top of page

పొలిమేర - పార్ట్ 2


'Polimera Part 2/2' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

'పొలిమేర పార్ట్ 2/2' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

దద్దానాల గ్రామం వాళ్ళు తమ ఊరి పొలిని తీసుకెళ్లి నందువల్లనే తమ ఊర్లో వర్షాలు పడటం లేదని అనిమెల గ్రామ ప్రజలు భావిస్తారు.

జాతర సమయంలో దద్దినాలనుండి పొలిని తీసుకుని రావాలని నిర్ణయించుకుంటారు.

అందుకు సమర్దుడిగా సుంకన్నను ఎంచుకుంటారు.ఇక పొలిమేర పెద్ద కథ పార్ట్ 2 చదవండి.


దద్దనాల్లో ఊరి నడింగల పెద్దేప్మాను కాడ ఊరి పెద్దలు పెద్దాడ్డి తిక్కాడ్డి బస్సిరెడ్డి చెల్లంనాయుడు తిమ్మానాయుడు కాటంరాయుడు మంచల్రాయుడు పెంటయ్య పెద్దబొట్లాచారి నామాలయ్య పోతురాజు అప్పల్రాజు సన్నన్న బుల్లెన్న సంటెన్న పాలన్న సాలన్న తలుపులన్న కొమర్రావు చిన్నారావు కన్నయ్య నల్లప్ప జాలప్ప ఆవులయ్య ఎద్దులప్పతో పాటు వూరి జనం గుమిగూడినారు.

బస్సిరెడ్డి ముందుగాల లేచి "అందరికి దండాలు. మనూర్లో ద్యావర జరిగి మూడేండ్లైతాంది. మూడేండ్ల కొకతూరి పెద్దమ్మ ద్యావర జరపడం ఆనవాయితీ. అమ్మోరి దయవొల్లా కరువుకాటకాలు ల్యాకుండా రోగంరోట్టా రాకుండా పైరు పచ్చలతో పిల్లాజల్లా చల్లంగా వుండాం. అందుగ్గాను ఈతూరి అమ్మోరి ద్యావర అందరూ కల్సికట్టుగా నిల్బడి వైబోగంగా సేచ్చాం. గాబట్టి ఎవరి వంతు వాళ్ళు పన్సేసి అమ్మోరికి ఏ కొతుకు రాకుండా జరపాల. యేదన్న వాటం (విధానం) దప్పుతే పెద్దమ్మతల్లి మాంతమైన దేవత. అన్ని ఇసయాల్లో మెల్కువగా వుండాల.


అన్నీసరే! అనిమెలోళ్ళు అమ్మోరి పొలి ఎత్తక పోవడానికి రావచ్చు. ఒగిసోలంతా జాగిరిగా ఉండాల. వాళ్ళ పొలి మనం ఎత్తకొచ్చినాంచి కరవుకాటకాల్తో అలమటిచ్చి అల్లాడి పోతాండరు. వాళ్ళు పొలి తీస్కక పోవడానికి తప్పక వొచ్చారు. ఓగన్నేసి వుండాల." అన్సేప్పి కుచ్చున్యాడు బస్సిరెడ్డి.


తిమ్మానాయుడు ఉషారుగా లేసి "ద్యావర గొప్పగా జరగాలంటే తీరువ ఈతూరి బారీగ ఏస్కోవాల! అన్నీ సరుకులు పిర్రమై పోయినై. తీరవలు రాబట్టే పని చెల్లంనాయుడికి ఒప్పగిచ్చాం. అమ్మోరికి పసుపు కుంకుమ గందోడి సాంబ్రాణి నిమ్మకాయలు టెంకాయలు నైద్యానికి సరుకులు అమ్మోరికి కొత్తగుడ్డలు అవుట్లు టపాకాయలు తెచ్చే బాద్యత కొమ్మర్రావుది. అమ్మోరి బొమ్మ సేసే బాద్యత కన్నయ్యది.


