top of page

ఫోన్ పోయింది


'Phone Poyindi' New Telugu Story


Written By Jidigunta Srinivasa Rao


రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కాలింగ్ బెల్ చప్పుడుకి వంట గదిలోనుంచి వచ్చి తలుపు తీసి, గోడ పట్టుకుని ఒంగిపోతు నిలిచివున్న సుబ్బారావు ని చూసి “అయ్యో.. ఏమైంది మామయ్యగారూ!” అంటూ చేయిపట్టుకుని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టి, లోపల గదిలో కూతురుకి లెక్కలు చెపుతున్న మొగుడు రమేష్ ని రమ్మని పిలిచింది రమ్య.


“ఏమైంది..” అంటూ రమేష్, రమేష్ కూతురు స్వర, పక్కగదిలో భారతం చదుకుంటున్న రాజేశ్వరి ఒకేసారి కంగారుగా ముందు గదిలోకి వచ్చారు.


సోఫాలో చెమటలు పట్టి వణికిపోతున్న భర్తని చూసి “ఏమైందండి, మళ్ళీ షుగర్ పడిపోయిందా?” అంది రాజేశ్వరి.


“వుండమ్మా, ముందు కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. యిది మనకి మాములేగా. వద్దన్నా సెల్ ఫోన్లో బాబాయ్ తో మాట్లాడుకుంటూ పది కిలోమీటర్లు నడిచేసి, ఇంటికి యిలా చేరతారు” అన్న కొడుకుతో, “ఎక్కువ దూరం వెళ్లలేదురా. మియాపూర్ దాకా వెళ్లి వచ్చేసాను” అన్నాడు సుబ్బారావు.


ఫ్రూట్ జ్యూస్ గ్లాస్ చేతికి యిస్తో “మామయ్యగారూ! మన యింటినుంచి మియాపూర్ రానుపోను 10 కిలోమీటర్స్ వుంటుంది, మీరు అంత దూరం నడవకూడదు” అంది కోడలు రమ్య.


“మొన్న తాతయ్య ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు” అంది మనవరాలు స్వర.


ఫ్రూట్ జ్యూస్ తో కొద్దిగా ఓపిక వచ్చిన సుబ్బారావు, మనవరాలు వంక చూసి “నువ్వు కూడా చెప్పేదానివే.. అసలు ఆ టైములో నువ్వు బయటకి ఎందుకు వచ్చావు, ఎవ్వరు తోడు లేకుండా” అన్నాడు.


“మిమ్మల్ని మేము ఎవ్వరం కంట్రోల్ చెయ్యలేం, మీ మనవరాలు తప్పా, అందుకే దానిని మీకు కాపలాపెట్టాం” అన్నాడు కొడుకు.


మెల్లగా లేచినుంచున్న తండ్రిని చూసి, “మళ్ళీ ఎక్కడకి లేచారు?” అన్నాడు.


“చెమటలు పట్టేసాయి, స్నానం చేసి వస్తా” అంటూ బాత్రూం లోకి వెళ్ళిపోయాడు..


వేడినీళ్లతో గంట సేపు స్నానం చేయడం అలవాటు. అయిదు నిమిషాలలోనే తలుపు కొడుతూ, “తాతయ్యా! ఆర్ యు ఓకే ?” అని అడుగుతున్న మనవరాలికి, “ఆ బాగానే వున్నా, వస్తున్నా” అన్నాడు సుబ్బారావు.


“దీనిని నాకు కాపలా పెట్టినదగ్గర నుంచి దీని పెత్తనం ఎక్కువ అయింది నా మీద” అనుకుని నవ్వుకున్నాడు. మనవరాలు అంటే ప్రాణం.


స్నానం చేసి వచ్చి, కోడలు చేసిచ్చిన రెండు చపాతీలు తిని, ఫోన్ తీసుకుని ఆ గదిలోనుంచి ఈ గదిలోకి నడుస్తూ వుంటే, “నడిచింది చాలు తాతా, ఇప్పటికే నీ కాళ్ళు అరిగిపోయాయి. యిప్పుడు నీ కంటే నేనే పొడుగు” అంటున్న మనవరాలితో, “అవునా సరే.. అయితే రా! నీకు ఒక కథ చెపుతాను” అన్నాడు సుబ్బారావు.


“వద్దు. నీ కథలన్నీ పాతవి. అనగనగా ఒక రాక్షసి అంటావు.. యిప్పుడు రాక్షసి వుంటుందా అసలు” అంది.


“సరే, అడుగుతా చెప్పు. బ్రమ్మరాక్షసి కూతురు ని ఏమంటారు?” అన్నాడు నవ్వుతూ.


“బ్రమ్మరాక్షసి కూతురు అవుతుంది. పెళ్ళైతే ‘బ్రమ్మరాక్షసి’ అవుతుంది. అంతే” అంది.


ఇంతలో వాళ్ళ అమ్మ పిలవడం తో, “తాతా గుడ్ నైట్ ” అని చెప్పి వెళ్ళిపోయింది.


లైట్ తీసేసి పడుకున్నాడు సుబ్బారావు.


తెల్లారింది, అందరు లేచి వాళ్ళ వాళ్ళ పనుల్లో వున్నారు. మనవరాలు స్కూల్ కి వెళ్ళిపోయింది అనుకుని, రాత్రి టేబుల్ మీద పెట్టిన ఫోన్ కోసం చూస్తే, ఫోన్ లేదు. మంచం మీద, సోఫాలో అంతా వెతికి, భార్య తో “నా ఫోన్ ఏమన్నా చూసావా” అన్నాడు.


“చూడలేదు, ఎక్కడ పెట్టారు రాత్రి, అయినా పొద్దున్నే ఎవ్వరికి ఫోన్ చేయాలి, ముందు స్నానం చేసి వచ్చి టిఫిన్ తినండి” అంది.


“నా ఫోన్ తీసావా” అని కొడుకుని ఆడిగాడు.


“నేను ఎందుకు తీస్తాను, గుర్తు తెచ్చుకోండి రాత్రి ఎక్కడ పెట్టారో, కనిపించకుండా వుంటే బాగుండును” అంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.


ఇల్లంతా వెతికినా ఫోన్ కనిపించలేదు. యిరవై వేల రూపాయల ఫోన్, బహుశ పనిమనిషి లాగేయాలేదుకదా అనుకుని, కోడలికి ఫోన్ గురించి చెప్పి, తన అనుమానం కూడా చెప్పాడు.


“ఛీ పనిమనిషి చాలా మంచిది, యింత వరకు ఒక్క చెంచా కూడా పోలేదు, అటువంటిది మీ ఫోన్ తీసుకుంటుందా” అంది.


మనవరాలు ఏమైనా దాచిందేమో అని, అది వచ్చే వరకు ఆగి, స్కూల్ నుంచి వచ్చిన మనవరాలుని, “నా ఫోన్ ఎందుకు తీసావ్” అని ఆడిగాడు సుబ్బారావు.


“నీ ఫోన్ నేను తీయలేదు, పారేసుకున్నావా” అని అడిగింది.


“రాత్రి యిక్కడే పెట్టాను, ఏమైందో తెలియటం లేదు” అన్నాడు.


సాయంత్రం అయినా వాకింగ్ కి వెళ్లకుండా కూర్చున్న భర్తని, “వాకింగ్ కి వెళ్ళరా” అంది.


“ఎక్కువ నడుస్తున్నాని గొడవ పెట్టారుగా, ఫోన్ కూడా పోయింది, మూగనోము పట్టినట్టు గా వుంది” అన్నాడు.


ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకుతో, “అబ్బాయి, నాకు ఒక చైనా ఫోన్ అయినా కొనరా. ఎక్కువ ఖరీదు ఫోన్ పోతే బాధగా వుంటుంది” అన్నాడు సుబ్బారావు.


“చైనా ఫోన్ పేలిపోతుంది, రేపు మంచి ఫోన్ కొంటాను, అయితే గంటలు గంటలు మాట్లాడుతూ నడవకండి” అన్నాడు కొడుకు.


“సరేలే అలాగే, ఈ వయసులో అన్నదమ్ములతో మాట్లాడుకోవటం తప్పా మేము చేసే పని ఏముంటుంది” అన్నాడు.


“మాట్లాడుకోండి నాన్నా,, కానీ రోడ్డు మీద నడుస్తూ వద్దు. యింట్లో మీ రూంలో పడుకుని మాట్లాడుకోండి” అన్నాడు.


అక్కడే కూర్చొని చదువుకుంటున్న మనవరాలు స్వర, తండ్రి వంక చూసి, “అయితే తాతకి కొత్త ఫోన్ కొంటావా?” అంది.


“చిన్నప్పుడు మా నాన్న నేను టెన్త్ క్లాస్ లో మోటార్ సైకిల్ కావాలంటే వెంటనే కొనిచ్చాడు తెలుసా” అన్నాడు కూతురు తో.


“తెలుసు, దానిమీద నుంచి పడి కాలు విరగకోట్టుకున్నావని బామ్మ చెప్పింది” అంది.


“కంగారుపడి కొత్త ఫోన్ కొనకు తాతయ్య కి, మూడు రోజులనుంచి సౌండ్ పొల్యూషన్ లేదు యింట్లో” అంటున్న మనవరాలి వంక అనుమానం గా చూసి, నా ఫోన్ యిదే ఎక్కడైనా దాచిందేమో అనుకుని ఒక అరగంట తరువాత మనవరాలు ని దగ్గర కూర్చుపెట్టుకుని, “చిన్నప్పుడు మా చెల్లెలు ఏ వస్తువు కనిపించకపోయిన నన్నే అడిగి వెతికి పెట్టమనేది. అలాగే రెండు నిమిషాలలో కనిపెట్టేవాడిని. మా నాన్న నన్ను CID అని పిలిచేవాడు.


అది సరే కానీ స్వరా, నీకు నా పోలిక వచ్చింది అంటారు కదా, మరి నువ్వు కూడా కనిపించని వస్తువులు పట్టుకోగలవా” అన్నాడు సుబ్బారావు మనవరాలితో.


“ఈజీగా పట్టుకోగలను. నేను పెద్దయినా తరువాత IPS అవుతా తెలుసా” అంది మురిసిపోతో.


“గుడ్ నువ్వు నిజంగానే అవుతావు బాగా చదువుకో” అని మెల్లగా దాని పుస్తకాల సంచిలో వెతికాడు సుబ్బారావు.


అనుకున్నట్టే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పుస్తకాలు మధ్యలో వుంది. యిప్పుడు ఫోన్ బయటకు తీసి మనవరాలిని వాళ్ళ తల్లిదండ్రుల చేత తిట్టించిడం కంటే, అది అంతట అది యిచ్చే వరకు ఆగుదాం అనుకుని, గమ్మున వచ్చి సోఫాలో కూర్చున్నాడు.


హోమ్ వర్క్ పూర్తి చేసుకుని, “ఏమిటో ఎప్పుడో IPS అవడానికి ముందే పోయినవన్నీ నన్నే వెతకమంటారు” అంటూ, మంచం క్రింద, డస్ట్ బిన్ లోను చూసి ఒక రెండు నిమిషాలలో తన రూమ్ నుంచి “తాతయ్యా నీ ఫోన్ దొరికింది” అంటూ తీసుకొని వచ్చింది.


“నా బంగారు తల్లే, ఎక్కడ దొరికిందే” అన్నాడు సుబ్బారావు.


“నువ్వు అన్నీ వెతికి,బాత్రూం లో చూడలేదు. అక్కడ గూట్లో పెట్టి వుంది” అంది స్వర..


“అబద్దం నాన్న, అక్కడ వుంటే మనకి కనిపించేదే, యిదే దాచిపెట్టి వుంటుంది” అన్నాడు కూతురు ని చూస్తో.


“నా ఫోన్ దొరికింది, ఏమిటి విశేషాలు,..అరే ఎందుకు ఆలా చేసాడు.. ” అంటూ తన తమ్ముడితో మాట్లాడుకుంటున్న తాతయ్య ని చూసి, “ఇందుకే ఫోన్ దాచేసా. అప్పుడే మొదలుపెట్టాడు మాటలు. నువ్వు తాతయ్య కి నిజంగా ఫోన్ కొంటావేమో అని భయం వేసింది. అందుకే యిచ్చేసా” అంటూ తండ్రికి అందకుండా పరుగేత్తింది స్వర.

శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Podcast Link

https://spotifyanchor-web.app.link/e/BI9YWS6Gewb


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1609559227349204999?s=20&t=lGrfJUMroocWNej6jlCjVQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


https://www.manatelugukathalu.com/profile/jsr/profile




52 views0 comments
bottom of page