసలు ఇటు వేపు వస్తారో రారో!


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments


bottom of page