పెంచిన ప్రేమ
- Srinivasarao Jeedigunta
- 3 days ago
- 6 min read
#JeediguntaSrinivasaRao, #PenchinaPrema, #పెంచినప్రేమ, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguStory, #తెలుగుకథ

Penchina Prema - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 05/07/2025
పెంచిన ప్రేమ - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సూపర్ బజార్ కి వెళ్లి ఇంటికి కావలిసిన సరుకులు కొనుక్కుని మెల్లగా నడుచుకుంటూ వస్తున్న లక్ష్మి, శశిధర్ దంపతులకు చెత్త కుండీ వెనుక నుంచి చిన్నపిల్లాడి ఏడ్పు వినిపించి చేతిలో సంచి భార్య చేతికి యిచ్చి ఏడుపు వినిపించిన చోటకి వెళ్లి చూసాడు.
రబ్బర్ షీట్ మీద పడుకుని ఏడుస్తున్న పిల్లాడిని చూసి, ఎత్తుకుని అటూ ఇటు చూసి “ఈ పిల్లాడు ఎవ్వరో మీకు తెలుసా” అని దారే పోయే వాళ్ళని అడిగాడు.
“మాకు తెలియదు, మీరు పోలీసులకి అప్పగించండి, వాళ్ళు చూసుకుంటారు” అంటూ వెళ్లిపోయారు.
“ఏమండీ! మనకి పిల్లలు లేరు కదా, ఎవ్వరో మాకు వద్దు అనుకుని వదిలేసారు, మనం కావాలి అని ఈ పిల్లాడిని తీసుకొని వెళ్లి పెంచుకుందాం, ఏమంటారు?” అంది లక్ష్మి.
“ఈ ఊరిలో చాలా మందికి మనకి పిల్లలు లేరని తెలుసు. యిప్పుడు ఈ పిల్లాడిని చూసి గిట్టని వాళ్ళు పోలీసులకి చెప్పితే మనం యిబ్బంది లో పడ్తాము” అన్నాడు శశిధర్.
“మనకి వున్న ఈ చిన్న కిరాణా కొట్టు వ్యాపారం ఏ ఊరిలో నైనా చేసుకోవచ్చు, పిల్లాడు కావాలి అంటే దొరకడు కదా, వీడిని పెంచి పెద్దచేస్తే వృద్దాప్యం లో మనల్ని ఆదుకుంటాడు” అంది భార్య లక్ష్మి.
“సరే నీ ఇష్టం, నువ్వు ఈ బాబు ని తీసుకుని హాస్పిటల్ లో చూపించి ఇటు నుంచి ఇటే భద్రాచలం వెళ్ళిపో మీ తమ్ముడి ఇంటికి. నేను యిక్కడ విషయాలు చక్కపెట్టుకుని వచ్చేస్తాను” అని భార్య కి కొంత డబ్బులు యిచ్చి తను ఇంటికి ఆలోచిస్తో బయలుదేరాడు.
హాస్పిటల్ లో బాబుని పరీక్ష చేసిన డాక్టర్ గారు “పిల్లాడు ఆరోగ్యం గానే వున్నాడు, కొన్ని డ్రాప్స్ రాసి యిస్తాను వాడండి”అని చెప్పటం తో ఊపిరి పిలుచుకుని తను కొన్న డ్రెస్ పిల్లాడికి వేసి భద్రాచలం బస్సు ఎక్కింది.
బస్సులోనుంచే తమ్ముడికి మెసేజ్ పెట్టి తనని బస్సు స్టాండ్ కి వచ్చి కలవమని కోరింది.
పిల్లాడితో దిగిన అక్కగారిని తన కారులో కూర్చోపెట్టి, “అక్కా! యిప్పుడు ఈ రిస్క్ అవసరమా మీకు, తెలియకపోతే పర్వాలేదు, బయటకు తెలిస్తే కోర్టు చుట్టూ తిరగాలి” అన్నాడు లక్ష్మి తమ్ముడు రమేష్.
“అందుకేగా తమ్ముడు.. మేము గుంటూరు జిల్లా నుంచి ఈ భద్రాచలం వచ్చేసింది. యిక్కడ మీకు తప్పా మేము ఎవ్వరికీ తెలియదు” అంది లక్ష్మి.
