top of page

కోళ్లగూడు

#NagavarapuSrinivasaRao, #నాగవరపుశ్రీనివాసరావు, #కోళ్లగూడు, #KollaGudu#TeluguyStories, #తెలుగుకథలు

ree

Kolla Gudu - New Telugu Story Written By Nagavarapu Srinivasa Rao

Published In manatelugukathalu.com On 03/10/2025

కోళ్లగూడు - తెలుగు కథ

రచన: నాగవరపు శ్రీనివాస రావు


మా అందరిని ఒకే గదిలో బంధించి ఉంచారు. మొత్తం 10 - 15 మందిమి ఉంటామేమో లెక్క తెలియడం లేదు. గదిలో అన్ని వైపులా కిటికీలు ఉండడం వల్ల గాలి, వెలుతురూ రావడానికి ఏమీ ఇబ్బంది లేదు. అందువల్లనే కాబోలు అంత ఇరుకులో ఉన్నా కూడా, నా ఆలోచనలు మాత్రం ఆగటం లేదు. 


అతికష్టం మీద కొంచెం మెడ పక్కకు, కిందకు తిప్పి చూసాను. మా గదిలాంటివి మా కింద ఇంకొక రెండో, మూడో ఉన్నట్లనిపించింది. అవికూడా మా గది లాగే కిటకిట లాడుతున్నాయి. ఇంతమంది బయటపడడానికి అరుస్తున్న అరుపులతో మొత్తం అంతా కోలాహలంగా ఉంది. 


అసలు ఇంతమందిని ఇలా బంధించి ఉంచినవారు ఎవరు, ఎందుకు బంధించారు? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేలోగా మా గదికున్న పైకప్పు తెరుచుకోవడం అందులోంచి ఒక బరువైన, భయంకరమైన చెయ్యి లోపలికి రావడం, మాలో ఒకరిని ఎత్తిపట్టుకుని బయటకు వెళ్లడం, మళ్ళీ పైకప్పు మూసుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. అది చూసి మిగిలిన మా అందరి ఆర్తనాదాలు మిన్నంటాయి. 


ఇంతలో "ఏంరా! ఈ మధ్య మీ కొట్లో మంచి సరుకు దొరకటం లేదని చాలా కంప్లైన్ట్ లు వస్తున్నాయి. ఇలాగైతే, కొట్టు దివాళా తీయడం ఖాయం" అని ఒక గద్దించే గొంతు వినబడింది. 


ఆ వెంటనే, "లేదన్నా! ఈ సారి అంతా కొత్త సరుకు. ఫారం సరుకు కాదు. మొత్తం నాటు సరుకే. మావాళ్లు ఊర్లన్నీ గాలించి మరీ పట్టుకొచ్చారు. ఇప్పుడు తీసుకెళ్ళన్నా. సరుకు మామూలుగుండదు నామాటిను. " అని నెమ్మదిగా బతిమాలుకుంటున్న మరో గొంతు వినబడింది. 


మీకందరికీ ఈపాటికి అర్ధమై ఉంటుంది. నేను ఒక కోడిపెట్టని. నాలుగు రోజుల క్రితం వరకు పచ్చని పల్లెటూరులో మా అమ్మతో పాటు ఊరంతా తిరుగుతూ స్వతంత్య్రంగా బతికే దాన్ని. మీ మనుషులు తినడానికి కావలసిన కోళ్లను ప్రత్యేకంగా పెంచి పోషించే ఫారాలు ఉండగా, మా ప్రాణాలకు ఎప్పుడోగానీ హాని రాదని, హాయిగా, ఆనందంగా ఉండేవాళ్ళం. 


తినగా తినగా గారెలు చేదెక్కుతాయన్నట్లు, ఇప్పుడు మీకు ఫారం కోళ్ల రుచి తగ్గి, నాటుకోడి అని మా పీకలమీద పడడంతో, కొట్లవాళ్ళు కూడా చుట్టుపక్కల ఊర్లన్నీ గాలించి, మమ్మల్ని పట్టుకొస్తున్నారు. మేమంతా ఆలా వచ్చినవాళ్ళమే. 


