ప్రకృతి ఒడిలో ప్రేమ ప్రయాణం
- Pulletikurthi Nagesh

- Apr 7
- 5 min read

ప్రకృతి మధ్యలో గడిపే కొన్ని క్షణాలు మన జీవితంలో చిరస్థాయిగా నిలుస్తాయి. అలాంటి ఒక అందమైన ప్రేమ ప్రయాణం… కానీ ఆ ప్రయాణం వెనుక ఒక గుండెను కదిలించే నిజం దాగి ఉంది.
Prakruthi Odilo Prema Prayanam - Emotional Love Story | Pulletikurthi Nagesh
ప్రకృతి ఒడిలో ప్రేమ ప్రయాణం - భావోద్వేగ ప్రేమ కథ | పుల్లేటికుర్తి నగేష్
Published In manatelugukathalu.com On 07/04/2026
అబ్బా .. మనం ఇద్దరం ఇలా ఏకాంతంగా ఇంత ఆహ్లాదమైన ప్రకృతి వఒడిలాంటి ఇంత ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో కదా రాజేష్
"అవును కదా... ఈ గాలి, ఈ పక్షుల కిలకిలరావాలు, కళ్ళముందు కనిపిస్తున్న ఈ పచ్చని కొండలు నిజానికి అవి నల్లగా కనిపిస్తున్నాయి ఇంకా పూర్తిగా వెలుతురు రాలేదు ... అంతా ఒక కలలా ఉంది.
ఈ క్షణం కోసం నేను కూడా ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో నీకు తెలియదు." ఐషు
రాజేష్ గొంతులో ఒక రకమైన తృప్తి, అదే సమయంలో ఏదో తెలియని ఒక చిన్న నిట్టూర్పు వినిపించాయి.
అతను పక్కనే ఉన్న గడ్డి మీద కూర్చుని దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ ఇలా అన్నాడు...
"పట్నం ఉరుకులు పరుగుల జీవితంలో, ఆ ఫైళ్ళ మధ్య, మీటింగ్‌ల మధ్య అసలైన జీవితాన్ని మర్చిపోయామనిపిస్తోంది.
కానీ ఇక్కడికి వచ్చాక, నీ పక్కన ఇలా కూర్చుంటే... కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది." కదా
నిజమే రాజేష్, కాలం ఆగదు కానీ... ఇలాంటి క్షణాలు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి.
ఆ పట్నం గోల, ట్రాఫిక్ సౌండ్లు ఏవీ ఇక్కడ లేవు.
కేవలం ఈ ప్రశాంతత, నువ్వు, నేను ... అంతే!" ఐశ్వర్య గొంతులో లోతైన అనుభూతి.
అప్పుడే కొండల వెనుక నుంచి సూర్యుడి తొలి కిరణం మెల్లగా బయటకు వస్తోంది.
అంతసేపు నల్లగా కనిపించిన ఆ కొండలు, ఇప్పుడు బంగారు రంగులోకి మారుతున్నాయి.
ఆ వెలుతురు ఐషు ముఖం మీద పడగానే ఆమె కళ్లలో ఒక వింత మెరుపు కనిపించింది.
రాజేష్ చాలా అబ్బురంగా ఐశ్వర్య ని చూస్తున్నాడు.
ఏంటి అలా చూస్తున్నావ్? ఇదే మొదటిసారి అన్నట్లు.
అవును నిన్ను మొదటి సారి కాలేజీ లో చూసినప్పుడు ఎలా వున్నావో? ఇప్పటికీ నీలో అందం ఏమాత్రం తగ్గలేదు సరికదా.. కొంచెం పెరగాయి కూడా..
అన్నాడు రాజేష్ చిన్నగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ.. బుగ్గలు బూరెలలా పొంగించి .. ఆటపట్టిస్తున్నట్లు
ఐశ్వర్య ముఖ్యం కొంచెం ఎర్రబడింది.. పైనుండి వస్తున్న సూర్యునిలా..
మరి.. ఇద్దరు పిల్లలు పుడితే ఆమాత్రం బరువు పెరగమా..
నువ్వు ఒకరిద్దరిని కంటే తెలుస్తుంది... ఆ వేవిళ్లు, వాంతులు, శరీరం బరువు, కాన్పు కష్టాలు, కాన్పు తరువాత మా కష్టాలు అంటూ చెప్తుంటే..
వద్దు తల్లీ ఇప్పుడు అవన్నీ.. మా బాధలు మాకు వుంటాయి వదిలేయి అన్నాడు రాజేష్ రెండు చేతులు జోడిస్తూ నాటకీయంకా..
ఐషు ఆ వెలుతురుని ఆస్వాదిస్తూ, "రాజేష్, చూస్తుంటే ఏదో మాయలా ఉంది కదా? ఈ ప్రకృతి మారుతున్న తీరు...
మన జీవితాలు కూడా ఇంతే కదా, ఒక్కోసారి చీకటిగా, ఒక్కోసారి వెలుగుగా!" ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా..
అంది నిశ్శబ్దంగా.
ఐషు ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ రాజేష్ భుజంపై తల వాల్చింది.
రాజేష్ అన్న మాటలు విన్నాక, ఆమె మొహంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది.
"నిజమే రాజేష్.. ఆ పట్నం గోడల మధ్య మనం ఒకరినొకరు చూసుకోవడమే కష్టమైపోయింది. కనీసం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకని రోజులు అవి.
కానీ ఇక్కడ.. ఈ కొండల మధ్య, ఈ చల్లని గాలిలో.. మళ్ళీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి," అంది ఐషు.
రాజేష్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
చుట్టూ ఉన్న చీకటి మెల్లమెల్లగా విడిపోతోంది.
దూరంగా పక్షుల అరుపులు మొదలయ్యాయి.
రాజేష్, ఐశ్వర్య ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీ క్లాస్ మేట్లు, ఇద్దరు మంచి కుటుంబాల నుండి వచ్చిన వారు..
ఐదు సంవత్సరాలు ప్రేమలో పడి, మునిగి, తేలి తరువాత కష్టం మీద పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అన్యోన్యమైన జంట అని చెప్పవచ్చు.
ఇద్దరు పిల్లలు. ఇద్దరూ విద్యాధికులు అవడం మూలాన, వాళ్ళ ఉద్యోగ జీవితాలలో బిజీ గా వుండడం మూలాన ఇద్దరికీ ఇంత ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశాలు చాలా తక్కువ.
మనం మన జీవితంలో బాగా స్థిరపడి మన పిల్లల్ని మంచి ఉన్నత స్థానాలకి తీసుకెళ్లాలి రాజేష్.
అవును పాప ని సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ చేద్దాం.
బాబుని మంచి డాక్టర్ ని గాని, ఇంజనీర్ ని గాని చేద్దాం ఐషు.
మంచివి అంటే అవేనా ఇంకేమీ లేవా.. రాజేష్..
అయినా మనం మన ఇష్టాలని వాళ్ళ పై మన తల్లి తండ్రులు లా రుద్దవద్దు. వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళని ఎంచుకొనిద్దాం.
ముందు వాళ్ళిద్దరినీ హాస్టల్ నుండి ఇంటికి తీసుకొ చేద్దాము.
మనం సమయం ప్లాన్ చేసి మనమే పెంచుదాం. అంతే గాని అలా పిల్లలు దూరంగా హాస్టల్ లో వద్దు.
ఇలా ఇద్దరు ఒక ప్రక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకో ప్రక్క తమ భవిష్యత్తు గురించి తన్మయం తో డిస్కషన్ లో మునిగి వుండగా..
ఏదో గుర్తొచ్చినట్లు ఐషు గొంతులో ఒక చిన్న మార్పు.. "కానీ రాజేష్, మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఈ ప్రకృతిని చూడటానికే కాదు కదా?
అయినా మనం ఇక్కడ ఎందుకు వున్నాం.. మనం బయలుదేరిన పని ఏంటి మనం చేస్తున్న పని ఏంటి.
రాజేష్ ఒక్కసారిగా ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోయాడు.
"అవును ఐషు... మనం అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? గుర్తుందా?" అని అడిగాడు.
ఐషు ఆలోచనలో పడింది. తనలో తాను మాట్లాడుకున్నట్లు "మనం... ఆఫీస్ పని మీద రాత్రికి రాత్రి అర్జెంట్‌గా ఆ పక్క ఊరికి బయలుదేరాం కదా రాజేష్?
వద్దు వద్దంటూనే రాత్రి ప్రయాణం కి బయలుదేర దీసావు.
అంతా ఘాట్ రోడ్డు ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించినట్టు ఉంది...
ఆ తర్వాత అంతా చీకటి. కళ్ళు తెరిచి చూసేసరికి మనం ఈ అందమైన లోయలో ఉన్నాం."
అవును నాకు కూడా అలానే గుర్తు వుంది. ఘాట్ రోడ్డు దిగుతున్నప్పుడు చీకటిలో రోడ్డు సడన్ గా మలుపు తిరిగింది.
ట్రాఫిక్ సైన్ బోర్డు లు ఏమీ లేకపోవడం తో నేను గమనించలేక పోయాను.
అప్పటికి టర్నింగ్ లో అదుపు చేయడానికి ప్రయత్నించాను
కానీ..
కారు లోయలోకి జారి నట్లువుంది .. కొంచెం డామేజ్ అయి వుంటుంది.
ఫర్వాలేదు. పోతే పోయింది.. ఇన్షూరెన్స్ వస్తుంది లేదంటే ఇంకోటి కొనికకోవచ్చు అన్నాడు రాజేష్ కొంచెం ధైర్యంగా.
అలా నడుచుకుంటూ రోడ్డు పైకి వచ్చారు ఇద్దరూ..
అప్పుడే దూరం నుండి 'సైరన్' వినిపించింది. ఒక అంబులెన్స్ వేగంగా వచ్చి కొండపై రోడ్డు పక్కన ఆగింది.
రాజేష్, ఐషు ఇద్దరూ కుతూహలంతో రోడ్డు పైకి వచ్చి చూశారు.
అక్కడ కారు నుజ్జునుజ్జయి పడి ఉంది.
ఏదో ఆక్సిడెంట్ లా ఉంది. చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు.
స్ట్రెచ్చర్ మీద రెండు మృతదేహాలను అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు.
ఐషు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "రాజేష్... చూడు, ఆ అమ్మాయి సరిగ్గా నా లాగే ఉంది! నేను వేసుకున్న డ్రెస్సే తను కూడా వేసుకుంది..." అని వణికిపోతూ అంది.
రాజేష్ ఆ పక్కనే ఉన్న మరో మృతదేహాన్ని చూసి తెల్లబోయాడు.
"అవును ఐషు... ఆ పక్కన ఉన్నది నేను!
అది నా కారు... నా వాచ్..." అన్నాడు కొంచెం భయంతో అరిచినట్లు...
ఒక్కసారిగా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఆ చల్లని గాలి ఇప్పుడు భయంకరంగా తోస్తోంది. తాము ఇక ఈ లోకంలో లేమని, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది కేవలం తమ ఆత్మలేనని వారికి అర్థమైంది.
అంబులెన్స్ తలుపులు మూసుకుని వెళ్ళిపోతుంటే, రాజేష్ ఐషు చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
ఇంతలో ఎవరో “అబ్బా… కాలికి తగిలింది రా…నొప్పి..
జాగ్రత్తగా నడువు. ఎవడో ఈ ఇనుప బోర్డు కోసేసి తీసుకెళ్లాడు అనుకుంటా..
ఇలాంటి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ కూడా వదలరురా మన వాళ్ళు… కోసుకుని తీసుకెళ్లి వందో రెండు వందలకు అమ్ముకుని తాగడం....
ఇది ఉండి ఉంటే… బహుశా ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో కదా…”
“మంచి భవిష్యత్తు ఉన్న ప్రాణాలు… ఇలా ఒక్కసారిగా గాలిలో కలిసిపోతున్నాయి రా…”
ఆ మాటలు విన్న ఐశ్వర్య గొంతు తడి ఆరిపోయి, పీలగా..
అంటే రాజేష్ మనం .. మనం.. చనిపోయామా ?
నిజంగా చనిపోయామా అంది అమాయకంగా..
అలా అమాయకగా అడుగుతున్న భార్య ముఖ్యం చూసి రాజేష్ కి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు..
అలానే వుంది ఐషు అన్నాడు రాజేష్ కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ..
అవును ఐషు అలానే వుంది..
రాజేష్ మరి మన పిల్లలో? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు పెంచుతారు? ఎలా పెరుగుతారు?
మనం లేకుండా వాళ్ళ భవిష్యత్తు ఎలా వుంటుంది రాజేష్? ఇప్పుడే కదా మనం అనుకున్నాము?
వూరుకో ఐషు. బాధ పడకు. మన పేరెంట్స్ చూసుకుంటారు ఇంక. మనకి తప్పినా వాళ్ళకి తప్పదు కదా.. అంటూ ఐశ్వర్య ని రాజేష్ ఓదారుస్తున్నాడు.
"కనీసం... ఆఖరి క్షణంలోనైనా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం కదా ఐషు," అన్నాడు రాజేష్ కళ్ళల్లో నీళ్లతో.
మనం బ్రతికున్నప్పడు ఒకరికి ఒకరు ఇవ్వలేని సమయం, ప్రశాంతత, మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఇలా ఆత్మలుగా మారిన తరువాతయినా ప్రకృతి ప్రసాదించింది ఐషు..
ప్రస్తుతానికి మనల్ని కలిపే వుంచింది ప్రకృతి. చూద్దాం ఎందుకో?
సూర్యుడు పూర్తిగా పైకి వచ్చాడు వెలుతురు బాగా వచ్చింది.
ప్రక్కకి చూస్తే ఐశ్వర్య లేదు..
ఐషు ఎక్కడ వున్నావ్? సమాధానం లేదు..
రాజేష్ ఎక్కడ వున్నావ్? ఐషు గొంతులో ఆదుర్ద .. రాజేష్ నుండి సమాధానం లేదు..
ఇలాంటి ప్రమాదాలు, ప్రేమలు, ఆందోళనలు, అనురాగలు ఎన్నో తన ఒడిలో దాచుకున్న ప్రకృతి, సమాధానం చెప్పదు, చెప్పినా మనకి అర్ధం కాదు, అర్ధం అయినా మనం పట్టించుకోము. అదే మన నిర్లక్ష్యం. ఏం కాదులే అనే పనికిరాని మనిషి ధీమా..
సమాప్తం
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం




Comments