పేగు బంధం
- Sammetla Venkata Ramana Murthy

- Jul 23
- 3 min read
#SusmithaRamanaMurthy, #సుస్మితారమణమూర్తి, #PeguBandham, #పేగుబంధం, #TeluguKathalu, #తెలుగుకథలు

Pegu Bandham - New Telugu Story Written By Susmitha Ramana Murthy
Published In manatelugukathalu.com On 23/07/2025
పేగు బంధం - తెలుగు కథ
రచన : సుస్మితా రమణ మూర్తి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“మమ్మీ! కాకా ఫినిష్ “ వాష్ రూములోంచి ఆరేళ్ళ పిల్ల కేక, తల్లికి వినిపించలేదు. ఆమె ఆన్ లైన్లో ఆఫీసు పనిలో వుంది. మరో పిలుపుకి కూడా ఆమెలో చలనం లేదు.
“అమ్మమ్మా! కాకా ఫినిష్!” వంటగదిలో వున్న ఆమెకూ వినిపించలేదు.
“తాతా!..” మనవరాలు కేక, వాష్ రూం తలుపు చప్పుడు విన్న తాతగారు వెళ్ళారు.
“ఫినిష్” రెండు వేళ్ళు చూపించింది పిల్ల.
తాతగారు నవ్వుతూ ఆ కార్యక్రమంతో బాటు బ్రషింగు, స్నానం కూడా చేయించి స్కూలు డ్రెస్సు వేసారు.
“ఏఁవండీ! స్కూలుకి టైము అవుతోంది. దానికి టిఫిన్ తినిపించి, పాలు పట్టండి. ఈలోగా స్కూలు బేగు సర్దేస్తాను “
తాతగారు ఆ పనులు పూర్తిచేసారు. అమ్మమ్మ కూతురు వేపు వాచీవేపు తదేకంగా చూసింది. అల్లుడు గదిలో లేప్టాప్లో బిజీగా వున్నాడు.
“వాళ్ళిద్దరూ ఆఫీసు పనిలో వున్నారండీ! మీరే దీన్ని స్కూలు బస్సు ఎక్కించి రండి”
తాతగారు పిల్లను తీసుకు వెళ్ళారు. అమ్మమ్మ సోఫాలో అలసటగా కూర్చుంది.
“మమ్మీ! అరగంట తర్వాత ముఖ్యమైన మీటింగు వుంది. ఈలోగా టిఫిన్ చేసేస్తాను”
టిఫిన్ పెట్టింది ఆమె. “మమ్మీ! వాషింగు మెషీన్లో ఉతికిన బట్టలున్నాయి”
ఆ బట్టలు ఆరబెట్టింది ఆమె. టిఫిన్ అయింతర్వాత కూతురు ఆఫీసు పని చూసుకోసాగింది.
*****
“వచ్చేనెల మమ్మీ, డాడీ అక్క దగ్గరకు వెళ్తారండీ! వారుండబట్టే మనం ఆఫీసు పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాం. పనిమనిషి సెలవు పెట్టినా అన్ని పనులు మమ్మీయే చేస్తోంది. వంటమనిషి రానప్పుడు వంట కూడా చేస్తోంది. మమ్మీ లేకపోతే అన్ని పనులు నేనే చేసుకోవాలి”
“ఇబ్బంది నీకే కాదు. నాకు కూడా. పిల్లను బస్సు ఎక్కించాలి, హోమ్ వర్కు నేనే చేయిచాలి.”
ఆందోళనతో కూడిన ఆ మాటలు సాప్ట్ వేరు దంపతులవి.
*****
“కాళ్ళు నొప్పులుగా వున్నాయండీ!”
“అలా పడుకో స్ప్రే కొడతాను”
వృద్ధ దంపతుల అనురాగం అది.
“పనిమనిషి, వంటమనిషి మూడు రోజులనుంచి రాకపోవడం వల్లే నీకీ ఇబ్బంది. అన్ని పనులు నిలబడి చేస్తుండటం వల్లే ఈ నొప్పులు”
“నెల నెలా పనివాళ్ళతో ఇలానే ఇబ్బంది అవుతోంది. మనం లేకపోతే, పిల్లను చూసుకుంటూ అది ఉద్యోగం చేయడం కష్టమే కదండీ?”
“మనమైనా ఎంతకాలం చేయగలం?.. కేవలం మాట సాయం మాత్రమే చేయగల దశలోకి వచ్చేసాం. మన ఆరోగ్యాలు బాగున్నాయి కాబట్టి ఇంకా పనులు చేయగలుగుతున్నాం”
“వచ్చేనెలలోనే పెద్దదాని దగ్గరకు వెళ్ళాలి కదండీ?”
“రెండు సార్లు వెళ్ళినా, నీకింకా అమెరికా మోజు తీరలేదా”
“మనకు ఇద్దరూ సమానమే కదండీ?”
