'Pelli Roju Kanuka' New Telugu Story
Written By Kowluri Prasada Rao
రచన : కౌలూరి ప్రసాదరావు
మామూలుగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా,అదిమి పెట్టలేని ముభావం సరోజ మొహం మీద నీటిబుగ్గలా ఎగసి పడుతూనే ఉంది.పెదవులు ఉచ్ఛరిస్తున్న ప్రశ్నలేవో నా చెవులవరకూ దూసుకొచ్చి మొహమాటపడి వెనుదిరిగి పోతున్నాయి.ఎప్పుడూ తూరుపురేఖల్లా విచ్చుకునే కనులు మసిబారిన దీపాలయ్యాయి.
చేతులు యాంత్రికంగా పనిచేస్తూ నిర్లిప్తతను ప్రకటిస్తున్నాయి.
మనసు కొద్దిగా చలించింది. 'ఏడిపించింది చాలు,ఇక చెప్పేద్దామా ?'అని క్షణంపాటు మనసు బలహీనపడింది.కానీ 'ధ్రిల్ ' పోతుందని సంభాళించుకున్నాను. ఎలాగూ కాసేపట్లో తెలుస్తుంది కదాని
సమాధానపడ్డాను.ఇవాళ మా పెళ్ళి రోజు.మా జీవితాల్లో ఏకైక పండుగ ఇదొక్కటే.పుట్టినరోజులు జరుపుకోం. ఎందుకంటే మేము ఎప్పుడు పుట్టామో సరిగ్గా తెలీదు.నేనూ
,నాభార్య ఇద్దరం అనాధలమే. అనాధ ఆశ్రమంలో నమోదు చేయబడిన బర్త్ డేటు మీద మాకు ఆసక్తిలేదు.అందుకే వివాహ దినోత్సవాన్ని ఘనంగా జరుపు
కుంటాం.
ఇక మాఆవిడ అలకకి చాలా కారణాలున్నాయి.వాటిలో మొదటిది ఇంట్లో ఫంక్షన్ చేయకపోవటం.ప్రతి సంవత్సరం బంధుమిత్రులను ఆహ్వానించి,వైభవంగా సంబరం చేస్తాము.ఈసారి ఎవరినీ పిలవలేదు
ఊరిబయట పిక్నిక్ లా సింపుల్ గా ప్లాన్ చేసాను.రెండవది బట్టల కొనుగోలు మాతో పాటు పనిమనిషి రంగమ్మ,ఆమె భర్తకి కూడా తీసాను.
కానీ అదనంగా తెచ్చిన రెండు జతల దుస్తులు ఎవరికో అర్ధంకాక సతమతమై పోతోంది.మూడోది అసలైన కారణం బహుమతులు.
ప్రతీ ఏడాదీ పెళ్ళికానుకలు ఇచ్చిపుచ్చుకుంటాం.పాపకి బాబుకి చెరో గొలుసూ తీసుకున్నాం.సరోజ నాకోసం డైమండ్ రింగ్ కొన్నది.నేను మాత్రం తనకోసం మునపట్లా ఏ గిఫ్టూ ఖరీదు చేయలేదు.అందుకే నిన్న షాపింగ్ ముగిసిన దగ్గర్నుంచీ, నా పట్ల నిరసన పెల్లుబుకుతున్నా బలవంతంగా ఆనకట్ట వేస్తుందని తెలుస్తూనే ఉంది.ఎవరూ లేని మేము ఒకరికొకరం ఆదరణ.మాకు మేమే ఆలంబన.బంధుమిత్రుల కొరత కొంత భర్తీ అయినా
,తల్లిదండ్రులు,అత్తమామలు లేని లోటు అడుగడుగునా మమ్మల్ని వేధిస్తూనే ఉంది.ఉద్యోగాలు సాధించినా ఆస్తులు సంపాదించినా అయినవారు లేరన్న వేదన వెంటాడుతుంటుంది.ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుని సాంత్వన పొందుతాం.
