విమాన ప్రయాణం

Vimana Prayanam - Telugu Inspirational Story | Dr. C. S. G. Krishnamacharyulu
విమాన ప్రయాణం - తెలుగు ప్రేరణాత్మక కథ | Dr. C..S.G . కృష్ణమాచార్యులు
Published in manatelugukathalu.com on 11/09/2026
విమాన ప్రయాణం — హాస్యరసభరిత తెలుగు కథ
తొలిసారి విమానంలో ప్రయాణించబోతున్నప్పుడు కలిగే ఉత్సాహం, విమానాశ్రయంలో ఎదురయ్యే కొత్త అనుభవాలు, ప్రయాణంలో జరిగే సరదా సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఆసక్తికరంగానే ఉంటాయి. డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు రచించిన ‘విమాన ప్రయాణం’ కథలో రిషి అనే యువ క్రికెటర్ తొలి విమాన ప్రయాణాన్ని హాస్యభరితంగా, వ్యంగ్యాత్మకంగా చిత్రించారు.
ఈ హాస్యరసభరిత తెలుగు కథను చదువుతూ రిషి అనుభవాలతో పాటు, జీవితంలో ఎదురయ్యే నిరాశలను ఎలా అధిగమించాలో తెలుసుకోండి.
రిషికి జీవితంలో తొలిసారిగా విమాన ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై, ఇంగ్లాండ్‌లో జరిగే సిరీస్‌లో అతను ఆడబోతున్నాడు. ఆ ఆనందంతో అతని మనసే ఆకాశంలో విహరిస్తుండగా, తన గర్ల్‌ఫ్రెండ్ పూజతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయం ప్రయాణికుల సందడితో కిటకిటలాడుతోంది. లోపలికి వెళ్లే ముందు, ప్రవేశద్వారానికి కొద్ది దూరంలో పూజ దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి రిషి ఆగాడు.
రిషి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని, “నువ్వు అదృష్టవంతుడివి రిషీ. ఆ అదృష్టానికి కష్టాన్ని జోడిస్తే గొప్ప ఆటగాడివవుతావు. అక్కడ అమ్మాయిలకు సైట్ కొట్టడం కాదు... బంతిని చూసి సిక్సర్లు కొట్టాలి. చిల్లర వేషాలు వేశావంటే నీకూ నాకూ రామ్ రామ్!” అంది పూజ.
రిషి నవ్వుతూ, “ఇంగ్లీష్ అమ్మాయిలు చాలా లిబరల్‌గా ఉంటారని, బాగా ఆడితే ముద్దులకు నో చెప్పరని మా సీనియర్ చెప్పాడు. అందుకని నువ్వు ఇప్పుడొక లిప్ కిస్ ఇచ్చేయ్. దాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ ఏ అమ్మాయి వైపూ చూడను,” అన్నాడు.
“అదే నా భయం! అలాంటి ముద్దులతో నీ దృష్టి బంతి మీద నుంచి అమ్మాయిల మీదకు మళ్లిపోతుంది. గుర్తుంచుకో... ఈ వయసులో ఎంగిలి ముద్దులకు ఆశపడితే, నీ క్రికెట్ జీవితం ఎంగిలి ఆకులా మారిపోతుంది!” అంటూ పూజ పెడమొహం పెట్టింది.
రిషి నవ్వుతూ, “అలగకు పూజా! ఇదిగో చూడు... నా పర్సులో నీ ఫొటో ఉంది. నన్ను భయపెట్టడానికి అది చాలు!” అన్నాడు.
ఆ మాటకు పూజ ముసిముసిగా నవ్వింది. “సరే, వెళ్లి సిక్సర్లు కొట్టు. ప్రతి సిక్సరుకి ఒక ముద్దు ఇస్తాను. అక్కడ చిల్లర వేషాలు వేయకు!” అంది.
“పెదవి మీదేగా?” అంటూ రిషి చిలిపిగా అడిగాడు.
పూజ అతని మాటలకు తల అడ్డంగా ఊపింది. “ఇప్పుడే వద్దని చెప్పానా? పెదవుల మీద కాదు. బంతిని చూసిన కన్నులపై; బ్యాట్ పట్టుకున్న చేతులపై; పరుగులు తీసిన పాదాలపై.”
“నువ్వు ఎప్పుడూ ఇంతే. కోరికలు వద్దనే బుద్ధూవి నువ్వు,” అన్నాడు అలక నటిస్తూ.
అతనికి బదులిస్తూ పూజ అంది. “సాధించాల్సింది చాలా ఉంది రిషీ. ముందుగా మన కలలను గెలిపించుకుందాం. నీవు క్రికెటరుగా, నేను ఉద్యోగినిగా స్థిరపడ్డ తర్వాత అన్నీ పెదవి ముద్దు రోజులే.”
రిషి ఆమె మాటలకు నవ్వి, “ఆ మాటనే నేను గుర్తుపెట్టుకుంటా!” అన్నాడు.
సమయం మించిపోతుండటంతో రిషి లోపలికి వెళ్లాడు. పూజ కూడా చిరునవ్వుతో చేయి ఊపుతూ “ముంబైలో దిగాక ఫోన్ చెయ్యి” అంటూ వీడ్కోలు పలికింది.
విమానాశ్రయంలో ప్రయాణికులను అనుమానితుల్లా చూస్తారని, వారి గుర్తింపు పత్రాలు పరిశీలించడంతో పాటు, మారణాయుధాల లాంటి బ్లేడు, చాకు, కత్తెర వంటి వాటి కోసం కూడా తనిఖీ చేస్తారని ముందే ఎవరో చెప్పడంతో రిషి అప్రమత్తంగానే ఉన్నాడు.
ప్రవేశద్వారం దగ్గర బొద్దుగా ఉన్న సెక్యూరిటీ గార్డు నిలబడి ఉన్నాడు. అతని గుండ్రటి ముఖం చూస్తే చైనా బొమ్మ గుర్తుకొచ్చింది.
“ఐడీ!” అన్నాడు అతడు గంభీరంగా.
రిషి వెంటనే డిజిలాకర్‌లోని ఆధార్ కార్డు తెరిచి చూపించాడు. అందులోని ఫొటో రిషి అసలు రూపానికి భిన్నంగా ఉంది. ఫొటోలో రిషి ముఖం జీవం లేని గంభీరతతో ఉంటే, ఎదురుగా నిలబడ్డ రిషి ముఖం నవ్వుతూ, ఉత్సాహంగా కళకళలాడుతోంది. గార్డు రిషి ముఖాన్ని చూశాడు. మళ్లీ ఫొటోను చూశాడు. మళ్లీ రిషిని చూశాడు. అలా నాలుగు సార్లు మార్చి మార్చి చూసిన తర్వాత పోలికలు కనబడీ కనిపించకపోవడంతో, విసుగ్గా తల ఊపి, “వెళ్లండి,” అన్నాడు.
లగేజీ తనిఖీ పూర్తయ్యాక రిషి టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఎయిర్‌లైన్ యూనిఫాంలో ఉన్న ఓ స్మార్ట్ అమ్మాయి అతని దృష్టిని ఆకర్షించింది. గుండ్రని ముఖం, నల్లని జుట్టు, తెల్లని బుగ్గలు, ఎర్రని పెదవులతో ఆమె ముఖం బహువర్ణాల గులాబీలా మెరిసిపోతోంది.
ఆమె చిరునవ్వుతో, “ఐడెంటిటీ ప్లీజ్,” అంది.
రిషి మనసులో, “ఐడెంటిటీ ఒక్కటే ఎందుకు అడుగుతున్నావు? అడిగితే నన్ను నేనే సమర్పించుకోనా, డార్లింగ్!” అనుకున్నాడు.
ఆమె అతని గుర్తింపు పత్రాన్ని పరిశీలించి, లగేజీని త్వరగా చెక్-ఇన్ చేసి, బోర్డింగ్ పాస్‌ను అతని చేతిలో పెట్టింది. రిషి బోర్డింగ్ పాస్ తీసుకుని నేరుగా వెళ్లి భద్రతా తనిఖీ కోసం క్యూలో నిలబడ్డాడు.
అతని వంతు రాగానే సెక్యూరిటీ సిబ్బంది మొబైల్, పర్సు, బెల్ట్ అన్నీ ట్రేలో పెట్టమన్నారు. రిషి అన్నీ తీసి పెట్టాడు. తర్వాత శరీర తనిఖీ మొదలైంది. సిబ్బంది చేతులతో భుజాల నుంచి నడుము వరకు తడుముతుంటే రిషికి చక్కిలిగింతలు పెట్టినట్లుగా అనిపించి నవ్వు ఆపుకోలేక కొంచెం వంకర్లు తిరిగాడు.
“నిలబడండి!” అని గార్డు హెచ్చరించడంతో రిషి బిగుసుకుని నిలబడ్డాడు.
తనిఖీ ముగియడంతో తన వస్తువులన్నీ తీసుకుని గేటు వైపు నడక సాగించాడు. భుజాలపై బ్యాక్‌ప్యాక్‌లు, చేతుల్లో ట్రాలీ బ్యాగులతో వడివడిగా జనం వలసదారుల్లా ఈసురోమంటూ నడుస్తున్నారు. వారిలో ఒకడై, రిషి గేట్ వైపు నడుస్తూ వెళ్తుంటే దారికి ఇరువైపులా గోడలపై అందమైన పెయింటింగ్స్ కనిపించాయి. మొత్తం దారి చూస్తే ఆర్ట్ గ్యాలరీలో నడుస్తున్నట్టుగా అనిపించింది.
“గంట ముందే గేట్ దగ్గరికి రావాలని చెబుతారు. మరి దారిలో ఇలాంటి పెయింటింగ్స్ పెట్టి ప్రయాణికుల దృష్టి ఎందుకు మళ్లిస్తున్నారు?” అని రిషి ఆశ్చర్యపోయాడు.
“వీళ్లకు ఏకాగ్రత పాఠాలు గుర్తున్నట్లు లేదు; అర్జునుడు పక్షి కన్ను తప్ప మరేమీ చూడకుండా బాణం వేసిన కథను మర్చిపోయి ఉంటారు. పాపం!” అని జాలిపడ్డాడు.
ఉదాసీనతతో కొన్ని చిత్రాలను చూసిన తర్వాత అతని మనసులో కళాభిమానం మేల్కొంది. ఆ క్షణంలో అతనిలోకి రారాజు సుయోధనుడు పరకాయ ప్రవేశం చేశాడు.
“ఏమి ఈ విమానాశ్రయం! మయసభను తలపిస్తున్నది! ఏమి సృజనాత్మకత! ఏమి కళాత్మకత! ప్రతి చిత్రంలోనూ ఎంత జీవకళ ఉట్టిపడుతున్నది! అద్భుతమైన ఈ చిత్రాలు, మనోహరమైన రంగుల సమన్వయం, సొగసైన అలంకరణలు, అన్నీ కన్నుల పండువగా, వైభవంగా, అత్యంత రమణీయంగా తీర్చిదిద్దబడినవి! భళారే విచిత్రం, ఇంతటి కళా సృష్టి చేసిన చిత్రకారులకు మా హృదయపూర్వక అభినందనలు!” అని లోగొంతుకలో ప్రశంసిస్తూ ముందుకు సాగాడు.
కొంచెం ముందుకు వెళ్లగానే వివిధ దుకాణాలతో అక్కడి ప్రప్రదేశం ఒక చిన్న మాల్‌లా కనిపించింది.
“విమానంలో ఎక్కే ముందు షాపింగా? ఇదేం గోల రా బాబూ!” అనుకుంటూ ఓ కేఫ్ దగ్గర ఆగాడు. అక్కడి ధరల జాబితా చూసి రిషి కళ్లు తేలేశాడు. “ఇక్కడి ధరలు అంతరిక్షంలో ఉన్నాయి. నాలాంటి నేల మీద నడిచేవాడికి అవి ఎలా అందుతాయి!” అనుకుంటూ, ఏదీ కొనకుండా నేరుగా గేట్ చేరుకున్నాడు.
ఇంకా గంటకు పైగా సమయం ఉండటంతో రిషి విశ్రాంతిగా కూర్చున్నాడు. అతనికి సమీపంలో కొందరు అమ్మాయిలు కనిపించారు.
పొడవాటి నల్లటి జుట్టుతో, తెల్లని చుడీదార్‌లో ఉన్న అమ్మాయి మొబైల్ చూస్తోంది. జీన్స్, టీషర్ట్‌లో మరో అమ్మాయి ఫోన్‌లో గుసగుసగా మాట్లాడుతోంది. ఇంకొక యువతి చలువ కళ్ళద్దాలు పెట్టుకుని పుస్తకం చదువుతోంది. రిషి కళ్లకు ఆ ప్రదేశం ఒక సౌందర్య ప్రదర్శన వేదికలా అగుపించింది. వారి వైపు దొంగచూపులు చూస్తున్న అతనికి అకస్మాత్తుగా పూజ హెచ్చరిక గుర్తుకొచ్చింది. దాంతో అయిష్టంగానే అతడు తన చూపులను మరోవైపుకు తిప్పుకున్నాడు.
"సుప్రసిద్ధ ఆంగ్ల కవి కీట్స్ ఏమన్నాడు? అందమైన వస్తువు ఎప్పటికీ ఆనందదాయకమే; సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని తన పద్య కావ్యాల్లో చెప్పాడు. అందాన్ని ఆస్వాదించని కళ్లెందుకు? ప్రకృతి అందమైనా, మనిషి అందమైనా చూడటంలో తప్పేముంది? అయినా ఈ వయసులో కాస్త చాపల్యం ఉండటం సహజమే" అని తనను తానే సమర్థించుకున్నాడు.
అలా ఆలోచనల్లో మునిగిపోయిన రిషికి విద్యుద్ఘాతంలా, “విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది” అన్న ప్రకటన వినిపించింది.
అంతే! ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారిగా జాతరలా మారిపోయింది.
ప్రయాణికులంతా అసహనంతో కదిలారు. కొందరు లేచి నిలబడ్డారు. మరికొందరు కౌంటర్ దగ్గర గుమిగూడి సిబ్బందిని ప్రశ్నించసాగారు. ఇంకొందరు పక్కనున్న వారితో చర్చిస్తూ, ఈ విమాన సర్వీసు ఇంతే, ఎందుకూ పనికిరానిది అని తిట్టిపోస్తున్నారు.
చేసేదేమీ లేక రిషి తన టీమ్ కెప్టెన్, మేనేజర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని తెలియజేశాడు.
అంతవరకు అందాలను చూస్తూ ఆ ప్రదేశాన్ని స్వర్గంలా భావించిన అతనికి, ఇప్పుడు అదే ప్రదేశం నరకంలా అనిపించసాగింది. అప్పుడతనికి కోచ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. “విషాదంలో ఆనందాన్ని వెతుక్కోవాలి; ఆపదలో ధైర్యాన్ని కూడగట్టుకోవాలి; నిరాశాంధకారంలో ఆశాకిరణాన్ని చూడాలి. ఇవే విజయానికి మూలసూత్రాలు.”
ఆ మాటల ప్రభావంతో రిషి మనసు కుదుటపర్చుకుని, ప్రశాంతంగా నిరీక్షించసాగాడు. రెండు గంటల తర్వాత బోర్డింగ్ ప్రారంభమైంది. రిషి విమానంలోకి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. కాసేపు అటూ ఇటూ చూసి మనసులో అనుకున్నాడు.
“ఇదేమిటో విమాన ప్రయాణం... పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుంది! గేట్ దగ్గర సీట్లు అంత సౌకర్యంగా లేవు, విమానంలో సీట్లు కూడా అంతే. తినుబండారాల ధరలు చూస్తే మధ్యతరగతి ప్రయాణికుడు వాటివైపు కన్నెత్తి చూడాలన్నా భయపడాలి. అవసరం లేని ఆడంబరానికి, నా లాంటి సాధారణ ప్రయాణీకులు మూల్యం చెల్లిస్తున్నారు. ఒకపక్క మనసులో బాధపడుతూనే, పైకి మాత్రం ‘మేం విమానాల్లోనే ప్రయాణిస్తాం’ అంటూ గొప్పలకు పోతారు. మనిషుల తీరే విచిత్రం! ఆకాశంలోని చంద్రుడిని భూమి మీదకు రమ్మని పిలుస్తారు; భూలోకం కాదనుకుని అంతరిక్ష విహారాలు చెయ్యాలని తహతహలాడతారు” అని అనుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత విమానం బయలుదేరింది. మేఘాలను చీల్చుకుంటూ విమానం ఆకాశంలోకి ఎగసిపోగా, నగర భవనాలు క్రమంగా చిన్నబడి మసకబారుతున్న దృశ్యం రిషికి అద్భుతంగా అనిపించింది. ఎయిర్‌పోర్టులో నడిచిన అలసట, ఆత్రుతతో గడిపిన నిరీక్షణ అన్నీ మరిచిపోయి, తెల్లని దూది పింజాల్లాంటి మబ్బులపైన సాగుతున్న తన తొలి విమాన ప్రయాణాన్ని అతను మనసారా ఆస్వాదించాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
C..S.G . కృష్ణమాచార్యులు గారి కొన్ని ఇతర రచనలు:
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).











Comments