“సరే.. మీ మరదలు నోట్లో నువ్వు గింజలు నానవు, తనకి చెప్పద్దు, ఈ బాబు నీకు పుట్టినట్టే చెప్పు, పుటింటికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అని వచ్చాను అని” అని హితభోద చేసాడు.
“అదేమిటమ్మా.. పిల్లాడు పుట్టేదాకా అంత రహస్యం గా దాచావు.. ముందుగా చెప్పితే సంతోషించే వాళ్ళం కదా” అంది మరదలు.
కొన్ని రోజులలో శశిధర్ కూడా బావమరిది ఇంటికి వచ్చేసి బావమరిది ని ఆడిగాడు మాకు అద్దెకు ఒక యిల్లు, అలాగే కిరాణా షాప్ పెట్టుకోవడానికి మంచి ఏరియా సూచించు అని.
ఆ ఊరిలో చాలా సంవత్సరాలనుండి ఉంటున్న రమేష్ బావగారి కోసం ఒక ఇల్లు, అదేవిదంగా కిరాణా షాప్ కోసం ఒక షాప్ తేలికగా కుదిరిచ్చాడు. మంచి రోజు చూసుకుని తను పెంచుకుంటున్న కొడుకు పేరు మీద ‘రత్నం జనరల్ స్టోర్స్’ అని వ్యాపారం మొదలుపెట్టాడు. మంచి సెంటర్ అవ్వడం, షాప్ యజమాని మంచివాడు అని పేరు పడటం తో వ్యాపారం బాగా అనుకుంది.
పిల్లాడు రత్నం కి మూడు సంవత్సరాలు రాగానే ప్లే స్కూల్ లో జాయిన్ చేసి లక్ష్మి కూడా భర్తకి సహాయంగా షాపులో కూర్చుటోంది.
ఒకరోజు స్కూల్ నుంచి శశిధర్ కి ఫోన్ వచ్చింది అర్జెంటుగా స్కూలు కి రమ్మని. భార్యభర్తలు షాప్ మూసేసి స్కూల్ కి వెళ్లారు. స్కూల్ ఇంచార్జ్ కంగారు పడుతో చెప్పింది ‘పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మీ అబ్బాయి కంట్లో యింకో పిల్లాడు పెన్సిల్ తో పొడిచాడు, మా టీచర్ తో మీ అబ్బాయి ని హాస్పిటల్ కి పంపించాము, పదండి వెళ్దాం’ అని చెప్పాడు. శశిధర్ గుండె ఆగిపోయినట్టు అయ్యింది విషయం వినగానే. అక్కడకి దగ్గర్లో వున్న కంటి హాస్పిటల్ కి చేరుకున్నారు. కుడి కన్నుకి కట్టుతో ఏడుస్తూ కనిపించిన కొడుకుని చూసి తల్లి లక్ష్మి తల్లడిల్లి పోయింది.
డాక్టర్ గారు శశిధర్ తో అన్నాడు “దెబ్బ బాగా తగిలింది. వారం రోజులు తరువాత కానీ చూపు వుందో లేదో తెలియదు. మందులు యిస్తున్నాను వాడి, వారం తరువాత రండి చూద్దాం” అన్నాడు.
స్కూల్ వాళ్లే హాస్పిటల్ బిల్లు యిచ్చి, శశిధర్ చేతులు పట్టుకుని “క్షమించండి, యిలా ఎప్పుడు మా స్కూల్ లో జరగలేదు, మీ అబ్బాయి హాస్పిటల్ ఖర్చులు మేము భరిస్తాము, దయచేసి మమ్మల్ని అల్లరి పెట్టకండి” అన్నాడు.
అప్పుడే వచ్చిన శశిధర్ బావమరిది కోపంతో “మిమ్మల్ని వదిలిపెట్టను, పోలీస్ రిపోర్ట్ యిచ్చి మీ స్కూల్ మూయించుతాను” అంటూ ఫోన్ తీసి పోలీసులుకి ఫోన్ చేస్తోవుండగా, శశిధర్ బావమరిది ని ఆపి, “ఎవ్వరి మీద కేసు పెడ్తాము, కంట్లో పొడిచిన ఊహ లేని యింకో చిన్నపిల్లాడి మీదనా, టీచర్ మీదనా, మన అదృష్టం బాగుండలేదు, హాస్పిటల్ ఖర్చులు వాళ్లే యిస్తామని ముందుకు వచ్చారు, చూద్దాం వారం రోజులు, మనం ఎవ్వరికి అపకారం చెయ్యలేదు, మనం ఈ గండం నుంచి బయటపడతాము అనుకుంటున్నాను” అన్నాడు పిల్లాడిని ఎత్తుకుని హాస్పిటల్ నుంచి బయటకు వస్తో.
వారం రోజుల తరువాత స్కానింగ్ లాంటివి చేసి పిల్లాడికి దెబ్బ తిన్న కన్నుకి చూపు పోయింది అని చావు కబురు చల్లగా చెప్పాడు డాక్టర్ గారు. “మరి యిప్పుడు ఎలా?” అని దీనంగా అడిగాడు డాక్టర్ ని శశిధర్.
“కన్ను గుడ్డు దానం దొరికితే హైదరాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్ లో ఆపరేషన్ చేస్తే చూపు వస్తుంది, దానికి కూడా ఒక సంవత్సరం ఆగాలి, , ఈ లోపున కన్ను డొనేషన్ బ్యాంకు లో రిజిస్టర్ చేసుకోండి” అని చెప్పాడు.
విషాదం తో ఇంటికి వచ్చిన శశిధర్ దంపతులకు కొడుకు జీవితం చీకటేనా అని బాధతో మంచం పట్టారు. బావమరిది, మరదలు వచ్చింది వీళ్ళ ఇంట్లోనే ఉండి ఎంత చెప్పినా కోలుకోలేకపోతున్నారు. ఒక రోజు ఉదయం శశిధర్ బావమరిదితో “నా కొడుకు కి ముందు ఎంతో జీవితం వుంది, అది చీకటిమయం కాకూడదు, నా జీవితంలో సగభాగం అయ్యిపోయింది, అందుకే నేను నా కన్ను ని నా కొడుకుకి యిస్తాను, నాకు ఒక కన్ను చాలు” అన్నాడు.
“ఏం మాట్లాడుతున్నావ్ బావ, ఎక్కడో దొరికిన పిల్లాడిని పెంచుకుంటున్నావు, వాడు దురదృష్టం వలన కన్ను పోయింది. నువ్వు వాడికి కన్ను ఎందుకు ఇవ్వడం, నీ కడుపున పుట్టిన వాడు కూడా కాదు, అయినా బతికి వున్నవాడి కన్ను తీసి ఇంకొకరికి పెట్టటానికి లా ఒప్పుకోదు” అన్నాడు బావమరిది.
వంటగదిలో వున్న బావమరిది భార్య ఈ మాటలు విని, “పెంచుకోవ్వడం ఏమిటి అండి. , అయితే మీ అక్కకి పుట్టినవాడు కాదా” అంటున్న భార్య నోరు నొక్కి “గట్టిగా అరవకు, ఈ రహస్యం నీ ద్వారా బయటకు వెళ్ళింది అంటే నా మీద ఒట్టే” అన్నాడు రమేష్.
రోజులు గడుస్తున్నాయి, షాప్ మీద ఇంటరెస్ట్ చూపించలేక పోతున్నాడు శశిధర్. బావగారి బాధ చూడలేక తనకి తెలిసిన డాక్టర్ స్నేహితుడు కి విషయం తెలియచేసి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రమేష్.
“ఎవ్వరైనా తమ కళ్ళు దానం చేస్తే వారు చనిపోయిన తరువాత ఆ కళ్ళ ని ఇతరులకి యిస్తారు. మీ బావగారి కన్ను తీసుకుని అతని కొడుకుకి పెట్టడం కుదరని పని, అయినా చాలా డబ్బు ఖర్చు అవుతుంది” అన్నాడు.
“డబ్బుల గురించి ఆలోచించకండి, ఏదో విధంగా పిల్లాడికి చూపు రావాలి” అన్నాడు రమేష్.
“అయితే నేను హైదరాబాద్ లో వున్న నాకు తెలిసిన కంటి డాక్టర్ ని అడుగుతాను, అతను అంగీకరిస్తే రహస్యంగా ఈ పని జరిపించుదాము, ముందు డబ్బు గురించి ఆ స్కూల్ వాళ్ళతో మాట్లాడు” అన్నాడు డాక్టర్.