గుడి కట్టిచ్చే వంతు పెదబొట్లాచారికి. అమ్మోరి కత చెప్పే ఆసాదోళ్ళును తప్పెటోళ్ళను మెళాలోళ్ళను తుడుమోళ్ళను కొమ్మోళ్ళను దండోరోళ్ళను పురమాయించే పని అప్పల్రాజుకు. ఎక్కువ తక్కువలు బుల్లెన్న సూసుకుంటాడు. ఒగ్యాల అనిమెలోళ్ళు పొలెత్తక పోనీకి వొచ్చే కన్పెట్టడానికి కాటంరాయుడు పోతురాజోళ్ళు ఉంటారు." అన్నీ పూసగుచ్చినట్టు సెప్పి కూకున్యాడు తిమ్మానాయుడు.


ఆ ఎనక మంచాల్రాయుడు "అద్సరే! ద్యావర దున్నపోతు మూడేండ్లుగా చేలల్లోబడి ఎట్టిగా తిని ఆంబోతులా బోబల్చినాది. దాన్ని పట్టడానికీ ఎవని వొల్లాగాదు. అమ్మోరి ముందర దాన్ని నరికే మొగోడెవడో ముందది దేల్సండ్రి." అని గురుతు సేసినాడు.


నల్లప్ప నిల్బడి "ఇంగెవరూ మన పాలన్న సాలన్నలే. ఓ ఇరబైమందిని ఎంటేస్కొనిబోయి ద్యావర దున్నపోతును పట్టకొచ్చారు. అమ్మోరికి వోళ్ళే బలిచ్చారు." అనే నల్లప్ప.


జనమంతా "ఔనౌను, వోళ్ళైతేనే సరిగ్గా సరిపోతారు" చప్పట్లుగొట్టి జైకొట్టి బలపర్చినారు జనం.


అదే జనం మద్దినున్న యామయ్య పైకి లేచి " మీ ఎర్రికాకపోతే అమ్మోరికి ఆకలేమిట్రా! మీ అమాయకత్వం కూలా! పచ్చి సీయలు తినడానికి ఆమేమన్నా జంతువా? ఎందుకు ఈ జీవ హింస. ఇది మూడత్వంతో చేసే చేష్ట" అని అరిచి చెప్పినాడు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటలు గాల్లో కల్సిపోయినాయి.


* * *


యాన్మందికి సబండు కులాలకు తెలపడం ఏమనగా వొచ్చే మంగలారం మన దద్దనాల్లో పెద్దమ్మ ద్యావర జరుగుతాదని ఊరి పెద్దలు నిర్నయించినారు. అందుగ్గాను ఊరి జనమంతా యాటలు కాయకప్పూరం ద్యావరకు కావాల్సిన వన్నీ తెచ్చుకోవాల్సిందిగా తెలియజెప్పడమైందోహో!" అంటూ తప్పెట కొడ్తున్న పాపన్న చాటింపేసినాడు.


ఇన్నె ఇసయమైనా దండోర ఇనగానే జనంలో యెక్కడలేని ఉషార కమ్ముకున్యాది. పిల్లోల్లు పట్టరాని సంతోసంతో ఎగుల్లేచ్చాండరు.


ఎవరికీ వాళ్ళు ప్యాటకు పోయి గుడ్డలుగుసుర్లు ద్యావరకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్యారు. మైదుకూరు సంతకు బోయి పొట్టేల్లు మేకపోతులు కోడిపుంజులు తెచ్చుకున్యారు. ఇండ్లకు సున్నాలు రంగులు పూసుకున్యారు. ఇంటింటికి చుట్టాలుపక్కాలు పిల్చుకున్యారు. ఇండ్లకు పందిర్లు ఏసి ఇంటి ముంగిట ముగ్గులేసినారు. వూరంతా రంగురంగుల కాగితాలతో అలంకరించుకున్యారు. ఈదులన్నీ కరెంట్ లైట్లతో రాతిరి పూట గుడక పట్టపగులు తీర్న ఉండెట్టు సేసినారు. ఊరంతా సందడి సందడిగా ఉండాది.


సాలన్న పాలన్న ఇద్దరూ అన్నదమ్ములు వూరికి ఎగుదాల బూమల్లో చల్లాటకం (ఆనందంగా ఎగురుట) ఆడ్తా మేచ్చాండే దున్నపోతును పట్టకరాను ఇరవైమంది కుర్రోళ్ళను ఎంటేసుకోని బోయినారు. దున్నపోతు బాగా బల్సీ కొమ్మలు దిరిగి వుండాది. మడుస్సుల్ని సూచ్చానే ముందర్కాళ్ళు నేలకు రాచ్చా కొమ్ముల్తో మార్కున్యాది. జనాన్ని చెలిగి పారేచ్చాంది. అందరూ తలాదిక్కు ఎడంగా పరిగెత్తినారు.


పాలన్న పగ్గాన్నీ ఉరిగా సేసీ దూరం నుంచే దాని మెడకు పడేట్టూ ఇసిరేసినాడు. అది కొమ్ముల్ని దాటుకొని మెడకు బిగిచ్చుకున్యాది. అంతలోపల సాలన్న ఎనక నుంచి తోక బట్టుకొని యాలబన్యాడు. పాలన్న ముందుపక్క సాలన్న ఎనకపక్క బిర్రుగా (గట్టిగా) పట్టుకోవడం వొల్ల దున్నపోతు ఎటూ కదల్లేక బుస్సులు కొడ్తా నిలబన్యాది. ఎడంగా జరిగినోలందరూ వొచ్చి తలాదిక్కు పట్టుకొని కిందేసినారు. దున్నపోతును గుదిగాళ్ళుగట్టి గుదిగాళ్ళ మద్దిన పొడుగాటి బడెను దూర్చి బడెకు అట్ట పదిమంది ఇట్ట పదిమంది బుజాలకు ఎత్తుకొని మోసుక బోయినారు. వూరికి నడుమున్న పెద్దేప్మానుకు కట్టేసినారు. జనం కోలాఅలంగా ఉచ్చొహంగా సూడ్నీకి వొచ్చినారు.


కన్నయ్య మరికొందరు జంగమెట్టకు బోయి కుమ్మర మట్టిని తెచ్చి ఊరేలపల బొమ్మల్సత్రం బయల్న కుచ్చోని పెద్దమ్మ అమ్మోరి బొమ్మను సేసినారు. అమ్మోరి ఇగ్రహం అద్దుబుతంగా కుదిరిన్యాది. అమ్మోరిని ఎత్తైన పీటెపై నిల్పి పానపతిట్ట సేసి పట్టు చీరేగట్టి బంగారు నగలు అలంకరించ్చినాడు కన్నయ్య.


పెద్దబొట్లాచారి ఊర్లో నాల్దోవల కూడల్లో నాలగుదిట్లా నాల్గుంజలు పాతి నాల్గుంజల్ను కల్పుతూ ఎదురుకట్టెల్తో గుడి కట్నాడు. గుడికి కప్పులా కొత్త తెల్లటి సైన్ గుడ్డలు గప్పి తూర్పు దిట్టు వాకిలి బెట్టి రంగుకాగితాల్తో పూలదండల్తో అలంకరించినాడు.


అమ్మోరిని గుడిలో నిల్పడానికి ఊరిపెద్దలు, జనం మేళతాళాల్తో బొమ్మల్సత్రం కాడికి అమ్మోరిని త్యాను బయల్దేరినారు..


కన్నయ్య అమ్మోరి మోగానికి పస్పు రాసి కుంకుమ బొట్లుబెట్టి నిమ్మకాయల దండ, పూల్దండ అమ్మోరి మెల్లో ఏసి టెంకాయలు గొట్టి నిమ్మకాయలు గోసి బలిపోతును "కోబలీ" అని బలిచ్చి పీటెపై వున్న అమ్మోరిని పీటెతో సహ నన్నెత్తి పైకి ఎత్తుకొని వూరిదిట్టు కదిలినాడు.


"కళాజొగో" అంటా జనమంతా బూమి ద‌‌ద్దరిల్లేటట్టూ అర్చినారు. ఔట్లు టపాకులు కాల్చినారు. తప్పెట్లు కొట్టినారు. తుడుం వాంచినారు. కొమ్ము ఊదినారు. చిందులోళ్ళు చిందేసినారు. ఆసాదోళ్ళు అమ్మోరి కత చెప్పుకుంటా సాగినారు. ఆ యంటే కన్నయ్యా అమ్మోరితో ఎలబారినాడు. వారెనుకే జనం నడిసినారు. ఊరి నడుమున ఏర్పాటు సేసుకున్న గుల్లో అమ్మోరిని నిల్పినాడు కన్నయ్య.


పూజారి సంటెన్న అమ్మారి సుట్టూ యాప్మండలు పర్చి అమ్మోరి ముందర పెద్ద ఇస్తరేసి కుంభాకూడు అందులో కుమ్మరించి గుండ్రంగా ముద్దగా సేసినాడు. గండదీపం ఎలిగించి సాంబ్రాణి, దూపం నిప్పులపై ఏసి ఊతకడ్డీలు ముట్టించినాడు. అమ్మోరి దగ్గిర గటం (సారాయి) బెట్టినాడు. టేంకాయల్గొట్టి నిమ్మకాయలుకోసి అమ్మోరిని పూలమాలల్తో పూజించి "పెద్దమ్మ తల్లో! సల్లంగా సూడమ్మ తల్లో!" అని గెట్టిగా అరిచి మొక్కినాడు. జనంగూడ దిక్కులకు ఇన్పడేట్టు అరిచి మొక్కినారు.


ఆసోదోళ్ళు అమ్మోరి కత పాడుతున్నారు. తప్పెట్లు తుడుములు కొమ్ములు మారుమోగు తున్నాయి. టపాసులు ఔట్లు పేల్తాండాయి. చిందోళ్ళు చిందేచ్చాండరు. పులేషగాళ్ళు అడులేచ్చాండరు. కట్టె తప్పేటోళ్ళు తిప్పుతాండరు. జనం ఇరగబడి సూచ్చాండరు. ఊరంతా రద్దూ రాయబరంగా వుండాది. నడి రాతిరి ఒంటి గంట నుంచి యాటలు ఆగతీయడం మొదలైతాయి.


* * *


అనిమెల్లో సుంకన్న నిండు కడవ నీళ్ళు పోసుకున్యాడు. ఉతికిన గుడ్డలు ఏసుకున్యాడు. కుటుంబంతో కల్సి బువ్వ తిన్యాడు. ఊరి జనం ఎనకమ్మడి రాగా పోలేరమ్మ గుడికి బోయినాడు. పోలేరమ్మకు పూల్దండేసి టెంకాయ కొట్టి కప్పూరం ఎల్గించి అమ్మోరికి ఆరతిచ్చినాడు. అనుకున్న కార్యం అనుకున్నట్టు జర్గాలని మనసారా మొక్కినాడు. ఎనక్కిదిరిగి అందరి దిట్టూ సూసి దండం బెట్టినాడు. అమ్మానాయినలకు దయిర్యం సెప్పినాడు. తమ్ముడ్ని చెల్లెల్ని గుండెలకు అత్తుకొని బాగ చదువుకొని అమ్మానాయినలకు మంచి పేరు త్యావాలని బుద్దిమాటలు సెప్పినాడు.


అమ్మానాయినలు తమ్ముడూ చెల్లెలు కుమిలికుమిలి ఏడ్చినారు. ఎవరికీ కన్నీళ్లు ఆగలేదు. సుంకన్నకు యేం కాకూర్దని అందరూ ఎయ్యి దేవుల్లను ఏడుకున్యారు. ఒగ చనగాలం పగిడాలలో వుండే మేనత్త అక్కమ్మ కూతురు నేరేలమ్మ మతికొచ్చి మన్సులోనే తనుకులాడినాడు (బాధపడాడు).


"ఆమెకు పొలి తెచ్చే ఇసయం తెల్సింటే గిమగిమాంటే ( ససేమిరా) వినుకొనుండేది కాదు. సపిచ్చే (ససేమిరా) పొలిత్యాను పోనిచ్చేది కాదు" అనుకున్యాడు.


పెద ముత్తైదులు సుంకన్నకు కుంకుమ బొట్టుబెట్టి అరతిచ్చినాక దద్దనాల దిట్టు కదిల్నాడు సుంకన్న. యువకులంతా నానారకాల ఆయుదాలతో సుంకన్నను అనుసరించినారు.


అనిమెల పొలిమేర సేర్నాక -


"సుంకన్నా! దయిర్యంగా పోయిరా! నువ్వు పొలెత్తుకొని రాంగానే నీ యంటబడొచ్చిన దద్దనాలోళ్ళను మేం ఆయుదాల్తో ఎదుర్కుంటాం. నీకు పోలేరమ్మ తోడుంటాది." అని దమ్ముగా సెప్పినారు అనిమెల యవకులు.


"సరే జాగర్తగా ఇక్కడే వుండండి" అని సెప్పి తానొక్కడే ఎలబారిబోయి దద్దనాల్లో ద్యావర జరిగే గుంపులో కల్సిబోయినాడు సుంకన్న.


ద్యావర జరిగే తావున తప్పెట్లు తుడుం కొమ్ము చిందుల చప్పుల్లతో రవరవమంటూ రవద్ధూలి లేసిపోతాండది. దద్దనాలకు సుట్టుండే ఇరవై నాల్గు పల్లెలు ద్యావరకు రావడంతో జన సముద్దరం లాగుండాది వూరంతా.

ఇంటియింటి నుంచి బోనాలు పొట్టేల్లు మేకపోతుల్తో మేళతాళాల్తో ఊరేగింపుగా చిందు తొక్కుకుంటా అమ్మోరి అంచుకొచ్చి పూజారి సంటెన్నకు బోనాలిచ్చి పొట్టేన్లు మేకపోతుల్ను చెట్లకు మాన్లకు కట్టేచ్చాండరు జనం.


సంటెన్న వోల్ల దగ్గిర్నుంచి బోనాలు కాయకప్పూరం నిమ్మకాయలు పస్పుకుంకుమ పూల్దండలు తీస్కుంటుండాడు.


రాతిరి నడిజాము దాటి ఒంటి గంటైనాది. యాటలు బలీయడం మొదులు బెట్నారు. యాటకొడవళ్ళు కనుమాటి గంగమ్మ ద్యావర్లో కొనకొచ్చినారు. యాటకొడళ్ళు మాంచి పదున్తో వుండాయి.


ముందు మొక్కుబడి బస్సిరెడ్డిది. ఆయప్ప యాటనే నరికినారు. ఆయప్పెనుక తిమ్మనాయుడిది. ఆతరువాత మంచాల్రాయుడు చిన్నయ్య పోతురాజు జాలప్ప సన్నన్న బుల్లారావు వొర్సగా వోళ్ళ వోళ్ళ యాటల్ని నరికినాక వూరందరియీ ఒకటెనుక ఒకటి యాటల్ని నరుక్కుంటా వుండారు. యాటను నరికేబ్బుడు జనం"కోబలి" అని ఆకాసం అంటేలా అరుచ్చాండరు. సంటెన్న యెవరి యాటను నరకినబ్బుడు వోళ్ళ టెంకాయగొట్టి వోళ్ళ బోనం కూడు అమ్మోరికి పెట్టి మిగతాది వోళ్ళకే ఇచ్చాండడు.


ఊరందరీ యాటలై పోయేసరికి నెత్తురు కాల్వలై పారినాది. యక్కడ్సూసిన రనారగతం. నరికిన యాటల్ని కొందరు దగ్గిరలోని చెట్లకు యాలదీసి చర్మాల్ని ఒలిచి కడుపులో బండారం (లివర కిడ్నీలు హర్ట్ లంగ్స్ బోటి) తీసి కసురు కడిగి దట్యాలను (చర్మం తీసిన కళేభరాలు) యింటికి తీస్కపోతాండరు. అప్పటికి తెల్లార్జాం నాలుగైంది. ఇంగ పొలిబలిచ్చినాక ఆసాదోడు కుంభాకూడు రగతం చాటలో కల్పి ఊరిసుట్టూ పొలి సల్లాల. పొలి సల్లేబ్బుడు పక్కూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా ఆయప్పకు కాపలాగా పక్క వూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా యంటంబడి కుర్రోళ్ళంతా ఈటెలు యాటకొడవళ్ళు గండ్రగొడ్డెళ్ళు తీస్కొని కోబలీకొబలీ యని అర్చుకుంటా పరిగెత్తి పోతారు. అమ్మోరిని తెల్లారక తలికే వూరి పొలిమేరలో ఇడిచిపెట్టి రావాల!


సాలన్న పాలన్న ఓ ఇరవై మంది దున్నపోతును పట్టకొచ్చినారు. దున్నపోతు బుస్సలు కొడ్తాంది. కోమ్ముల్తో కుమ్ముతాంది. దున్నపోతును అమ్మోరి దగ్గిరికి తీస్కొచ్చి ముందర పదిమంది యనక పదిమంది ఇరగ బట్టుకున్యారు. పాలన్న పదునైన బారీ యాటకొడవలి తీస్కొని దున్నపోతును నరకడానికి సిద్దంగా నిలబన్యాడు. అన్న సాలన్న తమ్ముడు పాలన్నకు నరికే వాటం సెబుతాండడు.

"దున్నపోతు మెడమీద ఇక్కడ నరుకుతే సులబంగా తెగిపడ్తాది" అని ఏలుబెట్టి చూపినాడు."సరే"నని పాలన్న నరకడానికి యాటకొడవలి పైకెత్తి బిర్రుగా బలంగా పట్టుకున్యాడు. పాలన్న కండ్లు ఎర్రబడి భీకరంగా కన్పడ్తాండడు. అబ్బుడు సీమ చిటుక్కుమంటే ఇనబడేట్టు సప్పిడి సేయకుండా ఉండారు జనం. అందరిలోనూ ఏమైతుందో ఎలావుతుందోనని జనం బిర్రాబిగిచ్చుకొని నోటమాటరాక ఊరక సూచ్చాండరు. అంత పెద్ద జీవాన్ని నరకడమంటే మాటలు కాదని జనం బయం.


తమ్ముడు యెక్కడ తప్పోతాడో యని సాలన్న మల్లొక తూరి "ఇక్కడ.. ఇక్కడ.. సరిగ్గా ఇక్కడ నరకు" అని తన తలను దగ్గిరికి సాపి ఆత్రంగా సూపబోయాడు. అన్న అట్టా మల్లా సెబుతాడని తెలీక అబ్బుడే పాలన్న ఉషారుగా చురుగ్గా ఉద్రేకంగా ఒక్కయేటున నరిక్యాడు.


అంతే! దున్నపోతు తలకాయతో పాటు అన్న తలకాయ కూడ తెగి అమ్మోరి ముందర పన్యాది. పజలందరూ సూచ్చాండంగానే చనంలో ఇంత గోరం జర్గిపోయినాది. సంతోసంగా జర్గుతాండే ద్యావర ఇసాదంగా మారినాది. ఏడుపులు పెడబొబ్బులతో ఆచోటంతా గోలగోల అయినాది. సాలన్న పెళ్ళాం మరిడమ్మ కూతురు ఈరినమ్మ కొడుకు మోదుగులయ్య రోదన అలివి కాలే. వలవలా ఏర్చి నెత్తి నోరు బాదుకుంటుండారు. పాలన్న ఏడుపును ఏదనను ఎవరూ ఆపల్యాక పోయినారు.


"పాలన్నా! నీదేం తప్పు లేదురా! మీయన్నా రొండోతూరి సెబ్బుతాడని నీకు తెలీక నరికినావు. పొర్పాటు నీదికాదు. తీరా నరికేప్పుడు సెప్పడం మీయన్నా సేసిన పొర్పాటు. ఐనా అలా జరగాలని వుందేమో! మడుసులం మనకేం తెల్సు? అందుకే జరిపోయినాది. బాదపడి లాబం లేదు. నువ్వు నిబ్బరించుకొని నీ వదినను పిల్లల్ను ఓదార్చు" వూరి పెద్దలంతా చెప్పి నెమ్మది పర్చినారు పాలన్నను.


పెద్దలంతా అబ్బటికబ్బుడు పెద్దమ్మ మాన్యం బూముల్ని శాసిపితంగా సాలన్న కుటుంబమే సేద్యం సేసుకొని బతకొచ్చని నిర్నయం తీసుకున్యారు.


ఇట్టాటి పరిచితి ఉండగానే సుంకన్న సిన్నగా జనాన్ని తొలగదొబ్బుకొని అమ్మోరి గుడి దగ్గిరకొచ్చి అమ్మోరికి మొక్కి, పార్తాండే నెత్తురు కుడికాలికి పూసుకొని జనం ఎలపలికి వొచ్చినాడు. ఊరిసుట్టూ పొలి సల్లక తలికే పొలి ఎత్తక పొవాలని సుంకన్నకు ముందుగాలనే తెలుసు.

బయలుకు వొచ్చిన సుంకన్న"అర్రరోయ్! మీ వూరి పొలి మా వూరికి ఎత్తక పోతాండా రోయ్!" అనీ గెట్టిగా కేకేసి అనిమెల దిట్టు ఉడాయించినాడు సుంకన్న. అంత గందరగోళంలోనూ కాటంరాయుడు సుంకన్న మాటలు ఇన్యాడు. చనాల్లో తేరుకొని జనాన్ని యవకుల్ని సమాయత్త పరచినాడు. యువకులంతా యాటకొడ‍ళ్ళు మచ్చుకత్తులు ఈటెలు గండ్రగొడ్డెళ్ఫు తీస్కొకొని సుంకన్నను యంబడించినారు.


వూరి యెలపల వడివడిగా ఉరికెత్తుతాండడు సుంకన్న. పొలిమేర ఐదు కిలోమీటర్లు వుండాది. దద్దనాలోళ్ళు కేకలేసుకుంటా యంబడించి వొచ్చాండరు. సుంకన్న చిక్కకుండా కాలికొద్దీ పరిగెడ్తాండడు. ఆ పరుగులో పట్టుదల కన్పడ్తాండది. కాటంరాయుడు అతని మడుసులు "ఎలాగైనా దద్దనాల పొలి అనిమేలకు పోగూడ్ద"ని సుంకన్నను యంటాడుతా వొచ్చాండరు.


"ఏమైనా పొలి అనిమేలకు చేర్చాల" ని పరుగులో ఏగం పెంచినాడు సుంకన్న. మొదటి మైలురాయి దాట్నాడు.


“నరకూ! పొడచూ! కోబలీ”యని దద్దనాలోళ్ళ అరుపులు కేకలు వీపెనుకే ఇనపడ్తాండయ్ సుంకన్నకు. సుంకన్నను పట్టుకోవడానికి కాటంరాయుడు, పొలిని పొలిమేర చేర్చడానికి సుంకన్న బిస్సగా పరిగెడ్తాండరు. సుంకన్న రెండవ మైలరాయి దాట్నాడు. సుంకన్న పరిగెత్తే ఏగంలో తలగుడ్డ ఎగిరిపోయినాది. చొక్కా ఊడిపోయినాది. పంచ రాలిపోయినాది. బనిగెను డ్రాయరు మాతరమే వొంటి మీద వుండాయి.


"పానం పోయినాసరే పొలిని మాతరం అనిమేలోళ్ళకు అందిచాల" సుంకన్న దుడంగా నిర్నయించు కున్యాడు. మూడవ మైలురాయి గూడా దాటుకున్యాడు. కాటంరాయుడి గుంపు అందుజాపులకు వొచ్చాండాది. యారముట్లు ఇసుడ్తాండరు. ఈటె సుంకన్న ఎడమపక్క రాసుకుంటా బోయినాది. గొడ్డెలి కుడిదిట్టు ఇసురుకుంటా బోయినాది. మచ్చుకత్తి తలకాయ మీద ఎంటికలు తగులుకుంటా బోయినాది. ఐనా సుంకన్న పరుగు తీచ్చానే వుండాడు.


నాలగోవ మైలురాయి గూడా చావుజంపుల దాట్నాడు. కాటంరాయుడోళ్ళు కిందామిందా పడ్తా వొచ్చాండరు. సుంకన్న శాయసత్తుల పరిగెత్తుతానే వుండాడు. ఇంగా అనిమెల పొలమేర ఇరవై అడుగులే వుండాది. సుంకన్న ఉద్దేగంగా అడుగులు ఏచ్చాండడు. పొలిమేరలో వున్న అనిమెలోళ్ళు "రా.. సుంకన్నా! పరిగెత్తు.. సుంకన్నా!" అంటూ సేతులూపుతా అరుచ్చాండారు. అందరిలోనూ బయాందోలన సోటు సేసుకున్యాది.


ఇంతలోపల పొలిమేర పదడుగులు ఉందనగా దద్దనాలోళ్ళు సుంకన్నను అందుకున్యారు. కాటంనాయుడు అటాత్తుగా బయానకంగా సుంకన్నను యాటకొడవలితో తలకాయ నరికినాడు. తల ఎగిరి ఆంత దూరం పన్యాది. ఆ తావంతా రానారగతమైనాది. ఐనప్పటికీ మొండెం పరిగెత్తుతాపోయి అనిమెల పొలిమేర అవతల పన్యాది.


బెడిల్ బెడిల్ అని ఉరిమినాది. పెటిల్ పెటిల్ అని మెరుపు మెరిసినాది. ఆ మెరుపు వెలుగులో పొలి రాసుకున్న కాలు అనిమెల పొలిమేరలో పడి ఉండడాన్ని దద్దనాలోళ్ళు అనిమెలోళ్ళు సూసి ఆచర్యపన్యారు.


"సచ్చి సాదించినాడు రా..! మొగోడు రా..! వీరుడు రా..!" అనుకుంటా ఎనిక్కి ఎలబారినారు దద్దనాలోళ్ళు సేసేది ఇంకేమి లేక.


ఉరుం మీద ఉరుం, మెరుపు మీద మెరుపు మెరిసినాది. మోడాలు గుంపులు గుంపులు కొండలెక్క ఆకాసంలో పరిగెత్తా వొచ్చాండయ్. పుల్లచినుకుల్తో మొదలు బెట్టిన వాన జడివానగా మారి దడిగట్టి నిలకురిసినాది. ఒక వీరుడు మరణించినందుకు ఓపలేని బాద అందర్లో అలుముకున్యాది.


అందరితో పాటు పొలిమేరలో వున్న జంబులన్న"మీ మూర్ఖత్వానికి ఒక మంచి మనిషిని బలి తీసుకున్నారు కదరా!" అని విపరీతంగా బాదపన్యాడు.


సుంకన్న శవాన్ని ఏడ్చుకుంటా! తలలు బాదుకుంటా! తడ్చుకుంటా! మోసుకొని పోయినారు అనిమెలోళ్ళు.

దప్పికగొన్న బూములు దప్పిక దీడ్చుకున్నాయి. పానంబోయిన చెట్లు చేమలు పానం బోసుకున్నాయి. అన్ని జీవరాసులు ఊపిరి పోసుకున్నాయి. యేరు పారినాది చెరువులు కుంటలు నిండినాయి. దొరువులు దొర్లినాయి. అలుగులు పొర్లినాయి. పొలాలన్నీ పచ్చదనం నింపుకున్యాయి. అనిమెలకు మల్లా ఆకుపచ్చ కళొచ్చినాది.

వానలు పడడమూ, పడకపోవడమూ సహజమైనా.. జనం వాన కోసం ప్రయత్నించినపుడు వానలు పడితే మూడనమ్మకాలకు బలం పెరుగుతుంది


========================================================================

***సమాప్తం***

========================================================================


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
24 views0 comments

コメント


bottom of page