చిత్రం విచిత్రం

Chitram Vichitram - Telugu Comedy Family Story | Malla Karunya Kumar
చిత్రం విచిత్రం - తెలుగు హాస్య కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In? manatelugukathalu.com On 12/09/2026
భార్య సుందరి అరవడంతో ఉలిక్కిపడ్డాడు అభిమానం రావు.
పుట్టినప్పుడు మురిపెం ఎక్కువై వాళ్ల నాన్నమ్మ అభిమానం రావు అని ముద్దుగా పిలిచేది. తర్వాత ఆ పిలుపు నచ్చడంతో తల్లిదండ్రులు కూడా ఆ పేరే పెట్టారు. పెరిగి పెద్దై బుద్ధి వచ్చినప్పటి నుండి ఆ పేరుంటే అభిమానానికి పరమ చిరాకు. కానీ ఏం చేయగలడు? రికార్డ్స్‌లో ఆ పేరు లిఖితమైంది. చివరికి తనకు ఇష్టం లేని పేరుని ఎ. రావుగా మార్చుకున్నాడు.
"ఏంటి మీరు చేసిన ఘనకార్యం? బంధువులు, ఇరుగుపొరుగు వారి ముందు నా పరువు పోయింది." పార్కుల్లో కుప్ప గంతులు వేసిన వీడియో తెచ్చి చూపించి కన్నెర్ర చేసింది సుందరి.
"అదా విషయం? వింతేముంది? ఈ స్వతంత్ర దేశంలో నాకు మాత్రం స్వేచ్ఛ లేదా? ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లేదా? అందుకే దూసుకుపోయా." మురిసిపోతూ చెప్పాడు.
"ఆపండి! మీరు గానీ ఈ పని ఆపకపోతే... అట్లకాడకు పని చెప్పాల్సి వస్తుంది." కళ్లు ఎర్రగా చేస్తూ, పళ్లు పటపటలాడించింది.
"అంత చిత్రం లేదు. మీకేనా గృహహింస చట్టాలున్నాయి? మాకు కూడా ఉన్నాయి. ఇలాంటి బెదరింపులు వస్తాయని తెలిసి ముందుగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాను." కళ్లు ఎగరేస్తూ అన్నాడు.
భర్త మాటలకు నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి దిక్కులు చూస్తోంది సుందరి.
"ఓ తెగ చూడకు! అది కంటికి కనపడదు. కానీ నీ పాపాలు రికార్డు చేస్తుంది. ఖబడ్దార్!" అని అంటూ భార్య గుండెల్లో హడలు రేపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
వెళ్తున్న అభిమానానికి ఎదురుగా వచ్చి, "నాన్న! ఏమిటి మీరు చేస్తున్న పని? నా మొబైల్ తీసుకొని నా స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో పందెం కాసి మరీ ఆడుకుంటారా? వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారు. నా సెల్ నాకు ఇవ్వండి." ఏడుస్తూ అన్నాడు కొడుకు.
"అదేంటి రా? నా సెల్ నీ సెల్ వేరు కాదు కదా! కొడుకుగా పుట్టగానే సరిపోదు, తండ్రి ఇష్టాలను కూడా గౌరవించాలి. తండ్రి జల్సాలకు మద్దతు ఇవ్వాలి. ఈ మాత్రం దానికే ఇలా అయిపోతే ఎలా? ఇంకా చాలా గేమ్‌లు ఉన్నాయి." కొడుకు తల నిమురుతూ అన్నాడు.
"ఇవి ఇష్టాలా! తింగరి పనులు... మీ వయస్సు వాళ్ళు ఆడే ఆటలు ఇవి కాదు." కుయ్యోమొర్రో అన్నాడు కొడుకు.
"నా ఇష్టం రా! ఈ స్వేచ్ఛ రాజ్యంలో నేను ఏమైనా చేస్తాను. అడిగే హక్కు నీకు లేదు. కేవలం నీది ప్రేక్షక పాత్ర అంతే." కొడుకు తలపై ఒక మొట్టికాయ పెట్టి ముందుకు వెళ్ళాడు.
రెండు అడుగులు వేసేసరికి కూతురు ఎదురుగా వచ్చింది... "నాన్న, ఏమిటి మీరు చేసిన పని? నా స్నేహితుల తల్లిదండ్రుల దగ్గర అప్పు తీసుకుంటారా! వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ నుండి తెచ్చి ఇవ్వాలి? అయినా ఈ పాడుబుద్ధి ఏమిటి మీకు?" తల బాదుకుంటూ అంది కూతురు.
"చూడమ్మా! తండ్రి బాధ్యత ఆ మాత్రం తీసుకోలేవా? నువ్వే ఏదో ఒకటి చేసి ఆ అప్పు తీర్చు... నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను." కూతుర్ని అయోమయంలో నెట్టేస్తూ అక్కడి నుండి తుర్రుమన్నాడు.
తల్లి, కొడుకు, కూతురు ముగ్గురూ కలిసి ఒక దగ్గరకు చేరుకున్నారు.
"అమ్మ చూసావా, నాన్న ఎంతటి ఘనకార్యం చేశారో!" ఏకరవు పెట్టింది కూతురు.
"అవునమ్మ, నాన్న రోజురోజుకీ చిన్నపిల్లాడిలా తయారవుతున్నాడు. కొంపతీసి పిచ్చి గానీ పట్టలేదు కదా." అనుమానం వ్యక్తం చేశాడు కొడుకు.
"నోరు అదుపులో పెట్టుకో రా, అపశకున పక్షి! మీ నాన్నకు పిచ్చి పడితే... ఈ బాధ్యతలు నెత్తికి ఎత్తుకోలేక మనకు పడుతుంది పిచ్చి. హాయిగా క్లబ్‌లో స్టెప్స్ వేస్తూ, బ్యూటీ పార్లర్‌లో మేకప్ వేయించుకుంటూ... ఇన్‌స్టా రీల్స్... మూడు స్టెప్సులు, ఆరు ఫేస్‌ప్యాక్‌లతో గడిచిపోయే ఆనంద జీవితం ఇప్పుడు ఎలా మారిపోయింది? అసలే ఆయన ఆఫీస్‌కు వెళ్ళి తొమ్మిది రోజులు అవుతుంది. ఇంకా ఇలానే కొనసాగితే మనం రోడ్డున పడతాం!" తియ్యని అనుభూతులు తలుచుకొని రాబోయే రోజుల్లో ఎదురవ్వబోయే పరిణామాలు తలుచుకొని అదిరిపడింది.
"అమ్మ! ఈ సమస్యను పరిష్కరించాలంటే అగ్ని మామయ్య కరెక్ట్. అతన్ని పిలిస్తే నాన్న లైన్‌లోకి వస్తాడు." సలహా ఇచ్చాడు కొడుకు.
కొడుకు సలహాకు మురిసిపోయి వెంటనే పచ్చజెండా ఊపింది. వెంటనే మామకు కబురు పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికి ఇంటి ముంగిట వాలిపోయాడు అగ్ని.
అగ్నిని చూసి ఒక్కసారిగా బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా చేరిపోయారు. ఒక్కొక్కరుగా సమస్యను ఏకరవు పెట్టారు. అందరి సమస్యలు విని అభయం ఇచ్చాడు అగ్ని.
అంతలోనే వచ్చాడు అభిమానం... అగ్నిని చూసి, "ఏంటి బావా, తెల్లారే దిగబడ్డావు? నువ్వు కూడా నాలా స్వేచ్ఛాజీవిగా మారాలనుకుంటున్నావా? అలాంటిది ఏమైనా ఉంటే నేను సహాయం చేస్తాను." అగ్ని భుజం తడుతూ అన్నాడు.
"బావ, ఏమిటి ఈ చేష్టలు? కుటుంబాన్ని ఇలానే చూసుకుంటావా?" ఉవ్వెత్తున పైకి లేచాడు అగ్ని.
కళ్ళు భూతద్దంలా పెద్దవి చేసి కుటుంబం వైపు చూసి, "బాగానే చూసుకుంటున్నాను కదా." వెకిలిగా నవ్వాడు.
"ఇది అన్నయ్య గారి వరుస... వేగలేక చస్తున్నాం." ఆకాశం ఊడిపడేలా రోదిస్తూ అంది.
"ఇలా కాదు రా లోపలికి." అని అభిమానాన్ని రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి, కొంత సమయం తర్వాత దిగులుతో ఒక కాగితంతో వచ్చాడు అగ్ని.
అగ్ని వైపు చూసి, చేతిలో కాగితం చూసి కంగారుపడుతూ దాన్ని అందుకుంది సుందరి, ఒకరి తర్వాత ఒకరు దాన్ని తీసుకొని చదివారు.
"మొత్తం అర్థమైంది కదా, ఆ షరతులకు ఒప్పుకుంటే... అంటే నువ్వు క్లబ్, పార్టీలకు తిరగడం మానేయాలి, చెత్త రీల్స్ చేయడం మానేయాలి. నువ్వు ఫ్రెండ్స్ దగ్గర అప్పులు మానేయాలి. నువ్వు ఫోన్ పట్టుకొని వీడియో గేమ్‌లు ఆడడం మానేయాలి. ఈ షరతులకు ఒప్పుకుంటే బావ తన బాధ్యతలు చేపడతానని అన్నాడు. లేకుంటే ఉద్యోగసద్యోగం వదిలి స్వేచ్ఛా పక్షి అయిపోతాను అంటున్నాడు. ఇక నిర్ణయం మీ చేతిలోనే ఉంది." వివరంగా చెప్పాడు అగ్ని.
ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆ పేపర్ మీద సంతకాలు పెట్టారు.
లోపల నుండి అగ్నిని చూస్తూ చిన్నగా నవ్వాడు అభిమానం.
ప్రతిగా నవ్వుతూ, 'లేకపోతే క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా ఆ మనిషిని వేపుకు తింటారా? ఇప్పటికైనా తెలుస్తుంటుంది ఆ మనిషి కష్టం, విలువ' తనలో అనుకుంటూ ఎదురుగా ఉన్న వాళ్లను చూసి నవ్వుకున్నాడు అగ్ని.
***సమాప్తం****
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.













Comments