లేకపోతే, నేను ఈ పరిస్థితిలో ఉండవలసిన దాన్ని కాదు. మా అమ్మ నన్ను పెట్టగానే (గుడ్డుగా) మా జాతి జ్యోతిష్కుడైన కుక్కుటేశ్వర శాస్త్రి గారు ముక్కుతో పెంట మీది ఇసుకలో రాశిచక్రం వేసి, నేను ఆమ్లెట్ గా మారకుండా పిల్లనౌతాననీ, తర్వాత కూడా 65 రోజుల గండంనుండి (65 రోజుల వయసున్న కోడిపిల్లలతో మీరేదో చికెన్ 65 అని చేసుకు తింటారటకదా!) విజయవంతంగా బయటపడి, దీర్ఘాయువుగా జీవిస్తానని చెప్పారట. 


ఈ విషయాలన్నీ తనతో పాటు ఊరంతా తిప్పుతూ చెపుతున్నపుడు మా అమ్మ కళ్ళల్లో ఏదో చెప్పలేని ఆనందం ఉండేది. ఆలా తనతోపాటు తిప్పుతూ మా అమ్మ ఇలాంటి విషయాలతోపాటు, పెంటమీద పురుగులను ఎలా వడుపుగా పట్టాలి, పట్టిన వాటిని కిందపడకుండా ముక్కున కరుచుకుని జాగ్రత్తగా తినే చోటుకి పరుగు తీయాలి, తెచ్చిన తిండిని పిల్లలందరం కలసి పంచుకుని, హాయిగా ఎలా తినాలి మొదలైన పాఠాలు కూడా చెప్పేది. 


వీటితోపాటుగా మాకన్నా పెద్ద జీవులైన పిల్లులు, కుక్కలు వంటి జంతువులతో పాటు, గద్దలు, రాబందులు వంటి పక్షులు మమ్మల్ని తినడానికి, హాని చెయ్యడానికి వస్తే, రక్షించుకోడానికి కావలసిన విద్యలు కూడా నేర్పేది. 


మళ్ళీ పెద్దగా వినిపించిన ఆర్తనాదాలతో నేను నా ఆలోచనలనుండి బయటకు వచ్చాను. మేమున్న గది చాలాభాగం అప్పుడే ఖాళీ అయిపోయింది. 


'ఒరే ఛోటూ! ఇక పై అరలోని కోళ్లు తీయడం మాని, కిందవి తియ్యరా. పైవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి. ' అన్నాడు కొట్టు యజమాని. 


'ఓహో! అలాగైతే మన ఆయుర్దాయం ఇంకొంచెం పెరిగింది' అనుకున్నాను నేను. (నా ఊహ తప్పని కొంచెంసేపటిలోనే తెలిసింది). 


యజమాని ఆదేశంతో ఛోటూ మా అర వదిలి, మధ్య అరలో చెయ్యి పెట్టి ఒక దురదృష్టజాతకురాల్ని మెడబట్టి బయటకు తీసాడు. ఇలా పూటకు ఇన్ని హత్యలు చేస్తున్న అతడు ఎంత కిరాతకంగా ఉన్నాడో చూద్దామని అతనివైపు తలతిప్పిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఛోటూ నా ఊహలకు భిన్నంగా ఉన్నాడు. పదిహేనేళ్ళు నిండని రూపం. మరీ పీలగా లేడుగానీ, కండపట్టి కూడా లేడు. కొంచెం మాసిపోయి, చిరుగులుపట్టిన ప్యాంటు, చొక్కా వేసుకున్నాడు. ఈ కాలం పిల్లలలాగే జుట్టు దుబ్బుగా ఉంచుకున్నాడు. 


ఇప్పుడో ఇకనో నీరసంతో కిందపడిపోతాడేమో అన్నట్టున్న అతనిలో నన్ను ఆకర్షించినవి అంత నీరసంలోను ఎదుటివాళ్ళ మనసులను చీల్చుకువెళ్ళే ఆ తీక్షణమైన కళ్ళు. అలాంటి కళ్ళు చాల తెలివైనవాళ్లకు, కారణజన్ములకు మాత్రమే ఉంటాయని మా కుక్కుటేశ్వర శాస్త్రి గారు చెప్పేవారు. 


చేతులోకి తీసుకున్న కోడిని మెడబట్టి చంపుతున్నప్పుడు అతని కళ్ళలో ఏ భావమూ కనబడలేదు. అతను ఇలా చంపే విద్యలో ఆరితేరి యాంత్రికంగా తయారయ్యాడా, లేక చిన్నవయసులోనే జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఇలా అయ్యాడా అనే విషయం నాకర్ధం కాలేదు. 


"ఈ మధ్య నీకు పనిమీద శ్రద్ధ తగ్గిందిరో. ఎప్పుడు చూడు పరధ్యానం, పిలవగానే పలకకపోవడం. ఇలా అయితే పనిలోనుండి తీసేస్తాను. " అరుస్తున్న యజమానితో, "లేదన్నా! కొంచెం ఒంట్లో బాగోక! అంతే. జాగ్రత్తగా పని చేసుకుంటాను, పనిలోనుండి మాత్రం తీసేయకన్నా!"బేలగా ప్రాధేయపడుతున్నాడు ఛోటూ. 


ఎంతో విశ్వాసంగా పనిచేసే ఛోటూనే అలా అంటున్న యజమానిని చూస్తే, ఏరు దాటాక తెప్ప తగలెయ్యడంలో మనుషులు ఎంత ఆరితేరిపోయారో అనిపించింది నాకు. అవునులే తమ వినోదాలకు, రాజకీయాలకు మా జాతిలోని మగజీవులను వాడుకుని, పందెం ఓడిపోగానే పలావు చేసుకు తినేది వీళ్ళే కదా! అనుకున్నాను. 


అయినా మేలుకొలిపే వాళ్ళను అంతమొందించడం ఈ జాతిలోనే ఉంది. ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఛోటూ చెయ్యి నా మెడమీదకు వచ్చింది. నా మెడ విరిచి చంపబోయే ఇతనిని చివరిసారి పరిశీలిద్దామని ఛోటూ కళ్ళలోకి చూసిన నాకు మరణసమయంలో వచ్చిన అతీంద్రియ శక్తో, ఏమో కానీ అతని కళ్ళల్లో తన ఇంట్లోని దయనీయ పరిస్థితి కనపడసాగింది. 


మంచానబడ్డ తండ్రి, తన అనారోగ్యాన్ని బయటకు చెప్పకుండా ఈడ్చుకొస్తున్న తల్లి, చదువుకుంటున్న చిన్న తమ్ముడు, ఆ తమ్ముడికన్నా పసిదైన చెల్లి అనే నాలుగుగోడల గూడులో ఇరుక్కున్న ఛోటూ కనిపించాడు. 


ఎంతో భవిష్యత్తు ఉండి, దేశానికి ఉపయోగపడగలిగే ఇటువంటి ఎందరో ఛోటూల జీవితాలు సరైన విద్యాసదుపాయాలు, శిక్షణ లేక చిన్నవయసులోనే ఇలాంటి పనులకు, కుటుంబపోషణకు అంకితమై, పరిస్థితుల కోళ్లగూడులో చిక్కుకుని మా మెడలు విరిచినట్లు విరవబడుతున్నాయి. వీటితో పోలిస్తే నా చిన్న మెడ ఎంత అని అనుకుంటూ ఉండగా ఛోటూ తన పని కానిచ్చాడు. 


సమాప్తం


నాగవరపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పాఠకుడిగా ముదిరి రచయితగా మారిన చిరు రచయితను నేను. స్వస్థలం శ్రీకాకుళం. ఉద్యోగరీత్యా 25 సంవత్సరాలుగా కర్ణాటక లోని మంగళూరు వాసం చేస్తున్న ప్రవాసాంధ్రుడిని. ఎప్పుడూ చదవడం, అప్పుడప్పుడు రాయడం అభిరుచులు.


Comments


bottom of page