“నీమాట నిజమే! ఓపిగ్గా చేయగల సాయం చేస్తున్నాం. మన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. ఎన్నాళ్ళని ఆర్నెల్లకోసారిలా?”
“మనం బాగున్నాం. మన పనులు చేసుకోగలుగుతున్నాం కదండీ?”
“ఎప్పుడూ ఇలాగే మన ఆరోగ్యం వుండదు”
“అర్ధం కాలేదండీ!”
“ స్వంత ఇల్లు ఆలోచన లేకుండా, పిల్లల బాగుకోసం శ్రమించాం. సతమతమయాం. చదివించాం. మంచి సంబంధాలు చేసాం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. అల్లుళ్ళు మంచి హోదాలో వున్నారు. దర్జాగా బతుకుతున్నారు”
“ఈరోజు మీ మాటలు వింతగా వున్నాయండీ!?”
“ఇప్పుడు మన గురించి మనమే ఆలోచించుకోవాలి. పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి కాదు”
“ మీ మనసులో మాట సూటిగా చెప్పండి”
“మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోము. అనారోగ్యం పాలైతే వీరికి ఎంత ఇబ్బందో మనం ఆలోచించాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన దారి మనం చూసుకోవాలి. మనం ఇక్కడ ఉన్నంత కాలం నీ పరిస్థితి ఇలానే వుంటుంది”
“విషయం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారు!”
“మన బాధ్యతలు పూర్తి అయాయి. ఇప్పుడు మన పిల్లలు, వారి పిల్లల బాధ్యతలు సక్రమంగా నిర్వహించే దిశలో వున్నారు. మనల్ని చూసే బాధ్యత పిల్లలదే-- అన్న మన ఆలోచన తప్పు”
“మీ ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదండీ!”
“మనం తప్పనిసరిగా బంధాలకు నెమ్మదిగా దూరమవడం మంచిది”
“ఈ మట్టి బుర్రకు ఇంకా అర్థం కాలేదండీ! దూరం కావడం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదామనా!”
“అవును! ఈ ఊర్లోనే వుందాం. లేదా మరెక్కడికైనా. అప్పుడప్పుడు చూడ్డానికి వద్దాం. మొదట కాస్త ఇబ్బందిగా వుండటం సహజం. నెమ్మదిగా అలవాటు పడతాం. నీకు శ్రమ తప్పుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది”
భర్త మాటలు కాదనలేక పోయింది ఆమె.. “అక్కడకు వెళ్ళింతర్వాత ముందుగా మనం తిరుపతికి, షిర్డీకి ఆతర్వాత కాశీకి వెళ్దామండీ!”
“అలాగే వెళ్దాం. మనం తిరుపతికి, షిర్ధీకి చాలాసార్లు వెళ్ళాం. కాశీ యాత్రకంటే ముందు, మనం ఇక్కడ చూడని దేవాలయాలు చాలా వున్నాయి. వాటిని చూద్దాం. ఇక్కడ తిరుపతి దేవస్థానం వారు వేంకటేశ్వరుని ఆలయం కట్టించారు. ఇక్కడ పెద్ద శివాలయం కూడా వుంది. బాబాగారి మందిరాలు చాలా వున్నాయి. ప్రశాంతంగా వాటన్నిటినీ చూద్దాం”
“అలాగేనండీ! ఇక్కడ వున్న అన్ని దేవాలయాలకు వెళ్దాం. ప్రసాదాలు తీసుకెళ్ళి చిన్నదానికి ఇద్దాం”
“ అలాగే!”
*****
“ప్రసాదాలు ఇవ్వడం, చిన్నదాన్ని, మనవరాలిని, అల్లుణ్ణి చూడ్డం అయింది. ఇక వెళ్దామా?”
“నాలుగు రోజులు వుండి వెళ్ళండి”
“నీవు రావా!?..”
“చిన్నదాన్ని, చంటిదాన్ని వదిలి, ఆ ఆశ్రమంలో వుండలేక పోతున్నానండీ!”
“అంటే నాకు చిన్నదానిపై ప్రేమ లేదనా!?”
“మీది తండ్రి ప్రేమ! నాది పేగు బంధమండీ!”
/ సమాప్తం /
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.




Comments