'Poti' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
'పోటీ' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“సార్! ఈ రోజు 6 గంటలకు మనం టౌన్ హాలుకి వెళ్ళాలి. అక్కడ "పాటే ప్రాణం" రియాల్టీ షోలో జరగబోయే ఫైనల్స్ పోటీకి మీరు ముఖ్య అతిథి" అని గుర్తు చేసాడు నా పియ్యే రఘు. అప్పటికి ఐదైంది. వెంటనే బయటకొచ్చి తౌను హాలుకి బయలుదేరాను; దాని ముందు నా కారు ఆగగానే నిర్వాహకులు బయట కొచ్చీ నన్ను లోపలికి తీసి కెళ్ళారు. ఇంతలో మైకు లోంచి ఆ కార్యక్రమ ప్రయోక్త “ముఖ్య అతిథి కలెక్టర్ గారు వచ్చేసారు. ఇప్పుడు వారిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను” అనగానే హాలంతా చప్పట్లతో మారుమ్రోగి పోయింది. నేను వేదిక మీదకు చేరుకునేసరికి ఆ కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడైన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు చక్రధర్ వచ్చి నన్ను తీసికెళ్ళాడు. ఆ తరువాత నేను, అతనూ మిగతా వారంతా జ్యోతి ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం మొదలైంది.. కలెక్టర్ ఉద్యోగంలో నెలకు కనీసం ఓ పదిసార్లైనా రక రకాల కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొనవలసి ఉంటుంది. ఈ రోజు పాటల పోటీ కాబట్టి నాకు ఈ కార్యక్రమం మీద ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు పాటలు పాడేవాడిని. సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ దాన్ని మధ్యలో ఆపేసి చదువు మీద ధ్యాస పెట్టడంతో అది అసంపూర్తిగా ముగిసిపోయింది. నేను 10వ తరగతి దాకా రెండు మూడు సార్లు పాటల పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి ఫైనల్స్ వరకూ వచ్చాను కూడా. ఆ రోజు ప్రేక్షకులందరూ నాకే ప్రథమ బహుమతి వస్తుందని అనుకున్నారు. ఆ కార్యక్రమం నిర్వహించింది అప్పటి ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాకు ఏ బహుమతీ రాలేదు.. దాంతో ఆ రోజు కార్యక్రమం రసాభాస అయింది.. నిర్వాహకుల్ని కొందరు పాఠకులు బహుమతుల నిర్ణయాన్ని పునః పరిశీలించమని ఘర్షణకి దిగారు.. మొత్తానికి నాకది అసంతృప్తిని మిగిల్చింది. వేదిక మీద కార్యక్రమం మొదలు కావడంతో నేను ఆలోచనల్లోంచి బయట పడ్డాను. పోటీలో నలుగురు గాయకులు పాడటం మొదలు పెట్టారు.. మూడు రౌండ్లు.. ఒక్కొక్క రౌండులో ఒక్కొక్క రకం పాటలు.. మొదటి రౌండులో మాధురీ ప్రధానమైన పాటలు.. అంటే మెలోడీ సాంగ్స్.. రెండవ రౌండులో జావళీలు.. మూడవ రౌండులో పాత యుగళ గీతాలు. ప్రతీ రౌండ్లో గాయకులందరూ మంచి మంచి పాటలను ఎంపిక చేసుకొని పాడేరు.. పాట తరువాత ప్రయోక్త చక్రధర్ ఆ పాట రచయిత గురించి, దాని నేపథ్యం గురించి, ఆ ట్యూను కి మూలకారణమైన పాత పాటలను, సంగీత దర్శకుడి గొప్పతనాలను వివరిస్తుంటే అందరూ ఆసక్తిగా ఆలకించడాన్ని నేను గమనించాను. అలా రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి ఆ పాటల రియాల్టీ షో ముగిసింది. ఇంక ఫలితాల సమయం వచ్చింది. ఇంతలో నాకు మా జాయింట్ కలెక్టర్ శ్యామ్ నుంచి ఫోన్ వచ్చింది; ఒక మండల ముఖ్య పట్టణంలో అగ్నిప్రమాదం జరిగిందనీ, తాను బయలుదేరి వెళుతున్నట్లు చెప్పాడు; నేను వెంటనే గడియారాన్ని చూసాను; ఇంకా కార్యక్రమం పూర్తి కావడానికి అరగంటకి పైగా సమయం ఉంది. నాకు త్వరగా వెళ్ళి ఆ అగ్నిప్రమాదాన్ని పర్యవేక్షించాలని ఉంది. కానీ కార్యక్రమం మధ్యలో వెళ్ళిపోవడం మంచిది కాదని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఫలితాలు ప్రకటన కొద్దిగా ఆలస్యం అయింది. ముగ్గురు న్యాయనిర్ణేతలు, చక్రధర్ మధ్య ఏకాభిప్రాయం కుదరక చాలా సమయం వృథా అయింది. చివరికి ఫలితాలు ప్రకటన చెయ్యడానికి చక్రధర్, ఆ న్యాయ నిర్ణేతలు ముగ్గురూ మైకు దగ్గరికి వచ్చి ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఫలితాలను ప్రకటించారు. కానీ నాతో సహా చాలామంది. ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది ఆశించినట్లు అద్భుతంగా పాడి మొదట బహుమతి వస్తుందనుకున్న అబ్బాయి “శ్రీవత్సకు ప్రథమ బహుమతి కాకుండా కన్సొలేషన్ బహుమతి రావడం చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. దాంతో ఆ అబ్బాయి తల్లితండ్రులు, స్నేహితులు చక్రధర్ తోను, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వాహకుల్తోనూ వాదనకి దిగారు. అది చిలికి చిలికి గాలివాన అవుతుండటం నాలో అసహనాన్ని పెంచింది. కొద్దిసేపటికి తరువాత ఆ ఛానల్ హెడ్ ని పిలిచి జరిగిన విషయాలను కనుక్కున్నాను. “ముగ్గురు న్యాయనిర్ణేతలూ ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల ఆ కార్యక్రమ ముఖ్య ప్రవక్త అయిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడైన చక్రధర్ కల్పించుకొని విజేతల్ని నిర్ణయించాడనీ, అది పోటీలో పాల్గొన్న వారికి అనుమానాలు రగిలించి ఘర్షణకి దారితీసిందనీ చెప్పారు. ప్రథమ బహుమతి వస్తుందనీ ఎంతో ఆశపడ్డ 'శ్రీవత్స' అనే కుర్రవాడు కంటనీరు పెట్టుకోవడంతో అతని స్నేహితులు, తల్లితండ్రులు చక్రధర్ని గట్టిగా నిలదియ్యడం, మరికొంతమంది చక్రధర్ ని సమర్థించటం ఇవన్నీ అక్కడ ఘర్షణ వాతావరణాన్ని కలుగజేసాయి. నేను ఆ పోటీలో పాల్గొన్న నలుగురు పిల్లల తల్లితండ్రుల్ని పిలిచి సర్ది చెప్పటంతో వారంతా రాజీకి వచ్చి బహుమతి ప్రధానానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత విజేతలకు బహుమతి ప్రధానోత్సవం మొదలైంది. ముందుగా చక్రధర్ ప్రసంగిస్తూ “ఈ కార్యక్రమాన్ని నేను 4 సంవత్సరాలైంది అవిఘ్నంగా నిర్వహిస్తున్నాను. అందుకు నాకీ అవకాశం ఇచ్చిన ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతున్నాను; ఇది పాటల పోటీ కార్యక్రమం; పోటీ అంటే ఘర్షణ కాదు; పిల్లల్లో ఉండే కళను, సృజనాత్మకతను, సంగీత స్వర జ్ఞానాన్ని వెలికి తీసి వాళ్ళను ఔత్సాహిక గాయకులుగా తయారు చెయ్యాలనే ఒక చిన్న ప్రయత్నం; అంతే తప్పా వాళ్ళ మధ్య స్పర్ధను రగిలించి అసూయను పెంచి శతృత్వాన్ని కలిగించాలని కాదు. మన పెద్దలు 'స్పర్ధయా వర్ధతే విద్యా' అన్నారు. స్పర్ధ ఉంటేనే విద్య వర్ధిల్లుతుంది.. స్పర్ధ అంటే ఘర్షణ పడటం కాదు; ఈ రోజు జరిగిన సంఘటనని మీరంతా గమనించి ఉంటారు.. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహం. తమ పిల్లలకే ప్రథమ బహుమతి రావాలనీ, లేకపోతే తమ పరువుకి భంగం కలుగుతుందన్న వాళ్ళ బలహీనత; రాత్రి పగలూ ప్రథముడిగా నిలవాలని విపరీతంగా సాధన చేసి ఈ రోజు అది రాకపోయేసరికి పోటీలో పాల్గొన్న పిల్లలు నిరాశకి గురయ్యారు. ఈ సమయంలో పిల్లలకు, వాళ్ళ తల్లితండ్రులకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే “ఇది పోటీ కాదు.. దీనిలో ప్రథమ బహుమతి రానంత మాత్రాన చిన్నతనం కాదు. ఏ పోటీలోనైనా, పరీక్షల్లోనైనా ఒక్కరికే ప్రథమ స్థానం దక్కుతుంది. అంతమాత్రాన మిగతావాళ్ళకి ఆ స్థాయి లేదని కాదు. ఓటమిని గెలుపుకి నిచ్చెనగా మార్చుకోవాలి.. ఓటమి అన్నది ఆలస్యమైన గెలుపు' అంటారు; విజేతలను ఆ రోజు పాట పాడే క్షణాన వాళ్ళు కనబరిచే ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతల విచక్షణతో నిర్ణయించబడుతుంది తప్పా ఇందులో ఏ విధమైన రాగద్వేషాలు ఉండవు; ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారిని ప్రసంగించ వలసిందిగా కోరుతున్నాను" అంటూ నన్ను ఆహ్వానిస్తూ నమస్కారం పెట్టాడు; నేను వేదిక ఎక్కగానే హాలంతా చప్పట్లు.. ఒక్కసారి హాలు వైపు చూసాను; హాలంతా ప్రేక్షకులతో కిక్కిరిసి పోయి ఉంది. "అందరికీ నమస్సుమాంజలి; ఈరోజు జరిగిన పాటల పోటీ నిజంగా వీనులకు విందు కలిగించింది. అందుకు నిర్వాహకులకు, పోటీలో పాల్గొన్న వర్ధమాన గాయనీ గాయకులకు అభినందనలు.. కానీ తదనంతరం జరిగిన సంఘటన నన్ను బాధకు గురి చేసింది. ఇది ఏ విధంగానూ అభిలషణీయం కాదు.. తనకే ప్రథమ బహుమతి రావాలనీ, తనే అందరికన్నా ముందుండాలన్న కోరిక తప్పు కాదు; అది వచ్చేవరకూ ప్రయత్నించాలే తప్ప రాలేదన్న ఆవేశం పనికిరాదు; తమ అపజయానికి కారణాలను విశ్లేషించుకుని తరువాత వాటిని సరిదిద్దుకొని మళ్ళీ గమ్యం వైపు సాగిపోయే వాళ్ళని విజయం వెతుక్కుంటూ వస్తుంది. అందుకు స్వీయ నియంత్రణ ముఖ్యం; గెలుపు రానంత మాత్రాన నిరాశ పడకూడదు.. 'అగాథమౌ జల నిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాలా మరుగున దాగీ సుఖమున్నదిలే; ఏదీ తనంత తానే నీ దరికిరాదు; శోధించి సాధించాలి అదియే ధీరగుణం' అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. నేను కూడా చిన్నప్పుడు గాయకుడినే ; సంగీతమంటే ప్రాణం; ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాను; అంత చిన్న వయసులో అకస్మాత్తుగా వచ్చిన కీర్తి నా కళ్ళను కప్పేసి అహంభావం కలిగించింది; కానీ ఒకరోజు నేను పరాజయం పాలయ్యాను; ఒక్కసారిగా అగాథంలోకి తోసివేయబడ్డట్లు భ్రమించి లోకాన్ని ద్వేషించడం మొదలు పెట్టాను; కానీ కొద్ది రోజుల తరువాత నా అంతచ్ఛక్షువులు తెరుచుకొనీ నాకు దిశానిర్దేశం చేసాయి; స్వీయ లోపంబులను తెలుసుకున్నవాడు గొప్పవాడవుతాడనీ మా తండ్రిగారు చెప్పేరు; ” చెబుతూ మధ్యలో కొద్దిసేపు మౌనం దాల్చేను. ఐదువేల మంది వీక్షిస్తున్న హాలంతా నిశ్శబ్దం.. కింద సూది మొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం.. అందరూ నేనేం చెబుతానో అన్న ఉత్సుకతో చూస్తున్నారు.. “అప్పుడు నేను నా గమనాన్ని మార్చుకున్నాను; మన అపజయాలకు ఇతరులను ద్వేషించడం మాని వాటిని సరిదిద్దుకుంటే విజయం తనంతట తానే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది; నేను నాకెంతో ఇష్టమైన సంగీతాన్ని విడిచిపెట్టి చదువు మీద ధ్యాస కేంద్రీకరించాను. అందులో విజయాన్ని సాధించి ఐయ్యేయస్ లో ఉత్తీర్ణుడినయ్యాను; నాకు ఆరోజు ప్రధమ బహుమతి వచ్చి ఉంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చే అవకాశం ఉండేది కాదు; నేను ఇదంతా చెబుతున్నది స్వోత్కర్ష కోసం కాదు; మీ అందరికీ దిశానిర్దేశం చెయ్యాలనే ఉద్దేశంతో; కాబట్టి ఎవరైతే గెలుపు ఓటమిల్ని సమానంగా స్వీకరించి తమ లోపాల్ని విశ్లేషించుకుంటారో వాళ్ళు విజయ తీరాలను చేరుకుంటారు” అని నేను చెప్పగానే హాలంతా చప్పట్ల హెూరుతో కొద్దిసేపు మారుమ్రోగింది. ఆ తరువాత గెలిచిన వారికి బహుమతుల్ని ప్రధానం చేసి వేదిక దిగిపోతుంటే ఇందాక ప్రథమ బహుమతి రాలేదని ఘర్షణకి దిగిన అబ్బాయి శ్రీవత్స , అతని తల్లితండ్రులు నా దగ్గరకు వచ్చి తమ తప్పుని దిద్దుకుంటామని చెప్పి నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పారు; వాళ్ళని చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి. (సమాప్తం) |
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments