top of page

పొద్దు వాలిపోతోంది


'Poddu Valipothondi' New Telugu Story




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సంధ్యాసమయం! సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు... పడమటి ఆకాశం ఎర్రగా కనిపిస్తూ సూర్యుడికి వీడ్కోలు పలుకుతోంది.


నేను వీధి వాకిట్లో నులక మంచం మీద పడుకున్నాను... పైన ఆకాశంలో అప్పుడే కనిపిస్తున్న చుక్కలు మెరుస్తున్నాయి. వీధిలో పశువులు ఇళ్ళకు వెళ్తూ ధూళిని రేపుతునాయి... అవును... ఇప్పుడు గోధూళి వేళ అయింది. ఈ పదానికి చిన్నప్పుడు నాకర్థం తెలిసేది కాదు. తెలిసే సరికి నేను వృద్ధుడనైపోయాను...


మా రైతు రాములు నా మంచం కింద దుడ్డు కర్ర, మంచి నీళ్ళ సీసా, విసన కర్ర పెట్టి వెళ్ళిపోయాడు... రెండు సంవత్సరాల నుంచీ నా దినచర్య ఇదే. నా భార్య శ్యామల నన్ను వదలి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి వంటరిగానే ఇంట్లో గడుపుతునాను. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటునారు. శ్యామల చనిపోయినపుడు వాళ్ళిద్దరూ వచ్చారు. అప్పుడు నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మనమనీ చెబితే నేను వెళ్ళనన్నాను. దాంతో వాళ్ళు కోప్పడి మారైతు రాములు కప్పచెప్పి వెళ్ళిపోయారు. నేను పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుణ్ణి కాబట్టి ఫించను 50,000 వస్తోంది. పదెకరాల పొలం వుంది. డబ్బుకి ఏ ఇబ్బందీ లేదు. కాకపోతే తోడు లేదు. వంటరి జీవితం... ఇలా ఎన్నాళ్ళు గడపాలనీ నా బాధ.


ఆలోచనల్లోంచి తేరుకున్నాను... పడమర దిక్కు వైపు మళ్ళీ చూసాను... నా జీవితం కూడా పడమర దిక్కుకి చేరుకుంది ... అంటే సంధ్యా సమయం అన్నమాట... అస్తమించడానికి ఎదురు చూసే సమయం... నేనెక్కడో చదివాను... ” పొద్దు వాలిపోతోంది”... అని.... నాది కూడా అదే స్థితి...

ఆలోచనలు మళ్ళీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వంటరితనాన్ని వెంట బెడుతుంటాయట ఆలోచనలు.


రాను రాను ఆకాశం నల్లబడుతోంది... చీకట్లు కమ్ము కొంటున్నాయి... ఊరు సద్దుమణుగుతోంది... ఒకప్పుడు మా ఊరు ఎంత బాగుండేది. యవ్వనంలో సాయంత్రం ఏటి ఒడ్డున వాలీబాల్ ఆడుకొని ఇంటి కొచ్చేసరికి అమ్మ కమ్మటి భోజనాన్ని పెట్టేది. యవ్వనం కాబట్టి ఆకలి విపరితంగా వేసేది... అందుకే ఆ భోజనాన్ని ఆవురావురు మంటూ తినేసి వీధిలోకి బాతాఖానీ కోసం వెళ్ళిపోయేవాడిని. ఊళ్ళో మా కామేశం మాస్టారి గారింట్లో మళ్ళీ మా బేచంతా గుమిగూడేది... యన్టీ ఆర్ గొప్పంటే ఏయన్నర్ గొప్పనీ, కృష్ణ డేరింగ్ హీరో అనీ చాలా సేపు సినిమా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంతలో మా మరో స్నేహితుడొచ్చి పక్క ఊరి టూరింగ్ టాకీసులో బొమ్మ మారిందని చెప్పడంతో ఆ సినిమాకి డబ్బులెలా సంపాదించాలోననీ ఆలోచనల్లో పడేవాళ్ళం.


ఆలోచనల్లోంచి మళ్ళీ బయట పడ్డాను..... తలగడ్డ సర్దుకొని ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాను...

కానీ కళ్ళు మూతలు పడటం లేదు. నక్షత్రాలు మెరుస్తూ జీవితం క్షణ భంగురం అనీ గుర్తు చేస్తున్నాయి.