“ఈ విషయం బయటకు తెలిస్తే మనమందరం జైలుకే, జాగ్రత్తగా ఉండాలి” అని హెచ్చిరించాడు.
డబ్బుకి లొంగి ఏ పని చెయ్యడానికి అయినా కొంతమంది వుంటారుగా, అటువంటి డాక్టర్ గారు హైదరాబాద్ లో శశిధర్ కొడుకు కంటిమార్పిడి చేసాడు.
ఒంటి కంటితోనే వ్యాపారం దివ్యంగా చేస్తో పిల్లాడిని టెన్త్ క్లాస్ లో చేర్పించాడు. కొడుకు రత్నం కి తల్లిదండ్రులు అంటే విపరీతమైన ప్రేమ. తండ్రి కన్ను ఎలా పోయింది అని తల్లిని ఎన్నిసార్లు అడిగినా మీ నాన్నకి పుట్టినప్పుడే ఒక కన్ను లేదు అని అబద్దం చెప్పింది కొడుక్కి లక్ష్మి.
వ్యాపారం లో బాగా సంపాదిస్తూ ఆనందంగా వున్న శశిధర్, లక్ష్మి లను చూసి ఓర్వలేక రమేష్ భార్య, రత్నం కి చెప్పింది, “వీళ్ళు మీ స్వంత తల్లిదండ్రులు కాదు, నువ్వు ఎక్కడో దొరికితే తీసుకుని వచ్చి పెంచుతున్నారు” అని.
ఆ మాటలకి రత్నం మనసులో అలజడి మొదలైంది. అంటే వీళ్ళు తన తల్లిదండ్రులు కాదు అన్నమాట, అయితే నా తల్లిదండ్రులు ఎవ్వరు అనుకుంటూ పెంచిన తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుని, వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, తండ్రిని “నీకు సరిగ్గా కనిపించదు కదా, ఆ గుడ్డితనం తో ఎందుకు షాప్ కి వెళ్ళటం, నువ్వు యింట్లో కూర్చో, నేను షాప్ కి వెళ్తాను” అని గొడవ పెట్టుకున్నాడు.
“నువ్వు బాగా చదువుకుని ఇంజనీర్ వి అయితే అప్పుడు షాప్ అమ్మేసి నీ దగ్గర హాయిగా ఉంటాము” అన్న శశిధర్ వంక విసుగ్గా చూసి, “నేను యింక చదవను, రేపటి నుంచి మీరు షాపుకి రావద్దు, నన్ను చూసి ప్రతి వాడు ఆగుడ్డి అతను కొడుకు రా అని ఏడిపిస్తున్నారు” అన్నాడు. మర్నాడు నుంచి రత్నం స్కూల్ కి వెళ్లకుండా షాపుకి వెళ్లి వచ్చిన డబ్బులు యింట్లో ఇవ్వకుండా స్నేహితులతో జూలాయి తిరుగుళ్ళు తిరగటం మొదలుపెట్టాడు.
విషయం తెలిసి శశిధర్ లోపల లోపల కుమిలిపోతున్నాడు, శశిధర్ భార్య చూస్తో ఉండలేక తమ్ముడికి విషయం చెప్పింది. “చెత్త కుప్పలో దొరికిన వీడికి మంచి బుద్దులు ఎలా వస్తాయి అనుకున్నావు అక్కయ్యా, వీడికోసం బావగారు గుడ్డితనం కోరి తెచ్చుకున్నారు, మీ ఖర్మ, అనుభవించాలి తప్పదు” అంటూ వెళ్ళిపోయాడు.
రాత్రి షాప్ కట్టేసే టైముకి రమేష్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. జనం బాగానే వున్నారు. పనికుర్రాడు కి షాప్ అప్పగించి బయట నుంచుని స్నేహితులతో మాట్లాడుతున్న రత్నం మామయ్య రావడం చూసి స్నేహితులని పంపించేసి “రండి మామయ్య, ఏమైనా కావాలంటే నేను తీసుకొని వచ్చి యిచ్చేవాడినిగా.. మీరు ఎందుకు రావడం” అన్నాడు.
“షాప్ ఎలా నడుపుతున్నావో చూద్దాం అని వచ్చాను. పని కుర్రాడిని టీ తీసుకొని రమ్మను” అని చెప్పి, “నువ్వు చదువు మానేసి ఎందుకు తల్లిదండ్రుల ని చులకనగా
మాట్లాడాలిసి వచ్చింది? నీకు ఏమైంది అసలు, మీ నాన్న నువ్వు గొప్పవాడివి కావాలి అని ఆశపెట్టుకున్నాడో తెలుసా” అన్నాడు.
“అసలు నా తల్లిదండ్రులు ఎవ్వరో తెలుసుకోవాలి అని నా ఆశ గురించి మీకెవ్వరికి అక్కరలేదా, నన్ను ఆ చెత్త కుండీలో పడేసి వుంటే ప్రాణం పోయి వుంటే బాగుండేది. వీళ్ళు నా స్వంత తల్లిదండ్రులు కాదు అని తలుచుకుంటే భయంగా వుంది” అన్నాడు రత్నం.
“నీకు వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు అని ఎందుకు అనుకుంటున్నావు?” అన్నాడు రమేష్.
“అత్తయ్య చెప్పింది, నేను చెత్త కుండీ దగ్గర దొరికితే వీళ్ళు తెచ్చుకున్నారు అని” అన్నాడు రత్నం.
“అత్తయ్య అంతే చెప్పిందా, నిన్ను పెంచి పెద్ద చేసిన మీ నాన్న కన్ను ఎలా పోయిందో చెప్పలేదా?” అన్నాడు.
“ఆయన పుట్టి గుడ్డి అని తెలుసు” అన్నాడు.
“కాదు నీకు ఊహ తెలియని రోజులలో కంట్లో పెన్సిల్ గుచ్చుకుని కన్నుపోతే మీ నాన్న నువ్వు చెత్త తొట్టి దగ్గర దొరికావు అనే ఆలోచన కూడా చెయ్యకుండా నీకు తన కన్ను దానం చేసాడు తెలుసా, అందుకు నేను, నీ మనసు పాడు చేసిన మీ అత్తయ్య సాక్ష్యం” అన్నాడు.
“నిజమా మామయ్య నువ్వు చెప్పేది, అంటే నేను నాన్న కన్నుతో చూస్తున్నానా” అన్నాడు.
“అవును. మీ నాన్న ఏమన్నాడో తెలుసా, ‘నా జీవితం సగం అయ్యిపోయింది, ఒక్క కన్నుతో బతకగలను, నా కొడుకు జీవితం చీకటి కాకూడదు’ అని కన్ను దానం చేసాడు. యిహ నీ యిష్టం యిప్పుడు ఏమి చేస్తావో” అని లేచి వెళ్ళిపోయాడు రమేష్.
రత్నం ఇంటికి చేరే సరికి పదిగంటలు అయ్యింది. మంచం మీద పడుకుని వున్న తల్లి లేచి “కాళ్ళు చేతులు కడుక్కుని రా, అన్నం వడ్డిస్తాను” అంది.
“నాన్న ఏరి అమ్మా” అన్న కొడుకు పిలుపు లో పూర్వపు ప్రేమ కనిపించి “అదిగో ఆ గదిలో వున్నారు” అంది.
మెల్లగా తలుపు తీసుకుని గదిలోకి వెళ్లిన రత్నం కి చీకటి గదిలో కూర్చొని వున్న తండ్రిని చూసి దగ్గరగా వెళ్ళి, తండ్రి చేతిలో షాప్ తాళం చెవ్వులు పెట్టి “నాకు వెలుతురుయిచ్చి మీరు చీకటిలో వున్నారా నాన్నా, నన్ను క్షమించండి, ఛీ నువ్వు వద్దు అని వదిలించుకున్న వాళ్ళ కోసం నన్ను అక్కున చేర్చుకుని ఏ తండ్రి చెయ్యలేని త్యాగం చేసారు నా కోసం. రేపటి నుంచి నేను స్కూల్ కి వెళ్తాను, మీ కోరిక నెరవేరుస్తాను” అన్నాడు తండ్రి తొడ మీద తల పెట్టి కన్నీళ్లు కారుస్తో.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments