పిట్టలూ పిల్లలూ..
- Pandranki Subramani
- 5 hours ago
- 3 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #పిట్టలూపిల్లలూ, #PittaluPillalu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pittalu Pillalu - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 03/10/2025
పిట్టలూ పిల్లలూ - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ మధ్య నాకు విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది, గాజువాకలో ఉన్న మా ప్రాంతీయ కార్యాలయంలో నా సర్వీసు రికార్డుని నవ్యీకరించుకోవటానికి.. ఇక విషయానికి వస్తే ఇటువంటివి ఇప్పటికిప్పుడు చేయాల్సిన అత్యవసర పనులు కాకపోయినా కాలయాపనకు తావులేకుండా ముందు చూపుతో ముందస్తుగా మతిమరుపుకి అవకాశం లేని విధంగా అధికార పూర్వక వ్యవస్థకు సంబంధించిన కార్యాలు పకడ్బందీగా చేసి ముగించడం నాకు మొదటినుండీ అలవాటు గనుక..
భోరున వర్షం కురవడం చూసిన తరవాతనే గొడుగు కోసం పరుగులు తీయడం నాకు గిట్టని పని. వర్షాకాలంలో వాన కురువడం అన్నది తెలిసిన విషయమే కదా— ఉద్యోగ వివరాలు అప్డేట్ చేయడం కూడా అదేవిధంగా అనివార్యమే కదా.. అప్పుడు, పనిలో పనిగా మద్దెలపాలంలో ఉంటూన్న మా చెల్లిని చూసిరావటానికి బయల్దేరాను; అమ్మ పంపించిన ఆవకాయ బాటిల్ని చింతాకు పచ్చడి బాటిల్ని అందించి రావటానికి.
నేను వెళ్ళేటప్పటికి మా బామ్మర్ది లేడు గాని, ఇల్లు మాత్రం యమ సందడిగా ఉంది. నేను అదేమీ లక్ష్యపెట్టకుండా ఇంటినుంచి తెచ్చిన వన్నీ మాచెల్లికి భద్రంగా అప్పజెప్పి నాకు సంబంధించిన పర్సనల్ ఫైల్సుని పిల్లకాయల కంట పడనివ్వకుండా పదిల పరచుకుని నా మేనల్లుడూ మేనగోడలిద్దరూ చేస్తూన్న హంగామా గమనించడానికి బాల్కనీ వేపు నడిచాను.
వరండాలో నా ఉనికి గమనించారో లేదో పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా అరిచారు యింటి పైకప్పు ఊడిపడ్డట్టు- “మామయ్యా! మామయ్యా! ఇప్పుడు బాల్కనీ వేపు వెళ్ళకండి. ప్లీజ్!”
వాళ్ళ కీచు గొంతులు విని కించిత్ బిత్తరపాటుకి లోనవుతూ తిరిగి చూసాను ఎందుకన్నట్టు—
అప్పుడు ముక్త కంఠంతో మరొకసారి అరిచారు ముగ్గురూ— “ పిచుకలు మోర్నింగ్ మీల్స్ కోసం వచ్చే తరుణం!”
అప్పుడు చట్టున ఆగి పట్టున అడిగాను కళ్ళు పెద్దవి చేస్తూ- “సో వాట్?“అని.
అప్పుడు పిల్లలు అసలు విషయానికి వచ్చారు- “మామయ్యా! నిన్నక్కడ గాని చూస్తే పిచుకలు బాల్కానీకి రావు. కీచుకీచుమంటూ అమ్మపెట్టిన గింజలు ధాన్యాలూ తినకుండానే వెళ్ళిపోతాయి. నువ్వక్కణ్ణించి కదలి వచ్చేసేయి మామయ్యా..”
ఇదెక్కడి తంటారా బాబూ అనుకుంటూ నేనక్కడ నిలవకుండా పిల్లలు నిల్చున్న దిక్కున వచ్చేసాను. మరికాసేపటికి మా మేనగోడలూ మేనల్లుడూ చెప్పినట్లే పిట్టలు నాలుగైదు పొలోమని గుంపుగా బాల్కనీలోకి తోకలాడిస్తూ వచ్చేసాయి. గింజలు కొరుక్కు తిని గిన్నెలోనుండి నీళ్ళు తాగసాగాయి. కొన్ని పిట్లలేమో రెక్కల పైన తుంపర చిమ్ముకుని బహు పసందుగా తోకలాడిస్తూ తుర్రుమన్నాయి. అది చూసి పిల్లల్ని ఉద్దేశించి అన్నాను- “ఇక నేను బాల్కనీలోకి వెళ్ళేదా?“
“ఇప్పటికిప్పుడు వద్దు మామయ్యా! ఇక్కడి పిచుకలకు ఫ్రెండ్స్ గ్రూప్స్ యెక్కువ— మరొక గుంపు పిచుకలు రివ్వున బాల్కనీలోకి వాలవచ్చు. అప్పుడు వాటికి గింజలు గాని ధాన్యాలు గాని కనిపించకపోతే ఊరుకోవు..”
“ఏం చేస్తాయేమిటి?“
“కీచు కీచుమని తోకలాడించుకుంటూ అమ్మను వెతుక్కుంటూ కిచెన్ లోకి దూరిపోతాయి. అప్పుడు అమ్మ “ సారీరా అమ్మలూ!” అంటూ వాటికి గింజలూ నీళ్ళ గిన్నే అందించిన తరవాతనే అవి వాటి భాషలో టాటా చెప్తూ యెగిరి పోతాయి. నీకు తెలుసో తెలియదో గాని ఇక్కడి పిచుకలన్నీ చాలా ఫ్రెండ్లీగా జోవియల్ గా ఉంటాయి మామయ్యా— వాటి పిచుకల భాషలో అమ్మను పలకరిస్తాయి కూడాను..”
నేనేమి అనలేదు. పిల్లల ముఖాలలోకి చూస్తూ ఊరకుండిపోయాను. పిల్లలకూ పక్షులకూ మధ్య యెంతటి అవినా భావ సంబంధం ఉంటుందో..
............................................................
అలా మూడు రోజులు మద్దెలపాలెంలో పిల్లలతో గడిపి మాచెల్లితో బోలెడన్ని ఊసులాడి వస్తు మార్పిడిలా అది అంచించిన జంతికలూ అరిసెలూ ప్యాక్ చేసుకుని ఇక నేను బయల్దేరుతున్నానంటూ అందరికీ టాటా చెప్తూ పిల్లలు ముగ్గురునీ దగ్గరకు రమ్మని పిలిచాను. ముగ్గురూ పరుగున వచ్చి సంతోషంగా అడిగారు- “మమ్మల్ని విజనగరం యెప్పుడు తీసుకెళ్తావు మామయ్యా?” అని—
“అది మీ వేసవి సెలవులప్పుడు మీ బాబుకి కబురు పంపిస్తాను గాని..ముందు దీనికి బదులివ్వండి. మీరెప్పుడైనా పిచుకలు చూసారా!”
నా ప్రశ్నవిని వాళ్లలో పెద్దదయిన మాలతి తెల్లబోయి చూసింది. తెల్లబోయి చూస్తూనే యెదురు ప్రశ్న వేసింది- “ఇదేం ప్రశ్న మామయ్యా? మూడు రోజులుగా మా బాల్కనీలో చూస్తూనే ఉన్నావుగా— పిచుకలు యెలా వచ్చి వాలుతున్నాయో— ఎంత ఫ్రెండ్లీగా ఊసులాడి వెళుతున్నాయో..”
నేను తల అడ్డంగా ఆడించాను అనంగీకార సూచకంగా— “ మీ యింటికి ప్రతిరోజు వస్తూన్నవి పిచుకలు కావు. పిచుకలు నల్లగా అంత చిన్నవిగా ఉండవు. పిచుకలు గోధుమ వర్ణంలో ఉంటాయి. వీటిలా మరీ చిన్నవిగా ఉండవు. ఈ విషయం మీ అమ్మ చెప్పలేదా?”
ఇది విని మాలతి మరింత విస్తుపోయింది- “అమ్మే కదా చెప్పింది ఆ నల్లపిట్లలన్నీనల్ల పిచుకలని..”
నేను తలతిప్పి చూసాను ప్రక్కన నిల్చున్న మా చెల్లి వేపు— అది వెంటనే సర్దుకుంది-
“ ఔన్రా అన్నయ్యా— నేనే చెప్పాను అవి పిచుకలని— ఎందుకంటే— నాకు కూడా వాటి అసలు పేరు తెలియదుగా! ఈ మధ్య అసలైన పిచుకలు కనిపించడమే లేదుగా!”
దాని జవాబు విని నేను నవ్వేసాను. “నేను మీ యింటి బాల్కనీలోని నల్లపిట్టల్ని ముబాయిల్ లో క్యాప్చర్ చేసాను. ఊరుకెళ్ళి వాటి అసలు పేరు కనుక్కొని చెప్తాను. అసలైన పిచుకల బొమ్మలు కూడా పంపిస్తాను.”అంటూ ఇంటి మెట్లు దిగాను.
ఇప్పటి తరాలకు ఇక ముందు రాబోయే తరాలకు పిచుకల గురించి తెలియకుండానే పోతుందేమో! కొన్నాళ్ళకు యెక్కడో వెతికి పట్టుకున్న రెండు మూడు పిచుకల్ని బడి పిల్లల కోసం జూపార్కులో పెట్టవలసి వస్తుందేమో! కీచు కీచుమని అల్లరి చేసే పిచుకలు లేని పర్యావరణాన్ని తలచుకుంటేనే కంపరం కలుగూతూంది. మానవాళి, సజీవతతో కళకళ్ళాడాల్సిన ప్రకృతికి, దైనందిన జీవితంలో తోడుగా కలసి మెలసి ఉండాల్సిన రంగు రంగుల పక్షి జాతికి మెల మెల్లగా దూర మవుతున్నారన్నది వాస్తమేనేమో!
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