ఒక వస్తువు విలువ అది దగ్గర ఉన్నపుడు కాక దూరమైనపుడే తెలుస్తుంది.అమ్మానాన్నల విలువ అనాధలమైన మాకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది?.నా భార్య బైటికి ఏడిస్తే,నేను మనసులోనే రోదిస్తాను.
పిల్లలు పుట్టాక కాస్త ఉపశమనం కలిగినా ఆవేదన ఇంకా రగులుతూనే ఉంది.సరోజ వైపు గుంభనంగా చూసి 'కాసేపు ఓపిక పట్టు డియర్ ' అని మనసులోనే నవ్వుకున్నాను. కానీ నా నిర్ణయాన్ని 'స్వాగతిస్తుందా , వ్యతిరేకిస్తుందా?'అనే అనే సందిగ్ధం నన్ను పీడిస్తూనే ఉంది.చెప్పిన పని తలూపుతూ చేస్తుందే తప్ప మౌనం వీడి మాట్లాడటం లేదు.రంగమ్మ విడ్డూరంగా చూస్తుంటే"మీ అమ్మగారు నవ్వితే నవరత్నాలు రాలతాయి.వాటిని ఏరుకుని మీరెక్కడ ఉంగరాల్లో పొదిగించు కుంటారో నని మాట్లాడటం లేదు" అంటూ మేలమాడాను.అయినా సరోజ పెదవి విప్పలేదు.జరిగిన వ్యవహారం తెలుసు గనుక రంగమ్మ కూడా మారు మాట్లాడలేదు
ఒకట్రక్కు ఆటోమీద సామాన్లు ఎక్కించాం.వండిన పాత్రలు,నీటి డ్రమ్ము,కింద పరచటానికి చాపలు వగైరాలు సర్దాం.కారులో నేనూ సరోజా,పిల్లలూ,ఆటోలో రంగమ్మ , ఆమె భర్తా బయలుదేరాం.సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఒక పాడుబడిన బస్ షెల్టర్ ఉంది.తిన్నగా దాని దగ్గరకు దారి తీసాను.అరగంటలో అక్కడికి చేరుకుని,'అత్తమ్మా,మావయ్యా!'అని పిలిచాను.నా పిలుపు విని శిధిల కట్టడంలో పడుకున్న వృద్ధ దంపతులు లేచి'నువ్వా బాబూ' అన్నారు సంభ్రమంగా.వారివైపు మొహం చిట్లించి చూస్తున్న సరోజతో 'కంగారు పడకు,మెల్లగా అంతా అర్ధమవుతుంది"అంటూ రంగమ్మ,
ఆమె భర్తకి పురమాయించాను వృద్ధులకి స్నానంచేయించమని.
వాళ్ళు అయోమయంగా చూస్తూ ముసలివాళ్ళకి తలంటుపోసారు. ఈలోపు ఆటో డ్రైవరు సాయంతో పలావు,చికెన్ వండిన పాత్రలు, పాయసం గిన్నె దించాను.చాపలు పరచి అన్నీ సిద్ధం చేసాను.పనిపూర్తి చేసిన రంగమ్మ దంపతులకి బట్టలు చేతికిచ్చాను.వాళ్ళు సంతోష పడుతుంటే,మాఆవిడ అనుమానంగా చూసిన వస్త్రాలు తీసి ముసలివాళ్ళకిచ్చి ధరించ మన్నాను.వాళ్ళు విస్తుబోతూ షెల్టర్ లోకి వెళ్ళారు.సరోజ విస్మయంగా చూసింది. ఏదో అవగతమౌతున్నట్టు తలపంకించింది.కొద్దిక్షణాల తర్వాత ముసలి వాళ్ళు బట్టలు కట్టుకుని బయటికి వచ్చారు.తెల్లని పట్టుబట్టల్లో పెద్దవాళ్ళుఆది దంపతుల్లా వెలిగిపోతున్నారు. కిలుం వదిలిపోయిన కంచుపాత్రల్లా ధగధగమెరిసిపోతుండటం చూసి సంతృప్తిగా నిట్టూర్చాను.ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళనుకుంటా, పూర్వవైభవం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.కళ్ళలో కృతజ్ఞత వెల్లువలా కురుస్తోంది.
వారిని మొదటిసారి కలసిన సంఘటన కళ్ళముందు కదలాడింది.
ఆరోజు చిన్నపనిమీద వెళ్ళి తిరిగి వస్తుండగా హఠాత్తుగా వర్షం వచ్చింది.దగ్గరే కదాని బైక్ వేసుకొచ్చా.కుంభవృష్టికి తడిచి పోతూ కాసేపు తలదాచుకోవటానికి నీడ దొరుకుతుందేమోనని చూస్తుంటే ఈ పాడుబడిన కట్టడం కనబడింది. బండి ఆపి లోనికి చొరబడి కర్చీఫ్ తో తల తుడుచు కుంటుంటే విన్పించిందా మూలుగు.ముసలి బిచ్చగాడు జ్వరంతో బాధ
పడుతుంటే ,భార్య జావ తాగిస్తూ సపర్యలు చేస్తోంది.వారిని చూడగానే ఎందుకో మనసు చివుక్కుమంది.దుమ్మూ ధూళితో నిండి భూత్ బంగ్లాలాంటి షెల్టరు.
జవసత్వాలు ఉడిగిపోయి చావుకోసం ఎదురుచూస్తున్న ముసలివాడు.
చిరిగిన బట్టల్లో శోక దేవతలా ముసలామె.
గోడ కంతల్లోంచి వారిమీదకి ఉరుకుతూ తడిపేస్తున్న జాలిలేని వాన.
చినుకులు ఆగిన వెంటనే సిటీలోకి వచ్చి, ఓ ఆర్.ఎం.పీ.డాక్టరును పట్టు కున్నాను.కావలసిన మందులు, ఆహారపు పొట్లాలు తీసుకుని ఆఘమేఘాల మీద వెనక్కి వచ్చాను.వైద్యం చేయించి,కొద్దిగా డబ్బులిచ్చాను.అప్పట్నుంచీ వారి యోగక్షేమాలు చూడటం బాధ్యతగా మారింది.నేనే వరసలు కలిపాను.
వాళ్ళు కూడా 'అల్లుడూ' అని ఆప్యాయంగా పిలుస్తారు
వృద్ధుల చేతుల్లో అక్షింతలు పోసి"ఈనాడు మాపెళ్ళిరోజు,మమ్మల్నిఆశీర్వదించండి"అన్నాను .నివ్వెరపోతున్న సరోజ భుజం తట్టి,"ఇకనుంచి వీరే నీ తల్లిదండ్రులు,
ఇదే నేను నీకిచ్చే 'మ్యారేజ్ డే గిఫ్ట్ ' అంటూ పిల్లలకేసి తిరిగి
" మీ అమ్మమ్మా,తాతయ్యలను,ఇంటికి తీసుకెళ్దామా?"అడిగాను.నిన్నటి నుండి పొడిబారిన నా భార్యకళ్ళు ఆర్ద్రతతో చెమ్మగిల్లి,ఆ తడి పిల్లల నేత్రాల్లో తుఫానుగా మారి,ముసలి వాళ్ళ చూపుల్లో తీరందాటింది.ఏం చేస్తుందో తెలీని భావావేశంలో సరోజ అమాంతం నన్ను కౌగలించుకుంది. అది చూసిన రంగమ్మ దంపతులు, ఆటోవాడు సిగ్గుతో తల పక్కకు వాల్చితే,ఆ దృశ్యం చూడకుండా పిల్లల్ని పొదవి పట్టుకున్నారు పెద్దవాళ్ళు.నా నిర్ణయాన్ని అభినందిస్తూ ఎండుటాకులు చప్పుట్లు కొడితే,చెట్లు పువ్వులు రాల్చి, తలలూపుతూ స్వాగతించాయి.
******************శుభం *****************
Comments