'Practical Joke'- New Telugu Story Written By Padmavathi Divakarla
'ప్రాక్టికల్ జోక్' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"సరోజా! ఇవాళ నా చిన్ననాటి స్నేహితుడు క్రిష్ణమూర్తి మన ఊరికి వస్తున్నాడు. నాకు ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు. సాయంకాలం ఆఫీసు నుండి అలాగే స్టేషనుకెళ్ళి వాడ్ని రిసీవ్ చేసుకోవాలి. నువ్వు మీ బ్యాంక్ నుండి వస్తూ పిల్లల్ని స్కూలు నుండి తీసుకొచ్చేయ్!" అన్నాడు రామారావు ఆఫీసుకు బయలుదేరుతూ.
క్రిష్ణమూర్తి పేరు వినగానే సరోజ ఉలిక్కిపడింది. తనకి తెలిసిన క్రిష్ణే ఈ క్రిష్ణమూర్తి కాదుకదా అన్న ఊహ ఆమె మనసుని జలదరింపజేసింది. రామారావు మాటల వరసలో తన చిన్ననాటి స్నేహితుడైన క్రిష్ణమూర్తి గురించి అప్పుడప్పుడూ చెప్తునే ఉన్నాడు. తనూ వింటూనే ఉంది. మరి ఇవాళెందుకీ కలవరపాటు కలిగిందో ఆమెకో క్షణం బోధపడలేదు. బహుశా అతను వస్తున్నందుకు అయి ఉంటుంది. తనకు తెలిసిన క్రిష్ణే ఎందుకవాలి?
ఇంతవరకూ ఆమె తన భర్త స్నేహితుడు క్రిష్ణమూర్తినిగాని, అతని ఫోటోనుగానీ చూడలేదు, అయినా భర్త చెప్పే మాటలవలన అతనెంత సంస్కారవంతుడో ఆమెకి బాగా తెలుసు. ఆ క్రిష్ణమూర్తి చాలా మంచివాడు. కలుపుగోరు స్వభావం కలవాడు. తనకి తెలిసిన క్రిష్ణ ఎక్కడ? తన భర్త స్నేహితుడెక్కడ? తను ఎరిగిన క్రిష్ణ స్వార్థపరుడు. ఆ వస్తున్నవాడు తప్పకుండా తన క్రిష్ణ అయి ఉండడు. అలా ఆలోచించిన మీదట ఆమె మనసు కుదుటపడింది. అయినా “అలాగే!" అని తల ఊపిందామె అన్యమనస్కంగానే.
సాయంకాలం అయిదు దాటిన తర్వాత పని తొందరగా ముగించుకొని బ్యాంక్ నుండి బయటపడి స్కూటీలో స్కూలుకెళ్ళి పిల్లలిద్దర్నీఇంటికి తెచ్చింది సరోజ. వాళ్ళు కాళ్ళూ చేతులూ కడుక్కొని, బట్టలు మార్చుకున్న తర్వాత వాళ్ళకి హార్లిక్స్, బిస్కెట్లు ఇచ్చి ఆడుకోవడానికి పంపింది. వాళ్ళు వీధిలోకి వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయింది.
ఇద్దరూ ఆణిముత్యాల్లాంటి పిల్లలు. బాబు బంటీ పెద్దవాడు, చిన్నది చిట్టి ఇద్దరూ ఆమెకి ప్రాణం. స్కూల్లో చాలా చురుగ్గా ఉంటూ, చదువుల్లోనే కాక ఆటల్లోనూ అందర్లోకీ ముందు ఉన్నారు. భర్త రామారావు నిజంగా రాముడే! ఓ ప్రభుత్వ రంగ సంస్థలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి జీతం. తను కూడా ఉద్యోగం చేస్తూనే ఉంది. తమకీ ఏ లోటూ లేదు. ఈ మధ్యే బ్యాంక్ లోన్ తీసుకొని ఓ మంచి ఫ్లాట్ కొని అందులోకి మారారు. ఆమెకి ఈ సంసారం స్వర్గ తుల్యంగా ఉంది.
సాయంకాలం ఆరు గంటల దాటిన తర్వాత రామారావుతో వచ్చిన క్రిష్ణమూర్తిని చూసి ఉలిక్కిపడింది సరోజ. ఆమె మొహం వివర్ణమైంది. సందేహం లేదు, అతను తను అనుకున్న క్రిష్ణే. ఈ మధ్య కాలంలో పదేళ్ళు గడిచిపోయినా, క్రిష్ణని గుర్తు పట్టడానికి అతనిలో పెద్దగా మార్పులేదు, కాకపోతే ఇప్పుడు అతని జుత్తు కాస్త పలచబడింది. మొహంలో కాంతి తగ్గింది. అంతే! సరోజని క్రిష్ణమూర్తికి పరిచయం చేసాడు రామారావు, "నా భార్య సరోజ!" అంటూ.
అప్రయత్నంగా ఆమె వైపు చూసిన క్రిష్ణమూర్తి కూడా ఒక్కసారి ఉలికిపాటుకి గురైయ్యాడు. అమెని అతను కూడా పోల్చాడు. తప్పదు కనుక, "హాయ్!" అంటూ పలకరించాడు.
"సరోజా! చల్లటి మంచినీళ్ళూ, కాఫీ తీసుకురా!" అన్నాడు రామారావు సోఫాలో కూర్చుంటూ.
క్రిష్ణమూర్తి తన బ్యాగ్ సోఫా పక్కనపెట్టి తనూ కూర్చున్నాడు. సరోజ వంటింటివైపు కదిలింది. ఇంతలో వీధిలోకి ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు ముందు హడావుడిగా ఇంట్లోకి అడుగుపెట్టి, "అమ్మా!..." అని అరిచినవాళ్ళల్లా సోఫాలో కూర్చున్న కొత్త మనిషిని చూసి అక్కడే ఆగిపోయారు.
వాళ్లను చూసిన రామారావు నవ్వుతూ, "రండి! బంటీ… చిట్టీ… ఇతను అంకుల్! నమస్కారం చెయ్యండి!" అనగానే, పిలల్లిద్దరూ క్రిష్ణమూర్తివద్దకు వచ్చి ముచ్చటగా నమస్కారం చేసారు.
ఆ పసి వాళ్ళు అలా బుద్ధిగా తనని పలకరించేసరికి తనని తాను మైమరచిపోయాడు క్రిష్ణమూర్తి. వాళ్ళని చూసిన క్రిష్ణమూర్తికి రామారావు అదృష్టంపై అసూయ పుట్టింది. తన చేజారిన అదృష్టం రామారావుని వరించండం నిజంగా తన దురదృష్టమని తలిచాడు. వంటింట్లో ఉన్న సరోజ హాల్లో జరుగుతున్నవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఓ రెండు నిమిషాల తర్వాత, ఓ ట్రేలో మంచినీళ్ళు, కాఫీ కప్పులు తీసుకొని హాల్లోకి వచ్చి, టీపాయ్పై పెట్టింది. మరో చేత్తో తెచ్చిన స్వీట్స్, స్నాక్స్ కూడా అక్కడే పెట్టింది.
"నువ్వు కూడా కూర్చొ!" అన్నాడు రామారావు సరోజ వైపు చూస్తూ.
ఆమె మొహమ్మాటంగా మరో సోఫాలో కూర్చుంది. ఆమెకి చాలా బెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.
"సరోజా! మన క్రిష్ణమూర్తి ఎంత కలుపుగోరు మనిషో తెలుసా! ఎప్పుడూ మమ్మల్నందర్నీ నవ్విస్తూ, తను నవ్వుతూ ఉంటాడు. ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటాడు కూడా! ఓ సారి ఏమైందంటే, నాకు మా కాలేజీ బ్యూటీ కవిత ప్రేమలేఖ రాసిందంటూ ఓ పింక్ కలర్ కవరు అందించాడు. ఆ కవరు తెరిచి మా స్నేహితులందరి ముందు ఆ ప్రేమలేఖ బిగ్గరగా పైకి చదివాడు. నాకు చాలా అయోమయంగా ఉంది. నాకు చదువు తప్పితే మరో ప్రపంచం లేదు.
అలాంటిది, నన్ను ఆమె ఎలా, ఎందుకు ప్రేమిస్తుందని అనిపించి వీడి చేతులోంచి ఆ ఉత్తరం తీసుకొని చదివితే ఇంకేముంది, అది వీడి చేతి రాతే! అందరి మధ్య నన్ను ఆట పట్టించినందుకు నాకు వెంటనే వాడి మీద కోపం వచ్చింది కూడా! రెండు రోజులు మాట్లడలేదు వాడితో. చివరికి కాళ్ళ బేరానికి వచ్చి లెంపలేసుకున్నాడనుకో, అది వేరే విషయం." అని పగలబడి నవ్వుతూ క్రిష్ణమూర్తి వైపు చూసాడు.
క్రిష్ణమూర్తి బలవంతాన పెదవులపై నవ్వు తెచ్చుకున్నాడు. "మాట్లాడవేంటిరా? అప్పటి అల్లర్లూ అన్నీ మరిచిపోయావా, లేక హఠాత్తుగా బుద్ధిమంతుడువైపోయావా?" అన్నాడు రామారావు స్నేహితుడి భుజం తడుతూ.
"అలా ఏం లేదురా!" అన్నాడు క్రిష్ణమూర్తి కాఫీ కప్పు చేతులోకి తీసుకుంటూ.
సరోజని చూసిన దగ్గరనుండి అతని మనసు మనసులో లేదు. ఆమె వైపు చూడటానికి ధైర్యం చాలడం లేదు. సరోజ రామారావు భార్య అని ముందే తెలిసి ఉంటే తను అసలు స్నేహితుడి ఇంటికి వచ్చేవాడే కాదు.
"ఇలాంటి అల్లరి పనులెన్నో చేసేవాడు మన క్రిష్ణమూర్తి. ఇంకోసారి సుబ్బారావు అనే మరో స్నేహితుడ్ని వాళ్ళ నాన్న కలవడానికి వచ్చినప్పుడు, ఏమీ తెలియనట్లు ఓ సిగరెట్ పేకట్, అగ్గిపెట్టి, కొంత చిల్లర వాడికి అందించి, 'ఇదిగోరా, నువ్వు తెమ్మన్న సిగరెట్లు." అన్నాడు.
ఆ తర్వాత ఆ సుబ్బారావు అవస్థ చూస్తే మాకందరికీ నవ్వు ఆగింది కాదు. వాడు వాళ్ళ నాన్న చేత్తో ఎన్ని చీవాట్లు తిన్నాడో లెక్కలేదు. వాడికి సిగెరెట్ పొగే పడదు, ఈ క్రిష్ణమూర్తే కావాలని ఏడిపించడానికి అలా చేసాడని మేమందరమూ చెప్తేగాని అతను శాంతించలేదు. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వెయ్యడంలో వాడికెవ్వరూ సాటి రారు. స్నేహితులమధ్య తంపులు, లెక్చరర్లమధ్య చిచ్చు పెట్టకపోతే వాడికి కిక్కే రాదు." చెప్పాడు రామారావు నవ్వుతూ.
క్రిష్ణమూర్తికి కూడా మొహాన నవ్వు పులుముకోక తప్పింది కాదు.
"ఇప్పుడు మరి ముందులా ప్రాక్టికల్ జోక్స్ చెయ్యడం మానేసాడులే! అది వేరేసంగతి." అని క్రిష్ణమూర్తివైపు తిరిగి, "అవును, నువ్వో ప్రేమ గ్రంధం నడిపావని మాకు చెబుతూ ఉండేవాడివి, ఏమైందిరా ఆ సంగతి? అసలు నీ ప్రేమ సంగతి ఏమైంది? నువ్వు ప్రేమించిన ఆ రాణి ఏమైంది? మీరిద్దరూ పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆ తర్వాత అసలు పెళ్ళే ఎందుకు చేసుకోలేదు?" అని అడిగాడు రామారావు.
ఆ మాటలు విన్న క్రిష్ణమూర్తి మొహం ఒక్కసారి నల్లబడిపోయింది. "చెప్పడానికేముంది, మా ప్రేమ విఫలమైంది. అంతే! పెళ్ళి వరకూ వచ్చినా, ఆమె అకస్మాత్తుగా హ్యాండిచ్చింది." అన్నాడు క్రిష్ణమూర్తి వంచిన తల ఎత్తకుండానే.
ఒకవైపు అతను ఏం చెప్తాడోనని చెవులు రిక్కించి వింటున్న సరోజ ‘అంతా పచ్చి అబద్ధం! ఆ పెళ్ళి జరగక పోవడానికి నువ్వే కారణం!’ అని అరిచి చెబ్దామనుకుంది, కానీ ఆమె నోరు పెగలలేదు.
కాకపోతే అతనికింతవరకూ పెళ్ళెందుకు జరగలేదో అని మాత్రం విస్మయం చెందింది. మరి అక్కడ ఉండదలచుకోలేదు సరోజ. వంటింట్లో పని ఉందంటూ సోఫాలోంచి లేచిందామె. వంటింట్లో పనిలో ఉన్నా ఆమె మనసు వాళ్ళిద్దరి సంభాషణపైనే ఉంది. ఎంత వద్దనుకున్నా, పదేళ్ళ క్రితం జరిగిన సంఘటనలు గుర్తుకు రాసాగాయి. గత స్మృతులు కళ్ళెంలేని గుర్రాల్లా ముందుకు దౌడు తీస్తున్నాయి.
*********
రాణి కాలేజీలో చదువుతున్న రోజులవి. ఆమె తండ్రి స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసేవారు. రాణి ఒక్కర్తే కూతురు. తల్లి, తండ్రీ, రాణి ముగ్గురే గల కుటుంబం. ఉన్నంతలో తృప్తిగానే బతుకుతున్న కుటుంబం వారిది. వాళ్ళ వీధిలోనే ఉండే ధనుంజయరావు ఏకైక సంతానం క్రిష్ణ. ధనంజయరావుకి ఊళ్ళో వ్యవసాయమేకాక, ఆ పట్టణంలో పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ధనంజయరావు ధనవంతుడికిందే లెక్క. డబ్బులోనే పుట్టి పెరిగిన క్రిష్ణ బలాదూర్గా తిరిగేవాడు.
ఒకసారి రాణిని చూసిన క్రిష్ణ మనసు చలించింది. రాణి సౌందర్యవతి. గుండ్రటి మొహం. తీర్చి దిద్దినట్లు ఉన్న ఆమె కనుబొమలు ఆమె ముఖానికి వన్నె తెచ్చాయి. కాటుక కనులు, ఎర్రటి పెదిమలు ఎదుటివారి మనసుని ఇట్టే దోచేస్తాయి. మరి క్రిష్ణమూర్తి ఆమెపట్ల అకర్షితుడవడంలో ఆశ్చర్యమేముంది! అంతవరకూ అల్లరిచిల్లరగా తిరిగి అమ్మాయిలను వేధించే క్రిష్ణ ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. ఎప్పుడు ఆమె ఎదురుపడినా నవ్వుతూ పలకరించేవాడు. ఎలాగైనా ఆమె పరిచయం పెంచుకోవాలని చూసేవాడు. వెంటపడేవాడు. "రాణి...రాణీ...!" అని కలవరించేవాడు. ముందు రాణి అతన్ని పట్టించుకోలేదు. అలా కాలేజీలో కూడా చాలా మంది తన వెంటపడేవారు. చదువు తప్పించి ఇంక దేనిమీదా ధ్యాస పెట్టదలచుకోలేదు ఆమె. క్రిష్ణ కూడా అలాగే అనుకొని ఆమె తన మానాన తను వెళ్ళేదే కానీ, అతని వంక మొహం ఎత్తి చూసేది కూడా కాదు. క్రిష్ణ ధోరణిలోనూ ఎలాంటి మార్పూ ఉండేది కాదు. నవ్వుతూ ఎదురు వచ్చేవాడు, గులాబిపూలు, గులాబి రంగు కవరులో ప్రేమలేఖలు పెట్టి ఆమెకి అందించేవాడు. అమె ఎదురైనప్పుడల్లా ఆమె అందాన్ని పొగుడుతూ చిన్న చిన్న కవితలు అల్లి చెప్పేవాడు.
చాలా రోజల వరకూ అతన్ని అసలు పట్టించుకోలేదు రాణి. అయితే, రాను రాను ఆమెలో కొద్దిగా చలనం కలిగింది. ప్రయత్నించగా, ప్రయత్నించగా రాయైనా కరగక మానదు కదా! క్రిష్ణ ఆమె అందాన్ని పదేపదే అలా పొగుడుతూ ఉంటే, ఆమె ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అద్దంలో తన ప్రతిబింబం చూసుకునేది, అతను చెప్పేది అక్షరాలా నిజమని గుర్తించేది. ఆ గుర్తింపు ఆమెకి ఆనందానిచ్చేది. ఆమె మనసు రోజు రోజుకీ కరిగిపోసాగింది. ఎంతైనా పొగడ్తలకి లొంగని మహిళ ఉండదు కదా!
ఒకరోజు ఆమె క్రిష్ణ పలకరింపుకి పులకించి అతనితో మాటలు కలిపింది. క్రిష్ణ కూడా మైమరచిపోయాడు ఇన్నాళ్ళకి తన వన్ సైడ్ ప్రేమ ఫలించబోతున్నందుకు. అయితే, కట్టుదిట్టాల్లో పెరిగిన రాణి మాత్రం క్రిష్ణని ఇష్టపడినా, అతన్ని దూరంగానే ఉంచింది. తొలిప్రేమ మనసుని ఎంత కలవరపరచినా ఆమె హద్దు దాటలేదు. ఆమె ప్రేమ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ముందు కూతుర్ని వారించినా, తర్వాత తన బాధ్యతనెరిగి సంబంధం కలుపుకోవడానికి ధనంజయరావు వద్దకు వెళ్ళి వాళ్ళ పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు.
కానీ, ధనమదంతో విర్రవీగిన ధనంజయరావు వాళ్ళ ప్రేమ వివాహానికి అడ్డు వచ్చాడు. రాణి తండ్రి రాజారావు అంత కట్నం ఇవ్వలేడని తెలిసి పది లక్షల కట్నం ఇస్తేగానీ పెళ్ళి జరగదన్నాడు. రాణికి ఈ విషయం తెలిసి క్రిష్ణని నిలదీసింది. క్రిష్ణ తప్పించుకోజూసాడు.
"అది మా నాన్న నిర్ణయం. అందులో నేను కలుగ జేసుకోలేను. కట్నం విషయం పెద్దవాళ్ళు చూసుకుంటారు. ప్రేమించుట పిల్లల వంతు. కట్నం విషయం ఆలోచించడం పెద్దల వంతు!" అన్నాడు.
అతని మాటలకి ఖిన్నురాలైంది రాణి. క్రిష్ణతో తనకున్న ప్రేమబంధాన్ని మరిచిపోవాలని అనుకుంది, కానీ దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఎలాగైనా, ఆ సంబంధం చేస్తే తన కూతురు సుఖపడుతుందని భావించి ఊళ్ళో తనకున్న కొద్దిపాటి పొలం అమ్మేసి, లోన్లు తీసుకొని మరీ కూతురికోసం కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.
"డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కాని ప్రేమించే మనిషి దొరకడం మాత్రం జీవితంలో ఒకసారే జరుగుతుంది. నిన్ను ప్రేమించే మనిషిని పెళ్ళి చేసుకుంటే నీ జీవితం నందనవనం అవుతుంది." అని ఆమెని బుజ్జగించి పెళ్ళికి ఒప్పించాడు తండ్రి రాజారావు.
అయిష్టంగానే రాణి అందుకు ఒప్పుకుంది. పెళ్ళి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. తన శక్తికి మించినదైనా ఉన్నంతలో వైభవంగా పెళ్ళి చెయ్యడానికి రాజారావు నిశ్చయించాడు. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత, ధనుంజయరావు ఉన్నట్టుండి ఒకరోజు రాజారావుని ఇంటికి పిలిపించాడు.
"చూడండి బావగారూ! మీరేం అనుకోనంటే ఓ మాట. మీరు కట్న కింద ఇచ్చిన పది లక్షలు మాకు ఏ మాత్రం చాలదండి. ప్రేమ వివాహం కదా అని మీ మాటలకి తలొంచి పది లక్షల కట్నానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మా వాడికి యుఎస్లో మంచి ఉద్యోగం వచ్చింది, వచ్చే నెలే అమెరికా వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. అప్పుడు మావాడికి పాతిక లక్షల కట్నంతో సంబంధాలు వచ్చినా, ప్రేమ వివాహమని సరేనన్నాను. ఇప్పుడు కనీసం మీరు పాతిక లక్షలైనా ఇవ్వకపోతే కుదరదండీ. పైగా వాడు అమెరికా వెళ్ళి అక్కడ ఉండడానికి మీరిచ్చే డబ్బులు ఏ మాత్రం సరిపోవు. అంతేకాక, మీకు మాత్రం అమెరికా సంబంధం అంటే గొప్పకాదూ! అంచేత, మీరు ఆ ప్రయత్నంలో ఉండండి." అని చల్లగా చెప్పాడు ధనంజయరావు.
అతని మాటలకి నెత్తిన పిడుగు పడినట్లు చలించిపోయాడు రాజారావు. ఇప్పడు సమకూర్చుకున్న డబ్బులే తన శక్తికి మించినది, అంత డబ్బులు ఎక్కణ్ణుంచి తేవాలో ఏ మాత్రం అర్థం కాలేదు అతనికి.
అయినా నిశ్చితార్థం కూడా అయిపోయాక, ఇలా అతను మాట్లాడటం ఏమైనా భావ్యంగా ఉందా అని మనసులో అనుకొని, "బావగారూ, నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కదండీ! శక్తికి మించినదే అయినా, మీ కోరికలన్నిటికీ తల ఒగ్గాను. ఇప్పుడు మీరు ఇలా అకస్మాత్తుగా కట్నం పెంచేస్తే ఎలా?" అన్నాడు రాజారావు దీనంగా.
"నిశ్చితార్థమే జరిగింది కానీ పెళ్ళి జరగలేదు కదా! పెళ్ళైన తర్వాత, ఇంకా కట్నం తెమ్మని, ఇవ్వకపోతే కాపురానికి కొడల్ని తీసుకురాకపోతే ఏం చేసి ఉందురు? అందుకే నేను ముందే చెబుతున్నాను ఈ సంగతి. మా వాడికి పెళ్ళి కూతుర్లకి కొదవేం లేదు, కో అంటే కోటి మంది దొరుకుతారు, కోటి వరకూ కట్నం కూడా ఇచ్చుకుంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు" చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు ధనంజయరావు.
అతని మాటలకి మతిపోయింది రాజరావుకి. అలాంటి వాళింట్లో తను కూతుర్ని ఇస్తే ఆమె కట్నానికి బలవక తప్పదని అర్థమైంది అతనికి. ఇంటికి ఏ మొహం పెట్టుకెళ్ళాలో అర్థం కాలేదతనికి.
"వెళ్ళి రండి బావగారూ! కట్నం డబ్బులు సమకూర్చుకొని రండి. ఇంక పదిహేను రోజులేగా ఉంది పెళ్ళి." అని వెనకనుండి ధనంజయరావు చెప్తున్నా, వినిపించుకోకుండా అక్కణ్ణుంచి నిష్క్రమించాడు రాజారావు.
మొహం వెళ్ళాడేసుకొని ఇంటికి తిరిగివచ్చిన తండ్రిని చూస్తూనే విషయం గ్రహించింది రాణి. ఏమి చేయాలో తోచక కుర్చీలో కూలబడ్డాడు. విషయం తెలిసిన రాణి తండ్రిని అనునయిస్తూ, "వద్దు నాన్నగారూ! మీ ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళ కోరికలకు తల వంచొద్దు. నేను చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరతాను. ఆ తర్వాతే నా పెళ్ళి." అని దృఢ నిశ్చయంతో చెప్పింది.
క్రిష్ణని అసలు కలవకూడదని నిశ్చయించుకుంది. కాని, అతనే ఆమెని పలకరించి, "అదేంటి, మీ నాన్నగారు మరి మా ఇంటికి రాలేదు? మా నాన్న అడిగిన పాతిక లక్షలు ఇవ్వలేరా? ఆ మాత్రం కూతురి భవిష్యత్తుకోసం ఖర్చు పెట్టలేరా?" అని అడిగిన అతనివైపు అసహ్యంతో చూసింది రాణి.
ఆ చూపుని తన జీవితంలో మర్చిపోలేడు క్రిష్ణ. అతనితో పెళ్ళి తప్పిపోవడమే మంచిదని నిశ్చయించుకొని అతని మాటలకి బదులేమీ చెప్పకుండా అక్కణ్ణుంచి కదిలిందామె. క్రిష్ణ ఇంత పచ్చి అవకాశ వాదని అనుకోలేదామె. తండ్రిని ఎదురించి తనని పెళ్ళి చేసుకుంటాడనుకుంది, కాని ఆమె ఆశ అడియాశ అయింది. ఆమె నమ్మకం వమ్ము అయింది. అలా ఆ పెళ్ళి ఆగిపోయింది.
క్రిష్ణ ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని సంగతులేమీ ఆమెకి తెలియలేదు. రాణి పట్టుదలతో చదివి, బ్యాంక్ పరీక్షలు రాసి, ఉద్యోగం సంపాదించింది. క్రిష్ణని పూర్తిగా మరిచిపోయింది. ఆ తర్వాత మంచి ఉద్యోగం చేస్తున్న ఓ సహృదయుడు కానీ కట్నం లేకుండా ఆమెను ఇష్టపడి పెళ్ళి చేసుకోవడం, ఆమె సంసారం పూలరథంలా సాగిపోవడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు.
***********
"భోజనం తయారైందా!" అన్న రామారావు మాటలకి ఆలోచనల్లోంచి బయటపడి, ఈ లోకంలోకి వచ్చింది సరోజ.
"వంట పూర్తైందండీ, వడ్డించేయనా!" అందామె.
వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చాక, వాళ్ళకి వడ్డించసాగింది సరోజ. పిల్లలిద్దరూ ముందే భోజనం చేసేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి చదువుకుంటున్నారు. వడ్డిస్తున్న ఆమెవైపు చూడటానికి ప్రయత్నించసాగాడు క్రిష్ణమూర్తి. అతని చూపులన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూండటం రామారావు కంటపడింది.
"మన క్రిష్ణమూర్తి భోజన ప్రియుడు, మరికాస్త కూర వడ్డించు. నువ్వు మెంతివంకాయ కూర చేస్తే అమృతమనుకో!" మెచ్చుకుంటూ తినసాగాడు రామారావు.
క్రిష్ణమూర్తి మాత్రం మొహమ్మాటంగా తినసాగాడు. అతని కళ్ళల్లో ఎవేవో భావాలు కదలాడుతున్నాయి. ఎవేవో చెప్పాలని మనసులో ఉంది, కాని ఏమీ చెప్పలేని అశక్తత అతన్ని కమ్ముకుంది. రెండుమూడు రోజులు ఉంటానన్న క్రిష్ణమూర్తి ఆ మరుసటి రోజు భోజనం కాగానే తనకింకేదో పనుందని, అర్జెంటని రామారావుకి చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక, "ఏంటో పాపం క్రిష్ణమూర్తి! కొందరి జీవితాలు అంతే! పీటలమీద పెళ్ళి తప్పిపోయింది, ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. వాడి దౌర్భాగ్యమో, ఏమిటో మరి అతని తండ్రికి వ్యాపారంలో బాగా నష్టాలువచ్చి, ఆస్తులన్నీ అమ్మి తీర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ వాడు జాబ్ చేస్తున్న సంస్థ కూడా అదే సమయంలో దివాలా తీయడంతో ఇండియా తిరిగి వచ్చాడు.
వాడు ప్రేమించిన అమ్మాయి వాడ్ని పెళ్ళి చేసుకొనుంటే వాడి జీవితం ఎలా ఉండునో? వాళ్ళ నాన్న డబ్బు కక్కుర్తి విషయం తెలిసి వాడికెవరూ పిల్లనివ్వలేదు. ఆ తర్వాత, పరిస్థితులెలాగూ మారిపోయాయి. అలా వాడికి మరి పెళ్ళి కాలేదు. పాపం జీవితంలో కూడా స్థిరపడలేదు.
స్నేహితులందరి సహాయం పొంది, ఏదో చిన్న వ్యాపారం మొదలు పెడదామని ఈ ఊరు వచ్చాడు కాని ఎందుకో మనసు మార్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు." చెప్పాడు రామారావు నిట్టూర్చుతూ.
'అవును, అలాంటి వాడ్ని పెళ్ళి చేసుకోని ఆ రాణి చాలా అదృష్టవంతురాలు, లేకపోతే వాళ్ళ ధనదాహానికి బలైపోయేది.' నోటిదాకా వచ్చిన మాటలు బయటకు మాత్రం రాలేదు.
అయితే, ఎంత అవకాశవాదైనా, క్రిష్ణమూర్తి తను ప్రేమించిన రాణే, ఈ సరోజా రాణి అని చెప్పి తన కాపురం చెడగొట్టనందుకు మాత్రం సంతోషించింది. తనను బ్లాక్మెయిల్ చెయ్యనందుకు ఆమెకి లోలోన చాలా రిలీఫ్గా ఉంది. అయితే, ఇకముందు మాత్రం అలాంటి పరిస్థితి ఎదురైతే తను భర్తకి అంతా నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. తన భర్త సహృదయుడు. తనను తప్పకుండా అర్థం చేసుకుంటాడన్న నమ్మకం ఆమెకి ఉంది. "అవును, పాపం క్రిష్ణమూర్తి!" అందామె.
తలూపాడు రామారావు. "అవును, అలా క్రిష్ణమూర్తి జీవితమే ఓ ప్రాక్టికల్ జోకైపోయింది." అన్నాడు.
అయితే, సరోజకి తెలియని విషయమొకటుంది. రామారావు సరోజని బ్యాంక్లో చూసి, ఇష్టపడి ఆమెని పెళ్ళి చేసుకోవడానికి నిశ్చయించుకొని ఆమె తండ్రి రాజారావుని కలిసిన సంగతీ, అతను క్రిష్ణమూర్తి వ్యవహారమంతా అతనికి చెప్పిన సంగతీ సరోజకి తెలియదు. అన్నీ తెలిసే రామారావు సరోజని వివాహమాడాడు, జరిగిన సంఘటనలో ఆమె తప్పేమీ లేదని గ్రహించి. నిశ్చితార్థం తర్వాత, ఆమె పెళ్ళి ఆగిపోవడానికి కారణమైనవాడు తన స్నేహితుడే అని తెలుసుకున్నాడు కూడా.
క్రిష్ణమూర్తి అవకాశవాదం కూడా తెలిసింది. అందుకే క్రిష్ణమూర్తి తన ఇంటికి వస్తానన్నప్పుడు, ఆహ్వానించి అనుకూలవతి అయిన భార్య సరోజతో, ముత్యాలవంటి పిల్లలతో తను జీవితమెంత సుఖంగా గడుపుతున్నాడో తెలియజేయాలనుకున్నాడు కూడా. అదే క్రిష్ణమూర్తికి తగిన శిక్ష అని రామారావు భావించాడు.
ఆ విధంగా, 'ప్రాక్టికల్ జోక్' రుచి క్రిష్ణమూర్తికి చూపించాలనుకున్నాడన్న సంగతి పాపం సరోజకి తెలియదు మరి!
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments