విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 1

Viswaroopuni Charithra - Part 1 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.
విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 1 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 17/11/2026
విశ్వరూపుని చరిత్ర – పార్ట్ 1లో గురువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, దేవేంద్రుడి రాజ్యగర్వం వల్ల దేవగురువు బృహస్పతికి జరిగిన అవమానాన్ని వివరిస్తుంది.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ......
తల్లిదండ్రులతో సమానమైన స్థానాన్ని గురువుకు ఇచ్చారు మన పూర్వీకులు. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో గురువును పోల్చారు.
ఏ యుగంలోనైనా, ఏ లోకంలోనైనా ప్రతి శిష్యుడు తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును సదా గౌరవించాలి. ప్రాతఃస్మరణీయుడు గురువు.
అటువంటి గురువును తన పదవీ గర్వంతో తృణీకరించిన దేవేంద్రుని గర్వభంగమే విశ్వరూపుని గురించి చెప్పే చరిత్ర.
చాలా తక్కువమందికి మాత్రమే తెలిసిన విశ్వరూపుని వృత్తాంతానికి మన మానవ జీవితానికి చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది.
విశ్వరూపుని జీవితకథ తెలుసుకున్నాక మానవ జీవితాలలోని ఎన్నో సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానం దొరుకుందనుటలో అతిశయోక్తి లేదు.
మహానుభావులు చేసే ప్రతి చర్య వెనుక ఒక పరమార్థం ఉండితీరుతుంది. అవి ముఖ్యముగా భూలోకవాసులకు మంచినో, చెడునో చేస్తాయి.
మన సంప్రదాయాలకు కానీ, ఆహారపు అలవాట్లకు కానీ, పండగలకు కానీ ఒకటేమిటి ఎన్నో, ఎన్నో చర్యలకు మూలాలు ముందు యుగాల్లో ఉండితీరుతాయి.
పున్నమినాటి నిండు చంద్రుని సరిసమానమైన తెల్లని గొడుగు, దేవకాంతలు విసిరే వింజామరలు, రత్నాలు పొదిగిన సింహాసనం అలంకారాలుగా కలిగిన దేవేంద్రుడు శచీదేవిని తన ఊరువు పై కూర్చోబెట్టుకుని దిక్కులను పాలించేవారు సేవిస్తుండగా సాటిలేని వైభవోపేతుడై కొలువు తీరాడు ఓ రోజు.
ఏతత్సమయంలో ఒకానొక ధర్మ కార్యనిమిత్తం నీతికోవిదుడు, దేవతలకు గురువుగానే కాకుండా వారి రహస్య సమాలోచనలకు మార్గదర్శకుడు అయిన దేవగురువు బృహస్పతి ఆ సభకు ఏతెంచాడు.
గొప్ప తపస్సంపన్నుడు, దయాస్వభావుడు, వాక్పతి అయిన బృహస్పతిని చూచి కూడా ఇంద్రుడు రాజ్యగర్వంతో దేవగురువుకు ఎదురేగలేదు సరికదా కూర్చోమని ఆసనం కూడా చూపించలేదు. మర్యాద చెయ్యలేదు, ప్రసన్నుణ్ణి చేసుకోలేదు.
చివరకు దేవతలందరూ ఆసీనులైన నిండుసభ అని కూడా తలంపక తన సింహాసనం నుండి లేవనైనా లేదు.
స్వర్గాధిపత్యంతో కలిగిన గర్వము ఇంద్రుని కన్నులు మూసుకునేలా చేసింది. తత్ఫలితంగా దేవగురువు అవమానపడి ఏ ప్రతికారం చెయ్యకుండా కొండంత బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని తన స్వగృహానికి వెళ్ళిపోయాడు.
బృహస్పతి వచ్చిన వెంటనే తిరోగమించేసరికి ఇంద్రునికి అవివేకంతో తాను చేసిన గురుతిరస్కారం తెలిసివచ్చింది.
పరమపవిత్రుడు, శుభచరిత్ర కలవాడుగా లోకాలన్నీ స్తుతించే బృహస్పతి పట్ల తాను అనుసరించిన తీరుకు దుఃఖపడ్డాడు, భయపడి, 'ఎంతో ప్రభావం గల బృహస్పతి పాదాలను పూజింపక మూర్ఖత్వంతో చెయ్యరాని పని చేశాను.
ఎంత గొప్పవారు తన దగ్గరకు వచ్చినా చక్రవర్తి స్థానంలో ఉన్నవారు తమ స్థానం నుండి లేవకూడదు అనేది పండితుల మాట.
దుష్టమార్గంలో ఉండి చెడ్డమాటలు పలికేవారి ఉపదేశాలు వినిన వాళ్ళు అధోగతి పాలవుతారు.
నేనావిధంగా కాకుండా ప్రజలచేత నమస్కరింపబడేవాడు, కార్యవిదుడు అయిన బృహస్పతి ఇంటికి వెళ్తాను.
నా కిరీటం తాకే విధంగా వారి పాదపద్మాలకు నమస్కరిస్తాను. వారిని సేవిస్తాను, నాయందు వారికి దయ కలిగేలా చేస్తాను.' అని అనుకుని దేవేంద్రుడు బృహస్పతి ఇంటికి బయలుదేరాడు.
దేవేంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న దేవగురువు తన మాయాశక్తిని ఉపయోగించి అదృశ్యుడైపోయాడు.
గురువు గృహాన్ని ఎంతో జాగ్రత్తతో పరిశీలించినా గురువు జాడ దొరకకపోవడంతో దేవేంద్రుడు చాలా బాధపడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న దానవులు ఇదే అదనుగా భావించి తమ గురువైన శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించి తమ బలాన్ని పెంచుకుని దేవతలపై యుద్ధానికి తెరతీశారు.
......... మొదటి భాగం సమాప్తం....................
విశ్వరూపుని చరిత్ర - పార్ట్ 2 త్వరలో
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి










Comments