నెల క్రితం దాకా నా సహాధ్యాయి వెంకట్రావ్ ఈ సమయంలో నా దగ్గరి కొచ్చేవాడు. మా పక్కిల్లే వాడిది... వాడూ, వాడి భార్యే ఉండేవారు. వాడి పిల్లలు బొంబాయిలో ఉండేవారు.

మా అగ్రహారంలో మా వీధికి మంచి పేరుండేది. చాలా మంది ఉపాధ్యాయులం ఉండేవాళ్ళం. వెంకట్రావ్ బాగా జాతకాలు, ముహుర్తాలు చూస్తాడు. నాకు పురాణాలు కొట్టిన పిండి. అందుకే సాయంత్రం పూట రైతులు మా దగ్గరికి వచ్చేవారు. రాను రాను మాకు వృద్ధాప్యం మీద పడటం, సమాజం మారిపోవడంతో కొత్త తరం వాళ్ళు మా దగ్గరికి రావడం మానేసారు . అప్పుడు నేను, వెంకట్రావ్ ఏవో కబుర్లు చెప్పకునేవాళ్ళం. కానీ నా దురదృష్టం వల్ల వాడు నెల క్రితం చనిపోయాడు.


వాడి భార్యని పిల్లలు తీసికెళ్ళిపోయారు. రాను రాను ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది . అగ్రహారంలోని ఇళ్ళన్నీ ఖాళీ అవుతునాయి. అవును... నాలాగే మా వీధికి కూడా సాయంకాలమైంది...


ఒకప్పుడు నేను చాలా గొప్ప ఉపాధ్యాయుణ్ణి... అప్పట్లో నేను ఎమ్. ఎ గణితం ఫస్ట్ క్లాసులో పాసై, బిఈడీ చేసాను. మా ఊరి హైస్కూల్లో నాకు లెక్కల మేస్టరుగా గొప్ప పేరుండేది... సాయంత్రం పూట ట్యూషన్ కోసం వచ్చే పిల్లలతో మా గుమ్మం నిండిపోయేది.


ఉదయం పూట ఎంతోమంది విద్యార్థులు, తల్లితండ్రులు తమ సందేహాల నిమిత్తం వచ్చేవాళ్ళు. నా చుట్టూ ఎప్పుడూ పదిమంది విద్యార్థులుండేవారు... క్షణం తీరికుండేది కాదు. ఎప్పుడో సంవత్సరానికోసారి తిరుపతి వెళ్ళడానికి కూడా సమయం దొరకనంత బిజీ ఉండేది.


రాను రాను సమాజంలో మార్పులు, శరీరం లో మార్పులు, పదవీ విరమణ,... ఒక్కొక్కటి నా మీద ప్రభావం చూపాయి. చివరికి నేను, శ్యామల వంటరిగా ఉండేవాళ్ళం... ఎవరైనా వస్తారేమోనని వీధి వైపు చూస్తుండే వాళ్ళం...

కానీ ఎవ్వరూ వచ్చేవారు కాదు...


ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్లు వచ్చాయి. ఖరీదైన ఫోన్ పక్క నున్నా అది ఒక్కనాడూ మోగదు... కొడుకులిద్దరికీ రోజు కొక్కసారైనా మాతో మాట్లాడటానికి సమయం ఉండదు. మేము చేస్తే కొప్పడతారు. అవసరం అయితే మెసేజ్ పెట్టమంటారు. వాళ్ళు, వాళ్ళ పిల్లల ఫొటోలు అన్నీ వాట్సాప్ లో చూడవలసిందే...


రాను రాను నిర్దూమ ధామం లోని ధూళిలా నిశ్శబ్దం పేరుకు పోతోంది. టీవీ ఒకప్పుడు బాగా చూసేవాడిని.. కానీ ఇప్పుడు అది విసుగు కలిగిస్తోంది... రాను రాను అన్నిటా విముఖత కలుగుతోంది... మనిషి ఒక్కొక్కటి విడుస్తూ వెళ్ళిపోతాడనీ ఎక్కడో విన్నాను... ప్రస్తుతం నాది అదే స్తితా?!


నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు పిల్లల్ని అమెరికా పంపడానికి లోను పెడుతుంటే నా సాటి ఉపాధ్యాయులు నన్ను తిట్టేవారు. వాళ్ళని అమెరికా పంపిస్తే నీ వార్థక్యంలో నిన్ను చూసేవాడెవరూ ఉండరు... ఇక్కడే వాళ్ళని నీ లాగే టీచర్లుగా తయారుచెయ్యి... నీకు తోడుగా ఉంటారనీ చెవిలో గూడు కట్టుకొని చెబితే వాళ్ళ మాటల్ని పెడచెవిన పెట్టాను. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను.


నాకు రోజూ పిల్లలతోనూ, మనవళ్ళతోను మాట్లాడాలనీ, వాళ్ళ జన్మదినం నాడు అభినందలు చెప్పాలని పెద్దకోరిక. కానీ అది తీరని కోరికనీ నాకు తెలుసు. తనకు తీరికున్నా వాళ్ళకుండదు...


తనకు వయసున్నప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి సమయముండేది కాదు. ఇప్పుడు సమయమున్నా వాళ్ళకి లేదు... ఇదే జీవన వైచిత్రి.

అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట గుండెల్లో నొప్పి వచ్చి మెలకువ వస్తుంది... ఊరంతా నిశ్శబ్దం... నొప్పి అనీ చెప్పకోవడానికి ఎవరూ ఉండరు... నిశ్శబ్దానికి చెప్పినా అది వినిపించుకోదు...


పోనీ పిల్లలతో చెబుదామంటే భయం అడ్డొస్తుంది ... అన్నింటి కన్నా నేను బాగా ఇష్టపడేది స్వేచ్ఛని... ఇప్పుడది లేకపోవడం పెద్ద బాధ... చిన్నప్పుడు బాధ వేస్తే చెప్పుకోవడానికి అమ్మ, తరువాత భార్య... తరువాత... ఇంకెవరూ లేరు... పిల్లలున్నా లేనట్లే... అమ్మ, భార్య ఇద్దరూ నన్ను వదలి వెళ్ళిపోయారు... బ్రతుకుని ప్రశ్నార్థకం చేసారు.


మొన్న జ్వరం వచ్చి పెద్దవాడికి ఫోన్ చేస్తే వాడు కోప్పడి నన్ను బాగా తిట్టాడు. నేను మంచులో పడుకుంటున్నాననీ, మందులు సరిగ్గా వాడటం లేదనీ, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం లేదనీ, చన్నీళ్ళు స్నానం చెయ్యవద్దనీ నన్ను బాగా మందలించాడు. వాడితో నాబాధ చెప్పకుందామంటే అదీ జరిగింది...


మళ్ళీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి. వృద్ధాప్యం ఒక శాపం అనేవాడు మానాన్న. అతన్ని నేను ఎంతో బాగా చూసుకున్నా అటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో...

మా అమ్మ తన జీవిత చరమాంకంలో ఎప్పుడూ ఒక శ్లోకం చెబుతుండేది.

“అనాయేసేన మరణం వినా దైన్యేన జీవనం” అంటే ఎక్కువ కాలం రోగంతో బాధపడుతూ మంచం పట్టకుండా చనిపోవడం, పేదరికం లేని జీవనం రెండూ గొప్పవి అనీ అర్థం .. అవి అందరికీ తేలిగ్గా లభించవు...


అయినా మనం కోరుకున్నప్పుడు మరణం రాదు... అది లలాట లిఖితం ... అది రావలసినప్పుడే వస్తుంది.

“జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ”

ఆలోచనలు క్రమంగా క్రమంగా నిద్రగా పరిణామం చెందుతునాయి... బాగా నిద్ర పట్టేసింది.

.........

ప్రభాత సమయం... లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగాను.... గుమ్మం ముందు కూర్చోగానే ఆలోచనలు మళ్ళీ ముసురుకోసాగాయి. ఇప్పుడు నా ఆలోచనల్లో మార్పు రాసాగింది...

నేను యవ్వనంలో ఎన్నింటినో త్యాగం చేసి పిల్లలను చదివించాను. వాళ్ళ సరదాలు తీర్చాను. ఉన్నదంతా వాళ్ళకే పెట్టాను.


కానీ ఇప్పుడు వాళ్ళేం చేస్తునారు. కనీసం తన గురించి ఆలోచించటం లేదు... “అపుత్రస్య గతిర్నాస్తి' అన్న సూక్తికి తూట్లు పొడుస్తూ ప్రవర్తిస్తున్నారు. తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు... శ్యామల చనిపోయే ముందు వాళ్ళు రాకపోతే “పిల్లల్ని ఎందుకు కన్నాం చెప్పండి... అవసాన దశలో మనల్ని బాగా చూసుకుంటారనే కదా... కానీ ఇప్పుడు వాళ్ళని కనీ తప్పు చేసామనిపిస్తోంది”. అనీ నాతో ఏడుస్తూ చెప్పటం గుర్తుకు రాసాగింది.


రేప్పొద్దున నేను చనిపోయినా అంతే కదా! వచ్చి ఇల్లు, పొలాలు అమ్ముకొని మా జ్ఞాపకాలేవీ ఇక్కడ లేకుండా చేస్తారు... ఆ పాటి దానికి వాళ్ళకెందుకాస్తి ఇవ్వటం? చనిపోయిన తరువాత ఆస్తి, ధనం మిగిలిపోతే మనం వాటిని అనవసరంగా సంపాదించినట్లేననీ ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.

దూరంగా చెట్టు మీద ఓ కాకి దాహంతో అరుస్తోంది...


ఈ రోజు నుంచి తను తన కోసం, సమాజం కోసం బతకాలి. The sky gets dark slowly.... ఆకాశం మసకబారే సమయం ఆసన్నమౌ తోంది. చిరు చీకటి ఆవహించే వేళ... ఇప్పుడు నేను ముందు కెళ్ళాలంటే ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటూ దారిని తేజోమయం చేసుకోవాలి. ఈ లోకంలో అనాధలకు, అన్నార్తులకు ఆపన్నహస్తం అందించాలి. వంటరితనాన్ని దగ్గరికి చేరనివ్వకూడదు... ఇక భావిజీవితాన్ని సుగంధ పరిమళంగా మార్చుకొని ముందుకెళ్ళాలి.... ఈ ఆలోచన రాగానే నాలో ఉత్సాహం ప్రవేశించింది. ఒక్కసారిగా లేచి ఏటికి వెళ్ళి స్నానం చేసాను....


స్నానం చేసి బయటకొస్తూ ఉంటే లోకమంతా అందంగా కనిపించ సాగింది. చల్లటి మలయమారుతం నన్ను కప్పేసింది. ఏరుని చూస్తూంటే ఆశ్చర్యం కలగసాగింది. గమ్యం తెలియకపోయినా గలగలా సవ్వడి చేస్తూ కొండలు, కోనల్ని స్పృశిస్తూ తన గమనాన్ని కొనసాగిస్తుంది. నేను కూడా ఈ రోజు నుంచి అలాగే చెయ్యాలి....


ఇంటికి వచ్చి మా పొలం పండిస్తున్న నలుగురి రైతుల్ని పిలిచాను. వాళ్ళు గాబరా పడుతూ వచ్చారు. నా పదెకరాల పొలాన్ని వాళ్ళ పేర రాయించిన కాగితాలు వాళ్ళకిచ్చేసాను. ఈ రోజునుంచి ఆ పొలం వాళ్ళదే... దాని మీద నాకుగాని, నా పిల్లలకు గాని ఏవిధమైన హక్కు ఉండదు. పిల్లలు బరువుని, బాధ్యతల్ని మోయడానికి గానీ ఆస్తుల్ని పంచుకోవడానికి కాదు....


ఆ మర్నాటి నుంచి పాతిక మంది పిల్లలకు ఇంటి దగ్గర చదువు చెప్పడం మొదలు పెట్టాను... స్కూల్లో పాతికమంది పేదవాళ్ళకు ఫీజుల కట్టి పుస్తకాలు, బట్టలు కొనిచ్చాను...

ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది... జీవిత గమ్యం తెలిసింది... చీకటిని తిడుతూ కూర్చుంటే వెలుగు రాదు. చిరు దీపాన్ని వెలిగిస్తేనే వస్తుంది. ఆపనే ఈ రోజు నేను చేసాను... ఇంటికి వస్తుంటే


“ఎవరో ఒకరు

ఎపుడో అపుడూ

నడవరా ముందుగా

ఆటో ఇటో ఏటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ

వెనుక వచ్చు వాళ్ళకూ బాట అయినది”

అన్న పాట గుర్తుకు వచ్చి నన్ను ప్రశాంతత ఆవహించింది.

(స‌మాప్తం)


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link




మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


66 views0 comments
bottom of page