top of page
Original.png

పోరు బరి

#GadirajuMadhusudanaRaju, #గాదిరాజుమధుసూదనరాజు, #పోరుబరి, #PoruBari, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Poru Bari - New Telugu Story Written By Dr. Gadiraju Madhusudana Raju Published in manatelugukathalu.com on 04/02/2026

పోరు బరి - తెలుగు కథ

రచన: డా. గాదిరాజు మధుసూదనరాజు


"తప్పు చేశావే! శ్రీలీలా"


అంది స్వాతి తన స్నేహితురాలిని ప్రేమగా గట్టిగా కౌగలించుకుని గాఢంగా నిట్టూరుస్తూ


"ఏమిటే బర్త్‌డే చేసుకోవటం తప్పంటున్నావా? లేక ఇలా ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని పిలిచి ఆడంబరంగా చేసుకోవటమా?"


"అబ్బ! అదేమీ కాదే. అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆ దాట్ల ధనంజయ్ వాళ్ళ అమ్మానాన్నలతో మీ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వద్దు అన్నావట!"


"ఏం, నీకు కంప్లైంట్ చేశాడా?"


"అవునే!


మీ అమ్మానాన్నలు కూడా 'ఓకే' అన్నారట కదా!"


"చూడవే! చిన్న బర్త్‌డే కూడా ఫ్రెండ్స్, పేరెంట్స్ లేకుండా జరుపుకోవటం నాకు

ఇష్టం ఉండదు. ఇక బతుకుమొత్తం అందరికీ దూరంగా నేను ఊహించుకోలేను.

ఆ బ్రతుకు నేను బతకలేను. అందుకే బ్లంట్‌గా రిజెక్ట్ చేశాను." అంటూ నిట్టూర్చింది శ్రీలీల.


**


"తప్పుచేశావే! శ్రీలీలా" అంది మెడికో భార్గవి పెళ్లికూతురుని చూస్తూనే ప్రేమగా గట్టిగా కౌగలించుకుని గాఢంగా నిట్టూరుస్తూ


కల్యాణ మంటపం డెకరేషన్ చూస్తే పాన్ ఇండియా సినిమా సెట్టింగ్‌తో పోటీ పడుతున్నట్లుంది.


ఒంటి నిండా బంగారంతో శ్రీలీల కూడా ఏదో గొప్ప జువెలరీ కంపెనీకి ప్రమోషన్ ఇస్తున్న యాంకర్లా కనిపిస్తోంది.


కిలకిల మంటూ నవ్వుతూ ఓ అమ్మాయిల గ్రూప్ వచ్చి శ్రీలీల, స్వాతిల మధ్య దూరి ఏదో చిలిపి ఈవెంటు లాంటిది నడిపించి అల్లరి చేశారు.


మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు, ఫ్యాకల్టీ మొత్తం రావటంతో కల్యాణ మంటపం కాస్తా తెల్లకోట్ల తళతళలతో అదేదో మెడికల్ కాన్ఫరెన్స్ సభా ప్రాంగణంలా మారిపోయింది.


"ఏమిటే, ఇదీ?


మెడిసిన్ పూర్తి కాకుండానే మధ్యలో ఈ పెళ్లి ఏంటి?"


ముస్తాబు అవుతూ బ్యూటీషియన్ ముందు... గదిలో దొరికిన శ్రీలీలను నిలదీసింది మెడికో భార్గవి.


"అయ్యో భార్గవీ!


ఇంట్లో పెద్దల ప్రమేయం అనివార్యం. వారి నిర్ణయం మాకు అనుసరణీయం.


మా సామర్లకోట నాన్నమ్మకి చదువులంటే ఇష్టం. ఆ చదువుల బరిలో వేస్తే అన్నీ ఫస్ట్ క్లాస్‌లే కదా! గెలిచాను అలా.


ఇప్పుడు మా రాజంపేట అమ్మమ్మ కోసం... సంసారం బరిలోకి దూకక తప్పలేదు, ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు."


"మరి కాలేజీకి ఎలావస్తావ్? కనీసం నీ కాబోయే భర్తది మన డాక్టర్ ప్రొఫెషన్ అయినా పరవాలేదు, అదీ కాదు... బ్యాంక్ అఫీషియల్. పోనీలే అనుకుంటే, మన ఇండియా వారి బ్యాంక్ కూడా కాదు, అదేదో డచ్ బ్యాంక్ అట కదా. ఇబ్బంది పడతావేమో ఆలోచించవే!"


" నిజమేనే భార్గవీ! మా కాబోయే శ్రీవారు మంచి వారిలా ఉన్నారు...


పెళ్లికి తరువాత నేను మెడిసిన్, ఇంకా పీజీ కూడా చదువుకున్నా, ఉద్యోగమే చేసినా, ప్రాక్టీస్ చేసినా అభ్యంతరం చెప్పమన్నారే వారు.


మా క్షత్రియ కమ్యూనిటీలో పెద్దల మాటకు కట్టుబడటం మా సంస్కృతి. అంతే!"


"సంస్కృతి కాదే! అది పిచ్చి!! ఇంత చదువు చదువుకుని నీవూ ఆ పిచ్చిలో పడతావా? ఆలోచించవే శ్రీలీలా!"


"అది పిచ్చి అయినా, ఆ పిచ్చే నాకూ ఇష్టం! నీవు బాధ పడకు భార్గవీ." అంటూ భార్గవి బుగ్గలు నిమిరి శాంతింప చేసింది శ్రీలీల నవ్వుతూ.


**


పెదాలపై వాపు, ఎర్రని గాయం. కందిపోయిన ముఖం. కమిలిపోయిన కంటిపాప.


ఎర్రగా గూడుకట్టి, నెత్తుటి ముద్దలా మారిపోయిన ఎడమ కన్ను!


ఒళ్ళంతా... హూనం!


తడిమిచూసే కొద్దీ తడుముతున్న చేతులకు తగులుతున్న ఉబికిన గాయాల ఆనవాళ్లు!


చూస్తూనే భోరున ఏడ్చింది మెడికో భార్గవి, శ్రీలీల హాస్పిటల్ బెడ్ పై కనబడగానే.


కాసేపు మాట్లాడి, ఏదో గుర్తుకు వచ్చిన దానల్లే బయటికి వచ్చి స్వాతికి ఫోన్ చేసింది భార్గవి.


అంతే!


అరగంటలో ప్రత్యక్షమైంది స్వాతి.


"ఏమిటే ఈ ఘోరం?


పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు కదే శ్రీలీలా?," అంటూ గుండెలకు హత్తుకొని కన్నీరు పెట్టుకుంది.


"ఇలా చేశారేంటి అంకుల్? హాయిగా చదువు కుంటున్న దాన్ని..." ప్రశ్నించింది స్వాతి.


అక్కడే ఎదురుగా నిలబడ్డ శ్రీలీల తండ్రి వర్మగారు ఆమె కళ్ళకు కనబడటంతో


"అవునమ్మా! స్వాతీ! నీ ఫ్రెండ్‌కి అన్యాయమే జరిగింది! వాళ్ళు డబ్బుకు ఆశపడి సంబంధం చేసుకున్నారు. వేధింపులు మొదలు పెట్టారు. బంధుత్వాలు, ఆత్మీయతలు అన్నీ నాటకాలేనమ్మా!"


"అదేంటి అంకుల్, మీరు అలా చూస్తూ వదిలేస్తారా! మా నాన్న డి.ఎస్.పి కదా! ఆయన మీ ఫ్రెండ్ కదా, పోలీస్ కేసు పెట్టండి. వాళ్ళ అంతుచూడండి!"

ఆవేశంతో ఊగిపోయింది స్వాతి.


"డాక్టర్లు కూడా గాయాల్ని చూసి హత్యా యత్నంలా కనిపిస్తోంది అంటున్నారు.

కేసు పెడదామని అంటే! అది విడాకులకు దారితీయొచ్చు, అలా విడాకులు తీసుకోవటం ఇష్టం లేదు" అంటూ మీ ఫ్రెండ్ శ్రీలీల కేస్ పెట్టటానికి ఒప్పుకోవటం లేదు. నీవైనా మీ ఫ్రెండ్‌కి చెప్పమ్మా!" అంటూ ప్రాధేయపడుతున్నట్లు స్వాతి చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకొన్నాడు శ్రీలీల తండ్రి వర్మ.


**


"తప్పు చేస్తున్నావే శ్రీలీలా!


నా మాట విను!


ఆ రోజు గుడ్డిగా నమ్మి ఈ రాక్షసుడిని పెళ్లి చేసుకున్నావ్.


వాడు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను కాలేజీకి పంపలేదు..." అంటున్న స్వాతి మాటలు పూర్తి కాకముందే ఆమె చేయిపట్టుకొని...


"ఆయన్ని అలా 'వాడు-వీడు' అనకే. నాకు నచ్చదు" అంది శ్రీలీల నీరసంగా మూలుగుతూ.


అంతలోనే అక్కడికి వచ్చిన మెడికో భార్గవితో "నీ వైనా చెప్పు! దీనికి ఏదో పిచ్చి పట్టినట్లుంది. ఏదైనా మర్లుమందు లాంటిది పెట్టాడేమో దీని మొగుడు.

డాక్టర్ అయ్యే యోగమున్న జీవితాన్ని... ఇలా పేషెంట్ స్థాయికి దిగజార్చిన వాణ్ణి గురించి ఇంకా గౌరవంగా మాట్లాడమంటోంది" అంటూ బుసలు కొట్టింది స్వాతి.


" స్వాతీ! శ్రీలీల మొండిది నీకు తెలుసుగా! దీని అత్తవారింటిలో దీని భర్తగారి ప్రవర్తన... అత్త, మామ, మరదులు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ అనుమానాస్పదంగానే

ఉన్నాయిట. కానీ తన అమ్మానాన్నలకి, తమ్ముడికి కూడా తెలియకుండా 'ఇంటి గుట్టు' అంటూ దాచిపెడుతూ ఫోజు కొడుతోంది. దేవుని దృష్టిలో మంచి దానిగా నిలవాలి అనీ! ఇదో గొప్ప ఇల్లాలిగా గెలవాలి అని కలలు కంటోంది." అంది మెడికో భార్గవి అసహనంగా.


"నీవు చార్టెడ్ అకౌంటెంటు కోర్సులో చేరాక, వర్మగారూ, మా ఫ్యాకల్టీతో పాటు మెడికోలము కొందరం... శ్రీలీలను కాలేజీకి పంపమని అడిగేందుకు వాళ్ళ అత్తవారింటికి చాలాసార్లు వెళ్ళాం. ప్రయోజనం లేకపోయినా... వాళ్ళ పక్కింటి వాళ్ళ వలన దాని అత్తింటి రాజ వైభవం గురించి మాత్రం చాలా తెలిసింది.


అదేమంటే శ్రీలీల శ్రీవారికి ఓ ప్రియురాలు, అట్లే వాళ్ళ మామకి కూడా ఓ వంటింటి ప్రియురాలు ఉన్నారు అని. అలా ఆ యింట్లో మగ వాళ్ళకి 'కమిట్‌మెంట్లు' ఉండటం అదో గొప్ప రాజ లక్షణం అనీ!!"


"అమ్మో భార్గవీ! శ్రీలీలకు తెలుసా?"


"తెలిసినా ఎవ్వరికీ చెప్పక పోవటం ఆ ఇంటి ఇల్లాలి మహా పతివ్రతా లక్షణం కావచ్చు. అది కూడా చెప్పడం లేదు!


ట్రీట్‌మెంట్ అయిపోగానే... వాళ్ళ అత్తారింటికే వెళుతుందిట అది. దాని ఖర్మ. అది అంతే!" అంటూ కన్నీరు పెట్టుకుంది భార్గవి.


ప్రక్కనే ఉండి వింటూ ఆగలేక...


"స్వాతీ! భార్గవీ! మీకూ, మా అమ్మానాన్నలకూ నామీద ప్రేమ ఉంది. నా భవిష్యత్ గురించి చింత కూడా ఉంది. కాదనను!


కానీ... వృథా!


నేటి టెక్నాలజీలతో స్కానింగ్, స్క్రీనింగ్, ఇంకా ఏవేవో పరీక్షలు చేసి


మనుషులలోని జబ్బులను, అవయవాలలోని లోపాలను కనిపెట్టవచ్చు.


ఎలాగోలా నయం చేయొచ్చు.


కానీ మనసులోని లోపాలను అలా కనిపెట్టలేం.


ఈ హాస్పిటళ్ళలో బాగుచేయలేం.


వాటిని కనిపెట్టి ఎవరిలో ఏ లోపాలు ఉన్నా పట్టుబట్టి ఆలుమగలే ఒకరి లోపాలను ఒకరు పోరాడి బాగుచేసుకోవాలి. అంతే!


ఈ గాయాలు మానిపోతాయి అని నేను నమ్ముతాను!


చెడు 'కమిట్‌మెంట్ల' రోగాలు నయమవుతాయి


అని నేను నమ్ముతాను!


కాలంతో పాటుగా... అలాగే


మనుషుల బుద్ధులు కూడా


క్రమంగా మారుతాయి


అని నేను నమ్ముతాను.


మా గోదావరివారి కోడి పందేల బరిలో చూడు! రెండు కేజీల బరువు కూడా లేని కోడి రెండు కోట్లు గెలిచింది!


గెలిచింది ఎర్ర కోడి అయినా, ఓడిన తెల్ల కోడి కూడా అంతకన్నా గొప్పగా చూపరుల మనసుల్ని గెలుచుకుంది!!


ఎందుకో తెలుసా?


తెల్లగా ఉన్న ఆ కోడి మొత్తంగా రక్తం తో తడిసి ముద్దయి ఎర్రని రంగులోకి మారినా... చివరి దాకా పోరాడి ఒడి బరిలో ఒరిగిపోయిందే కానీ పారిపోలేదు. ముఖంలో విసుగు, బెదురనేదే కనబడలేదు... అందుకే అది కూడా సూపర్ స్టార్ అయ్యింది" అంటూ


ఇద్దరు స్నేహితురాళ్ల కళ్ళల్లో కన్నీళ్ళు చూసి, లేని


శక్తిని కూడా తీసుకొని లేచి కూర్చొని, అంత బాధలోనూ, చిలిపిగా నవ్వుతూ


తన సెల్‌ఫోన్‌లో ఓ వీడియో చూపించింది, ఏదో చెప్పింది.


కానీ వాళ్ళు ఏడుస్తూనే వెళ్ళిపోయారు.


**


చదువుల పోరు బరి


తదుపరి


...ఉద్యోగాల పోరుబరి


తదుపరి


సంసారాల పోరుబరి


అన్నీ కలసిన బతుకుపోరుబరి...


దశాబ్దాలు గడిచిపోయాయి మరి.


**


అమెరికా నుండి బెంగళూరు ఎయిర్‌పోర్టులో


దిగింది స్వాతి.


దిగిన వెంటనే ఆ విషయం తెలియగానే గుండెల్లో


ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది ఆమెకి.


తనతో పాటు అమెరికాకు రమ్మంటే రాలేదు ఆ మొండి ఘటాలు.


అయినా...


ఇండియాలో బెంగళూరులోనే ఉన్న తన తమ్ముడు!


మరో డాక్టర్ అమ్మాయినే పెళ్లి చేసుకుని, పెద్ద హాస్పిటల్‌లో గొప్ప కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న తన తమ్ముడు!!


మంచి పొజిషన్‌లో ఉండి కూడా


తన కన్న తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో


పెట్టాడన్న విషయం అప్పుడే తెలిసింది ఆమెకి.


**


ఓల్డేజ్ హోమ్‌లో అడుగుపెట్టింది స్వాతి.


ఎదురుగా శ్రీలీల!


పంచలాల్చీలో వెండి రంగులో మెరిసిపోతున్న ఉంగరాల జుత్తుతో ఆమె ప్రక్కన ఆమె భర్త!!


జంటగా అక్కడ అలా కనిపించటంతో


" ఏవిటే శ్రీలీలా? మీరూ ఓల్డేజ్ హోమ్‌లో చేరారా?"


అంటూ ఆశ్చర్య పోవటం ఆమె వంతయింది.


" మీ అమ్మానాన్నలు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు వాళ్ళను చూద్దువుకాని, పద."


అంటూ స్వాతిని వారి గది వైపుకు నడిపించింది ఆమె.


" మీ ఫ్రెండ్ శ్రీలీల మమ్మల్ని నీలాగే కన్న కూతురిలా ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటోంది."


అంటూ శ్రీలీల వైపు చూపిస్తూ ప్రేమగా కౌగలించుకున్నారు పేరెంట్స్ స్వాతిని.


"ఏమిటే శ్రీలీలా! మన క్లాస్‌మేట్స్, మీ మెడికల్ కాలేజీ మేట్స్‌తో గెట్ టుగెదర్ ఏమైనా ఏర్పాటు చేశావా?"


అంటూ ప్రశ్నించింది స్వాతి... రూమ్ బయటకు రాగానే అక్కడ కనిపించిన


వాళ్ళందరినీ చూస్తూ ఆశ్చర్యంగా.


"మా అందరి పేరెంట్స్ ఈ ఓల్డేజ్ హోమ్‌లోనే


ఉన్నారు.


అంతే కాదు మన శ్రీలీల పేరెంట్స్, అత్తామామలు కూడా ఇక్కడే ఉన్నారు."


అంది డాక్టర్ భార్గవి నవ్వుతూ.


"తప్పు చేశావే, తప్పుచేశావే అంటూ


మనం ప్రతిసారీ శ్రీలీలను ఎన్నోసార్లు తప్పుపట్టాం.


కానీ ఇప్పుడు తన మరదులు, తోడికోడళ్ళు వదిలేసిన అత్తామామల్ని, తన తమ్ముళ్ళు వదిలేసిన తన అమ్మానాన్నల్ని తానే ప్రేమగా చూసుకుంటూ మెప్పుపొందుతోంది"


అంటున్న భార్గవి మాటలు పూర్తి కాకముందే


"మా అందరి పేరెంట్స్ దృష్టిలో కూడా అదో దేవత మరి" అంది డా. పవిత్ర నవ్వుతూ.


"మా తమ్ముళ్ళు, పిల్లలు కూడా అబ్రాడ్‌లోనే ఉన్నారు... వాళ్ళ దృష్టిలో మాత్రం మేము వాళ్ళ మాట వినని మొండి ఘటాలం"


అన్నాడు శ్రీలీల భర్త ఆనందవర్మ ఏదో తప్పు


జరిగిపోయినట్లు భార్య వైపు తిరిగి చూపి నిట్టూరుస్తూ.


"అయితే నీవు వెళ్లొచ్చుగా, వెళ్ళరా!"


అన్నాడు ఆనందవర్మ గారి తండ్రి బంగార్రాజు కలుగజేసుకుంటూ.


"వాళ్లకి నచ్చకే కదా యిక్కడ మమ్మల్ని వదిలేసి పోయారు. దాగలేదు కదరా ఇంటిగుట్టు, పరువు పోయింది. ఇక నీవు మాట్లాడకు. నా కోడలు శ్రీలీల మా పాలిటి దేవత! కాబట్టి క్షమించి భరిస్తోంది" అంటూ అరిచింది తల్లి భద్రావతీ దేవి, కొడుకు మాటల్ని విని తట్టుకోలేక గదిలోంచి.


" విన్నావా స్వాతీ! ఆ అత్తగారి మాటలు?


శ్రీలీల జీవితంలో గెలిచిందే!


మనకీ, మన పేరెంట్స్‌కీ అది దేవత అయ్యింది!


మనం ఎవ్వరం చేయలేని పని అది చేస్తోంది.


ఇది ఓల్డేజ్ హోమ్ కాదు.


అది తీర్చిదిద్దుకున్న ప్రేమ మందిరం.


శ్రీలీల ఇలా పెద్దల సేవలో తరించి పోతోంది."


డాక్టర్ భార్గవి కళ్ళల్లోనే కాదు. ఆ మాటలు వింటున్న తల్లిదండ్రులు, పిల్లలు... అందరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు జాలువారాయి.

***


డా. గాదిరాజు మధుసూదనరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు

 కృతజ్ఞతలు నమస్సులు

నేను  సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.

నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page